Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రపంచానికి వెలుగునివ్వటానికి అవిరళ కృషి చేసిన మైఖేల్ ఫారడే

[బాలబాలికల కోసం ‘ప్రపంచానికి వెలుగునివ్వటానికి అవిరళ కృషి చేసిన మైఖేల్ ఫారడే’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

ప్పుడు మనం కరెంట్ పోగానే వెంటనే జనరేటర్‌ను ఉపయోగించి కరెంట్‌ను పొందుతున్నాము. కానీ ఒకప్పుడు ఈ సౌకర్యం లేదు. కరెంటు పోయి మరల వచ్చేదాకా పెద్ద ఫ్యాక్టరీలతో సహా అన్నిపనులూ ఆగిపోయేవి. జనావళికి ఎంతో ఉపయోగపడే జనరేటర్‌ను ఎవరు కనుక్కున్నారో తెలుసుకుందాం!

మైఖేల్ ఫారడే 1791వ సంవత్సరం సెప్టెంబరు 22వ తేదీన లండన్ సమీపంలోని ఒక గ్రామంలో జన్మించారు. పేదరికం వలన స్కూలు విద్యకూడా పూర్తిచేయలేకపోయారు. కానీ భౌతిక, రసాయనిక శాస్త్రాలలో ఆయన సల్పిన కృషి చాలా గొప్పది. ఆయన తన 14వ యేట ఒక బుక్ బైండర్ వద్ద ఉద్యోగంలో చేరారు. ఆ పుస్తకాలకు అట్టలు వేస్తూ అందులోని విషయాలను చదివి అర్థం చేసుకునేవారు. ఇలా తెలుసుకున్న విషయాలతో చిన్నచిన్న ప్రయోగాలు చేసేవారు.

ప్రముఖ శాస్త్రవేత్త ‘హుప్రీ డేవీ’ విద్యుత్‌పై చాలా పరిశోధనలు చేసి ఎలక్ట్రాలసిస్ ద్వారా ఆరు లోహాలను కనుక్కొన్నారు. ఫారడే ఈ శాస్త్రవేత్త దగ్గర సహాయకుడిగా చేరాడు. 1813లో డేవీ యూరప్ పర్యటనకు వెళుతూ ఫారడేను కూడా తీసుకెళ్ళటం వలన అక్కడ మహామహులైన శాస్త్రవేత్తల ప్రసంగాలు వినే అదృష్టం కలిగింది ఫారడేకి. 1830లో ఫారడే ఎలక్ట్రాలసిస్‌కు సంబంధించి రెండు సూత్రాలను ప్రతిపాదించారు.

విద్యుత్-అయస్కాంతముల మధ్య గల సంబంధాన్ని నిరూపిచేందుకు 1821లో ఫారడే ఒక ప్రయోగం చేశాడు. ఇదే తరువాత కరెంట్ మోటారుగా రూపొందింది. ఫారడే మరిన్ని ప్రయోగాలు చేసి ‘ఎలక్ట్రో మాగ్నటిక్ ఇండక్షన్’ సూత్రాన్ని కనుగొన్నారు. యాంత్రిక చలనాన్ని, అయస్కాంతాన్ని కలపటం ద్వారా కరెంటును ఉత్పత్తి చేయవచ్చని ప్రతిపాదించారు. ఎలక్ట్రిక్ జనరేటర్, డైనమో తయారుచేయటానికి ఈ సూత్రమే ఆధారం. 1833లో ఫారడే కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు.

పరిశోధనల కోసం విపరీతమైన శ్రమ చేయడంవల్ల 1841లో ఆయన ఆరోగ్యం చెడిపోయింది. జీవితాంతం ప్రపంచానికి వెలుగునివ్వటానికి అవిరళమైన కృషి చేసిన ఫారడే 1867 ఆగష్టు 25వ తేదీన కన్నుమూశారు.

Exit mobile version