ప్రసాదమూర్తి రచించిన కవితల్లోంచి ఎంపిక చేసిన 71 కవితల సంపుటి ఇది.
సమకాలీన బహుముఖాల్ని పట్టుకున్న కవితలు ఇవి. నిజాన్ని చూడలేక కళ్ళు మూసుకున్న వాళ్ళ కళ్ళను కూడా తెరిపించగల కవితలివి.
“కవిగా, జిలుగు, కవనపు మర్మాలు తెలిసిన, చెయ్యి తిరిగిన అక్షరాల గిజిగాడు ప్రసాదమూర్తి” అంటారు దేవీప్రియ ‘ప్రసాద సముద్రం’ అన్న ముందుమాటలో.
“కవి ఎన్ని విధాలుగా ఎన్ని రకాల మానవ, ప్రాకృతిక వ్యవహారాలకు స్పందించే అవకాశం ఉందో, మనకీ కవితలు చూపిస్తాయి” అంటారు జి. లక్ష్మీ నరసయ్య ‘ఉండాల్సిన కవిత్వం… ఉత్తమ కవిత్వం’ అన్న ముందు మాటలో.
“నాకు నేనుగా నా జ్ఞాపకాలను కొన్నింటిని పోగు చేసి మీ ముందు ఉంచాను. వీటిలో వ్యక్తులుంటారు. సందర్భాలుంటాయి. సన్నివేశాలు ఉంటాయి. ఊహలుంటాయి… ఊసులుంటాయి. అనుభవాలు… అనుభూతులు… అనుబంధాలు… ఆగ్రహాలు అన్నీ ఉంటాయి” అని కవి తన ముందుమాట ‘నా నుంచి తప్పిపోయిన నా కోసం దేవులాట’లో అన్నారు.
***
ఈ కవితలలో నిత్య జీవితంలోని అనేక సామాన్యమైన సంఘటనలే అసామాన్యమైన రీతిలో, నూతనమైన అర్థాలతో, కొత్త కోణాలలో కనిపిస్తాయి.
‘హోం వర్క్’ కవితలో ‘నువ్వు ఒక జీవితాన్ని కూడా తెచ్చుకున్నావ్/తెరచి చూడు/నీ పని నీదే’ అంటాడు కవి ముగింపులో ఎనలేని ఆలోచనలకు తెరతీస్తూ.
‘మాటలే కదా/మాటలంటే మనుషుల మనసులే కదా/దయచేసి మాటని మార్కెట్ చెయ్యొద్దు’ అంటాడు ‘మాట్లాడుకోవాలి’ కవితలో.
‘ఎర్రపూల గౌను’ కవితలో ‘అదెప్పుడు ఇంటి కొచ్చి వెళ్ళినా/మొదటిసారి అత్తారింటికి వెళ్తున్నట్టే ఉంటుంది/కన్నపేగులో శాకుంతలం నాటకం/నాలుగో అంకం నలభైసార్లు రిపీటవుతుంది’ అంటాడు.
‘కూతురొచ్చింది’ కవిత ‘ఇంట్లో గోడలకు/పువ్వులు పూచి ఎన్నాళ్ళయిందో!/అమ్మాయి వస్తుందని కాబోలు/ఒళ్ళంతా లేతమావి చిగుళ్ళు/గుబురులు గుబురులుగా…’ అంటూ ఆరంభమవుతుంది.
ఇలాంటి మానవత్వం, ఆత్మీయ, హృదయానుబంధాలను ఎద కరిగే రీతిలో ప్రదర్శిస్తూ మనసును తడి చేస్తాడీ కవి తన కవితలతో.
మంచి కవిత్వం, వాద వివాదాలకు, నినాదాల హోరులకు, పోరాటాల కేకలకు దూరంగా హృదయంతో చదివి, మనసుతో అనుభవించాలనుకునేవారు తప్పకుండా చదవవలసిన కవితల పుస్తకం ఇది.
***
ప్రసాదమూర్తి కవిత్వం
రచన: ప్రసాదమూర్తి
పేజీలు: 216, వెల: ₹ 150
ప్రతులకు:
pramubandaru@gmail.com, 9705468149
ప్రముఖ పుస్తక కేంద్రాలు