Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రశ్నించు.. ప్రశ్నిస్తూనే ఉండు..

[యం. ధరిత్రీ దేవి గారు రచించిన ‘ప్రశ్నించు.. ప్రశ్నిస్తూనే ఉండు..’ అనే కవితని అందిస్తున్నాము.]

నాలుగ్గోడల నడుమనున్నా..
నాకెందుకులే అని సరిపెట్టుకుందామన్నా..
వర్తమాన భారతం వార్తలభారంతో చెలరేగే
ఆలోచనాసంద్రపు సుడిగుండాల్లో చిక్కి..
మునిగిపోతూ నలిగి నలిగి..
కడకు తేలి రూపుదిద్దుకుని..
నా మస్తిష్కపు పొరలు చీల్చుకుని
అక్షరాలై కాగితాన బారులై
పరచుకున్న నా భావజాలమా..!

అడగవా ఈ సమాజాన్ని..
కులమతాల అడ్డుగోడలు..
ప్రాంతీయ తత్వాలు.. రేపుతున్న
విద్వేషాల ఆరని అగ్నికీలలు.. ఎందుకని?
ఉగ్రవాదం కోరలు సాచి విషం చిమ్ముతూ
అమాయక ప్రాణుల్ని విగతజీవులుగా మార్చి
మరుభూమిని తలపిస్తున్న తీవ్ర సంక్షోభాల్ని
ప్రశ్నించవా.. ఈ మారణ హోమాలెందుకని !?

తరతరాలుగా.. ప్రతీ తరాన్ని
తీరని వేదనలో ముంచెత్తుతూ
నిర్వీర్యం చేస్తూ.. దుస్సాంప్రదాయాల
పడగనీడలో పాతుకుపోయి
కుళ్ళిపోతున్న ఈ మనస్తత్వాల్ని..
ప్రశ్నించవా.. ఎందులకీ
అనాగరిక మూఢత్వపు ముసుగులని!

ఆత్మాభిమానం మృగ్యమై
మానవీయ విలువలు శూన్యమై
అర్ధాంగి ఆస్తులకు అర్రులు చాస్తూ
మూడుముళ్ల బంధం మూన్నాళ్ళ
ముచ్చటగా మారుస్తూ..
నవ వధువుల్ని కాటికి పయనం
కట్టిస్తూన్న ఆత్మ విమర్శ ఎరుగని
నేటి సంస్కారహీనుల్ని
నిలదీయవా.. తగునా ఇది మీకని..!!

ఏ మూల వెతికినా.. ఏ వార్త చదివినా
ఏమున్నది గర్వకారణం..! తీరని మానసిక
సంఘర్షణల క్షోభ దప్ప.. అటనుండి
ఆవిర్భవించే వేదనాభరిత స్పందన దప్ప..!

అయినా సరే.. మదిని కలవరపరిచే
ఓ భావజాలమా.. మరోసారి.. మరోసారి..
ప్రశ్నించు.. ప్రశ్నిస్తూనే ఉండు..
ప్రశ్నార్థకంగా మారుతున్న దేశ భవిత గురించి..
భావితరాల అగమ్యగోచర ప్రస్థానం గురించి..!
ఏమో! జవాబు దొరకునేమో..!
సాంత్వన కలుగునేమో..!
సమాజం మారి నవభారతం
ఉదయించునేమో..!!

Exit mobile version