[ఎమ్. విజయశ్రీముఖి గారు రచించిన ‘ప్రస్థాన వేళ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
నా పేరు మాధవరావు. నేను కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఓ కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నాను.
రోగం పేరు ఏదైతేనేం.. ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నన్ను జాయిన్ చేశారు మా వాళ్ళు.
డాక్టర్స్ గంభీర వైఖరి, నా వాళ్లను సైతం లోపలకి రానివ్వక పోవడం, డోర్‌కి ఉన్న చిన్న అద్దంలో నుండి కలవరపాటుతో నన్ను చూస్తున్న నా కుటుంబ సభ్యుల చూపులతో నాలో రేగిన సందేహాలు..
‘ఇలా హడావిడి చేసి, ఆందోళనపరిచి ఈమధ్య సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వాళ్లు లక్షలలో ఫీజులు గుంజుతున్నార’ ని వింటున్నాను. లేక.. నా భౌతిక ప్రస్థానం నిజంగానే అతి త్వరలోనే ముగియ బోతోందా? అర్థం కాలేదు.
ఒకవేళ.. నిజంగానే.. నేనీ ఐసియు గదిదాటి బైటకు వెళ్ళలేకపోతే? పోతే..? అనే ఊహ కలిగే సరికి.. జీవితంపై ఆశ, నావాళ్ళ పైన మమకారం, నా చుట్టుపక్కల వారిపైన, జీవితంలో ఎదురైన ప్రతివారిపై గౌరవం ఉక్కుమ్మడిగా నాలో కదిలి నన్ను ఉక్కిరిబిక్కిరి చేయసాగాయ్!
ఎప్పటికైనా తప్పదు అని తెలిసినా.. అదేంటో మృత్యువు ముందే వచ్చేస్తున్నట్లుగా.. అదీ ‘నాకే రావాలా?’ అన్నంత దిగులుగా ఉంటోందీ మధ్య.
మధుమేహం వచ్చాకే తీపిలోని తీపి తెలిసినట్లు, చావు సమీపిస్తేనే జీవితం విలువ పెరుగుతుంది.
బతుకుమీద ఆశ అలా ఉంటుంది మరి!
“డాక్టర్ గారూ! మా వాళ్ళను లోనికి రానివ్వక పోయినా పర్వాలేదు. నాలుగు తెల్ల కాగితాలు, ఒక కలం ఇప్పించండి” డాక్టర్ వచ్చినప్పుడు రిక్వెస్ట్‌గా అడిగాను. “మీరు బాగా రెస్ట్ తీసుకోండి బయటకు వెళ్లాక బోలెడు రాసుకుందురు గాని” నవ్వి చెప్పారు డాక్టర్.
“బైట కెళ్లడమే జరిగితే, ఇంకా రాతల తోటి పనేముంది సార్? మాటలే మాటలు!” నీరసంగా నవ్వుతూ అన్నాను.
ఆయన చిన్నగా నవ్వి, సిస్టర్‌తో నేను అడిగినవి ఇవ్వమని చెప్పి, నన్నెక్కువగా ఆలోచించవద్దని హెచ్చరించి వెళ్లారు. నాకు కాస్త తేటగా ఉండి, కొద్దిసేపు కూర్చో గలిగినప్పుడు కాస్త కాస్తగా రాస్తున్నాను.. నేను రాయకుండానే వెళ్ళిపోతే..
నాతో పాటు.. ఒక అపరాధ భావాన్ని మోసుకు పోవాల్సి వస్తుందనే ఊహతోనే ఇది..
***
మనం కొద్దిరోజులైనా ఎక్కడికన్నా వెళ్లేటప్పుడు మనవాళ్ళకో, దగ్గరవాళ్ళకో, మిత్రులకో ‘బై’ అని వీడ్కోలు చెప్పి వెళతాము.
ఎప్పుడన్నా ఏదైనా రాయబోయి, జేబులో పెన్ లేనప్పుడు పక్కవాళ్లు అందించినా.. బస్సులోనో రైల్లోనో సీట్లులేక నిలబడితే, ఎవరైనా కొంచెం చోటిస్తే.. ఆ మాత్రానికే వాళ్లకు ధన్యవాదాలంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటాము కదా?
మరి.. అరవై ఐదేళ్లుగా ‘నాదనుకునే’ ఈ భౌతిక దేహం యొక్క ఉనికికీ, ఉత్తేజానికి, మనుగడకు, మధురస్మృతులకు ఎన్నోసార్లు ఎంతగానో నాతో సహకరించి, స్నేహించి నాజీవితంలో జవజీవాలు నింపిన ఆత్మీయ సహృదయులు ఎందరో కదా?
మళ్లీ మరలిరాని విధంగా, కానరాని చోటుకు నేను తరలిపోయే వేళ.. తుదివేళ.. ప్రయాణం ఖాయమని తెలిసీ.. ‘నేను’ అనుకునే మనసుతో, ‘నాది’ గా భరించిన ఈ భౌతిక రూపంతో కృతజ్ఞత తెలుపుకొని వీడ్కోలు చెప్పకుండా వెళ్ళిపోవడం.. ఉహూ.. నాకు మనస్కరించడం లేదు. లేదా.. మిమ్మల్ని, ఈ తనువుని వీడలేని అనుబంధమూ కావచ్చు..
నా జీవనయానంలో ఎదురైన వారికి అభివాదం తెలిపి, సెలవు తీసుకోవాలని ఉంది. అందుకే నా ఈ చివరి లేఖ..
***
నా జన్మదాతలై, ఏళ్ళక్రితమే ఆ స్వర్గలోక వాసులుగా వెళ్లిపోయిన నా జననీ జనకులకు తొలి కృతజ్ఞతలు!
అమ్మా! నీ కడుపులో పడిన ఒక జీవాణువుకు నీ రక్త మాంసాలతోనే ఆకారం, ఆయుష్షు ఇచ్చి, ఈ లోకాన్ని చూపి, పేగుబంధంతో ఆజన్మాంతం అనుబంధపు ముడివేసిన కన్నతల్లీ! నీ స్మృతికి చివరిగా సాష్టాంగ ప్రణామాలర్పిస్తున్నాను!
నాన్నా! నీవొక నిచ్చెనవై నా భావిభారాన్ని నీ భుజాలపై మోసి, నన్ను అందలం ఎక్కించావు. నా ఆశలకు ఆసరాగా నిల్చిన పితృదేవా! ఇదిగో.. నిన్ను తలుచుకుంటూ మోకరిల్లుచున్నాను!
నాకన్నా ముందు, నా తర్వాత పుట్టి మురిపాల బాల్యాన్ని పంచిన, ఈనాటికీ అండదండలై ఉన్న నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల అనురాగానికి మనసా వాచా తలవంచి నమస్కరిస్తూ.. ఆఖరి వీడ్కోలు!
గువ్వపిట్టల్లా ఎగురుతూ, తూనీగల్లా తిరుగుతూ చిలిపి అల్లరితో చిందులు వేసే చిరుతప్రాయంలో మీరు నాతో కలిసి, నేను మీతో కూడి అల్లరల్లరి చేసిన ఆ పరమానందపు రుచిని చవి చూపిన బాల్యమిత్రులారా! మరో జన్మలో కల్సుకుందాం, వెళ్ళి రానా?
గురుదేవులారా! ‘అఆ’లు దిద్దించి, నాలోని అజ్ఞానాన్ని తరిమే అక్షరదీపాన్ని వెలిగించారు! నా బతుకు బాటను వెలుగుదారిగా మార్చిన మీ అందరికీ వినమ్రతతోను, అత్యంత గౌరవంతోను చేస్తున్నాను మీకు పాదాభివందానాలు!
స్నేహితులారా! యవ్వనోత్సాహంలో అంబరాన్ని అందుకునే ఉత్తేజంతో, ఊసులతో, ఊహలతో.. పోటెత్తే వయసులో మీతో చేరి నేను, నాతో పాటు మీరు, మనం కల్సి చేసిన కొంటెపనులు ఎన్నెన్నో! చెప్పుకున్న చిలిపి కబుర్లు లెక్కలేనన్ని. ఎంతో ఆహ్లాదంగా గడిపిన ఆ రోజులు.. ఓహ్! ఇప్పుడు తలుచుకుంటుంటే.. ఈ మరణావస్థలో కూడా నా మనసుకు తుళ్లింతలే సుమా! మీ తలపులతో ఇప్పటికి సెలవా మరి?
ఇప్పుడు..
నా ప్రియసఖీ, నా జీవన సహచరీ! నీ రాకతోనే నా బతుకు తోటకి మరింత పచ్చదనం అద్దావ్! పరిమళ భరితమైన వర్ణ రంజితం చేశావోయ్! ముద్దులొలికే ఇద్దరు పసిపాపలను కానుకలుగా ఇచ్చి, నాకు పెద్దరికాన్ని కట్టబెట్టావ్!
నిన్ను ఒంటరిదాన్నిగా చేసి, వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైనది. నీ సాంగత్య సౌరభాలు నా ఆత్మతో వెన్నంటే వస్తాయ్! నిన్ను.. నిన్నే పదే పదే పలవరిస్తూ, నీ ప్రేమను అనుభూతిస్తూ.. వెళ్ళక తప్పదు కనుకనే.. నీ అనుమతిని అర్థిస్తున్నాను.. వెళ్లి రానా దేవీ?
నా కణాన్ని పంచుకుని, నన్ను కన్నతండ్రిని చేశారు. నా ప్రతిరూపాలుగా నిలిచిన నా బంగారుతండ్రీ, నా వరాలతల్లీ.. మిమ్మల్ని చూసుకుంటూ నేను అణువణువునా సంతోషంతో, సగర్వంగా పులకించిపోతూ ఉండేవాడిని. మిమ్మల్ని విడిచి వెళ్లాలనిలేదు.. తప్పదు. ఐనా, నేను మీ జీన్స్‌లో జ్ఞాపకాల్లో జీవించే ఉన్నాను కదా? అది చాలు! మళ్లీ మీ కడుపున పుట్టిన పాపాయిల్లో నేను కనిపిస్తూనే ఉంటానుగా?
ఇంకా..
నా ఇరుగుపొరుగులు, హితులు, పరిచయస్థులు నన్ను చూడగానే నాకు చిరునవ్వులు పంచి, నా ఆనందానికి కారణమైన వారికి ధన్యవాదాలు!
ఆఖరిగా.. అసలైన మాట!
తెలియని అవివేకంతో కొందరిని బాధపెట్టి ఉంటాను. తెలిసీ అహంకారంతో మరి కొందరిని అవమాన పరిచి ఉంటాను. కన్ను మిన్ను కానని కక్ష కార్పణ్యాలు ఒక్కోసారి నన్ను మృగాన్ని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అవన్నీ.. వారంతా.. ఈ అవసాన దశలో.. గుర్తుకు వస్తూ.. నా మనసును ములుకులుగా గుచ్చుతుంటే.. కనుకొలకులు కొలనులై పోతున్నాయ్!
ఆలస్యమైనా ఆఖరిగా అడుగుతున్నాను.. నన్ను మన్నిస్తారు కదూ?
మమకారం మధురస్మృతుల మేళవింపైన ఈ మానవ జన్మను స్పటికములా, స్వచ్ఛంగా ఉంచుకున్నట్లైతే.. ఆహా! ఈ వేళెంత సంతోషంగా సగర్వంగా, శాంతిగా పైకి పయనించే వాడిని!
మన పెద్దలు స్వర్గం నరకం అని చెప్పే పదాలు నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి.. చివరి దశ ప్రశాంతతే స్వర్గం! అంతిమ దశలో మనసు ఎత్తి చూపే మన అకృత్యాలే నరకం అని ఆలస్యంగా అర్థమౌతోంది!
బతుకు బుడగ చిట్లిపోయే చివరిక్షణాల్లో తెలిసీ ఏం లాభం? దశాబ్దాలు తరబడి బతికినా, సాటి వారికి మేలు చేయకపోయినా.. కీడు చేయలేదనే ఆత్మతృప్తి లేని జీవిత కాలమంతా వృథానే!
నిజం! జీవితం అందమైనది, అపురూపమైనది.. దాని విలువ ఇప్పుడు తెలుస్తోంది..
అందరితో మనసు విప్పి ఏదేదో చెప్పుకోవాలని.. ఆబగా.. ఆర్తిగా ఉంది.
కానీ.. నిస్స..త్తు..వ..గా.. ఏ..దో.. మ..గ..త.. క..మ్మే..
ఐ.సి.యు.లో ఆయన బెడ్‌కు ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్న సిస్టర్ ఆయన రాస్తున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చి బిపి, పల్స్ లాంటివి చూస్తూన్నప్పుడు ఆయన రాసే పేపర్ల మీద ఆమె దృష్టి అలవోకగా పడేది.
పూర్తిగా చదవక పోయినా.. కంటబడిన కొన్ని వాక్యాలతో జీవితంపై అనురక్తి, ముగిసిపోయే ముందటి ఆరాటం అర్థమై ఆలోచిస్తూ ఉండేది.
ముందున్న పుస్తకంలో ఏవో నోట్ చేసుకుంటూ తలెత్తిన సిస్టర్ మాధవరావు చేతిలో కలం జారి పోవడం.. ఆయన వెనక్కి వాలిపోతుండడం చూసింది. గభాల్న వెళ్లి పొదవి పట్టుకుని పడుకోబెట్టింది.
తాను చేయాల్సినవి చేస్తూనే డాక్టర్‌కి, కాల్ చేసింది.
‘జీవితం విలువ తెలుసుకొని బతకాలి. లేదా.. తెలుసుకున్నాకైనా బ్రతికుండాలి.. ఈయనకేమీ కాకూడదు’ మనసులోనే అనుకుంది సిస్టర్.
