[ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య ‘నవతి’ పూర్తి అభినందన సంచిక ‘ప్రతిభాసుప్రసన్నము’ పుస్తక పరిచయం అందిస్తున్నాము.]
మార్చి 2026 లో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారి తొంభైఏళ్ళ వేడుక ‘నవతి’ పూర్తి సందర్భంగా వెలువరించిన అభినందన సంచిక ‘ప్రతిభాసుప్రసన్నము’.
ఓ గొప్ప పండితుడి జీవితాన్ని, సాహిత్యాన్ని, ఆలోచలనలను, తాత్త్వికతను – ఆయన మిత్రులు, సహోద్యోగులు, అభిమానులు, శిష్యప్రశిష్యులు, ఇతర కవి పండితులు, ఆధ్యాత్మికవేత్తలు – ఎంతో అద్భుతంగా అందించిన రచనల సంకలనం ‘ప్రతిభాసుప్రసన్నము’. అధిక భాగం వ్యాసాల రూపంలో ఉన్నా, కొన్ని పద్య రచనలు, ఒక ఆంగ్ల వ్యాసం, ఒక ముఖాముఖి ఈ సంచికకు వైవిధ్యాన్ని చేకూర్చాయి.
సుప్రసన్నగారి జీవితంలోని పలు పార్శ్వాలను, వారు తమపై చూపిన ప్రభావాలను, వారి నుంచి తాము నేర్చుకున్న అంశాలను ఆయా రచయితలు తమ తమ రచనలలో పేర్కొన్నారు.
~
సుప్రసన్నగారు తెలుగు వెలుగుల కోవెల అని, పోతన వలె తెలుగుల రత్నపేటి అని, తెలుగునాట విశ్వనాథ తరువాత భారతీయ ఆత్మదర్శనాన్ని విస్పష్టంగా జీర్ణించుకుని అభివ్యక్తం చేసిన దార్శనికులని – ఈ సంకలనానికి సంపాదకత్వం వహించిన డా. దహగాం సాంబమూర్తి గారు వాక్రుచ్చారు. వారి సృజన అపూర్వమని, వారి ఆలోచనలు అనిదం పూర్వములని పేర్కొన్నారు.
శ్రీ ఆరుట్ల భాష్యాచార్య గారు తొమ్మిది పద్య కుసుమాలతో సుప్రసన్నగారిని అలంకృతులను చేశారు. ‘పద్య పుష్పోపహారము’ అనే రచనలో ఈ క్రింది పద్యం ఆచార్యుల వారి కావ్య నిర్మాణ శైలిని, వస్తుతత్త్వాన్ని సూక్ష్మంగా ప్రస్తావించింది.
పద్యములందునన్ వచన పద్యములందున మీదు భావనా
పద్యమె వేఱు, మీకవనపద్ధతి నవ్యము, వస్తుతత్త్వమున్
హృద్యముగా ధ్వనించి రసవిస్తర కావ్యముగా సుమించి, మీ
విద్యుత శిల్ప వైభవము విస్ఫురణమ్మొనరించు ధీమణీ!
‘ఉదాహరణ వాఙ్మయం’ (దేవతా స్తుతులు, భక్తి కావ్యాలు) లో ఉపయోగించే ప్రాచీనమైన ఛందోరూపాలు కళిక, ఉత్కళిక ఉపయోగించి డా. వజ్జల రంగాచార్య ‘సుప్రసన్నోదాహరణము’ అన్న పద్యాలను సభక్తికంగా, ఒక్కో విభక్తికి ఒక కళిక, ఒక ఉత్కళిక పద్ధతిలో అందించారు.
సంబోధనా ప్రథమా విభక్తి లో అందించిన ఉత్కళిక చూడండి, ఎంత అద్భుతంగా ఉందో:
బ్రతుకులో కవితలో/పరమమెరిగినవాడ/ఋతంభర ప్రజ్ఞయే/రూపగుణ మగువాడ/సృజన, తత్త్వ, విమర్శ/మతి త్రిదండధారుడా/రుజ రాగ భోగగతు/లూడ్చిన మహాఋషీ!
అభినవగుప్తునికి తెలుగు ప్రతిరూపంగా సుప్రసన్నాచార్యులను కొనియాడారు డా. ఏల్చూరి మురళీధరరావుగారు తమ పద్యంలో.
అభినవగుప్తపాదులకు నాంధ్రవచఃప్రతిరూపులై యశో
విభవముఁ గన్న శాస్త్రకృతవిద్యులకున్ గురుపాదులై కవి
త్వభణితిమార్గదీపన కభంగురకావ్యకృదర్హణీయవా
క్ప్రభుత రహిల్లు పూజ్యకవిరాణ్మిహికాఘృణి! యంకమాలికల్॥
“సుదీర్ఘ జీవితంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులని, ఎంతో విషాదాన్ని అనుభవించినా, వాటిని ధైర్యంగా ఎదురుకున్నారు. ఆనందాన్నైనా, విషాదాన్నైనా సమదృష్టితో ఎదురుకునే స్థితప్రజ్జత్వాన్ని ఆయన అలవర్చుకున్నారు” అంటారు జోహార్లు అర్పించారు డా. అంపశయ్య నవీన్, ‘ఆ మహా పండితునికి నా జోహార్లు’ అనే తమ వ్యాసంలో.
డా. లంకా శివరామప్రసాద్ గారు వ్రాసిన ఆంగ్ల వ్యాసంలో ఆచార్య కోవెల సుప్రసన్న గారిని అథర్వ వేదంలో కాండం 4, సూక్తం 1 లో ప్రస్తావించిన కవిగా పేర్కొన్నారు. ఇక్కడ ‘కవి’ అంటే ఆధునిక పరిభాషలోని కవి కాదు, వేద కాలపు పరిభాషలో ‘కవి’. అంటే సత్యాన్ని దర్శించిన ఋషి లేదా జ్ఞాని. భగవంతుడు సృష్టించిన ఈ విశ్వ నియమాలు, ప్రకృతి అందాల వెనుక ఉన్న పరమార్థాన్ని ఆ జ్ఞాని తన దివ్యదృష్టితో చూసి, లోకానికి వివరిస్తాడు. మన కాలంలో సుప్రసన్నగారు అటువంటి కవి, తత్త్వవేత్త, విద్యావేత్త, మౌన యోగి యని వ్యాఖ్యానించారు.
శ్రీ సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి గారు తమ వ్యాసంలో సుప్రసన్న గారి పద్య కవిత్వాన్ని విశ్లేషించారు. వాస్తవికత, ప్రతీక అంతఃస్ఫురణల రూపంలో యోగమార్గంలో కవితాసాధన చేయడం సుప్రసన్న కవితా రీతి అని పేర్కొన్నారు. వస్తువు, భాష, అభివ్యక్తి, అలంకారం అన్ని కవితా వ్యవసాయ ద్రవ్యాలు అనంతత్వం వైపు ప్రయాణించేట్టుగా చెప్పడం ఆయన కవిత్వంలో కనిపిస్తుందని అన్నారు.
‘ప్రసన్న ప్రపత్తి’ అనే తమ వ్యాసంలో డా. ఒద్దిరాజు వెంకట రామారావు గారు సుప్రసన్న గారి ‘శ్రీనృసింహ ప్రపత్తి’ కావ్యాన్ని విశ్లేషించారు. “సుప్రసన్నగారు జీవితం నుండి పారిపొమ్మని చెప్పలేదు. వారి దృష్టిలో మానవజన్మ దేవుడిచ్చిన వరం. జీవితం ఒక పవిత్ర యజ్ఞం. జీవించడమే పూర్ణయోగం” అని వ్యాఖ్యానించారు.
శ్రీ వరిగొండ కాంతారావు గారు ‘శ్రీ సుప్రసన్నారవిందము’ అనే తమ వ్యాసంలో ఆచార్యులవారిపై అరవిందుల ఫ్రభావాన్ని విశదీకరించారు. సాంపరాయము, శ్రీ అరవింద గాయత్రి, శ్రీ సీతారామ కథాసుధ, వనవాస రాఘవం, శ్రీ కృష్ణ శరణం మమ వంటి కావ్యాలనుంచి పద్యాలనుటంకించారు. సుప్రసన్నుల రచనకూ, వ్యక్తిత్వానికీ అభేదమని పేర్కొన్నారు.
‘సుప్రసన్నమ్’ అనే తమ వ్యాసంలో ఆచార్య యల్లాప్రగడ సుదర్శనరావు గారు సుప్రసన్నుల మానుష కోణాన్ని స్పృశించారు. జ్ఞానపీఠం లాంటి అత్యున్నత భారతీయ పురస్కారం ఆచార్యుల వారికి లభించాలని ఆకాంక్షించారు.
ఆచార్య సుప్రసన్న గారు ‘శ్రీవిద్య’ లోతులు తెలిసిన జ్ఞాని. వారి రచనల్లో శ్రీవిద్యాతత్త్వం అంతఃస్రవంతిగా ప్రవహిస్తుంటుంది. అసలు శ్రీవిద్య అంటే ఏమిటో తెలిపే వ్యాసాన్ని అందించారు డా. తాడేపల్లి పతంజలిగారు.
ఆచార్య సుప్రసన్న గారి సృజనాత్మక ధారపై అరవిందుల ప్రభావాన్ని విహంగ వీక్షణం చేశారు శ్రీ కస్తూరి మురళీకృష్ణ తమ వ్యాసంలో. అరవిందులు, విశ్వనాథ గార్ల ప్రభావం వల్ల సుప్రసన్నాచార్య గారి ఆలోచనలకు, సాహిత్యానికి నిండుదనం, లోతు, సాంద్రత వంటివి పుష్కలంగా లభించాయని అభిప్రాయపడ్డారు.
‘ఆధునిక ఋషి కోవెల సుప్రసన్నాచార్య’ అనే వ్యాసంలో ఆచార్య బన్న అయిలయ్య గారు, జీవితంలో సమస్యలని ఎలా ఎదుర్కోవాలో, సుప్రసన్నగారు తమ అనుభవాలను నుంచి తనకు నేర్పారని తెలిపారు. సమస్య పరిష్కారం ఆలోచనతో కాకుండా అనుభూతితో కూడా చేయవచ్చునని సుప్రసన్నగారు చెప్పారని, ఏదైనా సమస్య గురించి వారితో చర్చిస్తుంటే, ఒక తాత్త్వికుడితో చర్చించినట్టు తనకు అనుభవంలోకి వచ్చేదని ఆచార్య అయిలయ్యగారు తెలిపారు.
జీవితాన్నే ఒక యోగంగా భావించిన యోగి శ్రీ సుప్రసన్నగారని, ఆధునిక సాహిత్యంలో ఆధ్యాత్మిక జాతీయత దిశగా తమని ప్రోత్సహించారని ఆచార్య కసిరెడ్డి వేంకటరెడ్డి గారు తమ వ్యాసంలో పేర్కొన్నారు. సుప్రసన్నగారు ఎంత సనాతనులో, అంత నిత్యనూతనులని వ్యాఖ్యానించారు.
పరిశోధనల పర్యవేక్షణలో ఆచార్య సుప్రసన్నల పద్ధతి ఎలా ఉంటుందో, విద్యార్థులని బాధ్యతాయుతమైన భాగస్వాములుగా ఎలా మారుస్తారో డా. కాత్యాయిని విద్మహే తమ వ్యాసంలో పేర్కొన్నారు. పర్యవేక్షకుడిగా సుప్రసన్నగారిది ఆదేశించే లక్షణం కాదు, ఆలోచింపజేసే లక్షణం అని, ఆయన తమకు ఆదర్శమని వ్యాఖ్యానించారు.
డా. గుంజి వెంకటరత్నం గారు కూడా తమ వ్యాసంలో, పరిశోధనల పర్యవేక్షణలో ఆచార్య సుప్రసన్నల పద్ధతి గురించి వివరించారు. ఆచార్యుల వారు పర్యవేక్షక పరిజ్ఞాన ధురీణులని పేర్కొంటూ, తన పరిశోధన గురించి, ఆచార్యుల వారి మార్గదర్శనం గురించి వివరించారు. పరిశోధక విద్యార్థి తన పరిశోధనాంశంలోని విశేషాలతో పాటు, తత్సంబధమైన అనేకానేక విషయాలు, స్వయంగా తెలుసుకొనేవిధంగా ఆయన పర్యవేక్షణ ఉంటుందన్నారు.
‘విశ్వనాథ సాహిత్య తత్త్వ దర్శనం – సుప్రసన్న విమర్శనం’ అనే వ్యాసంలో, విశ్వనాథ గారిని, వారి సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదనీ, రసమయమైన విస్వనాథ సాహిత్యాన్ని మరింత రుచిమయం చేసి చూపించిన అపార ప్రజ్ఞా ధురీణులు సుప్రసన్నగారి, డా. గండ్ర లక్ష్మణ రావు గారు పేర్కొన్నారు.
వరంగల్లు సాహిత్యలోకంలో ఎవ్వరికి ఏ సందేహం వచ్చినా తీర్చగలిగే సామర్థ్యం ఉన్నవారు సుప్రసన్నగారని నాగిళ్ళ రామశాస్త్రి గారు తమ వ్యాసంలో పేర్కొన్నారు. ఇష్టాగోష్ఠి సంభాషణల్లో ఎన్నో విలువైన సంగతులుంటాయనీ, అవన్నీ రికార్డు కావాలని ఆచార్యులు తరచూ చెప్పేవారని గుర్తు చేశారు.
సుప్రసన్నగారు ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన దేశికులనీ, వారికి తెలియని ఫిలాసఫీ లేదనీ, వారితో ముచ్చటిస్తుంటే, అనేక పాశ్చాత్య తత్త్వవేత్తలు, ప్రాచ్యతత్త్వవేత్తలు తారసపడతారనీ శ్రీ వి. ఆర్. విద్యార్థి తన వ్యాసంలో పేర్కొన్నారు.
సహృదయ సంస్థతో ఆచార్యుల వారికున్న బంధాన్ని, వారితో తమకున్న అనుబంధాన్ని తమ వ్యాసంలో వివరించారు శ్రీ జి. గిరిజామనోహరబాబుగారు. మూడు దశాబ్దాల పాటు సాగిన సహృదయ సంస్థ కార్యక్రమాలలో ఆచార్యులవారు పాల్గొంటూ సంస్థ ప్రగతికి తోడ్పడ్డారని తెలిపారు.
డా. రామా చంద్రమౌళి గారు అందించిన వ్యాసంలో ఆచార్యుల వారి మణికర్ణిక, అశ్రుభోగ, శ్రీరామకథాసుధ పుస్తకాలను సంక్షిప్తంగా విశ్లేషించారు. ‘మణికర్ణిక’లో సుప్రసన్న గారు వ్రాసిన ‘వెళ్ళిపోవడమంటే’ అనే కవితని పంచారు. “ప్రతిరోజూ వెళ్ళి తిరిగొచ్చే మనిషి/ఏదో ఒకరోజు వెళ్ళి తిరిగిరాకపోవటమే/‘మరణం’ అని కదా అతడు నిర్వచించాడు” అని కవితా పాదాలను చదివితే, పైకి మామూలుగా అనిపించిన, ఆచార్యుల వారి గుండెలోని విషాదాన్ని ప్రదర్శిస్తాయి.
డా. ఎన్.వి.ఎన్. చారి గారు వరంగల్ లోని పోతన విజ్ఞాన పీఠానికి ఆచార్యుల వారందించిన సేవల గురించి తమ వ్యాసంలో పేర్కొన్నారు. ‘ఆచార్యులతో సత్సాంగత్యం’ అనే వ్యాసంలో శ్రీ ఎ.వి. అనిల్ ప్రసాద్, ఆకాశవాణికి ఆచార్యులవారికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఆత్మస్తుతి, పరనింద లేని ఋషితుల్యులు సుప్రసన్నగారని ఆయన వ్యాఖ్యానించారు.
‘మా తరానికి ఇది ఒక భాగ్యం’ అనే శీర్షికతో వ్రాసిన వ్యాసంలో డా. పాతూరి రఘురామయ్య గారు ఆచార్యుల వారి శిష్యవాత్సల్యాన్ని, శారదమ్మగారి ఆప్యాయతని రుచి చూపారు. ఆచార్యుల వారి పరిశోధక శిష్యుల వరుసలో బహుశా తానే చివరి స్కాలర్నని అభిప్రాయపడ్డారు.
శ్రీ పొట్లపల్లి శ్రీనివాసారావు గారు, ఆచార్యుల వారితో జరిపిన ముఖాముఖిని ‘చైతన్యావర్తనం’ అనే పేరిట ఈ పుస్తకంలో అందించారు. సిహెచ్. హైమవతి గారు తమ వ్యాసంలో ‘చేతనావర్తం’ కవితాసంపుటి గురించి, అందులో సుప్రసన్నగారి కవితా విశేషాన్ని క్లుప్తంగా వివరించారు. ఆధునిక భావచేతననీ, ఆధ్యాత్మిక చింతననీ కలిపే వంతెన ఆచార్యుల వారి కవిత్వమని వ్యాఖ్యానించారు.
శ్రీ చేపూరి శ్రీరామారావుగారు తమ వ్యాసంలో ఆచార్యు సుప్రసన్నగారు నిర్వహించిన అష్టావధానాలపై విహంగ వీక్షణం చేశారు. వివిధ అవధానాలలో పండితులు ఇచ్చిన సమస్యలను ఆచార్యులు పూరించిన పద్ధతిని కొన్ని ఉదాహరణల ద్వారా వివరించారు.
‘విశ్వనాథ భారతి’ స్థాపన, ఆ సంస్థ ద్వారా జరిగిన కృషిలో సుప్రసన్నగారి పాత్రని తమ వ్యాసంలో వివరించారు డా. ఎ. వి. నరసింహారావు. విశ్వనాథ అసంకలిత సాహిత్యాన్ని పాఠకులకు అందించిన ఘనత ఆచార్యులవారిదేనన్నారు.
కీ.శే. డా. రాళ్ళబండి కవితాప్రసాద్ గారు ఆచార్యులవారి ‘శివాభిసారిక’ కావ్యానికి వ్రాసిన ముందుమాటను ఈ సంకలనంలో చేర్చారు. గత వందేళ్ళలో వచ్చిన విశ్వకవి ఠాగూర్ ‘గీతాంజలి’, వడ్డాది సుబ్బరాయకవి ‘భక్తచింతామణి’, చలం ఊర్వశి, విశ్వనాథవారి ‘కృష్ణసంగీతం’ సరసన నిలిచే ధీరలలిత కావ్యమిదని వ్యాఖ్యానించారు ముందుమాటలో.
ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల జీవితం, కృషి, సాహిత్యం, తాత్త్వికత, ఆధ్యాత్మికల గురించి రచనలు అందిస్తున్న ఈ సంకలనంలో ఆచార్యుల వారు వ్రాసిన ‘ప్రబంధాతరంగ రోచిస్సులు’ అనే వ్యాసం ఎందుకు చేర్చారో, ఈ సంకలనం ప్రధాన సంపాదకులు డా. దహగాం సాంబమూర్తిగారి ప్రత్యేక ఇంటర్వ్యూలో చదవవచ్చు.
చివరగా, శ్రీ కోవెల సంతోష్ కుమార్ ‘తపస్వీ వాగ్విదాం వరః’ శీర్షికతో తమ కుటుంబం గురించి, తండ్రి గారి జీవన ప్రస్థానం, సంతోషాలు, విషాదాలు, రచనలు, సంస్థాగత సేవలు, పురస్కారాలు, గౌరవాలు, ఆచార్యుల వారిపై అరవిందుల, సద్గురు శివానందమూర్తి గార్ల ప్రభావం తదితర అంశాలతో సుప్రసన్నాచార్యుల జీవితాన్ని సుమారు 70 పేజీలలో పాఠకుల ముందుంచారు. ఇది ఆచార్యుల వారి మినీ బయోగ్రఫీ!
ఈ రచనలన్నీ చదివాకా, సుప్రసన్నాచార్యులవారికి ఉన్న గౌరవభావం రెట్టింపవుతుందనడంలో సందేహం లేదు. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సంస్కృతికి, అక్షరానికి నడిచే నిఘంటువు. వారి అనుభవం మనకు మార్గదర్శకం.
***
ప్రధాన సంపాదకులు: డా. దహగాం సాంబమూర్తి
ప్రచురణ: ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య ‘నవతి’ పూర్తి అభినందన సమితి, వరంగల్
పేజీలు: 270
వెల: ₹ 300/-
ప్రతులకు:
కోవెల సంతోష్ కుమార్,
4-48/12, రోడ్ నెంబర్ 3,
బాబా నగర్, నారపల్లి,
పీర్జాదిగూడా పోస్ట్, ఘట్కేసర్ మండల్
హైదరాబాద్ 500088
ఫోన్: 9052116463, 8374804304
~
డా. దహగాం సాంబమూర్తి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-dahagam-sambamurthy/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

