Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రతీక్షణం

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘ప్రతీక్షణం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

తాను గాయపడుతూ
నను గాయపరచని
సుదినం కోసం ప్రతి ఉదయం
ప్రతీక్షిస్తుంటాను!

మనస్సు లేని మనిషి చేతల
ప్రభావం చేత,
విష జాతుల విభేదాల విచ్చుకత్తుల
విహారాల వల్ల,
వికట కులాల దురాచారాల
ప్రహారాల వలన,
ప్రజా సంక్షేమం పట్టని
ప్రభుత వ్యవహారాల కారణంగా
ఏ ఒక్కరూ గాయపడని
సుదినం కోసం ప్రతీక్షిస్తుంటాను!

దారుణంగా ఎవరు దెబ్బ తిన్నా,
దయనీయంగా ఎవరు నష్టపడినా, దిగులు చెందినా
నా మనో నయనాలు
చెలమలయ్యేంతగా చెమ్మగిల్లుతాయి!
నా కవన చరణాలు
శోక తప్తమై సొమ్మసిల్లుతాయి!

హింసల వలన చిందే
రుధిర ధారలు,
చిప్పిల్లే కన్నీటి యేరులూ
ఏ మనిషివైతేనేమి..?
ఏ వర్ణస్థునివేవర్గస్థునివైతేనేమి?
రూపము, తాపమూ ఒక్కటే కదా.!
ప్రపంచాన్ని వసుధైక కుటుంబంలా చక్కదిద్దుతూ
సుగతి దిశగా
ప్రగతి దిశగా పయనింపజేస్తూ
సుఖ శాంతులతో ప్రకాశింపజేసే
మానవ సుగుణం కోసం
ప్రతీక్షిస్తుంటాను!

నా ఎదురు చూపులు ఫలవంతమయ్యే
సముచిత సమయం సంప్రాప్తించి
నేనాకాంక్షించే సంబరం
సాక్షాత్కరిస్తుందని
నిండు ఆశతో ప్రతీక్షిస్తుంటాను!

Exit mobile version