Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమ్ ఉత్సవ్ -2026 లో గొప్ప ఆకర్షణగా నిలిచిన తెలుగు నాటిక ‘కుసుమ్’ – వార్త

తేది 31-07-2026 న సాయంత్రం 4.00 గంటలకు ముంబయి లోని సిడ్నెహాం కాలేజీ, డా. బాబాసాహెబ్ ఆంబేడ్కర్ సభాగృహంలో ప్రేమ్ ఉత్సవ్ – 2026 ఘనంగా ప్రారంభమయింది.

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా, మున్షీ ప్రేంచంద్ గారి జన్మదినం 31 జూలై సందర్భంగా, వారి 22 కథల ఆధారంగా, మన రాజ్యాంగంలోని 22 భారతీయ భాషల్లో నాటికల ప్రదర్శన ఉత్సవం జరుపుకుంటున్నారు.

ప్రముఖ రంగస్థల దర్శకులు శ్రీ ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలోని “ఇండియన్ డ్రామా ఎంటర్టైన్ మెంట్ అకాడెమీ (ఐడియా) నాటక బృందం ‘ఒకే రచయిత, ఒకే దర్శకుడు, ఒకే రంగస్థలం’ ప్రాతిపాదికన, ‘భాషలు వేరైనా, దేశ ప్రజలు ఒక్కటే’ అనే సందేశంతో ప్రేమ్ ఉత్సవ్ జరుపబడుతోంది.

అందులో మన తెలుగు భాషకు కూడా స్థానం కల్పించబడుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా మున్షీ ప్రేంచంద్ గారి హింది కథలను శ్రీ ముజీబ్ ఖాన్ గారు నాటక రూపాంతరం చేయగా వాటిని ముంబయి ప్రముఖ రచయిత డా. అంబల్ల జనార్దన్ గారు తెలుగులోకి అనువాదం చేస్తూ వస్తున్నారు. అంతే కాదు ఆ నాటికల్లో ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు కూడా.

అందులో భాగంగా మున్షీ ప్రేంచంద్ గారి ‘కుసుమ్’ కథ ఆధారంగా ఈ సంవత్సరం ప్రేమ్ ఉత్సవ్ – 2026 లో అదే పేరుతో తెలుగు నాటిక తేది 31-07-2026 న సాయంత్రం 6.00 గంటలకు  ప్రదర్శింపబడింది. డా. అంబల్ల జనార్దన్, శ్రీ రమేశ్ చౌవల్, శ్రీ రిదం రాయర్ మరియు కుమారి పింకో సిసీలియా నటించిన ఆ నాటికకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి ప్రతిస్పందన వచ్చింది.

ప్రేమ్ ఉత్సవ్ – 2026 లో మొదటి రోజు ప్రదర్శించిన మరాఠీ, ఒడియా, డోగ్రీ, నేపాలీ, తెలుగు, మణిపురీ, కన్నడ, సింధీ, బోడో, మైథిలీ, గుజరాతీ, మొత్తం 11 నాటికల్లో మన తెలుగు నాటిక ‘కుసుమ్’ గొప్ప ఆకర్షణగా నిలిచింది.

శ్రీ మూల్ నివాసి మాల గారి నేతృత్వంలో ‘మహారాష్ట్ర తెలుగు బహుజన ఫోరం’ బృంద సభ్యులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, డా. అంబల్ల జనార్దన్, ముజీబ్ ఖాన్, కార్మిక నాయకుడు, నాటికలో ప్రముఖ పాత్ర పోషించిన శ్రీ రమేశ్ చౌవల్ గార్లను ఘనంగా సత్కరించారు.

తేది 01-08-2026 న మరో 11 నాటికల ప్రదర్శన తర్వాత కళాకారులను ఐడియా సంస్థ తరఫున సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు.

Exit mobile version