[శ్రీ బొబ్బా సత్యనారాయణ రచించిన ‘ప్రేమ నిలయం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పూర్తయిన చంద్రం, స్వప్న మూడు రోజులుగా జరుగుతున్న క్యాంపస్ ఇంటర్వ్యూలు అన్నీ శ్రద్ధగా హాజరయ్యారు. అలసిపోయిన ఇద్దరూ క్యాంటీన్‌లో టీ తాగి నిదానంగా నడుచుకుంటూ వచ్చి ఓ చెట్టు కింద నిలబడ్డారు. పచ్చని చెట్లతో పూల మొక్కలతో కాలేజీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.
“మన మధ్య మాటలకు చాలా గ్యాప్ వచ్చింది. మనం పట్టుదలగా చదవడం వల్ల ఒకరం జాబ్ సంపాదించాం. ఇంకొకరి రిజల్ట్ హోల్డ్‌లో పెట్టారు. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్‌గా ఉంది” అంది స్వప్న.
“రేపు సాయంత్రం వివేకానందనగర్‌లో ఉన్న పార్క్‌లో కలుసుకొని ఆ గ్యాప్‌ను తగ్గిద్దాం. అలాగే ఇంజనీరింగ్ పూర్తయ్యాక మనం పెళ్ళి చేసుకోవాలనుకున్నాం కదా. ఆ విషయం కూడా డిస్కస్ చేద్దాం” అన్నాడు చంద్రం.
సరే అన్నట్టు తలూపింది స్వప్న.
ఇంజనీరింగ్ తొలి ఏడాదిలోనే వారి హృదయాల్లో ప్రేమ చిగురించింది. కపటం కల్మషం లేకుండా మాట్లాడటం స్వప్న నైజమైతే, హుందాగా మాటల గారడీ లేకుండా సూటిగా స్పష్టంగా ముందు చూపుతో మాట్లాడటం చంద్రం ప్రత్యేకత. ఆ లక్షణాలే ఒకరికి ఒకరు నచ్చేలా చేసి పరస్వర ఆరాధనా భావం పెరిగింది.
కె.పీ.హెచ్.బీ.కాలనీలో ఉండే చంద్రం ఆ పార్క్‌కి వచ్చి లాన్‌లో కూర్చొని ఒక బుక్ చదవడంలో నిమగ్నమయ్యాడు. పార్క్ సందడిగావుంది. కొందరు పిల్లలు ఆడకుంటున్నారు. కొందరు వాకింగ్ చేస్తున్నారు. యువతీ యువకులు దూరం దూరంగా గుంపులుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. నాలుగు పేజీలు చదివాక స్వప్న రావడంతో బుక్ బ్యాగ్‌లో పెట్టి, “రా స్వప్నా కూర్చో” అన్నాడు చంద్రం అప్యాయంగా.
తన మనసులో నెలకొన్న గందరగోళం గుర్తొచ్చి,”చంద్ర.. మనిద్దరిలో ఎవరికి ఉద్యోగం వచ్చిన విషయం మన ఇళ్ళళ్ళో చెప్పొద్దన్నావు ఎందుకు?” కూర్చొంటూనే అడిగింది.
“దానికి మన పెళ్ళికీ లింక్ పెడతారు కాబట్టి. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం”
“సరే.. మరి మీ ఇంట్లో మన పెళ్ళికి మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా?”
“తప్పక ఒప్పుకుంటారు. నీకెటువంటి డౌట్ అక్కర్లేదు” భరోసా ఇచ్ఛాడు చంద్రం.
“అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావు?”
“మమ్మీ డాడీల ప్రేమ విహాన్ని బట్టి, ఆయన ఎప్పుడూ చెప్పే మాటల్ని బట్టి”
“ఏం చెప్పేవారు?”
“ప్రతి ఇంటి నుండి క్రమశిక్షణ కలిగి, సంస్కారం గల వ్యక్తులు సమాజంలోకి రావాలి. మంచి కుటుంబాల నుంచి మహోన్నతమైన వ్యక్తిత్వంతో వచ్చిన వారు న్యాయంగా తమకు నచ్చిన పని చేస్తూ విశాలభావాలు కలిగి, మూడ నమ్మకాలు, మత మౌఢ్యాలు, కులజాఢ్యాలు వదిలి ఉన్నతమైన మానవతా విలువల్ని త్రికరణశుద్ధిగా ఆచరించినప్పుడే సమాజంలో నిజమైన ఆనందం వెల్లి విరుస్తుంది. సమాజం స్వర్గధామం అవుతుంది. అవి లేనప్పుడు సమాజం సకల అనర్థాలకు నిలయం అవుతుంది – అని డాడీ చెబుతూ ఉంటారు” అన్నాడు చంద్రం.
“వెరీ నైస్. మరి మీ మమ్మీడాడీల ప్రేమ గురించి చెప్పు” ఆసక్తిగా అడిగింది స్వప్న.
“నిజామాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఇద్దరం చదివే రోజుల్లో మా డాడీ కలుపుగోలుతనం, స్నేహభావం, నిజాయితీ నచ్చి తనను ప్రేమించానని మా అమ్మ గౌతమి చెప్పింది. ఇద్దరివీ మిడిల్ క్లాస్ కుటుంబాలే కావడంతో, ఆదర్శ భావాలు గల డాడీ రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు చేసి తల్లిదండ్రులు ఆప్త మిత్రులు, ఆత్మీయబంధువుల సమక్షంలో నిరాడంబరంగా తనను పెళ్ళి చేసుకున్నారని కూడా చెప్పింది. ఆమె ప్రేమను పొందడం తన అదృష్టమ్మని డాడీ ఇప్పటికీ చెప్తారు. వారిద్దరు మంచిపుస్తక ప్రియులు. వాళ్ళను చూసే నేను పుస్తకాలు చదవటం అలవాటు చేసుకున్నాను” అడిగాడు చంద్రం.
“నీవు చెప్పినదంతా విన్నాక నీ తరపునుండి మన పెళ్ళికి గ్రీన్ సగ్నల్ పడినట్లే. అందుకు ఎలాంటి సందేహం లేదు. ఒక వేళ మా ఇంట్లో వద్దంటే ఏం చేద్దాం?” కర్తవ్యం చెప్పమంది స్వప్న.
“మీ వాళ్ళను ఒప్పించి మెప్పించి మనం పెళ్ళి చేసుకుందాం”
“ఎంత చెప్పినా ససేమిరా అంటూ వాళ్ళు ఒప్పుకోలేదనుకో”
“నా మీద నీకెంత ప్రేమున్నా కన్నవాళ్ళను కాదని, నన్ను పెళ్ళాడి వాళ్ళను నువ్వు బాధపెట్టడం కరెక్ట్ కాదు”
“కానీ మా అమ్మనాన్నలు కాదంటే మన ప్రేమను మనం చంపుకోలేం కదా” స్వప్న ఆవేదనగా అంది.
అది అర్థం చేసుకున్న చంద్రం, “సమాజంలో పరువు ప్రతిష్ఠల కోసం ప్రాకులాడే తల్లిదండ్రులు తమను కాదని పెళ్ళి చేసుకుంటే కన్న కూతురని కనికరం లేకుండా కడ తేర్చడం, అమ్మాయి తన ప్రేమను కాదంటే అబ్బాయి ప్రేమోన్మాదిగా మారి ఆమెను దారుణంగా హత్య చేయడం వంటి ఎన్నో బాధాకరమైన దృశ్యాలు టీవీల్లో చూస్తున్నాం. త్యాగగుణం ప్రదర్శించాల్సిన ప్రేమ స్వార్థం పగ ప్రతీకారాలతో వికృత రూపం దాలుస్తోంది. ఒకవేళ మీ కన్నవాళ్ళు మన ప్రేమ పెళ్ళిని వద్దన్నా నిన్ను ధైర్యంగా పెళ్ళి చేసుకోలేని పిరికివాణ్ణి మాత్రం కాదు. కానీ పెళ్ళికి ఒక వైపు ఆమోదం, మరో వైపు తిరస్కారం ఎదురైనప్పుడు, మనం మొండిగా ముందడుగువేస్తే మన జీవితాల పర్యవసానం మన చేతుల్లో ఉండదు” అంటూ చంద్రం భవిష్యత్తు చిత్రం ఆవిష్కరించాడు.
“నీ మాటలు వింటుంటే ధైర్యంగా మా వాళ్ళను ఒప్పించి తీరాలనిపిస్తుంది. కానీ ఎలా?”
“ఇందూరు ప్రభుత్వ పాఠశాలలో లెక్కల టీచర్‌గా పని చేసి రిటైరయిన డాడీ, అక్కడ వినాయక్‌నగర్‌లో ఉన్న మా ఇల్లు అమ్మి ఇక్కడ చందానగర్‌లో 3 బిహెచ్‌కే ఫ్లాట్ తీసుకున్నారని చెప్పాగా. త్వరలో గృహప్రవేశానికి మీ అమ్మానాన్నల్ని పిలవడానికి నేను మా అమ్మ మీ ఇంటికి వస్తాం. నువ్వు మీ ఇంట్లో మన విషయంతో బాటు, మేము పిలవడానికి వస్తున్న విషయం కూడా ముందే చెప్పు. వాళ్ళు మన ప్రేమ పెళ్ళికి సుముఖంగా వున్నదీ లేనిది మమ్మల్ని రిసేవ్ చేసుకునే దాన్ని బట్టి తెలిసిపోతుంది.”
“సరే” అంది స్వప్న.
***
అమ్మా నాన్నలైన భారతి, కృష్ణమూర్తిలతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు స్వప్న అన్ని విషయాలు చెప్పింది. ఆశ్చర్యపోయిన కృష్ణమూర్తి ఆ క్షణానికి ఏమీ చెప్పలేక, “ఆలోచించి చెబుతానమ్మ” అని మాత్రం అన్నాడు.
స్వప్న వారికి ఏకైక కుమార్తె. కృష్ణ మూర్తి ఆర్.టీ.సీ.లో కండక్టర్ జాబ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది అతని రిటైర్మెంట్ వుంది. బోధన్ సమీప గ్రామంలో భారతికి వాళ్ళ నాన్న గిఫ్ట్‌గా ఇచ్చిన రెండెకరాల పొలం ఉండేది. ఆ పొలం సాగు కృష్ణమూర్తి తల్లిదండ్రలు ఉంటున్న ఊరికి దగ్గరగానే ఉండటంతో వాళ్ళే చూసుకునేవారు. వారు కాలం చేసిన తర్వాత కౌలుకి ఇచ్చినా పెద్దగా ఆదాయం రావడంలేదని ఆ రెండెకరాలు అమ్మేసి కూకట్‌పల్లిలోని తులసీవనంలో ఒక ఫ్లాట్ కొన్నారు. స్వప్న చదువు పూర్తయ్యాక మంచి సంబంధం చూసి, పెళ్ళి చేసి ఆ ఇంటిని కూతురికి గిఫ్ట్‌గా ఇద్దామనుకున్నారు.
ఆ రోజు రాత్రి పడుకునే ముందు స్వప్న చంద్రానికి “రేపు మీరు మేము రావొచ్చు” అని మెసేజ్ చేసింది.
***
మరునాడు చంద్రం తన తల్లిని తీసుకుని స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చంద్రం వారికి పాదాభివందనం చేశాడు. స్వప్న కూడా చంద్రం తల్లికి పాదాభివందనం చేసింది. ఏం జరుగుతుందో అర్థం అవక, “మీరు ఎవరు?” అంటూ అయోమయంగా అడిగాడు కృష్ణమూర్తి.
స్వప్న కల్పించుకొని, “చెప్పాను కదా నాన్న చంద్రం అని ఈ అబ్బాయే. వాళ్ళు కొత్త ఫ్లాట్ కొన్నారు. గృహప్రవేశానికి పిలవడానికి వచ్చారు. మా విషయం చెప్పిన తరువాత మీరు ఆలోచనలో పడటంతో ఈ రోజు వీళ్ళు వస్తున్న విషయం చెప్పలేదు” అంది.
ఆ హఠాత్పరిణామానికి స్వప్న మినహా మిగతా నలుగురు ఆశ్చర్యపోయారు. చంద్రం తల్లి గౌతమి తేరుకొని, “కంగారులో మర్చిపోయి ఉంటుంది. దాందేముంది” అని కాబోయే కోడలిని వెనకేసుకొస్తూ వాతావరణాన్ని తేలిక పరుస్తూ అంది.
స్వప్న వంక తిరిగి కృష్ణమూర్తి, “ఆ అవును. పర్వలేదమ్మ” అంటూ, చంద్రం వైపు చూస్తూ “మీరు కూర్చోండి బాబు” అన్నాడు.
పరిచయాలు అయ్యాక స్వప్న టీ తెచ్చి నలుగురికీ ఇచ్చింది. స్వప్న ఇలా ఇరికిస్తుందని ఊహించని చంద్రం బిగుసుకుపోయి మాటలు రాకుండా ఉండిపోయాడు. టీ తాగటం పూర్తయ్యాక భారతికి, స్వప్నకి గౌతమి బొట్టు పెట్టి, “మీరు గృహప్రవేశానికి తప్పకుండా రావాలి. మరిన్ని విషయాలు మీరు వచ్చాక మాట్లాడుకుందాం” అంది.
“మీరింతగా చెప్పాక రాకుండా ఉంటామా?”అంది భారతి నవ్వుతూ.
***
స్వప్న తన తల్లిదండ్రులతో గృహప్రవేశానికి వెళ్ళింది. రాధాకృష్ణుల బొమ్మను బహుమతిగా ఇచ్చింది. కొత్త ఇల్లు వాళ్ళకు బాగా నచ్చింది. భోజనాలయ్యాక మిగితా ఆహ్వానితులందరూ వెళ్ళిపోయాక.. స్వప్న, చంద్రం కుటుంబాలు కలిసి కూర్చున్నారు. స్వప్న తన తల్లిదండ్రుల్ని చంద్రం నాన్నగారైన శ్రీరామ్‌కి పరిచయం చేసింది. చంద్రం తన అమ్మానాన్నలతో పాటు అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యల్ని వారికి పరిచయం చేసి, “వీళ్ళు కూడా మాతోనే వుంటారు” అని చెప్పాడు. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న ఈ రోజుల్లో నాన్నమ్మ, తాతయ్యనే కాకుండా గౌతమి తల్లిదండ్రులైన అమ్మమ్మ, తాతయ్యలను కూడా ఎంతో బాధ్యతగా ఆదరించడం అంటే, ‘ఈ ఇల్లు సంస్కారానికి విశాల భావాలకు నిలయం’ అని మనసులో అనుకున్నారు స్వప్న తల్లిదండ్రులు.
“కాలేజీలో వీళ్ళ పరిచయం దగ్గరి నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సంపాదించిన వరకు మా అమ్మాయి చంద్రం గురించి అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పింది. ఇక్కడికి వచ్చి మీ ఉమ్మడి కుటుంబాన్ని మొత్తం చూశాకా తెలియకుండా ఉన్న సందేహాలకు కూడా సమాధానాలు దొరికినట్టు అనిపించింది. వీళ్ళిద్దరి పెళ్ళికి మా ఇద్దరికీ ఎలాంటి అభ్యంతరం లేదు” అన్నాడు కృష్ణమూర్తి.
సంతోషంతో మొహాలు వెలిగిపోతుంటే స్వప్న, చంద్రం ఒకరినొకరు చూసుకున్నారు.
“అయితే చిన్న సందేహం. మీలో ఒకరికి ఉద్యోగం వచ్చింది. ఇంకొకరికి రాలేదు. ఎవరికి వచ్చింది అన్న విషయం ఎందుకు చెప్పడం లేదు?” అన్నాడు కృష్ణమూర్తి.
“మాక్కూడా ఎవరికి ఉద్యోగం వచ్చిందన్న విషయం చెప్పలేదు” అన్నాడు శ్రీరాం నవ్వుతూ.
“ఏం లేదు అంకుల్. ఆ సంగతి తెలిస్తే ఉద్యోగం ఉన్న వ్యక్తి పేరెంట్స్ లేని వారి పట్ల మాట్లాడే విధానం మారితే, తెలియకుండా దర్పం అధికారం చూపిస్తే పిల్లలుగా మేం అది చూడలేం. ఒక జంట బతకడానికి ఒకరి సంపాదన చాలు. అది ఎవరిదైతే ఏంటని మా ఇద్దరి అభిప్రాయం” అన్నాడు చంద్రం.
“మా అభిప్రాయం కూడా. ఇకపోతే పెళ్ళి ఏ పద్ధతిలో చేద్దామంటారు?” గౌతమి నవ్వుతూ అడిగింది.
కృష్ణమూర్తి దంపతులు అర్థం కానట్టు చూడటంతో, “మేమేమో రిజిస్టర్ ఆఫీస్‌లో నిరాడంబరంగా వివాహం చేసుకున్నాం. మీరేమో అప్పటికి మీ తాహతుకు మించి అంగరంగవైభవంగా కళ్యాణం చేసుకున్నారు. మరి వీళ్ళకు ఎలా చేద్దాం అంటారు?” అని వివరించాడు శ్రీరాం.
స్వప్న, ఆమె తల్లి దండ్రులు, చంద్రం, చంద్రం అమ్మానాన్న, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు ఆలోచనల్లో మునిగిపోయారు. ఇంతలో శ్రీరామే గొంతు సవరించుకొని, “మధ్యే మార్గంగా రెండు పద్ధతులు కలిపి చేద్దాం. వీలైనంత తక్కువ మందిని అంటే చాలా దగ్గరి బంధువులు స్నేహితులను పిలిచి, వారి సమక్షంలో అంగరంగ వైభవంగా జరిపిస్తే ఎలా ఉంటుందంటారు” అన్నాడు.
అందరూ ముక్తకఠంతో, “చాలా బాగుంటుంది” అన్నారు.
“అన్నట్టు కట్న కానుకలు మాకు అక్కర్లేదు. పైగా పెళ్ళికయ్యే ఖర్చు కూడా చెరి సగం పెట్టుకుందాం” అని గౌతమి అనడంతో భారతి ఆశ్చర్యపోయింది.
“అమ్మాయి పెళ్ళికి మా ఇంటిని గిఫ్ట్‌గా ఇద్దాం అనుకున్నాం. మీరు వద్దన్నారు కాబట్టి మాకు అద్దె ఇంట్లో ఉండే అవస్థ తప్పింది. పెళ్ళి ఖర్చు కూడా సగం తగ్గించారు. చాలా చాలా సంతోషంగా ఉంది” అంది భారతి.
“ఆదర్శ భావాలు ఊరికే చెప్పకుండా చేతల్లో చూపిస్తున్న మీ దంపతులను చూస్తుంటే మా అమ్మాయి ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుందని నమ్మకం కలిగింది. అయితే మాకున్నది మీకు లాగే ఒకే సంతానం కాబట్టి మా తదనంతరం ఆస్తి అంతా వాళ్ళదే” అన్నాడు కృష్ణమూర్తి.
ఇంతలో స్వప్నకు ఫోన్ వచ్చింది. నంబర్ చూడగానే చంద్రాన్ని బయటకు రమ్మని సైగ చేసి, ఇద్దరూ పక్కకు వెళ్ళి మాట్లాడి లోపలికి వచ్చాక చంద్రం, “ఒక శుభవార్త. మాలో ఒకరికి జాబ్ వచ్చి ఇంకొకరి రిజల్ట్ హోల్డ్‌లో పెట్టిన విషయం తెలుసు కదా. ఆ ఇంకొకరికి కూడా ఉద్యోగం వచ్చిందని ఇందాకే ఫోన్‌లో తెలిసింది. ఇప్పుడు మా ఇద్దరికీ ఒకే కంపెనీలో ఒకే స్థాయి ఉద్యోగాలు” అన్నాడు.
దాంతో అందరూ సంతోషంగా చంద్రం, స్వప్నలకు అభినందనలు తెలిపి వారి నోళ్ళను తీపి చేశారు.
బొబ్బా సత్యనారాయణ గారు 2014లో ఇందూరు జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం నుండి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందారు. అప్పటి నుండి కూకట్పల్లి, హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ‘ప్రేమ నిలయం’ వీరు రాసిన తొలి కథ.
