Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమా.. నీ విలువెంత

[అశ్వని పెమ్మరాజు గారు రచించిన ‘ప్రేమా.. నీ విలువెంత’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“రేయ్ ప్రభు, స్వాతికి చిన్న దెబ్బ తగిలింది, నేను సునంద యాత్రకి వచ్చాం ఒక్క వారం. నీకు అభ్యంతరం లేకపోతే..” అని ఫోన్‌లో అవతల ప్రభు వాళ్ళ అన్న సత్యం.

“అయ్యో, అదేం మాట అన్నయ్యా. నేను చూసుకుంటాలే. మీరు క్షేమంగా యాత్ర ముగించి రండి” అన్నాడు ప్రభు.

~

“స్వాతీ! నేను మీ హాస్టల్ బయట వున్నా. నువ్వు కిందకి రాగలవా అమ్మా” అని స్వాతికి ఫోన్ చేసాడు ప్రభు.

“అయ్యో బాబాయ్ వస్తున్నా..” అని ఫోన్ పెట్టబోతుంటే.. “అమ్మాయ్ ఒక వారం నాతో ఉండేలా బట్టలు గట్రా తెచ్చుకుని రా.. నాకు కొంచెం పని ఉంది నీతో” అని చెప్పాడు ప్రభు.

“సరే బాబాయ్..” అని స్వాతి ఒక అరగంటలో ఒక బ్యాగ్‍తో వచ్చి కార్ ఎక్కింది. నుదురు మీద ఒక చిన్న ప్లాస్టర్ ఉంది. కనిపించకుండా హుడి వేసుకుంది.

“స్వాతీ, నాకు ఈ వారం నాకు కొంచెం డాక్యుమెంటేషన్ పని ఉంది రా, సతీష్ ఏమో వాళ్ళ అమ్మగారికి బాలేదు అని ఊరుకి వెళ్ళాడు. నువ్వు ఏమైనా సాయం చెయ్యగలవా తల్లీ” అన్నాడు స్వాతి వైపు చూసి చూడనట్టు.

“హా బాబాయ్, తప్పకుండా. కాకపోతే రోజులో ఒక రెండు మూడు గంటలు చేయగలను. మిగతా టైం డ్యూటీ ఉంటుందిగా” అంది స్వాతి.

“అది చాలు. నా రీసెర్చ్‌లో వచ్చే పాయింట్స్ నేను రికార్డ్ చేసి ఉంచుతా. రోజులో నీకు కుదిరినప్పుడు అవి డాక్యుమెంట్ చేసి ఉంచు, ఫ్లో తప్పిపోకుండా ఉంటుంది, దిగు..” అన్నాడు కారు ఆపుతూ.

“అప్పుడే వచ్చేసామా” అంటూ బోర్డ్ చూసింది.. ‘బాంబే కుల్ఫీ!’ అని పేరు చూసి నవ్వుకుంది..

“రావే” అంటూ కార్ తలుపు తీసి చూస్తున్నాడు ప్రభు. “బాబాయ్ నీకు ఇంకా గుర్తుందా” అంటూ మెల్లిగా కారులో నుండి దిగింది స్వాతి.

“ఏమైంది స్వాతి మెట్టుతున్నావ్..” అని అడిగాడు ప్రభు.

“ఏమి లేదు బాబాయ్, మొన్న ప్రీతి స్కూటర్ మీద నుండి పడ్డా కాస్త కాలు నొప్పి చేసింది, మేజర్ ఏమి కాదు లే.”

“సరే మెల్లిగా రా” అని చెయ్యి అందించి లోపలికి తీసుకువెళ్లి కుల్ఫీ తీసుకున్నాడు.

“బాబాయ్ గుర్తుందా, నువ్వు నేను రాత్రి పూట కుల్ఫీ కోసం బయటకు వచ్చేవాళ్ళం. మర్నాడు అమ్మ చేత నాకు క్లాస్ పడేది, నువ్వేమో ఏమి తెలియనట్టే, స్వాతి మారం చేసింది వదినా అని చక్కగా తప్పుకునే వాడివి” అంటూ గుర్తు చేసింది ఇద్దరు నవ్వుకున్నారు.

కుల్ఫీ అయ్యి ఇంటికి వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయ్యింది. “డిన్నర్ ఏమి తింటావే, దోశ వేసుకుందాం లేక నీకు బాగా నచ్చే మ్యాగీనా” అన్నాడు ప్రభు నవ్వుతూ.

“బాబోయ్ హాస్టల్ దెబ్బకి మ్యాగీ నచ్చే లిస్ట్‌లోనుండి హేట్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది.. బాబాయ్ ఇప్పుడు దోశ వేస్తే చట్నీ చెయ్యాలి.. నేను ఉప్మా చేసేస్తా. ఆవకాయ ఉందా ఇంట్లో?” అంది స్వాతి.

“ఉంది గాని నువ్వు ఆ కాలుతో ఏమి తంటాలు పడతావు, నిలబడడం కష్టం కదా.. తరిగేసి ఇవ్వు నేనే చేసేస్తా ..” అంటూ ఉప్మాకి ఐటమ్స్ ఇచ్చాడు ప్రభు..

కాసేపట్లో ఇద్దరికి టిఫిన్ రెడీ అయ్యింది. రుచి చూస్తూ “బాబాయ్ తాత గుర్తొచ్చేశారు భలే చేశావ్, నీకు వంటలో ఇంత టాలెంట్ ఎలా బాబాయ్ 😊, నీ దగ్గర నేర్చుకోవాలి. అసలు అన్ని పనులు చక్కగా చేసేసుకుంటావ్” అంటూ ప్రభుని తెగ పొగిడేస్తోంది..

“చేసేందుకు ఎవ్వరూ లేకపోతే పనులు అవే వస్తాయి.. అవసరం నేర్పిస్తుంది అనేది బామ్మ గుర్తుందా.. నాన్న దగ్గర నేర్చుకున్నా.. వంట కూడా చాలా పద్ధతిగా చేసేవారు.. ఏ కరివేపాకు లేకపోయినా ఒప్పుకునేవారు కాదు.. మా అమ్మ విసుక్కునేది ఒక్క పూట కూడా సర్దుకోలేరు.. చంపేస్తున్నారు చాదస్తం అని” అంటూ గుర్తు చేసుకున్నాడు ప్రభు.

“హ అమ్మ ఎప్పుడు అంటుంది ప్రభుకి అన్ని మావయ్య గారి లక్షణాలు వచ్చాయి పట్టుదలతో సహా.. అంతెందుకు నాని కూడా అంతే” అంది నవ్వుతూ.

“అవును నాని ఎక్కడ స్వాతి? ఈ మధ్య అసలు మనిషి అయిపు అజ్జా లేడు, కొంపదీసి ఏ అమెరికానో వెళ్లిపోయాడా..” అని స్వాతి అన్న నాని గురించి అడిగాడు ప్రభు.

“లేదు బాబాయ్. యూనివర్సిటీ ఎక్స్చేంజి ప్రోగ్రాం అట దొరగారు హైద్రాబాద్ వెళ్ళాడు, నా డౌట్ వాడి గర్ల్ ప్రెండ్ కోసం అని..” అంది స్వాతి అనుమానంగా.

“వీడికి పిల్ల కూడా ఉందా.. అసలు నోరు విప్పి మాట్లాడడు కదే.. ఇవాళ్టి ఆడపిల్లలు అసలే గారాల కూచులు కదా” అన్నాడు నవ్వుతూ.

“హా, అది నిజమేలే. కానీ ఈ పిల్ల వీడి స్కూల్ నుండి తెలుసు. అదే బాబాయ్ వాసంతి టీచర్ గారి అమ్మాయి సహస్ర, వీడి తిక్క చిన్నప్పటి నుండి తెలుసుగా. ఇద్దరు సైలెంట్‌గా సెట్ అయిపోయారు.. వీడు ప్రొఫెసర్ అవ్వగానే పెళ్లి, అని మొన్న అమ్మ వాళ్ళు అనుకుంటున్నారు.. అయినా చిన్నపిల్లని నాకు చెప్తారా..”

“హా, నువ్వు చిన్న కూచివి మరి. వాడి కంటే ముందు అన్నయ్య నీకు పెళ్లి చేసేస్తాడు లే. మగపిల్లాడు, వాడి పెళ్లికి తొందరేమి?” అన్నాడు ప్రభు.

“బాబాయ్, ఇలా మాట్లాడితే నేను నిజాలు మాట్లాడాలి.. మళ్ళీ ‘నీ నోరు తిన్నగా ఉండదు’ అని తిట్లు తినాలి” అంది ఉక్రోషంతో స్వాతి.

“అవునా, సరే. నెమ్మదిగా పొద్దున్న మాట్లాడుకుందాం. ఇక్కడే ఉంటావుగా కొన్ని రోజులు.. ఇప్పుడు పడుకో. ఆ దెబ్బలకి మందు ఏమన్నా వేసుకున్నావా లేకపోతే నా దగ్గర ఉంది ఇస్తాను” అన్నాడు ప్రభు.

“ఉందిలే. మొన్న డాక్టర్ పెద్ద లిస్ట్ ఇచ్చింది. చచ్చిన్నట్టు మింగుతున్నా.. సరే పడుకో” అని గది లోకి వెళ్ళిపోయింది.

మర్నాడు పొద్దున్న..

తెల్లవారు జామున లేచి కాఫీ తాగుతూ ఏదో నోట్స్ రికార్డ్ చేస్తున్నాడు ప్రభు.

“గుడ్ మార్నింగ్ బాబాయ్ అప్పుడే లేచేసి పని లో పడిపోయావా.. నేను ఫ్రెష్ అయ్యి వస్తా. ఏదైనా టిఫిన్ చేస్తా” అంటూ గబగబా వెళ్లబోయి, “అమ్మా..” అని నొప్పితో కూర్చుండిపోయింది.

“అమ్మా స్వాతి ఏమైందే..” అని దగ్గరకి వచ్చి కాలు మీద దెబ్బ చూసి కళ్ళు చెమర్చాయి ప్రభుకి. స్వాతి చేతి మీద కూడా కముకు దెబ్బలు కనిపించాయి.

“పద డాక్టర్ దగ్గరకి వెళ్దాం. ఇది బహుశా ఫ్రాక్చర్ అనుకుంటున్నా..” అని సాయం పట్టి డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళాడు. పాదం దగ్గర హెయిర్ లైన్ ఫ్రాక్చర్. మూడు వారాల రెస్ట్ ఇవ్వాలి అని చెప్పి.. మోచేతి దగ్గర దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేశారు డాక్టర్.

ఇంటికి తీసుకు వచ్చి టిఫిన్, మాత్రలు ఇచ్చి కూర్చోబెట్టాడు. “బాబాయ్ నేను హాస్టల్‍కి వెళ్లిపోతా. నీకు మళ్ళీ ఎందుకు శ్రమ? అక్కడ ప్రీతి, సుమన వుంటారుగా నాకు సాయం..” అంది మెల్లిగా.

“స్వాతీ, నేను నిన్ను ఎత్తుకుని అన్నం పెట్టక్కర్లేదు. ఆ మాత్రం నీ పని నువ్వు చేసుకుంటున్నావు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, పైగా స్వాతి బాబాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేది ఎవరో చిన్న పాప ఇప్పుడేమో ఇబ్బంది అని పెద్ద మాటలు మాట్లాడుతోంది..” అన్నాడు నవ్వుతూ ప్రభు..

“బాబాయ్ నువ్వు ఎప్పుడు నాకు ఫ్రెండ్‌వే. అందులో ఎప్పుడు తేడా రాదు, మనం పార్టనర్స్ ఇన్ క్రైమ్ కదా☺️, సినిమాలకి వెళ్లిపోవడం, రాత్రి పూట సీక్రెట్ ఐస్‌క్రీమ్‌లు, అనిత ఆంటీని కలవడానికి వంకలు అన్నింట్లో మనము తోడుదొంగలం కదా” అంది నవ్వుతూ.

అనిత పేరు రాగానే కాసేపు ప్రభు మొహం గంభీరంగా అయిపోయింది.. అంతలోనే తేరుకుని “అవును నిన్ను బండి మీద నుండి పడేసింది ఎవరు ప్రీతి లేదా సుమనా?” అన్నాడు.

“ఇద్దరు కాదు, బాబాయ్. నేనే బండి నేర్చుకుంటూ పడిపోయా..” అని ప్రభు కేసి చూసింది. “ఒకసారి నా చేతి మీద గిల్లవే. నువ్వు బండి నేర్చుకోవడం, ఏం జరుగుతోంది? నువ్వు అసలే పిరికి గొడ్డువి కదే..” అంటూ ఆటపట్టించాడు ప్రభు.

“బాబాయ్ ఇలాగే రిషి నాకు పంతం పెంచేసాడు. అందుకే బండి నేర్చుకునే ప్రయత్నంలో ఇలా ఫీట్ చేశా..”

“మధ్యలో ఈ కొత్త కారెక్టర్ ఎవరు? ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఆ?” అని ఆటపట్టించాడు.

“బాబాయ్ నీకు చెప్పలేదు కదా. ఈ రిషి నా కొత్త ఫ్రెండ్. చాలా క్రేజీ ఫెలో. లాస్ట్ ఇయర్ ఫ్రెండ్షిప్ డే కార్నివాల్‍లో కలిసాడు. వాడి పిచ్చి నాకు భలే ఇష్టం.. నేను చిన్నప్పటి నుండి ఏ పనులు చెయ్యకూడదు అని పద్ధతిగా పెంచారో వాడికి అసలు ఆ ఊసే తెలియదు. వాడికి ఏది అనిపిస్తే అది చేస్తాడు, ఒక రూలు, పద్ధతి.. ఇదే తినాలి, ఇలాగే ఉండాలి అని ఏమి లేదు. అసలు దేనికి భయపడడం ఉండదు, బైక్ మీద అడ్వెంచర్ క్యాంప్స్‌కి వెళ్తాడు, ట్రెక్స్, ఫోటోగ్రఫీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ బాబాయ్”, 😊 అంటూ చాలా ఆనందంగా చెప్తోంది స్వాతి.

స్వాతిలో మునుపు ఎప్పుడు ఇంత ఉత్సాహం చూడలేదు. “స్వాతి ఇతని వ్యక్తిత్వం కొత్తగా వుంది. ఇంతకీ ఇతను ఎక్కడ ఉంటున్నాడు..”

“ప్రస్తుతం ఇక్కడే వున్నాడు బాబాయ్. ఇంకో కొన్ని నెలలు ఇక్కడే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అయిపోతే మళ్ళీ వేరే ఊరు, ఫ్రీలాన్స్ ఫోటోగ్రఫీ. అసలు నా ఫ్రెండ్స్ ఎవరు ఇలాంటి ఇంటరెస్టింగ్ ప్రొఫెషన్‍లో లేరు. ఎప్పుడు డాక్టర్, ఇంజినీర్, అకౌంట్స్ అంటూ బోరింగ్ పనులు. భలే ఉంది కదా బాబాయ్. ఎన్ని ఊర్లు, ఎన్ని కల్చర్స్, జీవితం మీద అవగాహన ఎంత ఉంటుందో. తను మాట్లాడుతూ ఉంటే వింటూ కూర్చోవాలి అనిపిస్తుంది.. నేను చూడు అమ్మమ్మ వాళ్ళ ఊరు, హైదరాబాద్, తిరుపతి తప్ప ఇంకో ఊరు వెళ్ళింది లేదు. ఈ ప్రాజెక్టు వచ్చే నెలకి పూర్తి, ఇహ హైదరాబాద్ వెళ్లిపోతా. ఇక్కడ గోల తప్పుతుంది. అసలు ప్రపంచం చూడలేదు బాబాయ్.” అంటూ తెగ చెప్పేస్తోంది స్వాతి.

“నిజమే జీవితం చాలా పెద్దది. మనం చూసిందే అని అనుకుంటూ ఉంటే బావిలో కప్ప లాగా ఉండకూడదు.. అవును నీ వర్క్ ఎలా వుంది అమ్మలు? ఇప్పటికే ప్రొబేషన్ అయిపోయింది అనుకుంటా.. ఆ ఇన్‌స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్‌కి పిలిచేస్తున్నారా మిమ్మల్ని.. నువ్వు నీ విషయాలు చెప్తూ కూరలు కోసి ఇవ్వు. నేను నీ ఫేవరెట్ బిర్యానీ చేసేస్తా” అంటూ ప్లేట్‌లో కూరలు ఇచ్చి తను వంటింట్లోకి వెళ్ళాడు.. అది ఓపెన్ కిచెన్ వల్ల అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ పని చేసుకోవచ్చు.

“హా, బాబాయ్ వచ్చేయమంటూ మొన్న పిలిచారు. నెక్స్ట్ మంత్ వెళ్ళాలి. నాన్న ఏమో ఒక్కదానివి ఎలా ఉంటావు అని గోల చేస్తున్నారు. నా ఫ్రెండ్స్‌తో హాస్టల్ లేదా అపార్ట్‌మెంట్‌లో ఉంటా అంటే ఇద్దరు ఒప్పోకోవట్లేదు.. ఇలాగే పంజరంలో ఉంచాలి అనుకుంటే ఎందుకు చదివించడం చెప్పు.. అవును బాబాయ్ నువ్వు కూడా నాలాగే ఫీల్ అయ్యావా, అందుకే అనిత గారు నీ లైఫ్‌లో లేరా ఇవాళ..” అని అడిగింది స్వాతి.

ఆ మాటకి ప్రభు మొహం ఎర్రగా మారింది. “స్వాతీ, అనిత విషయం వద్దురా.. ఎప్పుడో గడిచిపోయిన సంగతి మా అది. అప్పుడు తాత బామ్మ అందరి పద్ధతి వేరు.. ఇప్పటి లాగా ఓపెన్ మైండ్‌సెట్ లేదు మన ఇంట్లో.. అనితకి పట్టుదల ఎక్కువ. ఏదో అలా జరిగిపోయింది. అన్ని రిలేషన్‌షిప్స్‌లో హ్యాపీ ఎండింగ్ ఉండదుగా..” అన్నాడు జీరబోయిన గొంతుతో.

“సారీ బాబాయ్. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. కానీ నువ్వు అనిత గారు చాలా బావుండేది మీ జంట. నాకు ఆవిడ చాలా ఇష్టం. ఉన్నట్టుండి ఎందుకు నీకు దూరం అయ్యారో తెలియలేదు. అమ్మ వాళ్లని అడిగితే దెబ్బలాడి మాట దాటేశారు. నువ్వు కూడా వేరే వచ్చేసావు.. అందుకే అడిగాను..”

మాటల్లో భోజనం అయ్యింది. తన పనిలో భాగంగా ప్రభు ఏదో రిఫరెన్స్ టెక్స్ట్‌లు చూస్తున్నాడు. కళ్ళు పుస్తకాన్ని చూస్తున్న మనసు అనిత మీదకి పోతోంది..

ఇరవై ఏళ్ళ క్రితం..

“ప్రొఫెసర్ వేణు గారి ఆఫీస్ ఇదేనా అండీ?” అంటూ ఒక తీయటి కంఠం బెరుకుగా అడగడం విని, తాను రాస్తున్న విషయం ఆపి తల పైకి ఎత్తి చూస్తే పచ్చటి ఛాయతో సిందూరం రంగు డ్రెస్‌లో అప్పుడే విరిసిన కలువ లాగా అనిపించింది ప్రభుకి. అది అనితని తొలిసారి చూసిన అనుభవం.

ప్రభు ప్రొఫెసర్ వేణు దగ్గర అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తున్న రోజుల్లో యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తూ వేణు గారి ప్రాజెక్ట్ చెయ్యడానికి వచ్చింది అనిత.

అనిత చాలా బాగా చదివేది, జీవితంలో తనకి చాలా ఆశలు ఉన్నాయి. అవి ప్రభు ఆశలకి చాలా దగ్గరగా అనిపించాయి. దానితో ఆశలు అభిప్రాయాలు కలిసాయి.. స్నేహం ఇష్టంగా మారి ప్రేమగా మారే తరుణంలో ఇద్దరికీ స్పర్ధ వచ్చింది.

జీవితంలో ప్రతి బంధం డబ్బుతోనే ఉంటుంది అనేది అనిత వాదన. తాను చిన్నప్పటి నుండి చూసిన ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో దాని వల్ల ఇంట్లో నిత్యం జరిగే గోల ఇవ్వన్నీ చూసి ఈ అభిప్రాయం పూర్తిగా సిద్ధాంతం లాగా నమ్మేసింది. తనకి అమెరికాలో ఆఫర్ వచ్చింది. కొన్నాళ్ళు అక్కడ ఉండి సంపాదించుకుందాం అని బేరం పెట్టింది, అసలే ఇంట్లో అమ్మానాన్నకి అనిత దూకుడు ఎక్కలేదు. ఎలాగోలా నచ్చచెప్పి పెళ్లికి ఒప్పించాలి అని ప్రభు తంటాలు పడుతుంటే మధ్యలో ఈ అమెరికా ఊసు పట్టుకొచ్చింది అనిత.

“అనితా, అన్ని డబ్బుతోనే కాదు కొన్ని మనసుతో సంపాదించుకోవాలి. మన బంధం, మనకి దొరికే స్నేహాలు, మనకి కలిగే ఆనందం, ప్రశాంతత వీటిని డబ్బులో కొలవగలమా” అంటూ ఒప్పించాలని చూసాడు ప్రభు.

“డబ్బు లేని నాడు ఇవి ఏవి మనకి ఆసరాకి రావు ప్రభూ. స్నేహం, బంధం ఇవ్వన్నీ డబ్బు తోనే ముడిపడి ఉన్నాయి.. ఆఖరికి దేవుడు దగ్గర కూడా వేలు, లక్షలు పెట్టి టికెట్ కొంటే గుడిలో దేవుడి ముందు నుంచో పెడతారు. ధర్మదర్శనం అయితే ధర్మానికే వదిలేస్తారు. ఫస్ట్ క్లాస్‌లో ఉండే సుఖం జనరల్ కంపార్ట్మెంట్‌లో వస్తుందా? అంతెందుకు, మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోతే జనరల్ హాస్పిటల్‌కి వెళ్తామా లేక డబ్బు ఎక్కువైనా ఆరోగ్యం మీద భరోసా కోసం ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళి అప్పు చేసైనా వైద్యం చేయిస్తాం కదా.. ఇవి మాటలతో రావు, డబ్బు తోనే కొనాలి” అంది ఉక్రోషంగా.

“డబ్బు అక్కర్లేదు అనట్లేదు అనితా, కచ్చితంగా కావాలి. కానీ అదేదో ఇక్కడే సంపాదించుకుందాం అంటున్నా. ఒకసారి సముద్రాలు దాటి వెళ్తే, వెనక్కి తిరిగి చూస్తే బంధాల మధ్య అగాధం వచ్చి చేరుతుంది. ఒక్కసారి ఆలోచించు బంగారుతల్లీ” అన్నాడు లాలనగా.

వాళ్ళలో ఎవరు పంతం వదలలేదు, ఇద్దరు మౌనంగా దూరం అయ్యారు.

ఎక్కడ ఉందో ఏమి చేస్తోంది వివరాలు ఏమి తెలియనివ్వలేదు అనిత.

ఇలా మనసు గతం లోకి పరుగు పెడుతుంటే.. ఒక్కసారి తలుపు చప్పుడు అయ్యి చూసాడు. స్వాతి మెల్లిగా తలుపు దగ్గరకు వచ్చింది “బాబాయ్ నా పని అయిపోయింది ఇవాళ నువ్వు ఏమైనా బ్రీఫింగ్ ఇస్తే నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తా.” అంది.

“హా, సరే.. ఈ బ్రీఫింగ్ చూడు. నేను పాయింట్స్ మాత్రమే రాసాను. నువ్వు దీన్ని డిటైల్డ్‌గా రాయి విత్ డయాగ్రామ్స్.. డౌట్స్ ఉంటే అడుగు..”

ప్రభు యూనివర్సిటీలో సైకాలజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. స్వాతి కూడా బాబాయ్‌ని చూసి ఎం.యెస్.సి సైకాలజీ చేసి స్కూల్స్‌లో చైల్డ్ సైకాలజీ మీద ఒక స్కూల్‌తో పని చేస్తోంది.. ప్రభుకి అప్పుడప్పుడు రీసెర్చ్‌లో సాయం చేస్తూ ఉంటుంది..

“బాబాయ్ నోట్స్ రెడీ అయ్యింది. భోజనం చేద్దాం, ఆకలి బాబోయ్..” అంటూ గోల చేసింది స్వాతి.

“నువ్వు చైల్డ్ సైకాలజీ చదువుతూ అంతకంతకూ పిల్లవి అయ్యిపోయావు.. కానీ అందరూ నీలాగే చిన్న పిల్లలాగా వుంటారు, మాయ మర్మం లేకుండా అని నమ్ముతున్నావు. అదే నాకు నవ్వొస్తోంది.. సరే పద భోజనం చేస్తూ మాట్లాడదాం..”

ఇద్దరు భోజనం చేస్తుంటే “అవునా బాబాయ్ నేను చిన్న పిల్ల లాగా అందర్నీ నమ్ముతున్నా. మరి నువ్వు అదే సైకాలజీ చదివి అనిత గార్ని ఎందుకు కలుపుకోలేదు? అసలు ఏం జరిగింది బాబాయ్? ఆవిడ మీద నీ ప్రేమ ఎలా వదిలేసావు అంత తేలిగ్గా.. కట్టుబాట్లు పెట్టేందుకు మనదేమైనా పెదరాయుడు ఫ్యామిలీనా.. నువ్వు ఓ రెండు రోజులు నిరాహారదీక్ష, నిరసన లాంటివి చేసి ఉంటే పెద్దలు ఎందుకు దిగి రారు?” అంది స్వాతి..

“నువ్వు అన్నది నిజమే. అనిత కూడా ఇలాగే మాట్లాడింది. ‘ఓ నాలుగు ఏళ్ళు అమెరికా వెళ్లిపోదాం, సంపాదన బావుంటుంది, పెద్దలు కూడా దారికి వస్తారు’ అని.. కానీ నన్ను చదివించడానికి తాత నాయనమ్మ చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు కాస్త పాత పట్టింపులు గల మనుషులు. అంత తేలిగ్గా పంతం వదలరు.. అయినా అప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళేందుకి నా దగ్గర అంత స్తోమత లేదు. తన మీద ఆధారపడి ఎలా వెళ్తాం, అలా ఆడవారి సంపాదన, రికమండేషన్ మీద వెళ్లడం ఏంటి అని నా ఫ్రెండ్స్ ఏడిపించారు.. సమాజానికి ఎదురీదే ధైర్యం నాకు అప్పుడు తక్కువ..” అన్నాడు చిన్నబోయిన మొహంతో ప్రభు.

“సారీ బాబాయ్. నిన్ను బాధ పెట్టాలని కాదు.. అంటే నువ్వు అనిత గారిని కలిసి ఈ విషయం చెప్తే ఆవిడ ఏమన్నా గొడవ చేశారా?”

“గొడవ చేసే పిల్ల కాదు అనిత. చాలా ఆత్మాభిమానం గల అమ్మాయి, పొరపాటున కూడా దానికి భంగం వస్తే ఒప్పుకోదు.. నేను ఏ నిర్ణయం చెప్పలేక నువ్వు క్షేమంగా అమెరికా వెళ్లి నాకు ఫోన్ చెయ్యి అని చెప్పా, తనకి ఏమి అర్థమైందో మరి, అప్పటి నుండి ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు..” అన్నాడు విరక్తిగా నవ్వుతూ.

“బాబాయ్ అసలు నువ్వు ప్రయత్నం చేయలేదు.. అనిత పూర్తి పేరు ఏంటి? అంది స్వాతి.

“ఏమి ఇప్పుడు పేపర్‌లో వేస్తావా? ఇంకా నయం, ఫోటో కూడా అడగలేదు.. ఈపాటికి పెళ్లయి పిల్లలతో హాయిగా ఉండి ఉంటుంది.” అన్నాడు నవ్వుతూ.

“ఇంకా ఏ జమానాలో వున్నావు బాబాయ్? అసలు ఎలా వుందో తెలిస్తే కదా నీ కంక్లూజన్స్, ఇంతకీ పేరు చెప్పు అనిత గారిది.”

“నాకు గుర్తు ఉన్నంత వరకు అనిత రాణి కొచ్చెర్ల.. దేనికే జాతకం వేయిస్తావా?” అన్నాడు ఉడికిస్తూ..

“ఉండు బాబాయ్ ఆవిడ దొరకాలే గాని జాతకం ఏమి భాగ్యం పెళ్లికి ముహూర్తుమే పెట్టిస్తాం..” అంది నవ్వుతూ.

ఫోన్‌లో ఏదో చూస్తూ.. “బాబాయ్.. ఇలా రా” అంటూ కేక వేసేసరికి ఒక్కసారి కంగారుగా వచ్చాడు ప్రభు.

“ఇది చూడు బాబాయ్, నువ్వు చెప్పిన పేరుతో పది మంది ఉన్నారు. వీళ్ళలో మీ అనిత ఎవరో చెప్పు..” అని వాళ్ళ ఫొటోస్ చూపించింది స్వాతి.

అందులో ఉన్న అనిత మొహం కాస్త దగ్గరగా ఉన్న ఫోటో చూసి పోల్చాడు.. “తనే కాస్త వయసు పెరిగింది అంతే..” అన్నాడు నవ్వుతూ.

“అబ్బే లేదు బాబాయ్. మీ ఇద్దరికి వయసు వెనక్కి పోతోంది లే, ఇన్ని సంవత్సరాల తర్వాత చూసిన ఠక్కున పోల్చేశావు.. అన్నట్టు మీ మేడమ్ కౌన్సెలింగ్ లో బాగా ఆరితేరిన చెయ్యట బాబాయ్.. ఒకసారి నేను పోయి వస్తా ఉండు..” అంది నవ్వుతూ..

“ఏడిసావ్. ఇప్పుడు అలాంటి పనులు ఏమి చెయ్యకు. తనకి పెళ్లి అయ్యి పిల్లలు కూడా పుట్టేసి వుంటారు.. అలా వేరే వాళ్ళ సంసారంలో దూరకూడదు..” అన్నాడు గంభీరంగా.

“బాబోయ్ బాబాయ్, ఇప్పుడు ఆవిడని తన సంసారం వదిలేసి నీతో వచ్చేయమని చెప్పామా.. అసలు తను ఎలా వుందో ఏంటో అని చిన్న కుతూహలం.. ఆవిడని ఇబ్బంది పెట్టను.. నువ్వు అలా మొహం మాడ్చుకోకు..” అని స్వాతి ఆ సంగతి అక్కడికి వదిలేసింది.

మర్నాడు సాయంత్రం ప్రభుకి ఫోన్ వచ్చింది. “హలో ఎవరండి..” అడిగాడు.

అవతల వైపు నుండి “సార్ మేము వి ఆర్ టీవీ నుండి కాల్ చేస్తున్నాం. రేపు వాలెంటైన్స్ డే సందర్భంగా ‘యువత -ప్రేమ -ఆర్ధిక సంబంధాలు’ అనే అంశం మీద డిస్కషన్ వుంది. మీరు తప్పకుండ రావాలి అండి, మీకు వివరాలు పంపిస్తా” అని సమాధానం కూడా వినకుండా పెట్టేసాడు. ‘వీడు ఎవడో ఇంత కంగారుగా వున్నాడు, ఎదుటోడు చెప్పేది వినడా..’ అంటూ విసుక్కుంటూ అంటుంటే “ఏమైంది బాబాయ్ .. ఎవరు ఆ ఫోన్” అని అడిగింది స్వాతి.

“వీడెవడో టీవీ వాడు. వాలెంటైన్ డే సందర్భంగా ఏదో డిస్కషన్ అంట. రమ్మని పిలిచి నా సమాధానం కూడా వినకుండా పెట్టేసాడు.. ఈ గోల అంతా నాకెందుకు చెప్పు.. అనవసరంగా ట్రోల్స్. గోల అవసరమా నాకు?” అన్నాడు ప్రభు.

“అలా అనకు బాబాయ్. ఇప్పటి యువతకి నీ రీసెర్చ్ చాల అవసరం.. డబ్బుని ప్రేమని పోలుస్తున్నారు.. రెండు వేరే వేరే విషయాలు అని అర్థం కావాలంటే నీలాంటి వాళ్ళు మాట్లాడాలిగా బాబాయ్.. ఏదో పాఠం చెప్పినట్టు కాకుండా మనసులో నాటుకునేలాగా చెప్పడం నీకు వున్న టాలెంట్.. ప్లీజ్ బాబాయ్ వెళదాం.. నీకు నచ్చకపోతే వచ్చేద్దాం..” అని బలవంతంగా ఒప్పించింది.

మొత్తానికి ఇద్దరు మర్నాడు వెళ్లారు టీవీ స్టూడియోకి.. పానెలిస్ట్స్‌ని పిలిచే క్రమంలో ‘ప్రముఖ సైకాలజిస్టు ప్రభాకర్ గారితో పాటు ఎకనామిక్స్ అండ్ సైకాలజీలో రీసెర్చ్ చేస్తున్న ప్రముఖ కౌన్సిలర్ అనిత గారు.. ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ మధు గారు పాల్గొంటున్నారు..’ అని వినేసరికి ప్రభు మొహంలో ఒకేసారి ఆనందం కంగారు కట్టగట్టి వచ్చేసాయి. బయటకి వచ్చేదాం అనుకున్నా రాలేని పరిస్థితి. ఇంతలో స్టేజి మీద కూర్చుని మైక్ అన్ని చూసుకుంటుంటే కళ్ళ తోనే పలకరింపులు నడిచాయి ఇద్దరి మధ్య. పరిచయాల అనంతరం “అయితే అనిత గారు, మీరు మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే అంటారు” అని మొదలుపెట్టాడు ఆ ప్రెసెంటర్..

“కచ్చితంగా. డబ్బు లేకుండా ప్రేమ అంటే అది సినిమాల్లోనే సాధ్యం. అడిగిన కోరిక తీర్చడానికి డబ్బు కావాలి.. ప్రేయసికి అయితే తక్షణమే అడిగిన కోరిక తీర్చాలి. అదే పెళ్ళాం అయితే అలిగి సాధించి నస బెట్టి మొత్తానికి సాధించుకునే మార్గాలు అనేకం.. ఇది ఆడవారికే కాదు.. కట్నాలు, పండగకి కార్లు, మిద్దెలు తేకపోతే పెళ్ళాన్ని పుట్టింటికి పంపేయడాలు, కొండకచో కాల్చుకు తిన్న సందర్భాలు లేవా..” అని ఆవేశంగా అంటున్న అనిత వాక్ప్రవాహానికి అడ్డు పడ్డాడు ప్రభు.

“ప్రేయసి, పెళ్ళాం అలిగితే కోరిక తీర్చడం అనేది అదొక ముచ్చట.. వారి మధ్య బంధాన్ని పెంచే ఒక మార్గం.. అది వారి మధ్యన ఉన్న బంధానికి ఇచ్చే ప్రాముఖ్యత బట్టి ఉంటుంది.. ఇందులో ఆర్థికపరమైన విషయం వస్తే బంధం నీరుగారిపోతుంది. అమ్మ చేతి గోరుముద్ద, నాన్న ప్రేమగా తీసుకువచ్చే పీచుమిఠాయి, పెళ్ళానికి జడలో తురుమే మల్లె చెండు వీటికి విలువ కట్టే ఆర్థికవేత్తలు ఉన్నారా ఈ దేశంలో? అవ్వన్నీ కూడా తీయటి బంధాలు.”

“ఇవ్వన్నీ కథల్లో బావుంటాయి. నిజ జీవితములో కాదండి, ఈ రోజుల్లో చాల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నవి సరైన ఆర్థిక పరమైన అవగాహన లోపం వల్లనే, తలకు మించిన అప్పులు, తాహతుకు మించి పరువు కోసం ఖర్చులు, ఇలాంటివి చూసినప్పుడు మనషులు అనవసరమైన ప్రేమ బంధాలు అనే యుఫొరియాలో పడి బతికేస్తున్నారు. మీరు చెప్పే ఈ ప్రేమ అనేది ప్రేమించిన తొలినాళ్ళలో అద్భుతంగా ఉంటుంది, మొగుడికి ఒక రెండు నెలలు జీతం రాకపోతే పెళ్ళాం, లేదా తండ్రి ఆస్తి ఇవ్వకపోతే పిల్లలు విలువ ఉంటుందా, మనం 1940లలో లేము.” అంది అనిత ఆవేశంగా.

“అయితే అనిత గారు చెప్పిన దాన్ని పూర్తిగా తోసిపుచ్చలేము. మీరేమంటారు ప్రభు గారు?”

“డబ్బు అనేది జీవితం సాఫీగా గడవడానికి కచ్చితంగా కావాలి. కుటుంబాలు తాహతుకు మించి ఖర్చులు పరువు పేరుతో చెయ్యడం తప్పే, కానీ ఇది ఒక విధంగా మనకే తెలియకుండా ఒక వ్యవస్థ అనే చట్రంలో తిరిగేస్తున్నాం. ఆ అవగాహన కలిపించాలి అంతే గాని కేవలం ఈ అవగాహన లోపం వల్ల ప్రేమ అనేది హంబక్ అనడం తప్పు. చుట్టూ పది కోట్లు వున్నా ఒక్కోసారి ఒంటరిగా అయిపోయి డిప్రెషన్ లోకి పోయే వాళ్ళు వున్నారు, అదే పదిమంది నా అన్నవాళ్ళు కనిపిస్తే వచ్చే ధైర్యం, కష్టం వచ్చినప్పుడు అమ్మ ఒళ్ళో పడుకుని సేద తీరడంలో వుండే తృప్తి, ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది చెప్పండి.. మీరు ప్రపంచాన్ని జయించినా ఆ ఆనందాన్ని పంచుకునే ప్రేమించిన వ్యక్తి లేనప్పుడు అది లోటు గానే ఉంటుంది.” అని ముగించాడు ప్రభు ..

“మీరు చెప్పింది నిజం ప్రభు గారు ప్రేమ, బంధాలు లేకపోతే ఈ ప్రపంచం పూర్తిగా యాంత్రికంగా అయిపోతుంది. అప్పుడు సముద్రం మధ్యలో దాహం కోసం నీరు వెతికి నట్టే అవుతుంది. అందువల్ల యువత హుషారుగా విద్య మీద దృష్టి పెట్టాలి, బంధాలని సున్నితంగా నిలబెట్టుకోవడం నేర్చుకోవాలి” అంటూ కర్ర విరగకుండా పాము చావకుండా చర్చ ముగించాడు.

మైక్ ఇచ్చేసి లేవబోతున్న అనిత దగ్గరికి గబగబా వచ్చింది స్వాతి. “హలో మేడం, మీతో కాస్త మాట్లాడాలి సబ్జెక్టు పరంగా, మీకు అభ్యంతరం లేకపోతే ఒక కప్ కాఫీకి వెళ్ళొచ్చా?” అని అడిగింది.

“తప్పకుండా. ఒక అరగంటలో కింద కాఫీ షాప్‌లో కలుద్దాం” అని అంది అనిత. ఆ న్యూస్ ఛానల్ వాళ్ళతో కాసేపు మాట్లాడి కిందకి వచ్చి అనిత స్వాతి కాఫీ షాప్‌లో కూర్చున్నారు. కాఫీ ఆర్డర్ చేసాక “అవును స్వాతీ, పిల్లలు అందరు ఇంజనీరింగ్, డాక్టర్లు అని పరిగెడుతుంటే నువ్వు సైకాలజీ లోకి వచ్చావేంటి, ఇక్కడ సంపాదన తక్కువ హడావిడి ఎక్కువ” అంది అనిత.

“అనితా మేడం, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంభందాలే అని నమ్మే మీరు ఎందుకు ఈ రంగం లోకి వచ్చారు, సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. మీరు చదువుకున్న జమానాలో అమ్మాయిలు మహా అయితే బి.ఏ.లేదా బి.కామ్ చేసేవారు. అలాంటి సమయంలో మీరు సైకాలజీలో పిహెచ్.డి చేసి ఇప్పుడు ఇంత మంచి స్థాయిలో వున్నారు. మీరు నన్ను ఈ కెరీర్‌కి రావొద్దని చెప్తున్నారా? నేను అయోమయంలో పడిపోతున్నా. కానీ మీరు నాకు ఇన్‌స్పిరేషన్. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ దగ్గర గైడెన్స్ తీసుకోవచ్చా, మీ ఫ్రీ టైం లోనే. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను.”

“తప్పకుండా. నా నెంబర్ తీసుకో, ఎప్పుడు కావాలన్నా తప్పకుండా సాయం చేస్తా” ఇంతలో ఫోన్ మోగింది. “మేడం కార్ రిపేర్, బయట పెద్ద వాన. క్యాబ్‌లు కూడా దొరకట్లేదు”, “ ఇప్పుడు చెప్తే ఎలా రాజు? బయట చీకటి. వాన. ఎప్పుడు ఇల్లు చేరతాం?” అని చిరాకు పడుతోంది అనిత.

“మేడం మీకు అభ్యంతరం లేకపోతే మేము మిమ్మల్ని ఇంటికి దిగపెడతాము” అంది స్వాతి.

“స్వాతి నీకు కార్ ఉందా? నువ్వు ఎటు వైపు వెళ్తున్నావు? అసలే ఈ వానలో నువ్వు మళ్ళీ రీ రూట్ అంటే ఇబ్బంది కదా” అంది అనిత.

“మీరు అసలు కంగారు పడకండి మిమ్మల్ని క్షేమంగా చేర్చే పూచి నాది” అంటూ అనితని బలవంతంగా తనతో తీసుకుపోయి చప్పుడు లేకుండా కార్ ఎక్కించేసింది.

“ఇంతసేపు ఏంటి తల్లీ, బయట వాన చూడు” అంటూ ఒక్కసారిగా కార్ ఎక్కిన అనితని చూసి ఆగిపోయాడు ప్రభు.

“అది బాబాయ్, అనిత గారితో మాట్లాడుతూ లేట్ అయ్యింది. ఆవిడ కార్ బ్రేక్ డౌన్ అయితే నేనే పర్లేదు అని నచ్చచెప్పి తీసుకువచ్చా..”

“ఏమి పర్లేదు ఎక్కండి, తర్వాత మాట్లాడుకుందాం, వానకి తడిస్తే అసలే పడదు” అంటూ డోర్ తీసాడు. అనితని ముందు కూర్చోమని ఆఫర్ చేసి స్వాతి వెనకాల వైపు కూర్చుంది..

అనిత ప్రభు వైపు చూసి నవ్వుతూ “థాంక్స్” అంది ఫార్మల్‌గా. “నువ్వు అలాగే వున్నావు అనితా, ఏదో పరాయి వాళ్ళకి మల్లె థాంక్స్‌లు అవి” అని నవ్వుతూ అంటూ కార్ పోనిచ్చాడు. కొంత దూరం వెళ్ళాక ఒక దగ్గర ఆపి “ఇద్దరు దిగండి” అన్నాడు.

“ఇప్పుడు ఎక్కడికి?” అంది స్వాతి.

“సాయంత్రం నుండి ఏమీ తినలేదు. ఇంటికి వెళ్లి ఏదో ఒకటి వండుకోవాలి. ఎదర బోలెడు ట్రాఫిక్ ఉంది..” అంటూ లోనికి వెళ్తూనే మసాలా టీ, బన్ మస్కా ఆర్డర్ ఇచ్చాడు ముగ్గురికి.

“ప్రభూ, నీకు ఇంకా గుర్తుందా” అంది అనిత చిన్న పిల్లలాగా ఆనందపడిపోతూ..

“ఎప్పుడైనా మరిస్తేగా అనీ” అని గొణిగాడు. విని విననట్టే టీ తీసుకుంటూ ప్రభు కేసి తదేకంగా చూస్తోంది అనిత. ప్రభు కూడా అని మీద నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు..

స్వాతి ఫోన్ తీసుకుని పక్కన టేబుల్ దగ్గరకి జరగడం కూడా వాళ్ళ దృష్టి లోకి రాలేదు. “మన ప్లాన్ వర్కింగ్” అని మెసేజ్ పెట్టింది.. స్వాతి కళ్ళలో ఒక మెరుపు కనిపించింది..

“ప్రభు ఎలా వున్నావు, పెళ్లి..” అని ఆగింది అనిత..

“అనీ.. నేను ఎలా అన్ని వదిలేసి పెళ్లి చేసుకుంటా అని అనుకున్నావు.. సరే నీ సంగతి చెప్పు.. నాకు ఇప్పటికి ఆ అనితనే కనిపిస్తోంది, కాబట్టి నా ఊహ నిజం అయితే..” అని ఆగాడు ప్రభు.

“నీ ఊహ ఎప్పుడూ నిజమే ప్రభు. నేనే నేల విడిచి సాము చేశా.. ఈ తాపత్రయంలో ఏమి పోగొట్టుకున్నానో నాకు అర్థమయ్యేసరికి చాల సమయం గడిచిపోయింది” అంది కాస్త మెల్లిగా.

“సారీ అనిత. నిన్ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు, నిన్ను చూసిన ఆవేశంలో అడిగేసా.. అయిందేదో అయ్యింది, వర్షం తగ్గింది పద వెళ్తూ మాట్లాడుకోవచ్చు, ఎక్కడ ఉండేది?” అని అడిగాడు.

“నేను ఉండేది ముంబైలో మొన్నటి వరకు. ఈ మధ్యనే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. మాదాపూర్‌లో ఉంటున్నా” అంది. “ఓహ్ అయితే పర్లేదు.. కానీ ఈ వర్షంలో అంత దూరం, ఈ ట్రాఫిక్‌కి కాస్త టైం ఎక్కువే పడుతుంది, నీకు అభ్యంతరం లేకుంటే ఈ పూట నా ఫ్లాట్‌లో ఉండు.. స్వాతి కూడా ఉందిగా నీకు భయం లేదు” అన్నాడు నవ్వుతూ.

“నీ దగ్గర నాకు భయం ఏంటి ప్రభు.. నువ్వు మరీ చెప్తావ్. స్వాతిని ఎప్పుడో చిన్నప్పుడు చూసా. ఇట్టే పెరిగిపోతారు ఆడపిల్లలు అనిపిస్తుంది.. మళ్ళీ మన దారి లోకే వస్తోంది” అని మాట్లాడుతూ ఇద్దరు కార్ దగ్గరకు నడిచారు.

ప్రభు ఇంటికి చేరేసరికి వర్షం వల్ల చాలా రాత్రి అయినట్టు అనిపించింది. దారి పొడవునా ముగ్గురు సినిమాలు, పుస్తకాలు, హైదరాబాద్ ఎలా మారిపోయింది అలా మాట్లాడుకుంటూనే వున్నారు.

“ప్రభూ, ఈ మధ్య కాలంలో నేను ఎవరి ఇంట్లో ఉన్నదే లేదు. అందులోనూ నీలాంటి బ్రహ్మచారి ఇల్లు అంటే ఏమో అనుకున్నా కానీ భలే అలంకరించావు.. ఈ ఇల్లు చూసి నీకు ఇల్లాలు లేదు అంటే నమ్మడం కాస్త కష్టమే..”అంది నవ్వుతూ.

“నువ్వు మెచ్చుకునే అంతగా ఏమి లేదు లే” అని, “ఇలా కూర్చుని ఫ్రెష్ అవ్వు. ఇంతలో వంట చేసేస్తా. నీ కోసం కాస్త కారం వేసే చేస్తా లే” అన్నాడు ప్రభు

వాళ్ళకి వీలు కుదిరిన మేర ఏకాంతం ఇస్తోంది స్వాతి. అబ్బె తిండి, కూర, పులుసు, పుస్తకాలు, వేదాంతం అన్నట్టు మాట్లాడుతూ వుంటున్నారు. స్వాతికి చిర్రెత్తుకొచ్చింది ‘వీళ్ళు అసలు ఒకప్పుడు ప్రేమికులేనా? ఏదో అరవైలు దాటినట్టు ఉంది యవ్వారం’ అనుకుని, “రిషీ ఏమి చెయ్యాలో చెప్పరా” అని మెసేజ్ చేసింది.

“టైం టు రీ క్రీయేట్ అండ్ రిఫ్రెష్ దెయిర్ లవ్లీ మూమెంట్స్ 😊” అన్నాడు నవ్వుతూ.

“హ్మ్.. వుండు ఏదో మాయ చెయ్యాలి” అని రిప్లై పెట్టి కిందకి వెళ్లి “మేడం మీరు బాగా అలిసిపోయారు పైన నా గదిలో ఫ్రెష్ అవ్వండి,ఇంతలో డిన్నర్ రెడీ చేసేస్తాం” అంటూ పైకి తీసుకుపోయింది.

అనిత ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తన డ్రెస్సెస్‌లో నుండి గులాబీ రంగు చీర తీసి అక్కడ పెట్టింది. “మేడం డ్రెస్సెస్ అయితే మళ్లీ లూస్ టైట్ అని ఇబ్బంది ఉంటుంది. సో ఈ సారీ కట్టుకోండి” అంది నవ్వుతూ.

“అబ్బే వద్దు మా. ఐయామ్ ఫైన్” అంది అనిత మొహమాటంగా.

“ఏమి పర్లేదండీ. ఏమి ఇబ్బంది పడకండి ఇది మీ ఇల్లేగా” అని నాలుక కరుచుకుని గబగబా ఆ గదిలో నుండి కిందకి వెళ్లి ప్రభుకి సాయం చెయ్యడానికి.

మేడ మీద నుండి వస్తున్న స్వాతిని చూస్తూ “అమ్మలు, అనిత ఏది రెడీ అవుతోందా డిన్నర్ రెడీ. చూడు నా స్పెషల్స్ పీస్ పులావ్, ధం ఆలు, కర్డ్ రైస్, కస్టర్డ్” అన్నాడు ప్రభు..

“బాబాయ్ నువ్వేమైనా మాస్టర్ చెఫ్ ఫైనల్స్‌కి ట్రయల్స్‌లో వున్నావా? అరగంటలో ఇన్ని స్పెషల్స్ ఆఁ.. అంతేలే మేడం మాయ” అంది నవ్వుతూ.

“అల్లరి పిల్లా, దెబ్బలు పడతాయి హన్నా” అంటూ చెవి మెలి వేసాడు ప్రభు.

“ఏంటి బాబాయ్ కూతుళ్ళ పోట్లాట?” అంటూ నవ్వుతూ కిందకి దిగింది అనిత. “అయ్యో అదేం లేదు” అని, “ఏదో కాసేపు సరదాగా అలా నన్ను కవ్విస్తూ ఉంటుంది ఈ పిల్ల, రా భోజనం చేద్దాం” అంటూ పిలిచాడు ప్రభు. టేబుల్ మీద అందంగా అమర్చిన భోజనం చక్కని టేబుల్ క్లాత్, కట్లెరి, పొందిగ్గా వున్న ఆ వంట గదిలో సామాను చూసి “ప్రభూ, నువ్వు ఏమి మారలేదు. అదే పద్దతి, రూల్స్, అప్పట్లో విసుగ్గా అనిపించేది కానీ ఇప్పుడు అవి జీవితానికి ఎంత ముఖ్యమో బాగా అర్థం అవుతున్నాయి” అని టేబుల్ దగ్గర కూర్చుంది. ఇంతలో స్వాతి ఫోన్ మోగింది. “హా, సరే వుండు. సిస్టం దగ్గరికి వెళ్లి కాల్ చేస్తా” అంటూ హడావిడిగా మాట్లాడి “బాబాయ్ పేపర్ సబ్మిషన్‌కి నేను ఇవాళ కొన్ని చేంజెస్ చెయ్యాలి, విజ్జి కాల్ చేసాడు. నేను ప్లేట్‌లో పెట్టుకుని మేడ మీదకి వెళ్తా. మీరు తినేయండి” అని మారు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్లేట్‌లో పెట్టుకుని మేడ మీదకి వెళ్ళిపోయింది..

“ఈ పిల్లకి ఈ హడావిడి ఎప్పుడు తగ్గుతుందో, మొన్న ఒకసారి ఇలాగే కంగారుపడి బండి నేర్చుకుంటూ కింద పడి కాళ్ళు చేతులు డొక్కుని పోయాయి, ఎంత అల్లరో” అంటూ చెప్తూ ప్రభు అనితకి భోజనం వడ్డిస్తున్నాడు. “ప్రభూ, నీకు పిల్లలు అంటే చాలా ఇష్టం కదా, కనీసం వాళ్ళ కోసం అయినా పెళ్లి చేసుకోవలసింది, నువ్వు ఇలా మిగిలిపోయినందుకు నాకు చాలా గిల్టీగా వుంది” అంది అనిత, కళ్ళు చెమర్చగా.

“అబ్బా అనితా అలా అనకు. ఇందులో నీ తప్పు ఏముంది? ముందు తిను, అసలు ఆ ఈ గులాబీ రంగు చీరలో నువ్వు ఇప్పుడే విరిసిన గులాబీ లాగ వున్నావు, ఇన్నేళ్లు గడిచిన ఇంకా అంతే ముగ్దమనోహరంగా వున్నావు తెలుసా, నేను నీకు తప్పవేరే ఎవరికీ ఆ స్థానం ఇవ్వలేను. బహుశా నా మనసుకి సమాధానం చెప్పుకోలేకపోతున్నా. అది నా తప్పు కదా. ఒకవేళ నీకు ఈ పాటికే పెళ్లి అయితే అది ఎంత అపరాధం?” అన్నాడు తల దించుకుంటూ బాధతో. ఇంక తనని తాను ఆపుకోలేకపోయింది అనిత. వెళ్లి ప్రభుని కౌగలించుకుంది.

“ప్రభూ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా. అందుకే వేరే ఎవ్వరిని ఒప్పుకోలేకపోయా.. నా మూర్ఖపు వాదనతో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని మూర్ఖత్వానికి పోయా, ప్రతి వ్యవహారంలోను పట్టు విడుపు ఉండాలి. ప్రతి రూల్‌కి ఎక్సెప్షన్ ఉంటుంది అని తెలుసుకోలేకపోయా. దాని ఫలితం పుష్కరం పాటు నీ ప్రేమకి దూరం అయ్యాను, నన్ను క్షమించు” అంటూ ఏడ్చేసింది అనిత.

“హే టైం టు సెలెబ్రేట్ “ అంటూ కిందకి వచ్చారు రిషి, స్వాతి.

“అమ్మ దొంగల్లారా.. ఇంత సేపు నక్కి మా మాటలు వింటున్నారా?” అంటూ రిషి చెవి మెలిపెట్టాడు ప్రభు.

“అది మరి.. అంకుల్ ఇదంతా స్వాతి ఆలోచన” అంటూ దొంగ చూపులు చూస్తున్నాడు రిషి.

“బాబాయ్ మీ ఇద్దరు ఒకరిని ఒకరు మర్చిపోలేదని నాకు గత రెండు వారాలలో అర్థం అయ్యింది. నిన్న కలిసి ఇవాళ ప్రొపోస్ చేసి రేపు విడిపోతున్న జనరేషన్‌లో మీరు ఇన్నేళ్లు దూరంగా వున్నా ఇంకా ఒకరి మీద ఒకరికి ప్రేమ తగ్గలేదు. అలాంటి ప్రేమని కాపాడాలిగా బాబాయ్, పైగా మీ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే తాతయ్య బామ్మ ఎప్పుడు మిమ్మల్ని జంటగా చూడాలి అని ఆశ పడేవారు. తాత నాన్నతో ఈ మాట చాలాసార్లు చెప్పారు కూడా, కానీ నువ్వేమో పట్టు వదలని విక్రమార్కుడికి మల్లె బిగుసుకు కూర్చున్నావు, ఇక నాకు తప్పలేదు నాటకం వెయ్యక” అంది నవ్వుతూ.

“అమ్మో మా స్వాతి ఎంత పెద్దది అయిపోయింది..” అన్నాడు ప్రభు.

“ఉండు బాబాయ్ అదే పెద్దరికంతో మన ఇంటి పెద్దకి మీ విషయం చెవిన వేసేస్తా” అంటూ తన తండ్రికి ఫోన్ చేసి శుభవార్త చెప్పింది స్వాతి.

Exit mobile version