[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘ప్రేమానుబంధాల చిరునామా రాఖీ పూర్ణిమ!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మానవ జీవన యానంలో
ఆర్థిక ఔన్నత్యమే..
అనుబంధాలను సుసంపన్నం చేస్తుందా!?
దశాబ్దాలెన్ని గడిచినా
ఈ ప్రశ్నక జవాబు లభించదాయె!
నా ఎద లోయలలో
మమతల మాధుర్యాన్ని నింపి..
నేనే ప్రపంచంగా బ్రతికినవాళ్ళు
నా గుండెలపై తన్ని వెళ్ళిపోయిన దుస్థితిలో
నా మనసు గదిలో
అలజడులు చెలరేగి..
మానసిక వేదనలన్నీ
ఉప్పెనలుగా మారి
హృదయ సంద్రంలో
కల్లోలం చెలరేగిన వేళ..
మలయమారుతంలా అరుదెంచి
నా భగ్న జీవితంలో
నవ వసంత సౌందర్యాన్ని ఆవిష్కరించావు!
ప్రేమకు ప్రతిరూపమై
అనుబంధానికి ఆత్మవై
అనురాగబంధానికి
చిరునామాగా పరిణామం చెంది..
నా హృదయం లోగిలిలో
అమ్మవై కొలువు దీరావు..
మరి.. దశాబ్ధాలుగా
కంటిపై కునుకు లేకుండా
నీ రాక కోసం ఎదురు చూపులే!
నీ ప్రేమామృతంలో ముంచి
నా ముంజేతికి కట్టే..
అనుబంధాల ప్రతీక
‘రాఖీ’ బంధనం కోసం
పున్నమి రేడు చందమామ సాక్షిగా
ఎదురు తెన్నులతో..
కన్నులు అలసిపోతున్నాయి!
బంగారుతల్లీ..
నాపై.. కోపమా..
అలకా..? లేక..
సంపదతో తులతూగిన
ఆనాటి మహోన్నత స్థితి..
ఈనాడు నాకు లేదని చిన్నచూపా!?
స్నేహబంధాలకు
అనురాగ బంధాలకు
ఈ ‘లక్ష్మణరేఖ’ అడ్డగా వుంటుందా!?
ఈ ప్రశ్నకు సమాధానం తెలియక
నేటి శ్రావణ పూర్ణిమ రేయి
చందమామ సైతం..
మసక మసక వెలుతురు విరజిమ్ముతూ
మూగ వేదనను అనుభూతిస్తున్నాడు!
ఇంకా.. ఎన్నిదశాబ్దాలు
నాకీ అంతులేని నిరీక్షణ!?
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.
