[పెండ్యాల గాయత్రి గారు రచించిన ‘ప్రేమాయణంలో ఓ సీత’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
ఏయ్.. అమ్మూ..! ఎలా ఉన్నావే?
కవర్ చించగానే, కాగితంపై కుదురుగా కూర్చున్న అక్షర పక్షులను చూడడంతోనే.. నేనెవరన్నదీ నీకర్థమై పోయుంటుందిలే. అయినా, నిన్ను అమ్మూ! అని పిలిచే దమ్ము నాకు కాక, వేరెవరికుందని? నీకెంతో ప్రియమైన వాళ్ళు మాత్రమే అలా పిలవాలనే కండిషన్‌ను పక్కన పెట్టిన రామూగాడు.. నైన్త్ క్లాస్‌లోనే టెన్త్ చదివే మీ అన్నయ్య చేతిలో చావు దెబ్బలు తిన్న సంగతి నాకెప్పుడు గుర్తొచ్చినా చచ్చేంత నవ్వొస్తుంది. తెలుసా?
కానీ నాకు, మీ అన్నయ్యకు మాత్రమే తెలిసిన నిజమొకటి చెప్పనా అమ్మూ! ఆ చింపిరి జుట్టు రామూగాడికి నువ్వంటే చచ్చేంత ఇష్టం. నీకు డైరెక్ట్‌గా చెప్పే ధైర్యం ఏడవకా.. లవ్ లెటర్ రాసుకుని, బ్యాగులో దాచుకుంటే.. అది బాజీగాడు చూసి, మీ అన్నయ్యకు ఇచ్చాడట.
ఆ తరువాత జరిగిన వీరంగంలో చావుతప్పి కన్ను లొట్టబోగా.. వణికిపోతూ, నీకు గానీ, టీచర్లకు గానీ చెప్పొద్దని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాడట. మీ అన్నయ్య తరువాతి రోజు నాతో చెప్పాడులే. ఆ రామూగాడేనా.. మన క్లాస్ అబ్బాయిల్లో చాలామందికి నువ్వంటే ఎంత పిచ్చో నీకు, నాకూ తెలియంది కాదనుకో! తెల్లటి అందాల రాక్షసివి కదా.. ఆ మాత్రం ఫాలోయింగ్ ఉండడం అతిశయమేం కాదులే.
అతి విషయాలకు, అనవసర వివాదాలకు మనిద్దరం ఆమడ దూరాన ఉంటామని.. మన టీచర్లు మనలనెంత మెచ్చుకునేవారో, మన గురించి అందరికీ ఎంత గొప్పగా చెప్పేవారో.. జీవితంలో మర్చిపోగలమా? మన సీనియరయిన కిట్టుగాడు.. నావంక వెకిలి చూపులు చూస్తుండగా చూసిన ఫిజిక్స్ లెక్చరర్, వాడి కర్రె ఒంటిపై ఎర్రటి చారలు తెప్పించిన సంగతి నీకు గుర్తుండేవుంటుంది.
అదేంటో.. అందరికీ గౌరవ గారెలు తగిలించి మాట్లాడే నేను, మన బాల్యపు సంగతులు తలచుకునేటప్పటికి, గాడుల గోడలు ఎక్కేస్తున్నా.
‘ఎప్పటివో పదిహేనేళ్ళ నాటి సంగతులు ఇప్పుడెందుకు రాస్తున్నట్లు?’ అనుకుంటున్నావు కదూ! మొన్న నువ్వు బస్టాండ్‌లో కనిపించినప్పటినుండి.. ఆ సంగతులన్నీ పదే పదే గుర్తుకు వస్తూ, నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వద్దన్నా బడి ఒడిలోకి లాక్కెళుతున్నాయి.
‘ఫోన్ చేయవచ్చు కదా..’ అనుకోకు. కొన్నేళ్ళ ఎడబాటు తరువాత.. అనూహ్యంగా బస్టాండులో కలుసుకుని, కొద్దిసేపైనా కళ్ళారా చూసుకోకుండానే, కరువుతీరా కబుర్లు చెప్పుకోకుండానే బస్సు రాక నెపంతో ఎడమైపోయాం. ఆ పదిహేనేళ్ళ దూర కరువు తీరాలంటే, నాటి స్మృతుల బరువు తగ్గాలంటే.. పొడిపొడి పలుకుల ఫోన్ కాల్ కన్నా, మనసుపెట్టి ప్రేమాక్షరాలు పొదిగిన ఉత్తరం రాయడమే కరెక్ట్ అనిపించింది.
అయినా.. నన్ను చూడగానే నీ కళ్ళలో కనబడిన ఆనందాన్ని, నిన్ను కలవగానే నాకు అందిన సంతోషాన్ని ఈ కొన్ని అక్షరాలలో లిఖించగలనా? ఈ చిన్ని మాటలలో వెల్లడించగలనా..? బహుశా ఇదంతా మన స్నేహానికున్న పవర్ కావచ్చు.
ఈ పవర్‌తో పాటు.. మన ఎడబాటు తరువాత, నేనెక్కిన ఇంకో టవర్ కూడా నా చేత ఈ లేఖను రాయిస్తోందిలేవే..! అర్థం కాలేదు కదూ! ఏమీ లేదు.. నేను డిగ్రీ చదివే రోజులలో.. ఓ లెక్చరర్ బలవంతంతో తెలుగు కథలు, కాకరకాయలు చదవడం మొదలెట్టా. ఆయన, సమసమాజ భావాలు మెండుగా ఉన్నవాడులే..! చదివిన ప్రతీ కథపై అభిప్రాయాలు రాయమనేవాడు. నాటి బలవంతపు ప్రయత్నం.. నేడు బలమైన అక్షరాలను వెంటాడి, వేటాడేలా చేస్తోంది.
మళ్ళీ అర్థం కాలేదు కదూ! నాకు తెలియకుండానే నేను, విశ్వమానవతలోకి విజయవంతంగా దూరిపోయా. ఆదర్శ భావాలకు బానిసనైపోయా. ఈ బానిస అనేమాట చూచీ.. అపార్థం చేసుకోకు.
సర్వ బానిసత్వ విముక్తికై మా వారసత్వ సంప్రదాయాలను, మా పూజాపునస్కారాలను సైతం వదిలివేసా. పీడిత జనుల స్వేచ్ఛయే లక్ష్యంగా రచనలు చేస్తున్నా. ‘కల్లోలిత’ కలం పేరుతో సాహితీ లోకంలో మంచి కీర్తి కూడా సంపాదించా. ఆ పైత్యంలో భాగమే నువ్వు మొదటిసారిగా చదువుతున్న ఈ నా అక్షర పేటిక. అదేలేవే.. మన స్నేహ ఊసుల ఉత్తరం. పైత్యం, పరాచకం అంటూ ఏదో చనువుగా వాగానని.. వాటిని నా రచనలకు ఆపాదించకు.
మన గతపు ఊసుల పవర్‌ను ఈ మూడు రోజులుగా మనసునిండా నింపుకుని.. అక్షరాలలో ఒంపేద్దామని, నా బాల్యపు ఏకైక బంధానివైన నీతో నా ప్రేమాక్షరాలను పంచుకుందామని.. కలం పట్టుకుని కూర్చున్నా.
ఏంటే.. మొన్న అన్నావు!? ముప్పైల్లో పడ్డ నేను, పడుచు హీరోయిన్లా తలదన్నేలా ఉన్నానా? నా సమ ఈడున్న నీవు.. బామ్మలాగున్నావా? జోకులేస్తున్నావా జోకులు?! నలుగురు పిల్లల తల్లివి, నాలుగు క్షణాలైనా తీరికెరుగక, ఇంటెడు చాకిరీ చేస్తున్నదానివి.. ఆ మాత్రం, వళ్ళు నలగదా..? ఒంటి రంగు మాయదా? అంతమాత్రాన, నీ సౌందర్యనిధి సంతకెళుతుందటే పిచ్చిదానా?
అయినా, మన స్నేహమిచ్చిన చనువుతో నిన్ను కొన్నడుగుతున్నా. ఎంతో తెలివి, ధైర్యంకలదానివి కదా..! అంత చిన్న వయసులో పెళ్ళెందుకు చేసుకున్నావ్? అంతమంది పిల్లలనెందుకు కన్నావు? భరించలేనంత బండచాకిరి నెత్తినెందుకు వేసుకున్నావు? హైస్కూల్లో సి.పి.ఎల్.గా, ఎస్.పి.ఎల్.గా ఒక్కకేకతో మొత్తాన్ని కంట్రోల్ చేసేసేదానివి. నీ చొరవా, తెగువా ఏమైపోయాయే? ఇంటర్ రిజల్ట్ తరువాత.. నిన్ను కలుద్దామని మీయింటికి వచ్చా.. నీకు పెళ్ళై వేరే ఊరు వెళ్ళిపోయావని మీ అన్నయ్య చెప్పాడు. అంతే.. అప్పుడు మాయమై, మొన్న బస్టాండులో ప్రత్యక్షమయ్యావు. మీ ఆయన, పిల్లలు కూడా నీతో ఉంటే ఎంతో బాగుండేది. పరిచయం చేసుకునేదాన్ని.
చిన్నప్పుడు.. నీ పక్కన మురికి దారంలా ఉండే నేను, క్రమం తప్పని ఫేషియళ్ళతో నీ రంగును మించిపోయా కదే.. నువ్వలా కన్నుమాసిన రంగుకెందుకు వచ్చావని మీ ఆయన్ని నిలదీసేదాన్ని. ఇకనుంచైనా నిన్ను కష్టపెట్టవద్దని హెచ్చరించేదాన్ని. మొదట, మనలను మనం ప్రేమించుకోవాలి కదా అమ్మూ? మన స్వేచ్ఛను మనమే కాపాడుకోవాలి కదా!?
అప్పట్లో.. మన స్నేహ సఖ్యతను చూచి, అందరూ అసూయ పడేవాళ్ళు గుర్తుందా? మన మధ్య, ఎటువంటి విభేదాలు, రహస్యాలు వెతుకుదామన్నా దొరికేవి కావు ఎవ్వరికీ.
ఏ పని చేయాలన్నా పలువిధాలుగా ఆలోచించి, వెనకడుగు వేసే నేను, నీ స్పూర్తితో కొద్దికొద్దిగా ధైర్యాన్ని కూడగట్టుకున్నానంటే అతిశయోక్తి కాదు.
మా పాప పుట్టాక, ఇంకొకరుండాలి అన్నాడు మా ఆయన. నేను ససేమిరా అన్నా. నా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా.. తననే వేసక్టమీ కూడా చేయించుకునేలా బలవంతం చేసా. పాప పెంపకంలో సైతం తనను భాగస్వామిని చేసా. నా రచనా వ్యాసంగానికి, నా పాఠకులకు తగిన సమయం కేటాయించుకునేలా ప్లాన్ చేసుకున్నా. నన్ను నేను ప్రేమించుకోవడం మొదలెట్టా. ఆ సమానత సాధించుకున్న తరువాత, జీవితమెంత అద్భుతంగా ఉందనుకున్నావ్? నిత్యం ఒక నవోదయమంటే నమ్ము. ఆ నవీకరణ.. నన్ను నాకు స్పష్టంగా చూపిస్తోంది. నా లక్ష్యాలను ఎప్పటికప్పుడు నిర్దేశిస్తోంది. నా కర్తవ్యానికి కొత్త తలుపులు తెరుస్తోంది. మనుషుల మలినాన్ని కడిగే వజ్రాక్షరాలను అందిస్తోంది.
ఓ.. సారీ, సారీ అమ్మూ! మళ్ళీ కవన భాషలోకెళ్ళి, నిన్నిబ్బంది పెట్టేస్తున్నా. ఒక్కమాటలో చెప్పాలంటే.. రచనా యవనికపై అలుపెరుగని ప్రయాణం చేస్తున్నా.
కానీ.. ఓ చేదునిజం చెప్పనా అమ్మూ! అమృత కలశంలో చేరిన విషపు చుక్కల్లే మారి.. నా విజయపు ఝరిని మా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఆ విముఖతను మరో రూపంలో ప్రదర్శిస్తున్నాడు.
బొట్టు పెట్టుకునే దగ్గరనుండి.. బట్టలు వేసుకునేదాకా అదెందుకు? ఇదేమిటి? అంటూ సతాయిస్తుంటాడు. ఫోను మాట్లాడే దగ్గరనుండి.. పదిమందిలోకెళ్ళేదాకా ప్రతిదీ ఆరాలు తీస్తుంటాడు. వంటపని చెయ్యడం లేదు.. పాపను సరిగా పట్టించుకోవడం లేదంటూ సిల్లీ నేరాలు నాపై మోపుతూ, పదేపదే గొడవ పెట్టుకుంటుంటాడు.
నువ్వు చెప్పవే అమ్మూ! నాదైన వ్యక్తిత్వం నాకుండకూడదా? నేనేంటో నిరూపించుకునే అవకాశాలను అందిపుచ్చుకోకూడదా? అలాంటప్పుడు, నన్ను నన్నుగా ప్రేమించినట్టెలా అవుతుంది? భార్యాభర్తలకు అభేదం చూపినట్టెలా అవుతుంది?
ఈ భేద బానిసత్వం నుండి బయటపడటమెలా..? స్వయం స్వేచ్ఛ సాధించుకోవటమెలా? అనే సంఘర్షణలో సతమతమవుతున్న నాకు.. ప్రింటింగ్ ప్రెస్ నడిపే ఓ పాఠక దేవుడు తారసపడ్డాడు. విసిగి వేసారిన నా మదికి తన తేనె పలుకులతో సాంత్వన అనే వరమందించాడు. నాలోని భావాలకు తన గుండె అనే గూడు కట్టి గౌరవించాడు. నా మనో దర్పణంపై దర్పంగా నిలుచున్నాడు.
ఎంత అందంగా ఉంటాడనుకున్నావ్! ఎంత హుందాగా వ్యవహరిస్తాడనుకున్నావ్? అన్నింటినీ మించి, నా రచనలెంత గొప్పగా విశ్లేషిస్తాడో అసలు! అతని ముందు మా ఆయన దిగదుడుపేననుకో..!
ఏడేళ్ళుగా తోడుగా ఉండి.. నా భర్త గమనించలేని నా ప్రత్యేకతలన్నీ అతను ఏడు నెలలోనే గుర్తించాడు. నా రచనలన్నింటినీ స్వయంగా ముద్రిస్తున్నాడు. నా ప్రతిభను ప్రపంచానికి చేర్చే ప్రణాళిక వేసాడు. నన్ను నన్నుగా ప్రేమించగలుగుతున్నాడు. నాకోసం పరితపిస్తున్నాడు.
నేను, ఆలోచిస్తున్నా అమ్మూ! తీవ్రంగా ఆలోచిస్తున్నా. భర్త, బిడ్డ అనే బంధనాల మధ్య చిక్కుకుపోయి, నన్ను నేను కోల్పోవటం, ఎవరో ఏదో అనుకుంటారని, నా ప్రేమను చంపుకోవటం ఎంతవరకూ సమంజసం? త్వరలోనే.. అతి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటా. ఆ మాత్రం సాహసించకపోతే.. నా ప్రతిభకు, పరిణతికీ సార్ధకత ఏముంది?
అప్పుడెప్పుడో ఇంటర్ తరువాత విడవడిపోయిన మనం.. ఇప్పటికీ ఏక మనస్కులమనే భావన నన్ను వీడలేదు సరికదా.. నిన్ను అకస్మాత్తుగా కలుసుకోవడంతో రెట్టింపయింది. ఆ బలం అందించిన ఉత్సాహంతోనే.. నా హృదయపు దస్త్రాన్నంతా నీముందు పరిచేసాను. వేయికళ్ళతో వీక్షించి, వెంటనే.. నీ అక్షరాక్షితలను చిలకరిస్తావు కదూ అమ్మూ..!
లేఖ రూపంలో వచ్చే నీ రాక కోసం.. కోటికళ్ళతో ఎదురుచూస్తూ..
నీ ప్రియ స్నేహిత,
-లక్కీ.
@@@
‘ఎలా ఉన్నావు నేస్తం?’ అని నిన్నడగక్కరలేదనుకుంటా. కాగితాన్ని రెక్కలుగా మార్చుకుని, ఎగిరివచ్చిన నీ అక్షర పక్షులను చూడగానే అర్థమైపోయిందిలే.. నువ్వు చా.. లా ఉన్నతంగా ఉన్నావని.. ఉండబోతున్నావని.
అంత ఉన్నతస్థితిలో ఉన్న నీ జాబుకు ఏం జవాబు రాయాలో నెల రోజులనుండి తోచక, తోచింది రాసే తీరిక దొరకకా.. ఊరకుండిపోయా. నిన్న సాయంత్రం పొద్దుపోయాక.. మా ఎదురింట్లోని దృశ్యం చూసిన దగ్గరనుండి.. నీకు ఏదో ఒకటి రాయమని నా మనసు పదే పదే సొదపెడుతుంటే.. ఎట్టకేలకు ఈ అర్ధరాత్రి సమయాన రాద్దామని తీరిక చేసుకుని, టీవీ పెట్టుకుని కూర్చున్నా. టీవీలో ఏదో పాత సినిమాపాట వస్తోంది. ‘చైత్రము లోనా చినుకు పడాలని కోరేవు. మార్గశిరాన మండుటెండకై చూసేవు’ అంటూ కమల్‌హాసన్ పాడుతున్నాడు. ఇదే కదా, మనిషి అసలు నైజం అనిపించింది. ఏదో చెప్పాలనుకుని, తెగ తిప్పలు పడిపోతున్నా కదూ!
ఏం చెయ్యను? నేను నీలా సమ సమాజాన్ని చదివిన పాఠకురాలిని కాను. సమస్యలనుద్ధరించాలని కలం పట్టిన రచయిత్రినసలే కాను.
మాయింటి పరిస్థితులవల్ల ఇంటర్‌తోనే చదువాపేసి.. మరొక ఇంటిదానినైన నాకూ.. నీయంత గట్టిబుర్ర రాలేదులేగానీ, ‘చదువుకునే రోజుల్లో ప్రేమాయణం ప్రగతికి చేటు’ అనీ మన తెలుగు మాస్టారు చెప్పినమాట మాత్రం నా మట్టిబుర్రకి బాగా గుర్తుండిపోయింది.
ఆ మాటే తిరుగులేని వేదమనుకున్నానేమో.. నేనే సమస్తమనుకుని, చావుదెబ్బలు తిన్న రామూతోసహా, ఎవ్వరి ప్రేమనూ ఆమోదించలేకపోయా. కొన్నేళ్ళ తరువాత.. ఐఏఎస్ ఆఫీసరైన రామూ ప్రేమకే కాదు, బ్రతుకు ప్రగతికి కూడా దూరమయ్యానని.. నాకు నేనే భారమయ్యాననీ బాగా బాధపడిపోయా. అదే సమయాన, కిట్టూ లాంటివాళ్ళు వేసిన ఎన్ని రాకెట్టులనైనా పట్టించుకోని నిశ్చలతగల నీ స్నేహాన్ని తలచుకుని నాలో నేను గర్వపడిపోయా. కానీ.. ప్రగతిమెట్లెక్కాల్సిన రోజుల్లో ప్రేమాయణం, ప్రాణాలకే చేటనీ.. చెప్పడానికి, చేజేతులా తెచ్చుకునే ఆపదలను తప్పించడానికి ఇప్పుడు తెలుగు మాస్టారూ లేరు. ఆయనలా పాఠం చెప్పేవారున్నా, విని అర్థం చేసుకోగలిగినంత పసితనమూ లేదు.
అప్పుడెప్పుడన్నా, శుక్రవారం పూట.. పావలా బిళ్ళంత కుంకుమ బొట్టు పెట్టుకుని.., పాదాలనిండా పసుపు రాసుకుని.., పట్టుపరికిణీని కాస్తంత పైకి పట్టుకుని.. బుల్లి దేవతలాగా నువ్వు బడికి నడిచి వస్తుంటే.. నా రెండు కళ్ళని రెండొందల కళ్ళు చేసుకుని చూసేదాన్ని. అలా నీలా తయారవ్వాలనే నా తీవ్రమైన కోరికను అతి కష్టంమీద అణచుకునేదాన్ని.
నీకు గుర్తుందా? మన క్లాస్‌మెట్ మౌనిక, ఒక్కసారి బొట్టు పెట్టుకోమని.. వందసార్లు బ్రతిమలాడితే.. మా అన్న కంటబడకుండా కొద్దిసేపు ఎర్ర స్టిక్కర్ పెట్టుకున్నా. అది చూసి, మురిసిపోయిన రాము, ‘అచ్చం సీతాదేవిలా కళకళలాడిపోతోంది’ అన్నాడు, నాకు మాత్రమే వినబడేలా. నేను బొట్టు పెట్టుకుంటే చూడాలన్నది రామూ కోరికేనట. తరువాతి రోజు మౌనిక చెప్పింది.
నా పెళ్ళయ్యాక.. ఎన్నివందలసార్లు రామూని తలచుకున్నానో, ఎన్ని వేలసార్లు, సీతగా పుట్టివుంటే ఎంత బాగుండేదని తలపోసుకున్నానో నాకు మాత్రమే తెలుసు. వయసు పెరిగేకొద్దీ.. మీ దేవుడైన రాముడన్నా, రాముని కథ చెప్పే రామాయణమన్నా బాగా ఇష్టం పెరిగిపోయింది నాకు. రాముడికి, సీత ఒక్కటే భార్య ఉన్నందుకో.. లేక, నాలో సీతను చూసుకున్న రామూకు ఆయన పేరు పెట్టినందుకో.. కారణం స్పష్టంగా చెప్పలేను.
జరగనివి జరిపించుకునేంతటి స్వేచ్ఛ, మావాళ్ళెవ్వరూ చూడలేని నా తలపులలోనే సాధ్యమవుతుంది. జరిగేవి చూస్తుండటం, జరిపించుకునే నావాళ్ళకు అలుపెరుగక చేస్తుండటం మాత్రమే నాకు చేతనవుతుంది.
ఏంటీ అన్నావ్!? అప్పటి నా చొరవ, ధైర్యాలను ఇప్పుడు కోల్పోయానా? అప్పటి అందాన్నంతా పోగొట్టుకుని, బామ్మలాగున్నానా? నిజమే.. కొందరి కోరికలు గుర్రాలవుతుంటాయ్. ఇంకొందరి కోరికలపై గుర్రాలెక్కుతుంటాయ్. పరుగు వేగం పెరిగేకొద్దీ.., ఎగువనున్న కోరికలకు రెక్కలు మొలుస్తుంటాయ్.. దిగువనున్న కోరికలు, గోతుల లోపలికి పాతుకుపోతుంటాయ్. ఈ నా పిచ్చి మాటలు నీకేమైనా అర్థమయ్యాయా? అయ్యేవుంటాయిలే, నువ్వూ పేద్ద రచయిత్రివి కదూ!!
ఏంటది.. భేదబానిసత్వమా?! ఇది మీ రచయితలకు మాత్రమే చెందిన ప్రత్యేక పదమా? స్వేచ్ఛ అంటే.. సొంత యింటిని వదిలివేసుకుని, పరాయి పంచకు పరిగెత్తడమా? ఇది మీ సమసమాజపు సిద్ధాంతమా? నాకు తెలియక అడుగుతున్నాను.
నాకైతే.. ఈ భూమిమీద బ్రతకడం ముఖ్యం. బామ్మగానో, బానిసగానో. నువ్వు బొట్టు పెట్టుకోవడం మానేసినంత తేలికగా నేను బుర్ఖాను తీసేయలేను. భర్తనూ మార్చెయ్యలేను. నువ్వన్నా, నీ పేరన్నా నాకెంత ఇష్టమున్నా.. నువ్వు పేరు మార్చుకున్నంత సులభంగా నా తీరు మార్చుకోలేను. ఎందుకంటే.. మీయింట్లో అతి చవకగా దొరికే స్వేచ్ఛకు మాయింట్లో ఖరీదు బాగా ఎక్కువ. ఇకముందెప్పుడూ ఎక్కడా నన్ను ‘అమ్మూ’ అని పిలవకు. అది మీయింట్లోని పేరులా వినిపించే ప్రమాదముంది. అంతేకాదు, నువ్వు నా స్నేహితవని మావాళ్ళకు ఎన్నటికీ తెలియనివ్వకు. నీ లక్ష్యాలు నాలో ఉన్నాయని ఊహించుకునే ఉపద్రవముంది. ఈ నా అక్షరాలను చదివాక, ఈ కాగితాన్ని కాల్చేయకుండా పొరపాటున కూడా వదలకు. నా ఉనికి నీ స్మృతుల్లో మిగిలిపోయే అవకాశముంది.
నీ లేఖ నా చేతికంది, నెలరోజులు గడిచినా.. నాకిప్పటికీ జీర్ణంకాక అడుగుతున్నా.. వేదపండితుడి కూతురివైన నువ్వు, సోది కబుర్లకెట్లా ఆకర్షించబడ్డావు? కిట్టూగాడి వెకిలి చేష్టలను వ్యతిరేకించిన నువ్వు.. వట్టి మెత్తటి మాటలలో మమతనెట్లా వెతుక్కున్నావు? నువ్వు అడిగినవి, అడగనివి అన్నీ సమకూర్చిన నీ భర్త దగ్గర అసమానతనెందుకు చూసావు? చేతికందిన స్వేచ్ఛతోనే సంకెళ్ళెందుకు తగిలించుకున్నావు?
నిన్ను చూసి జాలిపడాలో, జాగర్త పడాలో నాకర్థం కావట్లేదు. ‘అంతమంది పిల్లలనెందుకు కన్నావు?’ అని నువ్వడిగిన ప్రశ్నకిప్పటికే నీకు జవాబు దొరికిందనుకుంటున్నా. మాయింట్లో పుట్టే పిల్లలందరూ దైవసైనికులు. మా దైవరాజ్య విస్తరణే ధ్యేయమైన తండ్రీ.. తల్లుల సంఖ్యను పెంచుకునైనా, మా సైనికులను అసంఖ్యాకం చేయాలనుకుంటాడు. తన ధ్యేయం కన్నా ఎవరి మనోభావాలు, మేనిగాయాలు ముఖ్యం కాదు. మా వ్యాపార వృద్ధికి చిహ్నంగా అమ్మకానికి వచ్చిన మా ఎదురింటిని ఇటీవలే కొన్నాడు మా ఆయన. నాకు తెలిసీ మాకిప్పటికే ఊళ్ళో మూడిళ్ళున్నాయి.
నీ జాబు నాకందిన వెంటనే నిన్ను జాగరూకపరుస్తూ జవాబు లేఖ రాసుంటే బాగుండేదనిపిస్తోంది. ఇప్పుడు సమయం మించిపోయింది. పరిస్థితి నా చేయి దాటిపోయింది.
అతి విషయాలకు, అనవసర వివాదాలకు దూరంగా ఉంటామని, అప్పట్లో మనిద్దరినీ అందరూ మెచ్చుకునేవారని, ఆనందంగా గుర్తు చేసుకున్నావు కదా.. ఇప్పటి నిన్ను చూసిన ఆ అందరూ.. కోరి కుడితిలో పడ్డ బలుపు బల్లి అని చెప్పుకుంటారేమోనని బాధగా ఉంది నేస్తం! నాకెంతో ఇష్టమైన సీతాలక్ష్మి అనే నీ పేరును.. నీకిష్టమైన లక్కీగా మార్చుకున్నావు. పరవాలేదు. అయితే.. ఇకనుండి నీకు నచ్చిన మార్పులు, చేర్పులు చేసుకునే లక్కీ ఛాన్స్ ఉండకపోవచ్చు. నువ్వు కోరుకుంటున్న స్వేచ్ఛ, సమానత్వాలు నీ రచనలకే పరిమితం కావచ్చు. ‘సీతాలక్ష్మీ!’ అనే పిలుపు నీ చెవులకిక వినబడకపోవచ్చు. ఇక ముందెప్పుడూ నేను నీతో మాట్లాడకపోనూవచ్చు.
నన్ను క్షమించు సీతా! నా పేరునుటంకిస్తూ ఇట్లు రాయనవసరమూ లేదు. ఎందుకంటే.. నువ్విప్పుడు నా ప్రాణ స్నేహితురాలివి కావు. నీకు తెలియకుండానే నా చిరునామాలోకి వచ్చేసిన నీకు, ఈ నల్లక్షరాల తెల్లకాగితాన్ని కిటికీ లోంచి లోపలకు పడేస్తే చాలు, పోస్ట్ చెయ్యనవసరం లేదు. అదిరిపడుతున్నావు కదూ.. అవును, ఇది నిజం. నువ్వూ.. నిన్న సాయంత్రం, మా ఎదురింటి కబేళాను వరించివచ్చిన గంగిగోవువి. నా మూడవ సవతివి.
పెండ్యాల గాయత్రి గారు, తెలుగు ఉపాధ్యాయినిగా ప్రకాశం జిల్లా, సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.
సామాజిక శ్రేయస్సే లక్ష్యంగా కలం పట్టిన వీరిప్పటివరకు.. 100 కి పైగా కవితలు, 60 వరకు కథలు, 9 శ్రవ్య, దృశ్య నాటికలు, రెండు నవలలు, కొన్ని పాటలు, గజళ్ళు రచించారు. వీరి రచనలు వివిధ పత్రికలలో, ఆకాశవాణిలో వెలువడడమే కాకుండా అనేక పోటీలలో బహుమతులు పురస్కారాలు అందుకున్నాయి. గిడుగు రామ్మూర్తి పురస్కారం, జిల్లాస్థాయి ఉగాది పురస్కారము, వివిధ సాహితీ సంస్థలు అందించిన ప్రతిభా పురస్కారాలు వీరు అందుకోవడం జరిగింది.
వీరి మొదటి పుస్తకం ‘కథలు కనే కళ్ళు’ (కథల సంపుటి) సినారె ట్రస్ట్ వారు అచ్చువేసి అందించిన పుస్తక బహుమతి కాగా, రెండవ పుస్తకం ‘దివ్యపథం’ నవల. దివ్యాంగుల జీవితాలకు, సభ్యసమాజానికీ అభేదం చెపుతూ వ్రాయబడిన దివ్యపథం నవల, ఇటీవలి కాలంలో వెలువడిన వైవిధ్యమైన రచనగా విమర్శకుల మన్ననలందుకుంది. భారతీయ సమాజ, సాంస్కృతిక నేపథ్యంతో సాగే వీరి రెండవ నవల “మా‘నవ’సేన” ఒక ప్రతిష్ఠాత్మక నవలల పోటీ పరిశీలనలో ఉంది.
