Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమే మా బలం-1

[శ్రీమతి సురేఖ పులి గారు రచించిన ‘ప్రేమే మా బలం’ అనే నవలని రావాహికగా అందిస్తున్నాము.]

“రాజు గారు! మీ తమ్ముడు, నా చెల్లెలు ప్రాణాపాయంలో ఉన్నారు, దయచేసి మీ పలుకుబడితో వాళ్ళను కాపాడే ప్రయత్నంలో మన దేశానికి క్షేమంగా రప్పించండి” దీనంగా అడిగాడు.

తీక్షణంగా చూసి “నా మాట వినలేదు. వాళ్ళిద్దరూ మీ మాటకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆకర్షణ!.. వయసు తన్నుకొస్తున్న ఆకర్షణ!! సిరి అయినా స్త్రీ అయినా ఆకర్షణకు దాసోహం!! తల వరకు మునిగి కొట్టుకుపోతుంటే ఎవరైనా ఎలా రక్షిస్తారు?” బిరుసుగా సమాధానం ఇచ్చాడు.

మరో సారి అన్నాడు “జరిగిన వన్నీ మర్చిపోయి, వారికి ప్రాణభిక్ష పెట్టండి!” రెండు చేతులు జోడించాడు.

“మన దేశంలో ఉన్నంత దయాదృహృదయులు ఇతర దేశాల్లో వుండరు. ఆ దేశ నియమ నిబంధనలకు ఒప్పుకునే వెళ్లారు; మీరైన, నేనైనా ఏమీ చేయలేము.” ప్రతికూల జవాబు పర్యవసానంగా రెండు నిర్జీవితులు శవపేటికలో బందీ అయి స్వదేశం తిరిగొచ్చాయి.

***

2000 సంవత్సరం

రాజ్ మహల్ వంటి ప్రభుత్వ కళాశాల అది, రాయి మీద రాయితో అందంగా సజీవత్వం ఉట్టిపడే చెక్కుచెదరని పురాతన నిర్మాణ భవనం! హైదరాబాద్‌లో ప్రత్యేకంగా బాలికలు, యువతుల అందుబాటు కోసం పట్టణానికి నడిబొడ్డున ఉన్న సరస్వతీ నిలయం! గాలి, వెలుతురు సమృద్ధిగా విశాలమైన తరగతి గదులు కలిగి స్కూల్, కాలేజీ ఒకే భవనంలో గొప్ప బీద తారతమ్యం లేక అమ్మాయిలందరికీ విద్య అవసరమని గొప్ప ఆశయంతో ఒకప్పటి నిజాం ప్రభుత్వం నిర్మించారు. అన్ని మతాల వారు జత చేరడంతో కొందరు డ్రెస్ వేసుకుంటే మరికొందరు చీరల్లో హాజరు; కాని తెలుగు అమ్మాయిలు పరికిణి ఓణీతో ముగ్దమనోహరంగా ఉన్నారు.

మధ్య తరగతి కుటుంబానికి చెందిన మనోజ్ఞ ఇంటర్మీడియట్ చదువుతున్న కాలేజీ అదే! మనోజ్ఞ ఇంటి దగ్గర ఎక్కిన సిటీ బస్‌లో కాలేజీకి వెళుతున్నది. సగం దూరం చేరుకోగానే బస్సు విద్యార్థులతో నిండి పోయింది. బస్సుకు వ్రేలాడబడి కొందరు అబ్బాయిలు అవస్థ పడుతున్నారు. కిటికీ పక్కన కూర్చుని ఉన్న మనోజ్ఞను బతిమాలుతూ “ప్లీజ్, ఈ బుక్స్ పట్టుకోండి,” ఎవరో కాలేజీ అబ్బాయి బస్ కిటికీ ఊచలు పట్టుకొని సమతూగుతూ రెండు పుస్తకాలు మనోజ్ఞ ఒడిలో పడేశాడు. అందరికీ వెళ్ళే తొందర! మారు మాట చెప్పలేక, పుస్తకాలు తీసుకుంది.

అంత సేపు ఓపికతో ప్రయాణించి, బస్ ఆగిన వెంటనే తోపులాట, దిగాలని తొందర!

చుట్టూ చూసింది, పుస్తకాలిచ్చిన అబ్బాయి లేడు. ఏమయ్యాడు? కొద్దిసేపు అతని కోసం చూసింది. చూస్తుండగానే బస్ నుంచి దిగిన విద్యార్థులు అందరూ వెళ్లిపోయారు. అమ్మో! ఇంకా ఆలస్యం చేస్తే ఇంగ్లీష్ లెక్చరర్ పాఠం వినమంటారు కానీ హాజరు ఇవ్వరు; ఆవిడతో అదో బెడద. ఇక ఆలస్యం చేయక ఆ అజ్ఞాత అబ్బాయి పుస్తకాలు రెండూ తన బ్యాగ్‌లో పెట్టేసుకుంది.

రెండు రోజులు గడిచినా ఆ అబ్బాయి జాడ లేదు. కాలేజ్ అడ్రస్ చూసి ఇచ్చేస్తా; అనుకుని అతనిచ్చిన రెండు పుస్తకాలలో ఒక పుస్తకం తెరిచింది. ఒక్కసారిగా గుండె గుభేలుమంది. రాసుకున్న నోట్స్ కాదు, తన పేరిట ఉత్తరాన్ని నోట్స్ క్రమంలో రాశాడు. పెరట్లో కూర్చొని నోట్స్ అనబడే ఉత్తరం తెరిచింది.

డియర్ మనోజ్ఞ!

మనిద్దరి పరిచయం వై.ఎం.సి.ఎ. ఫోటో బ్యూటీ కాంటెస్ట్‌లో జరిగింది. ఆ పోటీ నిర్వహించింది మా అన్నయ్య. నేను మీ ఫోటోలు తీస్తూ మీ అందం చూస్తూ మిమ్మలిని ప్రేమించడం మొదలుపెట్టాను. నన్ను నేను ప్రశ్నించుకుంటే తెల్సింది ‘నా ప్రియురాలికి నేనొక ప్రియుడ’ నయ్యాను అని. కానీ భగ్న ప్రేమికుడు కావద్దని నా ప్రయత్నాలు..

మీ కాలేజ్ గేట్ వద్ద మీ కోసం వారం రోజులు ఎదురు చూశాను. నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. కొన్ని రోజులు మీరు ఎక్కే బస్సులో నేనూ ఎక్కి.. మీరు చూడాలని, చూసెట్టు ఎంతో ప్రయాసపడ్డాను. లాభం లేక, క్రిక్కిరిసిన జనాలు ఉన్న బస్‌కు వెళ్ళాడబడి, సదవకాశం కోసం వేచి, ఇదిగో ఈ పద్ధతిలో నా మనసులోని మాట చెబుతున్నాను. నన్ను, నా ప్రేమను కాదనకండి. నేను టైమ్ పాస్ కోసం కాదు నిజంగా మనస్పూర్తిగా చెప్తున్నాను. నా ఈ ప్రేమ పెళ్లి వరకు; జీవితాంతం మీతో కలిసి బ్రతకాలని బలీయమైన కోరిక!

మీ పక్కన ఇతర అమ్మాయిలు ఉన్నందుకు నేను మీతో ముఖాముఖీ చెప్పలేక ఇదిగో ఈ మార్గం చూసుకున్నాను. మీ కాలేజ్ ఎదుట జాన్ బేకరీ ఉంది. మీరు నన్ను కలిసే వరకు మీ కోసం నేను అక్కడ కాచుకుంటాను.

ప్లీజ్.. నవ్వకండి!

నా డిగ్రీ అయిపోయింది. అన్నయ్య చేసే బిజినెస్ చూడాలి. అందుకే నాకింత ఖాళీ సమయం ఉంది. కాదు, దేవుడు నా కోసం మిమ్మల్ని చేరుకొమ్మని అవకాశం కల్పించాడు.

ఆశతో, ఆకాంక్షతో శౌర్యంగా ఒక రాజు.. (నా) రాణి కొరకు ఎదురు చూస్తూ.. సదా నీ స్నేహశీలతను కోరే డియర్..!?

పుస్తకాన్ని ఠపీమని మూసేసింది. అమ్మయ్య! చుట్టూ ఎవరూ లేరు, ఉన్నా భయం లేదు, ఏదో పుస్తకం చదివినట్లు కనబడుతుంది అందరికీ. మిగతా పేజీలు తిరగేసింది.. అంతా ఖాళీ.. అన్నీ పేజీలు ఖాళీ!

తెలివిగల అబ్బాయి, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉత్తరం పేరిట రెండు వందల పేజీల రెండు పుస్తకాలు తన చేతిలో పెట్టాడు. అంత మంది జనంలో, వుహు గుర్తు రాలేదు. ఫోటో బ్యూటీ కాంటెస్ట్ జరిగిన రోజున.. ఎవరు? రెండవ మారు మళ్ళీ చదివింది. అన్న చూస్తే లేని పోని రభస!

రెండవ పుస్తకం తెరిచింది, అదే ఉత్తరం కాపీ, మరోసారి ఉంది. తనలో తానే నవ్వుకుంది.. స్కూల్లో ‘విశ్వక్సేనుడు’ పదం పలకడం రాయడం రాకపోతే టీచర్ పదే పదే పలికించి, రాయించేవారు. ఈ శౌర్యరాజ్ కూడా ఈ ఉత్తరాన్ని తప్పులేకుండా రాయడానికి పూనుకున్నట్లు ఉన్నాడు!

అతన్ని ఒకసారి కలిసి చెప్పాలి ‘బాబు, నీకో దండం. నాకు ప్రేమలు-పెళ్ళిళ్ళు తెలియదు. వేరే ఎవరినైనా చూస్కో’ మళ్ళీ చదివింది. చాలా సార్లు చదివింది. జాగ్రత్తగా పుస్తకాన్ని బాగ్‌లో పెట్టుకుంది.

***

ఫ్యాక్టరీ జనరల్ షిఫ్ట్ మొదటి సైరన్ మోగింది. స్టాఫ్ అందరూ వారి అటెండన్స్ పంచ్ కార్డు గేట్ ఎంట్రన్స్ వద్ద సెక్యూరిటీ గది ఎదురుగా ఏర్పరిచిన పంచింగ్ మిషన్‌లో హాజరు యిచ్చి తమ తమ ఆఫీస్ గదుల్లోకి తీరిగ్గా నడుస్తున్నారు.

దాశరథి యథావిధిగా నోటీసు బోర్డు వంక చూసి, నిరాశ చెంది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీసులోని విభాగమైన టెలెక్స్ కం టెలిఫోన్ రూమ్ తాళం తీసి, ఏదైనా అర్జెంట్ టెలెక్స్ ఉన్నాయా.. చూసుకున్నాడు. అన్నీ రొటీన్ మెసేజ్స్ అని, రోజూ వారి పనిలో నిమగ్నమయ్యాడు.

దాశరథి పని వేళలు ఎనిమిది గంటల్లో టెలెక్స్, టెలిఫోన్ పనులు ముగియవు. ప్రతి రోజు సెకండ్ షిఫ్ట్ బస్సులో ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. కంపెనీ క్వార్టర్ కోసం అప్లికేషన్ యిచ్చి ఆరు నెలలు అయినా హెచ్.ఆర్/వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి జవాబు రాలేదు. యూనియన్ లీడర్‌తో గోడు వెళ్ళబుచ్చినా లాభం లేక పోయింది.

కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహదేవ్ శర్మ ఛార్జ్ తీసుకొని వారం అయింది. పి.ఎ. భూషణం, ఆఫీస్ అసిస్టెంట్ ఛాయాదేవి, అటెండర్ లింగయ్య అందరితో తొమ్మిది గంటలకు మీటింగ్ నిర్ణయించారు.

మహదేవ్ శర్మ గారు స్టాఫ్ అందరితో పాటు టీ తీసుకుని “మీ పరిచయం చేయండి” అన్నారు. ఈ.డి., సెక్రటేరియట్ స్టాఫ్ క్లుప్తంగా వారి పరిచయాలు, తాము నిర్వహించే పనుల సారాంశాన్ని వివరించారు.

ఇంత కంటే మంచి ఛాన్స్ వేరొకటి లేదని దాశరథి చొరవ తీసుకున్నాడు. “సార్, నేను ప్రతీ రోజు నా ఎనిమిది గంటల పని పూర్తి చేసి ఇంటికి వెళ్ళ లేక సెకండ్ షిఫ్ట్ చేసి ఇంటికి వెళుతున్నాను. వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, మరొక స్టాఫ్ సపోర్ట్ సహాయంగా ఇవ్వండి. ప్రత్యామ్నాయంగా మన ఫ్యాక్టరీ టౌన్ షిప్ క్వార్టర్ కేటాయింపు అయితే ఆఫీసు పనులు సక్రమంగా చేయగలుగుతాను.”

“దాశరథి గారు మీరు ఒక్కరే కాదు. మీ ముగ్గురూ వర్క్ లోడ్ పంచుకోవాలి. టౌన్ షిప్ క్వార్టర్ అలాట్మెంట్ మీ ఎలిజిబిలిటీ ప్రకారం నేను హెచ్.ఆర్ తో మాట్లాడి చెప్తాను.

మీరందరూ వినండి, ఈ యూనిట్ నష్టాల్లో ఉంది. ఉన్న స్టాఫ్‌ను ఇంకా తగ్గించాలని హెడ్ ఆఫీస్ ఎమ్.డి. సర్ గారి నోట్ వచ్చింది. సో.., నో న్యూ రిక్రూట్మెంట్. మరో విషయం కాస్ట్ రిడక్షన్ చేస్తూ మన యూనిట్‌ను మనం రక్షించుకోవాలి. ఇదే కాన్సెప్ట్ అందరి హెచ్.ఓ.డిస్ తో ప్రతి మీటింగ్ యందు జరిపే ముఖ్యాంశము. కాన్ఫిడెన్షియల్‌గా మన ఆఫీస్ నడవాలి. ఇట్స్ క్లియర్ టు యు ఆల్?”

అందరూ “ఎస్ సర్” అని, ఎవరి సీట్లల్లోకి వారు వెళ్ళి పోయారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు హెచ్.ఆర్ అండ్ వెల్ఫేర్ మేనేజర్‌తో మాట్లాడిన వెంటనే వ్యక్తిగత కంపెనీ క్వార్టర్ దాశరథి పేరిట కేటాయిస్తూ, స్వయానా దాశరథి చేతికి లెటర్ అందించారు. దాశరథి ఆ రోజు తన కొలీగ్స్ అందరికి నాన్ వెజ్ బిర్యానీ లంచ్ పార్టీ ఇచ్చాడు.

ఇంట్లో భార్య శమంతకమణి, చెల్లెలు మనోజ్ఞ; సన్నిత, ప్రణిత కూతుళ్లందరికి స్వీట్స్ ఇచ్చాడు దాశరథి.

***

ఫ్యాక్టరీ టౌన్ షిప్ స్కూల్లో సన్నిత మొదటి తరగతి, ప్రణిత ప్లే స్కూల్ లో జాయిన్ చేశాడు తండ్రి.

టౌన్ షిప్ ఆర్.టి.సి బస్ స్టాప్ వద్ద దాశరథి చెల్లెలితో “మనో, ఇక్కడ నువ్వు సిటీ వెళ్ళే బస్సు ఎక్కాలి. ఒకవేళ డైరెక్ట్ కాలేజ్ బస్ దొరకని పక్షంలో డిపో వరకు వెళ్ళి వేరే బస్సు తీసుకో” బాధ్యతగా చెల్లికి కావాల్సిన డ్రస్సులు, బాగ్, ఖరీదైన పార్కర్ పెన్ కొనిచ్చాడు అన్న.

“క్వార్టర్లో అన్నీ బానే ఉన్నాయి, మన సొంతిల్లు ఎవరైనా మంచి వాళ్ళను చూసి కిరాయిస్తే బాగుంటుంది కదా” శమంతకమణి విన్నవించుకుంది.

“ఇవ్వాలనే నాకూ ఉంది, కానీ మంచి వాళ్ళు ఎవరా అని ఎలా గుర్తించేది. ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగితే ఇద్దాం” లంచ్ చేసి ఫ్యాక్టరీ సైరన్ విని హడావిడిగా బయలుదేరుతూ అన్నాడు దాశరథి.

***

ఎకనామిక్స్ క్లాస్‌లో లెక్చరర్ నోట్ చదివారు “లక్స్ యాజమాన్యం అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. పాల్గొనదలచిన అమ్మాయిలు ఆఫీస్ రూమ్‌లో వివరాలు తెలుసుకొని, మీ పేర్లు నమోదు చేసుకోండి, ఇప్పుడు కాదు.. లంచ్ బ్రేక్ సమయంలో.”

ఒక్కసారిగా క్లాస్ అంతా మనోజ్ఞ పేరు ఉచ్చరిస్తూ గొల్లుమన్నారు. “నీకేం.. నువ్వు సృష్టి చెక్కిన అపరంజి అపురూప బొమ్మవు, అందానికి మరో పేరు ఎవరు అంటే మనోజ్ఞ. ఆకర్షణ ఆభరణంగా కలిగిన నువ్వు అందాల పోటీలో పాల్గొని మన కాలేజీకి ప్రైజు గెలవాలి” అమ్మాయిలందరూ ప్రోత్సహించారు.

మనసులో సంతోషంగా ఉన్నా, అన్న అనుమతి లేనిదే ఆవులించని చెల్లెలు అమాంతంగా అవునని చెప్పలేదు.

“వదినా, మా కాలేజీలో అందరూ నన్ను “లక్స్-అందాల పోటీలో పాల్గొనమంటున్నారు. అన్నతో ఎలా చెప్పాలి? అసలు ఒప్పుకుంటాడా?”

“అన్న సంగతి అటుంచి, నీ అభిప్రాయం చెప్పు. మీ కాలేజీలో కాదు, ఇది యూనివర్సిటీ స్థాయి పోటీ, నీకు పాల్గొనాలని ఉందా?” తల్లి ప్రేమను పంచి యిచ్చిన వదినతో మనసులో మాట చెప్పింది.

“నాకు పాల్గొనాలని ఉంది.”

“మనో, సామాన్యంగా ఇటువంటి అందాల పోటీలో పాల్గొనాలంటే మనోధైర్యం ఎక్కువ కావాలి. అంతే కాక శీలాన్ని శంకించే అపవాదులు కూడా మిన్న! మన జాగ్రత్తలో మనముండాలి” మౌనంగా విన్నది మనోజ్ఞ.

“నీ మీద నీకు విశ్వాసం, మా అందరికి నీ పైన ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయను అనే ధృడ సంకల్పం ఉంటే చాలు. మీ అన్నయ్య నీ ఇష్టాన్ని కాదనరు.”

“వదినా, నేను నా జాగ్రత్తలో ఉంటాను. ప్లీజ్, అన్నతో నువ్వే ఈ విషయం చెప్పాలి.”

“మరేం ఫరవాలేదు, నిన్ను బిడ్డ కంటే ఎక్కువగా చూసుకునే అన్న ముందు బిడియం ఎందుకు?”

“దాసన్న నన్ను ఎంతో ఎత్తున చూస్తున్నాడు కనుకనే.. డైరెక్ట్ గా చెప్పలేను; ఏమో వద్దంటే, లేక నా తృప్తి కోసం ‘సరే’ అంటే నేను భరించలేను. అందుకే నువ్వే మా ఇద్దరి మధ్య సరైన వారధి.” గారాలు పోతూ వదినను వాటేసుకుంది.

“అలాగే చెబుతాను” టీవీలో చిత్రలహరి చూస్తూ జవాబు ఇచ్చింది.

***

“దాశరథి గారు క్వార్టర్ ఎలా ఉంది? సెటిల్ అయ్యారా?” హెచ్.ఆర్. ఆశీర్వాదం గారు టెలెక్స్ రూమ్ కాన్ఫిడెన్షియల్ అనే బోర్డు తలుపు పైన వెళ్ళాడుతున్నది, తలుపు తీసుకొని వచ్చారు.

“ఎస్ సర్” క్లుప్తంగా చెప్పి తన పనిలో కూరుకు పోయాడు; అతను వెళ్ళిపోవాలనే ఉద్దేశ్యంతో..

“మీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి” మర్యాదగా అన్నాడు.

“సర్, అసలు నాకు ఖాళీ లేదు, లంచ్ త్వరగా చేసి మీ రూమ్‌కి నేనే వస్తాను, ప్లీజ్.”

“అలాగే దాశరథి” ఆశీర్వాదం చిరునవ్వుతో వెళ్ళిపోయాడు.

దాశరథి మాట నిలబెట్టుకోలేక పోయాడు. భూషణం సెలవులో ఉన్నందుకు మహదేవ్ శర్మగారు పిలిచి అర్జెంట్ ఆఫీస్ నోటీసు తయారు చేయమన్నారు. ఈడిగారి మాటను శిరసా వహించాల్సింది, తప్పదు. ఛాయాదేవి పని సాగతీతలో దిట్ట; ఎప్పుడూ ఆఫీసు పనిలో బిజీ!

ఆశీర్వాదం గారి పర్సనల్ విషయం తెలుసుకునే అంశం మెల్లిగా మరుగున పడింది.

“భూషణం, నేను వైజాగ్ వెళ్ళాలి, మూడు రోజుల సెలవు కావాలి. సార్ ఏమంటారో, నువ్వు నా లీవ్ రెకమెండ్ చేస్తే; సార్ శాంక్షన్ చేస్తారు.”

“నీ లీవ్ రెకమెండ్ చేస్తాను గానీ, నీ పనిని నేను మేనేజ్ చేయాలంటే బోరింగ్. ఓన్లీ మూడు రోజులే అంతకు మించి పొడిగించకు మరి.”

“లేదు పొడిగించను.”

“సిటీలో మీ ఇల్లు ఖాళీగా ఉంది కదా, నాకు తెలిసిన వాళ్ళు అడిగారు, అద్దెకు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా దాస్?”

“ఎవరైనా ఫ్యామిలీ, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ లేదంటే బ్యాంక్ ఎంప్లాయిస్ అయితే కిరాయికి ఇద్దామనుకుంటున్నాను.”

“దాస్, మీ ఇంటి డాక్యుమెంట్స్ ఒక సెట్ జిరాక్స్ ఇవ్వు, ఎవరైనా అడిగితే చూపించడానికి హాండీగా ఉంటుంది.”

“అలాగే రేపు యిస్తాను బాస్.”

కలెక్టర్ ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్న అబ్దుల్ రషీద్ గారిని భూషణం పరిచయం చేశాడు. నెలనెలా అద్దె ఢోకా లేదు అని తృప్తి చెంది దాశరథి అడ్వాన్స్, అద్దె విషయం పరస్పరం చర్చించుకొని ‘భూషణం ద్వారా వచ్చిన టెనెంట్’ అనే నమ్మకంతో వ్రాత పత్రాలు లేకుండా హౌసింగ్ బోర్డు కేటాయించిన ఇంటిని అద్దెకు ఇచ్చాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version