Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమే మా బలం-10

[శ్రీమతి సురేఖ పులి గారు రచించిన ‘ప్రేమే మా బలం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఏడాది దాటాకా శౌర్య ఇండియా వస్తాడు. అందరికీ కానుకలు తెస్తాడు. కొడుకుని చూసి మురిసిపోతాడు. అన్న మౌర్యరాజ్‍ని కలవాలని ఉత్సాహంగా వెళ్తాడు. కానీ చాలా నిరుత్సాహంగా తిరిగొస్తాడు. కొడుక్కి ఉయ్యాల ఫంక్షన్ తమ ఇంట్లో చేయాలని అన్నయ్యని అడిగితే, ఆయన తిరస్కరిస్తాడు. పిల్లవాడికి దాశరథినే పేరు పెట్టమంటాడు. పిల్లాడిని దాశరథి దంపతులు చూసుకుంటే, తనతో పాటు మనోజ్ఞని కూడా సౌదీ తీసుకెళ్ళి ఉద్యోగం చేయించి, కాస్త డబ్బు వెనకేసుకునేందుకు సహకరించమని దాశరథిని అడుగుతాడు. మొదట మనోజ్ఞ కూడా ఒప్పుకోదు. ఎంతో నచ్చజెప్పిన మీదట అంగీకరిస్తుంది. పిల్లవాడికి చిన్మయ్‌ని పేరు పెట్టి, దాశరథి అప్పగించి విమానంలో సౌదీ  బయల్దేరుతారు మనోజ్ఞా, శౌర్యరాజ్. చిన్మయ్ పెరుగుతుంటాడు. శమంత ఆరోగ్యం సన్నగిల్లటంతో, పెద్ద కూతురు సన్నిత ఇంటి పనుల బాధ్యత తీసుకుంటుంది. వైకుంఠ ఏకాదశి రోజున శమంత స్వర్గస్థురాలవుతుంది. ఆ కుటుంబం క్రుంగిపోతుంది. సౌదీలో అక్కడి వారి అక్రమాలకు, అసూయలకు మనోజ్ఞా, శౌర్యలు బలైపోతారు. కథ 2018లోకి వస్తుంది. యదువర్ సన్నిత కోసం ఆమె ఇంటికి వెళ్తాడు. అక్కడ తను కనబడదు. ప్రణీతని అడిగితే, తెలియదంటుంది. ఆమెపై కొద్దిగా కోపం ప్రదర్శిస్తాడు యదువర్. ఇంతలో గేట్ బయట చిన్మయ్ కనబడడంతో, వాడిని పలకరిస్తాడు యదువర్. వాడిని కారులో ఎక్కించుకుని చాక్లెట్లు కొనిస్తానని చెప్పి బయల్దేరదీస్తాడు. – ఇక చదవండి.]

“ఓ మై గాడ్.. ఇంత పెద్ద క్యాడ్బరీ” సంతోషంగా తీసుకున్నాడు.

“చిక్కు, పెద్దక్క కనబడలేదు, ఆఫీసు వెళ్ళిందా?”  ప్రశ్నల పరంపర మొదలైంది.

“ఆ, అవును. సారీ.. కాదు. నేను ఇప్పుడే చాక్లెట్ తింటాను” క్యాడ్బరీ తింటూనే పర్మిషన్ అడిగాడు.

“నీ కోసం కొన్నాను, నువ్వే పూర్తిగా తినాలి” సామ్రాజ్యం గెలిచిన ఆనందంతో తింటున్నాడు.

“ఇప్పుడే ఇంటికి పోవద్దు. ఇది పూర్తిగా అయిపోయిన తరువాత వెళ్దాం.”

“ఎందుకు, చిన్నక్క లాక్కుంటుంది అని భయమా?”

“లేదు, ఎవ్వరూ లాక్కొరూ, కానీ.. బయటివాళ్ళను  చాక్లెట్స్, బొమ్మలు అడగొద్దని మా ఇంట్లో రూల్స్!  మీ ఇంట్లో ఉన్న రూల్స్ ఏంటి?”  అమాయకంగా అడిగాడు.

“మా ఇంట్లో రూల్స్ లేవు. మా ఇంటికి వస్తావా?” ప్రేమగా అన్నాడు యదువర్.

“వస్తాను, గాని ఇప్పుడు కాదు.”

“మరి ఎప్పుడూ?..”

“పెద్దక్క వచ్చాక..”

“ఎక్కడికి వెళ్ళింది. పెద్దక్క..”

“బాగా జ్వరం కదా, అందుకని బెంగళూరు డాక్టర్ దగ్గరికి వెళ్లి ఇంజక్షన్ చేయించుకొని వస్తుంది.”

గతుక్కుమన్నాడు యదువర్. “ఏమిటి చిక్కు, పెద్దక్క జ్వరం ఏమిటి? ఇక్కడ డాక్టర్ లేరా?”

“ఇక్కడ డాక్టర్ ఉన్నా నువ్వు నాన్నగారిని వేరే వూరు తీసుకెళ్ళావు, అలాగే పెద్దక్క కూడా వేరే చోట డాక్టర్తో ఇంజక్షన్ చేయించుకుని వస్తుంది” ఆపకుండా చాక్లెట్ నములుతూ చెప్పాడు చిక్కు.

“ఏం జ్వరం, పెద్దక్క ఇంటి కెప్పుడు వస్తుంది?”

నాకు తెలియదు” తల, చేతులు అడ్డంగా ఆడించాడు.

“అది సరే చిక్కు, ఎప్పుడు వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది?”

“మీరు వెళ్ళిన కొన్ని రోజులకు.. నా చాక్లెట్ అయిపోయింది, ఇంటికి వెళ్దామా?”

“వెళ్దాం.. ముందు చేతులు, నోరు శుభ్రంగా కడుక్కో” పక్కనే ఉన్న నీళ్ళ బాటిల్ యిచ్చి కారు తలుపు తీశాడు.

“ఎందుకు.. చాక్లెట్ తిన్నందుకు చిన్నక్క నన్ను కొప్పడుతుందనా?” జవాబు రాకున్నా కారు దిగి చేతులు, నోరు శుభ్రంగా కడుక్కున్నాడు.

ఇంటి వద్ద చిన్మయ్‌ను వదిలి పెట్టి వెళ్లి పోయాడు యదువర్.

***

అమ్మ ఫోన్ చేసిన సంగతి ఇంటికి వస్తుంటే గుర్తొచ్చింది ‘నాన్నగారికి కాలు మడత పడింది..’ అంతే కారు వేగం పెంచి ఇల్లు చేరుకున్నాడు.

“అమ్మా, రియల్లీ సారీ..” నాన్నగారి బెడ్‌రూమ్‌లో కంప్రెషన్ ర్యాప్ కాలుకు కట్టుకొని నిద్రపోతున్న నాన్నగారు పక్కనే ఉన్న సోఫాలో దినపత్రిక చదువుతున్న యామినితో అన్నాడు.

“యదూ, నీకేం అంతగా కొట్టుకుపోయే పనులున్నాయి, నేను ఫోన్ చేసింది ఎప్పుడు? నువ్వు ఇంటికి వచ్చేది ఎప్పుడు? ఒకసారి టైమ్ చూడు?” చిన్న స్వరంతో ప్రశ్నించింది.

“అమ్మా,.. నిజంగా సారీ, కారణాలు వింటే నీకు సిల్లీగా ఉంటుంది. కానీ తప్పని పరిస్థితుల్లో ఒకచోట ఆగిపోవాల్సి వచ్చింది, అంతే ప్లీజ్. టేక్ ఇట్ ఈజీ!”

“ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటావు, ఇది మామూలేగా.. స్నానం చేసి ఫ్రెష్ అవ్వు.  ఏమైనా టిఫిన్ తింటావా?”

“వద్దు, టిఫిన్ తినాలని లేదు, ఏదైనా జ్యూస్ ఇవ్వు.”

యామిని వంటింటి వైపు వెళ్ళింది. ‘డాడ్, లవ్యు. ఐమ్ సో సారీ..’ గాఢ నిద్రలో ఉన్న తండ్రికి నిద్రా భంగం కలిగించక వెళ్లి స్నానం చేసి వంటింటి వైపు వెళ్ళాడు.

“ఇప్పుడు మనసు మనసు లోనే ఉందా? లేక ఎక్కడైనా తప్పి పోయిందా?” తీరిగ్గా పరిహాసం చేసింది యామిని.

“అమ్మా, ఎప్పటికీ నా మనసు నాతోనే ఉంటుంది, కానీ ఈ మధ్య కొంచెం నన్ను బాధ పెడుతుంది” అమ్మ కొంగును భుజాలపైన కప్పుతూ అన్నాడు.

“నాకో, నాన్నకో చెపితే పోయే బాధనా? లేక బాధ పెట్టిన వాళ్ళతోనే చెబితే తగ్గే బాధనా?” కూపీ లాగే ప్రయత్నంలో అడిగింది.

“నిజంగా నా బుర్ర పని చేయడం లేదమ్మా” అమాయకంగా అన్నాడు.

“నువ్వు చిన్న పిల్లాడివి కాదురా, తెలియక పోవడానికి.. ముందు నీ గర్ల్ ఫ్రెండ్స్‌ను తగ్గించు. బుద్ధిగా పెళ్లి చేసుకో.”

“ఎవరిని పెళ్లి చేసుకోవాలి?” అల్లారుముద్దుగా అడిగాడు.

“నీకు ఎవరైనా నచ్చితే వివరాలు ఇవ్వు. లేదంటే నేను చూసిన అమ్మాయిని ఒప్పుకో. నీ ఇష్టం!” నిశ్చయంగా చెప్పింది.

“నిజంగా ఇదే మాట మీద ఉంటావా?” అమ్మను తన వైపుకు తిప్పుకొని అడిగాడు.

“అనుమానం ఎందుకురా? షూర్‌గా నా మాట మీదనే ఉంటా, చెప్పు” యదువర్ అరచేతిని తన చేతుల్లో పట్టుకుని లాలనగా అంది.

“నాకు నిండుగా బట్టలు వేసుకొని, సాంప్రదాయంగా ఉండే మామూలు అమ్మాయి ఇష్టం. ఆల్రెడీ నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఒకసారి నేను ఆ అమ్మాయి మనసులో నా పట్ల ఎలాంటి భావన ఉందో తెలుసుకొని చెప్తాను” అమ్మ ఒళ్ళో తల పెట్టుకొని కళ్ళు మూసుకొని ఊహాసుందరి ని తలచుకుంటూ చెప్పాడు.

“ఓకే, ఎన్ని రోజులు టైమ్ తీసుకుంటావు?”

“ఎట్లా చెప్పగలను..”

“నీ ఫారిన్ టూర్ క్యాన్సిల్ ఎందుకు చేసుకున్నావు?” అసలు కూపీ లాగాలనుకుంది.

“కారణం ఉంది అమ్మా, కొన్ని రోజుల టైమ్ ఇవ్వు, ప్లీజ్.. అన్నీ చెప్తాను.”

“సరే, నాన్న నిన్ను చాలా సార్లు అడిగారు, మెలుకువ వచ్చిన తరువాత ఒకసారి పలుకరించిన పిమ్మట నీకు గడప దాటే అనుమతి!”

“తప్పకుండా.. యు అర్ వెరీ గుడ్ మదర్!” పొదివి పట్టుకున్నాడు.

***

“సార్, యదువర్ అని మన ఎక్స్ ఎంప్లాయ్ మిమ్మల్ని కలవాలని అంటున్నారు” సెక్యూరిటీ వాచ్‌మన్ ఇంటర్ కాం లో యజమానిని అడిగాడు.

“పంపించండి” కరుణాకరం అనుమతిచ్చారు.

ఆఫీస్‌లో కొంత పునర్నిర్మాణం, సీటింగ్ మార్పులు జరిగాయి. ఆఫీస్ బాయ్ యదువర్‌ను చూడగానే సంతోషంగా సెల్యూట్ చేశాడు. సి.ఇ.ఒ కేబిన్ వైపు వెళ్ళాడు.

“ఎస్.. యదువర్ చెప్పండి. హౌ ఈస్ మౌర్యరాజు?”  ఒక వైపు కంప్యూటర్ పైన దృష్టి పెట్టి మాట్లాడుతున్నారు.

“సర్, మా నాన్నగారు బాగున్నారు. నాకు కొంచెం పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావాలి.”

“ఎవరి పర్సనల్..?” ఇంకా దృష్టి తిప్పలేదు.

“ఆల్మోస్ట్ స్టాఫ్ మారిపోయారు. సో, మీరే నాకు గైడెన్స్ యివ్వాలి.”

“ఓకే.. బట్ బి బ్రీఫ్! తొందరగా చెప్పండి. లేదంటే రాత్రి ఏదైనా హోటల్ లో మీటింగ్ పెట్టుకుందాం” కళ్లలోకి గమనిస్తూ అన్నారు.

“సర్, సన్నిత.. ఇంకా ఈ ఆఫీస్ లోనే కంటిన్యూ..”

“ఎస్, సన్నిత ఇక్కడే ఉంది. ఇప్పుడు లీవ్‌లో ఉన్నది.”

“ఇంట్లో లేదు. వాళ్ళ నాన్నగారికి నేను ఉడిపి ఆయుర్వేద ఆసుపత్రిలో ఒక నెల దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పించాను. ఇప్పుడు వారు కూడా బాగున్నారు.”

“మరి, నీ ప్రాబ్లం ఏంటి?” కంప్యూటరు మూసి అన్నారు.

సర్, ఒక్కతీ.. సన్నిత.. జ్వరం అట. వేరే చోట ఉంది. మీకేమైనా వివరాలు తెలిస్తే చెప్పండి. ప్లీజ్ నేను తనకు హెల్ప్ చేయాలనుకున్నను” దీనంగా అడిగాడు.

“వై డూ యు వాంట్ టు హెల్ప్ హర్?” (ఎందుకని సహాయం చేయాలనుకున్నావు?)

‘కరుణాకర్ గారు మీరు మా నాన్నగారి డబ్బు అప్పు తీసుకొని బిజినెస్ నడిపిస్తున్నారు, ఇన్ని ప్రశ్నలు ఎందుకు?’ మనసులో విసుగు చెంది పైకి నవ్వు పులుముకొని “ఐ అమ్.. ఐ..” ఇబ్బందికరంగా అనిపించి చెప్పలేకపోయాడు.

“ఓకే సర్.. థాంక్స్, ఐ విల్ మూవ్” అని లేచాడు.

“అరెరె! ప్లీజ్ సిట్ డౌన్! సన్నిత బెంగళూరులో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నది. నేను కొంత డబ్బు సహాయం చేశాను, బహుశా ఇంకా చేస్తాను. ఎందుకంటే..” వాక్యాన్ని పూర్తి కానివ్వలేదు.

“కాన్సర్, హౌ? ఎప్పటినుండి??” కుప్పకూలి చైర్ లో కూలబడ్డాడు.

“అవును యదువర్, బ్రెస్ట్ క్యాన్సర్. అఫ్కోర్స్ మొదటి స్టేజ్! వాళ్ల నాన్నగారిని నువ్వు ఉడిపి తీసుకుని వెళ్లిన వారంలో తెల్సింది. చాలా బాధ పడుతూ నాతో చెప్పింది. ఒకప్పుడు అత్యవసర పరిస్థితిలో సన్నిత విశ్వదకు.. అదే నా భార్యకు అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసింది. నేను నా ఓబిడియంట్ స్టాఫ్ కేర్ తీసుకోవాలి. వాళ్ళ నాన్నకు తెలిస్తే కుంగిపోతారని ఇక్కడ కాకుండా వేరే చోట ట్రీట్మెంట్ మంచిది అనుకొని నేను నా మిస్సెస్ వెంట తీసుకెళ్లి బెంగళూరు క్యాన్సర్ హాస్పిటల్ చూపించాము.”

“ప్లీజ్, డీటైల్స్ ఇవ్వండి. నేను వెళతాను.”

“ఇంకో ఐదు రోజుల ట్రీట్మెంట్ అయితే కోర్సు పూర్తి అవుతుంది. తానే తిరిగి వచ్చేస్తుంది, వర్రీ లేదు” అభయమిచ్చాడు.

“లేదు. అంత వరకు ఆగే ఓపిక లేదు. నేను వెళ్ళాలి.. జస్ట్ అడ్రస్ ఇవ్వండి. తనకు ఏమి చెప్పొద్దు. సన్నిత ఒక్కతే.. అంటే ఎవ్వరూ అటెండర్ తోడుగా లేరా?

“నా మిస్సెస్ ఉంది, కానీ రెగ్యులర్ గా కాదు. నా కొడుకు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నందుకు అక్కడ-ఇక్కడ మానేజ్ చేసుకుంటుంది” క్యాన్సర్ హాస్పిటల్ అడ్రస్ ఫోన్‌లో షేర్ చేశాడు.

“ఇన్ పేషెంటా?.. అవుట్ పేషెంటా?”

“అవుట్ పేషెంట్.”

“మరి ఎక్కడ ఉంటోంది?”

“హాస్పిటల్ దగ్గర్లో హోటల్” హోటల్ వివరాలున్న కార్డ్ కోసం కార్డ్ ప్యాడ్ తెరిచాడు.

“సర్, చాలా థాంక్స్. సీ యు” బయటకు వెళ్లాలని స్ప్రింగ్ డోర్ లాగాడు.

“గుడ్ లక్!” యదువర్ వినిపించుకోలేదు.

***

నాలుగు కాళ్ళ వాకింగ్ స్టిక్‌తో మౌర్యరాజ్ మెల్లగా నడిచి డ్రాయింగ్ రూమ్ వరకు వచ్చాడు. యామిని ముగ్గురికి కమ్మటి కాఫీ తెచ్చి సోఫాలో కూర్చుంది. అందరూ కాఫీ తాగిన తరువాత అన్నాడు “నాన్నగారు, రేపు తెల్లవారుజామున పర్సనల్ పని మీద బెంగళూరు వెళ్ళాలి. మీకు చెబుదామని..”

“కొద్దిగా తెలిసింది. ఎవరో అమ్మాయిని  ఇష్టపడుతున్నవని, జస్ట్ క్లారిటీ కావాలి.. ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నావా? లేక ఇంకొంచెం ముందుకు వెళుతున్నవా?”

“రెండు కాదు. ఆ అమ్మాయి ఏదో ఆఫీసు పని మీద టూర్ వెళ్ళిందిట, రాగానే పరిచయం చేస్తాను.”

“అంటే మన అమ్మాయేనా? అంటే కులం, మతం.. ఎవరు అని?” యామిని అనుమానం తెలియపర్చింది.

“మన వాళ్లే..” తలాడించాడు.

“టూర్ అంటున్నావు.. ఉద్యోగం చేస్తుందా?”

“ఎస్ నాన్నగారు” ఓపికతో అన్నాడు.

“నీకు నచ్చింది. సరే.. కానీ, మాకు కూడా కనీసం పది శాతం అయిన నచ్చాలి” మౌర్యరాజ్ మనసులోని మాట పైకి చెప్పేశాడు.

“నో డౌట్, గ్యారంటీగా నచ్చి తీరుతుంది, బట్ వాళ్లు మనంత రిచ్ కాదు” ఎంతో హుషారుగా హమీ ఇచ్చాడు.

“నో ఇష్యూ” ఏదో రకంగా కొడుకు ఒకింటి వాడు అవుతాడని ఆశ!

***

డ్రైవర్ బషీర్ అలీను కాదని మర్నాడు ఉదయం తన మెర్సిడెస్ బెంజ్ తీసుకొని యదువర్ ఎయిర్ పోర్ట్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేసాడు. ఫ్లైట్, క్యాబ్ మార్చి బెంగుళూరు ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ రేడియోలజీ & ఆంకాలజీ విభాగంలో వరుసగా అమర్చిన చైర్‌లో కూర్చున్నాడు. ‘బుద్ధి తెలిసినప్పటి నుండి శివరాత్రి ఉపవాసం లేను; ఈ రోజు ఉంటాను’ దీక్షగా మఠ పీఠం వేసుకున్నాడు.

లీనియర్ ఆక్సిలెటర్, బ్రచిథెరపీ, కీమోథెరపీ కోసం వేరు వేరు గదులున్నాయి. ఇందులో ఏ గదిలో సన్నీ ఉన్నట్టు? హాస్పిటల్ స్టాఫ్‌ను అడిగితే.., లేని పోనీ అనుమానం రావచ్చు, వద్దులే! అనుకొని పక్కనే ఉన్న గోడ వైపు నడిచాడు.

వామ్మో! మరీ ఘోరం!! ఒక సామాన్య స్త్రీ తన భర్తకు కాబోలు గుండు చేసిన తలలో సూది గుచ్చి పైపు పెట్టి అతన్ని జాగ్రత్తగా పట్టుకుని చక్రాల కుర్చీలో కూర్చో పెట్టి ‘హి’ అని బోర్డు పెట్టిన వైపు తీసుకెళుతుంది. ఇంకోవైపు మరో బక్కచిక్కిన స్త్రీ అస్థిపంజరాన్ని పోలిన శరీరంతో ఉన్న అతని పొట్టకు రెండు అంగుళం మందంగా ఉన్న పొడవాటి ఇంజెక్షన్ ద్వారా నీళ్ళలో తడిపిన బ్రెడ్ ముక్కల్ని సిరంజీలో వేసి పైనుండి  కొద్ది కొద్దిగా పళ్ల రసాన్ని పోసి అతని ఆకలి తీరుస్తుంది. మహిళ తన వంతుగా పురుషుడు అస్తిత్వానికి బలం చేకూరుస్తుంది! మహిళలు చేసే సేవలకు పురుషులు వేయి రెట్లు ప్రోత్సాహము, ధైర్యము, సంతోషము, భద్రత యివ్వాలి! ఇస్తున్నారా? నేను ఇస్తాను.

మనసు కరిగిపోయింది. అటు ఇటు తిరుగాడుతున్నాడు. ఇక్కడ మిగతా అందరి రోగులను చూసే ఓపిక లేక తిరిగి రేడియేషన్  థెరపీ వైపు వచ్చి కూర్చున్నాడు.

పది గంటల సమయంలో హాస్పిటల్ బృందం వచ్చి “సర్, మీరు.. ఏ డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు?” కన్నడంలో అడిగింది. కన్నడ భాష అర్థం అయింది. మాట్లాడడం తెలియక వాళ్ళు అర్థం చేసుకునేట్లు “మై కజిన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కం ఫర్ ట్రీట్మెంట్, గివ్ మి సంమోర్ టైమ్ ప్లీజ్” (నా కజిన్ చికిత్స కోసం వస్తుంది, దయచేసి నాక్కొంచెం సమయం ఇవ్వండి) ఆరా తీసి అడిగిన యువతి వెళ్ళిపోయింది.

ఎదురుగా టీవీలో హాస్పిటల్ నైపుణ్యం, అందించిన సేవలు, డాక్టర్ గొప్పతనం, ఆరోగ్యం పొందిన వారితో ముఖాముఖి సంభాషణ ప్రసారణ జరుగుతున్నది. నచ్చక తల తిప్పుకున్నాడు, ఇంకా చూస్తే జీవితం మీద విరక్తి పుట్టి సన్యాసుల్లో కలుస్తాను అని న్యూస్ పేపర్ వైపు దృష్టి మళ్లించి వచ్చిన పేషెంట్ల వైపు చూపు సారించాడు. తాను డాక్టర్ కోర్సు చదవాలి అని అమ్మ నాన్న ఎన్ని ప్రలోభాలు పెట్టారు! బోలెడు డబ్బులు కట్టి సీటు కూడా కొన్నారు. బంక వలె సంవత్సరాలు సాగించి, ఎంతో కష్టపడి చదవక పారిపోయాను. మానవసేవ ఏమో గాని రోగుల అవస్థలు చూడలేక ఆత్మహత్య చేసుకునే వాడినిమో! వైద్యవిద్య చదవాలనే కోరిక ఉండటం గొప్ప కాదు. శ్రద్ధాసక్తులు మనోనిబ్బరం, స్థిరచిత్తం, తెలివితేటలు ముఖ్యం! ఇన్ని గొప్ప గుణాల్లో తనెక్కడ? ఎక్కడా లేడు.

ఒకరి తరువాత ఒకరు రేడియేషన్ రూమ్లోకి వెళ్ళడం రావడం జరిగిపోతున్నది. సన్నీ ఎక్కడ? నిరీక్షణ! అందులోనూ ప్రేమ చిగురించే వేళ హాస్పిటల్ వాతావరణం! నా దౌర్భాగ్యం. అనారోగ్యంతో చికిత్స కోసం పోరాడుతున్న నా సన్నీ!! తలచుకుంటే మనసంతా వికలమైతున్నది..

(ఇంకా ఉంది)

Exit mobile version