[శ్రీమతి సురేఖ పులి గారు రచించిన ‘ప్రేమే మా బలం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[చిన్మయ్‌కి చాక్లెట్ కొనిచ్చి, సన్నిత గురించి ఆరా తీస్తాడు యదువర్. జ్వరమొచ్చిందని, డాక్టర్ దగ్గరకి బెంగుళూరు వెళ్ళిందని చెప్తాడు చిన్మయ్. ఆమె అనారోగ్యమేమిటో, బెంగుళూరులో వైద్యం ఏమిటో యదువర్‌కి అర్థం కాదు. కొద్ది సేపటికి ముందు అమ్మ ఫోన్ చేసి, నాన్నకి కాలు మడత పడిందని చెప్పిన సంగతి గుర్తొచ్చి, వెంటనే ఇంటికి వెళ్తాడు. తండ్రి నిద్రపోతుండడంతో, ఏం జరిగిందని అడుగుతాడు. ఎప్పుడనగా ఫోన్ చేస్తే, ఇప్పుడొచ్చావా అని తల్లి కోప్పడి, పెళ్ళి చేస్తే గాని దారికి రావని అంటుంది. అప్పుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు, వివరాలు కొన్ని రోజుల తర్వాత చెప్తానని అంటాడు యదువర్. తను పనిచేసిన పాత ఆఫీస్ యజమానిని కలిసి, అతని ద్వారా సన్నిత అనారోగ్యం గురించి వివరాలు సేకరిస్తాడు. సన్నితకి కేన్సర్ అని తెలిసి విస్తుపోతాడు. బెంగుళూరు ప్రయాణానికి సిద్ధమవుతాడు. కాస్త కోలుకున్న మౌర్యరాజ్, వాకింగ్ స్టిక్ సాయంతో తన గదిలోంచి బయటకు వచ్చి, కొడుకుని అతని ప్రేమ గురించి అడుగుతాడు. వాళ్ళు మనంత రిచ్ కాకపోయినా, మీకు నచ్చుతారు అని చెప్తాడు. ఫ్లయిట్‌లో బెంగుళూరు వెళ్ళి అక్కడి ప్రముఖ కేన్సర్ హాస్పటల్ విభాగానికి వెళ్ళి, రేడియేషన్ రూమ్ దగ్గర ఎదురుచూస్తూ కూర్చుంటాడు. సన్నీ తలచుకోగానే అతని మనసు వికలమవుతుంది. – ఇక చదవండి.]
సన్నిత వస్తుంది, ఓ మై గాడ్! చిక్కి నల్లబడ్డది. కళ్ళు నీరసబడ్డాయి. సన్నిత వెంట మరొక మధ్య వయసున్న స్త్రీ తోడుగా ఉంది. బహుశా బాస్ గారి భార్య వుండొచ్చు. న్యూస్ పేపర్ అడ్డం పెట్టుకుని గమనిస్తున్నాడు. డెస్క్ వద్ద ఏదో మాట్లాడి తోడు వచ్చిన స్త్రీ యదువర్ ముందున్న వరుసలో కూర్చుంది. సన్నిత నర్స్ వెంట వెళ్లిపోయింది. ముందు కూర్చున్న ఆమె అందంగా, ఆరోగ్యాన్ని చక్కగా పోషిస్తున్నట్టు ఉంది. ఈవిడ సన్నిత స్నేహితురాలిగా ఉంది. మిస్సెస్ కరుణాకరం కాదనుకుంటా!?
ఎవరైతే తనకెందుకు? ‘నేను నీకున్నాను’ అని సన్నీకి ధైర్యం చెప్పాలి. పూర్తి ట్రీట్మెంట్ అయ్యే వరకు ఇక్కడే ఉండి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాలి. నిర్ధారణ చేసుకున్నాడు.
“హలో, హాస్పిటల్ వచ్చాం. అలాగే ఉంది, మరో రెండు సెషన్స్ ఉన్నాయి” సన్నిత వెంట వచ్చిన స్త్రీ ఫోన్ మాట్లాడుతూ లేచి కొంచెం దూరంగా వెళ్ళింది.
రేడియేషన్ ట్రీట్మెంట్ అయిపోయినట్టుంది, నర్స్ సన్నితను పట్టుకొని హాల్ వైపు వచ్చారు. సన్నీ తోడుగా ఉన్న మహిళ లిఫ్ట్ నొక్కింది. వాళ్ళిద్దరు లిఫ్ట్ ఎంట్రన్స్‌లో ఉండగా యదువర్ గబాల్న లిఫ్ట్ వైపు పరిగెత్తాడు. ముగ్గురే ఉన్నందుకు యదాలాపంగా సన్నిత తలెత్తి యదువర్ను చూసి అమితాశ్చర్య పోయింది. కళ్ళల్లో ఆనందం!
“యదువర్.. ఇక్కడికి ఎలా వచ్చావు?” స్వరంలో నీరసం!!
“నీ కోసం” ఆశ పూరితమైన శ్వాస, మనసు లోతుల్లో నుంచి మాట వెలువడ్డది.
“ఆంటీ.. ఇతను యదువర్.”
“యదువర్.. ఈవిడ విశ్వద మేడంగారు.”
పరస్పర పరిచయం చేసింది. ఆంటీ అంటే ఈవిడ సన్నిత ఫ్రెండ్ కాదు. ఒకర్నొకరు పలకరించుకునే లోపు లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆగిన తక్షణమే ఎగబడి జనాలు ఎక్కాలని ప్రయత్నించారు. ఎవరూ తగలకుండా యదువర్ సన్నితను పట్టుకుని జాగ్రత్తగా బయటికొచ్చారు. విశాలమైన హాస్పిటల్ వద్ద జనం హడావిడిలో ఒక ప్రక్కగా ముగ్గురు కూర్చున్నారు.
అనారోగ్యానికి భాష, జాతి, మత, ప్రాంత, లింగ వర్గ భేదాలు లేవు. ఏదో రకంగా ఏవో అనారోగ్య సమస్యలు! వీటికి తలవంచక తప్పదు అని తెలిసినప్పుడు మనస్పర్ధలు, పరస్పర ద్వేషాలు, మోసాలు, పగలు, హత్యలు ఎందుకు?
ఆలోచన విధానం చైతన్యవంతం కావాలి! మన జీవన విధానంలో మార్పు రావాలి!! యదువర్ మనసు ఆరోగ్యంగా ఆలోచించింది.
నిరంతరం వచ్చే పోయే జనంతో హడావిడిగా ఉన్నా, క్రమశిక్షణ, పరిశుభ్రత పూర్తి స్థాయిలో హాస్పిటల్ సిబ్బంది నిర్వహిస్తున్నారు. విశ్వద ఆంటీ యదువర్‌ను ఉద్దేశించి “మీరు ఇక్కడ? ఎక్కడ ఉంటున్నారు?”
“ఈరోజే వచ్చాను మేడమ్, మీరు అనుమతి ఇస్తే మీతో పాటు ఉంటాను” వినయంగా అన్నాడు.
“మాతో వుండలేవు, మేము తీసుకున్న రూమ్ ఇద్దరికీ సరిపోతుంది” క్యాబ్ బుక్ చేసే ప్రయత్నంలో ఫోన్ చూసుకుంటూ అన్నది విశ్వద.
“ఇట్స్ ఓకే మేడం గారు, అదే హోటల్‌లో రూమ్ తీసుకుంటాను!” సర్దుకుపోగలనని తీర్మానించుకున్నాడు.
యదువర్ క్యాబ్ డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు. “ఎలా తెలిసింది, నాకు బాగా లేదని?” సన్నిత ఉండబట్టలేక అడిగింది.
“మీ.. కాదు, ఒకప్పటి నా బాస్ చెప్పారు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. మాట్లాడకు ప్లీజ్..”
“కరుణకు ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదు, ఆడవాళ్ళ నోట్లో మాటలు దాగవంటారు, మగవాళ్ళు ఏం తక్కువా?” విశ్వద చిరాకు చెందింది.
‘తప్పేముంది.. నా వాళ్ళ విషయం నాతో చెబితే’ అని పెదవుల వరకు వచ్చిన మాటలు క్యాబ్ లొకేషన్ చేరిందని బలవంతంగా ఆపేశాడు,
రూమ్ వెళ్ళగానే సన్నిత నీరసంగా పడుకుంది. యదువర్ హోటల్ మేనేజర్ కోసం వెళ్ళాడు.
“సన్నిత, ఎవరితను? మనతో వుండటం ఎందుకు? నువ్వు ఇలా అబ్బాయిలను ఎంకరేజ్ చేయవద్దు” తిడుతున్నట్లే నచ్చచెప్పింది.
“మేడమ్, ఇతను.. మీరనుకున్నట్టు కాదు, వేరే, అంటే..” నసుగుతూ మాట పూర్తి చేయలేక పోయింది నిసత్తువ మూలంగా.
“నీకు ఓకే అయితే సరే కానీ ఏ మాత్రం మగ అహం చూపిస్తే మటుకు అప్పుడే గెట్ అవుట్ అంటాను!” కటువుగా అంది. నిర్జీవంగా ‘సరే’ అని తలాడించింది.
“ముగ్గురు ఇదే రూమ్‌లో సర్దుకోవచ్చు, కావాలంటే ఎక్సట్రా బెడ్ ఇస్తానన్నాడు” యదువర్ రూమ్‌లో అడుగుపెట్టాడు.
సన్నిత ఆదమరచి నిద్ర పోతుంది. “సర్దుకోవచ్చు.. కానీ ఎందుకు సర్దుకోవాలి? ప్లీజ్, మీరు వేరే ఉండండి. మాకు.. స్పెషల్లీ, నాకు కన్వీనియంట్‌గా లేదు” మొహమాటం లేకుండా అనేసింది.
“అలాగే వేరే ఉంటాను మేడం, మీరు రిలాక్స్ అయిన తరువాత నేను కొంచెం మీతో మాట్లాడాలి.”
“నేను అలిసి పోలేదు బాబు, సన్నిత పడుకుంది ఇప్పుడే మాట్లాడొచ్చు.”
విశ్వద చీదరింపుకు మనసు విసుగు చెంది, “సరే, ముందు మీరు భోజనం చేయండి” ఆకలిగా ఉన్నా విశ్వదను ఎదుర్కోవాలనుకున్నాడు.
తన పుట్టుపూర్వోత్తరాలు వివరించి, అమ్మానాన్నల ప్రేమ వర్ణించి, కరుణాకరంగారి కంపెనీ వ్యాపారాల్లో మౌర్యరాజ్ అందించే ఆర్థిక వనరుల ఒప్పందం తెలియచేశాడు. అంతటితో విశ్వద ఏవగింపు అంతమైపోయింది. ఆడవాళ్ళు ఏది చేసినా అతిగా చేస్తారని రూఢి చేసుకున్నాడు. సన్నిత నిద్ర లేచే సరికి సాయంత్రం అయ్యింది. ఈ మధ్యలో యదువర్ పళ్ళు, కొబ్బరి బొండాలు తెచ్చాడు.
“నేను అలా కింద లాన్‌లో వాకింగ్ చేసి వస్తా” ఇద్దరికీ ఏకాంతం కల్పించాలని విశ్వద వెళ్ళింది. అప్పటి వరకు రుసరుసలాడిన ఆంటీ తాను నిద్ర లేచేసరికి ఎంతో ఆప్యాయంగా యదువర్‌తో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయింది సన్నిత.
“ఏమైనా తింటావా? జ్యూస్ గాని కోకోనట్ వాటర్ తాగుతావా?” ప్రేమగా అడిగాడు.
“నాలుక చప్పబడ్డది.. ఏమో, ఏమి తినాలని లేదు. కానీ కడుపులో మంటగా ఉంది.”
“కోకోనట్ వాటర్ తో కొంచెం రిలీఫ్ ఉంటుంది” తాగమని ఇచ్చాడు.
చాలా సేపు మౌనంగా ఉన్నారు. “ఏదైనా మాట్లాడు యదువర్?”
“నువ్వు ఆరోగ్యంగా, క్షేమంగా ఇంటికి వెళ్ళాలి.. ఇదొక్కటే నా మనసులో ఉంది. మాట్లాడటానికి ప్రత్యేకంగా ఏమీ లేవు.”
“సరే, నేను మాట్లాడతాను.. నీకు నా అనారోగ్యం సంగతి చెప్పలేదని కోపంగా ఉందా? నువ్వు నాన్నను ఉడిపి తీసుకొని వెళ్ళిన తరువాత తెల్సింది నాకు ఈ ప్రాబ్లం అని, అసలు..”
సన్నిత మాటలను తుంచేశాడు “నాకు కోపం లేదు, నువ్వు రెస్ట్ తీసుకో, ఏమి మాట్లాడొద్దు!” నమ్రతగా అన్నాడు.
అతని మాటను ఖాతరు చేయలేదు. “నా మనసులో తొలుస్తున్న మాట విను, దయచేసి ఆపకు” కళ్ళల్లో చెమ్మ కనిపించింది.
“నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి నేను ఎవరికీ అపకారం చేయలేదు. ఏదీ అతిగా ఆశించలేదు. అమ్మకు ఇంటి పనుల్లో సాయం చేయడం, డిగ్రీ పూర్తి కాకుండానే ట్యూషన్లు చెప్పి ఆర్థికంగా ఇంటి ఖర్చులకు నాన్నకు తోడుగా వుండేదాన్ని. అమ్మ చనిపోయిన తర్వాత చిన్మయ్‌ని నేను, ప్రణి ఎంతో ప్రేమగా పెంచాము.”
“ఇప్పుడు ఇవన్నీ నాకు చెప్పడం అవసరమా?”
“నీకు అవసరం కాదు, కానీ నా కంఠశోషకు ఒక తెర పడాలి. నా వ్యథ ఎవ్వరికీ ఆసక్తికరంగా ఉండదు. ఎవ్వరూ వినరు, అలాగని నేను ఎవ్వరికీ చెప్పాలని ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే నాకు స్నేహితులు కూడా లేరు” దగ్గు వలన గొంతు పొలమారింది.
“అందరూ నాకు గోపికాలోలుడు అని బిరుదు ఇచ్చారు, మరి అట్లాంటి నన్ను ఎందుకు ఇష్టపడ్డావో..? వినాలని ఉంది” భావోద్వేగంగా మాట మార్చాడు. ఆయాసంతో కొద్ది సేపు మాటలు ఆపేసింది.
“నాకు నువ్వు మాట్లాడితే వినాలని ఉంది” మెల్లిగా అంది.
“నా ప్రశ్నకు జవాబు రాలేదు?” ప్రేమ ఉట్టిపడేలా కొంటెగా అడిగాడు.
“చెప్పాలా?.. తప్పదా?”
“తప్పదు.. చెప్పాల్సిందే!”
“నిజంగా నాకు తెలియదు. అందరు నన్ను గర్విష్టి అనుకొని దూరం పెట్టే వాళ్ళు. నువ్వు అలా కాదు. నాతో ఎంతో మర్యాదగా మాట్లాడేవాడివి. నీ ప్రసన్నమైన నవ్వులో నాకు ఏదో ఆకర్షణ కన్పించేది! నేను అలసిపోయాను అని ఒకసారి నీ విశాలమైన ఎద మీద వాలిపోయి సేద తీర్చుకోవాలని ఆరాటం కలిగేది. నువ్వే నా ఆత్మీయుడని పదే పదే నా మనసు నన్ను తట్టి చెప్పేది. ఇది ప్రేమనా? కాదా? మరి ఏమిటో అర్థం కాలేదు. ఇప్పటికీ తెలియదు. కానీ నా కోసం పెళ్లి సంబంధాలు వస్తుంటే నాన్న ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి మాట ఇస్తారో అని భయం కలిగింది. అప్పుడు నాకు నువ్వు నా జీవిత భాగస్వామి అని ఒక గట్టి నిర్ణయం ఏర్పడింది. కానీ చెప్పలేను, అదే నా అశక్తత!”
“శక్తివంతంగా ఇప్పుడు చెప్పావు, ఇట్స్ లవ్లీ!!
“ఇప్పుడు నీ వంతు.. నువ్వు చెప్పాలి, నేను వినాలి!”
“ఏ టాపిక్ గురించి మాట్లాడాలి, నీకు ఇష్టమైన విషయం పైన మాట్లాడుతాను” ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నిమురుతూ అన్నాడు.
అతని కళ్ళల్లోకి చూస్తూ అంది “నీకు నా పైన ఏర్పడిన భావన గురించి మాట్లాడు” అలసి పోయిన కళ్ళు చూసే సరికి యదువర్ మనసు కెలికినట్టయింది.
శ్రీకృష్ణుడు అంటే గోపికాలోలుడు అనే కాదు గోవర్ధనగిరి ధారుడు, ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు అని తనకు తాను అవసరం వచ్చినప్పుడల్లా అనుకునే వాడు. ఇప్పుడు ఆ దేవుడే అవకాశం ఇచ్చాడు.
“ఇక్కడ ఎక్కడ ఎర్రగులాబి పువ్వు లేదు, ఇదిగో ఈ ఎర్రటి ఆపిల్ పండు సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మా పేరెంట్స్ మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మన పెళ్లి విషయం చెప్పి..” మాట పూర్తి కాకుండానే ఆపిల్ పండు చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది.
“ఇంకా నా మాటలు పూర్తి కాలేదు అండీ..” కొంటెగా అన్నాడు.
“నేనేమి ఆపలేదు అండీ, ప్లీజ్ కంటిన్యూ..”
“చేస్తాను.. కానీ నీ స్పందన ఆపిల్ పండుపైన చూపించడం సబబుగా లేదు” ఆశ పడ్డాడు.
“పండు సాక్షి అయినందుకు పండు పైన స్పందన!” ఆశ పడడం నీ హక్కు అని అతనికి కొంచెం దగ్గరగా జరిగి కూర్చుంది.
రాజముద్ర పడ్డదనుకొని ఆలస్యం చేయక ప్రతిస్పందనగా ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. కళ్ళు మూసుకుంది, ఇక దేనికి ఆలస్యం?! హెచ్చరించింది కోరిక.. ఆ క్షణంలో ఆమె ముఖానికి చేరువవుతున్న అతని ముఖం ఆవేశం అడ్డుకట్ట తెంచుకుంది. మనసులో, శరీరంలో సుళ్ళు తిరుగుతున్న కోరిక వరద పొంగులు..
తన పెదవులతో ఆమె పెదవులను స్పృశించాడు. హృదయలయల శృతి కలుసుకున్నాయి, మధురమైన క్షణం కరిగి పోవాలని లేదు; సేద తీరింది. కలల అలల మీద పూల నావలా తేలిపోతున్న తనకు ఒక్కసారిగా ఎదల సొద తెలుసుకున్న తోడు దొరికింది.
“యదువర్, ఒకవేళ నా జీవితం తొందరగా ముగిసిపోతే? నువ్వు.. ప్రణీ..”
“స్టాప్ ద నాన్సెన్స్! అనగనగా కథలవి. మనసులో గల భయాందోళనలకు దూరంగా ఉండు, ఇప్పుడు ఎన్నో ఉపయోగదాయకమైన క్యాన్సర్ చికిత్సలు వచ్చాయి. కలిసి పోరాడదాం, గెలుపు తథ్యం!” హమీ ఇచ్చాడు.
‘స్త్రీలకు పాతివ్రత్యము, పురుషులకు ఏకపత్నీవ్రతం సర్వదా అనుసరణీయం.. అదే నా సిద్ధాంతం!’ విమెనైసర్ అని ముద్ర పడిన యదువర్ తన సోషల్ మీడియాలో, బయోపిక్‌లో రాసుకున్నాడు.
విశ్వద వాకింగ్ పూర్తి చేసి వచ్చి “ఈ ఒక్క రోజు కోసం వేరే రూమ్ ఎందుకు? ఇక్కడ ఉండిపో” అంది. ఎక్కువ వాగ్వివాదం చేయక ‘అలాగే’ అని తలాడించాడు. టీవీ పెట్టాడు. సన్నితకు నచ్చలేదని అర్థమైంది.
“యదువర్.. మీ ఫ్రెండ్షిప్ గురించి కొంచెం చెబితే వింటాను.”
“అంతగా చెప్పుకునే సంఘటనలు ఏమి లేవు మేడమ్!”
“అవునా! లేకుండానే వెతుక్కుంటూ ఇంత దూరం ఎలా వస్తావు? బిడియపడే అవసరం లేదు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పాలి.”
“ఆంటీ ఎందుకు.. అంత పట్టుదల?” సన్నిత అడిగింది.
“నువ్వు అనారోగ్యం మర్చిపోవాలి, అందమైన జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనందంగా గడపాలి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. ఆరోగ్యానికి మొదటి మెట్టు అందమైన జ్ఞాపకాలు! అందుకే మీ ప్రేమ పునాదులు చెప్పండి” విశ్వద ప్రేమగా అంది.
“నేను చెప్తాను, కానీ విసుగు అనిపిస్తే చెప్పండి, ఆపేస్తాను” యదువర్ మొదలు పెట్టాడు.
***
డిగ్రీ పూర్తి అయిన వెంటనే నాన్నగారి బిజినెస్ చూసుకోవలసినవాడు, కానీ లైఫ్‌లో యింకా ఏదో కావాలి, మరేదో చూడాలని తపన మిగిలింది. పేరు ప్రఖ్యాతులున్న ఆఫీస్‌లో మామూలు ఉద్యోగంలో చేరాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కాలర్ ఎగురవేయాలని కోరిక.
యదువర్ అమ్మానాన్నలను ఏదైన అడగలే గాని, వాళ్ళు కాదు, లేదు, వద్దు, అని ఇంతవరకు అనలేదు. ఇక అనబోరు కూడా, కొడుక్కి అంత నమ్మకం!
అందుకే ఏదైనా ఆఫీస్‌లో చిన్న ఉద్యోగం కోసం రాత, మౌఖిక పరీక్షలు నాన్నగారి సిఫారసు కాగితం ముందు దిగదుడుపే! ఎన్ని పరీక్షలు పెట్టినా వ్యర్థమే!!
యదువర్ ఉద్యోగంలో చేరాడు, ఇదో కొత్త మలుపు. స్నేహితులు, పరిచయస్థులు చదువుల కోసం విదేశాలకు వెళ్లలేదేమని ప్రశ్నలు. ‘విదేశాలు విహరించడానికి వెళతాను, పై చదువుల కోసం వెళ్ళను’ మనసులోని మాట అందరినీ సమాధానపర్చిందనుకున్నాడు, కానీ.. ‘డబ్బు పొగరు’ అని బిరుదు అంటించుకున్నాడు.
ఆఫీస్‌లో జాయిన్ అయిన కారణంగా పరిచయం ఉన్న అమ్మాయిలందరికీ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాడు. ‘యదువర్’ పేరు తెలుసుకొని కొత్తగా ఉందని, అర్థం ఏంటని అడిగారు. శ్రీకృషుడి పేరన్నాడు, ‘అందుకేనా నీకు అమ్మయిలతో స్నేహం ఎక్కువ’ ఎద్దేవా చేశారు.
‘మరోలా ఎందుకు అనుకోరు? శ్రీకృష్ణుడు ఆపద్బాంధవుడు అని సద్భావనా ఎందుకు రాదు?’ అందరూ వికృతిగా ఎందుకు ఆలోచిస్తారు?
కొందరు ముఖం పట్టుకొని అడిగారు పెళ్లి చేసుకోమని, “ఐ యామ్ సారీ” అని డైరెక్ట్‌గా జవాబు ఇచ్చి తప్పుకున్నాడు. మరికొందరు చాటుగా పిల్చి “ఐ లవ్ యు, డార్లింగ్, ప్లీజ్ మ్యారీ మీ” అని, “నువ్వు ఒప్పుకోక పోతే నేను చచ్చిపోతాను” అని, అలా ఏమిటేమిటో ఉక్కిరి బిక్కిరి చేశారు.
“సిల్లీ గర్ల్స్! ఐ పిటీ దెమ్ ఆల్. మీరంతా ఓన్లీ ఫ్రెండ్స్, అంతకంటే ఇతర వావి-వారుసలు వద్దు” అని నొక్కి చెప్పి తప్పుకున్నాడు.
ఇప్పుడు ధ్యాసంతా ఆఫీసే, ఆఫీసులో అమ్మాయిల సంఖ్య తక్కువ. ప్రతి ఒక్కరిలో ఏదో గంభీరత! కాలేజీ అమ్మాయిలు ఫ్యాషన్ పేరిట అవయవ ప్రదర్శన కోసం రకరకాల దుస్తులు ధరించేవారు. కానీ ఆఫీసులో అలాక్కాదు అందరూ చక్కగా చీరలు కట్టుకున్నారు, ఆఫీస్ పద్ధతులు పాటించాల్సిందే!
తోటి ఉద్యోగులకు యదువర్ హోదా, పరపతి తెలిసి పోయింది. అందరిదీ ఒకటే ప్రశ్న; యింత డబ్బు, పలుకుబడి ఉండి కూడా ఇంత చిన్న ఉద్యోగం చేయాల్సిన ఖర్మ ఏమిటని? అతనికి అదొక సంతృప్తి, చెప్పాలంటే గొప్పవాళ్ళ టైమ్ పాస్!
డైనింగ్ టేబుల్ పైన ఖరీదైన వివిధ రకాల వంటకాలు ఉన్నా, కొందరు నేల పైన కూర్చుని పచ్చడన్నం తినడం చాలా ఇష్టపడతారు.
అతని పక్క టేబుల్ అనూష, బాగుంటుది. ఇరవై ఏళ్లకు పైగా ఉన్నా, పదహారేళ్ల అమాయకత ముఖంలో కనబడుతుంది. ప్రతి రోజు చిరునవ్వుతో ‘విష్’ చేసుకునే అలవాటు చేసుకున్నారు. బాస్ లేనప్పుడు పర్సనల్ విషయాలు ముచ్చటించుకోవటం, చిన్న స్వరంతో జంకుతూ గుసగుస లాడేది అనూష.
అలవాటుగా యదువర్ చిన్న బహుమతులు ఇచ్చేవాడు. ముందు వద్దన్నా, ‘నువ్వు తీసికొనకపోతే నేను జాబ్ రిజైన్ చేస్తాను’ అని బెదిరిస్తే చాలు తీసుకునేది. కానీ అనూష మాత్రం గిఫ్ట్ యిచ్చే ప్రయత్నమే చేయలేదు. ఇట్స్ ఓకే! ఇది అబ్బాయిలకు సర్వసామాన్య విషయం, అమ్మాయి మనసు గెలుచుకోవడం ముఖ్యం!
(ఇంకా ఉంది)
సోషియాలజీలోనూ, ఇంగ్లీషులోనూ ఎం.ఎ. చేసిన శ్రీమతి పులి సురేఖ గారు హైదరాబాద్ హెచ్.ఎమ్.టి.లో పనిచేసి రిటైరయ్యారు.
స్కూల్ రోజుల నుంచి వీరి రచనా వ్యాసంగం కొనసాగుతుంది. సామాజిక విషయాల అనుభవాలు వీరి రచనల ఇతివృత్తాలు.
70 సంవత్సరాల వయసులోనూ ఉత్సాహంగా సాహితీసృజన చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 40 సామాజిక కథలు, నాలుగు నవలలు రచించారు. తెలుగు మరియు ఆంగ్లంలో వ్యాసాలు రాశారు. కొన్ని బహుమతులు గెలుచుకున్నారు.
