[శ్రీమతి సురేఖ పులి గారు రచించిన ‘ప్రేమే మా బలం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[సన్నిత కోసం బెంగుళూరులోని కేన్సర్ ఆసుపత్రికి వెళ్తాడు యదువర్. సన్నిత కనబడుతుంది. ఆమెకు తోడుగా వెంట ఉన్న స్త్రీ ఫోన్ మాట్లాడుతూ కొంచెం దూరం వెళ్ళగానే, యదువర్ గబుక్కున వెళ్ళి, నర్స్ సాయంతో లిఫ్ట్‌లో ప్రవేశించబోతున్న సన్నితని పలకరిస్తాడు. ఆమె కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. ఇక్కడికెలా వచ్చావని నీరసంగా అడుగుతుంది. ఈ లోపు ఆవిడ సన్నిత దగ్గరకి రావడంతో ఆవిడకి యదువర్‍ని పరిచయం చేసి, ఆవిడ విశ్వద మేడం అని చెబుతుంది. హోటల్‌లో సన్నిత వాళ్ళ రూమ్ లోనే ఉండేందుకు విశ్వదని అనుమతి అడుగుతాడు. ఆమె తొలుత అంగీకరించదు. హోటల్ వాళ్ళు అంగీకరించాడని అంటాడు యదువర్. సన్నితకి నిద్ర పట్టడంతో, అసలు నువ్వెవరు? సన్నితకీ నీకూ ఏమిటి సంబంధం అని ఆవిడ అడిగితే, తను సన్నిత ఎలా ప్రేమించుకున్నామో చెప్పడం మొదలుపెడతాడు. అందులో భాగంగా తన కొలీగ్ అనూష గురించి చెప్తాడు. – ఇక చదవండి.]
ఒక రోజు ఆఫీస్‌లో రొమాంటిక్ డైలాగుల పోరులో అనూష చేయి గట్టిగా పట్టుకున్నాడు, విడిపించుకోబోయింది; లాభం లేదు. ఆ ఉచ్చులో అనూష గాజులు పగిలిపోయాయి. అవి ఏరుకుని అనూష గుర్తుగా దాచుకున్నాడు. పరిచయమైన ప్రతి అమ్మాయి గుర్తుగా వాళ్ళకి సంబంధించిన ఏవైనా వస్తువులు దాచి పెట్టుకోవడం అలవాటు. ఎందుకంటే వారి నుండి బహుమానాలు రావు.
ఇంకా ఆఫీస్‌లో వివాహిత విశాలాక్షి, ఆఫీస్ అసిస్టెంట్ ఓంకారి, బాస్ పి.ఎ. సన్నిత ఉన్నారు. ఓంకారితో ఒకసారి మాట్లాడి, ఆమెకు టెక్కు అని నిర్ధారించుకున్నాడు. వాకబు చేస్తే తెలిసింది ఓంకారికి ఆల్రెడీ పెళ్లి నిశ్చయమైందని. సెలవు రోజుల్లో ఎక్కడైనా ఓంకారి కనబడితే పక్కన కాబోయే వరుడు వుండాల్సిందే. సర్వదా ఒకే తోడు వేసుకుని తిరిగితే బోరు పుట్టదా?
దీని మీద ప్రయోగం చేయాలనుకున్నాడు! చేశాడు, ఈ సృష్టిలో ఆడపిల్ల చిరునవ్వు ఉన్నంత మనోహరంగా మరింకేమీ లేదు అన్నట్టు సన్నిత పెదవుల మీద లాస్యం! సన్నిత అంటే ఆకర్షణ మొదలైంది.
‘నిజమైన అందం, ఆత్మకు ఎంతో ఆనందం’ అన్నట్లుగా అతను ఆమె ముఖం మీద నుంచి చూపులు మరల్చు కోలేకపోతున్నాడు. అతని మనసు అతని వశం తప్పినట్టుగా, విభ్రాంతితో కూడిన వివశత్వం పొందుతున్నట్లు ఉంది. ఇలాంటి అనుభవం అతనికి ఇదే మొదటిసారి.
అప్పుడప్పుడు సన్నిత సీరియస్‌గా ఉండేది. ఒక్కోసారి ఆ సీరియస్ తట్టుకోవడం ఇబ్బందిగా అనిపించింది. చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతుంది. అన్నీ లేత రంగు చీరలే కట్టేది. వీపు కనబడకుండా జాకెట్టు వంటినిండా వస్త్రాలు ఉన్నా అందానికి కొదువ లేని శరీర సిరులు. యదువర్ కళ్ళు, మనసు సన్నిత నుండి మరల లేక ఉన్నాయి. ఎవ్వరు, ఎప్పుడు మాట్లాడినా చాలా మర్యాదగా, మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడేది. మళ్ళీ పని చేస్తున్నంత సేపు గంభీరం!
యుక్తితో కొన్ని సార్లు, నిజాయితీతో కొన్ని సార్లు, ఆత్మీయతతో కొన్ని సార్లు జీవితాన్ని గెలవటానికి ప్రయత్నించాలి! యదువర్ దృష్టి సన్నిత వైపు మరలి నట్లు అనూష గ్రహించి, కాస్తంత ఈర్ష్య ప్రకటించింది. అనూష అడిగిన చోటల్లా వెంటేసుకుని తిరగడం మామూలైపోయింది, మరి ఈర్ష్య ఎందుకో అర్థం కాలేదు చాక్లెట్ అబ్బాయికి. అనూష మాత్రం వేరే బాయ్ ఫ్రెండ్స్‌తో ఫ్రీగా ఎందుకు ఉండాలి? బహుశా అందుకేనేమో అనూష పైన ఇంట్రెస్ట్ తగ్గి సన్నిత వైపు మళ్ళింది. కళ్ళు తెరిచినా, మూసినా ఇప్పుడు కనబడేది సన్నిత! సన్నీ.
సన్నితని చూసిన కొద్దీ చూడాలనిపించే అందం. ఎన్నో సార్లు స్వంత విషయాలు మాట్లాడబోయాడు కానీ తన చుట్టూ లక్ష్మణ రేఖ గీసుకునేది. సన్నిత లాంటి అమ్మాయిలు ప్రతీ చోట ఉంటే నేనెందుకు యిలా గర్ల్ క్రేజ్‌కు దిగజారుతాను? యదువర్ తనకు తాను సంజాయిషీ ఇచ్చుకున్నాడు.
ఆఫీసుకు ఎందుకు వస్తున్నాను అని ప్రశ్నించుకుంటే ‘సన్నిత కోసమే’ అని చెప్పవచ్చు. దినదినానికి యదువర్ వ్యామోహం పెరుగుతుంది. సన్నిత ముఖంలో ఏదో అనిర్వచనీయమైన ఆకర్షణ! భావకందని సౌకుమార్యం! ముఖ్యంగా కళ్ళు!! వాటి చూపు సోకితే చాలు చెడును కూడా విరిచి, మంచిగా మార్చ గల స్వచ్ఛత!
***
“యదూ, ఆఫీస్‌లో చేరి ఒక సంవత్సరమైంది. బిజినెస్ చూసుకో” మౌర్యరాజ్ మృదువుగా మందలించారు.
“ఇప్పుడప్పుడే కాదు నాన్నగారు” గారాల పట్టి జవాబు ఇచ్చాడు. నాన్నగారు చిన్నగా నవ్వుకున్నారు. నాన్నగారి నవ్వు కారణం సుపుత్రుడు అర్థం చేసుకోలేకపోయాడు.
ఒకరోజు సన్నిత అరగంట ఆఫీసుకు ఆలస్యంగా వచ్చింది. అడిగితే చెప్పదు కానీ కారణం కనుక్కోవాలి. ‘పుట్టిన రోజని గుడి కెళ్లిందట’ అనూష సాయంతో తెలుసుకున్నాడు.
“నువ్వు ఎంతో ధైర్యవంతుడో అనుకున్నా.. ఆఫ్టర్ అల్, సన్నీ ముందు ఇదేం పిరికితనం??” అనూష ప్రశ్నకు జవాబు ఇవ్వలేక పోయాడు.
సన్నీ వేషధారణలో ఏ మాత్రం స్పెషల్ లేదు. చాలా సింపుల్‌గా ఉంది. కూర్చున్న సీటు దగ్గరకు వచ్చి నవ్వుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసాడు, విప్పారిన కళ్ళు మెరిసి “థాంక్స్” అంది. స్వీట్స్ అడిగితే జవాబివ్వలేదు.
“మీరివ్వకపోతే, సాయంత్రం పార్టీ అరేంజ్ చేస్తాను” బెదిరింపుకు సన్నగా నవ్వింది.
“వద్దు, నేనే ఇస్తాను. కానీ ఇది ఆఫీస్, మా ఇంటికి రండి” నవ్వుతూ అడ్రస్ ఇచ్చింది.
పూలవాన కురిసింది. హాఫ్ డే సెలవు పెట్టి ఫ్యాన్సి, జ్యువెలరీ షాప్‌లు తిరిగాడు, ఎన్నో నచ్చాయి. కానీ సన్నితకు ఏం కావాలి? తన టేస్ట్ ఎలా తెలియాలి?
ఛ! నేనెంత ఫుల్ ని, ఏం గిఫ్ట్ కావాలో అడగడం మర్చిపోయాను. అమ్మాయిలకు లెక్కలేనన్ని గిఫ్ట్స్ యిచ్చిన వాడిని, సన్నీ కోసం ఎన్నిక చేయలేక పోతున్నాను. తనకు సమయస్ఫూర్తి లేదని ఖరారు చేసుకున్నాడు యదువర్!
సన్నిత ఫ్రెండ్స్ ముందు గిఫ్ట్ లేక ఖాళీ చేతులతో, ఒఫ్ఫ్! ఎంత నామోషీ! బ్రతుకు చప్ప బడుతున్నది. ఇంటికెళ్ళి తోచినంత, తృప్తి తీరా హుందాగా తయారై; పసుపు, ఎరుపు కలగలుపుగా ఉన్న విరిసీ విరియని గులాబి కోసుకున్నాడు.
ఉత్సాహం ఉరకలేస్తుంది, గుండె అదురుతుంది. కారు కంటే బైక్ బెట్టర్ అని, బైక్ స్టార్ట్ చేసి, సన్నిత స్నేహాన్ని పెంచుకుంటే, నా ఈ జీవితంలో నేను గెలిచినట్టే! బైక్ మబ్బుల పైన ఆకాశంలో ఎగురుతుంది.
ఇచ్చిన అడ్రస్ ప్రకారం సులభంగానే ఇల్లు కనుక్కోగలిగాడు ‘దాశరథి మణి’ నేమ్ ప్లేట్ చూసి, కొత్తగా ఉంది. నా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుందేమో?.. అనుకుని, కాలింగ్ బెల్ నొక్కితే గాని బయటకు రాలేదు.
డ్రాయింగ్ రూమ్ కం వరండాలో లైట్ వేసి కూర్చోమంది. యదువర్ ఉత్సాహమంతా నీరు గారి పోయింది. మామూలుగా ఇంట్లో వంట చేసుకునే ఆడవాళ్ల వలే వుందే తప్ప, గొప్పేమీ లేదు. సన్నీలో సహజంగా వుండే అందం.. అంతే! పుట్టిన రోజు అలంకరణ హొయలు లేదు!
చెరో చైర్‌లో కూర్చున్నారు. మౌనంగా కొద్ది సేపు గడిచింది. గులాబి పూవు యిస్తూ అభినందనలు తెలియ చేశాడు. ‘థాంక్స్’ అని పువ్వులు లేని వాజ్‌లో అమర్చింది.
“నా కోసం నేనిచ్చిన గులాబీని తల్లో పెట్టుకోండి” చిరునవ్వుతో అన్నాడు.
అతని కళ్ళల్లోకి చూసి “నాకు పూలు తలలో కంటే నా ఎదురుగా వాజ్‌లో ఉండటమే ఇష్టం.”
“అనూష చెప్పింది మీ పుట్టిన రోజని” వింటున్నది.
“మీ సీరియస్ నెస్ అంటే నాకు చాలా యిష్టం” జవాబు రాలేదు.
“మీరు డెయిలీ ఇంటికి వచ్చి ఏం చేస్తారు?”
“మీరు గర్ల్స్ తో కూడా ఎక్కువ మాట్లాడరు” జవాబు రాలేదు.
“మీరేమైనా మాట్లాడండి” ఓపిక నశించింది.
“ఏం మాట్లాడాలి?” అమ్మయ్య నోరు విప్పింది, యదువర్ అల్పసంతోషి కాడు. ఇంకా సాగించాడు.
“ఏదైనా జనరల్ టాపిక్.”
“మీరు స్వీట్ అడిగారు కదా..”
“అఫ్కోర్స్”
స్వీట్ దేముంది, మీతో మాట్లాడాలి. అతని మనసు ఆమె మాటల కోసం ఆరాటపడుతున్నది. లోపలికెళ్ళి చిన్న సైజు స్టీల్ డబ్బా తెచ్చింది. జుట్టు నెరిసిన ఒకతను కూరగాయల సంచి పట్టుకొని లోపలికి అడుగుపెట్టాడు.
“నాన్నా, ఇతను యదువర్.. ఆఫీస్ కొలీగ్, దాశరథి.. మా నాన్నగారు” పరిచయం చేసింది. ఇద్దరూ దేనికి సంకేతం లేని మాటలు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. సన్నిత డబ్బా పట్టుకుని వాళ్ళ మాటలు వింటూనే ఉంది.
సన్నిత నాన్నగారు రిటైర్ అయ్యారు. అమ్మ లేదు. చదువుకుంటున్న తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. నాన్నగారి పెన్షన్ మరియు సన్నిత సంపాదనతో ఖర్చులు వెళ్లదీస్తున్నారు. ఉంటున్న ఇల్లు చిన్నదైనా, స్వంతమే.
“నాన్నా, వీరికి నా పుట్టిన రోజని తెల్సిందిట, అందుకే స్వీట్ కావాలంటే, ఇంటికి రమ్మన్నాను” ఎంతో సౌమ్యంగా చెప్పింది. మందహాసం చేశారు నాన్నగారు.
డబ్బా మూత తీసి, అందులో ఉన్న చెంచాతో చక్కెర తీసింది. నాన్నగారు కూరల సంచితో లోపలికి వెళ్లారు.
“చక్కెరతో రకరకాల స్వీట్స్ చేస్తారు కదా, అందుకని మీకు నచ్చిన స్వీట్ ఏమిటో తెలియక ఇది ఇస్తున్నాను, తీసుకోండి” ముద్దు ముద్దుగా మాట్లాడే మాటలు చక్కెర కంటే తీపి!
“థాంక్ యు వెరీ మచ్” అని అరచేతిలో చెంచాడు చక్కెర పోయించుకుని తిన్నాడు. డబ్బా లోపలికి తీసుకెళ్తుంటే “మీరు కూడా తినండి.”
“ఊహూ, నాకు తీపి నచ్చదు” మృదువైన సమాధానం ఇచ్చింది సన్నిత.
“మీకు ఇష్టమైనవి ఏమిటి?” అటువైపునుంచి జవాబు రాలేదు.
మళ్ళీ వచ్చి మౌనంగా కూర్చుంది. సన్నిత మనసు అద్దంలా కనబడితే బావుడ్ను. అది కుదిరే పని కాదే! మాటలు పెంచాలి.
“మీరు ఆఫీస్ యిచ్చిన ఫోన్ కాక మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి.”
“నాకు వేరే పర్సనల్ నెంబర్ లేదు” పెడసరంగా మాట్లాడక ప్రేమగా అంటే ఏం నష్టం?
“కొత్త ఫోన్ తీసుకోండి, లేదా నేను పుట్టిన రోజు బహుమతి గా నేను ఇస్తాను” ప్రేమగా అన్నాడు.
“వద్దు. అందమైన గులాబీ ఇచ్చారు చాలు.”
వేరే అమ్మాయిలైతే ఒప్పుకుందురు. ఏమీ తోచక అన్నాడు “మీ ఇల్లు చూపించండి, టైమ్ పాస్ అవుతుంది.”
“ఇల్లు ఒకరికి చూపించుకునేంతగా కట్టుకోలేదు. అయినా రండి చూపిస్తాను.” అంటూ ప్రక్కనే ఉన్న చిన్న గదిని చూపిస్తూ, ఇది నా గది అనుకోవచ్చు” అంది.
ఆ గదికి ఎడమ వైపున ఉన్న మరో తలుపు చిన్న వరండాలోకి దారి తీస్తుంది. వరండాలో రీడింగ్ టేబుల్ ఉంది. వరండాకు ఆనుకొని మరో వైపు కొంచెం పెద్ద గది. కొంచెం ప్రక్కగా వంటిల్లు. వరండా నుండి పెరట్లోకి దారి. పెరట్లో వివిధ మొక్కల మధ్యలో ఈజీ చైర్లో పెద్దాయన నడచి వచ్చిన అలసట తీర్చుకుంటున్నారు.
ఇల్లు బాగుంది అనే కంటే, యిల్లు సర్దడంలో తీసుకున్న శ్రద్ధ నచ్చింది. మళ్ళీ ఇద్దరూ సన్నిత రూమ్ లోకి వచ్చారు. ఖరీదైన అలంకరణ ఏమీ లేదు. చిన్న టేబుల్ క్యాలెండర్, పక్కనే బుద్దుడి కంచు విగ్రహం. గోడకు శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిమ.
మాటలే లేవు, ఇంకా కూర్చోవడం సబబు కాదని లేచాడు. వచ్చేస్తుంటే ఎదురొచ్చిన సన్నిత తమ్ముడు చిన్మయ్ కుమార్, చెల్లెలు ప్రణితలను పరిచయం చేసింది.
“నన్ను అందరూ చిక్కు అని పిలుస్తారు, మరి మిమ్మల్ని ఏమని పిలవాలి?” ఎంతో ముద్దుగా బొద్దుగా ఉన్నాడు.
“నీ ఇష్టం, ఎలా అయినా పిలవచ్చు..” నవ్వుతూ అన్నాడు.
“ముందు మీ పేరు చెబితే కదా..” చిలుక పలుకులు వెలువడ్డాయి.
“నా పేరు యదువర్.. యదూ అని పిలుస్తావా?”
“వద్దు.. నాకు నచ్చలేదు.” యదువర్ కట్టుకున్న టై చూసి, దానికున్న ముడి తడిమాడు.
“మీ టై చాలా బాగుంది. నాకు టై లేదు, ఎలా వేసుకున్నారు.”
“టై వేసుకోరు, కట్టుకుంటారు” తన మెడలోని టై విప్పి చిన్మయ్ మెడలో కట్టాడు.
సంబర పడ్డాడు, టై ముడి ఎన్ని సార్లు నేర్పించనా చిన్మయ్ నేర్చుకోలేక పోయాడు.
“చిక్కు, పెద్దవాళ్ళకి సరిగ్గా కట్టుకోవడం రాదు, మరోసారి ట్రై చేయి” అని ప్రణిత అడ్డు చెప్పింది.
“మిమ్మల్ని ‘ముడి’ అని పిలుస్తాను” నవ్వుకుంటూ అన్నాడు చిన్మయ్.
చిన్మయ్ చూపులన్నీ యదువర్ బైక్ పైనే ఉన్నాయి. షోరూం బైక్ వలె ఉంది. వీధి చివరి దాకా వెళ్ళాక వెనుతిరిగి చూశాడు. సన్నిత బదులు ప్రణిత తన చేయిని గాలిలో ఊపుతుంది. ఛ! సన్నీ నుండి ఆశించిన వీడ్కోలు రాలేదు, అందుకే తిరుగు జవాబు యివ్వక బండి వేగం పెంచాడు.
***
మళ్ళీ ఆఫీస్‌లో దర్శనం. పనిగట్టుకుని నవ్వుతూ “సన్నిత గుడ్ మార్నింగ్!” తిరుగు జవాబులో ప్రత్యేకత ఏమీ లేదు. అందరికీ చెప్పినట్టు ఉంది; తన పనిలో నిమగ్నమైనది.
అతనికి ఆఫీస్ వర్క్ బోర్ కొడుతుంది. సన్నిత.. హు! నన్ను చాలా దూరం పెట్టేస్తుంది. ఎన్నో.. మరెన్నో సార్లు దగ్గరవుదామని ప్రయత్నించాడు కానీ ఓడిపోయాడు. ఆడవారికి అహం, మొండితనం మంచిది కాదు.. ఒళ్ళు మండింది.
ఆ తాపంలో అనూషకు మళ్ళీ దగ్గర అయ్యాడు. అనూష ఎలా చెబితే అలా వింటుంది, యదువర్ కంటే అతని డబ్బు మీద ఆకర్షణ ఎక్కువ! అలా అని అతను ఏ అమ్మాయిని శారీరకంగా కోరుకోలేదు. జీవిత భాగస్వామికి యిచ్చే స్థానం, వేరే ఎవరికి ఇవ్వకూడదు. నిర్ధారణకు కట్టుబడి ఉన్నాడు.
అనూషను వెంటేసుకొని ట్యాంక్ బండ్ వద్ద యదువర్ బైక్ మెల్లిగా వెళుతుంది. ఎక్కడో, ఏదో అసంతృప్తి. ఎందుకో తెలియని కసి, కక్ష్య. ఎవరి మీద పగ తీర్చుకోవాలి; తెలియట్లేదు. అందుకే ఈ మధ్య అతని మనసు దైవ సన్నిధి వాంఛిస్తూన్నది.
కన్నులు చెదిరే కాంతులతో మెరిసి పోయే బిర్లా మందిరం కనబడింది. ఒకసారి దేవుని దర్శించాలని కోరిక బలీయమైనది. మెర్క్యురీ లైట్ల వెలుగులో అనూష చాలా ఆకర్షణీయంగా ఉంది. ముఖంలో ఆనందం బదులు భయం కనబడుతుంది. కారణం అడిగాడు “బాయ్ ఫ్రెండ్స్‌తో ఏ చోటుకయిన వెళ్లొచ్చు, కానీ దేవుని గుళ్ళు అంటే భయమేస్తుంది, ఏదో తప్పు చేస్తున్న భావన” అమాయకత! ఐ పిటి హర్! జాలి ప్రదర్శించి అనూష చేతిని పట్టుకుని అడుగులు ముందుకు నడుస్తున్నాయి.
వాతావరణం ఎంతో చల్లగా, ప్రశాంతంగా ఉంది. మనసుకు ఆహ్లాదాన్ని యిచ్చే దేవుని మందిరం. “ఒఫ్! నాలో కవి లేడు, కవిత్వం అల్లేద్దును.” వాతావరణాన్ని ఆస్వాదిస్తూ దేవుని మొక్కడం మరిచిపోయాడు. అనూష బుద్ధిగా మొక్కింది. తొందరగా వెళ్ళి పోదామని హడావిడి చేసింది. వెళ్లాలని లేక ఇంకాస్సేపు ఉందామని యదువర్ కోరిక, ఒక ప్రక్కగా ఉన్న మెట్లు దిగి వస్తున్న వారికి ఆశ్చర్యమేసింది. సన్నిత!.. పాలరాతి మెట్లు పైన కూర్చొని ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తుంది, వాళ్ళిద్దరిని చూడలేదు. సన్నితని చూసి అనూష వెళ్ళిపోదామని మరీ తొందర పెట్టింది. ఇంత కంటే మంచి ఛాన్స్ మరొకటి లేదని ముందడుగు వేశాడు. అనూష మనసు ఉడికి పోతున్నదని తెల్సుకున్నాడు.
“హాయ్! సన్నిత,.. మీరేప్పుడొచ్చారు?” ఆనందాశ్చర్యలలో ఎదురుగా నిలుచున్నాడు.
“హలో! కొంచెం సేపు క్రిందటే.. హలో అనూష..” సన్నిత కనబడగానే ముందుగా ఆకర్షణ అన్పించేవి ఆమె కళ్ళు! చాలా అందమైన విప్పారిన కళ్ళు!!
ఆ కళ్ళు; అనుమానం లేదు, సన్నిత ఏడ్చింది. కళ్ళు ఉబ్బి, తెలుపు రంగు బదులు ఎరుపు రంగు కనబడుతుంది.
సన్నిత గుడికి వచ్చి బాధ పడే విషయం ఏమిటి? తనను బాధ పెట్టేంత ధైర్యం ఎవరికుంది? కనుక్కోవాలి.
అనూష ఏవో జోక్స్ చెప్పగానే తెగ నవ్వుతున్నారు యిద్దరు. యదువర్ మొహమాటం కోసం నవ్వినా, మనసు పరిపరివిధాలుగా ఆలోచిస్తుంది. ఏమైంది నా ప్రియురాలికి?
సన్నిత నవ్వే నవ్వులో ఆనందం లేదు. బాధను కప్పిపుచ్చే నవ్వు అది. అనూషకు ఏం తెలుసు? ‘బాస్ పి.ఎ. సన్నీ నవ్వుతుంది’ అంతే చాలనుకుంది.
“చీకట్లో ఒక్కరే ఎలా వెళతారు?” యదువర్ ఆందోళన తెలియజేశాడు.
“వెలుగు నుండి వచ్చినంత మాత్రాన, వెలుగులోనే గమ్యం చేరుకోవాలని ఏముంది? చీకటిని కూడా చూడకపోతే, యిది జీవితమే కాదు.”
“మీలా డైలాగ్స్ మాట్లాడటం నాకు రాదు.”
“నాది డైలాగ్ కాదు, నిజం!”
టాపిక్ మార్చింది అనూష. చాలా సేపు మాట్లాడుకున్నారు. టైమ్ ఎనిమిది దాటింది. ముగ్గురు కలిసి దిగి కిందికి వస్తున్నారు. ఆశ్చర్యమేసింది, అనూషకు ఇంటికి ఆలస్యంగా వెళ్లడం అలవాటు, కానీ సన్నిత లాంటి అమ్మాయి ఇంటికి ఆలస్యంగా వెళ్ళుతుందా? అసలు సన్నిత గురించి స్టడీ చేయాలి.
“సన్నిత, మీరు మళ్ళీ మీ ఇంటికి పిలువలేదు?”
తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. ఆమె అలా చూసేసరికి అతనకి నరనరాలలో విద్యుత్ ప్రవహించే భావన కలిగింది. మళ్ళీ మళ్ళీ చూస్తే మరీ ఇష్టం. మాయ చేసి మత్తెక్కించే కలువ కళ్ళు! కానీ సన్నిత అలా చూసి తలదించుకుని జవాబు చెబుతుంది. సభ్యత, ఇంగిత జ్ఞానం అనేవి ఏవో ఉన్నాయి కాబట్టి నిలదొక్కుకున్నాడు లేకుంటే తాను నిలబడిన చోటు తన రూమ్ అయితే సన్నిత తలను రెండు చేతులతో పైకెత్తి ‘నా కళ్ళల్లోకి చూసి మాట్లాడు..’ అని ఆ మాయలో జారిపోవాలని కోరిక, కార్యరూపేణా సంతోషం పొందేవాడు.
“స్నేహితుడని మిమ్మల్ని పరిచయం చేశాను. నా స్నేహితులు నా ఇంటికి రావడానికి ప్రత్యేక ఆహ్వానం అవసరం లేదు. ఎప్పుడైనా రావచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు.” అందం, ఆరోగ్యం విరబూసిన పారిజాతం లాంటి ముఖం.. ఆమె పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు మెరిసింది.
బుక్ చేసిన ఆటో కోసం సన్నిత కళ్ళు వెతుకుతున్నాయి. అందరి కళ్ళల్లో నలుసు పడితే బావుండును, ఒక సారి తృప్తి తీరా సన్నితని ముద్దు పెట్టుకునేవాడిని! అంతగా నచ్చింది.
ఆటో రావడం, ఇద్దరికీ బై చెప్పి కదిలి పోవటము జరిగిపోయాయి. అనూషను ఇంటి వద్ద డ్రాప్ చేయాలని బైక్ స్టార్ట్ చేశాడు.
దారిలో అనూష అంది “సన్నిత అంటే నాకు ఒళ్ళు మంట, ఏదో ఆఫీస్‌లో బాస్ పి.ఎ. అని మామూలుగా మాట్లాడితే, జస్ట్ అటెన్షన్ గ్రాబ్ చేసే రకం.”
జవాబు యిచ్చే మూడ్‌లో లేడు. “బాయ్స్‌తో ‘ఫ్రెండ్’ అని ఒక టాగ్ పెట్టి ఫ్రీగా ఉంటుంది, కానీ ధైర్యంగా బాయ్స్‌తో తిరిగే మజా తెలియదు. మోస్ట్ కన్నింగ్ మెంటాలిటీ” వింటూనే ఉన్నాడు.
“ఆ ఫేస్‌లో ఒక అట్రాక్షన్ లేదు, అందం లేదు. ఎప్పుడూ సీరియస్ ఫేస్ పెడితే, ఈగల్లా మగాళ్లను తన చుట్టూ తిప్పించుకోవాలనే తపన!”
ఇక నోరు విప్పక పోతే, ఆక్సిడెంట్ చేస్తాడేమో, “హేట్ చేయడానికి యిన్నేనా కారణాలు?”
“ఇవి చాలవా? ఇంకా కావాలా?” ఒక అమ్మాయి వేరే అమ్మాయిని ఇష్టపడకపోతే అసూయతో అంతగా అయిష్టం ఎందుకో అర్థం కాలేదు అతనికి.
“అయినా.. బీయింగ్ ఎ లేడీ, మరో లేడి పైన బ్యాడ్ డిస్కషన్ గుడ్ కల్చర్ కాదు.” ప్రేమిస్తున్నాను అని నిర్ధారణ చేసుకున్న ప్రేయసి పట్ల దుర్భాష సహించలేక అన్నాడు.
“ఓకే. టాపిక్ మారుస్తాను, నన్ను మ్యారేజ్ చేసుకునే వుద్దేశ్యం ఏమైనా ఉందా?” వీపు పైన ఐ లవ్ యు అని గోటితో రాస్తూ గోముగా అడిగింది.
“నేను నా మేరేజ్ విషయంలో సెల్ఫిష్” అన్నాడు.
“సెల్ఫిష్, మీన్స్..” అమ్మయ్య! జవాబు చెప్పడం తప్పింది, అనూష వాళ్ళ ఇల్లు వచ్చేసింది.
***
యదువర్ అనూష పుట్టిన రోజు నాడు ఆఫీస్‌లో హంగామా చేశాడు. స్టాఫ్ అంతా బాగా ఎంజాయ్ చేశారు.
తెల్లారి బాస్ అనూషను పిలిచి వార్నింగ్ యిచ్చాడు. ‘పార్టీ యిచ్చింది, ఆఫీస్ అంతా అల్లరి గోల చేసిన వాళ్లు ఒకరైతే చివాట్లు వేరొకరికి; నాన్న గారి పలుకుబడి మహిమ!! పాపం అనూషకు వార్నింగ్!’
సడన్‌గా సన్నిత, అనూష బాస్ రూమ్ లోకి వెళ్లారు. లోపల ఏదో గొడవ జరిగింది. ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. అనూషను మాటల్లో పెట్టి గొడవకు కారణాలు తెలుసుకున్నారు స్టాఫ్. గంట లెక్చర్ యిచ్చింది.
బాస్ కోపానికి కారణం సన్నిత యిచ్చిన కంప్లెంట్ అని అనూష అపోహ! థర్డ్ క్లాస్ తిట్లు తిట్టింది. సన్నిత గురించి చేదుగా, అసహ్యంగా మాట్లాడితే భరించలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు యదువర్.
(ఇంకా ఉంది)
సోషియాలజీలోనూ, ఇంగ్లీషులోనూ ఎం.ఎ. చేసిన శ్రీమతి పులి సురేఖ గారు హైదరాబాద్ హెచ్.ఎమ్.టి.లో పనిచేసి రిటైరయ్యారు.
స్కూల్ రోజుల నుంచి వీరి రచనా వ్యాసంగం కొనసాగుతుంది. సామాజిక విషయాల అనుభవాలు వీరి రచనల ఇతివృత్తాలు.
70 సంవత్సరాల వయసులోనూ ఉత్సాహంగా సాహితీసృజన చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 40 సామాజిక కథలు, నాలుగు నవలలు రచించారు. తెలుగు మరియు ఆంగ్లంలో వ్యాసాలు రాశారు. కొన్ని బహుమతులు గెలుచుకున్నారు.
