[శ్రీమతి సురేఖ పులి గారు రచించిన ‘ప్రేమే మా బలం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఓ రోజు సన్నిత ఇంటికి వెళ్తాడు యదువర్, ఒక మాట అడుగుతాను నిజం చెప్పాలి అంటాడు. పర్సనల్ విషయాలు తప్ప మరేవైనా అడగమంటుంది. సన్నిత అనూష ఎందుకు మాట్లాడుకోవడం లేదో చెప్పమంటాడు. ఆమెకి తనంటే కోపమని, ఆఫీసులో ఆమె మీద తనే ఫిర్యాదు చేసిందని భావిస్తోందని చెప్తుంది సన్నిత. ఉద్యోగం మానేసి తండ్రి వ్యాపారంలో సాయంగా వెళ్తాడు యదువర్. అతనికి పరిచయమైన అమ్మాయిలందరికీ పెళ్ళిళ్ళయిపోతాయి. ఫ్రెండ్షిప్ పేరిట అమ్మాయిల సంసారాల్లో కలతలు రేపొద్దని మౌర్యరాజ్ కొడుకుని హెచ్చరిస్తాడు. అమ్మ యదువర్‌ని పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేయడం మొదలుపెడుతుంది. దాశరథి సన్నితకి పెళ్ళి సంబంధాలు చూస్తుంటాడు. బిజినెస్‌లో శిక్షణ కోసం యదువర్‌ని విదేశాలకు పంపదలుస్తాడు మౌర్యరాజ్. ఆ సందర్భంగా యదువర్ ఓ పార్టీ ఇస్తాడు. సన్నిత పార్టీకి రాకపోడంతో కోపగించుకుని ఆమె ఇంటికి వెళ్తాడు. ఆమె ఆ సమయంలో దాశరథి మందుల కోసం బయటకి వెళ్తుంది. ప్రణీత యదువర్‌ని ఆహ్వానించి కూర్చోమంటుంది. అనారోగ్యంతో ఉన్న దాశరథిని చూస్తానంటాడు. ప్రణీత వద్దంటుంది. కారణమడిగితే, వాళ్ళ ఫ్యామిలీ అంటే దాశరథికి నచ్చదని చెప్తుంది. ప్రణీతని ఒప్పించి, నిద్రపోతున్న దాశరథిని చూస్తాడు యదువర్. సన్నిత రాగానే, దాశరథిని ఉడిపి తీసుకెళ్ళి ఆయుర్వేద ట్రీట్మెంట్ ఇప్పించడానికి ఒప్పిస్తాడు. యదువర్ చేసిన ఏర్పాట్లతో ఉడిపి వెళ్ళి, దాశరథిని ఆయుర్వేద ఆసుపత్రిలో చేర్పిస్తారు. అటెండెంట్‍గా మగవారే ఉండాలనడంతో తానే ఉండిపోతాడు. దాశరథికి చికిత్స జరుగుతూంటుంది. ఈ క్రమంలో దాశరథి, యదువర్‍లు మనసు విప్పు మాట్లాడుకుంటారు. అపోహలు తొలగిపోతాయి. ఒక రాత్రి పూట యదువర్‌కి – అతని బాబాయి, తన చెల్లెలు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారనీ, ఆ పెళ్ళికి యదువర్ తండ్రి మౌర్యరాజ్ అంగీకరించలేదని చెప్తాడు దాశరథి. శౌర్యరాజ్, మనోజ్ఞలు చనిపోయాకా, ఎప్పుడైనా మా నాన్నగారిని కలిసారా అని అడుగుతాడు యదువర్. లేదంటాడు దాశరథి. తన తండ్రి పశ్చాత్తాపం గురించి, బాబాయి ఆస్తులని జాగ్రత్తగా కాపాడడం గురించి చెప్తాడు. – ఇక చదవండి.]
“అంకుల్, నాన్న బాత్‌రూమ్‌లో కాలు జారి పడ్డారట, అమ్మ ఫోన్ చేసింది. మీ డిశ్చార్జ్ కాగానే వెళ్లిపోదాం. మరెప్పుడైనా ఉడుపి కృష్ణుడు గుడికి వెళ్దామా, ప్లీజ్..”
“అయ్యో పాపం, అలాగే మనం బాగుంటేనే గుళ్ళు, గోపురాలు” నిరాశ పడ్డాడు.
డిశ్చార్జ్ రోజు యదువర్ క్రెడిట్ కార్డుతో రెండు లక్షల పైన బిల్ కట్టాడు. “బి.పి. కంట్రోల్‌లో ఉండాలి. ఇక్కడ అభ్యాసం చేసిన ఆరోగ్యం నియమాలు సక్రమంగా పాటించాలి. ఇప్పుడు రాసిచ్చిన గుళిక మాత్రలు, కషాయాలు తీసుకోవాలి, అప్పుడే పూర్తిగా కోలుకుంటారు” అన్నారు డాక్టర్.
***
కెంపెగౌడ విమానాశ్రయం చేరుకున్న తర్వాత విశ్వద భర్తకు ఫోన్ కలిపింది “నీ డ్రైవర్ లీవ్‌లో ఉన్నాడు. నా డ్రైవర్ నన్ను పికప్ చేస్తాడు, మిగతా అంతా నార్మల్” అవతల ఫోన్ కట్ అయింది.
చెక్ ఔట్ అయిపోయింది.
“ఆంటీ, నా కారు ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ వద్ద ఉంది. నేను సన్నితను డ్రాప్ చేస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి.”
విశ్వద నుండి ‘నో, వద్దు’ అనే జవాబు రావద్దని ఎంతో నమ్రతగా, రెండు చేతులు కట్టుకుని చెప్పాడు యదువర్.
ముగ్గురి మనసులో ఒకటే భావన! విశ్వదకు తొందరగా ఇంటికి వెళ్ళాలి. వెళ్లి కొడుకు చదువు, కోచింగ్ ఎలా సాగుతున్నది అనే ఆదుర్దా.
నాన్న ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత ఎలా కోలుకుంది కనులారా చూడలేదు. ఆంటీ కారులో ఇంటికి వెళితే ఆరోగ్య సూత్రాలు వినలేక విసుగు పుడుతుంది. యదువర్ కార్లో అయితే ఆరోగ్య సూత్రాల కంటే ఆనందం ఎక్కువ, అనుకుంది సన్నిత.
యదువర్ మనసులో ఏకాంతం కావాలని ఆతృత!
యదువర్ ఆలోచన ఇద్దరికీ భిన్నంగా ఉంది. విమానాశ్రయం నుండి వచ్చి వెయిటింగ్‌లో ఉన్న తన కారులో సన్నితతో పాటు నేరుగా ఫ్రూయిట్స్ జ్యూస్ షాప్ వద్దకు తీసుకెళ్ళాడు. ఆవురావురుమని మూడు రకాల జ్యూసులు తాగేసాడు. తన వంతుగా పుచ్చకాయ జ్యూస్ తీసుకుంది. అతని వింత దప్పిక ప్రవర్తనకు ఆశ్చర్యపోయింది.
“నేనింతే, నేను టీ, కాఫీల కంటే ఎక్కువ ఇలాంటివి ఇష్టపడతాను” ఆమె కళ్ళల్లో ప్రశ్నకు జవాబు ఇచ్చాడు.
“కొన్ని గంటలు ఎక్కడైనా హోటల్ వెళదామా?”
“ఎందుకు? వద్దు.. నన్ను ఇంటి వద్ద డ్రాప్ చేయి..”
“ఈ రోజు తప్పకుండా మీ ఇంటి వద్ద వదులుతాను, బట్.. కొన్ని గంటలు మనం ప్రైవేట్‌గా మాట్లాడుకుందాం, ప్లీజ్..!”
ఖాళీ జ్యూస్ గ్లాసును ఒక చేత్తో మరొక చేయి ఆమె అరచేతిని పట్టుకొని అర్థిస్తున్నాడు.
“సరే మాట్లాడుకుందాం, కానీ హోటల్ వద్దు, ఎక్కడైనా కారు ఆపి.., నాకు చాలా నీరసంగా ఉంది, కబుర్ల కంటే కొద్ది సేపు పడుకోవాలని ఉంది.”
“నీరసంగా ఉంటే ఇంకో గ్లాస్ జ్యూస్ తాగుతావా?”
“ఉహు, వద్దు.. టైర్డ్ ఫీలింగ్.. టైమ్ వేస్ట్ చేయక, నువ్వు చెప్పాల్సిన విషయం తొందరగా చెప్పాలి.”
అందరూ అమ్మాయిలతో రెస్టోరెంట్ వచ్చినట్టు కాదు. పెళ్లికి సముఖంగా ఇద్దరం ఇష్టపడ్డాం కదా అని మనసులోని కోరికలు వెర్రితలలు వేయడం లేదు, తదుపరి కర్తవ్యానికి ప్రాధన్యత!
“ఎక్కడికి వద్దు, ఇక్కడే కూర్చుందాం. నువ్వు సూటిగా చెప్పగలిగావు, నేను సూటిగా అడుగుతున్నాను..”
ఏమిటి అన్నట్టు చూసింది.
“మా అమ్మానాన్నల తర్వాత నా పైన, నా క్యారెక్టర్ పైన నమ్మకం ఉండి నన్ను ఇష్టపడుతున్నందుకు అంటే నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్!! ఇన్ అదర్ వర్డ్స్.. ఐ జస్ట్ లవ్ యు టిల్ మై.. లాస్ట్ బ్రీత్!!”
మధ్యలో ఆపేసింది. “క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని నేను వచ్చాను, మొదటి శ్వాస! చివరి శ్వాస!! అనే మాటలు వద్దు.. వేరే ఏదైనా మాట్లాడదామా?”
“ఐం సారీ! అందరూ నన్ను వుమెనైజర్ అని తోక అంటిస్తే కూడా నన్ను ఇష్టపడటానికి కారణం తెలుసుకోవాలని, ప్లీజ్.. మళ్లీ ఏదో అడ్డు చెప్పి నన్ను ఆపకు.”
“ఆల్రెడీ హోటల్ రూమ్‌లో చెప్పాను కదా, మళ్లీ కొత్తగా ఎందుకు అడుగుతున్నట్టు?”
“నా గురించి నీ నుండి మంచి మాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరక అడిగాను. బహుశా ఇంకా ఎన్నో సార్లు అడుగుతానేమో!”
సన్నిత చిన్నగా నవ్వుకుంది “అయితే విను.. ఎవరో ఏదో అంటే నేను అంత సులువుగా స్పందించను. ఆ పనికిమాలిన మాటలు.. ఏమో నాకు నమ్మబుద్ధి కాలేదు. ఎంత మంచిగా ఉన్నా సమాజంలో అమ్మాయిలు, అబ్బాయిల పైన ఏవో వదంతులు వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు నేను నిన్ను గమనించే దాన్ని, ఎందుకో గాని నువ్వంటే సదభిప్రాయం నిలిచిపోయింది. మా నాన్నతో చెబితే ‘నీకు అతని వైపు ఆకర్షణ పెరుగుతుంది, అంతే కానీ అది ప్రేమ కాదు’ అని నచ్చ చెప్పారు” చెప్పడం ఆపింది.
“అపకు, ప్లీజ్.. నాకు ఇంకా వినాలని ఉంది.”
“కానీ.. నాన్నకు మీ ఫ్యామిలీ పైన మంచి అభిప్రాయం లేదు, మొండి పట్టు పట్టి ఎంతో గౌరవించే దేవుడి ప్రతిరూపమైన ‘నాన్నను’ కాదని నేను జీవించలేను.”
“హలో.. సన్నీ.. ఇప్పుడు ఇక్కడ ఆపాలి.”
“ఎందుకు?”
“నేను చావు బతుకుల గురించి మాట్లాడితే క్యాన్సర్ యుద్దాన్ని జయించి వచ్చాను, ఇక అలాంటి మాటలు వద్దన్నావు. మరి నువ్వేంటి ‘జీవించలేను’ అని నాకు ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నావు?” గట్టిగా నిలదీశాడు.
పక పకా నవ్వింది. అందమైన నవ్వుకు జత కలిపాడు. కొద్దిసేపు ఇద్దరికీ మాటలు లేవు. ఒకరి కళ్ళ లోతుల్లో మరొకరు ఆనంద ఆహ్లాదాన్ని వెతుకున్నాయి.
చిన్న పిల్లల కేరింతలతో పక్క టేబుల్ నిండి పోయింది. బిల్లు చెల్లించి బయటికి వచ్చారు.
“యదువర్..” చిటికెన వేలు పట్టుకుంది. ఆమె అరచేతిని తన అరచేతిని మద్దతుగా అందించాడు.
“మా నాన్నతో నేను ఫ్రెండ్ పెళ్లి అని అబద్ధం చెప్పాను, నా అనారోగ్యం సంగతి చెప్పొద్దు.”
“సరే, నువ్వు కూడా మా పేరెంట్స్‌తో క్యాన్సర్ గురించి అసలు లైఫ్ లాంగ్ చెప్పొద్దు, ప్రామిస్! ఇదే మనిద్దరి సామరస్యానికి పునాది!!”
“ఆర్నెల్లకోసారి హాస్పిటల్ చెక్ అప్ వెళితే మీ వాళ్లకు తెలుస్తుంది కదా? అప్పుడేలా మేనేజ్ చేద్దాం?” అనుమానంగా అడిగింది.
“ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం, ఎందుకంటే ఇంకా మన సొసైటీలో ఆదర్శాల ఆచరణ దూరం ఉంటూనే ఉంది. నీ అనారోగ్యం గురించి మనిద్దరితో పాటు మీ చెల్లెలికి కూడా తెలుసు, కొంచెం జాగ్రత్తగా ఉంటే సరి.”
“ఎందుకు? నా అనారోగ్యం గురించి పెళ్లికి ముందే తెలిస్తే మీ పేరెంట్స్ ఒప్పుకోరని అనుమానమా?” అణచుకున్న బాధ ఆగలేదు.
“తెలియదు, ఏమో..? నాకు రిస్క్ తీసుకోవాలని లేదు. చెప్పకపోతే నష్టం ఏమి లేదు. చెబితే మనం ఒకటి కాలేమేమో అని చిన్న తడబాటు!”
అతని అరిచేతిని ఆమె ఎదకు హత్తుకుంది. అతని చేతిని వెనక్కి తీసుకోలేదు, ఆమెతో భుజాన్ని కలిపి కారు వైపు నడిచారు.
***
“హలో, మీ నాన్నగారికి ఎలా ఉంది?” ఉండబట్టలేక సన్నిత యదువర్‌కు ఫోన్ చేసింది.
“ఓకే, ఫరవాలేదు. కొంచెం కుడి కాలు మడమ బెణికింది. కంప్రెషన్ ర్యాప్ కట్టుకున్నారు. కొన్ని రోజులు రెస్ట్ అంతే. హౌ అబౌట్ యువర్ డాడ్?”
“గుడ్, ఇంప్రూవ్డ్ మచ్; నాన్న అలవాట్లలో మార్పు వచ్చింది. డల్ గా లేరు. థాంక్స్ టు యు.”
“వెల్కమ్. వాట్ మోర్?”
“నథింగ్, జస్ట్ కాసువల్ కాల్.”
“మీ నాన్న హాస్పిటల్‌లో జరిగిన డిస్కషన్ చెప్పారా?”
“లేదు, చెప్పలేదు. వై.., ఎనీ సీరియస్?”
“నథింగ్ లైక్ దట్. నాకు మీ డాడ్ మధ్య జరిగిన హాస్పిటల్ మాటర్ మెయిల్ చేస్తాను. ప్లీజ్ గో త్రు.”
“జస్ట్, చూచాయగా ఔట్లైన్ చెప్పొచ్చు కదా!”
“నీ మనసులోని మాట, మీ నాన్న ద్వారా తెలిసింది. అఫ్కోర్స్ ఐ యామ్ వెరీ హ్యాపీ!” అటు వైపు నుండి జవాబు రాలేదు. మళ్ళీ అన్నాడు “హలో, ఆర్ యు దేర్?”
కళ్ళల్లో మెరుపు మెరిసింది “నీ మెయిల్ కోసం వెయిటింగ్!” ఫోన్ పెట్టేసింది.
చిన్మయ్ గేమ్స్ ఆడాలి, ప్రణిత యూట్యూబ్ స్క్రోల్ చేయాలి, సన్నిత యదువర్ పంపే ఈమెయిల్ చూడాలి, అందరికీ అర్జెంటుగా ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి, హడావిడి! ఆఫీస్ ఇచ్చిన ఫోన్లో రెడ్ అండ్ గ్రీన్ బటన్ లతో తృప్తి లేదు. అవసరాలు, అనుకూలతలు పెరుగుతున్నాయి. ఈమెయిల్ చదివి, మనసులో నాన్నకు థాంక్స్ చెప్పుకుంది సన్నిత.
***
ఎక్కువ రోజుల వ్యవధి లేకుండా, యదువర్ తల్లిదండ్రులు మౌర్యరాజ్, యామిని పళ్ళు, మిఠాయిలతో దాశరథి ఇంటికి విచ్చేశారు.
“మీ ఆరోగ్యం పూర్తిగా నయం అయిన తర్వాత ఇల్లు కదలాల్సింది” దాశరథి బిడియ పడుతూ అన్నాడు.
“మూల్గిన కొద్ది రోగం పెరుగుతుంది. ఇప్పుడు బాగానే ఉన్నాను. మీరు కోలుకున్నారా? అన్నీ సక్రమంగా పాటిస్తున్నారా?”
“అన్నీ తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాను. ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే..”
“మీ ఆఫీసు బ్లాక్ లిస్టెడ్ అని చదివాను.”
“అవును. అంతా బ్లాక్.. నలుపు! దేశం ఎంతో పురోగతి సాధిస్తుంది అని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ నా లాంటి వారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో!..”
“ఒకసారి అటు వైపు వెళ్ళాను, అంత పెద్ద పేరు గాంచిన ఫ్యాక్టరీ పాడుపడి ఉంది. ఎవరిది తప్పు అంటారు.”
“ఎవరిది? ఉద్యోగులు మేనేజ్మెంట్ తప్పు అంటారు; మేనేజ్మెంట్ గవర్నమెంట్ తప్పు అంటుంది; గవర్నమెంట్ లాభాలు లేని కంపెనీలకు నిధులు ఇవ్వనంటుంది. ముందున్న వాడి నునుపైన వీపు తన్నాలని అనుకుంటారే తప్ప, ముందున్న ముక్కు శ్వాస తీసుకోలేక ముప్పు తిప్పలు పడుతుందని కొంచెం ఆక్సిజన్ అందించలేరు.”
సన్నిత ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చింది. “ఆల్రెడీ మా వాడు నాకు ఇష్టమైన వాటి గురించి చెప్పాడేమో” మౌర్యరాజ్ సంతోషంగా జ్యూస్ తీసుకుంటూ యామిని వైపు చూస్తూ ఏదో సైగ చేశాడు.
“పాత విషయాలు అన్నీ మర్చిపోయి, కొత్తగా పిల్లలు పెంచుకున్న స్నేహం ఆధారంగా మేము మీ అమ్మాయి సన్నితను మా ఇంటి కోడలు కావాలని అడగడానికి వచ్చాము.”
దీర్ఘకాలిక, అపరిష్కృత సమస్యలకు పరిష్కారం దొరుకుందని ఎంతో ఆశగా ఉన్నా ఎప్పటికప్పుడు నిరాశే మిగిలింది. కానీ ఇప్పుడు!
దాశరథి చాలా సేపు మౌనంగా ఉన్నాడు. కళ్ళల్లోని చెమ్మ కనబడనీయక ప్రయత్నించాడు. జీవితంలో ఎప్పుడైనా, ఎప్పటికైనా, నైతిక జీవన విలువలు ఎంత ముఖ్యమో, ఆప్యాయతలు, అనుబంధాలు, వారసత్వాలు కూడా అంతే అవసరం. బొంగురు గొంతుతో అన్నాడు, “నాకూ మన బంధుత్వం నిలుపుకోవాలని ఉంది. మీ అందరితో పాటు నేను ప్రయాణం సాగిస్తాను. పాత విషయాలు కాదు కానీ శుభకార్యాలకు ‘మణి’ లేదు.. నేనొక్కడినే సర్దుకోగలనా అనే సందిగ్దం!”
“మనిషి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది, అందరూ కలిసి సంతోషంగా చేద్దాం, మీరు వర్రీ అవకండి” ఓదార్పుగా అన్నాడు మౌర్యరాజ్.
“వాళ్లిద్దరి మనోబలం అలా ఉంది మరి” యామిని సంతోషంగా సన్నిత వైపు చూస్తూ అంది.
బెరుకుగా చూస్తున్న చిన్మయ్‌ని ‘రమ్మని’ సైగ చేశాడు మౌర్యరాజ్. చిన్మయ్ చప్పున సన్నిత వొళ్ళో కూర్చున్నాడు. అరచేతి మందం క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చాడు, ముందు వద్దని బెట్టు చేసి, దాశరథి ‘చిక్కు తీసుకో’ అనగానే తీసుకున్నాడు.
“ప్రణిత.. నా చిన్న కూతురు డిగ్రీ ఐయింది, ఉద్యోగ ప్రయత్నంలో ఉంది” పరిచయం చేశాడు దాశరథి.
కూర్చునేందుకు ఖాళీ కుర్చీలు లేక, “కిచెన్‌లో కొంచెం పని ఉంది” అని తప్పుకుంది. కిచెన్ పని కాదు; ఎప్పటికప్పుడు పెద్దల మధ్య జరిగే పెళ్లి సంభాషణ ‘లైవ్’ ఫోన్ ద్వారా యదువర్‌కు తెలియ జేస్తుంది.
“పెట్టిపోతల విషయానికి వస్తే నేను.. అదే; నా ఆర్థిక పరిస్థితి గొప్పగా లేదు. ఆ క్రమంలో మీరు ప్లాన్ చేయండి. నేను అనుసరిస్తాను” తడబడుతూ అన్నాడు దాశరథి.
“మీరు అన్యథా అనుకోవద్దు మేము, మీ అనుమతి లేకుండా ఒక ప్రోగ్రాం అనుకున్నాము. అఫ్కోర్స్, మీకు నచ్చకపోతే కాన్సెల్ చేద్దాం.”
“చెప్పండి” మనసును అదిమి పట్టి అన్నాడు.
“ముహూర్త బలం చూసుకొని మనం అందరం శ్రీ శృంగేరి శారదా దేవి పీఠం వెళ్ళి మీ అమ్మాయి, మా అబ్బాయిల వివాహం జరిపిద్దాం. తిరుగు ప్రయాణంలో ఉడుపి ‘శ్రీకృష్ణ’ దేవస్థానం వెళ్దాం. మీ కోరిక మేరకు ‘గోపూజ’ చేయించుకుందాము. తర్వాత మల్పే బీచ్ చూసుకొని మనం బయలుదేరి వచ్చేద్దాం. ఇక కొత్త దంపతులు వారి కోరిక ప్రకారం వారి హనీమూన్ ప్రయాణం ప్లాన్ చేసుకుంటారు.”
“అంటే, మన వెంట వీళ్ళు రారు.”
“అవును, ఈ ప్రోగ్రాం నచ్చక పోతే, మీరు మీకు తోచిన ప్లాన్ చెప్పండి.”
“సన్నితా, ఏమంటావు?”
“నాన్నా, నేనేమంటాను. నాకంటూ పెద్దగా అభిప్రాయం ఏమీ లేదు. అన్నీ యదువర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకొని ఉంటారు.”
“అందరూ తిరుపతిలో పెళ్లి జరగాలని అనుకుంటారు, మీరు వేరుగా అనుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా?” దాశరథి చిన్న అనుమానం వెలిబుచ్చాడు.
యామిని మౌర్యరాజులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని సన్నగా నవ్వుకున్నారు “మా అబ్బాయిని ఎంత బతిమాలి, బలవంత పెట్టినా ‘డాక్టర్’ కోర్స్ చేయలేదు; కనీసం నా తమ్ముడి కొడుకు ఫ్యూచర్లో మెడిసిన్ చదవాలని మా కోరిక. అందుకే చదువుల తల్లి సరస్వతీ దేవి ఆశీర్వాదం తీసుకోవాలి” అనుమానం తీర్చాడు.
“చిన్మయ్ ఇంకా చిన్నవాడు, అప్పుడే వాడి మీద ఆశలు పెట్టుకున్నారు.”
“చిగురించే లేత మొక్కలు అనువైన సమయంలో మలుపు తిప్పాలి. అన్నట్టు దాశరథి గారు, చిన్మయ్ చదువు, మిగతా ఖర్చులు అన్నీ ఇక మా వంతే.”
“ఫరవాలేదు, ఏదో జరుగుతుంది జరగనీయండి, మీ బిజినెస్ ఎలా నడుస్తుంది” మాట మార్చాడు.
“చాలా మటుకు అన్ని వ్యాపారాలు మూసేశాను. ఓన్లీ లీడ్‌లో ఉన్న వ్యాపారస్తులకు, సినీ నిర్మాతలకు వడ్డీలకు అప్పులు ఇస్తున్నాను. పోతే షిప్యార్డ్ షేర్లు ఉన్నాయి. నా ఇంటి పక్కనే ఉన్న తమ్ముడి ఇల్లు, వాడి వంతు బంగారం అలాగే ఉన్నాయి.” చూచాయగా అడిగితే సూటిగా సమాధానం వచ్చింది.
“పెళ్ళిలో నగలు, లాంఛనాలు వాటి గురించి వివరంగా చెప్పండి” నసుగుతూ అన్నాడు.
“అదే చెప్పానుగా, బంగారు నగలు వద్దు. శౌర్య అవసరానికి మించి బంగారం దాచుకున్నాడు. ముఖ్యమైన సూత్రం, ఉంగరం మా వంతు. పెళ్లి తర్వాత అమ్మాయి ఇష్టప్రకారం ఏం కావాలో చేయించుకుంటుంది. తొందర ఎందుకు?”
“అలా కాదులేండి, మా వంతుగా అబ్బాయికి ఉంగరం పెట్టాలి.”
“సరే, మీ యిష్టం. పెళ్లి బట్టలకు ఏదో మాకు తోచిన విధంగా ఈ ఐదు లక్షలు తీసుకోండి” అంటూ యామిని బ్యాగ్ లోని డబ్బులు తీసి దాశరథ చేతిలో పెట్టింది.
అయోమయం, ఏమీ తోచని పరిస్థితి; “వద్దండీ, ఇచ్చిపుచ్చుకోవటం వద్దు అని అనుకున్నప్పుడు వుహు ప్లీజ్ వద్దు!” నిర్మొహమాటంగా చెప్పింది సన్నిత.
“ఉన్నంతలోనే సర్దుకోవటం అలవాటై పోయింది, అందుకే వద్దంటున్నది. మీరేమీ అన్యథా అనుకోవద్దు” కూతురిని సమర్ధించాడు.
“ఫరవాలేదు, యదువర్ ఎందుకు అంతగా అమ్మాయి విషయంలో మొండి పట్టుపట్టాడో అర్థమైంది” డబ్బులు బ్యాగ్‌లో పెట్టుకుని అన్నది.
“నీక్కూడా ఇలాంటి కోడలు కావాలి అని కోరుకున్నావు కదా!” భార్య కోరిక బహిరంగం చేశాడు మౌర్యరాజ్. అనుకున్న ప్రోగ్రామ్ ప్రకారం ఇరువురి కుటుంబాలు కలిసి వివాహ శుభకార్యం జరిపించారు. పుణ్యక్షేత్రం, గోపూజ, సముద్రతీరం, ద్వీపం సందర్శించారు.
***
యవ్వనం వరంగా ప్రసాదించిన లేతదనం! సౌందర్య శోభితమైన మధుపర్కాలు ధరించిన తెల్లటి శరీరఛాయాతో, నునుపుదేరిని కళతో పెళ్లి కూతురుని చూస్తూ “నువ్వూ నేను ఇలా ఒకరు ముందు ఒకరు.. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా?” కొత్త పెళ్ళికొడుకు అన్నాడు.
నుదిట కళ్యాణ తిలకం దిద్దుకొని, బుగ్గన కాటుక చుక్క పెట్టుకొని, ఎడమచేతిలో అడకత్తెర, కుడిచేతి మణికట్టున కంకణంతో ఆరడుగుల ఆజానుబాహుడుని రెప్పవాల్చక చూస్తూ “ఎంత?” ముగ్ధ నోరు విప్పింది.
“మెడలో తళుకులీను బంగారు తాళి, నుదుట ఎరుపు కుంకుమ బొట్టు, పట్టుచీర, పసుపు అలుముకున్న నీ పాదాలకున్న పారాణి, తొడిగిన వెండి మట్టెల చిరు సవ్వడి, తడారిన నీ జుట్టులో గుబాళిస్తూ మల్లెల దండ” సన్నితని చూస్తూ కళ్ళు మూసుకొని ఇంకా చెప్పసాగాడు.
“జీవితం వెల కట్టలేనంత వేడుకలా, తేలికగా ఉంది! నాకున్న ఎన్నో అదృష్టాల్లో, ఆనందాల్లో నువ్వు నా హృదయ వేదిక పైన నిలిచిన నా అర్ధాంగి” యదువర్ భావోద్వేగం మాటల్లో ప్రకటించాడు.
“భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు, నేను నీ అనురాగాల ప్రేమ పిపాసి అయినందుకు, అందమైన-అరుదైన జీవితం దొరికినందుకు, నా బలహీనతకు బలం నువ్వు!” సన్నిత స్థిర స్వరం బయట పెట్టింది.
“ఆ మాట నేను చాలా సార్లు అనుకున్నాను.”
“ఏ మాట” అతని నోట వినాలని అడిగింది.
“నా బలం నువ్వు అని, ఇద్దరికీ ఓకే తలంపు రావడం అంటే మనది అన్యోన్యమైన జంట!” వెలిగే కళ్లతో భర్త వంక చూసి, సేదదీరుతున్నట్లుగా అతని భుజంపై వాల్చుకుంది తలను. క్షణం తర్వాత అతను చేయి అందించగా లేచింది.
“నువ్వు నాతో చెప్పాలని ప్రయత్నించిన మాట ప్రణి పెళ్లి గురించి.. అవునా?”
“అవును. ప్రణి నా చెల్లెలు మాత్రమే కాదు, నా మంచి స్నేహితురాలు కూడా.. నా దురదృష్టం కొద్దీ.. అంటే నా అనారోగ్యం కారణంగా నేను లేకుండా పోతే.. నువ్వు మా చెల్లిని పెళ్లి చేసుకోవాలి. ఇదే మాట నీతో చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను.”
“ఇప్పుడు చెప్పావు, ఓకేనా!? నా మాట కూడా వింటావా.. వినడం కాదు ఆచరించు!” ఏమిటన్నట్టు కళ్ళతో ప్రశ్నించింది.
“నీ మనసులో నుండి ఆ పాడు మాటలు తీసేయ్, అసలు నీలో అనారోగ్య సూచనలు లేవు. ట్రీట్మెంట్ తీసుకున్నావు, రెగ్యులర్‌గా చెకప్‌కి వెళ్దాం. దట్స్ ఇట్! ఇక ప్రణీత.. మంచి అమ్మాయి, నీలాగా సెన్సిటివ్ కాదు! మనిద్దరం కలిసి తనకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేద్దాం. మనసును ప్రశాంతంగా పెట్టుకో, నీ వర్రీస్ అన్నీ నావే! మనిద్దరం వేరు కాదు, ఒకటే!” ఆమె అందమైన కళ్ళల్లో కాంతిని చూస్తున్నాడు. ఊహించలేనంత ఎత్తున ఉత్తుంగ తరంగాలు లేస్తున్నాయి.
“భలే సరదాగా, హాయిగా, ఆనందంగా జరిగిన ఈ ట్రిప్ నేను మర్చిపోలేను” చేతులకు సన్నటి ఇసుక పులుకున్న ప్రణీత పరిగెత్తుకుంటూ వచ్చింది. చిన్మయ్ తడిసిన బట్టలతో సంతోషంగా గంతులు వేస్తున్నాడు.
“నా చిక్కుముడి వీడింది.. కొసలు దొరికాయి” అక్క పక్కగా కూర్చుని అంది.
“నాకు మన రిలేషన్ ఎలా కొలిక్కి తీసుకు రావాలో అర్థం కాలేదు” మరదలితో చిలిపిగా అన్నాడు.
“మనం బయలుదేరితే మంచిది” దాశరథితో అన్నాడు మౌర్యరాజ్.
“నేను పెద్దక్క వెంటే ఉంటాను, మీతో రాను” పదే పదే చిన్మయ్ అంటుంటే “ఆల్రెడీ నీ స్కూల్ మిస్ అవుతున్నావు, వద్దు.. నువ్వు మాతోనే ఇంటికి వచ్చేయి” మొండిగా అంది ప్రణీత. మాటలు మానేసి ఏడుపు మొదలు పెట్టాడు.
“మిమ్మల్ని అందరిని వదిలి మేము ఇక్కడ ఉండాలని నిర్ణయం మార్చేద్దాం, ఇంకా ఇక్కడ ఉండాలని లేదు” యదువర్ నిర్మొహమాటంగా అన్నాడు.
“అయ్యో, మీ హనీమూన్ ఇక్కడే అని పెద్ద వాళ్ళు నిర్ణయించారు” ఇద్దరూ నవ్వుకున్నారు. ఒకరి బలహీనతకు మరొకరి బలం విశ్వాసం, ఆకర్షణ!
“మా హానీమూన్ మేము ఇంకా ఆలోచించుకోలేదు, ప్రస్తుతం అందరమూ కలిసి ఇంటికి ప్రయాణం. చిక్కు.. కమాన్, ఐ అమ్ విత్ యు.. లెట్స్ గో టుగెదర్!” యదువర్ గాలిలో చిన్మయ్‌ను ఎత్తి ఎగరేసి ఆనందంగా పట్టుకున్నాడు. చిన్మయ్ బయపడక నవ్వుతూ సన్నిత వైపు చూశాడు.
సన్నిత యదువర్, చిన్మయ్ లను ప్రశాంతంగా చూసింది.
(సమాప్తం)
సోషియాలజీలోనూ, ఇంగ్లీషులోనూ ఎం.ఎ. చేసిన శ్రీమతి పులి సురేఖ గారు హైదరాబాద్ హెచ్.ఎమ్.టి.లో పనిచేసి రిటైరయ్యారు.
స్కూల్ రోజుల నుంచి వీరి రచనా వ్యాసంగం కొనసాగుతుంది. సామాజిక విషయాల అనుభవాలు వీరి రచనల ఇతివృత్తాలు.
70 సంవత్సరాల వయసులోనూ ఉత్సాహంగా సాహితీసృజన చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 40 సామాజిక కథలు, నాలుగు నవలలు రచించారు. తెలుగు మరియు ఆంగ్లంలో వ్యాసాలు రాశారు. కొన్ని బహుమతులు గెలుచుకున్నారు.
