Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమే మా బలం-2

[శ్రీమతి సురేఖ పులి గారు రచించిన ‘ప్రేమే మా బలం’ అనే నవలని రావాహికగా అందిస్తున్నాము.]

[మనోజ్ఞ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూంటుంది. రోజూ కాలేజీకి బస్‌లో వెళ్ళొస్తూ ఉంటుంది. ఒక రోజు బస్ రద్దీగా ఉండడంతో ఓ అబ్బాయి బస్ కిటికీ ఊచలు పట్టుకొని సమతూగుతూ రెండు పుస్తకాలు మనోజ్ఞ ఒడిలో పడేసి పట్టుకోమంటాడు. కానీ తర్వాత అతను కనిపించడు. కాసేపు వెతుకుతుంది. కాని కాలేజీకి టైమ్ అయిపోతోందన్న తొందరలో ఆ పుస్తకాలను తన బ్యాగ్‍లో పెట్టుకుని వెళ్ళిపోతుంది. రెండు రోజులైనా ఆ అబ్బాయి కనబడడు. ఓ సాయంత్రం పెరట్లో ఒంటరిగా కూర్చుని అతనిచ్చిన పుస్తకాలలో ఒకదాన్ని తెరిస్తే, అందులో ఆమె కోసం ఉత్తరం రాస్తాడు. ఆమె తనకెలా తెలుసో చెప్తాడు. తన గురించి చెప్పి, ఆమెను ప్రేమిస్తున్నానని రాస్తాడు. మనోజ్ఞ అన్నయ్య దాశరథి ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. అతనికి క్వార్టర్స్ ఎలాట్ కాలేదు. ప్రతి రోజూ బస్సులు దొరికీ దొరకక ఇబ్బంది పడుతుంటాడు. యూనియన్ లీడర్ ద్వారా ప్రయత్నించినా దొరకదు. ఓ అందాల పోటీలో పాల్గొనే అవకాశం వస్తుంది మనోజ్ఞకి. వదిన శమంతమణి వెళ్ళమని ప్రోత్సహిస్తుంది. దాశరథితో తాను మాట్లాడతానని చెప్తుంది. కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహదేవ్ శర్మ ఛార్జ్ తీసుకొని స్టాఫ్‍ని పరిచయం చేసుకునే సందర్భంలో దాశరథి తన గురించి చెప్పుకుని, తన సమస్యని విన్నవిస్తాడు. ఆయన వెంటనే క్వార్టర్స్ ఎలాట్ అయ్యేట్టు చూస్తాడు.  సెంటర్‍లో ఉన్న సొంతింటి నుంచి ఫ్యాక్టరీ టౌన్ షిప్‌కి మకాం మారుస్తాడు. పిల్లల్ని ఫ్యాక్టరీ టౌన్ షిప్ లో ఉన్న స్కూల్లో చేరుస్తాడు. సొంతింటిని ఎవరికైనా అద్దెకి ఇవ్వాలనుకుంటాడు. తన కొలీగ్ భూషణం సిఫార్సుతో వచ్చిన, కలెక్టర్ ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్న అబ్దుల్ రషీద్ అనే వ్యక్తికి వ్రాత పత్రాలు లేకుండా తన ఇల్లు అద్దెకి ఇస్తాడు దాశరథి. – ఇక చదవండి.]

“శమంతా, ఈ నెల నుంచి జీతాలు ఫస్ట్‌న కాక ఎప్పుడు ఫండ్స్ ఉంటే అప్పుడే ఇస్తారుట” దాశరథి చిన్న బోయిన మనసుతో బాధపడుతూ చెప్పాడు.

“అంటే నెలా, రెన్నెళ్ల ఇంటి ఖర్చులకు డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోవాలి.. అంతే కదా?” ప్రశాంతంగా అన్నది.

“అదొక్కటే కాదు, ఎక్కడ వీలైతే అక్కడ పొదుపు చేయాలి.. టైమ్ ఎటు తీసుకెళ్తుంది చెప్పడం చాలా కష్టం!” నిర్లిప్తత ధ్వనించింది.

ఆఫీసుకు మూడు రోజులు సెలవు పెట్టి దాశరథి కుటుంబంతో పాటు చెల్లెలు పాల్గొన్న పోటీలో హాజరు అయ్యారు.

***

వైజాగ్‌లో లక్స్ యాజమాన్యం నిర్వహించిన అందాల పోటీకి ప్రముఖ సినీ పరిశ్రమకు చెందిన వారు, పేరుగాంచిన ప్రకటన సంస్థలు విచ్చేశారు. దక్షిణ భారతదేశ రాష్ట్రాల వివిధ కళాశాల విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. దుస్తుల తుది నిర్ణయం కార్యక్రమం నిర్వహణ వారిదే పై చేయి! న్యాయనిర్ణేతలు వాళ్ళ పనిలో నిమగ్నమైయ్యారు.

వొంటికి బిగుతుగా కట్టిన తళుకుల మెరుపుల దుస్తులతో అందమైన అమ్మాయిలు ఒక్కొక్కరే వేదికపై సోయగాలు ఒలికిస్తూ నడుస్తున్నారు. పలుచని నిమ్మపండు రంగు చీర, చీర నుండి కత్తిరించిన గుడ్డతో కుట్టిన జాకెట్; శరీరం పై భాగాన్ని పూర్తిగా కప్పేస్తున్న పారదర్శకమైన జాకెట్ నుండి వీపు భాగం, చేతుల నునుపు స్పష్టంగా కనబడుతున్నాయి. మెరుపులు చిందిస్తూ ఒయ్యారంగా వేదిక పైన నడిచివచ్చిన మనోజ్ఞ హంస నడకలో హొయలు, చమత్కారంగా చూసే ఓరచూపులు, ఎంత అదిమి పెట్టినా, అంతే ఉనికిని చాటే ఎత్తుపల్లాల వంపుల అలరులు, సంకేతంగా సంతోష చప్పట్ల మోతలతో ప్రదర్శన దద్దరిల్లింది.

ధైర్యలక్ష్మి తోడుగా అదృష్టలక్ష్మి, ధనలక్ష్మి బుజ బలమైనారు; మనోజ్ఞ పోటీలో మొదటి స్థానంలో నిలిచింది. బహుమతి కిరీటం, ప్రశంసాపత్రం, నగదు వచ్చాయి. మౌర్యరాజ్ బ్యూటీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వారు అదనంగా వారి నగల ప్రచారణ కోసం అడ్వాన్స్ పదివేల రూపాయల నగదు యిస్తూ, సంవత్సరం వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకుని హామీ పత్రం పైన దాశరథి, మనోజ్ఞ సంతకాలు తీసుకున్నారు.

ప్రొప్రయిటర్ మౌర్యరాజ్ సమక్షంలోనే అతి చొరవగా యువరాజును పోలిన రాకుమారుడు మాటి మాటికీ మనోజ్ఞ ముందు చేయి చాపి ‘షేక్ హ్యాండ్’ అంటూ తన హాబీని ప్రత్యేకంగా స్వంత కెమెరా ద్వారా ప్రదర్శించుకున్నాడు.

“మీ ఫ్యామిలీ?” చుట్టూ మూగిన ఫ్రెండ్స్‌ని తోసిపుచ్చి శౌర్యరాజ్ ప్రశ్నించాడు.

“మా అన్నయ్య, వదిన వచ్చారు” అమాయకంగా జవాబు ఇచ్చింది.

ఫ్యాషన్ షోలో పాల్గొన్న అమ్మాయిలు ధైర్యవంతులు అనుకుంటే, ఈ సౌందర్యరాశి ఇంట్లో వాళ్ళ తోడుగా వచ్చిందా? యువరాజుకు నిరాశ ఎదురైంది.

వివిధ పత్రిక విలేఖరులు మనోజ్ఞ ఇంటర్వ్యూ కొరకు ఎగబడుతున్నారు. యువకుల ఫ్యాషన్ షో జరిగితే శౌర్యరాజ్ మొదటి స్థానంలో నిలిచేవాడని అందాల పోటీకి విచ్చేసిన ప్రేక్షకులు ముఖ్యంగా అమ్మాయిలు నిర్ధారించుకున్నారు.

కొందరు అమ్మాయిలు అలవోకగా శౌర్యరాజ్ స్పర్శ కోసం చేతులు ముందుకు చాచారు, మరికొందరు ఉద్దేశ్యపూర్వకంగా వచ్చి అతని భుజాన్ని ఢీ కొట్టుకున్నారు, అదొక వ్యామోహ తృప్తి!

అమ్మాయిల స్పర్శ కోరే అబ్బాయిలు; అబ్బాయిల మెప్పు పొందాలనే తహతహ అమ్మాయిలకు..! అదొక వైస్ వెర్సా మోజు!!

***

ఇన్ని రోజుల జీవితంలో మొదటి సారి సముద్ర తీర అందాల్ని చూస్తున్న కొద్దీ చూడాలని ఉంది. అక్కడ-ఇక్కడ చదవడం, వినడమే గాని కళ్ళతో నీలి రంగు తలపోసే విశాఖ సముద్రం చూస్తుంటే భూమి పైన ఉన్నట్టు తోచలేదు. ఎంత పెద్ద తీరం! క్షణం వ్యవధి లేకుండా అలలు ఉత్సాహంగా ఉబికి వస్తూ, చప్పబడి పోతున్నాయి. మనోజ్ఞ సముద్రం నీటిని రుచి చూసింది. వెనువెంటనే ఉమ్మేసి “అమ్మో, చెంచాడు నీళ్ళలో కిలో ఉప్పు కలిపినట్లుంది.”

“ఎవరైనా సముద్రం నీటిని రుచి చూస్తారా?” దాశరథి చిరాగ్గా అన్నాడు.

“రుచి చూడాలని చూశాను తప్పేంటి?” మనసు చిన్నబుచ్చుకుని నెమ్మదిగా ఇసుక గూళ్ళు కట్టుకొని ఆడుకొంటున్న సన్నీ, ప్రణీ జతన చేరింది. సముద్ర కెరటాలపై నుండి చూపు మరల్చక తీక్షణంగా చూస్తున్న భార్యను కదిపాడు.

“మణీ, అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు?”

“ఎంతో మంది కవులు, రచయితలు ఈ సముద్రం పైన కవితలు, కథలు రాశారు. ప్రేమికులు ఈ తీరంలో ఎన్నో మధురమైన కలలు చూశారు. అలల అలజడిలో పిల్లలెప్పుడూ ఆడుతూ, పాడుతూ నవ్వుతూ, నర్తిస్తూ పోగవుతారు. తీరంలోని ఇసుకతో చిన్నారులు గూళ్లుకట్టి ఆటలాడతారు, గవ్వలతో సాగరంలో ఎండుటాకులను పడవలుగా వదిలి నవ్వుతూ ఆడుకుంటారు. నిరాశను తట్టుకోలేని వారు విసిగి ఇందులో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు, యిలా ఎందరి కోసమో..”

భార్య మాటలు నచ్చక, “మనం ఇక్కడికి ఫ్యామిలీతో ఎంజాయ్ కోసం వచ్చాము. ఏదో సర్వసంగ పరిత్యాగి అయిపోవద్దు” ఆమె ఆలోచనలు ముందుకు సాగనివ్వలేదు.

బట్టలకు అంటుకున్న ఇసుక దులుపుకొని లేచారు. ఒకరి చేతులు మరొకరు పట్టుకుని కొంత దూరం నడిచి దోసిళ్ళ నీళ్ళను ఒకరి పైన ఒకరు జల్లు కొని తడుస్తూ సంతోష పడ్డారు. అంతా ఆనందాల మయం!

***

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహదేవ్ గారు డిపార్ట్మెంట్ సడెన్ చెక్ చేశారు. రిజిస్టర్లు, చలామణి అవుతున్న ఇంప్రెస్ట్ తాలూకు డబ్బులు, ఏది వదల్లేదు.

‘ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ మహాదేవ్ సార్ క్రమంలో వృత్తి ధర్మాన్ని నెరవేరిస్తే, దేశంలో ప్రభుత్వ సంస్థలు చిరకాలం వెలుగుతూ ఉంటాయి’ కార్మికులందరు కొద్ది కాలంలోనే పొగడ్తలు మొదలుపెట్టారు.

టపా టప్ టెలెక్స్ కీ బోర్డు పైన వేళ్ళు నాట్యం ఆడుతున్నాయి. మరో వైపు ఇయర్ ఫోన్ సాయంతో టెలిఫోన్ ఆపరేటర్ పని; ఏక కాలంలో ద్వంద్వ పనులు. దాశరథి వెనుక నిలబడి ఈడి సార్ గమనిస్తున్నాడు. పది నిమిషాలు గడిచాయి. పని ముగిసిన తర్వాత కుర్చీ నుండి లేస్తూ ఈడి సార్‌ని చూసి తడబడ్డాడు.

“ఇట్స్ ఓకే దాస్, ప్లీజ్ మీ పనిని కానివ్వండి” అన్నాడు. ఎంత ‘ఓకే’ ఐనా దాశరథి చేతులు కట్టుకుని అధికారి ముందు నిల్చున్నాడు. హనుమంతుని తోక వలె అత్యంత పొడవైన డూప్లికేట్ టెలెక్స్ చెక్ చేసి, ఫ్రాంకింగ్ డీటైల్స్ రిజిస్టర్ను క్షుణ్ణంగా తనిఖీ ముగిసిన తర్వాత డోర్ వైపు వెళుతున్న ఈడి గారితో “సార్, ఒక్క మాట..”

“చెప్పండి దాస్.”

“నాకు ఒక నెల సెలవు కావాలి సార్.”

“నెలా? ఎందుకు?”

“మా చెల్లెలు ఆడిషన్ బొంబాయిలో ఉంది. తోడుగా నేనే వెళ్ళాలి, అందుకు..”

“దాస్, నేను అర్థం చేసుకోగలను కానీ ఛాయాదేవి గారు మెటర్నిటీ లీవ్‌లో వెళతారు, భూషణం వాళ్ళ సన్ ఐఐటీ కోచింగ్ అని రెగ్యులర్గా ఇర్రెగ్యులర్. సో, బెటర్ లెట్స్ ఫైండ్ అనదర్ వే.”

పచ్చి వెలక్కాయ గొంతులో ఇరుక్కున్నట్టు నోట మాట రాలేదు.  “నా రూమ్‌కి రండి” ఈడి గారు దాశరథిని వెనకాలే తీసుకెళ్లారు.

ఉక్కపోతలో ఫ్యాన్ గాలికి కూర్చుని పని చేసి పొందిన విశ్రాంతికి, సార్ గదిలో ఏసీ యిచ్చే చల్లదనపు హాయిలో చాలా తేడా ఉంది. బెల్ నొక్కి ఆఫీస్ బాయ్ అని పిలిచారు. ఇద్దరినీ కూర్చోమని సైగ చేసి ఈడి సార్ తన కంఫర్ట్ రివాల్వింగ్ చైర్ లో కూర్చున్నారు.

“లింగా, ప్రతి రోజూ నీ పని, నీ రెస్టింగ్ టైమ్” వివరించమన్నారు. గుక్క తిప్పుకోకుండా లింగయ్య జవాబు చెప్పాడు.

“దట్స్ గుడ్, సో, నీకు పని వేళలు తక్కువ ఉన్నాయి. కొంత నీ పని సమయాన్ని దాశరథి వద్ద నువ్వు వర్క్ ను సర్దుకోవాలి. అంటే కాల్ కనెక్ట్ చేయడం, పాస్ అయిన మెసేజ్ క్రమబద్ధంగా ఫైల్ చేసి పెట్టాలి.”

“ఓకే సర్. ఒకసారి ఎలా చేయాలో నాకు చూపెట్టాలి, తప్పకుండా చేస్తాను.”

“లింగా, నౌ యు మే గో” లింగయ్య తన పాంట్రీ రూమ్‌కి వెళ్ళిపోయాడు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శర్మ గారు కొన్ని మంచి నీళ్ళు తాగి, “దాస్ గారు, మీ ఎర్న్ లీవ్ సాక్షన్ చేయనందుకు ఫీల్ కాకండి. మన బొంబాయి మార్కెటింగ్ ఆఫీస్ స్టాఫ్‌తో చెప్తాను, వాళ్ళు మీ అమ్మాయికి కావాల్సిన వసతులు కలిపిస్తారు అండ్ ఫుల్ కేర్ కూడా తీసుకుంటారు. ఐ అషూర్ యు.”

కంపెనీ క్వార్టర్ మంజూరు చేసి, పని ఒత్తిడిలో సహాయం, కుటుంబ విషయంలో జోక్యం; ఇన్ని రకాలుగా సాయపడే బాస్ దొరకడం అందరికీ సాధ్యం కాదు!

యూనిట్ చీఫ్ భరోసా ఇస్తున్నారు; సంతోషపడాలా? ఎంతో గారాబంగా పెరిగిన చెల్లెలు మొదటిసారి స్వస్థలం వదలి ఒక్కతే వేరే పట్టణం వెళుతుంటే బాధ పడాలా??

ఇక అనేందుకు ఏం ఉంది “సరే సర్, థాంక్స్” అని లేచాడు.

ఆడపిల్లలు ఇద్దరూ చిన్నవాళ్ళు, శమంత చెల్లెమ్మకు తోడు వెళ్ళలేదు. వచ్చిన బొంబాయి ఆఫర్ మనోజ్ఞ వదులుకోవాలని లేదు. “మనో, నీ బొంబాయి ప్రోగ్రామ్ డేట్ ఖరారు అయిందా?”

మనోజ్ఞ ఎరుపు రంగు వెల్వెట్ కవర్ తెరిచి మౌర్యరాజ్ గారి ఆహ్వానం చూపించిది. రోజొక అడ్వర్టయిజ్మెంట్ షూటింగ్ అంటే వారం రోజుల ప్రోగ్రామ్. ఈడి సార్ చెప్పినట్లు కంపెనీ మార్కెటింగ్ టీం ఏ విధంగా మనోజ్ఞ పైన శ్రద్ధ తీసుకోగలరు? అధికారి మాటను కాదనే ధైర్యం ఎవరికీ ఉండదు, నమ్మకం పెంచుకున్నాడు.

***

మర్నాడు మౌర్యరాజ్ గారి ఆహ్వానం ఈడీ సార్ గారికి చూపించాడు. సార్ వెంటనే ఆఫీస్ బాయ్ని పిలిచి జిరాక్స్ చేయించి, జిరాక్స్ పైన తన ఆమోదం తెలిపి కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ గారికి ఫాక్స్ చేశారు. క్షణాల్లో జవాబు కూడా వచ్చింది. మనసులో ఏదో ఆనందం! భూషణం, ఛాయాదేవికి జవాబుగా వచ్చిన తిరుగు ఫాక్స్ చూపించి సంతోషాన్ని  పంచుకున్నాడు.

“దాస్, నీ లక్ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఏం పూజలు చేస్తున్నావో చెప్పు బాసు” వీపు తడిమి అన్నాడు.

“అవునండీ, దాశరథి గారు, నాకూ చెప్పండి ఈ సారి బాబు పుట్టాలని పూజ చేస్తాను” వరుస కూతుర్లు పుట్టారని ఛాయాదేవి ఆతృతగా అడిగింది.

“మీ అందరి ఆశీస్సులు తోడుగా ఉన్నాయి, పూజలేవి చేయలేదు” దాశరథి జవాబిచ్చాడు. సృష్టి సహజగుణం – ఒకరికి ఆనందం కలిగితే కొందరికి ఈర్ష్య కూడా మొలకెత్తుతుంది. మనసులోని భావాలు తెలుసుకోవడం ముఖంలో అందరికీ కనబడవు!

***

‘దాశరథి గారు’ అంటూ మళ్లీ ఒక రోజు లంచ్ టైమ్లో ఆశీర్వాదం గారు సెంట్రల్ రిజిస్టర్ రూమ్ లోకి వచ్చారు. భోజనం చేస్తూ “చెప్పండి సార్, నాతో ఏదైనా పని ఉందా?”

“అవును, కానీ కొంచెం పర్సనల్.”

“ఫరవాలేదు చెప్పండి సార్..”

“ప్లీజ్, కాన్ఫిడెన్షియల్!”

“చేతులు కడుక్కొని వస్తాను బయటికెళ్ళి మాట్లాడదాం.”

“వద్దు, ఇక్కడే బాగుంది.”

కారిడార్లో వాష్ బేసిన్ వద్ద చేతులు, టిఫిన్ బాక్స్ శుభ్రం చేసుకొని తీరిగ్గా వచ్చాడు దాశరథి. “మరో మారు చెప్తున్నా, చాలా సీక్రెట్ దాస్. మా ఆవిడ ఎం.బి.ఎ చేస్తుంది. బోలెడు ప్రాజెక్ట్ వర్క్స్  ఉంటాయి. నాకు కొంచెం జిరాక్స్ గానీ, ఫాక్స్ గానీ, ఈవెన్ ఫోన్స్.. నాకు పర్సనల్ గా ఏదైనా హెల్ప్ అవసరం ఉంటే చేసి పెడతావా?” చిన్న స్వరంతో పెద్ద కార్యం వివరించాడు.

“సర్,  నాకు అర్థం కాలేదు.”

“అన్ని సెక్షన్లో డైరెక్ట్ ఫోన్ లేదు, ఔట్ సైడ్ ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా నిన్నే అడగాలి అదే వయా ఎక్స్ఛేంజి. మా ఆవిడకు నేను కొంచెం తన చదువులో సహాయం చేస్తున్నాను. ఆఫీసు వేళల్లో నువ్వు నేనిచ్చిన మాటర్ టైప్ లేదా ఫోన్ ద్వారా ఆమె డౌట్స్ ఎక్సట్రా వంటివి చేసి పెట్టాలి.”

దాశరథి దొంగ పనికి జవాబు చెప్పలేదు.

మళ్లీ అన్నాడు ఆశీర్వాదం “ఈ విషయం ఎక్కడా తెలియనివ్వను. బిట్వీన్ యు అండ్ మీ..” దాశరథి అరచేతిని తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు.

“మరి రిటర్న్ నీకేమి సాయం అంటావా? రెండు సార్లు తప్పిన నీ ప్రమోషన్ ఈ సారి డెఫినెట్! ప్లీజ్ ఈ డీల్ వాడుకో” ఆజ్ఞాపిస్తున్నాడో,  అర్థిస్తున్నాడో అర్థం కాలేదు.

లంచ్ టైం అయ్యింది, సైరన్ మోగింది.

“ఆలోచించుకొని చెప్తావా?” భుజాన్ని నిమురుతూ అన్నాడు.

“ఆలోచించే అవసరం లేదు సార్. నేను ఛీటింగ్ చేయలేను. నా ఆకలి కడుపుకు అన్నం పెట్టిన ఈ సంస్థను కాలితో తన్నే దుర్బుద్ధి నాకు లేదు” నిక్కచ్చిగా మనసులోని మాట చెప్పాడు.

దాశరథి ముఖంలోని విముఖత జీర్ణించుకోలేక తన వ్యక్తిత్వం నిలుపు కోవాల్సిన అవసరం ఉందని జేవురించే నవ్వు నవ్వుతూ “యు ఆర్ జెన్యూన్, కీప్ ఇట్ అప్! ఐయినా, జస్ట్ ఇన్ఫర్మేషన్, నువ్వు ఎంకామ్ ఐయ్యి ఉండి, స్కూల్ ఫైనల్ మాత్రమే నీ క్వాలిఫికేషన్ చూపి ఈ జాబ్ చేస్తున్నావు. మేనేజ్మెంట్కు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, మరి ఇది ఛీటింగ్ కాదా? ఎనివేస్, క్యారీ ఆన్” బాంబు పేల్చి వెళ్ళి పోయాడు పర్సనల్ డిపార్ట్మెంట్ చీఫ్.

లంచ్ తర్వాత పని చేయలేక పోయాడు. అవును తను ఎం కామ్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ నుంచి ఒక్క ఉద్యోగ అవకాశం కూడా రాలేదు, తనను వెక్కిరిస్తూ ఎగతాళిగా ఎం.కామ్ మిగిలింది. అర్జెంటుగా ఉద్యోగం కావాలి, పూట గడవాలి. ఇల్లు నడవాలి!

టెన్త్ పాస్, టెలిఫోన్ ఆపరేటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్‌లో కొత్తగా రిజిస్టర్ అయిన వారానికే ఈ ఉద్యోగం వచ్చింది. అంతే, ఎంకామ్ తాత్కాలికంగా అంతర్మధనం అయిపోయింది. తను చేసిన తప్పేంటి?

ఓపెన్ యూనివర్సిటీలో బీకాం చదివే అక్కౌంట్స్ సెక్షన్ సహఉద్యోగులకు అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ, ఆడిటింగ్ సిలబస్ సెలవు రోజుల్లో ఫ్రీగా చెప్పాను. ఆశీర్వాదం బంధువే థామస్ కూడా ఉన్నాడు అందులో.. ‘అయ్యో పాపం’ అని సరస్వతీ దేవిని దానం చేయరాదని మనసులో లెంపలు వేసుకున్నాడు.

ఆశీర్వాదం యిచ్చిన వార్నింగ్ బుర్రని తొలుస్తుంది. భృతి కోసం చదువుని మడత పెట్టి, నొక్కి పెడితే అది తప్పా? మేనేజ్మెంట్ తప్పని రుజువు చేస్తే; అసలు కంపెనీ రూల్స్ ఏంటి? ఎవరు చెప్తారు!

ఆలోచనలతో నిద్ర రాలేదు. ఇంట్లో అందరూ హాయిగా నిద్ర పోతున్నారు. శమంతకు చెబితే? పాపం వూరికే టెన్షన్ తప్ప ఏమీ లాభం లేదు. తానే ఏదో ఒకటి చేయాలని తీర్మానించుకున్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version