Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమే మా బలం-3

[శ్రీమతి సురేఖ పులి గారు రచించిన ‘ప్రేమే మా బలం’ అనే నవలని రావాహికగా అందిస్తున్నాము.]

[ఫండ్స్ లేని కారణంగా జీతాలు ఒకటవ తేదీన కాకుండా, నిధులు ఉన్నప్పుడు ఇస్తామన్న వార్తని భార్యతో పంచుకుని బాధపడతాడు దాశరథి. పొదుపుగా కాలం గడుపుదామని ఆమె భరోసా ఇస్తుంది. వైజాగ్‌లో జరిగే అందాల పోటీలో పాల్గొనేందుకు అన్నావదినా, పిల్లలతో పాటు అక్కడికి వెళ్తుంది మనోజ్ఞ. దక్షిణ భారతదేశ రాష్ట్రాల నుండి వివిధ కళాశాల విద్యార్థినిలు పాల్గొన్న ఆ పోటీలో మనోజ్ఞ ప్రథమ స్థానం పొందుతుంది. లక్స్ సోప్ వారి ప్రచారకర్తగా ఒప్పందం కుదుర్చుకుంటుంది. అదనంగా పోటీ నిర్వాహకులైన మౌర్యరాజ్ కంపెనీ నగల ప్రకటన ఒప్పందం చేసుకుంటుంది. నిర్వాహక సంస్థకి చెందిన శౌర్యరాజ్ మనోజ్ఞని పలకరిస్తాడు. అతడి అందం చూసిన అమ్మాయిలు చుట్టూ మూగుతారు. మర్నాడు సాయంత్రం వారు కుటుంబ సమేతంగా బీచ్ వద్ద కాసేపు గడిపి సంతోషిస్తారు. సెలవు పూర్తయ్యాకా, ఆఫీసులో చేర్తాడు దాశరథి. ఓ రోజున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహదేవ్ గారు ప్రతీ డిపార్ట్మెంట్ పనులని క్షుణ్ణంగా చెక్ చేస్తారు. ఆయన తన వద్దకి వచ్చినప్పుడు దాశరథి పనిలో లోనమై ఆయనను గమనించడు. దాశరథి పనితీరును మెచ్చుకుంటారాయన. తనకి ఒక నెల రోజులు సెలవు కావాలని అడిగి, కారణం చెప్తాడు దాశరథి. ఇంకో కొలీగ్ కూడా లీవ్‌లో వెళ్తున్నందున మరో మార్గం చూద్దామని, తన గదికి రమ్మని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత ఆయన గదిలోకి వెళ్ళిన దాశరథికి ఆయన భరోసా ఇస్తారు. బొంబాయి ఆఫీసు సిబ్బంది సాయం చేసేలా మాట ఇస్తారు. మనోజ్ఞ కార్యక్రమం షెడ్యూల్ రాగానే దాన్ని మహదేవ్ గారికి ఇవ్వగా, ఆయన, మాట ఇచ్చినట్లుగానే అన్ని ఏర్పాట్లు చేయిస్తారు. అది చూసి కొందరు దాశరథి పట్ల అసూయపడతారు. ఆశీర్వాదం తన వ్యక్తిగత పనులకు ఆఫీసు టెలెక్స్ వాడుకుంటానంటే; తాను చీటింగ్ చేయనని, కుదరదని చెప్తాడు దాశరథి. అప్పుడు ఆశీర్వాదం దాశరథిని మెచ్చుకుంటునట్టే మెచ్చుకుని నువ్వు ఎంకామ్ పాసయి కూడా పదో తరగతి అర్హత మీద ఈ ఉద్యోగం చేస్తున్నామని మేనేజ్‍మెంట్‌కి తెలుసని బెదిరిస్తాడు. కంగారు పడతాడు దాశరథి. రాత్రి ఇంటికి వెళ్ళినా అతని టెన్షన్ తీరదు. తానే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటాడు. – ఇక చదవండి.]

“వకుళా, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బాగానే ఉన్నాను. ఇప్పుడు ఏమిటో కడుపులో ఏదోలా ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను” మనోజ్ఞ అబద్ధాన్ని నిజమని చెప్పి క్లాస్ ఎగ్గొట్టింది.

విద్యార్థులు అందరూ లేరని అటు ఇటూ చూసుకొని, జాన్ బేకరీ వైపు చూసింది. ఒక అబ్బాయి లేత గోధుమ రంగు షర్ట్, ముదురు గోధుమ రంగు ప్యాంటు వేసుకొన్నాడు. మనోజ్ఞ వైపు చూస్తున్నాడు. మనోజ్ఞ చూడగానే చలువ కళ్ళద్దాలు తీశాడు, అతన్ని గుర్తు పట్టింది. కానీ పేరు గుర్తుకు రాలేదు. మనోజ్ఞ వైపు చేతిని గాలిలో వూపుతూ చిన్నగా నవ్వుతున్నాడు. రోడ్డు క్రాస్ చేసి అతనిని సమీపించింది.

“మీరు పుస్తకాలు నాకు యిచ్చి, కనపడకుండా పోతే ఎలా? ఇదిగో తీసుకోండి” అంటూ తన బ్యాగ్ లోని అతని పుస్తకాలు బయటకు తీసింది.

“అవి మీకే, నా లెటర్ చదివి, నన్ను కలుసుకున్నారు, చాలా థాంక్స్, బేకరీ లోపల కూర్చుందామా?” తృప్తిగా అన్నాడు.

“లేదండీ, నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే, అమ్మో! వద్దు మిమ్మల్ని చూశాను, మాట్లాడాను అంతే! నేను ఇక వెళ్తాను” గాబరా పడ్డది.

“అంతే కాదు, ఇప్పుడే మొదలు; ఇంకా చాలా ఉంది. లోపల కూర్చుంటే మీ ఫ్రెండ్స్ ఎవ్వరికి తెలియదు. ప్లీజ్.. రండి మనోజ్ఞ గారు” ‘అంతే కాదు’ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ ఇక మాటలకు తావులేదు అని బేకరీ లోపలికి దారి చూపించాడు.

వెకిలి చేష్టలు లేక మర్యాదగానే ఉన్నాడని, అతని వెంటే బేకరీ లోపలికి వెళ్ళి రెండు కుర్చీలు చిన్న బల్ల ఉన్న చోటు కూర్చున్నారు.

“మీరు ఏం తింటారు?” వెయిటర్ రాగానే అన్నాడు.

“ఏమైనా తిందామని వచ్చామా? మాట్లాడడానికి వచ్చామెమో అనుకున్నాను” సన్నగా నవ్వుతూ అంది.

“అఫ్కోర్స్, మాటలే! వూరికే వచ్చి కూర్చుంటే ఓనర్ మనల్ని పిచ్చి చూపులు చూస్తాడు. సో, ఏదో ఒకటి తింటూ మాట్లాడుదాము” కర్రీ పాప్స్, సాండ్విచ్ చెప్పాడు.

ఎక్కువ వ్యవధి తీసుకోక హోటల్ యజమాని స్వయంగా టేబుల్ పైన పెట్టి వెళ్ళాడు.

‘ఎవరో అబ్బాయితో కాలేజీ ఎగ్గొట్టి ముచ్చటిస్తున్న సంగతి ఏ ఒక్కరైనా చూసి అన్నకు చెప్పారంటే నా పని అంతే సంగతులు!’ అని లోలోపల గొణుక్కుంది.

“ఏమైనా చెప్పండి” గెలుపు నాది అన్నంత హుషారుగా అన్నాడు.

“నేనా? నాకేం లేవండి చెప్పడానికి, మీరే చెబుతా అన్నారు. చెప్పకుండా తింటూ కూర్చున్నారు.”

“మీరు తెలివిగల అమ్మాయండీ, లెటర్ తరువాయి భాగం నుంచి చెప్పనా లేక మళ్ళీ మొదలు పెట్టనా?” కొంటెగా అడిగాడు.

‘మీరు తెలివిగల’ అనే పదం ఎంతో వినసొంపుగా ఉంది. అందరూ అందంగా ఉన్నావు అన్నారేగాని నాలో మరో ఆకర్షణీయమైన గుణం వుందని ఇతనే మొదటిసారి అన్నాడు. మనోజ్ఞ మనసు భయాలకు దూరమైంది.

“మీ ఉత్తరములో మీ పేరు, ఊరు లేవు, ముందు మీ పరిచయం?”

“మీకు నా వివరాలు తెలుసనుకున్నాను. చివర్లో ఒకచోట నా పేరు ఇటు అటుగా ఉంటుంది.”

సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని పేరు కనుక్కోవడంలో ప్రాధాన్యత ఇవ్వలేదు, పేరు గమనించలేదు. తల అడ్డంగా తెలియదని చెప్పింది.

“నేను: శౌర్యరాజ్. చదువు: బిజినెస్‌లో డిగ్రీ. అన్న: మౌర్యరాజ్. నాన్న: లేరు. అమ్మ: ఈ మధ్యనే నాన్నను వెతుక్కుంటూ పరలోకానికి పోయారు. వదిన: ఇంట్లో అన్ని చూసుకు..” బయోడేటా పాఠం అప్పచెప్పాడు.

అతని మాటలు మధ్యలో ఆపేసింది. “నా ఎదురుగా ఉన్న బాయ్స్ గ్రూప్ నన్ను తినేసేట్టు చూస్తున్నారు. గాలిలో ముద్దులు పంపిస్తున్నారు. నాకు చాలా అనీజీగా ఉంది. బయటకు వెళదాం” మనోజ్ఞ మాట వినగానే వెనక్కి తిరిగి చూసాడు.

“ఓనర్‌తో చెప్పి గొడవ పెట్టుకోవచ్చు, కానీ నా మంచి మూడ్ పాడు చేసుకోవాలని లేదు. పైగా ఇది సినిమా కాదు. కాలర్ ఎగరేసి ఫైటింగ్ సీన్ చూపెట్టడానికి” చిన్న స్వరంతో అన్నాడు.

“ప్లీజ్, అవేమీ వద్దు. వెళ్దాం” కంగారు పడ్డది.

“జస్ట్ డోర్ వద్ద వెయిట్ చేయండి, ఇన్ నో టైమ్ ఐ గెట్ మై కార్” ఆర్డర్ చేసిన ఆహారం వదిలి పెట్టి, ప్రీమియర్ పద్మిని కారులో ఇద్దరు రోడ్డు ఎక్కారు.

“అనీజీ పోయి, ఈజీగా ఉందా?”

“శౌర్యరాజ్ గారు, ఆ అబ్బాయిల వంక నేను ఎటువంటి యాక్షన్ చూపలేదు మరి వారి రియాక్షన్ ఎందుకు అలా..? వాళ్ళేంటి అలా పిచ్చిగా చేశారు.”

“ఆడపిల్ల కనబడితే అవకాశం కోసం కొందరబ్బాయిలు అలా చేస్తారు. ఇక ఆ టాపిక్ వదిలేయండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం?” ఆమె మనసును మళ్లించే ప్రయత్నం చేశాడు.

“మా ఇంటి దగ్గర వదిలేయ్యండి” సగటు అమ్మాయి తొందర తెలియ చేసింది.

“హలో! మేడం గారు ఎన్ని రోజులు కష్టపడ్డానో తెలుసా? ఈ రోజు నా కష్టం ఫలించింది. ప్లీజ్, నా కథ పూర్తిగా వినండి. తప్పకుండా మిమ్మల్ని మీ ఇంటి వద్ద వదిలి పెడతా” ఆదుర్దాతో అన్నాడు.

“సరే చెప్పండి” ప్రశాంతంగా అన్నది.

మాటల్లోనే తాజ్ హోటల్ ముందు కారు ఆపి, “మీరు దిగండి, నేను కార్ పార్క్ చేసి వస్తాను” అన్నాడు.

హోటల్ పేరు విన్నది; కానీ అదే చూడడం. ఎవరు ఎవరిని పట్టించుకున్నట్లు లేదు. ఓ మూల టేబుల్ చూస్కోని కూర్చున్నారు. సర్వర్ మంచి నీళ్ళతో పాటు మెనూ తెచ్చాడు.

“మేము లంచ్ చేసి వెళతాము. తొందర ఏమీ లేదు. లంచ్‌కు చాలా టైమ్ ఉంది” శౌర్యరాజ్ మాటలు విని సర్వర్ వెళ్ళిపోయాడు.

కొద్దిసేపటి వరకు ఇద్దరు మౌనంగానే వుంటూ మధ్యలో ఒకరినొకరు చూస్తూ ఉన్నారు.

“మీ పుస్తకాలు తీసుకోండి, మా ఇంట్లో చూస్తే బాగుండదు” బ్యాగ్‌లో నుండి రెండు పుస్తకాలు బయటకు తీసింది.

“మీ ఇంట్లో చూడలేదు.. అనుకోండి.. అంటే నా లెటర్ మీకు బాగుందా? నచ్చిందా?” టేబుల్ పైన తల ఆన్చి నెమ్మదిగా అడిగాడు.

తెలివి నాకు కాదు, నీకు ఉంది అనుకుంది మనోజ్ఞ. “మీ స్టోరీ చెబుతూ ఆగిపోయారు. సశేషం కథ శేషం చేయండి” మనసులో భావన బయట కనపరచక అంది.

పొందికగా కూర్చుని “ఒకే.., ఇంట్లో నా పెళ్లికి వేట మొదలైంది. నాకు మీరు నచ్చారు, మీ పెద్దవాళ్ళని కలవమని ఆల్రెడీ ఇంట్లో చెప్పాను, ముందు మీకు నచ్చాలి కదా అని, ఈ ప్రయత్నం! కథ అయిపోయింది.”

“అదేంటి ఇంత పెద్ద హోటల్ లంచ్ అంటే సెవెంటీ ఎం.ఎం సినిమా స్టోరీ అనుకున్నా, అంత తొందరగా అయిపోనిచ్చారు?”

“సాగదీసి సంతలో పెట్టె వాడిని కాదు నేను, చాలా క్లుప్తంగా ఉంటాను” అతని మాటలు ఆమె వింటూ ఉన్నది.

“ఈ రోజు మీ అభిప్రాయాన్ని చెప్పాలి.”

“నా అభిప్రాయం అంటే దేని గురించి?”

“నా కథ మీరు విన్నారుగా ఇంకా దేని గురించి అంటారేమిటి, ఏమీ తెలియనట్లు?”

“మీరు ఎన్నో రోజులు కష్టపడ్డాక; మీ మనుసులో మాట చెప్పారు. బాగానే ఉంది. మరి నేనూ కష్టపడాలి కదా, మీ గురించి క్లుప్తంగా కాదు వివరంగా తెలుసుకోవాలి కదా” మడత పేచీ పెట్టింది.

“మీకు ఛాన్స్ యిస్తున్నా కదా, తెలుస్కోండి” ఛాతీ వైశాల్యం సాగించి చైర్ వెనుక అనుకొని వ్యంగ్యంగా అన్నాడు.

“మీరేమైనా ఛాతీ చీల్చుకున్న తోకలేని హనుమంతుడా? మనసులోని శ్రీరాముల వారిని చూసేందుకు, పెద్దలు పెళ్లికి ఎన్నో మంచి-చెడ్డలు చూస్తారు. నేను కనీసం కొన్ని అయినా చూడాలి కదా. పైగా ఈ రోజే మొదటి రోజు మనం కలిశాం, లైఫ్ అంటే అంత ఈజీ గోయింగ్ కాదు?”

“మీ తెలివి మామూలుగా లేదు, వూ.. సరే, చెప్పండి ఎన్ని రోజులు నేను వెయిట్ చేయాలి?” మామూలుగా కూర్చున్నాడు.

“మీరు దేని కోసం వెయిట్ చేయాలో చెప్పలేదు” నవ్వుతూ అంది.

“మీరు పెళ్లికి ఒప్పుకుంటారా అని?”

“శౌర్యరాజ్ గారు, మనం ఇంకా ‘గారు, మీరు’ లోనే ఉన్నాము. మన స్నేహం బలపడాలి. ఒకరి పట్ల ఒకరికి ఇష్టం, గౌరవం యిలా ఎన్నో ఉన్నాయి.”

“ఎన్నో అంటే?” ప్రశ్నించిన అతనికి జవాబు రాలేదు. అతన్నే చూస్తూ ఉంది.

“నువ్వు అలా చూడకు, నా ఆశలు పెరుగుతూ ఉంటాయి” గోముగా అన్నాడు.

“అరె? అప్పుడే ‘మీరు’ ను ‘నువ్వు’ గా మార్చేశారు.”

“చెప్పానుగా, నేను తొందర మనిషినని. నువ్వు ఒప్పుకుంటే ఈ రోజే మా ఇంటికి కూడా కలిసి వెళ్దాం.”

“లేదు.. మరో సారి చూస్తాను. జస్ట్ అడ్రస్ ఇవ్వండి. మీ స్నేహం నాకు ఓకే. నేను చదువు పూర్తి చేయాలి, ఆర్థికంగా మా అన్నకు సహాయం చేయాలి. పెళ్లి ఎప్పటికైన అవుతుంది. కానీ మా అన్నా వదినలు నాకు కనిపించే తల్లిదండ్రులు. వారి సమ్మతం లేనిది నేను నా పెళ్లి నిర్ణయం తీసుకోను.”

“థాంక్స్. మొత్తానికి నువ్వు కూడా క్లుప్తంగా నీ గురించి చెప్పావు. నాకు దారి దొరికింది.” విప్పారిన కాటుక కళ్ళ అందాన్ని చూస్తున్నాడు.

“ఏ దారి?” ఆమె ప్రశ్నకు అతను జవాబు చెప్పలేదు. వెయిటర్ రావడంతో భోజనం ఆర్డర్ చేశాడు.

“మనం అప్పుడప్పుడు కలుసుకోవాలి లేదా మాట్లాడుకోవాలి అంటే ఏం చేయాలి?”

“స్నేహం పునాదులు గట్టి పడడం కోసమా?”

“ఇది నా కార్డ్” జేబులో నుంచి పర్సు తీసి అడ్రస్, ఫోన్ నెంబర్ ఉన్న విజిటింగ్ కార్డ్ యిచ్చాడు. నీ వివరాలు? అని కళ్లతో అతని ప్రశ్న.

“నాకు ఇలాంటి కార్డు లేదు” అన్న ఆఫీస్ అడ్రస్, క్వార్టర్ వివరాలు చెప్పింది.

“ఇంకా ప్రేమ మొగ్గలోనే ఉంది, అప్పుడే పెళ్లి మాటలెందుకని అనుకుంటున్నావా?” ఇంకా కొంచెం మనసు తెలుసు కోవాలని తాపత్రయ పడ్డాడు.

“నేను కలల్లో బ్రతికే దాన్ని కాను. సినిమాల్లో వలె పుట్టలు, చెట్లు పట్టుకొని తిరిగి ప్రేమించుకున్నామనే ఒక అపోహతో అందరి ముందు అభాసుపాలు అవ్వను. ఇద్దరి మధ్య ఇష్టం కొనసాగితే పెద్దల వరకు వెళుతుంది లేదంటే అభిప్రాయాలు మారుతాయి.”

సంతోషం పట్టలేక మొదటి కలయికలో హృది నుంచి ఇద్దరికీ మనసు పురివిప్పింది. మనసులు మాట్లాడుకున్నాయి! హోటల్ భోజనం ముగిసింది.

***

తెల్లారి సెలవు రోజు. చదువు దాచినందుకు శిక్షగా ఉద్యోగంలో నుంచి తీసేస్తారా? ఈ ఉద్యోగం వదిలి ఎక్కడికి పోవాలి? ఇంటి బయట ప్రాంగణం చూశాడు. ఇంటి చుట్టూ వెదురు చెక్కతో ప్రహరీ కట్టి ఉంది. శమంత నేల కనబడకుండా ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు, పూల మొక్కలు నాటింది. వాటి క్షేమం చూసేదీ ఇంట్లోని ఆడవాళ్లే.. నా ప్రమేయం ఏమీ లేదు. ఎన్నో ఏళ్లుగా పెరిగిన పనస, సపోటా, జామ, దానిమ్మ, కలుషితం లేని స్వచ్ఛమైన గాలి, సబ్సిడీ కరెంట్, ఉచిత త్రాగు నీటి సౌకర్యం! ఇన్ని సదుపాయాలు ఉన్న క్వార్టర్ వదిలి ఎక్కడికి పోవాలి? తలదాచుకునేందుకు స్వంత ఇల్లు ఉంది, మరి ఆకలిదప్పులు ఎలా??

కాలకృత్యాలు తీర్చుకుని, ఇంటి బయట నడుస్తూ టౌన్‌షిప్ గుడి వెనుక కొండల ప్రాంతంలో నిలుచున్నాడు. బాలాదిత్య మెల్లిగా వస్తున్న జాడలు కనబడుతున్నాయి. పరుగుల జీవితంలో ప్రకృతి అందాలే గమనించలేదు. సునాయాసంగా పైకి ఎదుగుతున్న సూర్యుడి కాంతి లో ఎన్ని రకాల మార్పులు!?

‘నా కుటుంబం నా బలం, నేను పోషించలేక పోవడం నా బలహీనత! నా విద్య నా బలం! నాకొక బ్రతుకు తెరువు కోసం విద్యను అదిమి పెట్టి తగిన ఉద్యోగంలో చేరకపోవడం నా బలహీనత!

నా బలం గెలవాలి! నా కుటుంబాన్ని పోషించుకోవాలి. నా ఆత్మవిశ్వాసంతో నేను గౌరవంగా జీవించాలి. ఎవ్వరికీ హాని చేయక నా మార్గాన నేను నడచినా ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి.’

ఎవ్వరిని పట్టించుకోని ఆదిత్యుడు అరుణరేఖల్ని విరజిమ్ముతున్నాడు. కన్నీళ్లకు, కష్టాలకు కుంగిపోరాదు; వాటిని ఎదుర్కొనే ధైర్యసాహసాలు ఇవ్వమని ఆకాశం వైపు చూస్తూ దేవుడ్ని కోరుకున్నాడు.

మబ్బుల ముళ్ళు గుచ్చుకోకుండా అరుణ రంగు మార్పు చెంది ఆదిత్యుడు తెలుపు రంగుతో ప్రకాశిస్తున్నాడు. అరచేతులు వాటంతట అవే జోడించుకుని నమస్కరించాయి. ‘దేవదేవా! ఏ కష్టం ఎదురైనా, ఎదురించే శక్తి నాకు ఇవ్వు, బ్రహ్మ విష్ణు మహేశ్వర రూప దినకరా శుభకరా దేవా’ అని మరో సారి మొక్కుకున్నాడు.

***

ఈడీ సార్ ఇంటి తలుపు తట్టాడు. జర్మన్ షెపర్డ్ పెంపుడు కుక్క కర్ణభేరి బద్దలయ్యేలా అరిచింది. ఇంటి లోపలి నుంచి సార్, బయట నుంచి వాచ్మాన్ ఒకేసారి దాశరథిని చూశారు.

“దాస్, కం కం” అంటూ ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించారు. కంపెనీ యిచ్చిన ఖరీదైన టేకు వుడ్ ఫర్నిచర్ పొందికగా డ్రాయింగ్ రూమ్ లో అమర్చారు. సర్ కూర్చోమన్నారు.

ఆఫీసులోని ఈడి హోదాలో ఉన్న మహదేవ్ గారికి ఇంట్లో సింపుల్గా బనీన్, ధోతిలో ఉన్న ఇంటి పెద్దాయనకు పూర్తిగా తేడా!

“చెప్పండి దాస్ గారు” అంటూ పెద్దమనిషి సుముఖత దాశరథి మనసును తేలికపరిచింది.

“సార్, నా ప్రాబ్లం ఒకటి కాదు, నా మనసులో ఒక..” చెప్పలేక తడబడుతున్నాడు.

దాశరథి మాటలు వినిపించుకోలేదు. చటుక్కున లేచి కిచెన్ వైపు నడిచాడు. మళ్లీ వచ్చి కూర్చుని, “ఇప్పుడు చెప్పండి దాస్ ఏమైనా క్వార్టర్ చేంజ్ కావాలా? నేబర్స్ గొడవలా?”

“నో సర్. యాక్చువల్లీ.. నేను ఎంకాం డిగ్రీ హోల్డర్. ఫామిలి ఇబ్బందుల వలన ఉద్యోగం తొందరగా వెతుక్కోవాల్సి వచ్చింది. సంవత్సరాలు గడుస్తున్నా జాబ్స్ దొరకనందున మెట్రిక్ సర్టిఫికెట్‌తో ఇప్పుడున్న జాబ్ లో చేరాను. వచ్చిన జీతంతో ఇల్లు గడుస్తుంది. ఏమి ప్రాబ్లమ్స్ లేవు.”

శ్రద్దగా వింటున్నారు సార్. “డిగ్రీ లేనందుకు నాకు ఆఫీసర్ ప్రమోషన్ రాదేమో, అయినా ఫర్వాలేదు. కానీ నా డిగ్రీని అదిమిపెట్టి ఉద్యోగంలో చేరినందుకు నా పైన మేనేజ్మెంట్ ఏదైనా చర్య తీసుకుంటారేమో అని కొంచెం దిగులుగా ఉంది” నసుగుతూ అన్నాడు దాశరథి.

సార్ వారి భార్య నిండు స్త్రీ మూర్తి వేడి ఇడ్లీ ప్లేట్ తో హాల్లోకి వచ్చారు. నవ్వుతూ “ప్లీజ్, హావ్ ఇట్.”

“సద్గుణ నా వైఫ్. మేడమ్ గారికి తెలుగు రాదు.”

తెలుగు రాకపోతే ఏమిటి చూడగానే కాళ్ళకు దండం పెట్టాలని తలంపు వస్తుంది. ఆరోగ్యమైన పసిమి ఛాయ గల్గిన ముఖం. కనీసం పౌడర్ కూడా రాసుకోలేదు, చిన్న కుంకుమ బొట్టుతో చూడముచ్చటగా ఉన్నారు.

ఇడ్లీ ప్లేట్ దాశరథి చేతిలో పెట్టారు ఈడి సార్ “మేము ఇప్పుడే టిఫిన్ చేశాం, నువ్వు తిన్నాక, కాఫీ తాగుదాం” ఆలస్యం చేయక టిఫిన్ తిన్నాడు.

కాఫీలు అయ్యాక “దాస్ ప్లీజ్ లిసేన్, నిన్ను నువ్వు నష్టపర్చుకున్నావు. అంతే గానీ మేనేజ్మెంట్‌కు ఏమీ నష్టం చేయలేదు. భయపడకు, నీకు ఎలాంటి ఉద్యోగ నష్టం జరగదు.”

భగవంతుడు అభయమిస్తున్నాడు, “ఒక వేళ నీకు ఆఫీసర్ కావాలనే కోరిక ఉంటే డిగ్రీ తప్పనిసరి. నువ్వు జాయిన్ అయ్యే కంటే ముందు చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇప్పుడు సమర్పిస్తే మేనేజ్మెంట్ నీ పైన యాక్షన్ తీసుకుంటారు. అంతే.. నువ్వు ఇంకా మెట్రిక్ తోనే అడ్జస్ట్ అవుతున్నావు కదా డోంట్ వర్రీ!”

“సర్, నాకు ఇప్పుడున్న సామాన్య జీవితం చాలండీ” కళ్ళు చెమ్మగిల్లాయి.

“కొన్ని నెలల్లో నేను రిటైర్ అవుతాను, ఈ యూనిట్ సవ్యంగా నడిచే ఆశ లేదు. బెటర్ నువ్వు హెడ్ ఆఫీస్‌కి ట్రాన్స్‌ఫర్ పెట్టుకో, ఫర్ సమ్మోర్ డేస్ యూ క్యాన్ గెట్ ఆన్” ఉద్యోగి రక్షణ నిమిత్తం చెప్పారు.

హెచ్.ఆర్. ఆశీర్వాదం గారికి యూనిట్ చీఫ్ మహాదేవ్ శర్మ గారికి ఎంత వ్యత్యాసం! ఒకరు బెదిరిస్తున్నారు. మరొకరు మంచి జీవిత మార్గం చూపుతున్నారు!!

“సర్, మీకు అసిస్టెంట్‌గా ఎక్కడికైనా వస్తాను గాని, వేరే ఎవరో అంటే..”

“నీలాంటి మంచి పనిమంతుడు పని గురించి ఆలోచించాలి కానీ ఎవరు బాస్? ఎవరు స్టాఫ్? అని లెక్కలు పెట్టుకొని గీతలు గీసుకోవద్దు.”

‘ఎంతో అనుభవంతో చెబుతున్నారు’ అనుకున్నాడు దాశరథి.

ఇదే మంచి అవకాశం ఆశీర్వాదంతో జరిగిన దొంగ పని గురించి చెప్పితే.., వద్దు; పని జరగనప్పుడు ఫిర్యాదు చేయలేను. నా విషయంలో సమస్యలు ఉంటే ఆలోచించాలి కానీ అందరి గురించి తనకెందుకు?

మనసు చల్ల బడ్డది, ప్రశాంతగా ఇల్లు చేరుకున్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version