[శ్రీమతి సురేఖ పులి గారు రచించిన ‘ప్రేమే మా బలం’ అనే నవలని రావాహికగా అందిస్తున్నాము.]
[కడుపు నొప్పి అని అబద్ధం చెప్పి, క్లాస్ ఎగ్గొట్టి బేకరీకి వెళ్ళి తన కోసం ఎదురుచూస్తున్న శౌర్యరాజ్‌ని కలుస్తుంది మనోజ్ఞ. అతని పుస్తకాలు అతనికి ఇవ్వబోతే, వద్దంటాడు. లోపల కూర్చుందాం రమ్మని అంటాడు. ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే బాగుండదని అంటుంది. కానీ అతడి ఒత్తిడి వల్ల లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. కర్రీ పఫ్స్, సాండ్‍విచ్ ఆర్డర్ చేస్తాడు. తన గురించి, తన కుటుంబం గురించి చెప్తాడు. అక్కడ చేరిన తుంటరి కుర్రాళ్ళు ఇబ్బంది పెట్టడంతో, మనోజ్ఞని తీసుకుని తాజ్ హోటల్‌కి వెళ్తాడు. ఓ మూల టేబుల్ తీసుకుని మాటల మధ్యలో తాను ఆమెను ప్రేమిస్తున్నట్లు, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్తాడు. అదంత సులువు కాదనీ, ఇప్పుడే తమ పరిచయం మొదలైందని అంటుంది, అతన్ని బాగా అర్థం చేసుకోవాలనీ అంటుంది. అంత కాలం తాను ఆగలేనని అంటాడు శౌర్యరాజ్. తన అన్నా వదినల సమ్మతి లేనిదే తాను పెళ్లి నిర్ణయం తీసుకోనని అంటుంది మనోజ్ఞ. చివరికి భోంచేసి వచ్చేస్తారు. చదువు వివరాలు దాచినందుకు ఉద్యోగంలోంచి తీసేస్తారేమోనని భయపడతాడు దాశరథి. దేవుడిని తలచుకుంటాడు. ఓ ఆలోచన వచ్చి, ఈడీ మహాదేవ్ గారి ఇంటికి వెళ్ళి, జరిగినదంతా చెప్తాడు. దాశరథి మేనేజ్‌మెంట్‌కు ఎటువంటి నష్టం కలిగించలేదనీ, అతని ఉద్యోగానికొచ్చిన ప్రమాదమేదీ లేదని ఆయన భరోసా ఇస్తారు. తెరిపినబడిన మనసుతో ఇంటికి తిరిగొస్తాడు దాశరథి. – ఇక చదవండి.]
“ఆగండి, దయచేసి ఒక్క నిమిషం ఆగండి..” ఆయాసంతో రొప్పుతూ అమ్మాయిల గుంపుకు ఎదురుగా వచ్చి నిలుచున్నాడు శౌర్యరాజ్. “ఈ పర్స్ మీ బ్యాగ్‌లో నుండి కింద పడిపోయింది, తీసుకోండి” అంటూ శౌర్యరాజ్ మనోజ్ఞ చేతిలో చక్కనైన మెత్తటి నల్ల రంగు మనీ పర్స్ చేతిలో పెట్టాడు. పర్స్ పట్టుకున్న చేతిని తన చేత్తో గట్టిగా అదిమి పట్టుకున్నాడు. మనోజ్ఞ క్షణం నివ్వెరపోయి, అటునిటు ఫ్రెండ్స్ ఉన్నారని మారు మాట్లాడక “థాంక్స్ అండీ” బరువు మోస్తున్న పుస్తకాల బ్యాగ్‌లో దూర్చేసింది. ఎటువంటి స్పందన కనపరచక అందరితో పాటు వెళ్ళిపోయింది.
ఎవ్వరు లేరని నమ్మకం కుదుర్చుకొని పెరట్లో కెళ్ళి నల్లటి వెల్వెట్ మనీ పర్స్ నుండి తెల్లటి కాగితం తొంగి చూసింది. సెంటు వాసన గుమ్ముగా ఉంది. చదవడం మొదలు పెట్టింది.
– ప్రతీరోజు కాలేజీ ముందు నీ అందమైన కాటుక కళ్ళ చూపు కోసం, నీ నవ్వు కోసం పడిగాపులు కాస్తున్నాను, నన్ను గమనించి కూడా ఏమీ పట్టనట్టు నువ్వు వెళ్లిపోతూ ఉంటే.. ఏమనుకోవాలి? నా ఫోన్ నెంబర్ నీ వద్ద ఉన్నా, ఒక్కసారి కూడా మోగలేదు. అస్తమానం ఫోన్ చూస్తూ కూర్చుంటున్నాను. నువ్విచ్చిన మీ అన్నయ్య ఆఫీస్ నెంబర్‌కు ఫోన్ చేస్తే, మాట్లాడేది మీ అన్నగారు. విసుగ్గా ఉంది. వచ్చే శుక్రవారం స్కైలైన్ థియేటర్‌లో హృషీకేశ్ ముఖర్జీ గారి ఆనంద సినిమా విడుదల, మనిద్దరికి రెండు మార్నింగ్ షో టిక్కెట్లు బుక్ చేశాను. ప్లీజ్.. చీర కట్టుకొని రావాలి. థియేటర్‌లో మాట్లాడుకోవడం కుదరదు, సినిమా చాలా బాగుంటుంది ఎందుకంటే నాకు ఇష్టమైన బెంగాలీ డైరెక్టర్ తీశారు. సినిమా తదనంతరం హోటల్ భోజనం. సరేనా? రావాలి.. మర్చిపోవద్దు. మీ కాలేజీ నుండి ఎక్కువ దూరం లేదు, ఈజీగా రిక్షాలో వచ్చేయవచ్చు, రూపాయి తీసుకుంటాడు. నేను థియేటర్ బయట ఉంటాను. నీ చుట్టూ ఉన్న సైన్యం చూస్తే ఇబ్బందిగా ఉంది, ఎల్లప్పుడూ నీకు సైన్యం అవసరమా? ఒంటరిగా ఉంటే ఎంత బాగుంటుంది.
నిన్నే నేరుగా థియేటర్ రమ్మంటున్నా, లేకుంటే నాకు నిన్ను కష్టపెట్టే ఉద్దేశం లేదు –
హడావిడిగా కాగితాన్ని పుస్తకాల బ్యాగ్‌లో నొక్కేసింది. అవును అతన్ని రోజు చూస్తుంది. తగుదునమ్మా అని ‘హాయ్’ అంటూ గాలిలో చేతులు ఊపితే, సమాధానంగా నేను పళ్ళు ఇకిలించి నవ్వలా? నా చుట్టూ అందరూ జనం ఉన్నారని ఏడుస్తూ పళ్ళు కొరుక్కుంటూ అతన్ని మభ్యపెట్టలా?
నా జీవిత ఉద్దేశం ముందస్తుగానే చెప్పినా అతనికి తొందర ఎందుకో? నేను నలుగురిలో అపవాదు తెచ్చుకొని అందరి ముందు చులకన కాను. అన్న నా మూలంగా వచ్చిన అపవాదు విని ఎంత బాధ పడతాడు? మనసుతో తర్జనబర్జన చేసుకున్నది.
నా వైపు నుండి ఆలోచిస్తే నేను సరిగ్గా ఉన్నాను. అతని వైపు..? ఏమో అతని పరిస్థితి ఎలా ఉందో? తొందరగా పెళ్లి చేసుకోమని అన్నా వదినలు వేరే సంబంధాలు చూస్తున్నారేమో!? నేను ఇష్టం, నన్నే పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా ఇంట్లో చెప్పడానికి ఆధారాలు లేక పాపం నా కోసం రోజు ఎదురు చూస్తున్నడేమో! అపవాదులు ఇష్టపడక, ఇలా జాగ్రత్తగా.. నాకు హుందాగా ఉత్తరం రాసి ఇస్తున్నాడమే!! ఇందులో తప్పేంటి??
ఉత్తరంలో బూతు మాటలు లేవు, నన్ను బెదిరించే వాక్యాలు లేవు. అదే అనసూయ బావ అనసూయకు.. ఛీ! అసభ్యంగా పిచ్చిగా రాశాడు. దానికి ఈ పిచ్చిది అదేదో సర్టిఫికెట్ అయినట్లు క్లాస్ అంతా చూపించి నవ్వుకున్నారు. పిటి యు బావ! అసలు అనసూయకు బుద్ధి లేదు. నచ్చితే జవాబు ఇచ్చుకోవల్సింది లేదంటే బూతు కాగితం అని చెత్తలో పడేయాల్సింది. క్లాస్ అంతా పబ్లిసిటీ చేసి అనవసరంగా వాళ్ళ బావను అపహాస్యం చేసింది, అలా తప్పు చేయొద్దు.
మనోజ్ఞ ఎడతెరిపి ఆలోచలకు అంతరాయం కలిగింది. అన్న వచ్చినట్టున్నాడు, అందరినీ సాయంత్రం టీ తాగమని వదిన పిలుస్తుంది. వెళ్ళకపోతే.. అన్న టీ కప్పుతో పెరట్లోకి వచ్చేసి.. నా బ్యాగ్ చూస్తే! వద్దు. బుద్దిగా తాను వంటింట్లోకి వెళ్లడమే సబబు!
‘అందమే ఆనందం’ అన్న వదినను మైమరిచి చూస్తూ ఘంటసాల గారి పాట పాడుతున్నాడు. వాళ్ళిద్దరూ అంత చనువుతో ఆనందంగా పాడుకుంటూ ఉంటే ముచ్చటేసి తలుపు దగ్గర ఆగిపోయింది. మళ్లీ పిలిస్తే వెళ్లొచ్చు!
అన్న స్వరం ఎంతో వినసొంపుగా ఉంది. సంగీతం నేర్చుకొని ఉంటే బాగుండేది. ఆర్థిక ఇబ్బందుల వలన జీవితంలో రాజీ పడ్డాడు. జాలేసింది! అన్నిటికీ డబ్బే కారణం! డబ్బుల ఇబ్బందుల ఇరకాటంలో ఎందరి కళలు కలలుగా మిగిలిపోతున్నాయో?
అందమే ఆనందం/ ఆనందమే జీవిత మకరందం/ పడమట సంధ్యా రాగం/ కుడియెడమల కుసుమపరాగం/ ఒడిలో చెలి మోహన రాగం/ జీవితమే మధురానురాగం/ అందమే ఆనందం/ ఆనందమే జీవిత మకరందం.. పాట ఆగిపోయింది.
అందమే ఆనందం.. ఆనందం! ఆనంద్.. కొత్త సినిమా! వంటింట్లో తన వంతు టీ తీసుకుంది. “మనూ, ఈ రోజు మీ అన్నయ్య చాలా సంతోషంగా ఉన్నారు? ఎందుకో అడుగు..” అంది.
“ఎందుకన్నా?” అమాయకంగా అడిగింది.
“ఈ రోజు స్కూల్ ప్రిన్సిపాల్ మీ పిల్లలిద్దరు చాలా బాగా చదువుతున్నారు, మంచి తెలివిమంతులని ఎంతో పొగిడారు.”
“అన్నా, ఆవిడ నీకేలా కలిసింది?”
“ప్రతి నెలా యాక్షన్ ప్లాన్ రిపోర్ట్ మా ఆఫీస్‌లో ఇవ్వాలి అందుకని స్కూల్ ప్రిన్సిపాల్‌తో పాటు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్చార్జి వస్తారు..” దాశరథి ఇంకా చెబుతూనే ఉన్నాడు.. ఏమీ తలకెక్కడం లేదు.
“మనూ, నిన్నే.. ఏమాలోచిస్తున్నావు?”
ఉలిక్కిపడ్డ మనోజ్ఞ “ఆ పాట ఏ సినిమాలో ఉంది అని ఆలోచిస్తున్నా?”
“బ్రతుకు తెరువు, మంచి సినిమా, ఎక్కడైనా మార్నింగ్ షో వస్తే మనందరం కలిసి చూద్దాం” తానే సినిమాలో నటించినంత సంతోషంగా అన్నాడు.
“మార్నింగ్ షో లో పాత సినిమాలే వస్తాయా? కొత్త సినిమాలు రావా అన్నా?”
“కొత్తగా విడుదలయ్యే సినిమాలు మార్నింగ్ షో తో మొదలు అవుతాయి. అవి లేకుంటే ఏవైనా మంచి ప్రజాదరణ పొందిన పాత సినిమాలు వేస్తారు.”
“ఓహో.. అలాగా! మరి నీకు మంచి హిందీ సినిమాల గురించి ఏమైనా తెలుసా?”
“మంచి హిందీ సినిమాలు.. తెలుసు, కానీ నీకెందుకు? నువ్వెప్పుడు హిందీ సినిమాలు చూడవుగా?”
అమ్మో! ఎక్కువ మాట్లాడితే అపాయం అనుకుంది. “మా కాలేజీలో శుక్రవారం రాగానే అదే.. సిటీ సెంటర్ కదా, ఏదో ఒక హిందీ సినిమా చూడాలని క్లాసులు ఎగ్గొట్టి మా ఫ్రెండ్స్ వెళతారు. అంతగా నచ్చే సినిమాలు ఏముంటాయని నా అనుమానం?”
“మనూ, మీ ఫ్రెండ్స్‌తో సినిమాలకు, షికార్లకు వెళ్లొద్దు. నీకు ఏదైనా చూడాలని ఉంటే నాతో చెప్పు, తప్పకుండా నేను తీసుకుని వెళ్తాను. సరేనా?”
“సరే, ఇప్పట్లో నాకు ఏమీ లేదు, ఒకవేళ ఉంటే తప్పకుండా చెప్తాను. నువ్వు చెప్పినట్టే అందరం కలిసి వెళ్దాం.” ఓ.. రారాజు! ఎంతో మంచి అమ్మాయిని నేను; నా చేత నా అన్నకు అబద్దం చెప్పిస్తున్నావు? అబద్ధం చెప్పినందుకు బాధ లేదు, శౌర్యరాజు తనలో లేని గుణానికి నాంది పలికించాడని నవ్వుకుంది.
***
జాన్ బేకరీ వద్ద నిల్చుని రిక్షా కోసం చూసింది. జాన్ బేకరీ ఓనర్ మనోజ్ఞ దగ్గరగా వచ్చి “క్యా, రిక్షా నహీ మిల్ రహా హై?”(ఏమిటి, రిక్షా దొరకడం లేదా?)
ఉలిక్కిపడింది. ఇతనికి ఎలా తెలుసు నేను రిక్షా కోసం చూస్తున్నా అని? పెదాల మీద బలవంతంగా నవ్వు పులుముకుంది.
“మై మేరే స్కూటర్ పే ఆప్కో సిన్మా టాకీస్ కనే చోడ్దూ?” (నేను నా స్కూటర్ పైన మిమ్మల్ని సిన్మా టాకీస్ వరకు వదిలిపెట్టవలేనా?) పొద్దున్నే జర్దా పాన్ వేసుకుని ఎర్రగా పండిన తమలపాకు జర్దా కంపు నోరు, గార పట్టిన నోటి పళ్ళు!
నేను సినిమాకే వెళ్తున్నా అని ఇతనికి ఎలా తెలుసు? నా మొహాన్ని ఇంత క్షుణ్ణంగా ఎలా చదవగల్గుతున్నాడు? ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేనుండలి! దేవుడు రక్షించి రిక్షా అతన్ని పంపించాడు.
“బేటీ, కాహా చల్నా?” (బిడ్డా, ఎక్కడికి వెళ్ళాలి?)
“ఇదర్హి.. (ఇక్కడికే) అని రిక్షాను కొంచెం ముందుకు నడవమని ఐదారడుగులు ముందుకు నడిచి “స్కై లైన్ థియేటర్ కే పాస్.” (స్కై లైన్ థియేటర్ వద్దకు).
“బైటో..” (కూర్చో) మురికిగా ఉన్న బట్టతో శుభ్రంగా ఉన్న సీటును తుడిచాడు.
“కితనా పైసే దేనా?” (ఎంత డబ్బులు యివ్వాలి?)
“జో చాహే ఓ దీజియే.” (మీకు తోచినంత ఇవ్వండి.)
“పక్కా బోలో.. కితనా పైసే దేనా?” (ఖచ్చితంగా చెప్పు, ఎంత డబ్బులు ఇవ్వాలని?)
“బేటీ, బోని కా టేం హై.. బైటో మేరీ అమ్మా” (బోణి సమయం బిడ్డా! కూర్చో నా తల్లీ) చిరాకో, పరాకో అర్థం కాలేదు.
బేకరీ ఓనర్ మనోజ్ఞ వైపు చూపు మరల్చక గమనిస్తూ దగ్గరగా వచ్చి “మేరా నాం జాన్, సూరి సాబ్కో మైనే బ్లాక్ మే సిన్మా టికిట్ బేజా, కోయి బాత్ నహి, రిక్షా వాలే కో అట్ అణా దేదీజీయే” (నా పేరు జాన్. సూరి గారికి బ్లాక్ లో నేను సినిమా టికెట్లు అమ్మాను, ఫరవాలేదు, రిక్షా వాడికి రూపాయి ఇవ్వండి).
అతని మాటలు వినబడ్డా, స్పందన చూపించక రిక్షా ఎక్కి కూర్చుంది.
జాన్ గారికి దుర్బుద్ధి లేదని మనసు నిలకడగా ఉంది. లేదంటే ఈ నా దొంగ వేషాలు అన్న వరకు చేరేస్తే, అమ్మో! వద్దు.. ఆ క్షోభ!
ఎదుర్కొనే ధైర్యం లేనప్పుడు, రాజుతో సినిమాలు ఎందుకు? అన్నకు కాదు, మనఃసాక్షి కి జవాబు ఇచ్చుకోవాలి! సినిమా మోజు కాదు! శౌర్యరాజ్కు ఉన్నది నిజమైన ప్రేమా? లేక టైమ్ పాస్ పేరిట అమ్మాయిల మోజా? తెలుసుకోవాలి.
కాలయానం మనోజ్ఞ శౌర్యరాజుల స్నేహాన్ని చిగురించింది.
***
వివిధ వ్యాపార సంస్థలు బొంబాయిలో వరుసగా వారం రోజుల పాటు ఫోటో షూట్ నిర్వహిస్తున్నారు. మౌర్యరాజ్ గారి ‘బ్యూటీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ’ కూడా పాల్గొంటున్నారు. సంవత్సరం వరకు కాంట్రాక్ట్ తీసుకున్న క్రమంలో మనోజ్ఞకు సూచన వచ్చింది. కానీ దాశరథి సెలవు మంజూరు కాలేదు, అన్న ఆఫీస్ వాళ్ళతో సంప్రదించి, బొంబాయిలో కలుసుకోవాల్సిన ఆఫీసర్ పేరు, ఫోన్ నెంబర్ తీసుకుని మొదటి సారి విమానం ఎక్కింది. తోడుగా శౌర్యరాజ్ కూడా ఉన్నాడు.
విమానం కిటికీ నుండి నేలను చూసి మురిసిపోయింది. దేవలోకం నుండి భూలోకం చూస్తున్న సంతోషం! తెల్లటి మబ్బుల్లో దూసుకు పోతున్న విమానం. కలలో కూడా అనుకోలేదు ఈ ప్రయాణం, పైగా పైసా ఖర్చు లేకుండా అంతా ఉచితం!
శౌర్యరాజ్ ఏదో మాట్లాడాలని తపిస్తున్నాడు. దేవలోకంలో ఉన్న మనోజ్ఞ ఆ సమయంలో మౌనంగా ఉంది. ఈ అదృష్టానికి కారణం తన అందమే!
‘దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఏదీ శాశ్వతం కాదు. నేను నేనుగా ఉండాలి. నా వలన ఎవరికీ బాధ కలిగించవద్దు. నాకు చేతనైనంత సహాయం చేయాలి. నాలో పొగరు, కోపం ఉండకూడదు’ మనసుకు తోచిందల్లా మననం చేసుకుంది.
బొంబాయి వచ్చేసింది. అంత పెద్ద నగరం ఇంత తొందరగా చేరుకోవడం? ఇంకా ప్రయాణం సాగితే బావుండును, మనసులోని మాట పైకి అనేసింది.
“అలాగే మన పెళ్లి అయ్యాక హనీమూన్..”
“ప్లీజ్, స్టాప్ శౌర్య! ఎప్పుడూ ఒకటే మాట వేరే టాపిక్ లేదా?” చిరాగ్గా అంది.
“లేదు, నా కోరిక నీతో చెబితే చిరాకేందుకు?”
“కోరిక సరే.. నీ మాటలు వలన నువ్వు ఒక బలహీనుడిగా అనిపిస్తుంది.”
“కోరికలకు మరో అర్థం బలహీనమే!”
“కాదు..”
“మరేంటి..?”
“ప్లీజ్, అర్థం లేని మాటలు వద్దు, మొదటి సారి ప్లేన్ ప్రయాణం.. నేను, నా మనసు ఆకాశంలో తేలిపోతుంటే, నన్ను వేరే వైపు మరల్చ వద్దు” ప్రాధేయపడ్డది.
“ఇదేం చూసావు, పెళ్లి తరువాత విదేశాల ప్రయాణం చేద్దాం” శౌర్యరాజ్ మాటలు వినబడ్డా జవాబు ఇవ్వలేదు.
దాశరథి ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు ఎయిర్పోర్టుకు రాలేదు. ఫోన్ చేసినా సమాధానం లేదు. మనోజ్ఞ వసతి ఏర్పాట్లు మౌర్యరాజ్ దగ్గర ఉండి చూసుకున్నారు. ఫైవ్ స్టార్ హోటల్ రంగుల హంగులకు దిమ్మ తిరిగి పోయింది. నగల ప్రదర్శన, గోవా టూరిజం, పట్టు చీరలు, సౌందర్య సాధనాల ప్రదర్శనలు జరిగాయి. ప్రముఖ వార్త విలేఖరులు ప్రదర్శన వివరాలు, ఫోటోలు తీసుకుంటున్నారు.
అందెలు అందుకోవటం, సింహాసనం మీద కూర్చోవడం అంటే ఇదేనేమో స్వర్గం! డబ్బు అందింది. అమితానందంతో అన్న ఆఫీస్ నెంబర్ కి ఫోన్ చేసింది.
“మనో,.. చాలా సంతోషం తల్లీ. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. ఏ లీగల్ అగ్రిమెంట్స్ పైన సంతకాలు చేయకు. మనకు అన్ని విధాలా సౌకర్యంగా ఉందో లేదో చూసుకొని ఆలోచిద్దాం.”
“సరే అన్న, అంతా బాగానే ఉంది. మీకు బొంబాయి నుండి ఏమైనా తీసుకురావాలా?”
“వద్దు, ఏమీ వద్దు. మన సిటీలో అన్నీ దొరుకుతాయి. నీ ప్రోగ్రామ్స్ అయిపోగానే నేరుగా ఇంటికి వచ్చేసేయ్, ఉంటాను. వేరే కాల్స్ వస్తాయి తర్వాత మాట్లాడతాను ఫోన్ పెట్టేస్తా” ట్రంక్ కాల్ ముగిసింది.
దాశరథి చెప్పినట్లుగానే సినీ రంగానికి చెందిన ప్రముఖులు కొందరు మనోజ్ఞకు ఆఫర్ ఇచ్చారు.
“ఆలోచించి చెబుతాను” అన్న మాట మనసులో నెమరు వేసుకొని ఆఫర్ యిచ్చిన వారిని దూరం పెట్టింది.
“రాత్రి ఫ్లయిట్, ఇంకా చాలా టైమ్ ఉంది. బొంబాయిలో చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, పద ఎటైన పోదాం” మనోజ్ఞ రూమ్ లోకి వచ్చి అడిగాడు.
“అన్నీ చూడలేము, చూడాలని లేదు. బీచ్ వెళ్దాం.” బయలుదేరారు; రెసిప్షన్ వద్ద ఎదురైన మౌర్యరాజ్ సంతోషంగా పలకరించుకున్నారు.
“మనోజ్ఞ గారు మీరు సినీ అవకాశాలు ఎందుకు వదులు కుంటున్నారు?” మౌర్యరాజ్ ప్రశ్న.
“నా చదువు సాగదు సార్. ఇప్పుడే సినీ రంగంలో ప్రవేశించాలని లేదండీ” సౌమ్యంగా సమాధానమిచ్చింది.
“ఈ గోల్డెన్ ఛాన్స్ లు మళ్ళీ మళ్ళీ రావు, ఎన్క్యాష్ యువర్ బ్యూటీ.”
“అన్నయ్యా, మేము బీచ్ వెళుతున్నాము, మీరు రండి” తమ్ముడు కలగ చేసుకున్నాడు.
“నేను క్లోసింగ్ ఫంక్షన్ చూసుకోవాలి, నువ్వు కూడా వెళ్లకు. షి కన్ గో విత్ అవర్ రెప్రెసెంట్స్.” (ఆమె మన ప్రతినిధులతో వెంట వెళ్ళగలదు).
“నో, నో, నేను తోడుగా వెళతాను” నిర్ధారణగా చెప్పాడు.
“వద్దు, మన వర్క్ వదిలి ఆ అమ్మాయితో బీచ్ ఇంపార్టెంట్ కాదు” అన్నదమ్ములిద్దరూ తర్కించుకున్నారు.
“నేను మనోజ్ఞను ప్రేమిస్తున్నాను. వాళ్ళ ఇంటి పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుంటాను” ముసుగు తొలగించాడు.
“వాళ్లు మనకు తగిన వారు కాదు, పెళ్లి చేసుకున్న తరువాత నువ్వు చాలా విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది, సుడిని ఎదుర్కోవాలి. వాటిని అధిగమించడం మంచిదే; కాదనను.. కానీ అధిగమించడం కంటే ఒక్కోసారి ఏటికి ఎదురీదడం అవుతుంది. ఆ ఎదురీతకు మనిషికి బలమైన విశ్వాసం, దృఢచిత్తం, అమితమైన సహనం కావాలి.” అక్కడ మరో ముఖ్యమైన శ్రోత ఉన్నా పట్టించుకోకుండా లెక్చర్ ఇస్తూనే ఉన్నాడు.
“అంటే, డబ్బున్న అమ్మాయిని మీరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే.. జీవిత ఎదురీత సులభంగా గెలిచినట్టు; నేను ఒక సామాన్య కుటుంబీకుల అమ్మాయిని కోరుకుంటే నేను ఓడిపోతానని మీ ఊహ! ఐ మీన్ మీ అంచనా?” ఎదురు దెబ్బ ఆశించలేదు, మాటల్లేక మూగపోయాడు మౌర్యరాజ్.
ప్రేమ యింత గుడ్డిదా, మగువ అందం ఒక మాయ అని ఎలా చెప్పాలి. ఈ పెళ్లి జరిగితే తమ్ముడు చాలా నష్టపోతాడు. అరిచి, కోప్పడి లాభం లేదు. చెప్పిన మాట వినని సోదరుడి వైఖరి చిరాగ్గా ఉంది. “ఓకే, బట్ ఐ కాంట్ సపోర్ట్ యు” వెళ్ళిపోయాడు.
(ఇంకా ఉంది)
సోషియాలజీలోనూ, ఇంగ్లీషులోనూ ఎం.ఎ. చేసిన శ్రీమతి పులి సురేఖ గారు హైదరాబాద్ హెచ్.ఎమ్.టి.లో పనిచేసి రిటైరయ్యారు.
స్కూల్ రోజుల నుంచి వీరి రచనా వ్యాసంగం కొనసాగుతుంది. సామాజిక విషయాల అనుభవాలు వీరి రచనల ఇతివృత్తాలు.
70 సంవత్సరాల వయసులోనూ ఉత్సాహంగా సాహితీసృజన చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 40 సామాజిక కథలు, నాలుగు నవలలు రచించారు. తెలుగు మరియు ఆంగ్లంలో వ్యాసాలు రాశారు. కొన్ని బహుమతులు గెలుచుకున్నారు.
