[శ్రీమతి సురేఖ పులి గారు రచించిన ‘ప్రేమే మా బలం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఇంటికొచ్చాకా, అబ్దుల్ రషీద్ వ్యవహారం, జరిగిన మోసమంతా భార్యకీ, చెల్లెలికీ వివరిస్తాడు దాశరథి. ఆఫీసులో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అన్నకి తెలియజేస్తుంది. భూషణాన్ని కలిసి, మన తరఫున మాట్లాడే లాయర్ని చూడమని అడుగుతానని అంటాడు. మనోజ్ఞ వ్యతిరేకిస్తుంది. ఆఫీసులో దాశరథిపై కేసు కొట్టేస్తారు. ఓ సెలవు రోజున తన సమస్య చెప్పి, సాయం చేయమని అడుగుదామని భూషణం ఇంటికి వెళ్తాడు. అతన్ని ఓ గదిలో కూచోబెట్టి, వేరేవాళ్ళొస్తే వాళ్లతో మాట్లాడడానికి వెళ్తాడు భూషణం. అతని వ్యవహారంపై అనుమానం వచ్చి అక్కడున్న ఓ టేబుల్ సొరుగులో చూడడంతో, నకిలీ సంతకాలతో తన ఇంటి పత్రాలు కనబడతాయి. నిర్ఘాంతపోయి, వాటిని రహస్యంగా దాచుకుని, అక్కడ్నించి బయటపడతాడు. తర్వాతి సెలవురోజున తన ఇంటికి ఒరిజినల్ కాగితాలు, భూషణం ఇంట్లో దొరికిన నకిలీ పత్రాలు తీసుకుని ఎం.డి. మహాదేవ్ శర్మగారికింటికి మనోజ్ఞని తీసుకుని వెళ్తాడు. ఆయన దాశరథితో మాట్లాడుతుండగా, మనోజ్ఞ ఆయన కొడుకు, ఆటిజమ్‌తో బాధపడుతున్న గురుదేవ్‌తో మాట్లాడుతుంది, అతనితో చెస్ ఆడి ఓడిపోతుంది. గురుదేవ్ ఎంతో ఆనందిస్తాడు. ఎండి గారి సలహా మీద, సమస్యని మానవ హక్కుల సంఘం ముందు పెట్టి, జరిగిన మోసాన్ని న్యాయమూర్తికి విన్నవించుకుంటాడు. దారిలో వస్తూ, పార్కులో కాసేపు నిద్రపోతాడు. – ఇక చదవండి.]
ఆఫీసులో భూషణం మాట్లాడటం మానేశాడు. ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణకు ఎగబడుతున్నారు. ఆశీర్వాదం వి.ఆర్.ఎస్. దరఖాస్తు ఇచ్చేశాడు. ఇప్పుడు పుకార్లు ఆశీర్వాదం వైపు మళ్ళాయి. ‘కంపెనీ సొమ్ము బాగా కొట్టేశాడు, అందుకే స్వచ్ఛంద పదవీ విరమణకు ముందస్తుగా దరఖాస్తు’ అని.
పర్సనల్ డిపార్ట్మెంట్ పని ఒత్తిడి పెరిగింది. ఛాయాదేవిని లోలోపలే వేరే విభాగానికి బదిలీ చేయదలచారు. భూషణం ఒప్పుకోలేదు.
“సర్ పని ఎక్కువ ఉన్న డిపార్ట్మెంట్కు నేను రెడీ.” దాశరథి ప్రస్తుతం ఉన్న చోట పని ఒత్తిడిని పరోక్షంగా తెలియ చేయాలనుకున్నాడు. పైగా శర్మ సార్ రిటైర్మెంట్ కూడా సమీపంలో ఉంది. ఇప్పుడున్న బిల్డింగ్ నుండి మరో బిల్డింగ్‌కు బదిలీ అయ్యాడు దాశరథి.
‘పని ముఖ్యం పాలిటిక్స్ కాదు’ అడిగిన వాళ్ళకి సమాధానం దొరికింది.
మానవ హక్కుల కమిషన్ నుంచి పోస్ట్ వచ్చింది, కాని ఏమి తీర్పు వినాల్సి వస్తుందోనని కవరు విప్పాలంటే భయంగా ఉంది. అయినా తప్పదు! ఈ పోస్ట్ కోసం ప్రతీ రోజు ఎదురు చూశాడు, తీరా వచ్చాక ఏ బాంబు పేలుతుందోనని హడలు!
“మనోజ్ఞ, నా కళ్ళలో ఏదో నలక పడింది, కొంచెం నువ్వు చదువు” తనలోని మనోధైర్యం దాక్కున్నది.
‘దాశరథి యిచ్చిన అప్లికేషన్ మరియు ప్రత్యక్ష సాక్షిగా జత చేసిన సంతకాల మేరకు అబ్దుల్ రషీద్ ఫోర్జరీ సంతకం చేసి ఇల్లు నోటరీ చేసుకున్నాడని రుజువైంది. రెండు నెలల గడువు లోపల అబ్దుల్ రషీద్ ఇల్లు ఖాళీ చేసి దాశరథికి అప్పగించాలి ఇక..’ చదవడం ఇంకా పూర్తి కాలేదు, అంతలోనే దాశరథి సంతోషం పట్టలేక కన్నీరు ఆగలేదు. కవరు మీద ఉన్న మానవ హక్కుల కమిషన్ ముద్రను పదే పదే గుండెలకు హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. లక్షల్లో ఖర్చు అని వాపోయిన సగటు సాధారణ మనిషికి న్యాయం జరిగింది.
వంట చేస్తున్న భార్యను వెళ్ళి అదుముకున్నాడు. “మణీ! నా ఇల్లు నాకు దక్కింది” తన ముఖం ఆమె భుజం పైన పెట్టుకున్నాడు. ఆతని కన్నీరు ఆమె భుజాన్ని తడి చేశాయి. అన్యోన్యమైన జంట అని మనోజ్ఞ మరోసారి రూఢి చేసుకుంది.
సంతోషం నలుగురికీ పంచుకునే క్రమంలో అరిసెలు చేసి ఇరుగు పొరుగున పంచారు. మహదేవ్ గారింటికి అందరూ కలిసి వెళ్లారు. ఈ మారు డాస్కీ మనోజ్ఞను చూడగానే తోకాడిస్తూ గంతులు వేసింది. మనోజ్ఞ డాస్కీని అదుముకొని ఆనంద పడింది.
నిస్వార్థపరుడైన మహదేవ్ గారి పాదాలకు దాశరథి వంగి దండం పెట్టాడు. సరైన సలహా ఇవ్వడం కూడా అందరి వలన కాదు. ఆలస్యం చేయక అప్పటికప్పుడే అందరూ అరిసెలు తిని తృప్తి చెందారు.
మనోజ్ఞ గురుదేవ్ కలిసి ఇంటి చుట్టూ పెరిగిన పూల మొక్కలను పలకరిస్తున్నారు. గురుదేవ్ ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు, ఇప్పుడు ఎడతెరిపి లేకుండా మాట్లాడుతున్నాడు. ఇద్దరూ ఎంత హాయిగా మాట్లాడుకుంటున్నారని తండ్రి కిటికీ నుండి గమనించి తృప్తి చెందాడు.
“దాశరథి, మనోజ్ఞకు ఇప్పట్లో మేరేజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?”
“లేదండీ, ముందు చదువు పూర్తి కావాలి. పెళ్ళికి తొందర లేదు సార్.”
“ఒక వేళ ఉంటే నాతో ముందుగా చెప్పాలి, ఎందుకంటే..”
గురుదేవ్ మనోజ్ఞ రంగు రంగుల పూలు ఇంట్లోకి తెచ్చి పూలగుచ్చం తయారు చేసి ఖాళీగా ఉన్న పూల కూజాలో అమర్చారు.
“అంకుల్, మీ గార్డెన్ చాలా బాగుంది” సంతోషంగా చెప్పింది.
“వారానికి ఒక సారి తోటమాలి వస్తాడు. నా శ్రమ ఏమీ చేయను, ఆంటీ శ్రద్ధ తీసుకుంటారు. కనీసం పువ్వులు కూడా తెచ్చి అందంగా అమర్చను” నవ్వుతూ అన్నారు.
“మీకు పుస్తకాలు చదవడం, మాకందరికి తెలియని విషయాలు చెప్పి మావంటి వారికి సహాయం చేయడం తెలుసు. అది ఎంతో గొప్ప పని” ఒకర్నొకరు పొగడటం సరిపోయింది.
***
చలికాలం, పొద్దున్నుండి సూర్యుడు మబ్బుల మాటున ఉన్నాడు. పెరట్లో చెట్ల నడుమ తివాసి పర్చి అందరూ వేడి వేడి చపాతీలు, ఆలూ-టమాటా కూర తో టిఫిన్ కానిచ్చారు. దోబూచులాడే ఎండలో చలి కాచుకుంటున్నారు.
“మనోజ్ఞ, నీతో కొంచెం మాట్లాడాలి” సెలవు రోజు దాశరథి తన తీరిక వేళను ఉపయోగించుకున్నాడు.
ఇంత నిక్కచ్చిగా అన్నాడంటే అర్థమైంది మనోజ్ఞకు “ఏమిటన్నా?”
“మహదేవ్ సార్ గారికి నువ్వు, నీ కదలికలు నచ్చాయి. వాళ్ల అబ్బాయి గురుదేవ్.. నీకు.., ఆ అబ్బాయి నచ్చితే, నా అభిప్రాయం అడిగారు. ముందు నీకు నచ్చాలి అని చెప్పాను, మరి నువ్వేమంటావ్?”
మనోజ్ఞ ఆశ్చర్యంతో “అదెలా సాధ్యం? నేను.. అదే, నన్ను ఇష్టపడటం? నీ ముందే, అంటే.. అదే, ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా నువ్వు ఉన్నావుగా, ఏమైనా ఓవర్‌గా చేశానా?” మాటలు తడబడుతూ తన అనుమానం చెప్పింది.
“ఓవర్‌గా చేస్తే నచ్చుతారా? ఒకడే కొడుకు, బోలెడు ఆస్తి, మంచి కల్చర్ ఉన్న ఫ్యామిలీ. తెలుగువాళ్ళే కానీ చాలా ఏళ్ళ తరబడి కర్ణాటకలో నివాసమున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు.”
శమంత కలుగచేసుకుంది “ఆ అబ్బాయికి ‘ఆటిజమ్’ అని వాళ్ళే చెప్పారు, అన్నీ తెలిసి మనమెలా ఒప్పుకుంటాము?”
“అదే పాయింట్! మరి, అందరి మధ్యలో ‘ఆటిజమ్’ కనబడుతుంది, అదే మనోజ్ఞ సమక్షంలో గురుదేవ్ మామూలుగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళు అక్కడే, మనోజ్ఞ నచ్చి నిర్ణయం తీసుకున్నారు.”
మనోజ్ఞ నేలపైన పర్చిన తివాసి దారాల కొనలను ముళ్ళు వేస్తూ మౌనంగా ఉంది. వదిన చెప్పే ఉంటుంది ‘శౌర్యరాజ్ సంగతి’ మరి తెలిసి కూడా గురుదేవ్ గురించి అప్పుడే అక్కడే ‘నో, వద్దు’ అని తేల్చి చెప్పక, ఇంటి వరకు మోసుకొచ్చి చెబుతున్నారంటే, ఆలోచనలు-అనుమానాలు మనోజ్ఞ మెదడులో సుడిగుండమై తిరుగుతున్నాయి.
“సడన్‌గా, అడిగితే మనోజ్ఞ సమాధానం చెప్పడం కష్టం. మీ ప్రియమైన చెల్లెలుకు కొంచెం టైమ్ ఇవ్వండి” శమంత అడ్డు వేసింది.
“మీ ఇద్దరూ ఆలోచించండి” దాశరథి అన్నాడు.
“మా ఇద్దరి సంగతి సరే, మీ మనసులోని మాట చెప్పండి” భర్తను అడిగింది.
“అవును, వదిన మాటలకు ఆన్సర్ కావాలి” మనోజ్ఞ తొందర.
నవ్వుకున్నాడు “మీరు నా జుట్టుకు తాడు కట్టి నన్ను లాగొద్దు, లేడీస్ ఫస్ట్; అది వదిన కావచ్చు మరదలు కావచ్చు.”
“దీన్ని టాక్టిక్స్ అంటారు”
“శమంతా, మనిద్దరం కాదు, మనోజ్ఞ తన ఇష్టాయిష్టాలు చెప్పాలి, పెళ్ళి దానికి మనకు కాదు.”
“అవును, టైమ్ తీసుకుని, ఆలోచించుకొని చెబుతుంది లేండి.”
“టైమ్ లిమిట్ ఉందా అన్నా!”
“నన్ను అడిగిన పెళ్లి పెద్ద టైమ్ లిమిట్ గురించి ప్రస్తావించలేదు. నేను అడగ లేదు. ఎందుకంటే ఆ మహనీయుడు నాకు ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో మార్లు అండగా ఉన్నాడు” హుషారుగా సాగే అంశంలో ఒక్కమారుగా దాశరథి సిరీస్ అయ్యాడు.
టిఫిన్ చేసిన ప్లేట్లు, కాఫీ కప్పులు పేర్చుకునే పనిలో మనోజ్ఞ నిమగ్నమైంది. మిగిలిన కూర, నీళ్ళ జగ్గు, గ్లాసులు పోగు చేసి వంటింటి వైపు దారి తీసింది ఇల్లాలు. మనోజ్ఞ హృదయం అలల అలజడితో అలసి పోయింది.
‘ఎందుకంటే ఆ మహనీయుడు నాకు ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో మార్లు అండగా ఉన్నాడు.’ ఈ వాక్యం చెవుల్లో మారుమ్రోగుతోంది. అంటే అన్నకు నేను గురుదేవ్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది.
నాదీ తప్పే, శౌర్యరాజ్ గురించి వదినతో చెప్పాను, గాని అన్నతో అనలేదు. అన్నావదినల మధ్య దాపరికాలు ఉండవు కదా, మరి?
‘అన్నతో చెప్పొద్దని నేనే అన్నానేమో’, వీలైనంత తొందరగా అన్నీ మాట్లాడుకోవాలి, ఇప్పుడెలా?
పాపం గురుదేవ్ చాలా మంచివాడు, అమాయకుడు.
మరి శౌర్య? చెడ్డ వాడా? ఒకరు మంచి అంటే మరొకరు చెడ్డ వాళ్ళవుతారా?!
ఇదేం పరీక్ష నాకు, హాయిగా ఎంజాయ్ చేసే నా మెదడుకు ఏదో సైంటిస్టుగా ఆలోచనలతో ఇరుకున పెడుతున్నాను.
కథల్లో, సినిమాల్లో ఉన్నట్టు పెళ్లి అనగానే అమ్మాయిలు సిగ్గుల మొగ్గలయి, పసిమి కాంతుల వర్ఛస్సు! ఏమిటేమిటో అంటారు, మరి ఈ సందిగ్ధం నాకెందుకు??
నన్ను ప్రాణంతో సమంగా చూసుకొనే అన్న మాటకు విలువనివ్వలా? నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న శౌర్యకు తోడునై నడవలా? ఇదేం పరీక్ష నాకు? అవివాహితగా ఉంటే సరిపోతుంది.
‘యౌవనం ఒక రణరంగం. తెలివిగా గెలవాలి మౌనంగా నిలవాలి. తానొవ్వద్దు, నొప్పివ్వద్దూ’ ఆలోచించ సాగింది.
***
“ఈ రోజు గురుదేవ్ పుట్టిన రోజు. ఓన్లీ మీ ఫ్యామిలీ మాత్రమే వస్తారు, ప్లీజ్ డూ కం హోమ్ దాస్!”
“అలాగే సార్.”
పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ పూలగుత్తి కానుకగా దాశరథీ, శమంతకమణి అందజేశారు.
“ఐ వాంట్ యువర్ గిఫ్ట్” (నాకు మీ నుండి బహుమతి కావాలి) అని గురుదేవ్ మనోజ్ఞ చెంతకు వచ్చి చేతులు పట్టుకుని అడిగాడు. ఒక్క క్షణం బిత్తరపోయి ఏం చేయాలో తోచక అటు ఇటు చూసింది. మహదేవ్ దంపతులు కూడా ఆశించని గురుదేవ్ చర్యకు చకితులైయ్యారు.
“వాట్ గిఫ్ట్ యు వాంట్? ప్లీజ్ లెట్ మి నో” (మీకు ఏ బహుమతి కావాలో దయచేసి చెప్పండి) మనసులోని ఇరకాటాన్ని కనపరచక, నవ్వుతూ అడిగింది మనోజ్ఞ.
“యువర్ బ్యూటిఫుల్ స్మైల్ అండ్ లవ్లీ ఫ్రెండ్షిప్ ఈజ్ ఎనఫ్!” (నీ అందమైన నవ్వు, ప్రేమమయం అయిన నీ స్నేహం చాలు).
“షూర్” అని పక్కనే ఉన్న పూల కూజాలో తాజాగా ఉన్న పూలగుత్తి నుంచి తెల్ల గులాబీ ఇచ్చింది. ఆనందంగా తీసుకున్నాడు.
దాశరథి దంపతులు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కున్నారు. ఎంత తొందరగా బయటపడితే అంత మంచిదనుకున్నారు. కానీ సద్గుణ ఒప్పుకోలేదు. తన కొడుకు ఇంకాస్త ఎంజాయ్ చేయాలనుకుంది.
నలుగురు కలిసి ఆడుకునే గేమ్స్ రెడీగా పెట్టారు. దాశరథి-గురుదేవ్ జత; మహదేవ్-మనోజ్ఞ మరొక జత; కారమ్స్ తర్వాత పేకాట, మధ్యలో తినుబండారాలు.
అదను చూసుకొని సద్గుణ కన్నడ మిళితమైన తెలుగులో అడిగింది. “మణి గారు మా అబ్బాయి మీ మరదలు చూడ ముచ్చటగా ఉన్నారు. మీకు ఇష్టమైతే, అంటే మాకు కట్నం, లాంఛనాలు ఏమీ వద్దు. వాడి ఇష్టం మాకు ముఖ్యం; వారిద్దరికీ పెళ్లి జరిగితే బాగుంటుంది.”
“మేడం గారు, ఈ విషయం ఇదివరకు మీ వారు మా వారితో చెప్పారు. మా ఆయన మనోజ్ఞను కూడా అడిగారు. కానీ జవాబు రాలేదు.”
“అంటే మీకూ, మీ వారికి ఇష్టమే కదా?” తిరకాసు పెట్టింది.
“మా ఇష్టం ముఖ్యం కాదండి. మనోజ్ఞ నిర్ణయించాలి, చెప్పాలంటే, మనోజ్ఞ చాలా మంచి అమ్మాయి అన్నీ సర్దుకుపోయే గుణం కలది. నేను గాని మా వారు గాని మనోజ్ఞ అభిప్రాయానికి కట్టుబడి ఉంటాము” తెలివిగా తప్పుకుంది.
“అవును, మీరు చెప్పింది నిజమే. మరి ఈ సంతోష సమయాన మనోజ్ఞను అడగనా?”
“ఆ అడగండి, కానీ ఒక్క విషయం మేడం గారు, ఒక వేళ మనోజ్ఞ ఈ పెళ్ళికి ఒప్పుకోక పోతే మీరు అన్యధా భావించవద్దు.”
“అలాగే, అంత హుషారుగా ఇండోర్ గేమ్స్ ఆడుతుంటే పైగా గురు గిఫ్ట్ అడగ్గానే ఒప్పుకున్న అమ్మాయి పెళ్లికి కూడా ఒప్పుకుంటుంది” నమ్మకంతో జవాబు వచ్చింది.
“మీకు అంత నమ్మకం ఉంటే ఓకే, మీరే అడగండి. మేము శ్రోతలము మాత్రమే.”
అన్ని గేమ్స్ లోనూ గురుదేవ్ గెలుపు సాధించాడు. “హుర్రే!” అంటూ ఆటను ముగించారు.
రెండవ మారు టీ తాగారు. “సార్ మేము వెళతాము” దాశరథి అన్నాడు.
“ప్లీజ్, కొంచెం సేపు ఆగండి” సద్గుణ అంది. ఎలాంటి తుఫాను ఎదుర్కోవాల్సి వస్తుందోనని లోలోపలే భ్రాంతి చెందింది మణి.
కొడుకును ఉద్దేశించి “గురు, నీకు మనోజ్ఞ నచ్చితే నీ మేరేజ్ చేద్దామని అనుకుంటున్నాము.” అక్కడితో ఆగక “మనోజ్ఞ, నువ్వు కూడా చెప్పాలి గురుదేవ్ నీకు నచ్చాడు కదూ?”
దాశరథి, శమంత ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కొడుకును అడిగే విధానంలో ‘ఛాన్స్ ఇస్తున్నట్టు’! అదే మనోజ్ఞ కు ‘నచ్చాడు కదా’ అని తీర్మానం ఇచ్చింది! అంటే ఈ సంబంధం పోగొట్టుకోవద్దని అర్థమా?
***
అందరికీ అసలు పరీక్ష ఇప్పుడు మొదలైంది!
“యా మమ్, మనో ఈస్ బ్యూటిఫుల్, హర్ హార్ట్ ఈస్ మోర్ అట్రాక్టివ్, ఐ లవ్ హర్!” (అవును అమ్మా, మనూ అందగత్తె, ఆమె మనసు చాలా ఆకర్షణీయంగా ఉంది, నేను ఆమెను ప్రేమిస్తున్నాను). బంతి మనోజ్ఞ వైపు పడ్డది. పెద్దల్లో ఆందోళన పెరిగింది.
ఎక్కువ సేపు ఆలోచించక మనోజ్ఞ అంది “థాంక్యు వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్, ఆన్ ది అదర్ సైడ్, యు టూ ఆర్ హ్యాండ్సమ్!” (నువ్విచ్చిన పొగడ్తకు చాలా థాంక్స్, నువ్వు కూడా చాలా అందగాడివి) సత్యమైన విషయం మరోసారి తెలియచేసింది.
గురుదేవ్ చాలా సంతోషంగా షేక్ హ్యాండ్ యిచ్చాడు. ఇంగ్లీష్ లో ఇంకాస్త మాట్లాడింది “నీ తెలివితేటలు అమోఘం! ప్రతి ఆటలో గెలుపు కోసం చాలా శ్రమిస్తావు. నీకు యింత ఏకాగ్రత ఎలా సాధ్యం?”
ఇంగ్లీషులో జవాబిచ్చాడు “నీకు అందం ఎలా సొంతమో అలాగే అనుకో, ఓడిపోయినా ఫరవాలేదు. ఓడిపోతూ ఉంటే గెలుపు దారి కనబడుతుంది. ఓటమిని అంగీకరించే ఓర్పు కావాలి అంతే!” లోక మెరిగిన నిజమైనా, అందరూ ఒప్పుకోలేరు!
చిన్నవాడైనా జీవిత సత్యాన్ని ఎంత బాగా చెప్పాడు అని దాశరథి మెచ్చుకున్నాడు. మనోజ్ఞ గురుదేవ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే బాగుండునని మనసులో కోరుకుంటున్నాడు. కళ్ళతో సైగ చేశాడు. ‘అబ్బాయి బాగున్నాడని’ అమ్మాయి నవ్వి వూరుకుంది.
“గురూ, మీ పేరెంట్స్ అనుకుంటున్నారు మనిద్దరం పెళ్లి చేసుకుంటే బాగుండునని, నీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలి?” ముఖ సూటిగా అడిగింది.
మహదేవ్ గారు అడ్డు వచ్చారు “మనోజ్ఞ, మాకు కావలసింది నీ అభిప్రాయం! గురుదేవ్ మేము ఏది చెప్పినా, ఎవర్ని మ్యారేజ్ చేసుకో అని నిర్ణయించినా అభ్యంతరం చెప్పడు, వాడికి ఏవో మాటలు చెప్పి ఇబ్బంది పెట్టకు” మానసిక బలహీనత అని తెలిసి కొడుకును వెనకేసుకొచ్చారు.
“అంకుల్, సారీ” మారు మాట్లాడక నొచ్చుకుంది. నొచ్చుకున్న మనోజ్ఞ ముఖం గురుదేవ్ తదేకంగా చూశాడు.
“డాడ్! బయట గార్డెన్లో చక్కటి పూల చెట్టును ఇంట్లో నా బెడ్ పైన పెట్టుకోలేను. మనోజ్ఞలో అందం, కలుపుగోలుతనం ఉన్నాయి. ఆమె ఒక స్నేహితురాలు మాత్రమే!”
ఆచితూచి మాట్లాడే గురుదేవ్ ఎడతెరిపి లేక మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. “నన్ను ఆటలలో ఓడించే అమ్మాయిని భార్యగా ఇష్టపడతాను. నాకు డాక్టర్ చదివిన అమ్మాయిలంటే కూడా ఇష్టం. ఎందుకంటే మనిషి అనాటమీ గురించి తెలిసి నన్ను, నా ఫ్యామిలీ బాధ్యతలు స్వీకరించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను” చెప్పాల్సిన మాటలు ఇంగ్లీష్‌లో చెప్పి గురుదేవ్ హాల్ నుండి వెళ్ళిపోయాడు. ఈసారి ‘సారీ’ చెప్పడం మహదేవ్ దంపతుల వంతైంది.
వెనువెంటనే ‘థాంక్స్’ కూడా చెప్పారు. ఇన్నాళ్ళూ ‘ఆటిజం’ అని గురుదేవ్ మనసులోని మాటను ఎవరు బయటకు రానివ్వక కప్పి పెట్టారు. మనోజ్ఞ పుణ్యమా అని ఒక అభిప్రాయానికి వచ్చారు.
పదే పదే థాంక్స్ చెప్తున్న వారిని అడ్డుకుని “ఆటల్లో నిపుణత కలిగిన మీ అబ్బాయిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది సార్! ఇక గురుదేవ్ ఒలంపిక్స్ పోటీలో పాల్గొనే అవకాశం ఉంది.”
ఇంటికి తిరిగి వస్తూ దారిలో అన్నాడు “పిల్లలు పెళ్లి విషయంలో గురుదేవ్ మాదిరిగా మనసులో ఉన్న మాట పెద్దలతో చెప్పాలి, వూరకే మనసులో పెట్టుకొని ఉంటే; పెద్దలు వేరే సంబంధాలు చూస్తే అందరికీ కష్టమే.”
ఇదే అదను అని ఇంటికి రాగానే మనోజ్ఞ శౌర్యరాజ్ గురించి చెప్పింది. ప్రశాంతంగా విని, “ఆతన్ని రమ్మను, నేను మాట్లాడిన తర్వాత సరైన సంబంధమా, కాదా?.. చెప్తాను.”
“అన్నా, మళ్లీ ఇదేం మడత పేచీ? ‘కాదు’ అనొద్దు మేమిద్దరం ఒకర్నొకరం ఇష్టపడ్డాం.”
“ఇష్టపడితే? అతను నీకు ఎంత వరకు సరిపోతాడు అనే విషయం మేము చూడాలి. పైగా జీవితం కథ, నవల, సినిమా కాదు, ఇప్పుడున్న నీ వయసులో కలిగేది ఆకర్షణ! ప్రేమ కాదు. కలిసి జీవిస్తుంటే కష్టసుఖాలు పంచుకుంటే ప్రేమ జనిస్తుంది.”
నిరాశగా ఉన్న మనోజ్ఞ ముఖం చూసి శమంతకమణి అంది “మనోజ్ఞ, ఎందుకు చిన్నబుచ్చుకుంటావు? అతను బాగుంటేనే కదా నీకు నచ్చాడు. మీ అన్నయ్య ఆఫీస్ సెలవు ఉన్న రోజు రమ్మను, సరేనా!” ఓదార్పుగా అంది. ఆ రోజు రాత్రి ముగ్గురు నిద్ర పోలేదు. ఎవరి మనసులో వారికి తోచిన రీతిలో జవాబు లేని ప్రశ్నలు!
(ఇంకా ఉంది)
సోషియాలజీలోనూ, ఇంగ్లీషులోనూ ఎం.ఎ. చేసిన శ్రీమతి పులి సురేఖ గారు హైదరాబాద్ హెచ్.ఎమ్.టి.లో పనిచేసి రిటైరయ్యారు.
స్కూల్ రోజుల నుంచి వీరి రచనా వ్యాసంగం కొనసాగుతుంది. సామాజిక విషయాల అనుభవాలు వీరి రచనల ఇతివృత్తాలు.
70 సంవత్సరాల వయసులోనూ ఉత్సాహంగా సాహితీసృజన చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 40 సామాజిక కథలు, నాలుగు నవలలు రచించారు. తెలుగు మరియు ఆంగ్లంలో వ్యాసాలు రాశారు. కొన్ని బహుమతులు గెలుచుకున్నారు.
