Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమే మా బలం-8

[శ్రీమతి సురేఖ పులి గారు రచించిన ‘ప్రేమే మా బలం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[దాశరథి ఆఫీసులో ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణకు ఎగబడుతారు. అతనికి పనిభారం పెరిగిపోతుంది. ఇప్పుడున్న బిల్డింగ్ నుండి మరో బిల్డింగ్‌కు బదిలీ అవుతాడు. మానవహక్కుల సంఘం దాశరథికి అనుకూలంగా తీర్పు ఇస్తుంది. రెండు నెలల్లో ఇళ్ళు స్వాధీనం చేయమని ఆదేశిస్తుంది. దాశరథి చెల్లెల్ని వెంటబెట్టుకెళ్ళి మహాదేవ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. గురుదేవ్‍కి మనోజ్ఞతో చనువు ఏర్పడడం గమనించిన మహాదేవ్ గారు, ఆయన భార్య మనోజ్ఞని కోడలిగా చేసుకోవాలనుకుంటారు.  తమ కుటుంబానికి ఎంతో చేసిన మహాదేవ్ గారి ఋణం తీర్చుకోడానికైనా చెల్లెలు వారి కొడుకుని పెళ్ళి చేసుకోవాలని భావిస్తాడు దాశరథి. ఎటూ చెప్పలేక మనోజ్ఞ నలిగిపోతుంది. గురుదేవ్ పుట్టిన రోజుకి దాశరథిని కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తారు మహాదేవ్ దంపతులు. ఆ వేడుక సందర్భంగా గురుదేవ్‌తో మనోజ్ఞ పెళ్ళి ప్రస్తావన మళ్ళీ వస్తుంది. అయితే గురుదేవ్ మాత్రం మనోజ్ఞ తనకి చక్కని స్నేహితురాలు మాత్రమేనని చెప్పి, ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకోవడం లేదంటాడు. అలా ఓ సమస్య పరిష్కారమవుతుంది. ఇంటికి వచ్చాకా అన్నకి శౌర్య రాజ్ గురించి చెప్పాలని అనుకుంటుంది మనోజ్ఞ. దాశరథి ఆఫీసు సెలవున్న రోజున శౌర్యని రమ్మని చెప్పమని వదిన చెప్తుంది మనోజ్ఞకి. – ఇక చదవండి.]

రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం మూడో నాటికి ఉధృతమైంది. ఉతికిన బట్టలు ఇంట్లో అటు ఇటు తాళ్ళు కట్టి ఆరబెట్టిన ఆరలేదు. సోమవారం ఫ్యాక్టరీ సెలవు రోజు, దాశరథి పిల్లలు ఇంట్లో ఉన్నారు.

“ఈ వాన మూలంగా నేను కాలేజీ మానేయాల్సి వచ్చింది” విసుక్కుంది.

“ప్రకృతి ఏ కాలంలో జరగాల్సిన పనులు చేసుకుంటుంది. వానలు పడలేదనుకో ఎవరికి నష్టం?”

“కురిసినపుడు విసుక్కోవడం, ఎండినప్పుడు ఎదురు చూపు చూడటం మనుషులకు మామూలే వదిన.”

“అదే వద్దని నా అభిప్రాయం, ప్రణిత రైమ్స్ లో రేన్ రేన్ గో అవే, కం అగైన్ అనదర్ డే, లిటిల్ జానీ వాంట్స్ టు ప్లే! అని పాడుతూ డాన్స్ చేస్తుంది, నాకు అసలు నచ్చలేదు.”

“అదేదో చిన్న పిల్లల నోరు తిరగాలని ఇంగ్షీషు ప్రాసపదాల పద్యం పెట్టారేమో..” దాశరథి అన్నాడు.

“చిన్నపిల్లలు భగవత్ స్వరూపం! వారి నోట వెంట యథార్థం పలికించాలి, అంతే కాని వరుణుడిని ఆగిపో అని అంటే ఎలా? ఏదో మన పనులు ఆగిపోతున్నాయని వానలు వద్దని పాటలు, పద్యాలు వల్లించొద్దు” చెప్పింది.

“పెద్దగా చదువుకోలేదంటావు కానీ లోకాయుక్తగా లాజిక్ చెపుతున్నావు” మెచ్చుకున్నాడు. ఇకమీదట అలాంటి రైమ్స్ మన పిల్లల చేత చదివించవద్దు, మార్కులు పోయినా ఫర్వాలేదు.”

“నేనెప్పుడో మానేసానండి!” గొప్పగా చెప్పింది శమంతకమణి.

“అందుకే అన్నా, ఎడతెరిపి వానలు.. వానా వానా వల్లప్ప, చేతులు చాచి చెల్లప్ప..” నవ్వుతూ చెప్పింది మనోజ్ఞ.

అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ముందు గదిలో ఆరని తేమ బట్టల్ని ఇస్త్రీ చేసి సన్నిత, ప్రణీత చేతల్లో చెరొకటి చొప్పున అందిస్తూ వాటిని భద్రంగా రోజువారీ బట్టల బీరువాలో సర్దిపెట్టారు. శమంతకమణి పెరట్లోని చామాకులు తెచ్చి రుచిగా వేడిగా చామకూర పొట్లాలు చేసి అందరికీ పెట్టింది.

“వదినా, నువ్వు ఏవైన అంటే.. ఇదిగో ఇట్లాంటి భిన్నమైన పకోడీ చేస్తే నన్ను పిలిచి నాతో చేయించు, నేను నేర్చుకోవాలి” నాలుక కాల్చుకుంటూ వేడి చామకూర పోట్లాలు తింటూ అంది.

“ఇప్పుడు చెప్తాను విను, మరోసారి ఎప్పుడైనా చేద్దువు.”

“నాకు పుస్తకంలో రాసుకుంటే గాని ఎక్కదు” ఇష్టమైన, కఠినంగా తోచిన వంటలు రాసుకున్న పుస్తకం తెచ్చింది.

“కొత్త పుస్తకం పెట్టాలి, అన్ని పేజీలు నిండి పోయాయి” గొణుక్కుంది మనోజ్ఞ.

దాశరథి చేయి కడుక్కొని వచ్చాడు. “ఎంత థియరీ రాసుకున్న ప్రాక్టికల్స్ వలన నువ్వు పర్ఫెక్ట్ అవుతావు. రుచిగా వండి ఇంట్లో అందరికీ పెట్టాలి అనే ఆలోచన నీ మనసుకే రావాలి, అదొక తృప్తినిస్తుంది.”

“నేనున్నా కదా, పెళ్లి అయిన తర్వాత ఇవన్నీ తప్పని పనులు, ఇప్పటి నుంచి అవసరమా? మనూ, నీ ధ్యాస చదువు మీద నుండి మరల్చకు! వంట ఎప్పుడైనా, ఎవరికైనా వస్తుంది, కానీ చదువు అవకాశం అందరికీ రాదు” కాలేజీ చదువులు ఎరుగని అసంతృప్తిని చవి చూసిన మహిళ ఆవేదనతో అంది.

“ఎప్పుడూ చదువే అంటే దానికి బోర్! అప్పడప్పుడు నీ వద్ద వంటలోని చిట్కాలు నేర్చుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది” దాశరథి అన్నాడు.

“వదినా, నువ్వు అన్ని వంటలు చేయగలవు కాబట్టి నేను చదువుకోవాలని కోరిక. అన్నకు నన్ను అల్ ఇన్ వన్ ఉండాలని ఉబలాటం, అంతే కదా అన్నా?” దాశరథిని చూసి అంది.

“అల్ ఇన్ వన్ ఒక్కటే కాదు, యు అర్ ది బెస్ట్ వన్ కావాలి అని నా ఆశ!” అనగానే దాశరథి కాళ్ళు మొక్కాలని మోకాళ్ళు తాకింది.

“అరే, ఏమైందమ్మా..” చెల్లెలి భుజాలు పట్టుకుని పైకి లేపాడు.

“నా గురించి ఎంత మంచిగా ఆలోచిస్తున్నావు. నీకు చెల్లెలుగా పుట్టడం నా అదృష్టం!” మనోజ్ఞ కళ్ళు చెమ్మగిల్లాయి. భగవంతుడి మరో రూపమైన అన్నకు నేను, నా పెళ్లి బరువు కావద్దు. ఆలోచనలు మనోజ్ఞ మెదడును తొలుస్తున్నాయి.

ఎన్ని కోణాల్లో చూసినా ‘శౌర్య తనకు భర్తగా సరిపోతాడు’ అని తలపిస్తుంది. ముఖ్యమైన మొదటి కారణం అతను నన్ను ఇష్టపడుతున్నాడు. అతని ఇంటి వాళ్ళ గూర్చి చెప్పినంత వరకు నిజాలే ఉన్నాయి. ఆడపిల్ల పెళ్లికి పెద్దలు చూసే విషయాలు ఏముంటాయి?

అబ్బాయి కుటుంబ చరిత్ర బాగుందా? అతనికి అంగ వైకల్యం లేదు కదా? కులం, గోత్రం, గుణం, అందం, చదువు, ఉద్యోగం, సంపాదన ఉన్నాయా?

అన్నీ ఉన్నాయి! ఉద్యోగం బదులు బిజినెస్ ఉంది. బోలెడు ఆస్తి ఉంది. ఆడబిడ్డ జోరు, అత్తపోరు లేవు. మరి? ఇంతే! ఇంట్లో వాళ్ళు భూతద్దంలో పెళ్లి సంబంధాలు చూసి నిర్ణయించేది!! రోజు ఇలాంటి ఆలోచనలతో మనోజ్ఞ మనసంతా కకావికలమైంది.

అమ్మ నాన్నల ఫోటోలు మాత్రమే చూసిన నాకు, ఏ రోజు కష్టం-కన్నీరు తెలియకుండా పెంచిన అన్నకు నా పెళ్లి విషయంలో కొంత వూరట కలిగిస్తే మంచిదే కదా! లవ్ మేరేజ్ అని అన్నకు కోపం వస్తుందా? నేనేమైనా లేచి పోతున్నానా? సోమరి దద్దమ్మను కోరుకుంటున్నానా?

కాదుగా! సమయం-సందర్భం చూసి నచ్చచెప్పాలి. చాలా ధైర్యం కావాలి. పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి? ఎలా కట్టాలి? శౌర్యతో కట్టించాలి! మనోజ్ఞ తన సంఘర్షణ శౌర్యతో చెప్పింది.

***

శౌర్యరాజ్ ఫారిన్ చాక్లెట్స్, మన్నికైన ఆపిల్ పళ్ళు పట్టుకొని తన కారులో వచ్చాడు. మనోజ్ఞ అన్నగారితో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి వాటి గురించి ఏమీ ఆలోచించలేదు. అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకోవాలి. అదొక్కటే ధ్యేయం!

నమస్కారం ప్రతి నమస్కారం తర్వాత ‘హాయ్’ అని ఆపిల్ పళ్ళు సన్నితకి, ఫారిన్ చాక్లెట్స్ ప్రణీతకు ఇచ్చాడు.

దాశరథి మౌనం చూసి శమంతకమణి అన్నది “మీరిద్దరూ ఇష్టపడ్డారు. మా అమ్మాయి మీ ఇంట్లో సర్దుబాటు అవుతుందని మేము ఎలా నమ్మగలం?”

“అడ్జస్ట్ కాలేదు అని తెలుసండీ, మనోజ్ఞ వచ్చేది అత్తారింటికి కాదు, నా ఇంటికి; ఇప్పుడున్న ఇల్లు మా అన్నయ్యది. నా ఇల్లు దాని పక్కనే ఉంది, అద్దెకిచ్చాను” మర్యాదగా సమాధానం ఇచ్చాడు.

దాశరథి మాట్లాడుతూ “మీరు ఆర్థికంగా మాకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారని తెలుసుకున్నాను. నీకు ఉద్యోగం లేదు. బిజినెస్, అది కూడా మీ అన్న గారి సమక్షంలో ఉంది. మరి నా చెల్లెల్ని ఎలా చూసుకో గలరు?” ప్రశ్నలు సమంజసంగా ఉన్నాయి అనుకున్నాడు విద్యార్థి.

“నా మీద నాకు నమ్మకం ఉందండి. నా వంతుగా నా బ్యాంక్ ఎఫ్.డి.లు, షేర్స్ ఉన్నాయి. గోల్డ్ బిజినెస్‌లో కొంత పలుకుబడి ఉంది. అరబ్ దేశాల కాంటాక్ట్స్ ఉన్నాయి. నేను నా కుటుంబాన్ని పోషించగలననే నమ్మకం, ధైర్యం ఉంది.”

ఆసక్తిగా వింటున్నారు. ఉల్లిపాయ బజ్జీలు, టీ తెచ్చి టేబుల్ పైన పెట్టింది మనోజ్ఞ. టీ తాగాడు.

“సర్, కొంత మనోబలం కావాలి, అందుకే అడుగుతున్నాను నన్ను నమ్మండి” రెండు చేతులతో దండం పెట్టి అడిగాడు శౌర్యరాజ్. కొద్ది సేపు మౌనం ఆవహించింది.

“అన్యథా అనుకోవద్దు, నా సలహా వింటారా?” ప్రశ్నించాడు.

“చెప్పండి సర్, తప్పకుండా వింటాను. కానీ నెగిటివ్ మాటలు వద్దు ప్లీజ్” స్వరం నిండా అర్థింపు.

“మనోజ్ఞ మీ గురించి చెప్పిన పిమ్మట నేను మీ ఇంటి విషయాలు అంటే నాకు అవసరం ఉన్నంత మేరకు శోధించాను. అదేంటంటే, మీ అన్న గారికి డబ్బు, హోదా ఉన్నాయి. నేను మీ పెళ్లి జరిపిస్తే, మర్నాడు నాకూ, నా కుటుంబానికి అతను ఏదైనా హాని చేస్తే?” అనుమానం తెలిపాడు దాశరథి.

“లేదు సార్, మా అన్నయ్య మంచి వాడు, అలా ఒకరికి కీడు చేయడు. ఆ తత్వం కాదు” అన్నను సమర్థిం చాడు తమ్ముడు.

“మీ ఫ్యామిలీ వరకు మంచి! నా చెల్లెలే ఇష్టం లేనప్పుడు, మంచితనం మారదని గ్యారెంటీ ఏమిటీ?” స్పష్టీకరించాడు.

“మీరు అనుభవజ్ఞులు, మీరే తగిన సలహా ఇవ్వండి. ఆ ప్రకారం నేను వెళతాను” రాజీకి వస్తే మంచిదని ఎదుటి వారి ఒప్పందం సమ్మతమే అనుకున్నాడు.

“విను మరి, మీరిద్దరూ మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్టర్ చేసుకోండి. అలాగే షూరిటీ కూడా సంపాదించండి. నెల గడువులో మీకు మ్యారేజ్ డేట్ వస్తుంది. సంతకాల పెళ్లి జరుగుతుంది. మీ అన్నయ్య కోపం తగ్గిన తర్వాత మీ ఇష్టం!” దాశరథి తనకు తోచిన తీర్మానం ఇచ్చాడు

“మా వారు కీడెంచి మేలెంచుతున్నారు. మీరు తప్పుగా అనుకోవద్దు” శమంతకమణి భర్త మాటకు బలం ఇచ్చింది.

“ఇందులో తప్పేముంది నా మంచికే అన్నారు. మీరు చెప్పినట్లే చేస్తాను.” ఎంతో నసపెట్టి యిబ్బంది చేస్తారనుకున్నాడు, కానీ పెద్ద బుద్దితో మర్యాదగా ఒప్పుకున్నారు. కొన్ని షరతులు పెడితే పెట్టారు, ఫరవాలేదు ఈ మాత్రం ఒక అన్నగా మనోజ్ఞకు అండగా ఉన్నాడు; చూస్తుంటే ముచ్చటగా ఉంది.

దాశరథి ఒక్క సైగ చేయగానే శమంతకమణి, మనోజ్ఞ కూర్చున్న హాలు వదిలి బెడ్ రూమ్ వైపు నడిచారు.

“ఓకే, బట్ ఐ కాంట్ సపోర్ట్ యు” చిరాగ్గా మౌర్యరాజ్ మాట్లాడిన సన్నివేశం తలుచుకున్నాడు. అన్నయ్యకు ప్రతిచర్యను నిర్దేశించడం మాత్రమే తెలుసు, ఎదుటి వ్యక్తి మనసులో సంఘర్షణ, బలహీనతలు గుర్తించే విశాలత్వం లేదు.

దాశరథి, మౌర్యరాజ్ ఇద్దరూ అన్నలే! ఒకరు పెళ్లి ఒప్పుకుంటున్నారు, మరొకరు వద్దంటున్నారు. ఇద్దరూ ఔనంటే సమస్య లేదు, ఇద్దరూ వద్దంటే లేచిపోయి గుళ్లో పెళ్లి చేసుకోవచ్చు, ఇరుకైన దారి నడక, ఒక్క మార్గపు బాట!

ఆలోచనలకు అంతరాయము కల్గింది, లోపల ఏదో నిర్ణయం తీసుకొని ముగ్గురు వచ్చారు.

“శౌర్యరాజ్, విషయం ఏమిటంటే..” గుండె గుభేలుమంది! మళ్ళీ ఏదో తిరకాసు పెడతాడా? ఉత్సాహం క్షణకాలంలో నీరుగారిపోయింది ఆశ అడియాస అయింది.

“పద్దతిగా ఒకసారి మీ అన్న వదినలతో నేను కలిసి మాట్లాడతాను, వాళ్లు నా చెల్లిని మీతో పెళ్లికి అంగీకరించకపోతే అప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ దారి వెంట నడుచుకోవచ్చును.”

“సర్, మా అన్నయ్య.. నిజంగా చెప్పాలంటే చాలా ఉత్తముడు, కానీ స్వ విషయానికొస్తే ఆయనకు కొన్ని.. అంటే తాను గీసుకున్న కొన్ని పరిధులు ఉన్నాయి. అందరిని సమదృష్టితో చూసే ఆదర్శవంతుడు కాదు ధనిక, పేద; పెద్ద, చిన్న తరతమ భేదాలు వేలెత్తి చూపుతారు. మీరు మా ఇంటికి వస్తే.. నాకేమీ అభ్యంతరం లేదు, కానీ మీకు మా అన్నయ్య కఠినత్వం భరించలేరేమో. మీకు అవమానం తప్ప ఆదరణ, ఆప్యాయత దొరకదు అనుకుంటున్నాను. ఆ పైన మీ ఇష్టం!”

“ఇంత బహిరంగంగా తోబుట్టువు గుణం చెప్పినందుకు ఒక రకంగా బాగానే ఉంది మరో రకంగా బాధగా కూడా ఉంది. ఏది ఏమైనా మీరు మీ నిర్ణయం మార్చుకోకుండా ఉంటే.. నా తోబుట్టువు కోరిక కోసం నేను అవమానాలు లెక్క చేయను. ఏదో ఒక రోజు సమయం కుదిరిస్తే, నేను, మణి మీ ఇంటికి వచ్చి పెళ్లి విషయం మాట్లాడతాను” దాశరథి గురుతర బాధ్యతను నిర్వర్తించదలచాడు.

వెళుతూ ఆదిశంకరులుగా అగుపించిన జంట కాళ్ళకు దండం పెట్టాడు, ఆశీర్వదించారు. కాబోయే కొత్త జంట సంతోషంగా కళ్ళతోనే సంభాషించుకున్నాయి.

ఊహించినట్టుగానే మౌర్యరాజ్ గురించి సరిగ్గా అంచనా వేశాడు తమ్ముడు, మనోజ్ఞ తో శౌర్యరాజ్ వివాహం ససేమిరా ఒప్పుకోలేదు.

***

మేధావుల మేధావితనానికి, గౌరవనీయతకు, విశ్వసనీయతకు నిజాయితీ అన్నది చివరి గీటురాయి అవుతుంది. మహదేవ్ గారి పదవీ విరమణ జరిగిన అనంతరం ఆఫీసులో పని చేయాలని అనిపించలేదు. పైగా ఎన్నాళ్ళని జీతాలు లేని ఊడిగం? యాజమాన్యం యిచ్చే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంటే కనీసం తనకు వచ్చే బకాయిలన్నీ వచ్చేస్తాయి!

ఉద్యోగంలో చేరినప్పుడు గుడి కెళ్ళి అర్చన చేయించుకొని ఆనందంగా, ఆరోగ్యంగా అభివృద్ధి వైపు సక్రమంగా నడిచి పూర్తి కాల పరిమితి ఉద్యోగం చేసే శక్తిని ఇవ్వమని దేవుడిని మొక్కుకున్నా, ఏది జరగాలో అదే జరుగుతుంది. క్రమంగా ఉద్యోగం చేసుకోవడం కూడా ఒక వ్యసనమే! రోజులు గడుస్తున్న కొద్ది కార్యదీక్షతో పని చేస్తూ మనసు, శరీరం ఒక సేవానిరతి అనెడి పద్ధతికి బానిస అయిపోతుంది. ఒక దశలో పదవీ విరమణ సమయం రాగానే వ్యక్తిగతంగా సతమతమవుతున్న సమస్యలన్నీ ఊకుమ్మడిగా మనతో యుద్ధానికి బయలుదేరతాయి.

ఉద్యోగం ఒక ఆకర్షణ! దానికి అనుసంధానమై ఉంటే అదొక మాయ! నష్టాల్లో కూరుకుపోయిన సంస్థలు మూసేస్తున్నారు అంటే అదొక దురదృష్టం!!

ఉద్యోగ కాలపరిమితి పూర్తి కాకమునుపే దాశరథి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని, సొంత ఇంట్లో నివాసముంటున్నాడు.

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి చాలా విలువైంది, పీల్చే గాలి తప్ప అన్నింటికి డబ్బుల ఖాతా సరి చూసుకోవాలి. రోజులు గడ్డుగా గడుస్తున్నాయి. గోరుచుట్టు మీద రోకలి పోటు అన్నట్టు మనోజ్ఞ నెల తప్పిన సంతోషమో, వేవిళ్ళ కర్కశత్వానికి తట్టుకోలేక అమ్మ వలె ఆదరించిన వదిన ఆశ్రయం కోరి పుట్టింటికి వచ్చేసింది.

“వదినా, ఈ వాంతులు, వికారాలు భరించడం చాలా కష్టంగా ఉంది, స్త్రీ తల్లి కావాలంటే ఎన్ని విపరీతాలు భరించాలి” శమంతకమణి ఒడిలో తల పెట్టుకొని బాధ పడింది.

“ఈ వికారాలు కొన్ని రోజులే! కాన్పు అయితే ఇవన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి, ధైర్యంగా ఉండాలి” ఓదార్చింది.

లేడీ డాక్టర్ సుందరి గారి దగ్గర గర్భ పరీక్షలు జరిగాయి. దాశరథి ప్రణాళిక ప్రకారం ఇంటిని గుట్టుగా నడుపుతున్నాడు.

***

“నాకు సౌదీలో వ్యాపార సమన్వయం కుదిరింది. మనోజ్ఞ కాన్పు వరకు ఆగలేను. ఒక రెండేళ్ల పాటు మీ దగ్గర ఉంటుంది. అఫ్కోర్స్, డబ్బులు పంపిస్తాను. ప్లీజ్..” దాశరథి ముందు చేతులు కట్టుకుని ప్రాధేయపడ్డాడు శౌర్యరాజ్.

మన దేశంలో బ్రతుకు తెరువు లేనట్టు, ప్రేమించి పెళ్లి చేసుకొని గర్భవతి అయిన భార్యను వదిలి వెళ్లాలని ఎందుకు అనిపిస్తుంది? తండ్రి బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక అన్న అలజడి తిరుగుబాటు చేసింది.

ఎంతకీ జవాబు రాలేదు. “మనో, నన్ను వెళ్లొద్దని అంటుంది, కానీ ప్రాణప్రదంగా చూసుకునే మీరు ఉన్నారనే భరోసాతో.. మంచి అవకాశం వదలాలని లేదు” మాటలు మింగుతూ చెప్పాడు.

“ఉన్నపళంగా ఇంత పెద్ద విషయం చెప్పి నా అనుమతి కావాలంటే నేనేం చెప్తాను?” దాశరథి పరోక్షంగా అయిష్టత తెలియచేశాడు.

మొదటి నుండి మనోజ్ఞని ఇష్టపడని అన్నయ్యను ఇప్పుడు నా భార్య గర్భవతి ఆశ్రయం ఇవ్వమని ఎలా అడగాలి? రెండు రోజుల వరకు ఇంట్లో ఎవరికి మాటలు సాగలేదు.

స్వంత చెల్లెలు బాగోగులు చూసుకోవడానికి ఆలోచిస్తున్నాడు బాధ్యత గల్గిన అన్న!

కానీ ఈ మహోన్నత వ్యాపార అవకాశం వదులు కోవడం ఎంత పిచ్చిదనం!! ఆర్థిక సహాయం ఒక్కటే సరిపోదు, మనిషి తోడు చాలా అవసరం. ఎప్పుడు ఎలా? శౌర్యరాజ్ సరి అయిన నిర్ణయం కోసం తాపత్రయ పడుతున్నాడు.

“మనూ.. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. సౌదీలో నా వ్యాపారం నిలదొక్కుకోవడానికి రెండేళ్ళు పట్టొచ్చు. నన్ను నమ్ము, మళ్ళీ తిరిగి వచ్చి నిన్ను, మన బిడ్డను నా వెంట తీసుకెళతాను. అన్నీ సమకూరితే మనం అక్కడే సౌదీలోని స్థిరంగా ఉంటూ మీ వాళ్లను కూడా అక్కడికి గౌరవంగా పిలుచుకోవచ్చు.” నచ్చచెబుతూ, ఆర్థిస్తూ, బ్రతిమాలుతూ ఎన్నో రకాలుగా గోడు వెలిబుచ్చాడు. తినగ తినగ వేము తీయనయ్యింది.

***

“డాక్టర్ గారు నాదొక చిన్న విన్నపం” అల్ట్రాసౌండ్ చేసిన డాక్టర్ సుందరి గారితో అంది మనోజ్ఞ.

“చెప్పమ్మా..” డాక్టరమ్మ చిరునవ్వు మెరిసింది. బయట హల్లో కూర్చున్న వదిన జాడ కోసం తొంగి చూసింది. మనోజ్ఞ చూసే చూపులు డాక్టర్‌కు కొంత అనుమానం రేకెత్తించాయి.

“మనోజ్ఞ, అసలు మీరు వివాహిత.. అవునా? కాదా? అక్రమ సంబంధం పెట్టుకొని కడుపు తెచ్చుకొని గర్భస్రావం కోసం వచ్చారా?” ప్రశాంతత మాటలో ఉన్న అక్షరాల పదును గుచ్చుకుంది.

“డాక్టర్, లేదండీ.. మీరు పొరపాటు పడుతున్నారు. నాకు పెళ్లి అయింది. మా వారు ఈ మధ్య వ్యాపారం కోసం సౌదీ వెళ్లారు. అమ్మనాన్న చిన్నప్పుడే పోయారు. అన్నా వదినలు పెంచి పెద్ద చేశారు. ఈ బిడ్డ నాకు కావాలి” డాక్టర్ గారి అనుమానం అతి తొందరగా పోగొట్టాలని గుక్క తిప్పుకోకుండా చెప్పింది.”

“మరి, ఇంకేం చెప్పాలనుకున్నారు?” డాక్టరు ప్రశ్న.

“మా అన్నయ్య ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు. ఫిక్సెడ్ పిఎఫ్ డబ్బుల్లో నుండి కొంత నా కోసం ఖర్చు చేస్తున్నారు. ఇప్పట్లో మా వారు డబ్బు పంపలేరు.”

“అయితే, నేనేం చేయాలి?”

“నా కాన్పు కోసం ఎంత ఖర్చు అవుతుందో ఉజ్జాయింపుగా చెబితే, నేను నాకున్న కొంచెం బంగారంతో.. మా అన్నయ్యకు ఇబ్బంది కలగకుండా సర్దుతాను” స్వరాన్ని మరీ చిన్నగా చేసి డాక్టర్‌కి మాత్రమే వినిపించేటట్టు చెప్పింది.

“మిమ్మల్ని ప్రేమగా పెంచి, పెద్దదాన్ని చేసిన వాళ్ళు, మీరు అలా చేస్తే ఒప్పుకుంటారా?”

“అందుకే మీ సహాయం అడుగుతున్నాను.”

“నాకు అర్థం కాలేదు, క్లియర్ గా చెప్పండి.”

“మా వాళ్ళతో మీరు నాకు ఉచితంగా వైద్యం చేస్తున్నారని చెప్పండి, వాళ్లకు తెలియకుండా మొత్తం హాస్పిటల్ బిల్లు నేను చెల్లిస్తాను.”

“అదెలా కుదురుతుంది?” డాక్టర్ గారి మొహంలో అనుమానం తొంగి చూసింది.

“డాక్టర్, మీకు నమ్మకం లేకపోతే ప్రస్తుతానికి ఈ ఉంగరం మీ వద్ద పెట్టుకోండి, స్వచ్ఛంగా డైమండ్ పొదిగిన బంగారమే!” చేతికున్న ఉంగరాన్ని తీసి టేబుల్ పైన పెట్టింది.

“మీ పరిస్థితి అర్థమైంది. మీరు ఈ ఉంగరం వేలికి పెట్టుకోండి. నేను ఏదో ఒకటి చేస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి” మనోజ్ఞ వేలికి ఉంగరాన్ని మళ్లీ తిరిగి తొడిగే ప్రయత్నం చేసింది.

***

మేనల్లుడిని చూసి దాశరథి ఆనంద బాష్పాలు ఆగలేదు. మేలిమి బంగారు వర్ణం, పాలుగారే అతి మెత్తని సున్నిత శరీరం! చిన్ని ఎర్రని నోరు. అప్పుడప్పుడు ఎంతో పని చేసి అలసిన ఒళ్ళు విరుపులు, లేదంటే ఏదో ఎనలేని సంతోషంగా తనలో తానే నవ్వుకోవడం! ఎంత విచిత్రం భగవంతుని సృష్టి!

నేనంటే నేను ఎత్తుకోవాలని సన్నిత, ప్రణిత ఉభలాటపడుతున్నారు. ఈ సందడి చూస్తే మనోజ్ఞ ఆనందం ఆకాశం దాటింది. ప్రసవ వేదన మరచి పోయింది.

“డాక్టర్ గారి పుణ్యమా అని మనకు అన్ని సౌకర్యాలు ఉన్న స్పెషల్ వార్డు ఇచ్చారు. ఓల్డ్ సిటీ జజ్జ్ ఖానా ఆసుపత్రి అంటే వైద్యం బాగుండదేమో అని తాచ్చాడాను. కానీ నా అంచనా తప్పు!” దాశరథి అన్నాడు.

“ప్రసూతి నిపుణురాలు డాక్టర్ సుందరిగారు ఉదయం చార్మినార్ జజ్జ్ ఖానా ఆసుపత్రిలో ప్రసూతి వార్డు అధికారి; సాయంత్రాల వేళ ఇంటి వద్ద స్వంత క్లినిక్,” పొత్తిళ్లలో చిన్నారి బాబును అదుముకొని శమంతకమణి అన్నది.

“అవును, డాక్టర్ మనింటి పరిస్థితి ఎలా తెలుసుకున్నారో? మన ముఖం మీద ఏం కనబడ్డదో? మన పైన దయ తలిచింది, ఎంతో ఋణపడ్డాము” దాశరథి కృతజ్ఞతలు విని, తెర వెనుక నడిచిన కథ తెలిసి పోతుంది అని చటుక్కున మనోజ్ఞ “అన్నా, ఈ రోజు ఐ.ఎస్.డి. ఫోన్ చేసి రాజుకు నా డెలివరీ సంగతి..”

“నువ్వు చెప్పాలా తల్లి, తప్పకుండా చెప్తాను. వీలుంటే రమ్మని కూడా అంటాను. ఈ చిన్ని కృష్ణుడు పేరు ఏం పెట్టాలో కూడా ఆలోచించుకోవాలి.”

“వీడి పేరు మాత్రం మీరిద్దరూ నిర్ణయించాలి” మనోజ్ఞ మొండిగా అంది.

“ముందు తల్లిదండ్రులు, ఆ తరువాత మేము..” దాశరథి మరోసారి చిన్నారి బాబుని స్పృశించాడు.

“మణి, సులభ కాన్పు కదా, ఇంటికి తొందరగా పంపమని అడుగు” పిడికిలి బిగించిన చిన్నారి చేయి పట్టుకోవడం లోని ఆధ్యాత్మిక తరంగాలు ప్రసరిస్తున్న అనుభూతితో ఆనందపడుతూ దాశరథి కళ్ళు మూసుకున్నాడు.

గుర్ఖా తలుపు తెరిచి “సాబ్, వక్త్ హో గయా, బాహర్ చల్నా!” (సమయం అయిపోయింది, బయటకు వెళ్ళాలి) అని గుర్తు చేశాడు.

చిన్నారి పాపడు మొదటి చూపులో, మొదటి స్పర్శకు మనసంతా హాయిగా ఉంది. “ఇన్నాళ్ళూ ఎక్కడున్నావు బుజ్జి కన్నయ్యా? నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, తొందరగా మన ఇంటికి వచ్చేయ్! మనం చాలా మాట్లాడుకోవాలి, ఆడుకోవాలి!!” దాశరథి తన అరచేతిలో ముద్దులు పెట్టి చంటి వాడి నుదుటికి తరలించాడు.

“శౌర్యరాజ్, మనోజ్ఞ పండంటి బాబుకు జన్మనిచ్చింది” సంతోషంగా జీవన సాఫల్యాన్నిచ్చిన కబురు అందచేశాడు.

“బావగారు, చాలా ఆనందంగా ఉంది. మనూ ఇంటికి వచ్చాక ఫోన్ చేయండి, మాట్లాడతాను.”

“నువ్వు ఇండియా రావడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా?”

“కష్టమే, ఏమో చెప్పలేను ఐనా చూస్తాను! అందరూ బాగున్నారా?”

“అందరం బాగున్నాము, ఇండియా వచ్చేందుకు నీ సాయశక్తుల ప్రయత్నించు. మొదటిసారి బాబు పుట్టాడని మీ మేనేజ్మెంట్ నచ్చచెప్పు, ఎలాగో అలాగా బ్రతిమాలు!”

“తప్పకుండా చెప్తాను, కాని.. డౌటే!”

“ఎందుకు డౌట్?”

“ఇక్కడ ఎన్నో కఠినమైన నియమాలు, నిబంధనలు, వీరికి వ్యతిరకంగా ఏ పని చేయలేము.”

“సరే.. ఉంటాను” ఐ.ఎస్.డి. ఫోన్ డబ్బులు కట్టి ఇంటి వైపు నడిచాడు. సన్నిత ఇంట్లో వంటా-వార్పూ చూసుకుంటూ స్కూల్ ఫైనల్ పబ్లిక్ పరీక్షలు రాస్తుంది. శమంత హాస్పిటల్ లో మరదలి క్షేమాలు చూసుకుంటున్నది.

మనకు మన దేశంలో విధులు, బాధ్యతలు; నియమాలు, నిబంధనలు లేవా? మన దేశంలో ఉంటూ ఇక్కడి నియమాలు, నిబంధనలు మనం పాటించాలంటే బద్దకం! అదే వేరే దేశం వాడు మనకు ఎన్ని కఠినమైన ఏ ఆంక్షలు పెట్టినా సమ్మతమే!?? మనమే మనల్ని గౌరవించకపోతే ఎలా?

(ఇంకా ఉంది)

Exit mobile version