Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమే మా బలం-9

[శ్రీమతి సురేఖ పులి గారు రచించిన ‘ప్రేమే మా బలం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సోమవారం ఫ్యాక్టరీకి సెలవు కావడంతో దాశరథి ఇంట్లోనే ఉన్నాడు. అనుకోకుండా పెద్ద వాన పడుతుండడంతో మనోజ్ఞ, పిల్లలు కూడా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ప్రణిత బడిలో నేర్పిన రెయిన్ రెయిన్ గో ఎవే అనే రైమ్ పాడుతుంటే, బాధపడుతుంది శమంత. వానా వానా వల్లప్ప, చేతులు చాచి చెల్లప్ప లాంటివి పాడించాలని అంటుంది మనోజ్ఞ. వదిన దగ్గర వంటలు నేర్చుకుంటుంది మనో. శౌర్యతో తన పెళ్ళి గురించి అన్నకి ఎలా నచ్చచెప్పాలో మనోకి అర్థం కాదు. ఓ రోజు శౌర్య మనో ఇంటికి వచ్చి, దాశరథితో తమ పెళ్ళి ప్రస్తావన తెస్తాడు. అందరూ మాట్లాడుకుంటారు. రిజిస్టర్ మేరేజ్ చేసుకోమని సలహా ఇస్తాడు దాశరథి. కానీ, ముందు తాను వెళ్ళి మౌర్యరాజ్ తోనూ, అతని భార్యతోనూ మాట్లాడుతానంటాడు. అన్నావదినలు ఒప్పుకోరని అంటాడు శౌర్య. అతను ఊహించినట్టే అవుతుంది. దాశరథి నిరాశతో తిరిగొస్తాడు. సంస్థ నష్టాల్లో కూరుకుపోతుంటే, తప్పక స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంటాడు దాశరథి. పెళ్ళైన కొద్దిరోజులకే గర్భం దాలుస్తుంది మనోజ్ఞ. ప్రసవానికై అన్న దగ్గరకి వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో, చాలా పొదుపుగా గడుపుతుంటాడు దాశరథి. తనకి సౌదీలో వ్యాపారావకాశం వచ్చిందని చెప్పి, అందరినీ ఒప్పించి, అక్కడికి వెళ్ళిపోతాడు శౌర్య. మనోజ్ఞకి కొడుకు పుడతాడు. అంతకు ముందు మనోజ్ఞ డాక్టర్‌ని బ్రతిమాలడంతో, ఆమె బిల్లుని బాగా తగ్గిస్తుంది. శౌర్యకి ఫోన్ చేసి కొడుకు పుట్టిన సంగతి చెప్పమంటుంది మనోజ్ఞ. అలాగే చేస్తాడు దాశరథి. శౌర్య ఎంతగానో ఆనందిస్తాడు. – ఇక చదవండి.]

మురిపాల పసికందు ఎంత ముద్దొస్తున్నాడు! వేరే ఆలోచన లేదు. తాను తండ్రి అయినప్పటి కంటే ఇప్పుడు సంతోషం అమితంగా ఉంది. ఎందుకు?

జీవిత యానమంతా ఉరుకులు పరుగులే; పదవీ విరమణ తరువాత తన ప్రపంచం అంతా స్థిరంగా ఉంది. ఒక సామాన్య సగటు మనిషికి మిగిలింది నిర్లిప్తత, నిరాసక్తత అనుకునే సమయంలో చంటిబాబు రాకతో జీవన సౌందర్యాన్ని, అలవికాని ఆనందాన్ని తెచ్చాడు.

సంవత్సరం దాటాక అందరికీ బహుమానాలతో శౌర్యరాజ్ ఇండియా వచ్చాడు. కన్నకొడుకును చూడగానే కన్నీళ్లు ఆగలేదు.

నా అన్న వాళ్ళు దూరంగా ఒంటరిగా ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుందో అని జీవితపు చేదు గురించి పదే పదే చెప్పాడు.

మౌర్యరాజ్‌ను కలవాలని ఉత్సాహంగా వెళ్ళాడు. వెళ్లినంత హుషారుగా తిరిగి రాలేదు. ఏదో మథనపడుతున్నాడని “అందరం కలిసి ఏదైనా గార్డెన్ వెళ్దాం, కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది” మనోజ్ఞ ప్లాన్ ప్రకారం ఇందిరా పార్క్ వెళ్లారు.

ఇదేదో ‘ప్రేమికుల దినం’ వలె ఉంది. ఎక్కడ చూసినా జంటలు; తద్దినం లాగా ఇదేం దినం? ఇదేం ఆకర్షణ?? ప్రేమ-శృంగారం నలుగురిలో బట్టబయలు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక దినం కేటాయించుకోవాలా? యువత అంతగా బరి తెగించి పోవాలా?

పార్క్ అనగానే పిల్లలు ఆహ్లాదాన్ని చూసి, వెనుతిరగి పోలేక “తెలియక వచ్చాము.. తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం” నిశ్చయించుకుని, మెత్తటి పచ్చికలో చెట్టు నీడను కూర్చున్నారు. స్వచ్ఛమైన గాలిలో, విశాలమైన స్థలం చూడగానే అందరికీ ఏదో ఒక ఆట ఆడుకోవాలని ఉత్సహం! ఇళ్ళల్లో ఆటలకు తగు స్థలం లేనందుకు పార్కులను ఆశ్రయిస్తారు. వంతులవారీగా అందరూ దాగుడు మూతలు ఆడుకున్నారు. చెమ్మచెక్క ఆట అయిన పిమ్మట శౌర్యరాజ్ అందరికి ఐస్ క్రీం కొని తెచ్చాడు.

“అన్నయ్యను బతిమాలాను బాబుకు ఊయల ఫంక్షన్ చేద్దాం అని, ఇంకా నా పైన విముఖత ఉన్నట్టుంది, అంతగా ఇష్టం ఉన్నట్టు లేదు. ఏదైనా గుడిలో జరిపిద్దామని అనుకుంటున్నాను.”

“పోనీలే, అతనికి మీ పెళ్లి ఇష్టం లేనప్పుడు, మీ కొడుకును ఎలా మనసుకు హత్తుకోగలడు? నువ్వు బాధపడకు, ఒక మంచి పేరు నిర్ణయించుకోండి. నువ్వు తిరిగి వెళ్లే లోపు మనం సంతోషంగా నామకరణం చేద్దాం” దాశరథి ఊరటగా అన్నాడు.

“బాబు పేరు అన్న ఖరారు చేస్తే నీకేమైన అభ్యంతరమా?” మనోజ్ఞ భర్తను ప్రశ్నించింది.

“లేదు, పెద్ద వాళ్ళు పేరును సూచిస్తే అది శుభసూచకం! మీరు మనస్ఫూర్తిగా దీవించి అనుకున్న పేరు మా ఇద్దరికీ సమ్మతమే!” దాశరథిని ఉద్దేశించి అన్నాడు.

“నా పైన ఇంత నమ్మకం ఉంటే, నాకు ఇంకేం కావాలి!” తృప్తి చెందాడు.

“మరో విషయం చెప్పాలి, ఆ.. అదే ఏంటంటే..” నసుగుతున్నాడు.

“నీ వాలకం చూస్తే ఇక సౌదీ వెళ్లడానికి సముఖంగా లేవనుకుంటున్నా” మనోజ్ఞ సంతోషంగా అంది.

“నేను కోరుకునేది కూడా అదే, ఆ వ్యాపారాలేవో ఇక్కడే మన దేశంలో చేసుకుంటే అందరికి సుఖంగా ఉంటుంది” శమంతకమణి ఎప్పటినుంచో మనసులోని కోరికను చెప్పింది.

భార్య మాటను వంత పలికినట్లు దాశరథి కూడా అవునని తలాడించాడు.

“లేదండీ.. ఈ సారి నేను మనూ ఇద్దరం కలిసి సౌదీ వెళ్తాము. అదే.. బాబు.. చిన్నోడు, వాడిని మీరు కొన్నాళ్ళ పాటు చూసుకొమ్మని.. నా రిక్వెస్ట్!” రెండు చేతులు జోడించి దీనంగా అడిగాడు. వింటున్న ముగ్గురు శ్రోతలు అవాక్కయ్యారు.

“ఇదేం కొత్త ఆలోచన? బాబును వదిలి నేను రాను. అయినా నేను వచ్చి అక్కడ.. అరబ్బుల మధ్య వెలగబెట్టేది ఏంటి?” చిరాగ్గా అంది మనోజ్ఞ.

దాశరథి దంపతులు ఒకరి ముఖాలు ఒకరు విస్మయంగా చూసుకున్నారు.

“రాజు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? వాడు ఇంకా పసివాడు, వాడిని వదిలి నేను రాలేను” అయిష్టాన్ని తెలిపింది.

“ప్రేమించిన భార్యను విడిచి ఉండలేక అంటున్నావా? లేక ఇంకా వేరే కారణాలు ఉన్నాయా?” దాశరథి సూటిగా అడిగాడు.

“మీరు చెప్పే కారణం కాదు, ముందుగా మనూ కోసం అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరం కలిసి డబ్బులు సంపాదిస్తే తొందరగా అనుకున్న ఆదాయంతో మన దేశం వచ్చి ఇక్కడ హోదాగా నిలదొక్కుకోవచ్చును” సూటిగా సమాధానం ఇచ్చాడు.

“ఉద్యోగాలు చేయాలంటే మన దేశం గొడ్డుపోయిందా? ఒకళ్ళకొకళ్ళు ఇక్కడే వుంటూ, దర్జాగా ఉండలేమా? ఏమో నాకైతే మనోజ్ఞ వెళ్లడం ఇష్టం లేదు.”

“అంటే.. బాబు పెంపకం మీరు చూడలేరు అని అనుకోవాలా?” మరో వైపు నున్న కత్తి పదును చూపెట్టాడు.

“మణి చెప్పేది ఒకటి, నువ్వు అర్థం చేసుకునేది మరొకటి, వీడు.. ఈ చిన్నారి కన్నయ్య మాకు భారమా?” దాశరథి ఉద్వేగంగా అన్నాడు.

“మరి, ఎందుకు నా కోరికకు మద్దతు పలకరు? నా భార్య నాకు సహకరిస్తే తప్పేంటి?” గంభీరంగా అన్నాడు.

దాశరథి, శమంతకమణి ఆపైన మాటలు పెంచలేదు.

అది గమనించి “నీకు సంపాదన గురించే ఆలోచన.. బాబు కోసం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇక్కడ వీళ్ళకు నువ్వు ఇవ్వలేదు” మనోజ్ఞ నిజాన్ని తెలిపింది.

“నేనేమన్నా పారిపోతున్నానా? తప్పకుండా ఇస్తాను” సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

“మనూ, నాకు డబ్బు ఇబ్బంది కాదు, నా బంగారు కొండకు తల్లిదండ్రుల ప్రేమ, వాత్సల్యం కావాలి. మీరెక్కడో? వీడెక్కడో? ఉంటే నాకు నచ్చదు” దాపరికం లేకుండా దాశరథి అన్నాడు.

“కొన్ని సంవత్సరాలు..! అంతే వాడికి వూహ తెలిసే లోపల మేము.. కాదు మనమందరం ఒకే చోట ఉందాము. నా కొడుక్కి ప్రేమ, వాత్సల్యం కొరత రాదు” శౌర్యరాజ్ హమీ ఇచ్చాడు. అయిష్టంగానే ఒప్పుకోవాల్సి వచ్చింది.

***

సౌదీలో బిజినెస్ చూసుకుంటున్న శౌర్యరాజ్ వద్దకు వెళ్లే క్రమంలో చిన్మయ్ బాబును వదిన వద్ద వదిలి పెట్టింది.

“విమానంలో చాలా సేపు ప్రయాణించాలి అనే కోరిక తీరింది కదూ!”

“కోరిక తీరడం అంటే నా చుట్టూ ఉన్న నా వాళ్ళు నా మూలంగా ఎటువంటి అసౌకర్యం ఉండకూడదని..”

“మీ వదినా అన్నయ్యలు చిన్న బాబును మనకంటే బాగా చూస్తారు, నాకు పూర్తి నమ్మకం ఉంది. పైగా సన్నీ, ప్రణీ తోడు ఉండటం వలన వాడు ఆటల్లో నిమగ్నమౌతాడు.”

“అలా అనుకొని మనం, ముఖ్యంగా నువ్వు నీ మనసుని సమాధాన పర్చుకోవాలి, ముందే చెప్తున్నా, ప్లీజ్.. మా అన్నకు, బాబు ఖర్చులకే కాదు, ఇంకొంచెం ఎక్కువ డబ్బు పంపించు” ఆజ్ఞాపించింది మనోజ్ఞ.

“తప్పకుండా. ఇక డబ్బులకు మనకేం కొదువ?” మాటిచ్చాడు శౌర్యరాజ్.

***

కొత్తలో చిన్మయ్ అల్లరి చేతలు ఆనందంగా ఉన్నా, దినచర్యలో పని ఒత్తిడి పెరిగి శమంతకమణి ఎక్కువ అలసటకు గురి అయింది. ఆరోగ్యం తేడా చేసినా పెద్దగా పట్టించుకోలేదు. ఇంటి పని ఎంత చేసినా తక్కువే, పైగా అన్ని విషయాలందు పరిపూర్ణత ఆశించి శుచి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తే అన్ని సమయాల్లో పెరిగే వయసు తరిగే ఆరోగ్యం సహకరించదు.

“అమ్మా, ప్లీజ్.. నువ్వు పనులు ఏవీ చేయకు, మేం ఉన్నాంగా.. నువ్వు రెస్ట్ తీసుకో” పలుమార్లు సన్నిత హెచ్చరించింది, బతిమాలింది. అలవాటు పడ్డ ప్రాణం, ఎంత నచ్చచెప్పినా కొన్ని పనుల కొసమెరుపు సరిదిద్దాలని ఉబలాటం!

“నీ ఉబలాటం కాదు మణి, దీన్ని చాదస్తం అంటారు. పిల్లలు పెద్దవాళ్ళ అవుతున్నారు, వాళ్లు నిన్ను మించిన పనిమంతులు కావాలంటే నువ్వు చక్కగా ఒక చోట కూర్చుని పని పురమాయించు” భర్త అనునయంగా చెప్పాడు.

వైకుంఠ ఏకాదశి పూజ కానిచ్చి అందరి ఉపవాసాల సమయం దాటి ఫలాలు సేవించిన అనంతరం నిశ్శబ్దంగా విశ్రాంతి కోసం ఒరిగిన శమంతకమణి మణి కాంతుల మెరుపు అదృశ్యమైంది.

“నేరుగా వైకుంఠానికి దారి దొరికింది, ఎంత అదృష్టవంతురాలు; పుణ్యవతి, పసుపు-బొట్టుతో పోయింది” ఇరుగుపొరుగు శమంతకమణి చావుని మెచ్చుకున్నారు. దాశరథి మనసు అమితంగా రోదించింది. సన్నిత కుమిలి కుమిలి ఏడ్చింది.

కానీ ప్రణిత ఊరుకోలేదు. “నాన్న ప్రతీరోజు మనం పూజించే దేవుడికి ఒక లెక్కా పత్రం లేదా? మంచి అమ్మను మన నుండి తీసుకెళ్లడం అన్యాయం కదా?” కన్నీళ్ళు తుడుచుకున్నాడు.

“ఆ దేవుడు అందరి రాతలు ముందుగానే రాసి పెట్టాడు తల్లీ, మనం ఎంత వేడుకున్నా, జరిగేది జరగక మానదు!”

“అయితే, అది కావాలని, ఇది కావాలని అనవసరంగా దేవుని డిస్టర్బ్ చేయడం మన తప్పు! బహుశా అందుకేనేమో ఆ భగవంతుని ఏకాగ్రతను మనం భంగం కలిగిస్తున్నామని మన మీద కోపంతో విపత్తులను సృష్టించి మన మనఃశాంతి దూరం చేస్తున్నాడు.”

“ప్రణి, మనం సామాన్య మనుషులం! మనకు దేవుని మహిమ గురించి తర్కం తగదు. ఆయన ఇచ్చిన వేళ సంతోషించాలి, యివ్వని రోజు బాధ పడాలి.. ఈ రెండు మన జీవితంలో సమాంతర రేఖలు!”

దాశరథికి ఎంత దుఃఖించిన తరుగు కనబడలేదు. అక్కా చెల్లెళ్ళ పెంపకంలో చిన్మయ్‌కి శమంతకమణి లేమి పెద్దగా అగుపించలేదు.

***

“రాజు గారు మీ తమ్ముడు, నా చెల్లెలు ప్రాణాపాయంలో ఉన్నారట, దయచేసి మీ పలుకుబడితో వాళ్ళను కాపాడే ప్రయత్నంలో మన దేశానికి క్షేమంగా రప్పించండి” దీనంగా అడిగాడు.

“నా మాట వినలేదు. వాళ్ళిద్దరూ మీ మాటకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆకర్షణ!.. సిరి అయినా స్త్రీ అయినా ఆకర్షణకు దాసోహం!! తల వరకు మునిగి కొట్టుకుపోతుంటే ఎవరైనా ఎట్లా రక్షిస్తారు?”

మరో సారి అన్నాడు “జరిగిన వన్నీ మర్చిపోయి, వారికి ప్రాణభిక్ష పెట్టండి!” రెండు చేతులు జోడించాడు.

“మన దేశంలో ఉన్నంత దయార్ద్ర హృదయులు ఇతర దేశాల్లో వుండరు. ఆ దేశ నియమ నిబంధనలకు ఒప్పుకునే వెళ్లారు; మీరైన, నేనైనా ఏమీ చేయలేము.” ప్రతికూల జవాబు పర్యవసానంగా రెండు నిర్జీవిత ప్రాణులు పెట్టెల్లో బందీ అయ్యి స్వదేశం తిరిగొచ్చాయి.

అరబ్బులకు అన్ని వేళలా అణిగిమణిగి లేనందుకు వారి అక్రమ అసూయలకు బలియైనారు మనోజ్ఞ శౌర్యరాజ్! భౌతికకాయం గుర్తు పట్టలేనంతగా చిత్రహింసకు గురయ్యారు. శూన్య ఫలితాన్ని మౌనంగా అంగీకరించడం తప్ప వేరే మార్గం లేదని అర్థమైంది.

***

2018 సంవత్సరం

యదువర్ సన్నిత కోసం చూశాడు, కనబడలేదు. సంతోషంగా ఎదురు వచ్చి కళ్ళతోనే థాంక్స్ చెప్పి అందరూ చూస్తున్నా షేక్ హ్యాండ్ ఇచ్చి, ఎంతకీ తన అరచేయి వదలక గట్టిగా పట్టుకొని మణికట్టు మీద చిన్న ముద్దు పెడుతుందని అదుపులేని మనసును అదిమి పట్టి ఇంటికి వస్తే.. అసలు సన్నీ కనబడలేదు. అరగంట గడిచినా అసలు ఆచూకీ లేదు. ప్రయాణ బడలిక మూలంగా స్నానం చేసి మజ్జిగ తాగి దాశరథి బెడ్ రూమ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న వేళ, ప్రణితను పెరట్లోకి రమ్మన్నాడు యదువర్.

“ఎన్నో ఆశలతో, ఎంతో మధురమైన క్షణాలు ఊహించుకుంటూ ఆఘమేఘాల మీద వస్తే సన్నీ లేదు, ఏదో పని.. సిటీ వదిలి వెళ్ళింది అని ఎంత సునాయాసంగా చెప్పగలుతున్నావు. ఏం పని? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? ఎవరితో వెళ్ళింది?” ప్రతి పదాన్ని ఒత్తి పలుకుతూ కోపంతో చిందులేస్తున్నాడు యదువర్.

“అంత కోపం ఎందుకు? నిజంగా నాకేం తెలియదు” ప్రణిత అమాయకంగా చెప్పింది.

అవును.. తనకు అంత కోపం ఎందుకు? శాంత స్వరంతో మళ్ళీ అన్నాడు “తెలియకుండా ఎలా వుండగలవు? ప్లీజ్.. సన్నిత వివరాలు నాకు కావాలి.”

“మీరు వెళ్లి నెల అయింది అవునా? యింకో ఐదు రోజుల్లో ఇంటికి వస్తుంది. కానీ ఎక్కడికి వెళ్లిందో నేను చెప్పను. అక్కకు ప్రామిస్ చేశాను.”

“ప్రామిస్!.. అంటే? అంకుల్ మేల్కొని నిన్ను అడిగితే ఇలాగే సమాధానం చెప్తావా?”

తల అడ్డంగా తిప్పి “లేదు..”

“మరి ఏం చెప్తావు?” కొడతాడేమో అన్నట్టు ఉద్రేకపడ్డాడు.

“అబద్ధం చెప్తాను.. వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి అని, ఆఫీస్ వాళ్ళతో పాటు ఊరెళ్ళింది అని..”

“ప్రణీ, నా నుంచి తప్పించుకున్నావు నువ్వు! నువ్వు కాకుండా ఉంటే, ఇలాంటి అబద్ధపు నాటకాల అమ్మాయిని చెంప ఛెళ్లుమనిపించేవాడిని. ఏదో గూడుపుఠాణి నడుస్తున్నది మీ ఇద్దరి అక్కాచెల్లెళ్ల నడుమ!” విసురుగా అన్నాడు.

మౌనంగా తల నేల కేసి చూస్తూ నిలబడింది. కొద్ది క్షణాలు గడిచిన పిమ్మట అన్నాడు. “నేనేమి ఫూల్ కాదు, నువ్వు చెప్పినంత మాత్రాన నేను కనుక్కోగలను.. మై డియర్ ప్రణీ! నీకు అందరి అమ్మాయిల వలె మీ అక్క అంటే ఈర్ష్య!! మరో వైపు నుండి నువ్వు.. నాకు..” వాక్యం పూర్తి చేయలేదు.

“ఎందుకు ఆగిపోయావు.. నేను.. నీకు..” కళ్ళల్లో కళ్ళు పెట్టి దురుసుగా అడిగింది.

“వద్దు, చెప్పను.. నేను మీ అక్కను వెదికి క్షేమంగా ఇక్కడికి తెస్తాను. ఎందుకంటే.. సన్నీ ఈజ్ మై ఎటర్నల్ లవ్!” విసురుగా వెళ్లిపోయాడు.

“హాయ్! చిక్కుముడి.. హౌ ఆర్ యు?” చిన్మయ్ చిన్న పిల్లల సైకిల్ తొక్కుతూ గేట్ బయట కనబడ్డాడు. ఆగకుండా సైకిల్ తొక్కడం వలన ఒళ్లంతా చెమట పట్టింది.

“హలో! చిక్కు, ఎలా ఉన్నావు?” నవ్వుతూ పలుకరించిన చిన్మయ్‌ని చూడగానే ఇంతకు ముందు ఉన్న చిరాకు, కోపం మాయమయ్యాయి.

“హాయ్! నేను ఓకే. మరి నువ్వు? సైకిల్ రేసింగ్ అయిపోయిందా?” యదువర్ నవ్వుతూ అడిగాడు.

“నేనైతే చాలా బాగున్నాను, నువ్వు ఎందుకో, నా అంత బాగా లేవు. నాన్నగారు ఇంటికి వచ్చారా లేక ఇంకా హాస్పిటల్ ఉన్నారా?” చిన్మయ్ అన్నాడు.

“నాన్నగారి ఆరోగ్యం ఇప్పుడు బాగుంది, అందుకే ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. పద మనం క్యాడ్బరీ చాక్లెట్ కొనుకుందాం.”

“పద..” తన చిన్న సైకిల్ ఇంట్లో పెట్టి తిరిగి వెళుతున్న చిన్మయ్‌ని ప్రణిత వెళ్లొద్దని ఆపేసింది.

“చిన్నక్క, ప్లీజ్.. నేను వెళ్ళాలి, నాకు క్యాడ్బరీ చాక్లెట్ కొనిస్తా అన్నాడు.” గేట్ బయట నిలబడి యదువర్ గమనిస్తున్నాడు.

“చిక్కు, నేను ఇస్తాను, నువ్వు ఇంట్లోకిరా..” బుజ్జగిస్తూ ప్రణిత అంది.

“అన్నీ అబద్ధాలు! ఇంట్లో క్యాడ్బరీ చాక్లెట్స్ లేవు, షాప్ లో ఉంటాయి.” తరువాత మాట వినిపించుకోలేదు, యదువుర్ తాను వచ్చిన కారులోనే చిన్మయ్‌ను కూర్చోబెట్టి వెనుతిరగక, కనీసం షాప్ వరకు వేళతామని చెప్పక కారులో వెళ్లి పోయాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version