Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమే మూలం

[బాలబాలికల కోసం ‘ప్రేమే మూలం’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

క ఇంట్లో ఒక పిల్లవాడు తిండి తినడం లేదని పెద్దగా తిడుతూ ఓ బెత్తం తీసుకుని కొట్టబోతూ ఉంది. ఆ పిల్లవాడు గట్టిగా ఏడవసాగాడు.

వాడి ఏడుపు పక్కింటిలోని పరశురాం విని పరుగున ఆ పిల్లవాడి ఇంటికి వచ్చి, “అమ్మా పిల్లవాడికి ఓ కథ చెప్పో, ఒక పాట పాడో నవ్వుతూ పెడితే తింటాడు. భయపెడితే అసలు తినడు, నీకు అర్థం అవాలంటే ఓ కథ చెబుతాను” అంటూ పరశురాం ఓ కథ చెప్పడం ప్రారంభించాడు.

***

విదర్భ దేశరాజు కపిల వర్మకి జంతు సేకరణ అంటే ఇష్టం. అందుకే ఆయన వేటకి వెళ్ళినా జంతువులను చంపకుండా పట్టి తెచ్చి తన జంతు ప్రదర్శనశాలలో ఉంచేవాడు. కొన్ని సార్లు వాటికి తనే ఆహారం అందించేవాడు. ఇలా ఉండగా ఒక వేటలో ఆయన సంహాన్ని వేటాడి బంధించి తెచ్చి తన ప్రదర్శనశాల దగ్గర బోనులో వేరుగా బంధించి తనే రోజూ బోనులోకి మాంసం వేసేవాడు. అలా కొన్ని నెలలు వేసిన తరువాత దానిని మచ్చిక చేసుకునేందుకు సింహాన్ని బోను బయటకు తెప్పించి తనే దాని మందు మాంసం వేశాడు. అది ఒక ముక్క తింటుడగా రాజు గట్టిగా, “త్వరగా తీను నాకు వేరే పనులున్నాయి” అని అరిచాడు.

అంతే సింహానికి కోపం వచ్చి రాజుగారి చెయ్యిని కరిచింది. రాజుగారి చేతికి రక్తం వచ్చింది. దానితో పాటు కోపం కూడా వచ్చింది.

అక్కడే ఉన్న భటుడు, “మహారాజా తమరు సింహానికి మాంసం వేయకండి. మీకేమన్నా అవుతే మా అందరికీ కష్టం” అని చెప్పి ఆ రోజు నుండి ఆ భటుడే మాంసం దానికి తినిపించసాగాడు.

అలా తినిపిస్తున్నపుడు రాజు తన అంతఃపురం మేడ మీద నుండి చూస్తున్నాడు. ఆ భటుడు కూనిరాగం తీస్తూ సింహం జూలు దువ్వుతూ దానికి మాంసం తినిపించడం చూసి ఆశ్చర్యపోయాడు.

అప్పుడే అక్కడికి వచ్చిన రాణికి ఆ దృశ్యం చూపి, “ఎందుకు భటుడు పెడితే ఆనందంగా తింటోంది?” అడిగాడు రాజు.

రాణి చిరునవ్వు నవ్వి ఈ విధంగా చెప్పింది, “ఆ భటుడు దానికి ఊరకనే తినిపించక ఓ కూనిరాగంతో, జూలు దువ్వుతూ ప్రేమతో తినిపిస్తున్నాడు. అది క్రూర జంతువు అయినా దానికి కూడా ప్రేమ కావాలి. ఆ సూక్ష్మంతోనే భటుడు తినిపిస్తుంటే తింటోంది. అందుకే పిల్లలు అన్నం తిననని మారాం చేస్తుంటే తల్లులు ఆ పాప బుగ్గలు నిమురుతూ ‘చందమామ రావే, జాబిల్లి రావే’ పాటలు పాడి ‘మా పాపాయికి తినిపించవే’ అని పాడుతారు” అని వివరించింది.

ఈ కథ విన్న తరువాత రాజు గారికి ప్రేమతో మనసులు దోచుకోవచ్చునని శతృత్వం రూపు మాపవచ్చునని తెలిసొచ్చింది.

***

పరశురాం చెప్పిన ఈ కథ విన్న ఆ తల్లి ప్రేమతో వాడి తల నిమిరి ఓ పాట పాడి తిపిస్తుంటే వాడు హాయిగా తిన్నాడు.

Exit mobile version