[ఆల్బర్ట్ కామూ రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Albert Camus’s poem ‘Loving You’ by Mrs. Geetanjali.]
~
నేను ముసలివాడినయ్యే కొద్దీ
అర్థం అవుతూ వస్తున్నదేంటంటే..
నీకు స్వేచ్ఛని ఇస్తూ.,
నువ్వు భరించేంత తేలికగా ఉంటూ..
నీకే మాత్రమూ భారం కాకుండా
నిన్ను ప్రేమించే వాళ్లతో మాత్రమే జీవించగలవని!
ఆ స్వేచ్ఛ, ప్రేమ చాలా బలంగా కూడా ఉండాలి సుమా!
షరతులు లేని ప్రేమ అన్నమాట!
కానీ ఈ కాలపు జీవితం ఉందే.,
చాలా దుర్భరమైనది, చేదైనది కూడా.
సరే ఇక., మనం ప్రేమించే వారితో
మళ్లీ సరి కొత్త బంధాల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి?
ఈ జీవితం
పూర్తిగా రక్తహీనమై పాలిపోయిందే మరి?
నీ సంతోషాన్ని.. స్వేచ్ఛని..
ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే
జీవించడంలోని నీ అద్భుతమైన సాహసాన్ని
నేను అమితంగా ప్రేమిస్తాను.
నా స్వేచ్ఛని ఏమాత్రం అడ్డుకోని
నీతో జీవన సాహచర్యాన్ని ఇష్టపడతాను..
నిన్ను ప్రేమిస్తున్నాను!
~
మూలం: ఆల్బర్ట్ కామూ
అనుసృజన: గీతాంజలి
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964