Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేరణ – స్ఫూర్తి

[ద్వాదశి ఉమాబాల గారు రచించిన ‘ప్రేరణ – స్ఫూర్తి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

‘భిన్నత్వంలో ఏకత్వం’ మన ప్రభుత్వ పాఠశాలలు. వివిధ కులాల, మతాల, వర్గాల పిల్లలందరూ ఒకే తీగ పూవుల్లా చేరి విద్యనభ్యసించే ‘చదువుల తల్లి ఒడి మన బడి’. బతుకు బాటను తీర్చిదిద్ది, సంస్కార సౌరభాలు వెదజల్లించే పూదోట మన పాఠశాల. మట్టిలోని మాణిక్యాలు ఎన్నో ఉంటాయి. వెలికితీసే తోటమాలులు కోకొల్లలు. అటువంటి ప్రభుత్వ పాఠశాలలో అంతులేని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న ఉపాధ్యాయిని లలిత.

ఆరోజు తన పాఠ్యాంశంలోని భాగంగా బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యార్జనపై పాఠం చెబుతూ.. “ఏ కల్మషం లేని విరులు నవ్వుతుంటాయి. చిన్నారులు కూడా నవ్వుతూంటారు. వారికి భయం అంటే తెలియదు. బాల్యం కదా. చీకూ చింతా లేని జీవితం. కానీ, అదే బాల్యంలోని కొంతమంది పిల్లల తల్లిదండ్రులకి కూలీ నాలీ చేస్తేనే కాని రోజు గడవదు. ఈ క్రమంలో అవసరమైతే వారి పిల్లలని కూడా పనిలోకి పంపి, డబ్బులు సంపాదించేలా చేస్తారు. అలా ఎంతో మంది పిల్లలు తెల్లవారుజామునే లేచి, పత్రికలు చదివే వారిండ్లకు వార్తాపత్రికలు వేసి, బడికి వచ్చి చదువుకొనేవారు. తల్లుల వెనుక పనిపాటలలో సాయపడేందుకు వెళ్ళే బాలికలు కూడా వున్నారు. ఇంకా బడిలో చేర్చకుండా కర్మాగారాలలో, హోటళ్ళలో పనికి పంపేవారూ ఉన్నారు”.. ఇలా సాగిపోతోంది ఉపాధ్యాయిని లలిత పాఠం.

చిన్నతనంలోనే దుర్భరమైన చిన్నారుల జీవితాల గురించి చెబుతూవుంటే తరగతి గదిలోని పిల్లలంతా నిశ్శబ్దంగా పాఠం వింటున్నారు. పాఠ్యాంశంలోని విషయాన్ని వివరిస్తూన్న లలితా టీచర్ “14 సంవత్సరాల లోపు బాలబాలికలను విధిగా బడిలో చేర్పించాలి, చదివించాలి. అంతేకాని వాళ్ళతో చాకరీ చేయించి, ఒత్తిడికి గురి చేయకూడదు. అలా చేసేవాళ్ళని చట్టం శిక్షిస్తుంది. బాలలకు ప్రత్యేకించి కొన్ని ప్రధాన హక్కులు ఉన్నాయి. ముఖ్యంగా భారత ప్రభుత్వం 2009 ఆగష్టులో విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా చట్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏప్రిల్ 1, 2010 నుండి ‘నిర్బంధ ఉచిత విద్యాహక్కు చట్టం’ అమలులోకి వచ్చింది. అంటే 6 నుండి 14॥ ల మధ్య వయస్సున్న బాలబాలికలందరూ ఉచితంగా నిర్బంధ విద్యను పొందుతారు. వారందరూ మానసిక వికాసంతో పాటు ఆరోగ్యంగా ఎదిగేలా చూడాలి. మీరంతా అభివృద్ధి చెందాలంటే విద్యతో పాటు వినోదం, విరామం, ఆటపాటలతో బాల్యాన్ని అనుభవిస్తూ, వాళ్ళ హక్కులని పరిరక్షించేలా ఉండాలి. భవిష్యత్తు మీదే కదా మన ఊరి, జిల్లా, రాష్ట్ర, దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది” అని ఒక్క క్షణం ఆగి, లలితా టీచర్ పిల్లలని చూస్తూ “ఏమైనా అడగాలనుకుంటున్నారా?” అంది.

వెంటనే సంధ్యలేచి “టీచర్, మరి మా అమ్మకి సాయం చేయకూడదా?” అంది. అవాక్కైన లలితా టీచర్ “అమ్మకి సాయం అంటే?” అంది. “మా నాన్న వాచ్‌మ్యాన్‌గా ఉన్నారు. మా అమ్మ అపార్టుమెంటులోని ఇళ్ళల్లో పని చేస్తుంది. నేను కూడా మా అమ్మతో వెళ్ళి గిన్నెలు తోమి, ఇల్లు ఊడ్చి అమ్మకి సాయం చేస్తాను” అని తెలిపింది సంధ్య. “నువ్వు వెళ్ళకూడదు, చేయకూడదు” అని కాస్త గట్టిగానే చెప్పింది లలితా టీచర్. దాంతో సంధ్య ముఖం చిన్నబోయి కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. మళ్ళీ సంధ్యే “మరి మా అమ్మకి ఒంట్లో బాగాలేకపోయినా వెళ్ళకూడదా?” అంది ఏడుస్తూ భయంగా. లలితా టీచర్ కోపంగానే “కూడదని చెప్పానా?” అంది. ఇంతలో గంట మ్రోగడంతో బయటికి వచ్చేసింది టీచర్. గుండె బరువెక్కినట్లైంది. స్టాఫ్ రూములో కూర్చుని ఆలోచనలో పడిన లలిత సమయం చూసుకొనేలేదు. పక్కనే వున్న సైన్స్ టీచర్ చూసి, “ఏంటండి లలితగారు భోజనం చేయరా? ఉపవాసమా ఏంటి?” అన్న మాటలకి  ఆలోచనల నుంచి బయటికి వచ్చింది లలితా టీచర్.

లలిత బడి నుండి ఇంటికి వెళ్ళినా, ఆమె కళ్ళ ముందు సంధ్య రూపమే కదలాడుతోంది. ఏ పని చేస్తున్నా తన మాటలే వినిపిస్తున్నాయి. ఏ పనీ చేయాలనిపించలేదు, ఏదీ తినాలనిపించలేదు. ‘సంధ్య బుద్ధిమంతురాలు, చక్కగా చదువుతుంది, తెలివైనది. కానీ ఆర్థిక పరిస్థితులు ఆ చిన్నారి చేత పనులు చేయిస్తున్నాయి. ఆ చిట్టి మనసును నొప్పించకుండా చెప్పాలి. ఎలా?’ అని ఆలోచనలతో నిద్రలోకి జారుకుంది లలితా టీచర్.

మర్నాడు ఉదయం యథాప్రకారం తన తరగతికి వెళ్ళి గదిలో అడుగుపెట్టి పిల్లలందరినీ కలయచూసింది లలిత. సంధ్య కనపడలేదు. మనసులో ఏదో బాధగా అనిపించింది. “సంధ్య రాలేదా?” అని అడిగింది. క్రిందకి తల దించుకొని కూర్చున్న సంధ్య మెల్లగా లేచి నిలబడింది తల ఎత్తకుండానే. లలితా టీచర్ గట్టిగా ఊపిరి తీసుకొని, వాతావరణాన్ని ప్రశాంతంగా చేస్తూ, “పిల్లలూ! మీకు ఈరోజు పాఠం చెప్పను. ఒక కథ చెప్తాను. కధ అనే కన్నా మీ వయసులో ఉన్న అబ్బాయి గురించి, ఆ అబ్బాయి చదువు గురించి చెప్తాను” అంది. పిల్లలందరూ “చెప్పండి టీచర్” అని ముక్తకంఠంతో అడిగేసరికి లలితా టీచర్ సంతోషంగా చెప్పడం ప్రారంభించింది.

“ఒక పల్లెటూరిలో 12 సంవత్సరాల శంకర్ అనే అబ్బాయి ఉండేవాడు. తనకి ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. శంకర్ నాన్నగారు ఆ ఊరిలోనే చిన్న ఉద్యోగం ఉద్యోగం చేసేవారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడంతో పిల్లలందరికీ చదువులు చెప్పించలేక పెద్దవాడైన శంకర్‌ని బడికి వెళ్ళద్దని, చదువు మాన్పించేశారు. బాగా చదివే శంకర్ తను బాగా చదివి మంచి మంచి పనులు చేస్తానని స్నేహితులతో ఎప్పుడూ చెబుతూండేవాడు. పాపం శంకర్, తండ్రి మాటను కాదనలేకపోయాడు. అయితే శంకర్ నిరాశా, నిస్పృహకి లోనుకాకుండా, ‘నేనేం చేయాలి? చదువుకోడానికి మార్గమే లేదా?’ అని ఆలోచించాడు. ఒక రోజు వాళ్ళ నాన్నగారు చెప్పిన ఒక గొప్ప వ్యక్తి జీవితం గురించి గుర్తుకు వచ్చింది శంకర్‌కి. అతనెనరో కాదు, మన దేశం గర్వించే వ్యక్తి, రాష్ట్రపతి, నీతి, నిజాయితీకి మారుపేరుగా, ఎనలేని కీర్తిప్రతిష్ఠలందుకొన్న మన ‘అబ్దుల్ కలాం’ గారు. అతన్ని ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ గా గొప్పగా పిలుచుకుంటారు కూడా.” కలాం గారు కూడా తన బాల్యంలో పేదరికాన్ని అనుభవిస్తున్నా, వారి తల్లిగారు చెప్పే మాటలతో, స్ఫూర్తితో ప్రేరణ పొంది, మొక్కవోని ధైర్యంతో గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆ స్థాయికి ఎదిగిన అబ్దుల్ కలాం గారు కూడా చిన్నతనంలో, చదువుకొనే వయసులో ఉదయాన్నే వార్తాపత్రికలు ఇంటింటికీ వేసుకొని, బడికి వెళ్ళి వచ్చి, మరల వారి అమ్మగారికి పనిలో సాయం చేసేవారు. ఇలా ఆలోచిస్తూ ఉండగా శంకర్ కి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది.

తన స్నేహితులు బడి నుండి వచ్చిన తరువాత వారి వద్దకు వెళ్ళి ఆరోజు చెప్పిన పాఠాలను అడిగి తెలుసుకొంటూ ఉండేవాడు. అంతేకాక వారి వీధిలోని 1,2 తరగతి పిల్లలకి అక్షరాలు, అంకెలు, పదాలు నేర్పించడం, తరువాతి తరగతి పిల్లలకి

మొదలైనవి చెప్పి, వప్పచెప్పించుకోవడం, వారికి వచ్చే సందేహాలను తీరుస్తూ అన్నలా. అలా చదివిస్తున్న పిల్లలకి పరీక్షల్లో మంచి మార్కులు రావడంతో, లెక్కలు, ఎక్కాలు మొదలైనవి చెప్పి, వప్పచెప్పించుకోవడం, వారికి వచ్చే సందేహాలను తీరుస్తూ ఉండేవాడు అన్నలా. అలా చదివిస్తున్న పిల్లలకి మంచి మార్కులు రావడంతో వారి వారి తల్లిదండ్రులు శంకర్‌ని ప్రోత్సహిస్తూ, ఇలాగే మా పిల్లలకి ట్యూషన్ చెప్పవలసినదని 10, 20/- రూపాయిలు ఇస్తూ ఉండేవారు.

శంకర్ “అయ్యో వద్దండి. డబ్బులు తీసుకోకూడదండి” అనేవాడు. కానీ, వాళ్ళు శంకర్ భుజం తట్టి, అభినందిస్తూ, “ఈ డబ్బులతో నువ్వు పుస్తకాలు, పెన్నులు కావలసినవి కొనుక్కొని చదువుకో బాబు” అనేవారు.

టీచర్ చెబుతూ ఉండగా “రవి అనే విద్యార్ధి లేచి, టీచర్! మరి శంకర్ చిన్న వయసులో డబ్బులు తీసుకున్నాడు కదా! పని చేసి డబ్బు సంపాదించకూడదు కానీ, చదువు చెప్పి డబ్బులు తీసుకోవచ్చా?”. అని అడిగేడు. “మంచి ప్రశ్న వేశావు రవీ! ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. శంకర్ ఖాళీగా కూర్చోకుండా, తను చదివిన చదువును మరిచిపోకుండా ఉండేందుకు వీధిలో పిల్లలందరినీ చదివించేవాడు. అలాగే తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి తన తరగతి పాఠాలను బడిలో ఉపాధ్యాయులు ఏం చెప్పారో తెలుసుకొని, నేర్చుకొనేవాడు. ఈ క్రమంలో వీధిలో పిల్లల తల్లిదండ్రులు శంకర్‌కు పారితోషకంగా ఇస్తే, ఒక మంచి విద్యార్థికి చదువుకొనే అవకాశంగా ఉంటుందని ఇచ్చేవారు. పూర్వకాలంలో కూడా విద్యనిచ్చే గురువులకు గురుదక్షిణ అని ఇచ్చేవారు. అలాగే మన ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇప్పటికీ బాగా చదివి, మంచి మార్కులు తెచ్చుకొనే విద్యార్ధులకి ప్రోత్సాహకాలుగా నగదు బహుమతులు (స్కాలర్ షిప్పులు) ఇస్తున్నారు కదా” అని చెప్పారు టీచర్.

అంతా. విన్న తరువాత వినయ్ లేచి, “టీచర్! శంకర్ మళ్ళీ ఎప్పుడు బడికి వెళ్ళాడు?” అని అడగగా, శ్రావణి, “మిగిలిన తరగతులు చదివాడా టీచర్?”  అడిగింది. వెంటనే లలితా టీచర్, విద్యార్ధుల ఆసక్తికి ముగ్ధురాలై, “ఓ.. మరుసటి సంవత్సరం నుండే వెళ్ళాడు. శంకర్ గురించి ఆ నోట, ఈ నోట విని ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ శంకర్ వాళ్ళ యింటికి వెళ్ళి, తన తల్లిదండ్రులుతో మీ అబ్బాయికి మంచి తెలివితేటలున్నాయి. వాటితో పాటు చదువుపై ఎంతో మక్కువ ఉంది. కాబట్టి మీ అబ్బాయిని బడికి పంపించండి. ప్రభుత్వమే ఉచితంగా పుస్తకాలు, బట్టలు ఇచ్చి, భోజనం కూడా పెట్టి, విద్యనందిస్తోంది అని చెప్పి, శంకర్ వాళ్ళ నాన్నగారిని ఒప్పించారు. ఆ విధంగా శంకర్ మళ్ళీ బడిలో చేరి అందరి నమ్మకాన్ని నిజం చేస్తూ, బాగా చదువుకొని పక్క జిల్లాకే కలెక్టర్ గా వచ్చి మంచి మంచి పనులు చేసి అందరి మన్ననలు పొందాడు. కాబట్టి, పిల్లలూ! శంకర్‌లా అందరూ పరిస్థితుల వలన వచ్చే కష్టనష్టాలను ఎదుర్కొని, ధైర్యంగా ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి పౌరులుగా మారుతారు” అని చెప్పి, “మీరు కూడా ఈవిధంగా ముందుకు వెళతారా?” అని పిల్లలనుద్దేశించి అడిగింది లలితా టీచర్. పిల్లలందరూ సంతోషంగా ఒక్కసారిగా “తప్పకుండా టీచర్” అని, “మేము కూడా బాగా చదువుకొని, మంచి ఉద్యోగాలు సంపాదిస్తామని చెప్పారు. ఆ మాటలు విన్న లలితా టీచర్ సంతోషం పట్టలేక ఆనందభాష్పాలతో తరగతి గది నుండి వెళ్ళిపోయింది.

కాలగమనంలో సంవత్సరాలు గడిచాయి. లలితా టీచర్ ఉద్యోగ విరమణ చేసి, తన మనుమలతో ఆడుకుంటున్న ఒక సాయంకాలం వాళ్ళ అమ్మాయి వడివడిగా వచ్చి “అమ్మా! నీకే ఫోను” అంది. “ఎవరో లలితా టీచర్ కావాలని అడుగుతున్నారు.” అని ఫోన్ చేతిలో పెట్టింది. “ఎవరే వాళ్ళు?” అంటూ.. “హలో ఎవరూ” అంది. “టీచర్! నేను, సంధ్యని టీచర్. 5వ తరగతి స్టూడెంట్‌ని” అని అంది. “ఓ.. సంధ్యా, నువ్వా!” అంది ఆశ్చర్యంగా లలితా టీచర్. “అవును టీచర్!” అని “మీరిచ్చిన స్ఫూర్తితో నేను కష్టపడి చదివి, మీ ఊరిలోనే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ‘ప్రిన్సిపాల్’గా చేరాను. స్నేహితుల ద్వారా మీరు ఈ ఊరిలోనే ఉన్నారని తెలుసుకొని ఫోన్ చేశాను టీచర్” అని, “రేపు ఉదయాన్నే మిమ్మల్ని కలుస్తాను” అని చెప్పింది సంధ్య.

మూగబోయిన ఫోన్‌ను చూస్తూ జ్ఞాపకాల సుడులలో పయనిస్తూ.. ప్రేరణ నుంచి వచ్చిన స్ఫూర్తికి నిజమైన ఉదాహరణగా అనుభుతిని పొందుతూ రేపటి ఉదయం కోసం ఎదురు చూస్తూ ఆనందంలో నిదురలోకి జారుకుంది లలిత.

Exit mobile version