Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘పునరావృతం’ – కొత్త ధారావాహిక – ప్రకటన

సీనియర్ రచయిత శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.

***

మన ఆచార వ్యవహారాల్లో కాలక్రమేణా మార్పులు సంభవించడం సహజం. వాటిలో భాగంగానే మన వివాహవ్యవస్థ సాంప్రదాయ పద్ధతులనుండి ఆధునిక ఆలోచనల వైపు మారుతోంది. మొదట్లో నిశ్చయ వివాహాలు: పెద్దలు నిశ్చయించి కుదిర్చిన వివాహాలు అమలులో ఉండేవి. వాటిలో వధూవరుల వయసులో చాలా తేడా ఉండేది. వారిద్దరు వారి పెళ్లిలోనే ఒకరినొకరు చూసుకోగలిగేవారు. ఆ తరువాత వరుల కోరికపై వయసులో తేడా తక్కువగానున్న వధువుతో పెళ్ళిచూపుల ద్వారా వివాహాలు కుదిరేవి. ఆ పిమ్మట ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహాలు, ప్రారంభమయ్యేయి. ఈ పరిణామాల ఆధారంగా రచించినదే ‘పునరావృతం’ నవల.

నవల కథలోనికి వెళితే, గౌరీపతి శాస్త్రి వంశపారంపర్యంగా పురోహితుడు. ఆయన తన పుత్రిక వివాహం సాంప్రదాయ పద్ధతిలో జరిపించేడు. తన తనయుడు గణపతిశాస్త్రికి కాలానుగుణంగా స్కూలు చదువు చెప్పించేడు. గణపతికి ఉద్యోగం చేయాలని ఉన్నా తండ్రి ఆ జోలికి వెళ్ళనియ్యలేదు. ఆయిష్టంగా పౌరోహిత్యమే చేయవలసి వచ్చింది. గణపతి తన కొడుకును తప్పక ఉద్యోగస్థుణ్ణి చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. వాణ్ణి డిగ్రీ చేయించేడు. వాడు బ్యాంకు ఉద్యోగస్థుడయ్యేడు. తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఒక మలయాళీ అమ్మాయిని వివాహమాడేడు. తరువాత జరిగినది తెలుసుకోడానికి నవల చదవాలి.

***

ఈ సరికొత్త ధారావాహిక.. సంచికలో.. త్వరలో.

చదవండి.. చదివించండి..

Exit mobile version