Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పునరావృతం-1

[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

అవి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు రోజులు.

ఆ రోజుల్లో శ్రీవల్లిపురం చిన్న పల్లెటూరు. కాని దానికొక ప్రత్యేకత ఉండేది. ఆ గ్రామంలో వెలసిన సరస్వతి వేదవిజ్ఞాన పీఠం ఉత్తమమైనదిగా గుర్తింపు ఉండేది. దగ్గరోనున్న జిల్లాల నుండి కూడా విద్యార్థులు అందులో చేరేవారు. క్రమంగా శ్రీవల్లిపురం ఒక నగరంగా ఎదిగింది. కారణం; దాని దగ్గరలో ఒక పెద్ద రసాయన కర్మాగారం, తత్సంబంధమయిన చిన్న కర్మాగారాలు వెలియడంతో దగ్గర ఊళ్లనుండి ప్రజలు అక్కడకు వలస రావడం ప్రారంభమయింది. ముఖ్యంగా, యువత ఉద్యోగావకాశాలు నిమిత్తం రావడం జరిగింది. పెరుగుతున్న జనాభా వ్యాపారస్థులను కూడా ఆకర్షించింది. కొత్త ప్రైవేటు స్కూళ్లు, ఒక డిగ్రీ కాలేజీ విద్యా సౌకర్యాలకు ఏర్పడ్డాయి. వైద్య సౌకర్యాలు కూడా మెరుగుపడ్డాయి. పురప్రజల అవసరాల ఆధారంగా తాజా రకం దుస్తుల దుకాణాలు, ఎలక్ట్రానిక్ సామగ్రి దుకాణాలు మున్నగునవి బజారుకు కొత్త వన్నెలు తెచ్చేయి.

శ్రీవల్లిపురానికి వలస వచ్చిన వారిలో ద్వివేదుల గౌరీపతిశాస్త్రి గారి కుటుంబం కూడా ఉంది. కొన్ని తరాలనుండి వారు దగ్గరలోనున్న జీళ్లపల్లి వాస్తవ్యులు. శాస్త్రిగారికి తెలిసినంత వరకు మూడు తరాలనుండి వారికి పౌరోహిత్యం జీవనోపాధి. అందరూ వేద పండితులు. శాస్త్రిగారికి శ్రీవల్లిపురం పరిచయమున్నదే. ఆయన పౌరోహిత్యంలో కొన్ని శుభకార్యాలు ఆ ఊళ్లో జరిగేయి. శాస్త్రిగారు కేవలం పౌరోహిత్యమే కాదు, పురాణాలు, వేదాలు, కూడా క్షుణ్ణంగా అభ్యసించేరు. వివాహం, ఉపనయనాల ప్రత్యేకత వివరంగా తెలుసు. అవి తగు సందర్భాలలో ప్రేక్షకులకు వినిపిస్తూ ఉంటారు. తరచూ శుభకార్యాలు జరిపించునపుడు, భోజనాలనంతరం విరామ సమయాల్లో ఆయన ప్రవచనాలు వినడానికి పెండ్లికి వచ్చినవారందరూ కుతూహలంగా ఉంటారు. ఆ సందర్భాలలో వారందరూ ఒకచోట చేరి శాస్త్రిగారిని అవి వినిపించమని ఆహ్వానిస్తారు. శాస్త్రిగారు ఒక కుర్చీపై అర్ధ పద్మాసనంలో ఆసీనులయి, కుడి ముణుకును కుడి చేతితో సున్నితంగా రాస్తూ ప్రవచనాలు చెబుతూ ఉంటే, చేరిన వారందరూ శ్రద్ధగా వింటారు. ఆ ప్రత్యేకత ఆయన వృత్తిలో తోడ్పడుతుంది. శ్రీవల్లిపురం నగరానికి శాస్త్రిగారి వృత్తిపరమైన రాకలు పెరిగేయి. క్రమంగా ఆ పరిణామంతో వృత్తిపరంగా తను సేవలందిస్తున్న ఒకాయన సలహాతో, శాస్త్రిగారు సకుటుంబంగా శ్రీవల్లిపురంలో తమ నివాసాన్ని శాశ్వతంగా ఏర్పరుచుకొన్నారు.

శాస్త్రిగారి భార్య పార్వతి. ఆ దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు, గణపతిశాస్త్రి; కూతురు, అలివేలు మంగమ్మ. శాస్త్రిగారి తల్లి ఈశ్వరమ్మ వారితోనే ఉంటోంది. ఈశ్వరమ్మ పార్వతికి స్వయాన మేనత్త. శాస్త్రిగారి తండ్రి పదహారు సంవత్సరాల క్రితం పరలోకం చేరేరు. గణపతిశాస్త్రిని అందరూ వాడుకగా ‘గణపతీ’ అని పిలిచేవారు. అలాగే అమ్మాయిని ‘మంగమ్మా’ అని పిలిచేవారు. గణపతి మంగమ్మకన్నా అయిదేళ్లు పెద్ద.

ఈశ్వరమ్మకు మనవలంటే వల్లమాలిన ప్రేమ. ఆవిడకు రామాయణం అతి ప్రీతి. మనవలకు వారి చిన్నతనంలో రామాయణంలోని చిన్న చిన్న కథలు చెబుతూ వారికి వాటిలోని నీతులు కొన్ని సులభంగా బోధపడేటట్టు చెప్పేది. దశావతారాలు ఆసక్తికరంగా చెప్పేది. వారవి కుతూహలంతో శ్రద్ధగా వింటూ ఆనందించేవారు. ఒక్కొక్కప్పుడు కథలు వింటూ చిన్నది మామ్మ ఒడిలో నిద్రబోయేది. ఈశ్వరమ్మ మనవరాలి నిద్రకు భంగం కలగకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి దాని పక్కమీద పడుకోబెట్టేది. ఒకరోజు, ఈశ్వరమ్మ చిన్ని కృష్ణుని కాళింగ మర్దనం వారికి కళ్లకద్దినట్లు చెబుతోంటే, “ మామ్మా ఆ పాము అంత పెద్దదికదా, చిన్నికుస్తుణ్ణి కుట్టీలేదా.” అని ఆశ్చర్యంతో అడిగేడు, గణపతి. “చిన్ని కృష్ణుడు దేముడు నాయనా. దేముణ్ణి పాము కుట్టినా ఏమీ అవ్వదు.” అని వాడి తల నిమురుతూ ఈశ్వరమ్మ వాడి సందేహం తీర్చింది. అలా ఈశ్వరమ్మ మనవలతో కాలంగడుపుతూ సంతోషం పొందేది. ఒక్కొక్కప్పుడు భర్తను తలచుకొని, “మీ నాన్నగారు ఉండుంటే ఈ ముద్దుల మనవలని చూసి మురిసిపోయి ఉందురు.” అని కొడుకుతో తన విచారాన్ని చెప్పుకునేది. “అలా బాధపడకమ్మా. నాన్నగారు పై లోకం నుండి చూస్తూనే ఉండి ఉంటారు. నాన్నగారి ఆశీర్వచనం వాళ్లకెప్పుడూ ఉంటుంది.” అని శాస్త్రిగారు తల్లిని సముదాయించేవారు.

ఈశ్వరమ్మకు కోడలిపట్ల కూడా అభిమానం ఉండేది. వంటింట్లో ఆమెకు కూరలు తరగడం వంటి కొన్ని చేయగలిగిన సాయం చేస్తూండేది. కోడలు వంటింట్లో పనులు చేసుకొంటున్న సమయాల్లోను, పేరంటం వంటి కార్యక్రమాలకు వెళ్లినప్పుడు, చిన్న పిల్లలను జాగ్రత్తగా తను చూసుకొనేది. రోజూ మనవలను తన కాళ్లమీద పడుకోబెట్టి వాళ్లకు స్నానాలు చేయించేది. అలా చిన్నపిల్లల పెంపకంలో పరిపరి విధాల తోడ్పడుతూ కోడలుకు సహాయాన్ని అందజేసేది. మడిగా తను పూజ చేసుకొంటున్న కొన్ని సమయాలలో మనవడు ప్రాకుకొంటూ వచ్చి తన దగ్గరకు వస్తే, చికాకు పడకుండా తన ఒళ్లో కూర్చోబెట్టుకుని పూజాకార్యక్రమం సాగనిచ్చేది. అది తెలుసుకొని కోడలు వడిగా వచ్చి, “ అయ్యో, నేను చూడలేదు. వీడొచ్చి నిన్ను ముట్టేసుకున్నాడా. ఇలా ఇయ్యత్తయ్యా. నేను వాణ్ణి ఉయ్యాల్లో కూర్చోబెడతాను.” అని అత్తయ్యని అడిగితే, “మరేం ఫరవాలేదే. చిన్నపిల్లాడు. తప్పులేదు. నువ్వు వెళ్లి నీ పని చూసుకో.” అని సద్ది చెప్పి, మళ్ళీ తన పూజ చేసుకొనేది, ఈశ్వరమ్మ.

కాలమాన పరిస్థితుల దృష్ట్యా గణపతికి కనీస ఆధునిక విద్యాభ్యాసం చేయించ దలచి శాస్త్రిగారు వాణ్ణి ఒక ప్రైవేటు స్కూలో ప్రవేశపెట్టేరు. గణపతి తెలివితేటలుగా చదువుకుంటూ నాల్గవ తరగతిలో అడుగుపెట్టేడు. కుమారునకు శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించిన నాటి నుండి, గౌరీపతిశాస్త్రిగారు వాణ్ణి తన వృత్తిలో శిక్షణ ప్రారంభించ దలిచేరు. కాని గణపతి వినయంగా తనకు ఇంకా పెద్ద క్లాసులు చదవాలని ఉందని విన్నవించుకున్నాడు. తండ్రి దానికి సుముఖంగా లేరని తెలియగానే మామ్మ దగ్గర ఆ విషయం మొరపెట్టుకున్నాడు. తనకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందని, ఇంగ్లీష్ పై క్లాసుల్లోనే నేర్పుతారని, మనసులో కోరిక మామ్మకు తెలియబరిచేడు. ఆమెకు ఆ విషయం నచ్చింది. ఈశ్వరమ్మ జాలిపడి, శాస్త్రిగారితో మనవడి ఉద్దేశాన్ని సిఫారసు చేస్తూ, “పెద్దక్లాసులు చదువుకొంటానని వాడు మొర పెట్టుకొంటున్నాడురా. వాణ్ణి చదువుకోనీ. ఆ పల్లెటూరులో సదుపాయాలు లేక నీకు స్కూలు చదువులు చెప్పించలేదుగాని, ఉంటే మీ నాన్నగారు నీకు ఎంతోకొంత చదివించి ఉందురు. గణపతి తెలివయినవాడు. వాణ్ణి పై క్లాసులు చదువుకొని నాలుగు ఇంగ్లీసు ముక్కలు నేర్చుకొనీ. ఆ ఇంగ్లీసు రాక అప్పుడప్పుడు నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో చూడు. పౌరోహిత్యం ఏముంది; మూడు నాలుగేళ్లలో ఇట్టే నేర్చేసుకొంటాడు. అంచేత వాణ్ణి ఆ పెద్దక్లాసులేవో చదువుకోనీ.” అని గట్టిగా చెప్పడంతో శాస్త్రిగారు కూడా తల్లి అభిప్రాయాలతో ఏకీభవించి అంగీకరించేరు. గణపతి చదువు ముందుకు సాగింది.

ఒకరోజు గణపతి A,B,C,D లు దిద్దుకొంటూ ఉంటే, ఈశ్వరమ్మ వాడి దరి చేరి, “గణపతీ, ఏమిటి నాయనా రాస్తున్నావు.” అని కుతూహలంగా అడిగింది.

“మామ్మా, ఇవి ఇంగ్లీషు అక్షరాలు. A,B,C,D. లు.” అని సగర్వంగా మామ్మ ముఖంలోనికి చూస్తూ చెప్పేడు.

ఈశ్వరమ్మ ముఖం చేటంత అయింది. అంతలో శాస్త్రిగారు రాగానే, “కుర్రాడా, చూసేవా. గణపతి అప్పుడే ఇంగ్లీసు రాసేస్తున్నాడు. నేను చెప్పేను కదరా, వాడు తెలివయిన వాడని.” అని వికసించిన ముఖంతో సగర్వంగా చెప్పింది. శాస్త్రిగారు గణపతి రాసిన ఇంగ్లీష్ అక్షరాలు చూసి మురిసిపోయేరు. అది తెలిసి పార్వతి కూడా వారి సంతోషాన్ని పంచుకుంది. గణపతి క్లాసులో అధికశాతం విద్యార్థులు ఉద్యోగస్థుల పిల్లలు. స్నేహస్వభావం వల్ల గణపతి వారిలో బాగా ఇమిడిపోయేడు. వారిలో కొందరికి అప్పుడప్పుడు హోమ్ వర్క్ చేయడంలో గణపతి సహాయపడడం జరుగుతూండేది. వారి పిల్లల చదువు పురోగతిని తెలుసుకోడానికి కొందరు ఉద్యోగస్థులు క్లాసుకు వచ్చి టీచర్లను సంప్రదించేవారు. అట్టి సమయాల్లో వారిని గణపతి తదేక దీక్షతో చూస్తూండేవాడు. దేనికలా చూసేవాడో వాడికే తెలియాలి. ప్రతి సంవత్సరం స్కూలు వార్షికోత్సవాలు జరుగుతాయి. ఒక సంవత్సరం ఆ వార్షికోత్సవానికి కలక్టరు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించేరు. ఆయన సభలో ప్రవేశిస్తూండగానే సభలో అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. సభలో తోటి విద్యార్థులతో నున్న గణపతి కూడా అందరితో బాటు లేచి నిలబడ్డాడు. అందరూ ఆశీనులయినతరువాత కూడా గణపతి అలా నిల్చునే కలక్టరుగారిని దీక్షగా చూస్తూంటే, పక్కనున్న విద్యార్థి వాణ్ణి కూర్చోబెట్టేడు. ఉత్సవంలో భాగంగా బహుమతి ప్రదానాలు ప్రారంభమయ్యాయి. ప్రతీ తరగతిలో ఉత్తమ విద్యార్థికి బహుమతులిస్తున్నారు. గణపతి తన క్లాసునుండి, మొత్తం స్కూలునుండి, ఉత్తమ విద్యార్థిగా ఎన్నికయ్యేడు. “ద్వివేదుల గణపతిశాస్త్రి”, అని వాడి పేరు పిలవగానే వాడి తోటి విద్యార్థులందరూ హర్షధ్వానాలతో హోరెత్తించేరు. గణపతి వేదిక వద్దకు వెళ్లి కలక్టరుగారి ఎదుట వినయంగా నిలబడ్డాడు. ఆయన గణపతి మెడకు రెండు బహుమతి పతకాలు తొడుగుతూ అభినందించేరు. మరో మారు సభ దద్దరిల్లింది. గణపతి కలక్టరుగారికి పాదాభివందనం చేసి ఆయన ఎదురుగా నిలబడ్డాడు. ఆయన చిరునవ్వుతో, “ఇంకా కష్టబడి చదువు. కాలేజీ క్లాసుల్లో అన్నీ ఇంగ్లీష్ లోనే చెప్తారు. అంచేత ఇంగ్లిష్ బాగా నేర్చుకో. పెద్ద చదువులు చదువుకుంటే పెద్ద ఉద్యోగాలు చెయ్యగలవ్.” అని హిత బోధ చేసేరు. ఆయన వాక్యాలు గణపతి మనోఫలకం మీద చెరగని ముద్ర వేసేయి.

ఒకరి ఇంట వివాహకార్యక్రమంలో నిమగ్నులైన మూలాన్న శాస్త్రిగారు పై కార్యక్రమానికి వెళ్లలేకపోయేరు. కార్యక్రమం ముగిసిన వెంటనే గణపతి అమిత ఉత్సాహంతో ఇల్లు చేరుకున్నాడు. వడి వడిగా మామ్మ దగ్గరకు వెళ్లి, మామ్మకు, అక్కడి ఉన్న తల్లికి, చెల్లికి, తన బహుమతులు సగర్వంగా చూపెట్టి, “మామ్మా, కలక్టరుగారు నాకేమిటి చెప్పేరో తెలుసా.” అని ఇంకా చెప్పబోతూంటే,

“కలక్టరుగారు నీతో మాట్లాడేరా. నీతో ఏమిటన్నారు.” అని ఆత్రుతగా అడిగింది, పార్వతి.

అన్న చేతిలోని బహుమతులు తను పట్టుకు చూస్తూ, “అన్నా ఇవి చాలా బాగున్నాయి. ఇవి బంగారంతో చేసేరా.” అని అమాయకంగా అడిగింది.

“అవి బంగారంవి కావే వెర్రితల్లి.” అని మామ్మ చెబుతూండగానే,

గణపతి “కలక్టరుగారు ఈ రెండూ స్వయంగా నా మెడలో వేసేరు. నేను ఆయనకు పాదాభివందనం చేసేను.” అని చెప్పగానే,

“మంచిపని చేసేవు నాయనా. పెద్దవాళ్లని అలా గౌరవించాలి. అది సరేగాని నీతో ఆయన ఏమిటి మాట్లాడేరు.” అని మామ్మ కూడా తెలియగోరింది.

“పెద్ద క్లాసులు చదివితే పెద్ద ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. కాలేజీ క్లాసుల్లో పాఠాలు ఇంగ్లీష్ లో చెప్తారట. అంచేత ఇంగ్లీష్ బాగా నేర్చుకోమన్నారు.” అని వివరంగా జరిగినది చెప్పేడు.

మామ్మ తన హర్షాన్ని మనవడి తలపై ముద్దాడి తెలియజేసింది. పార్వతి కూడా తనయుని ముద్దాడి సంతోషాన్ని వ్యక్తబరిచింది. అన్నా, చెల్లెలు, తమ గదిలోకి వెళ్లిపోయేరు. గణపతి ప్రదానోత్సవంలో జరిగినదంతా పూసగుచ్చినట్టు చెల్లికి చెప్పేడు. తెల్లారి శాస్త్రిగారు రాగానే పార్వతి సంతోషంగా కొడుకు చెప్పినదంతా విపులంగా ఆయనకు చెప్పింది. ఆయన కూడా కొడుకు పురోగతిని హర్షించేరు.

పార్వతి, “కలక్టరు గారు మనవాడితో స్వయంగా మాట్లాడేరుటండి.” అని ఆయన ఇచ్చిన సలహాను మరోమారు ఉప్పొంగిపోతూ చెప్పింది.

“మంచిదే. మన పిల్లడికి అటువంటివారి ఆశీర్వచనాలు మంచి చేస్తాయి. ఆయన సలహా.. అంటే. పెద్దవాళ్ళు పిల్లలిని ప్రోత్సహించడానికి తోచిన సలహాలిస్తూ ఉంటారు. అవన్నీ మనం చెయ్యాలనిగాదు. వాటిలో మనకు చేతనయిందేదో చెయ్యాలి. అలాంటి కార్యక్రమాలలో వాళ్లలా ప్రోత్సహించేలాగ మాట్లాడతారు.” అని నర్మగర్భంగా చెప్పేరు. ఆయన మనసులో ఏముందో పార్వతికి తెలుసు.

గణపతి మంచి మార్కులతో తొమ్మిది పాసయ్యేడు. పదవ క్లాసు చదవడానికి ఉత్సాహంగా ఉన్నాడు. శాస్త్రిగారి ఆలోచన వేరుగా ఉండేది. వాడికి పదిహేనేళ్లు వచ్చేయి. ఇహ వాణ్ణి తన వృత్తిలో శిక్షణ ప్రారంభించడం మంచిదనుకున్నారు. దానికి ముహూర్తం పెట్టేరు. ఒకరోజు గణపతిని పిలిచి వాడికి తన మనోభావాన్ని చెప్పేరు. వాడు ఇంకా పై క్లాసు చదవాలని ఉందని వినయంగా తెలియజేసేడు. శాస్త్రిగారు సమ్మతించలేదు. నిజానికి గణపతికి పై క్లాసులు చదివి ఇంగ్లీషు బాగా నేర్చుకొని ఉద్యోగం చేయాలని మనసులో కోరిక ఉండేది. కాని తండ్రి మాట జవదాటే అలవాటు లేదు. ఏమీ తోచక వాడు ఏడుపు ముఖంతో వెళ్లి ఈశ్వరమ్మతో, “మామ్మా, నాన్నగారికి నువ్వు చెప్పు. నేను పదో క్లాసు చదువుతానంటే వద్దంటున్నారు. స్కూలు మానీమంటున్నారు.” అని, ‘త్వమేవ శరణం’ అని వేడుకున్నాడు.

ఈశ్వరమ్మ కొడుకు వద్దకు వెళ్లి, “కుర్రాడా, గణపతి పదో క్లాసు చదువుతానంటున్నాడురా. ఒక్క సంవత్సరమే కదా చదవనీ.” అని సలహా ఇచ్చింది.

శాస్త్రిగారు, “అమ్మా, తొమ్మిది దాకా చదివించడం, వాడికి ఇంగ్లీష్ నాలుగు ముక్కలు చదవడం, రాయడం, వస్తాయని. వాడు ఇంగ్లీష్ బాగానే నేర్చుకున్నాడు. ఇంకా పై క్లాసులు చదవడం ఎందుకు. వాడేం ఉద్యోగాలు చెయ్యాలా, చెప్పు. వాడికి పదిహేనేళ్ళు వచ్చేయి. ఇప్పటినుండి వాడు పౌరోహిత్యం నేర్చుకుంటే అయిదారేళ్లకు వాడు స్వయంగా పౌరోహిత్యం చెయ్యగలడు. వాడి కాళ్ళ మీద వాడు నిలబడగలుగుతాడు.” అని తల్లికి నచ్చచెప్పేరు.

ఈశ్వరమ్మ, “అవును నాయనా, నువ్వు చెప్పింది సబబుగానే ఉంది.” అని ఏకీభవించింది.

ఈశ్వరమ్మ తన వెనకనున్న మనవడితో, “నాయనా గణపతీ, మీ నాన్న చెప్పింది విన్నావుగా. ఇంగ్లీసులో నాలుగు ముక్కలు నేర్చుకొంటావని ఇప్పటి దాకా చదివించేడు. అవేవో వచ్చేయి కదా. నువ్వు ఇహ పౌరోహిత్యం నేర్చుకోవాలి, బాబూ. మీ నాన్న చెప్పినట్టూ విను.” అని వాడికి సలహా ఇచ్చింది.

వాడు మారు మాట్టాడకుండా నిరాశతో తన గదికి వెళ్లి తన పక్కమీద వాలిపోయేడు.

కొడుకు ఆవేదన పార్వతి తెలుసుకుని వాడి చెంత జేరి, “నాయనా, అలా బాధపడకు. మీ నాన్నగారు మొదటే చెప్పేరుగా ఇంగ్లీసు నాలుగు ముక్కలు నేర్చుకోడానికే నిన్ను బళ్ళో వేస్తున్నానని. మనకెందుకు నాయనా ఆ ఇంగ్లీసు చదువులు. ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్లు ఏలాలా. మీ నాన్నగారు చెప్పినట్టు విను బాబూ. లేచి మొహం కడుక్కుని రా. నీకిష్టమయిన బజ్జీలు చేసేను. తిందువుగాని.” అని తల నిమురుతూ తనయుణ్ణి ఓదార్చింది.

గణపతి పరిస్థితులకు లొంగిపోయేడు. తన ఆవేదన చెల్లితో పంచుకొన్నాడు. “చెల్లీ, నిజానికి నాకు నాన్నగారిలాగ పౌరోహిత్యం చేయాలని లేదు. ఇంగ్లీషులో పెద్దక్లాసులు చదివి ఉద్యోగం చేయాలని ఉంది.

నాన్నగారు పౌరోహిత్యం నేర్చుకోమంటున్నారు. మామ్మ కూడా నాన్నగారి మాటే చెప్పింది. ఏం చేస్తాను నాకు ఉద్యోగం చేసే అదృష్టం లేదు.” అని చెల్లిదగ్గర వాపోసుకొన్నాడు.

మంగమ్మ అన్న దిగాలును అర్థం చేసుకొని, “అన్నా. మనమేమీ చేయలేము. నాన్నగారి మాట కాదనలేవు. ఆ.. నాకొకటి తట్టింది అన్నా.” అని చెల్లినోట వినగానే, “ఏమిటది చెల్లీ.” అని ఆత్రుతగా అడిగేడు.

“అన్నా, నీకు పెళ్లయ్యేక పిల్లలు పుడతారు కదా. వాళ్ల చదువు నీ ఇష్టమే కదా. వాళ్లకి ఇంగ్లీసు చదువులు చదివించి వాళ్లని ఉద్యోగంలో పెట్టు. నీ సరదా తీరుతుంది.” అని వయసుకు మించిన ఆలోచనతో అన్నకు సలహా ఇచ్చింది. గణపతికి అది బాగా నచ్చింది.

“చెల్లీ, నువ్వు చెప్పింది చాలా బాగుంది. నా పిల్లలికి పెద్ద ఇంగ్లీషు చదువులు చెప్పించి ఉద్యోగంలో పెడతాను. పౌరోహిత్యం వైపు వెళ్ళనివ్వను.” అని గణపతి వికసించిన ముఖంతో “థాంక్యూ. చెల్లీ.” అన్నాడు. గణపతిలో నున్న నిరాశ ఒక దృఢ నిశ్చయానికి దారి తీసింది. భవిషత్తులో తన కొడుకును తప్పక ఉద్యోగస్థుణ్ణి చేద్దామని సంకల్పించుకొన్నాడు.

ఒకమారు మంగమ్మ దగ్గరకు వెళదామా. తను కూడా అన్నవలె తెలివయినదే. కాని శాస్త్రిగారు అమ్మాయిని నాలుగో క్లాసు అయిపోగానే దాని చదువుకు మంగళం పాడేరు. అదీను అన్నలా ఇంకా చదివించండని తండ్రిని ప్రాధేయబడితే, సాగలేదు. మామ్మ సిఫారసు కూడా దొరకలేదు. “ఎందుకే నీకు ఇంకా చదువు. చాకలి పద్దులు వెయ్యడానికి వచ్చింది చాలు. మీ నాన్న మంచివాడు. నువ్వు అడక్కుండానే నిన్ను ఈ మాత్రం చదివించేడు. తెలుగు చదవడం రాయడం వస్తే నాలాగ వేలిముద్రలు కాకుండా సంతకం చెయ్యగలవని బడిలో వేసేడు. నీకు తెలుసా. మా రోజుల్లో ఆడపిల్లలని బడి వైపు వెళ్లనిచ్చేవారు కాదు.” అని ఆ చిన్నదాని ఆశల మీద నీరు జల్లింది ఈశ్వరమ్మ. తన కోరిక తీరలేదని మంగమ్మ మనసులో చాలా బాధపడ్డాది.

గణపతికి చెల్లి అంటే చాలా అభిమానం. నిరాశతో ఉన్న చెల్లికి ధైర్యం చెపుతూ, “చెల్లీ, నువ్వు బెంగపడకు. నా పాత పుస్తకాలు ఉన్నాయి. వాటితో నీకు పై క్లాసు పాఠాలు నేను నీకు నేర్పిస్తాను.” అని నొక్కి చెప్పి హామీ ఇవ్వడంతో మంగమ్మ సంతోషంతో, “అన్నా, నీలాగ అన్ని క్లాసుల పాఠాలు నేర్పిస్తావా.” అని అడిగింది.

“అయిదో క్లాసు నుండి అన్నీ నేర్పిస్తాను.” అని అన్న నోట వినగానే,

“అన్నా, నాకు ఇంగ్లీసు కూడా నేర్పుతావా.” అని కుతూహలంతో అడిగింది.

“తప్పకుండా నేర్పిస్తాను. కానీ మొట్టమొదటి పాఠం నేర్చుకో. అది ‘ఇంగ్లీ..సు కాదు. ఇంగ్లీ..షు.” అని చిరునవ్వుతో చెప్పగానే, “ ఇంగ్లీ..షు” అని చిరునవ్వుతో తప్పు దిద్దుకొంది. “గుడ్” అని చెల్లికి కితాబు ఇచ్చేడు గురువు. అన్న వద్ద శిష్యరికం చేస్తూ మంగమ్మ తెలుగులో మరికొంత వెలుగు పొందింది. ఇంగ్లీషులో చిన్న చిన్న పదాలు, వాక్యాలు చదవడం రాయడం కూడా అలవరచుకుంది. కొన్నాళ్లై అమ్మ వెంటా తిరుగుతూ వంటగదిలో అమ్మకు సాయం చేయడం మొదలుపెట్టింది. రోజూ అమ్మ పూజ చేస్తున్నప్పుడు దగ్గరలో బుద్ధిగా మఠం వేసుకు కూర్చుని పూజా కార్యక్రమాలు తెలుసుకుంది.

గణపతి తండ్రివద్ద పౌరోహోత్యం, వేదాలు, పురాణాలు, ఎంత శ్రద్ధగా నేర్చుకొంటున్నా, తనకు పైచదువులు చదువుకునే అవకాశం లేకపోయిందని మనసులో అప్పుడప్పుడు బాధపడసాగేడు. కొన్నాళ్లకు పౌరోహిత్యాలికి వెళ్ళినప్పుడు శాస్త్రిగారు తనయుణ్ణి తనతో బాటు తీసుకెళ్లడం ప్రారంభించేరు. అక్కడ వాడు ఆయనకు చిన్న చిన్న సాయాలు చేస్తూ కార్యక్రమాల పద్ధతిని అవగాహన చేసుకొంటున్నాడు. తండ్రివద్ద తగు శిక్షణ పొంది అతి త్వరలో స్వయంగా గణపతి పూజ, వినాయక పూజ, సరస్వతీ పూజ వంటివి స్వయంగా చేయించడానికి ధైర్యంగా సిద్ధమయ్యేడు. వినాయకచవితినాడు శాస్త్రిగారు ఒక ఇంట, గణపతి మరో ఇంట పూజలు చేయించడం ప్రారంభమయింది. క్రమక్రమంగా గణపతి ఉపనయనం, వివాహాది శుభకార్యాలు స్వయంగా చేయించగల స్థాయికి ఎదిగేడు. కులవృత్తిలో తనయుని శీఘ్ర పురోభివృద్ధి గమనిస్తున్న శాస్త్రిగారికి అది సంతోషాన్నిస్తోంది. గణపతి, పైవారందరికీ ‘గణపతిశాస్త్రి’ అయ్యేడు. స్వయంగా ధనార్జన మొదలుపెట్టడంతో గౌరీపతి శాస్త్రిగారు గణపతిని అభినందించేరు. ఆ విషయం తల్లి, మామ్మలను కూడా సంతోషబరిచింది.

ఈశ్వరమ్మ రోజూ ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొన్నాక కోడలు ఇచ్చిన గలాసుడు వేడి వేడి కాఫీ తాగి స్నానం చేస్తుంది. ఆ తరువాత పూజా మందిరం చేరి సుమారు ఒక గంట పూజ చేసుకొంటుంది. అలా ఒక రోజు పూజ చేసుకొంటున్న సమయంలో ముందుకు వాలిపోయింది. కొంత సమయం వరకు అది ఎవరూ గమనించలేదు. కొద్దిసేపటికి మంగమ్మ గమనించి, వడిగా వెళ్లి, “మామ్మా, మామ్మా” అని రెండు మూడు మార్లు గాభరాపడుతూ ఈశ్వరమ్మ భుజాలు పట్టుకు ఊపింది. ఈశ్వరమ్మ పక్కకు కుప్ప కూలిపోయింది. వెంటనే పరుగు పరుగున తండ్రిని సమీపించి “నాన్నా మామ్మ పూజచేస్తూ పడిపోయింది. ఎంత పిలిచినా పలకలేదు.” అని గాభరాపడుతూ చెప్పగానే, శాస్త్రిగారు హుటా హుటిన అక్కడకు వెళ్లేరు. “అమ్మా, అమ్మా” అని చెవిలో గట్టిగా అరిచేరు. లాభం లేక పోయింది. శాస్త్రిగారు ఆందోళనలో పడ్డారు. అది తెలియగానే పార్వతి, గణపతి కూడా ఆందోళనతో అక్కడకు చేరేరు. శాస్త్రిగారు, ఆటో త్వరగా తెమ్మని గణపతికి చెప్పేరు. ఆటో రాగానే ఈశ్వరమ్మను, తండ్రీ కొడుకులిద్దరూ పట్టుకుని ఆటోలో తమ ఇద్దరి మధ్య జాగ్రత్తగా పట్టుకుని కూర్చోబెట్టి, త్వరగా ఆమెను దగ్గరలోనున్న ఆసుపత్రికి తీసుకెళ్లేరు. డాక్టరు ఈశ్వరమ్మను పరీక్షించి, ఆమె ఇహ లేరని చెప్పగానే, గణపతి తండ్రిని గట్టిగా పట్టుకొని , “నాన్నా” అని కంట తడి పెట్టుకొన్నాడు. శాస్త్రిగారు ఉప్పొంగి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ కొడుకును ఓదార్చి వాడి సాయంతో తల్లి భౌతికకాయాన్ని ఆటోలో ఇంటికి చేర్చేరు. కుటుంబంలోని నలుగురూ విషాదంలో మునిగిపోయేరు. మంగమ్మ, మామ్మ భౌతిక దేహంపై వాలి ఏడ్వసాగింది. గణపతి తన దుఃఖాన్ని అణచుకొంటూ చెల్లిని ఓదార్చ ప్రయత్నించేడు. శాస్త్రిగారు తల్లి భౌతిక కాయం చెంతనే కూర్చుని, ఆమె తల నిమురుతూ దుఃఖాన్ని దిగమింగుకొంటున్నారు. పార్వతి కూడా అదే అవస్థలోనున్నా, భర్త చెంత చేరి, “అత్తయ్య అదృష్టవంతురాలు. సునాయాసంగా దేముని పూజ చేస్తూ ప్రాణాలు వదిలేసింది.” అని భర్త మనసుకు ధైర్యం చెప్పింది. ఆయన అవునన్నట్టు తల ఊపేరు. ఆ వార్త తెలిసిన శాస్త్రిగారి మిత్రులు, తెలిసినవారు కొందరు వచ్చి ఈశ్వరమ్మ భౌతిక దేహానికి పాదాభివందనం చేసి శాస్త్రిగారికి తమ సంతాపం తెలియజేసేరు. కొన్ని గంటల పిమ్మట శాస్త్రిగారు తల్లి భౌతిక శరీరానికి శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు చేసేరు. యథావిధిగా ఆమె అస్థికలు గోదావరిజలాల్లో నిమజ్జనం చేసి తదుపరి కార్యక్రమాలన్నీ ఇంటివద్ద శ్రద్ధగా చేసేరు. తల్లి ఫోటోకు ఫ్రేము కట్టించి దానిని పూజా మందిరానికి సమీపంలో తండ్రిగారి ఫోటో పక్కన గోడకు తగిలించి పూలమాల అమర్చేరు.

ఈశ్వరమ్మ పరలోకం చేరిన తరువాత చాలా రోజులవరకు ఇంట్లో నలుగురూ చేరి కూర్చున్నప్పుడు, ఆమెను తలచుకుంటూ తీయని జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ ఉండేవారు. “మామ్మ మా చిన్నప్పుడు మాకు చెప్పిన కథలు ఎన్నో నాకు ఇంకా బాగా జ్ఞాపకం ఉన్నాయి. కథలు ఎంత బాగానో చెప్పేది మామ్మ.” అని గణపతి ఆమెను తలచుకుంటూ ఉండేవాడు.

“మామ్మ చెప్పిన చిన్నికృష్ణుని కథలు చాలా బాగుండేవి. ఇప్పటికీ అవి జ్ఞాపకం ఉన్నాయి.” అని మంగమ్మ మామ్మను తలచుకొనేది.

“అమ్మ నన్నెప్పుడూ తిట్టడం గాని కొట్టడం గాని చెయ్యలేదు. ఏదైనా పొరపాటు చేసినా, ‘తప్పు నాయనా. అలా చెయ్యకూడదు.’ అని నెమ్మదిగా బోధపరిచేది. నాన్నగారు పోయిన తరువాత ఇంటి బాధ్యతంతా తన మీదే పడ్డా, ఎప్పుడూ విసుక్కోకుండా నెమ్మదిగా ఉండేది.” అని శాస్త్రిగారు తల్లి గతాన్ని తలచుకున్నారు. “అందరి ఇళ్లలో అత్తగారంటే కోడళ్లకు భయం ఉంటుంది. అదృష్టవశాత్తు అత్తయ్యతో నాకు అలాంటి సమస్య ఎప్పుడూ రాలేదు. నన్ను ఎంతో అభిమానంగా చూసేది. పిల్లలిద్దరికి వాళ్ల చిన్నప్పుడు తనే స్నానం చేయించడం, ఆడించడం, జోల పాడి పడుకోపెట్టడం చేసేది. వంటింట్లో పని నువ్వు చూసుకో. వీళ్లని నేను చూసుకొంటాను, అని రోజూ ఎంతో సాయం చేసేది. నిజానికి పిల్లలిద్దరూ అత్తయ్య దగ్గరే పెరిగేరు. అందుకే వాళ్లకి మామ్మ అంటే అంత ప్రేమ.” అని పార్వతి అత్తయ్యను తలచుకుంది.

“అంతేకాదు, పార్వతీ, పిల్లలికి మామ్మ మాటలంటే గౌరవం. నీకు తెలుసో లేదో, గణపతి చదువు విషయంలో వాడు తొమ్మిది పాసయిన తరువాత, వాడికి ఇంకా పై క్లాసులు చదవాలని ఉన్నా ‘మీ నాన్న చెప్పినట్టు, చదువు ఆపి పౌరోహిత్యం నేర్చుకో బాబూ’, అని అమ్మ చెప్పగానే కిమ్ అనకుండా వాడు ఒప్పుకున్నాడు. అలా, ప్రేమించే గౌరవం తెచ్చుకోవాలి.” అని శాస్త్రిగారు తల్లి హితబోధలు నెమరు వేసుకున్నారు. ఆప్యాయత, అనురాగంతోనే ఈశ్వరమ్మ కుటుంబంలోని అందరి మనసు చూరగొంది.

ఎంతటి కష్టానికైనా కాలమే ఔషధమంటారు. కాలక్రమేణా శాస్త్రిగారి కుటుంబం మునపటి వలె ఎవరి పనులలో వారు నిమగ్నులయ్యేరు. పార్వతికి అత్తయ్య లేని లోటు వంటింట్లో తెలుస్తోంది. క్రమక్రమంగా మంగమ్మ వంట పనులలో అమ్మకు సాయపడుతోంది. తల్లి శిక్షణలో వంటలు చేయడం నేర్చుకొంటోంది. ఒకరోజు భోజనాల సమయంలో పెసరపప్పు పులుసు కలుపుకు తింటూ, “పార్వతీ, ఇవాళ పెసరపప్పు పులుసు చాలా రుచిగా ఉంది.” అని శాస్త్రిగారు భార్యకు కితాబు ఇవ్వబోతే,

“ఇవాళ ఆ పులుసు మన మంగమ్మ చేసిందండీ.” అని చిరునవ్వుతో సగర్వంగా చెప్పింది, పార్వతి.

అది విని గణపతి, “నాన్నా, చెల్లి అమ్మ కన్నా బాగా వండుతోంది.” అని పెంకిగా అమ్మ ముఖలోనికి చూస్తూ చెల్లికి కితాబు ఇచ్చేడు.

“నిజమేన్రా నాయనా. నాకన్నా నీ చెల్లే బాగా వండుతుంది. రేపటినుండి నేను వంటింట్లోకి రాను. నీకు నీ చెల్లే వండిపెడుతుంది.” అని పార్వతి కూడా వాడికి పెంకిగా జవాబిచ్చింది.

అంతలో “నువ్వెందుకు అంత బాధపడుతున్నావు. వాడేదో వాడి చెల్లిని ప్రోత్సహించడానికి అన్నాడు. నిజానికి నువ్వు చేసినట్టు పులిహోర ఎవ్వరూ చెయ్యలేరు, పార్వతీ. నువ్వు ఏది చేసినా భేషుగ్గా చేస్తావ్.” అని శాస్త్రిగారు భార్యను ప్రోత్సహించేరు.

“నాకేమీ బాధగా లేదండీ. ఏదో సరదాకి అన్నాను. అది బాగా వండిందంటే నాకూ సంతోషమేగా” అని పార్వతి ఆ సంభాషణకు తెర దించింది.

(సశేషం)

Exit mobile version