Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పునరావృతం-10

[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[చిట్టితల్లి అత్తవారింటికి వెళుతుంది. క్రమంగా అక్కడి పద్ధతులకి అలవాటు పడుతుంది. మూర్తికి, నరసమ్మగారికి చేదోడువాదోడుగా ఉంటుంది. నూతన దంపతులిద్దరూ ఒక రోజు సాయంత్రం బీచ్‌లో గడిపి వస్తారు. హనీమూన్‌కి వెళ్ళమని మూర్తికి నరసమ్మ చెబుతుంది. చూద్దాంలే అంటాడు. నరసమ్మ తన పెద్దకొడుకుతో మాట్లాడుతుంది. అతను, అతని తమ్ముడు మాట్లాడుకుని మూర్తి హనీమూన్‍కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. బావల ఏర్పాట్ల ప్రకారం మూర్తి, చిట్టితల్లి డార్జిలింగ్, గ్యాంగ్‌టక్ చూసి వస్తారు. చిట్టితల్లి తమ హానీమూన్ విశేషాలు వివరంగా తండ్రికి రాస్తుంది. తల్లిదండ్రులు ఆనందిస్తారు. – ఇక చదవండి.]

భర్త ఇంటలేని సమయాల్లో చిట్టితల్లి, వంటింట వంటావిడతో కొద్దిసేపు గడపడం, పనిపిల్ల పనులను పర్యవేక్షిస్తూండడం చేస్తోంది. వీలయినంతసేపు దొడ్డమ్మగారి దగ్గర గడుపుతోంది. నరసమ్మకు కూడా అది బాగుంది. ఇదివరలో మేనల్లుడు ఇంట్లో లేనప్పుడు, ఒంటరితనంతో, వాడి రాకకై ఎదురుచూస్తూ ఉండేది. ఇప్పుడు చిట్టితల్లితో న్యూసుపేపర్లోని విషయాలు చర్చిస్తూ కాలక్షేపమవుతోంది. అటువంటి సమయంలో ఓ రోజు, “పార్వతీ, మీ అమ్మ తెలుగులో పురాణాలు బాగా చదువుకొందిట. నువ్వేవైనా అవి నేర్చుకొన్నావా, మీ అమ్మ దగ్గర.”అని నరసమ్మ అడిగింది.

“అన్నీ నేర్చుకోలేదు, దొడ్డమ్మగారూ. స్కూల్లో చదువుతున్న రోజుల్లో టైమే దొరికేదు కాదు. అయినా శలవు రోజుల్లో మా అమ్మ పోతనగారి భాగవతంలో అక్కడక్కడ, అర్థాలతో బోధపరిచింది. దానితో నాకు భాగవతం మీద ఇంటరెస్టు కుదిరింది. స్కూలు చదువయ్యేక రోజూ మా అమ్మ భాగవతం చెప్పడం ప్రారంభించింది. నా పెళ్లి కుదిరేక, అమ్మకు అస్సలు టైము దొరకలేదు.” అని భాగవతం చదవడంలో తనకున్న ఆసక్తి వ్యక్తపరిచింది. “అయితే ఇంకా చదవాలని ఉంటే చెప్పు. పెద్ద పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. సత్యాన్ని ఒకటి తెమ్మంటాను.”అన్నాది, నరసమ్మ.

“పుస్తకాలు షాపుల్లో అమ్మే వాట్లో, అందులోని ప్రతీ పద్యానికి అర్థాలు ఉండవుటండి. అవి లేకపోతే నాకు బోధపడవండి.”

“పోనీ చెబ్దామంటే నాకూ వాటి అర్థాలు రావు.”

“తిరుపతి దేవస్థానం వాళ్లు, రామాయణం, భారతం, భాగవతం, పద్యాల తాత్పర్యంతో సహా అచ్చు వేయించారట. మా నాన్నగారు చెప్పేరు.”

“అలాగా, వాళ్లు మన పురాణాలు చదువుదామనుకున్నవాళ్లకి పనికొచ్చే పని చేసేరనమాట. సత్యాన్ని ఆ భాగవతం ఎక్కడ దొరుకుతుందో కనుక్కొని కొని తీసుకురమ్మంటాను. మనిద్దరికీ కూడా మంచి కాలక్షేపమవుతుంది. అమ్మా, ఈ రోజుల్లో మన పిల్లలు ఇంగ్లీషు చదువు మోజులో పడి, తెలుగును అటకెక్కించేస్తున్నారు. ఇంగ్లీష్ చదవడం మంచిదే. అది రాకపోతే, ఉద్యోగాలు దొరకడం కష్టం. కానీ తెలుగు మన మాతృభాషమ్మా. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. మీ నాన్నగారు, అమ్మ వంటివారు ఉండబట్టే మన తెలుగు భాష ఈ మాత్రంగానైనా ఉంది.” అని నరసమ్మ గణపతి, అన్నపూర్ణలను మెచ్చుకొంది.

అంతలో మూర్తినుండి ఫోను వచ్చింది. తను రావడంలో మరో గంట పట్టొచ్చని, తనకోసం కాసుకు కూర్చోకుండా మేనత్తను భోజనం చేసేమన్నాడు. నరసమ్మ అంగీకరించడంతో చిట్టితల్లి ఆ ప్రయత్నానికి వంటింటికెళ్ళింది.

ఒకరోజు చిట్టితల్లి తమ అందరి క్షేమసమాచారం తెలియజేస్తూ, తండ్రికి ఉత్తరం రాసింది. దొడ్డమ్మగారు, భర్త, తన్ను ఎంతో ఆదరిస్తున్నారని, తను సుఖసంతోషాలతో ఉంటున్నానని రాసింది. తమ్ముడు బాగా చదువుకొంటున్నాడా అని రాస్తూ, భాగవతం విషయం కూడా క్లుప్తంగా పేర్కొంది. మూర్తి దానికోసం, తిరుపతివారికి రాసేడని, అది రాగానే, రోజూ, దొడ్డమ్మగారిదగ్గర కొంతసేపు చదువుతానని, తెలియజేసింది. ఆ వివరాలు తెలిసి, గణపతి, అన్నపూర్ణ సంతోషించేరు. సీతమ్మగారి భర్త, విశాఖపట్నంలో పెళ్ళికి వెళ్లడమేమిటి, అక్కడ నరసమ్మగారు తన మేనల్లునికి తగిన సంబంధం చూడమని ఆయనతో చెప్పడమేంటి, సీతమ్మగారికి మన చిట్టితల్లే తట్టడమేమిటి, అన్నీ ఆ ఏడుకొండలవాడి దయే అని తమ ఇష్టదైవాన్ని తలచుకున్నారు. అన్నపూర్ణ, ఉత్తరంలోని విషయాలు తెలుసుకొని, సంతోషించేమని, ముగ్గురం క్షేమంగా ఉన్నామని, తమ్ముడు శ్రద్ధగా చదువుకొంటున్నాడని కూతురుకు రాసింది. పోతన భాగవతం మొదటినుండీ చదవక, ఎక్కడనుండి ప్రారంభించాలో విపులంగా రాసింది. దొడ్డమ్మగారి దగ్గర చదివే ముందు, తనని ఓ మారు చదువుకోమని సలహా ఇచ్చింది.

తిరుపతి దేవస్థానం నుండి, పోతన భాగవతం, అయిదు పుస్తకాలూ మూర్తి ఇంట్లో లేనప్పుడు అందేయి. చిట్టితల్లి దొడ్డమ్మగారికి అవి చూపించింది. “చాలా విలువయిన పుస్తకాలు. మీ గదిలో అల్మైరాలో జాగ్రత్తగా ఉంచమ్మా, వాటిని. మంచిరోజు చూసుకొని, చదువుకొందాం.” అని, నరసమ్మ సలహా ఇచ్చింది. భర్త రాగానే సంతోషంతో తిరుపతినుండి పుస్తకాలందేయని చెప్పి, వాటిని చూపించింది. అవి చూసి, “ఏవో క్లాసు టెక్స్ట్ బుక్కుల్లా ఉంటాయనుకున్నాను. ఇవన్నీ చదవడానికి ఎన్నేళ్లు పడతాయి, బాబూ.” అని, అయిదు పుస్తకాలూ చేత్తో ఎత్తి పట్టుకొని, శ్రీమతి ముఖంలోకి చూస్తూ మూర్తి ఆశ్చర్యంగా అడిగేడు.

“మీరన్నట్టు ఇవన్నీ ముందునుండి కొసవరకూ చదవాలంటే, ఏళ్ల తరబడి చదవాలి. అది నాకు చేత కాదు. అన్నీ వినడానికి, దొడ్డమ్మగారికి ఓపిక కూడా ఉండదు.”

“మరి.”

“కొన్ని ఎంపిక చేసినవి, మా అమ్మ సజెస్ట్ చేసింది. మా అమ్మ కూడా నాకు అలాగే నేర్పింది. నాకు చాలావరకు జ్ఞాపకం ఉన్నాయి. దొడ్డమ్మగారికి అవే చదివి వినిపిస్తాను.”

“వెరీ గుడ్, అత్తగారు రిమోట్ కోచింగ్ చేస్తారన్నమాట. She is great.” అని అత్తగారిని పొగిడేడు.

మూర్తికి కష్టమర్లు బాగా పెరగడంతో, ఆదాయం కూడా పెరిగింది. ఫియట్ కారు కొనుక్కున్నాడు. చిట్టితల్లి భాగవతంలోని ఎంపిక చేసిన పద్యాలు తాత్పర్యంతో సహా దొడ్డమ్మగారికి చదివి వినిపించడం మొదలుపెట్టింది. సుభద్రమ్మ, చిట్టితల్లిని మెచ్చుకుంది. ఒకరోజు మూర్తితో, “సత్యం, పార్వతి భాగవతంలోని పద్యాలు ఎంచక్కానో చదివి అర్థాలతో కూడా నాకు వినిపిస్తోంది. నువ్వు కూడా దాని దగ్గర విని నేర్చుకో.” అని మూర్తికి సలహా ఇచ్చింది.

“అత్తా, ఆ భాగవతం వింటూ కూర్చుంటే, నా భాగవతం మూతబడిపోతుంది. అయినా నువ్వు చెప్పేవు కదా. వీలున్నప్పుడు చిట్టితల్లి దగ్గర వింటూ ఉంటాను.” అని మందహాసంతో చిట్టితల్లిని చూస్తూ అన్నాడు.

చిట్టితల్లి కూడా చిరునవ్వుతో స్పందించింది.

***

కాలచక్రం కొన్ని సంవత్సరాల ముందుకు దొర్లింది. ఆ రోజుల్లో చిట్టితల్లి ఇద్దరు పిల్లల తల్లయింది. పెద్దవాడు ప్రభాకర్. చిన్నది శారద. నరసమ్మ, సుభద్రమ్మ, పరలోకం చేరుకున్నారు.

శ్రీవల్లిపురంలో గౌరీపతిశాస్త్రి బి. కామ్.డిగ్రీ చేసేడు. గణపతి, అన్నపూర్ణ సంతోషించేరు. కొడుకును బేంక్ పరీక్షల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టమని చెప్పేడు, గణపతి. ఓ పది రోజులు సరదాగా గడిపేక నాన్నగారు చెప్పినట్లు చెయ్యమని అన్నపూర్ణ సలహా ఇచ్చింది.

మంగమ్మ కొడుకు సింహాద్రి B.Sc. చెప్పుకోదగ్గ మార్కులతో పాసయ్యాడు. తన ప్రణాళిక ప్రకారం ఇంట్లో ట్యుటోరియల్ ఇనిస్టిట్యూటు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తనను సంప్రదించతలచిన వారి సౌకర్యార్థం ఇంట్లో టెలిఫోను సౌకర్యం అవసరమనుకొన్నాడు. విషయం తల్లితో చెప్పేడు. మంగమ్మ అది అవసరమే అనుకుంది. శర్మ కూడా అంగీకరించేడు. శర్మ ఇంట్లో టెలిఫోను సదుపాయం వచ్చింది.

ఆ రోజు వైకుంఠ ఏకాదశి. నవరంగపట్నంలోని వెంకటేశ్వరాలయం భక్తులతో రద్దీగా ఉంది. ఉదయం ఆరు గంటలనుండి, పురుషులు ఓ క్యూలోను, స్త్రీలు వేరే క్యూలోను నిలబడి స్వామి దర్శనం చేసుకొంటున్నారు. అంతకంతకు, ఆంజనేయుని తోకలాగ ఆ క్యూలు పెరిగిపోతున్నాయి. దర్శనానికి భక్తులు చాలాసేపు వేచి ఉండవలసి వస్తోంది. కొందరు వాలంటీర్లు వారికి ఇబ్బంది కలగకుండా సేవలందిస్తున్నారు. స్త్రీల క్యూలోనుండి వరసగా ఇద్దరకు, తరువాత పురుషుల క్యూలోనుండి ఒకరుగా, మార్చి మార్చి శర్మ సేవలందిస్తున్నాడు. క్యూలో దూరంగా వృద్ధులు కనిపిస్తే, శర్మ వారిని పిలిచి సత్వరం సంతృప్తిపరుస్తున్నాడు. క్యూలో జనం అది హర్షిస్తున్నారు. భక్తుల సేవలో శర్మకు ఊపిరి పీల్చుకోడానికి కూడా సమయం దొరకడం లేదు. దేవాలయ విధుల్లో శర్మకు సహాయ పడడానికి నియమితుడైన వెంకటేశ్వర చేన్లు, స్వామి దర్శనం చేసినవారికి శఠగోపంతో ఆశీర్వదిస్తున్నాడు. భక్తులు ఎట్టి ఒత్తిడీ తేవడంలేదు. ఓపిగ్గా నిరీక్షిస్తున్నారు. నిలబడి, నిలబడి, అలసిపోయిన వారు, వారి జాగాలోనే, కూర్చోబడిపోతున్నారు. వాలంటీర్లు వారికి త్రాగడానికి నీరు అందిస్తున్నారు. ఆ సమయంలో నడివయస్సులోనున్న ఒక వ్యక్తి, నూతన పట్టువస్త్రాలు ధరించి, దట్టంగా గులాబీపువ్వులు, కొబ్బరికాయ గల వెండిపళ్లెంతో, సతీసమేతంగా నేరుగా శర్మ దగ్గరకు వెళ్లబోతున్నాడు. క్యూలో నున్నవారు, ‘అయ్యా, క్యూలో రండి. మేము రెండు గంటలయింది. క్యూలో ఉన్నాం.” అని, పదేపదే కేకలు పెడుతున్నా, పెడచెవిని పెట్టి తిన్నగా శర్మను చేరి వెండిపళ్లెం అందివ్వబోయేడు. శర్మ అది అందుకోలేదు.

“అయ్యా, భక్తులందరూ గంటలతరబడి క్యూలో ఉండి దర్శనం చేసుకొంటున్నారు. తమరు కూడా దయచేసి అలా చేయండి. లేకపోతే, జనం కమిటీవారికి నా మీద ఫిర్యాదు చేస్తారు. దయచేసి. క్యూలో రండి.” అని,శర్మ వినయంగా అర్థించేడు.

ఆ వచ్చినాయన భార్య, “ఆయన ఎవరో నీకు తెలుసా.” అని కళ్లతో భర్తను చూపిస్తూ అడిగింది.

శర్మ ఆత్మగౌరవం దెబ్బతింది. భక్తులు కాదు, కమిటీవారెవరూ కూడా అప్పటివరకు అతన్ని ‘నువ్వు’ అని అనలేదు. అయినా శర్మ అది బయటకు కనబరచక, “అమ్మగారూ, నాకు తెలియదండీ. ఉదయం నుండి రాత్రి ఎనిమిదీ, తొమ్మిది వరకు దేవాలయంలోనే సేవలు చేసుకొంటున్నాను. అంచేత బయట ప్రపంచంలో ఏమిటి జరుగుతోందో నాకు తెలీదమ్మగారూ.” అని, వినయంగా విన్నవించుకున్నాడు.

“ఆయన.. ఎంఎల్లే గారు.” అని సగర్వంగా తెలియజేసింది, ఆ ప్రజాసేవకుని భార్య.

శర్మ అది తెలుసుకొని ఆ ఎం. ఎల్లే. గారికి వంగి నమస్కరించేడు.

“సరే, తెలిసింది కదా.” అని, ఎం ఎల్లే గారు, చేతిలోని వెండి పళ్లెం ఇవ్వబోతూ ఉంటే,

“అయ్యా క్షమించండి. ఆఫీసులకు వెళ్లేవారు కేవలం దర్శనం చేసుకు వెళతారు. పదకొండు గంటలవరకు, కేవలం దర్శనాలికే సేవలిస్తున్నాం. మధ్యలో అర్చన సేవలు చేస్తే వారికి ఆలస్యమవుతుందనీ, ఉదయం పదకొండు గంటల తరువాత అర్చన సేవలందించమని కమిటీ వారు నిర్ణయించేరు సార్. ప్రస్తుతం కేవలం దర్శనాల సేవలే చేస్తున్నాం సార్. తమరికి ఆలస్యం చేయను. ఇప్పుడే దర్శనం చేయిస్తాను. పదకొండు గంటలకు వస్తే, అర్చన చేస్తాను. అన్యథా భావించకండి, సార్. కమిటీవారి ఆజ్ఞలవి.”

“ఏమిటి నువ్వు మాట్లాడుతున్నావ్. నీ కమిటీ గిమిటీలు ఏం చెప్పినా, నాకు వాటితో సంబంధం లేదు. నాకేమీ పనీపాటూ లేదనుకున్నావా; నీ దేవాలయానికి పది మార్లు రాడానికి. తొందరగా నేను చెప్పింది చెయ్యి. నాకు అటు లేటయిపోతోంది. ఎందరో నాకోసం కాచుకుని ఉంటారు.” అని కర్కశంగా అన్నాడా ఎంఎల్లే.

శర్మ క్లిష్ట పరిస్థితిని గమనిస్తున్న ఒక భక్తుడు, “పూజారిగారూ, మరేమీ మాట్లాడకుండా ఆయనగారి పని కానిచ్చీండి.” అని వినయంగా చెప్పేడు.

జరిగిన అవమానానికి శర్మ మనసులో బాధపడుతూ, ఎంఎల్లే గారికి సేవలందిచ్చేడు. శర్మకు సలహా ఇచ్చిన భక్తునికి దర్శనం చేయిస్తున్నప్పుడు, ఆ భక్తుడు, “పూజారిగారూ, ఈ పొలిటీషియన్సుకి, నీతి నియమం ఉండవండి. వాళ్లకి పొగరిపోత్తనం ఎక్కువ. అతగాడి పెళ్లం కాబోసు, ఆ మనిషికి కూడా ఎంత పొగరండీ. మీరేమీ అవి పట్టించుకోకండి.” అని శర్మకు సలహా ఇచ్చేడు. బయటకు వెళుతున్న ఆ ప్రజాసేవకుణ్ణి, క్యూలోని కొందరు భక్తులు, అతగాడికి వినిపించేటట్లే ఛీదరించుకొన్నారు. రాజకీయనాయకులు అట్టి ఛీదరింపులు పట్టించుకోరు. వాళ్ల పని అయిపోతే చాలు, వారికి. చేస్తున్న పని, మంచిదా చెడ్డదా అనే ఆలోచనే వారికి రాదు. సరే, ఈ రాజకీయనాయకుల ప్రజాసేవ గూర్చి ఎంత చెప్పినా తరగదు. మనం కథలోకి వెళదాం.

దేవాలయంలో భక్తుల సేవలు తిరిగి ప్రారంభమయ్యేయి. కమిటీ ప్రెసిడెంటు, నాయడుగారు దేవాలయంలో జరిగిన విషయం తెలియగానే హుటాహుటిన దేవాలయం చేరుకొన్నారు. అర్చనలు జరుగుతున్నాయి. శర్మవద్దకు వెళ్లి, “శర్మగారూ, జరిగిందంతా ఇప్పుడే తెలిసింది. నేను చాలా బాధపడ్డాను. మీరెలా ఉన్నారో చూడ్డానికి వచ్చేను. తరువాత అన్నీ తీరిగ్గా మాట్లాడుతాను. భక్తుల సంగతి చూడండి.”అని ఆయన భక్తులకు సదుపాయాలు ఎలాగున్నాయో చూసి వెళ్ళేరు.

దేవాలయంలో జరిగిన విషయం మంగమ్మకు తెలిసింది. ఆశ్చర్యపోయింది. భర్త ఎంత నొచ్చుకున్నాడో అని చాలా బాధపడింది. ‘చెత్త వెధవలు; వీళ్లు రాజకీయనాయకులేంటి. మన ఖర్మ.’ అని చీదరించుకొంది. మధ్యాహ్నం రెండు గంటలకు, భోజనవిరామ సమయానికి భర్త కొరకు భోజనం పట్టుకొని దేవాలయానికి వెళ్ళింది. జరిగిన అవమానాన్ని శర్మ జీర్ణించుకోలేకపోతున్నాడు. కృంగిపోయి కూర్చొని ఉన్నాడు. ముగ్గురు వాలంటీర్లు శాంతపరుస్తున్నారు. మంగమ్మను చూడగానే, శర్మ ఏడ్చినంత పనిచేసేడు. మంగమ్మ, “జరిగినదంతా నాకు శేషమ్మగారు చెప్పేరు. ఆ సమయంలో ఆవిడ దర్శనంకోసం క్యూలో ఉండేవారట. బాధపడకండి. పొద్దున్ననుండి ఏమీ తినలేదు. కప్పు కాఫీ తాగి అయిదు గంటలకు వచ్చీసేరు. మీకు భోజనం తెచ్చేను. చల్లారిపోతుంది. తినండి.” అని, కేరియర్ విప్పుతూ ఉంటే,

“మంగా, కేరియరు విప్పకు. నాకేమీ తినాలని లేదు.”అని మనసులో బాధపడుతూనే అన్నాడు.

“నేనూ ఇంకా తినలేదు. మీరు తిన్నాకే నేను తింటాను.” అని మంగమ్మ నిస్పృహతో బ్రతిమలాడుతూ ఉంటే, కమిటీ ప్రెసిడెంటు నాయడుగారు అక్కడికి చేరుకొన్నారు. శర్మ, మంగమ్మ, అతనికి నమస్కారం చేసేరు. అతనితో మంగమ్మ భర్త భోజనం చెయ్యడం లేదని చెప్పుకుంది.

“శర్మగారూ, దయచేసి భోజనం చెయ్యండి. నాకు తెలుసు, మీరెంత బాధపడుతున్నారో. అమ్మగారు కష్టపడి తెచ్చారు. మీరు భోజనం చెయ్యండి. లేకపోతే నీరసించిపోతారు.” అని బోధపరిస్తే, శర్మ అంగీకరించేడు. శర్మ భోజనం చేస్తున్న సమయంలో నాయడుగారు,

“అమ్మా, ఇవాళ అన్నీ అలాగే అయ్యేయండి. ఉదయాన్నే మా కమిటీ మెంబరు ప్రసాదుగారికి హార్టు ఎటేక్ రావడంతో ఆయన్ని వెంటనే హాస్పిటల్లో చేర్చేం. అతని పిల్లలిద్దరూ ఊళ్లో లేరు. మా కమిటీ మెంబర్లలో నేను, ప్రసాదుగారు తప్ప మిగిలిన వాళ్లు ఎవరూ ఊళ్లో లేరు.” అని ఇంకా చెప్పబోతూ ఉంటే,

“మూర్తిగారు కూడా ఊళ్లో లేరా అండి.” అని మంగమ్మ అడిగింది.

“ఆయన చెల్లెలిగారి అమ్మాయి పెళ్లి ఉందని వారంరోజుల కిందటే గుంటూరు వెళ్లేరమ్మా.”

భోజనం ముగించిన శర్మ, “దేవాలయంలో జరిగినది తెలియగానే హాస్పిటలు నుండి ప్రెసిడెంటుగారు నన్ను చూడ్డానికి వెంటనే వచ్చేరు, మంగా.” అని ప్రెసిడెంటు గారి ఔదార్యాన్ని వ్యక్తబరిచేడు.

“ఇలాంటి రద్దీ రోజుల్లో, మా కమిటీ మెంబరు ఎవరో ఒకరు ఇక్కడ ఉంటాం అమ్మా. భక్తులకు ఏ ఇబ్బందీ లేకుండా చూడ్డానికి. ఇవాళ ఉదయం నేను ఉండడానికి, మధ్యాహ్నం ప్రసాదుగారు ఉండడానికి నిన్ననే అనుకొన్నాం. కాని ప్రసాదుగారికి హార్ట్ ఎటేక్ రావడంతో అంతా తారుమారయిపోయింది. ఇదివరకెప్పుడూ ఇటువంటిది జరగలేదు కూడా.” అని నాయడుగారు వివరించేరు.

“ఆ వచ్చినాయన ఎం.ఎల్లే. అని నాకు నిజంగా తెలీదండి.” అని శర్మ నాయడుగారికి వినయంగా చెప్పుకున్నాడు.

“శర్మగారూ, నేనూ అతణ్ణి ఎప్పుడూ చూడలేదండి. నాకు హాస్పిటల్లో ఒకాయన చెప్తే తెలిసింది. ఆ మహానుభావుడి మీద నాలుగు క్రిమినల్ కేసులు కోర్టులో నడుస్తున్నాయట. ఒక దానిలో బెయిలుమీద ఉన్నాట్ట. అదీ వాడి ఘనత.”

మంగమ్మ ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఉంది.

“అమ్మా, నేను ఇప్పటిదాకా స్నానం చెయ్యలేదు. హాస్పిటల్లోనే ఉన్నాను. వాళ్ల నాన్నగారి పరిస్థితి తెలియగానే టేక్సీ చేయించుకొని ప్రసాదు గారి రెండో అబ్బాయి ఇప్పుడే వచ్చేడు. హాస్పిటల్లో అతనుంటాడు. నేను ఇంటికి వెళ్లి స్నానం చేసి, ఏదో కొంత తిని వీలయినంత వేగరం దేవాలయానికి వస్తాను. మీరు బెంగ పడకండి.”అని నాయడుగారు అభయమిచ్చేరు.

మంగమ్మ ఇంటికి వెళ్ళింది. శర్మ విధులలో నిమగ్నుడయ్యేడు.

తండ్రికి జరిగిన అవమానం తెలిసి, సింహాద్రి. ఉగ్రస్వరూపుడయ్యేడు. మంగమ్మ కొడుకును శాంతింపజేసింది.

మరునాడు ఉదయం తెలుగు న్యూస్ పేపర్లలో పై విషయం వివరంగా ప్రచురుణమయింది. డ్యూటీలో ఉన్న పూజారిగారిని అవమానపరచి, డ్యూటీలకు అంతరాయం కలిగించినందులకు ఆ ఎం.ఎల్లేని, స్పీకరుగారు వెంటనే బర్తరఫ్ చేయాలని అపోజిషను వారు తీర్మానించేరు. అతనిపై క్రిమినలు కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని హెచ్చరించేరు. న్యూస్ పేపరు రిపోర్టర్లు ప్రజాభిప్రాయాన్ని సేకరించేరు. అందరూ ఎం.ఎల్లేని తప్పుపట్టేరు. కొందరు నిందించేరు. మరి కొందరు, హైకోర్టువారు దీన్ని వెంటనే సుమోటోగా తీసుకొని ఎం ఎల్లేని శిక్షించాలని గట్టిగా కోరేరు. కొందరు ప్రెస్ రిపోర్టర్లు ఎం.ఎల్లె గారిని కలియడానికి విఫల ప్రయత్నాలు చేసేరు.

జరిగిన పై విషయం న్యూస్ పేపర్లో చదివి, గణపతి, అన్నపూర్ణ, శర్మ గూర్చి ఆందోళన పడ్డారు. గణపతి వెంటనే పోస్ట్ ఆఫీసుకెళ్లి శర్మకు ఫోను చేసేడు. ఆ సమయంలో శర్మ దేవాలయంలో ఉన్నాడు. సింహాద్రి ఫోను ఎత్తుకున్నాడు. నాన్నగారు బాగానే ఉన్నారని చెప్పేడు. మంగమ్మ కూడా మాట్లాడి శర్మ దేవాలయంలో విధులు యథావిధిగా చేస్తున్నాడని చెప్పడంతో, గణపతి కుదుటబడ్డాడు. విశాఖపట్నం నుండి, చిట్టితల్లి, మూర్తి ఫోను చేసి, శర్మ ఎలాగున్నది అడిగి తెలుసుకొన్నారు.

నాలుగు రోజులు తరువాత ఎం.ఎల్లే గారు, తాను వైకుంఠ ఏకాదశినాడు సతీసమేతంగా వెంకటేశ్వరాలయానికి వెళ్లేనని, తన రాకను దూరంనుండి చూసిన పూజారిగారు, తనను నేరుగా తమ వద్దకు రమ్మని బిగ్గరగా పిలవడంతో, ఆయన దగ్గరకు వెళ్లేనని, ఆయనే వారిద్దరికి దర్శనం చేయించి, అర్చన కూడా చేసేక వెనుతిరిగేనని, పూజార్లను తనెప్పుడూ గౌరవిస్తానని, గిట్టని వారెవరో తనపై అపనిందలు మోపారని, అవి వాస్తవాలు కావని, ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేరు.

ఒక నాలుగయిదు రోజులు ఆ విషయం కొందరి నాలికపై ఉంది. అంతే, అక్కడితో అది చెల్లు.

(సశేషం)

Exit mobile version