[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[భర్త ఇంట్లో లేనప్పుడు దొడ్డమ్మ నరసమ్మగారితో సమయం గడుపుతుంది చిట్టితల్లి. వంటావిడ, పనిపిల్ల పనులను పర్యవేక్షిస్తుంది. నరసమ్మ దినపత్రికలలోని విషయాలు చిట్టితల్లితో చర్చిస్తూంటుంది. ఒకరోజు, మీ అమ్మ పురాణాలు బాగా చదువుకుందట కదా, నువ్వు ఏవైనా నేర్చుకున్నావా అని అడుగుతుంది. భాగవతం వచ్చనీ, కానీ ఏదైనా వ్యాఖ్యానం ఉన్న పుస్తకం ఉంటే చదివి చెప్పగలనని అంటుంది చిట్టితల్లి. తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించిన పుస్తకం తెప్పించుకోవాలని అనుకుంటారు. తన యోగక్షేమాలన్నీ తల్లిదండ్రులకి ఉత్తరం రాస్తుంది చిట్టితల్లి. తిరుపతి నుంచి భాగవతం పుస్తకాలు అందుతాయి. మంచి రోజు చూసి చదివి వినిపించడం మొదలెడుతుంది చిట్టితల్లి. మూర్తికి కస్టమర్లు పెరిగి, ఆదాయం పెరుగుతుంది. కాలం గడిచి చిట్టితల్లి ఓ కొడుక్కి, ఓ కూతురికి తల్లవుతుంది. నరసమ్మ, సుభద్రమ్మ స్వర్గస్థులవుతారు. శ్రీవల్లిపురంలో గౌరీపతిశాస్త్రి బి.కామ్ పాసయి, బ్యాంకు పరీక్షలకి సిద్ధమవుతుంటాడు. నవరంగపట్నంలో శర్మ, మంగమ్మల కొడుకు సింహాద్రి బిఎస్‍సి పాసయి, తన ప్రణాళిక ప్రకారం ట్యుటోరియల్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తాడు. ఓ రోజున వైకుంఠ ఏకాదశి నాడు వేంకటేశ్వర స్వామి ఆలయం బాగా రద్దీగా ఉంటుంది. శర్మ, అతని సహాయకుడు వీలైనంత మేర భక్తులందరికీ దర్శనం చేయిస్తుంటారు. ఇంతలో ఒక ఎమ్మెల్లే, అతని భార్య దర్శనానికి వచ్చి, తోటి వారితో దురుసుగా ప్రవర్తించి, క్యూ దాటి వచ్చి తమకు అర్చన చేయించమంటారు. అతను ఎమ్మెల్లే అని తెలియని శర్మ, దయచేసి క్యూలో రమ్మని అర్థిస్తాడు. ఎమ్మెల్లే భార్య శర్మ మీద విరుచుకుపడుతుంది. ఎమ్మెల్లే కూడా కర్కశంగా మాట్లాడి అవమానిస్తాడు. మౌనంగా అర్చన చేసి, తీర్థ ప్రసాదాలిచ్చి వాళ్ళని పంపేస్తాడు. ఇతర భక్తులందరూ ఎమ్మెల్లేని నిందిస్తారు. అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఈ వార్త విపరీతంగా వ్యాపించి, ఆలయ కమిటీ సభ్యులకి, మంగమ్మకి తెలుస్తుంది. భర్త భోజనానికి ఇంటికి రాకపోయేసరికి, క్యారేజీ తీసుకుని ఆలయానికి వెళ్తుంది. తినడానికి నిరాకరిస్తాడు శర్మ. కమిటీ ప్రెసిడెంటు నాయడుగారు నచ్చజెప్పి, తినేలా ఒప్పిస్తారు. తండ్రికి జరిగిన అవమానం తెలిసి, సింహాద్రి కోపగించుకుంటాడు, మంగమ్మ కొడుకును శాంతింపజేస్తుంది. మర్నాడు ఈ ఉదంతం పేపర్లలో వస్తుంది. రాజకీయంగా దుమారం రేగుతుంది. ఎమ్మెల్లేని బర్త్‌రఫ్ చేయాలని ప్రతిపక్షం పట్టుపడుతుంది. గొడవ ముదురుతుండడంతో, గిట్టని వారెవరో తనపై నిందలు మోపారని, అవి వాస్తవాలు కావని ఒక ప్రెస్ స్టేట్‌మెంట్ ఇస్తాడా ఎమ్మెల్లే. కొన్నాళ్ళకి ఆ విషయం మరుగున పడిపోతుంది. – ఇక చదవండి.]
సింహాద్రి తలపెట్టిన ఇనిస్టిట్యూటు ఆరంభించడానికి ఏర్పాట్లన్నీ అయ్యేయి. రిజిస్ట్రేషను చేయించేడు. ప్రభుత్వం నుండి అనుమతి కూడా తీసుకున్నాడు. స్టూడెంట్లకు త్రాగునీటి సదుపాయం సమకూర్చేడు.
ముందుగా ఒక గదిలో కార్యక్రమం ప్రారంభించదలచుకొన్నాడు. కేవలం పది, పదకొండు, పన్నెండు తరగతి విద్యార్థులనే శిక్షణకు తీసుకోదలిచేడు. గత ఆరేడు వారాలనుండి, సింహాద్రి తన ఇనిస్టిట్యూటు గూర్చి నలుగురికి తెలియజేసేడు. ఇద్దరు ముగ్గురు క్లాసుమేట్లు కూడా సహకరించేరు. ఇనిస్టిట్యూటు ప్రారంభించడానికి శర్మ ముహూర్తం పెట్టేడు. ఆ రోజున ముందుగా కొడుకు చేత వినాయకపూజ, సరస్వతీపూజ మంగమ్మ సమక్షంలో చేయించేడు. గణపతి, అన్నపూర్ణ, ఫోనులో సింహాద్రిని దీవించి, శుభాకాంక్షలు తెలియజేశారు. చిట్టితల్లి, మూర్తి, ఫోనులో శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఎనిమిదిమంది పదో తరగతి విద్యార్థులతో సింహాద్రి శిక్షణా కార్యక్రమం ప్రారంభించేడు. కొడుకు ప్రయోజకుడయ్యేడని శర్మ, మంగమ్మ సంతోషంగా ఉన్నారు. నెల రోజులలో విద్యార్థుల సంఖ్య పదహారుకు చేరుకుంది. మరో నాలుగు నెలలు గడిచేయి. మరో ఆరుగురు విద్యార్థులు చేరేరు. వారిలో నలుగురు పదకొండవ తరగతి విద్యార్థులు. సింహాద్రి పాఠాలు, ముఖ్యంగా లెక్కలు బాగా బోధపరుస్తున్నాడని నలుగురి నోట పడ్డాది. ఇంజనీరింగు ప్రవేశ పరీక్షలు రాసి, ప్రత్యేకించి లెక్కలలో ఇక్కట్లు పడి, ఫలితం దక్కని ఇద్దరు, మళ్ళీ ఇంజనీరింగు పరీక్షలు రాయదలచి, ఆ పరీక్షలకు శిక్షణకోసం సింహాద్రి వద్ద చేరేరు. తన శిక్షణలో వారు ప్రవేశ పరీక్ష పాసయితే, తనకు మంచి భవిషత్తు ఉంటుందని సింహాద్రి అనుకొన్నాడు. కాని వాడికా పరీక్షల్లో అనుభవం లేదు. ఏదో ఆలోచించేడు. విశాఖపట్నం లోని మూర్తికి ఫోను చేసేడు. మూర్తి ఫోన్ ఎత్తుకొని,
“సింహాద్రీ, ఎలా ఉంది నీ ఇనిస్టిట్యూటు.”
“బాగానే నడుస్తోంది బ్రదరూ. నిన్న ఇద్దరు కేన్డిడేట్స్ జాయినయ్యేరు. వాళ్లిద్దరూ లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసేరు. మా ఊళ్లోనే ఒక ట్యుటోరియల్స్‌లో లాస్ట్ ఇయర్ కోచింగ్ తీసుకున్నారట. పాస్ కాలేదు. ఈ ఏడాది మళ్లీ ప్రిపేర్ అవుతున్నారు. నా దగ్గరకొచ్చేరు, కోచింగు కోసం.”
“Good opportunity. రాత్రి పగలూ తోమీ వాళ్ళని. డెఫినిట్ గా ఈసారి పాసవుతారు.”
“అది నిజమే, బ్రదరూ. కాని తోమడానికి నా దగ్గర ఏమీ లేదు. నీకు తెలుసుగా. నాకు అందులో ఎక్స్‌పీరియన్స్ లేదు. ఏమైనా మంచి మెటీరియల్ దొరుకుతుందేమో అని మా ఊళ్లో చూసేను. శాటిస్ఫైడ్యువేవీ నాకు కనబడలేదు. వైజాగ్‌లో ఉంటాయేమో చూసి, ఉంటే నాకు పంపించగలవా.”
“మెటీరియల్ అంటే స్పెసిఫిక్‌గా ఏమిటి.”
“ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్ సబ్జెక్టులో నాకక్కరలేదు. ప్రీవియస్ ఇయర్స్ కొశ్చన్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ ఉంటే కావాలి.”
“ఇప్పుడు నాకు బోధపడింది. నీకేమిటి కావాలో. ఇప్పుడే నేను వెళ్లి బుక్ షాప్సులో చూస్తాను. దొరికితే వెంటనే నీకు కోరియర్ లో పంపిస్తాను. డన్.” అని హామీ ఇచ్చేడు.
“Thank you, బ్రదరూ. చిట్టితల్లిని అడిగేనని చెప్పు.”
“చెప్తాను గాని, Thanks చెప్పేసి చేతులు దులిపేసుకొందాం అనుకొంటున్నావా. నీకు తెలుసుగా. నేనెవరికీ ఫ్రీ సర్వీస్ చెయ్యను.”
“నాకు తెలుసు బ్రదరూ. నీ వాటా నీకిస్తాను.”
ఇద్దరూ నవ్వుకున్నారు.
మూడు రోజుల్లో సింహాద్రి విశాఖపట్నం నుండి కోరియరు అందుకున్నాడు. గబగబా అవి పేజీలు తిరగేసి చూసేడు. తనకు కావలిసిన మెటీరియలే ఉంది. వెంటనే ఫోన్ చేసి మూర్తికి ధన్యవాదాలు చెప్పేడు. ఒక నోట్ పుస్తకంలో వచ్చే వారం ఏ రోజు ఏమిటి చెప్పాలో ఆలోచించి రాసుకున్నాడు. ఆ పద్ధతిలోనే శిక్షణ ప్రారంభించేడు. స్కూలుకు వెళుతున్న కుర్రాళ్లను రెండు బేచిలుగా విడతీసేడు. ఒక బేచికి, ఉదయం ఏడు నుండి తొమ్మిది, రెండో బేచికి సాయంత్రం ఏడు నుండి తొమ్మిది వరకు పాఠాలు బోధపరుస్తున్నాడు.
ఇంజనీరింగు ప్రవేశ పరీక్షలు రాసే వారిద్దరకు స్కూలుకు వెళ్లే అవసరం లేదు కనక, రోజూ వీలయినంత సమయం వారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించేడు. ముందుగా సబ్జక్ట్స్ లోని థీరీ క్షుణ్ణంగా బోధపరిచేడు. మూడు వారాల తరువాత ప్రతీ శనివారం వాళ్లకి టెస్టులు చేస్తున్నాడు. వారి తప్పులను సరిదిద్ది, బోధపరుస్తున్నాడు. వారూ రాత్రింపగళ్లు కష్టపడ్డారు. ఇద్దరూ ఇంజనీరింగు ప్రవేశ పరీక్ష రాసేరు. సింహాద్రి అంచనాలో వారు చాలా బాగా రాసేరు. ఫలితాల కోసం వారిద్దరితోబాటు సింహాద్రి కూడా వెయ్యికళ్లతో ఎదురు చూసేడు. ఫలితాలు వెలుపడ్డాయి. ఆ ఇద్దరిలో ఒకడు వివేక్, రాత పరీక్ష పాసయ్యాడు. సింహాద్రి తనే పాసయినంత సరదా పడ్డాడు. తల్లిదండ్రులకు తన విజయం చెప్పేడు. వారు కొడుకు ఘనతకు పొంగిపోయేరు. తన కొరకు ఎవరో రావడంతో సింహాద్రి అటు వెళ్ళేడు.
మంగమ్మ శర్మతో, “ఏమండీ, మనవాడు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది.” అని పొంగిపోయింది.
“మంగా, నిజమే, వాళ్లతో బాటు వాడూ కష్టపడ్డాడు. వాడికి ఆ పరీక్షల్లో పాసయ్యే తెలివితేటలు ఉన్నాయి. వాడే ఆ పరీక్ష రాసి ఉంటే, తప్పక పాసయి ఉండేవాడు, మంగా. ఏమంటావ్.”
“అవునండి, నిజమే. తప్పక పాసయి ఉండేవాడు. వాడికా తెలివితేటలు ఉన్నాయ్ కాబట్టే ఆ కుర్రాణ్ణి పాస్ చేయించేడు.”
“కానీ వాడికి తెలుసు, మంగా. వాడు ఆ పరీక్ష పాసయినా నేను చదివించలేనని. అందుకే మన మనసు బాధపడకుండా వాడాజోలికి వెళ్లలేదు.”
“మీరలా బాధపడకండి. వాడు.. ఇంజినీరు కాలేకపోయినా అప్పుడే ఒక ఇంజనీరుని తయారు చేస్తున్నాడు. ఇంకా ఎంతమందినో ఇలా తయారు చేస్తాడు. అలా గర్వపడదాం.”
“ఎంచక్కా చెప్పేవ్, మంగా. జరగని దానికి విచారించకుండా జరిగినదానికి సంతోషపడాలి.”
“నేను వెళతాను. వాడికేదయినా తీపి తినిపించాలి.” అని మంగమ్మ వంటింటి వేపు వెళ్ళింది.
అటు వివేక్ తండ్రి. కొడుకుతో స్వయంగా వచ్చి సింహాద్రికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, “సార్, చాలా చాలా థాంక్స్ అండి. వాడొక్కడే మా సంతానమండి. నేను ఓ ప్రైవేటు కంపెనీలో ఎకౌంటెంటుగా పని చేస్తున్నాను. మావాడికిది ఆఖరి ఛాన్సట. ఇందులో పాసవ్వకపోతే ఏమిటి చెయ్యడమా అని బెంగ పడుతూ ఉండేవాడిని. మీ ధర్మమా అని వాణ్ణి పాస్ చేయించేరు.” అని, తలవంచి నమస్కారం చేసి, నాలుగు అరటిపళ్లు, రెండు ఏపిల్స్‌తో బాటు అయిదు వందల రూపాయలు పెట్టిన ఓ కవరు చేతికి వినయంగా అందించేడు. సింహాద్రి అది స్వీకరించి, “సార్, కేవలం నా చెప్పడంతో మీవాడు పాస్ కాలేదండి. చాలా కష్టపడ్డాడు. అందుకే పాసయ్యేడు. వాడి గురించి మీరు ఇక బెంగ పడక్కరలేదు. ఇంజినీరుగా బాగా పైకొస్తాడు.”
“గురువులు. మీ ఆశీర్వాదమే వాడికి కావాలి.” అని, కొడుకును గురువుగారి కాళ్ళకి దండం పెట్టమని చెప్పేడు. తండ్రీ కొడుకులు శలవు తీసుకున్నారు. సింహాద్రికి గురువు స్టేటస్ వచ్చింది. సింహాద్రి వద్ద శిక్షణ పొందుతున్న పది, పదకొండవ తరగతి విద్యార్థులు ఏన్యువల్ పరీక్షలలో మంచి మార్కులతో పాసయ్యేరు. ఇద్దరికి లెక్కల్లో తొంభై శాతం పైన వచ్చేయి. వాటితో సింహాద్రి వద్దకు శిక్షణకు రాదలచినవారి సంఖ్య పెరిగింది. సింహాద్రిని వాళ్ల శిక్షణలో బిజీగాఉండనిద్దాం. మనం శ్రీవల్లిపురంలో ఏమిటి జరుగుతోందో చూద్దాం.
***
గౌరీపతి, ఫ్రెండ్సు వెంకటగిరి, ప్రసాదులతో బేంక్ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నాడు. భావి ప్రణాళిక గూర్చి వాళ్ళు ఆలోచనలో పడ్డారు. బేంకుల్లో ఉద్యోగాల కోసం అడ్వర్టైజ్మెంటు వచ్చేదాకా ఖాళీగా ఉండకుండా ప్రిపరేషన్ మొదలుపెట్టడం మంచిదనుకున్నారు. తమంత తాము చదువుకొని బేంకు పరీక్ష పాసవడం కష్టమని వారికి తెలుసు. వాటికోసం ఊళ్లో రెండు కోచింగ్ సెంటర్లున్నాయి. వాటిలో ఏదయినా ఒకదానిలో చేరుదామా అంటే, వాటి రిజల్ట్స్ ఏం బాగులేవని తెలిసింది. ఊళ్ళోని పుస్తకాల దుకాణానికి వెళ్లి, గైడ్సు ఉన్నాయేమో చూసేరు. ఏవో ఉన్నాయిగాని, పూర్తిగా వాటిమీద ఆధారపడలేమనుకొన్నారు. వైజాగ్‌లో అంతకన్నా మంచివి దొరకొచ్చనుకొన్నారు. గౌరీపతి తన బావని అడుగుతానన్నాడు. పోస్టాఫీసుకు వెళ్లి మూర్తికి ఫోను చేసేడు.
“బావా, నాకో హెల్ప్ కావాలి.”
“చెప్పు, ఏమిటో.”
“నేను బేంకు పరీక్షలకి ప్రిపరేషను మొదలెడుదామనుకొంటున్నాను.”
“అయితే, ఏమిటి. నన్ను కోచింగు ఇమ్మంటావా.”
“విను, బావా. అన్నీ హాస్యంలోకి దింపేస్తావ్. ఆ ప్రిపరేషనుకి మా ఊళ్లో ఏవైనా మంచి గైడ్సు ఉంటాయేమో అని చూసేను. అవి అంత బాగులేవు. వైజాగ్‌లో ఉంటాయేమో నువ్వు చూసి చెప్పగలవా.”
“గౌతీ, ఇబ్బంది ఏమీ లేదు. చూడగలను. కాని, వాటిలో నీకు ఏవి యూస్ఫుల్‌గా ఉంటాయో నాకు తెలీదు. అంచేత, it is better. నువ్వు ఒకసారి వచ్చి పెర్సనల్‌గా చూస్తే మంచిది. నీకూ మీ అక్కని చూసినట్టుంటుంది. నాకూ, అత్తగారినుండి తినడానికి ఏవైనా తేగలవ్. Two birds at one shot. బాగుంది కదూ.”
“నువ్వు చెప్పింది బాగానే ఉంది, బావా. నాన్నగారినడిగివస్తాను. బై.”
గౌరీపతి తల్లితో తన ఆలోచన పంచుకున్నాడు.
అన్నపూర్ణ, “అవును బాబూ, పోటీ పరీక్షలు. సరైన పుస్తకాలు లేకపోతే ఎలాగ. మీ నాన్నగారితో చెప్తాను.” అంది.
అన్నపూర్ణ విషయం భర్త చెవిన వేసింది.
“నువ్వన్నట్లు వాడు పోటీ పరీక్షలకి వెళ్తున్నాడు. ఇక్కడ వాటికి సరైన పుస్తకాలు దొరక్కపోతే, మరి విశాఖపట్నమే వెళ్లాలి. వాడు స్వయంగా వెళ్లి చూసుకోడం మంచిదే. ఎంత కావాలో చెప్పమను. ఇస్తాను.” అని కొడుకు విశాఖపట్నం వెళ్లడానికి అంగీకరించేడు.
అన్నపూర్ణ అల్లుడుకి, కూతురికి, ఇష్టమయిన మైసూరుపాకు చేసింది.
గౌరీపతి విశాఖపట్నం చేరుకున్నాడు. వాడు ఇంటికి రాగానే, పలకరించి, మూర్తి వాడి బేగు కలియజూసేడు.
“దేనికలా వాడి బేగంతా సవిరిస్తున్నారు. ఇదిగో మా అమ్మ పంపించిన స్వీట్సు.” అని కొంటెగా ఒక పేకెట్టు ఎత్తి చూపించింది, చిట్టితల్లి.
“అదిలా ఇయ్యి. అత్తగారు నాకోసం పంపించేరు.” అని, ఆ పేకెట్టు చిట్టితల్లి చేతిలోంచి తీసుకొని, ఓపెన్ చేసి చూసేడు.
“వరేవా, మైసూరుపాక్. Thank you, అత్తగారూ.” అని వాటిలో ఒకటి లాగించేడు.
మరునాడు మూర్తి గౌరీపతిని పుస్తకాల షాపుకి తీసుకెళ్ళేడు. వాళ్లతోబాటు, మూర్తి ఎకౌంటున్న బేంకులో ఓ క్లర్కు కూడా ఉన్నాడు. ముగ్గురూ, రెండు మూడు దుకాణాలకి వెళ్లేరు. ఆ క్లర్కు సలహాతో గౌరీపతి నాలుగు గైడ్లు కొన్నాడు. గౌరీపతి, బావను, ఆ క్లర్కును, అభినందించేడు. మరొక రోజు ఉండి, తిరుగు ప్రయాణమయ్యేడు.
గౌరీపతి ఫ్రెండ్సు, వాడు తెచ్చిన పుస్తకాలు చూసి, “గౌరీ, నువ్వు తెచ్చిన గైడ్సు చాలా బాగున్నాయి. మనకు బాగా పనికొస్తాయి. ఒక దాన్లో, కొన్నింటికి ఆన్సర్లు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేడు. చాలా యూజ్ఫుల్ బుక్స్ సెలెక్ట్ చేసేవ్.” అని కొనియాడేరు.
“అసలు క్రెడిటు మా బావదిరా. తన ఏకౌంటున్న బేంకులో పని చేస్తున్న ఓ క్లర్కును మాతో తీసుకెళ్ళేడు. ఆయనే ఈ బుక్స్ సెలెక్ట్ చేసేరు. ఆయన మరో సలహా ఇచ్చేడు. పరీక్షలకి నెల్లాళ్ళ ముందు, క్విక్ రివిజన్ అని ఓ గైడు వస్తుందట. అది కూడా యూజ్ఫుల్‌గా ఉంటుందన్నాడు. అతను బేంకు పరీక్ష రాసేట్ట.”
“మీ బావగారికి thanks చెప్పాలిరా. మనకోసం ఆయన చాలా శ్రమ తీసుకున్నారు.”
ముగ్గురు ఫ్రెండ్సు పుస్తకాలలో ఏముందో చూడ్డంలో నిమగ్నులయ్యేరు.
చదువు ఆరంభానికి గణపతి మంచిరోజు నిర్ణయించేడు. ఆ రోజున గౌరీపతి ఇంట్లోనే ముగ్గురూ పరీక్షకు చదువు మొదలుపెట్టేరు. అయిదు వారాలు గడిచేయి. ప్రభుత్వరంగంలో నున్న కొన్ని బ్యాంకుల్లో క్లర్కుల పోస్టుల కొరకు ప్రకటన పేపర్లలో వెలువడ్డాది. ముగ్గురూ సకాలంలో ఎప్లై చేసేరు. ముగ్గురు స్నేహితులూ పరీక్షకు తయారీ ముమ్మరం చేసేరు.
***
సింహాద్రి శిక్షణలో ఒకడు ఇంజనీరింగు ప్రవేశ పరీక్ష పాసయ్యేడన్న వార్త, నలు దిక్కులా వ్యాపించింది. ఆ ప్రవేశ పరీక్షలకు తయారవుతున్న ఆరుగురు సింహాద్రి వద్ద శిక్షణకు చేరేరు. వారందరూ ఒక మారు ఆ పరీక్ష రాసినవారే. సింహాద్రి కేవలం వారికే, మరొక గదిలో శిక్షణ ప్రారంభించేడు. హైస్కూల్లో చదువుతున్న పది, పదకొండు తరగతి విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. ఆ పురోగతి ఊళ్లో ఉన్న కోచింగ్ సెంటర్ల వారికి ఆందోళన కలుగజేసింది. వారిలో ఒకరు, తమ సెంటర్లో ఫుల్ టైమ్ కోచ్‌గా చేరితే నెలకు యాభై వేలు ఇస్తామని, సింహాద్రికి కబురు పంపేరు. అది తెలిసి, మరో కోచింగు సెంటరువారు, నెలకు అరవై వేలు ఇస్తామని, ఆరు నెలల జీతం ఎడ్వాన్సుగా ఇస్తామని కబురు చేసేరు. ఆ రెండింటిని సింహాద్రి వినయంగా తిరస్కరించేడు. ఒక నెల తరువాత వారిలో ఒక కోచింగ్ సెంటర్ వారు, తమ దగ్గర శిక్షణ పొందుచున్న ఒక పన్నెండవ తరగతి అబ్బాయికి వారే జీతం కట్టి సింహాద్రి ఇనిస్టిట్యూట్‌లో చేరమన్నారు. వాడు రోజూ సింహాద్రి చెప్పిన పాఠాలు కోచింగు సెంటరువారికి సమర్పించడానికి నిర్ణయమయింది. ఆ కుర్రాడు సింహాద్రి వద్ద చేరేడు. కోచింగు సెంటరు వారి ప్రణాళిక అమలవుతోంది. మూడు వారాలు గడిచేయి. ఒక రోజు ఆ కుర్రాడు సింహాద్రి ఇచ్చిన వర్క్ చేస్తూ ఉంటే పెన్ను సరిగా రాయలేదు. వెంటనే తన బేగులోనుండి మరొక పెన్ను తీసి రాయడం మొదలుపెట్టేడు. ఆ పెన్ను ఎట్రేక్టివ్‌గా ఉంది. పక్క కుర్రాణ్ణి అది ఆకర్షించించింది. అలా చూడ్డంలో వాడు ఆ పెన్ను మీద ఊళ్లోని ఒక కోచింగు సెంటరు పేరు గమనించేడు. వాడికేదో అనుమానమొచ్చింది. విరామ సమయంలో ఆ విషయం సింహాద్రి చెవిలో వేసేడు. సింహాద్రి ఆ కుర్రాణ్ణి పిలిచి “నువ్వు.. కోచింగు సెంటరులో చదువుతున్నావు కదూ. నిజం చెప్పకపోతే నువ్వు నన్ను మోసం చేసేవని పోలీస్ రిపోర్ట్ ఇస్తాను.”అని భయపెట్టేడు. ఆ కుర్రాడు సింహాద్రి పాదాలు పట్టుకొని, “పోలీస్ రిపోర్ట్ ఇవ్వకండి సార్.”అని భయపడుతూ నిజం చెప్పేడు. సింహాద్రి వాణ్ణి లేవదీసి, “ఇటువంటి పనులెప్పుడూ చెయ్యకు.” అని వారించి, వాణ్ణి వెంటనే వెళ్లిపోమని మరెప్పుడూ అక్కడకు రావద్దని హెచ్చరించేడు. వాడి కోచింగు సెంటరువాళ్లని తన దగ్గరకొచ్చి వాడు కట్టిన జీతం తీసుకోమని చెప్పమన్నాడు. ఆ కుర్రాడు మరి రాలేదు. సింహాద్రి నెల తరువాత ఆ కుర్రాడు కట్టిన జీతం.. కోచింగు సెంటరువారికి మనియార్డరు ద్వారా పంపేడు.
సింహాద్రి రాత్రింబగళ్లు పడుతున్న శ్రమ గమనిస్తున్న తల్లిదండ్రులు, సింహాద్రిని తన ఆరోగ్యం గూర్చి శ్రద్ధ చూపమని హెచ్చరించసాగేరు. మంగమ్మ రోజుకు రెండుమార్లు, చిక్కటి పాలలో బోర్న్‌వీటా రెండు చెంచాలు కలిపి సింహాద్రికి త్రాగడానికి ఇస్తోంది.
సింహాద్రి ఆదాయం బాగా పెరిగింది. ఇంట్లో కావలిసిన అన్ని సౌకర్యాలు సమకూర్చేడు. వంటావిడ ఒకామె పనిలో చేరింది. ఉన్న ఇంటిని వీలయినంతవరకు ఆధునికంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు.
తండ్రిని పని మానేసి పూర్తిగా రెస్టు తీసుకోమని, రెండు మూడు మార్లు చెప్పేడు. ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు పని చేయడం ఇంటికి, ఒంటికి, మంచిదని శర్మ నచ్చచెప్పేడు. యథావిధిగా దేవాలయ విధులు నిర్వర్తిస్తున్నాడు. కొడుకు ప్రయోజకుడయ్యాడని, కమిటీ మెంబర్లు శర్మను అభినందించేరు. ఉద్యోగాల వేటలో పడకుండా తన ఉద్యోగం తనే సృష్టించుకున్నాడని మూర్తిగారు ప్రత్యేకంగా సింహాద్రిని అభినందించేరు.
సింహాద్రి పెళ్లికొడుకుల లిస్టులో పడ్డాడు. పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది. అమ్మాయి బి.ఏ. పాసయింది. వయసు ఇరవై సంవత్సరాలు. ఒకే ఒక తమ్ముడు. తండ్రి శ్రీకాకుళంలో ఒక ప్రైవేటు స్కూల్లో లెక్కల మాస్టారుగా పని చేస్తున్నాడు. ఆ విషయంలో శర్మ ఆలోచిస్తూ, మంగమ్మతో,
“మంగా, వాడి పెళ్లి విషయంలో వాడి ఆలోచనలేమిటో తెలుసుకోడం మంచిదేమో” అని తన అభిప్రాయం చెప్పేడు.
“అవునండి. మీరన్నది నిజమే. పెద్దవాడయ్యేడు. వాడి పెళ్లి విషయంలో వాడేమిటనుకొంటున్నాడో తెలియకుండా ముందుకెళ్లలేం.” అని మంగమ్మ భర్త అభిప్రాయంతో ఏకీభవించింది.
“మంగా, వాడు తీరుబాటుగా ఉన్నప్పుడు, వాణ్ణి అడిగి చూడు. వాడేమిటి అనుకొంటున్నాడో. అది తెలిసేక వచ్చిన సంబంధం వాళ్ళకి ఏదో రాయొచ్చు. ఆడపిల్లవాళ్లు. మన జవాబుకోసం ఆతృతగా చూస్తూ ఉంటారు.”అని చెప్పి దేవాలయానికి వెళ్ళేడు.
పెళ్లి విషయంలో కొడుకు అభిప్రాయం మంగమ్మ కోరింది.
దానికి స్పందిస్తూ, సింహాద్రి, “అమ్మా, మీ ఇద్దరి అభిప్రాయమేమిటి.” అని తల్లిదండ్రుల అభిప్రాయం తెలియగోరేడు.
“నాన్నా, ఇది నీ పెళ్లి. నీ జీవితమంతా, చేసుకొన్న పెళ్లాంతో గడపాలి. మా రోజులు వేరు. ఇప్పుడు ఆడా, మగా, ఇద్దరికీ పెళ్లిళ్ల విషయంలో, వాళ్ల వాళ్ల అభిప్రాయాలు ఉంటున్నాయి. అది మంచిదే. అంచేత నీ అభిప్రాయం ముఖ్యం. నాన్నగారు కూడా నీ అభిప్రాయం అడగమన్నారు.”
“అమ్మా, నిజానికి ఇప్పటిదాకా నేనా విషయం ఆలోచించలేదు. నా పనిలో నేను ఉంటున్నాను.”
“అవును నాయనా. నేను చూస్తున్నాను. పొద్దున్న నాకన్నా వేగరం లేచి, కొంత సేపు యోగా చేసుకున్నాక స్నానం చేసి, దేముడికి దండం పెట్టుకుని, ఆ గదిలోకి వెళిపోతున్నావు. రోజల్లా అక్కడే గడుపుతున్నావ్.”
“కుర్రాళ్లకు ఆ రోజు పాఠాలు ఏమిటి చెప్పాలో ముందుగా చూసుకోవాలమ్మా. అందుకే వేగరం వెళుతున్నాను.”
“అవును, నాయనా. అది ముఖ్యం. కాని, ఇప్పుడు నీ పెళ్లి విషయం కూడా ఆలోచించాలి నాన్నా. అదీ ముఖ్యమే.”
“అమ్మా, ఆలోచించుకొని, రేపు చెపితే ఫరవా లేదా.” అని, సమయం కోరేడు.
“రేపే కదా. ఫరవాలేదు. బాగా ఆలోచించుకొని రేపు చెప్పు.”
“సరేనమ్మా, రేపు చెప్తాను.”అని, తన పనిలోకి వెళ్లేడు.
రాత్రి తల్లి చెప్పిన విషయం సింహాద్రి ఆలోచించేడు. తనకు పెళ్లి చేసుకొనే సమయం ఆసన్నమయిందనుకొన్నాడు. అయితే తన జీవితభాగస్వామి నుండి ఏమిటి ఆశించాలి. ఆమె కుటుంబ విషయం తను చూసుకోనక్కరలేదు. తల్లిదండ్రులకే ఆ విషయాలు తెలుసు. వాళ్లే చూసుకొంటారు. తను నిర్ణయించుకోవలసినది, అమ్మాయి విద్యార్హతలు. అనుకోని పరిస్థితులు వస్తే, తన కాళ్ళమీద తాను నిలబడగలిగే అర్హత ఉండాలి. అంచేత తప్పకుండా గ్రేడ్యుయేట్ అయి ఉండాలి. ఏదో ఓ డిగ్రీ అయితే లాభం లేదు. తన ప్రస్తుత పరిస్థితిలో తన సబ్జెక్ట్స్ లోనే డిగ్రీ ఉంటే, తనకు వృత్తిలో సహాయపడగలదు. అంతే కాకుండా, అవసరమొస్తే, తను కొన్ని రోజులు స్వయంగా ఇనిస్టిట్యూట్ నడిపించగలదు. అయితే ఇవన్నీ తన వైపే ఆలోచించేననుకొన్నాడు. తల్లిదండ్రుల కోరిక ఏమిటో తెలుసుకోడం ముఖ్యమనుకొన్నాడు. నిద్ర కమ్ముకు రావడంతో, గదిలో దీపాన్ని ఆర్పేడు.
ఆ మర్నాడు సింహాద్రి తల్లితో తన పెళ్లి విషయం మాట్లాడేడు. గత రాత్రి తన ఆలోచనలు వివరంగా చెప్పి, “అమ్మా, నా విషయమే నేను ఆలోచించేను. అమ్మాయి విషయంలో మీ ఇద్దరి అభిప్రాయాలు ఏమిటమ్మా.” అని అడిగేడు.
“నాయనా, నువ్వు అన్ని విధాలా బాగా ఆలోచించేవ్. ప్రత్యేకంగా మాకు కావలసిందేమిటి. వంటింట్లో సాయం అఖర్లేదు. వంటావిడ ఉంది. మిగిలిన పన్లకి పని మనిషి ఉంది. మేమిద్దరం మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం. ఎటొచ్చీ, వచ్చిన పిల్ల అరమరికలు లేకుండా మన కుటుంబంలో ఇమిడితే, అదే పదివేలు.”
“అదే పదివేలు, అన్నావ్. ఏంటమ్మా. నాకు బోధపడలేదు.”
“పిల్ల గూర్చి అన్నీ తెలుస్తాయిగాని, మన ఇంటికొచ్చేక ఎలా వ్యవహరిస్తుందో మనకి తెలీదు కదా, నాన్నా. దానికి మనమేమీ చేయలేం. నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకు. అందరికీ అదే పరిస్థితి.”
“అమ్మా, పెళ్లి సంబంధం వస్తే, ముందుగా నువ్వు, నాన్నగారు వాళ్ల ఇంటికి వెళ్లి చూడండి. మొదట మీకు నచ్చితేనే ముందుకు వెళదాం.”
“అలాగే నాన్నా.”
“ఎవరో వచ్చినట్టుంది. వెళతానమ్మా.” అని నిష్క్రమించేడు.
కొడుకుతో జరిగిన సంభాషణ వివరాలు మంగమ్మ శర్మకు చెప్పింది.
సింహాద్రి కోరికలు తెలిసేక వచ్చిన సంబంధం సరిపోదని శర్మ తెలుసుకున్నాడు. ఆ పెళ్లివారికి మర్యాదగా ఆ విషయం తెలియజేసేడు.
మనం, గౌరీపతి, సింహాద్రీల విషయం తెలుసుకున్నాం గదా. ఓ మారు విశాఖపట్నంలో L.I.C. ఏజెంటు, మూర్తి ఏమిటి చేస్తున్నాడో చూద్దాం.
(సశేషం)
శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం నవంబరు, 1936 లో జన్మించారు. M.A. మరియు P.G. Diploma in Personnel Management పాసయ్యారు. ఉద్యోగ పర్వం, హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రారంభించి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిగా చేసి, 1994 లో విశ్రాంతి తీసుకొన్నారు. అమెరికా వాసి.
హైస్కూలు విద్యార్థిగా రంగస్థల ప్రవేశం చేసేరు. చిన్న నాటికలు రాసి, వాటిలో పాత్రలు ధరించి, దర్శకత్వం చేసేరు.
గత ఎనిమిది సంవత్సరాల నుండి రచనలు చేస్తున్నారు. ఈ నాటికి 33 కథలు, 3 నవలలు, 4 కవితలు, ఒక హాస్య నాటిక ప్రచురణమయ్యేయి.
