Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పునరావృతం-13

[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మేనత్త చనిపోయాకా, ఇంకా ఆమె ఇంట్లో ఉంటే బావలు ఏమనుకుంటారో అని ఆలోచిస్తాడు మూర్తి. పోనీ ప్రతి నెలా అద్దె ఇద్దామంటే బావలు ఒప్పుకోరని తెలుసు. తాము ఉన్న ఇల్లు కొట్టేసి, ప్లాట్లు కట్టిస్తే, వాళ్ళకి చాలా ఎక్కువ డబ్బు వస్తుందని చిట్టితల్లి సలహా ఇస్తుంది. చిట్టితల్లి ద్వారా కస్తూరి గారిని, ఆవిడ నుండి మరొకరిని సంప్రదించి బిల్డర్ రఘురామయ్య ఫోన్ నెంబర్ పట్టుకుంటాడు మూర్తి. రఘురామయ్య వచ్చి ఇంటిని చూస్తాడు. చర్చల అనంతరం నలభై లక్షల నగదు, ఒక త్రీ బెడ్ రూమ్ ఫ్లాటు ఫుల్లీ ఫర్నిష్‌డ్‌ది ఇచ్చేట్టు ఒప్పందం కుదురుతుంది. మూర్తి, బావలిద్దరికీ ఫోన్ చేసి విషయం చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని, అంగీకారం తెలుపుతారు. తమకు అంత ఆదాయం కల్పించినందుకు కృతజ్ఞతగా ఆ త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్‌ని మూర్తికే ఇచ్చేస్తారు. చిట్టితల్లి అన్నీ వివరాలు అమ్మానాన్నలకి ఉత్తరం రాసి తెలియబరుస్తుంది. గౌరీపతి, అతని మిత్రుడు ప్రసాద్ బ్యేంకు ఉద్యోగం కోసం రాసిన రిటెన్ టెస్ట్ పాసవుతారు. ఇంటర్వ్యూ కోసం సన్నద్ధమవుతారు. నవరంగపురంలో మంగ, శర్మలు కొడుకు సింహాద్రికి పెళ్ళి చేయాలని తలుస్తారు. విశాఖలోని మూర్తికి ఫోన్ చేయగా, వైజాగ్‌లోని పెళ్ళిళ్ళ పేరయ్య మార్కండేయ శాస్త్రి గారి గురించి చెప్పి, ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాడు. శాస్త్రిగారిని తమ ఇంటికి పిలిస్తే, ఆయన తమ ఇల్లూ చూసినట్టుంది, కొడుకు ఇన్‌స్టిట్యూట్ కూడా చూసినట్టుందని అంటుంది మంగ. వారి ఆహ్వానం మేరకు శాస్త్రి గారు నవరంగపురం వచ్చి మంగమ్మ, శర్మ దంపతుల ఆతిథ్యం స్వీకరిస్తారు. వాళ్ళకెలాంటి కోడలు కావాలో తెలుసుకుంటారు. సింహాద్రి లోనికి రాగా, కొడుకుని ఆయనకి పరిచయం చేస్తారు. పెళ్ళి కొడుకు జాతకం వివరాలు, ఫోటో తీసుకుని శాస్త్రిగారు తిరుగుప్రయాణమవుతారు. ఆయనటు వెళ్ళాకా, ఆలయానికి బయల్దేరుతాడు శర్మ. – ఇక చదవండి.]

గౌరీపతి బేంకు ఇంటర్వ్యూకి వెళ్ళేడు. ప్రసాదుకు రెండురోజుల క్రితం విపరీతమైన జ్వరం రావడంతో ఇంటర్వ్యూకి వెళ్లలేకపోయేడు. రెండు నెలల తరువాత రిజల్ట్స్ వచ్చేయి. గౌరీపతి క్లర్కుగా ప్రభుత్వరంగంలో ఒక ప్రధానమైన బేంకులో క్లర్కుగా సెలెక్టయ్యేడు. వాడి సంతోషానికి అంతు లేకపోయింది. కొడుకు స్వయంగా చదువుకుని బేంకు పరీక్ష పాసయ్యేడని గణపతి, అన్నపూర్ణ, వాడి తెలివితేటలను కొనియాడేరు. కొడుకు తలపై అన్నపూర్ణ ముద్దుల వర్షం కురిపించింది. గణపతి కూడా వాణ్ణి దగ్గరగా తీసుకొని, “చాలా కష్టపడ్డావు నాన్నా. నీ కష్టం ఫలించింది. కష్టబడి నిజాయితీగా పనిచేస్తే బేంకులో పెద్ద ఆఫీసరు కాగలవ్.” అని హితవు పలికేరు. తన ఫ్రెండ్సుని కలియడానికి వెళతానని గౌరీపతి వెళ్ళేడు.

“మీ కల నిజమయిందండి. మీ పిల్లణ్ణి ఎంతమాత్రం పౌరోహిత్యుణ్ణి చెయ్యకుండా ఉద్యోగస్తుణ్ణి చేస్తాననుకున్నారు గదా. అది ఇవాళ నిజమయింది.”

“అంతా ఆ భగవంతుని దయ అన్నపూర్ణా. ఆ విషయం బాగా జ్ఞాపకం చేసేవ్. నీకిదివరలో చెప్పేను, జ్ఞాపకముందా. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నాన్నగారు తొమ్మిదితో ఆపీమని చెప్పగానే, నేను నిరాశపడ్డాను. అప్పుడు మంగ నాతో, ‘నీకు పెళ్లయిన తరువాత పిల్లలు పుడతారు గదా అన్నా. వాళ్లని తప్పకుండా ఉద్యోగంలో పెట్టు.’ అని, చిన్నదయినా పెద్ద సలహా ఇచ్చి ఓదార్చింది. ఇప్పుడే దానికి ఫోను చేసి చెప్తాను. మన గౌరీపతి ఉద్యోగస్తుడయ్యేడని. అది ఎంతో సంతోషిస్తుంది.”

“అవునండి, మంగకి మన పిల్లలంటే ఎంతో అభిమానమండి. మన అల్లుడు మూర్తి కూడా మనవాడికి చాలా సాయం చేసేడండి. అతనికి కూడా ఫోను చేసి చెప్పండి.”

“అలాగే. ఇప్పుడే వెళ్లి చెబ్తాను.”అని గణపతి పోస్టాఫీసుకు వెళ్ళేడు.

గౌరీపతి బేంకు ఉద్యోగస్తుడయ్యేడని తెలిసి, మంగమ్మ, శర్మతోబాటు, మూర్తి, చిట్టితల్లి కూడా సంతోషించి గణపతికి అభినందనలు తెలియజేయమన్నారు.

ఊళ్లో ఉన్న ఒక కోచింగు సెంటరు వారు, గణపతిని కలసుకొని, గౌరీపతి తమ వద్ద శిక్షణ పొందేడని న్యూస్ పేపర్లో ఫొటోతో బాటు ప్రకటన ఇచ్చేందుకు అంగీకరిస్తే పాతికవేలు ఇస్తామన్నారు. అటువంటి తప్పుడు ప్రకటనలకు తానొప్పుకోనని గణపతి ఖచ్చితంగా చెప్పి వారి ఆఫరును తిరస్కరించేడు.

నెలకు 19,900 రూపాయలు బేసిక్ సేలరీ మీద క్లర్కుగా ఎపాయింట్ చేస్తూ బేంకు హెడాఫీసునుండి, గౌరీపతి ఆర్డర్లు అందుకున్నాడు. గౌరీపతి మూడు నెలల శిక్షణార్థం ఢిల్లీలోని బేంకు శిక్షణాకేంద్రంలో చేరేడు. శిక్షణ పూర్తయ్యేక బేంకు భీమవరం బ్రేంచిలో క్లర్కుగా చేరేడు.

***

హనుమంతరావుగారని ఒకాయన, విజయనగరానికి దగ్గర ఊళ్లో గవర్నమెంటు హైస్కూలు హెడ్మాస్టరుగా పని చేసి ఏడాది క్రితం రిటైరయ్యేరు. ఆయన విజయనగరంలో స్థిరబడ్డారు. దానికి కారణం, ఆయనకు విజయనగరంలో పిత్రార్జితమయిన ఒక పెంకుటిల్లు ఉంది. రిటైరయ్యేముందు ఆయన కోరికపైనే విజయనగరం దగ్గర ఊరికి ప్రభుత్వం ఆయన్ని బదిలీ చేసింది. ఆయన భార్య కనకదుర్గమ్మ. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. అందరిలో పెద్దవాడు సర్వేశ్వరరావు. ఆ తరువాతది హేమలత. మూడవది లావణ్య. సర్వేశ్వరరావు I.I.T. ఖర్గపూర్‌లో బి.టెక్. చేసి జంషెడ్పూర్‌లో నెలకు అరవైవేల మీద టాటావారి కంపెనీలో అయిదేళ్ల క్రితం చేరేడు. గత ఏడాది పెళ్లయింది. భార్య ఇందిర. హనుమంతరావుగారి పెద్దకూతురు హేమలత B.A. చేసింది. రెండేళ్ల క్రితం పెళ్లయింది. ఆమె భర్త బాలకృష్ణ, సాలూరులో ఒక కోపరేటివ్ బేంకులో గుమస్తాగా ఉన్నాడు. రెండవ అమ్మాయి లావణ్య, లెక్కలు, ఫిజిక్సు, కెమిస్ట్రీలతో బి.ఎస్సీ. అరవైనాలుగు శాతంతో గత సంవత్సరం పాసయింది. హనుమంతరావు దంపతులు లావణ్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆయనకు పెద్ద కట్నాలిచ్చే తాహతు లేదు. పెద్దవాడు సర్వేశ్వరరావు ఇంజనీరింగు చదువుకి బేంకు లోను తీసుకొన్నాడు. వాడది రెండు సంవత్సరాలలో తీర్చేసేడు. పై చదువుకు అమెరికా వెళ్లాలని సంకల్పించుకొన్నాడు. దానికోసం డబ్బు నిలవ చేస్తున్నాడు. తండ్రికి ఎట్టి సాయమూ చేయడం లేదు. పెద్దమ్మాయి హేమలత పెళ్లికి హనుమంతరావు గారు సహాయం అడిగితే, మొక్కుబడిగా 10,000 రూపాయలు పంపేడు. రావుగారికి కోపం వచ్చి ఆ సొమ్ము తిరిగి పంపించేసేరు. విజయనగరంలోని తన పిత్రార్జితం అయిన ఇంటి వెనుకనున్న జాగా అమ్మి పెళ్లిఖర్చులు పెట్టేరు.

***

మూర్తి డెవలప్మెంట్స్‌కు ఇచ్చిన మూడంస్తుల ఎపార్టుమెంట్స్ పూర్తిగా తయారయిపోయేయి. దాని మెయిన్ గేటు వద్ద ‘అప్పలనరసమ్మ ఎపార్టుమెంట్స్’ అని పెద్ద అక్షరాలతో లిఖింపబడ్డ ఒక పాలరాతి పలక గోడకు అమర్చబడ్డాది. మూర్తి ఫోను చేసి, బావలిద్దరిని కుటుంబసహితంగా వచ్చి గృహప్రవేశం చేసుకోమన్నాడు. మూడు వారాలలోగా చేసుకోకపోతే మూఢం వస్తుంది గనక వెంటనే ఆ శుభకార్యం చేసుకోమని సలహా ఇచ్చేడు. వారు ‘సరే’ అనగానే ముహూర్తం పెట్టించి తెలియజేసేడు. ఆ ముహూర్తానికి మరుచటిరోజు మూర్తి గృహప్రవేశానికి ముహూర్తం కుదిరింది. ముహూర్తానికి రెండు రోజులు ముందుగా మూర్తి బావలిద్దరూ సకుటుంబంగా విశాఖపట్నం చేరుకున్నారు. ఆహ్వానాలు అందుకొని, రెండు సుముహూర్తాలకు, గణపతి, శర్మ, సకుటుంబంగా హాజరయ్యేరు. అందరి రాకతో పెళ్లికళ వచ్చింది. గణపతి, శర్మ, రెండు శుభకార్యాలూ శాస్త్రోక్తంగా జరిపించేరు.

తీరికిగా సాయంత్రం పిన్నా పెద్దా అందరూ ఒకచోట సమావేశమయ్యేరు. మూర్తి, చిట్టితల్లి, అందరకు నూతన వస్త్రాలు అందజేసేరు. బావలకు మూర్తి ఏవో ప్రత్యేక కానుకలిచ్చేడు. ఆ కార్యక్రమం అయిన తరువాత అందరి కోరికపై అన్నపూర్ణ, భారతంలో, అంపశయ్య మీద పడుకొని ఉన్న భీష్ముడి వద్దకు కృష్ణుడు పాండవులతో వచ్చినప్పుడు, భారత యుద్ధంలో మూడవ రోజున తన విజృంభణకు అర్జునుడు ఆగలేకపోగా, కృష్ణుడు తన మీదకు చక్రధారియై వచ్చిన ఘట్టం గుర్తుకొచ్చి, కృష్ణుడిని స్తుతించిన ‘కుప్పించి ఎగసిన గుండలంబుల కాంతి/ గగనభాగంబెల్ల గప్పికొనగ/నురికిన నోర్వక యుదరంబులోనున్న/ జగముల వ్రేగున జగతి కదల/..’ పద్యం వినిపించి, దాని తాత్పర్యం చెప్పింది. తరువాత ప్రహ్లాదుని హరి భక్తిని తెలియజేస్తూ, పోతన రచించిన భాగవతంలో ‘మందారమకరంద మాధుర్యమున దేలు/ మధుపంబువోపునే మదనములకు/ నిర్మల మందాకినీ వేచికలదూగు/..’ పద్యం వినిపించి తాత్పర్యం చెప్పింది. అందరూ హర్షించి చప్పట్లు కొట్టేరు. తరువాత అందరూ వినోద కార్యక్రమంలోకి వెళ్లేరు.

కార్యక్రమం ముగిసిన మర్నాడు గణపతి, శర్మ, గౌరీపతి, తిరుగు ప్రయాణమయ్యేరు. కూతురు, అల్లుడు కోరడంతో వారికి సాయంచేయడానికి అన్నపూర్ణ మరొక వారం ఉండదలిచింది. మూర్తిబావలిద్దరూ నాలుగు రోజుల తరువాత వాళ్ల ఊళ్లకు ప్రయాణమయ్యేరు.

***

కూతురు లావణ్య పెళ్లి సంబంధాలకోసం హనుమంతరావుగారు సర్వ ప్రయత్నాలూ చేస్తున్నారు. తల్లి కనకదుర్గమ్మ కూడా తెలిసినవారందరితో చెప్తున్నాది. ఒకరోజు ఈవినింగ్ వాక్ సమయంలో హనుమంతరావు గారితో ఒకాయన, “రావుగారూ, విశాఖపట్నంలో మార్కండేయశాస్త్రి అని ఒకాయన వద్ద పెళ్లి సంబంధాల లిస్టు పెద్దదే ఉంటుందట. మీకు విశాఖపట్నంలో తెలిసినవాళ్లు ఎవరైనా ఉంటే వెళ్లి ఆయన్ని కలియమనండి. మీ అమ్మాయికి అతని దగ్గర మంచి సంబంధం దొరకొచ్చు.” అని సలహా ఇచ్చేడు. దానికి, “విశాఖపట్నంలో తెలిసినవాళ్లు ఎవరూ ఉన్నట్టులేదండి. అయినా చూడాలి.” అని రావుగారు స్పందించేరు. అవి విన్న మరో ఆయన, “రావుగారూ, వైజాగ్‌లో మా బావమరిది కొడుకున్నాడు. వాడికి ఫోన్ చేసి ఆ శాస్త్రి ఫోన్ నంబరు అడుగుతాను.” అని రావుకు సహాయపడదలిచేడు. “చాలా థాంక్స్ అండి. ఆ శాస్త్రిగారి ఫోన్ నంబరు తెలిసేక ఆయనకు ఫోన్ చేసి మాట్లాడుతాను.”అన్నారు, రావుగారు. ఆ మర్నాడు రావుగారికి తన ఈవినింగ్ వాక్ మిత్రునినుండి ఫోన్ వచ్చింది. “రావుగారూ, వైజాగ్ లోని మా వాడితో మాట్లాడేను. వాడికి ఆయన్ని తెలుసట. ఆయన మేరేజ్ బ్యూరో పెద్దదేనిట. ఆయన సర్వీస్ కూడా బాగుంటుందట. తన బ్యూరోలో రిజిస్ట్రేషనుకి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తాడట. మావాడు, ఆయన్ని పర్సనల్‌గా కలిసి మాట్లాడ్డం మంచిదన్నాడు. ఆ శాస్త్రి ఫోన్ నెంబరు చెప్తాను రాసుకోండి.” అని ఆ నంబరు ఇచ్చేడు. రావుగారు ధన్యవాదాలు చెప్పేరు. రావుగారు భార్యతో ఆ విషయం చర్చించేరు. విశాఖపట్నం వెళ్లి శాస్త్రిగారిని కలసి వివరంగా మాట్లాడ్డం మంచిదని నిర్ణయానికి వచ్చేరు. హనుమంతరావు గారు శాస్త్రిగారికి ఫోన్ చేసి విషయం చెప్పి స్వయంగా వచ్చి కలుసుకుని వివరాలన్నీ తెలియజేస్తామన్నారు. ఆయన అది అన్ని విధాలా మంచిదన్నారు. ఆ మర్నాడు ఉదయం పది దాటేక వచ్చి కలసుకోమన్నారు. అమ్మాయి బయోడేటా, ఫోటో తెమ్మన్నారు.

హనుమంతరావుగారు సతీసమేతంగా విశాఖట్నంలోని శాస్త్రిగారింటికి వెళ్లేరు. ప్రారంభ మర్యాదలయ్యేక రావుగారు శాస్త్రిగారికి తమ కుటుంబ వివరాలు చెప్పేరు. ఆ తరువాత లావణ్య చదువు వివరాలు చెప్పేరు. ఆమెకు తగు సంబంధం కోసం చూస్తున్నామన్నారు. రావుగారు లావణ్య బయోడేటా, ఫోటో కవరులో పెట్టి శాస్త్రిగారికి అందించేరు. ఆ రెండింటిని ఒక మారు చూసి శాస్త్రిగారు తిరిగి కవర్లో పెట్టి, “రావుగారూ, అన్నీ భేషుగ్గా ఉన్నాయి. కట్నాలు ఎంతవరకు వెళ్లొచ్చునో తెలిస్తే దానిని బట్టి తగ్గ సంబంధం చూడొచ్చు.”

“శాస్త్రిగారూ, మీ దగ్గర దాపరికం దేనికి. మా అబ్బాయి ఇంజనీరింగు చదువుకు బోలిడయింది. బేంకు లోను తీసుకొన్నా అది ఏమీ సరిపోలేదు. నా జీతంలోంచే వాడికి ప్రతి నెలా డబ్బు పంపించేను. మా పెద్దమ్మాయి పెళ్లికి కూడా చాలా ఖర్చయింది. నాకున్న ఆస్తల్లా విజయనగరంలో పిత్రార్జితమయిన ఇల్లొకటుంది. అందుచేత పెద్ద కట్నాలిచ్చుకోలేను. ఒక లక్షదాకా తూగగలను.”

“ఉత్తి కట్నంతో సరిపోదుకదండి. దానికి రెండింతలు పై ఖర్చులవుతాయి.” అని, రావుగారి భార్య కనక దుర్గమ్మ భర్త మాటలకు మరికొంత బలం పోసింది.

“మరి మీ అబ్బాయి, టాటావారి కంపెనీలో పనిచేస్తున్నాడన్నారు. అతనికి పెద్ద జీతమే ఉంటుందే. అతడు సాయం చెయ్యొచ్చుగా.” శాస్త్రిగారి ఆలోచన.

“శాస్త్రిగారూ, వాడికి పెద్దజీతమే వస్తున్నాది గానీ వాడు పై చదువుకు అమెరికా వెళ్లడానికి సొమ్ము కూడబెట్టుకొంటున్నాడు.” రావుగారు విధిలేక ఇంటిగుట్టు విప్పి చెప్పవలసొచ్చింది.

“సరే, అర్థమయింది రావుగారూ. ఇది ఇంటింటి రామాయణమే. ఈ రోజుల్లో కట్నాలు వివిధ రూపాల్లోకి వెళ్ళేయి. కొందరు, మా వాడి చదువుకే లక్షలమీద అయింది. గవర్నమెంటు ఉద్యోగంలో ఉన్నాడు. అంచేత కనీసం అయిదు లక్షలేనా ఇవ్వాలి అని డైరెక్టుగా అడుగుతారు. మరికొందరు తెలివిమీరిన వాళ్లు, మాకు కట్నాలు అక్కర్లేదు. పెళ్లి స్టారు హోటల్లో చేస్తూ, మాకు, మా బంధుమిత్రులకు అదే హోటల్లో బస ఏర్పాటు చేస్తే సదుపాయమవుతుంది అని సంఘసంస్కర్తల అవతారంలో మాట్లాడుతారు.” అని శాస్త్రిగారు నేటి పరిస్థితి చెప్పేరు.

“శాస్త్రిగారూ, మీరన్నది అక్షరాలా నిజం. నా పరిస్థితి మీకు దాపరికం లేకుండా చెప్పేను. మరి నాకు మీరే ఏదో దారి చూపించాలి.” అని రావుగారు వేడుకున్నారు.

“రావుగారూ, నేనూ ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేసేను. ఆడపిల్లలు గల తల్లిదండ్రుల ఇబ్బందులు నాకు తెలుసు. అయితే ఇప్పుడిప్పుడు కొందరు ఆడపిల్లలు కూడా షరతులు పెడుతున్నారు. అది మంచి పరిణామమే. వాళ్ల హక్కులు వాళ్లు తెలుసుకొంటున్నారు. అయితే పెళ్లికి ముందే ఇరుపక్షాలవారు, ముఖ్యంగా వధూవరులు మనసువిప్పి మాట్లాడుకొంటే తరువాత సమస్యలు రావు. ఏమంటారు.”

“మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. మా అమ్మాయి పెళ్లి విషయంలో మీ సలహా తప్పక పాటిస్తాను.” అని రావు గారు శాస్త్రిగారి సలహాతో ఏకీభవించేరు.

“ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు చెప్పేనంటే, నేను కుదిర్చిన సంబంధాలు సఫలమవ్వాలని నా కోరిక.”

“సంబంధాలు మొక్కుబడిగా కుదర్చకుండా మీరు అవి సఫలమవడానికి సలహాలు కూడా ఇస్తున్నారు. అందుచేత మీరు కుదిర్చిన సంబంధాలు సక్సెస్ అవుతాయి.”

“సరే, రావుగారూ, ఈ మధ్యనే నా దగ్గర ఒక మంచి సంబంధం రిజిస్టరయింది. అబ్బాయి బి.ఎస్సీ. బాగా చెప్పుకోదగ్గ మార్కులతో పాసయ్యేడు.” అని చెప్పి తన దగ్గర ఉన్న ఫైలోకటి తెచ్చి, సింహాద్రి బయోడేటా, ఫోటో, రావుగారికి చూపించేరు.

రావుగారు సింహాద్రి బయోడేటా, అది శ్రద్ధగా చూసేరు. ప్రక్కనే ఉన్న ఆయన భార్య ఇంగ్లీష్ రాకపోవడం మూలాన్న అటువైపు చూడలేదు. రావుగారు ఆమెకు బయోడేటాలోని వివరాలు బోధపరిచేరు. రావుగారు సింహాద్రి ఫోటో తాను చూసి, భార్యకు చూపించి , తిరిగి శాస్త్రిగారికి ఇచ్చేరు.

శాస్త్రిగారు ప్రస్తుతం సింహాద్రి నడుపుతున్న ఇనిస్టిట్యూటు గూర్చి వివరాలు చెప్పేరు.

“ఆ అబ్బాయి అంత తెలివైనవాడు కదా, తన దగ్గర చదువుకున్నవాళ్లే ఇంజనీర్లు అయ్యేరంటున్నాడు కదా, మరి తనెందుకు ఇంజినీరు పరీక్షలు రాయలేదు.” అని నర్మగర్భంగా దుర్గమ్మ ప్రశ్న సంధించింది.

“దుర్గా, తండ్రికి ఆ స్తోమతు లేదని గ్రహించి ఉంటాడు.”

“మనవాడిలాగ బేంకునుండి అప్పు తీసుకొని ఉండొచ్చుగా.”

“నువ్వు మర్చిపోయేవా. మన వాడికి ప్రతి నెలా ఎంతెంత పంపిస్తూ ఉండే వాళ్ళం. దానికి మనం ఎన్ని తిప్పలు పడ్డాం.” అని రావుగారు కొద్దిగా చికాకు పడుతూ అన్నారు.

“అమ్మా, మీకు ఆ అబ్బాయి గూర్చి ఏ అనుమానమున్నా, మీకు ఇష్టం లేకపోతే ముందుకు వెళ్లొద్దు.” అని శాస్త్రిగారు ఖచ్చితంగా చెప్పేరు.

“శాస్త్రిగారూ, అబ్బాయి ప్రస్తుతం ఏమిటి చేస్తున్నాడు అన్నది ముఖ్యం. అలా ఎందుకు చెయ్యలేదు, ఇలా ఎందుకు చెయ్యలేదు అన్నది అప్రస్తుతం.” అని రావుగారు పరోక్షంగా భార్యకు సందేశమిచ్చేరు.

“రావు గారూ, మీరు చెప్పినవన్నీ విన్నాక, ఈ సంబంధం ఎందుకు చెప్పేనంటే, అబ్బాయి తల్లిదండ్రులు మాకు కట్నకానుకలు అక్కరలేదు, సాంప్రదాయమైన కుటుంబం నుండి పిల్ల కావాలి అని ఏ అనుమానము లేకుండా చెప్పేరు. ఏమమ్మా చెప్పండి. మీ అభిప్రాయమేమిటి.”

“సరే, నేననడానికేముంది. చెప్పండి, మిగిలిన విషయాలు.” అని దుర్గమ్మ శాస్త్రిగారితో అంది.

మంగమ్మ దంపతులు ఆ విషయంలో చెప్పినవన్నీ శాస్త్రిగారు విపులంగా చెప్పేరు.

“రావుగారూ, నేను స్వయంగా వారింటికి వెళ్లేను. వారింట్లో వారు చెప్పిన సకల సౌకర్యాలు ఉన్నాయి. దంపతులిద్దరూ ఎంతో మర్యాదగా మాట్లాడేరు.” అని చెప్పి, సింహాద్రి ఇన్స్టిట్యూటులో తను చూసినవన్నీ చెప్పేరు.

“మీరు స్వయంగా చూసి చెప్తున్నారు. సందేహించడానికేమీ లేదు.” అని రావుగారు తన సంతృప్తిని తెలియబరిచేరు.

“మీరు బాగా ఆలోచించుకోండి. అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోండి. అన్ని విధాలా నచ్చితేనే ముందుకెళ్లండి.” శాస్త్రిగారి సలహా.

“శాస్త్రిగారూ, నాకేమో సంబంధం బాగున్నట్టుంది. అయినా మీరు చెప్పినట్టు ముగ్గురం ఆలోచించుకొని ఏదో ఒక నిర్ణయానికి వస్తాం. మీరు చాలా శ్రమ తీసుకొని వివరంగా చెప్పేరు. చాలా థాంక్స్ అండి. మరి శలవా.”

“శుభమస్తు.” అని శాస్త్రిగారు దంపతులకు వీడ్కోలు పలికేరు.

రావుగారు, భార్య, విజయనగరంలోని తమ నివాసం చేరుకున్నారు. అమ్మాయి లావణ్యకు, సంబంధం విషయంలో శాస్త్రిగారితో జరిగిన సంభాషణంతా రావుగారు తెలియబరిచేరు. బాగా ఆలోచించుకుని తన నిర్ణయం చెప్పమన్నారు. లావణ్య స్పందిస్తూ, “డేడీ, మీ ఇద్దరి అభిప్రాయమేంటి. పెద్దవాళ్లు. మీకు నచ్చాలిగా.”

“తల్లీ, మాకు నచ్చిందికాబట్టే, నీదాకా తెచ్చేం. అయినా మాది ఫైనల్ కాదు. నీకు నచ్చడం ముఖ్యం.”

“అమ్మా, ఇది నీ జీవితానికి సంబంధించినది. నువ్వు సరే అంటేనే మేం వాళ్లతో మాట్లాడుతాం.” అని దుర్గమ్మ కూడా అంది.

“సరే, డేడీ, ఆలోచించుకొని రేపు చెప్తాను.”

“అలాగేనమ్మా. తొందరేమీ లేదు.” అని దంపతులిద్దరూ అమ్మాయి గదినుండి నిష్క్రమించేరు.

ఆ రాత్రి రావుగారు భార్యాసమేతంగా తమ పడకగదిలో ఉన్నారు.

“దుర్గా, సంబంధం గూర్చి నీ అభిప్రాయమేంటి.” రావుగారు భార్య అభిప్రాయం అడిగేరు.

“వేరే నా అభిప్రాయం దేనికి. అమ్మాయికి మీరు చెప్పేరుగా, మనిద్దరికీ నచ్చిందని.”

“నీ అభిప్రాయం కూడా ముఖ్యం. నీకు నచ్చకపోతే, పొద్దున్న అమ్మాయికి చెప్పి, సంబంధం డ్రాప్ చేసేస్తాను.” అని రావుగారు అన్నారు.

“అన్నీ బాగున్నాయండి. కానీ..”

“కానీ, ఏమిటి.”

“కుర్రాడి తండ్రి దేవాలయంలో పూజారిటగా. అందరూ వియ్యంకుడేమిటి చేస్తున్నాడంటే మనం ఏమిటని చెప్తామండి. వాళ్లకి బాగుంది. వియ్యంకుడు ఎవరంటే, రిటైరుడు హైస్కూలు హెడ్ మాస్టరు అని గర్వంగా చెప్పుకోవచ్చు.” దుర్గమ్మకు స్టేటస్ బాధ.

“దుర్గా, మన సంఘంలో టీచర్లకు ఎంత గౌరవముందో నీకు తెలీదు. ఏడాదికో రోజు టీచర్స్ డే నాడు కుర్చీలో కుర్చోబెట్టి మెడలో ఓ చవకరకం పూలదండ వేసి, నాలిక చివరినుండి నాలుగు పొగడ్తలు పలికి దాని అర్థం తెలీకపోయినా ‘ఆచార్యదేవో భవ’ అని రెండు ముక్కలు పలుకుతారు. అక్కడితో చెల్లు. తరువాత ఏ రోజయినా వారే ఎదురుబడితే టీచరు నమస్కారం చేసినా ప్రతినమస్కారం చెయ్యరు. వాళ్ల దర్శనం కోసం గంటలకొలది వాళ్ల ఆఫీసు ముందర వేలాడాలి. ఆ అవమానాలన్నీ భరించేను. నీతో కొన్ని చెప్పేను, మర్చిపోయినట్లున్నావ్.” అని రావు గారు గత అవమానాలను నెమరువేసుకున్నారు.

“ఏమోనండి. అది తప్పితే మిగిలినవి బాగున్నట్టే ఉంది.”

“నీకింకా ఆ స్టేటస్ విషయం బుర్రలోంచి పోయినట్టు లేదు. ఆయన దేవాలయంలో తన డ్యూటీస్ పద్ధతి ప్రకారం చేసుకోగలడు. ఎవరూ కలుగజేసుకోరు. దేవాలయానికి వచ్చే భక్తులందరూ ఆయన్ని గౌరవిస్తారు. నా సంగతేమిటి. నేను ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను. ఓ మారు ఒక స్టూడెంట్, వాణ్ణి స్టూడెంట్ అనకూడదు, రౌడీ వెధవ, పబ్లిక్‌గా ఓ అమ్మాయిని క్లాసులో ముద్దు పెట్టుకున్నాడు. ఆ పిల్ల తండ్రి నా దగ్గరవొచ్చి కంప్లైంట్ పెట్టినా ఏమీ చెయ్యలేకపోయేను. ఎంచేతంటే ఆ వెధవ ఒక మినిస్టరు కొడుకు. ఇప్పుడు నీకు బోధపడిందా నా స్టేటస్ ఏమిటో. అంచేత అదలా ఉండనీ. అమ్మాయికి నచ్చితేనే ముందుకెళదాం.”

“అవునులెండి. అది ఇష్టపడితేనే వాళ్లతో మాటాడండి.” అని సంభాషణకు కనకదుర్గమ్మ తెర దించింది.

రాత్రి చాల సేపటివరకు లావణ్య తండ్రి చెప్పిన సంబంధం విషయం దీర్ఘంగా ఆలోచించింది. సింహాద్రి తెలివయినవాడనుకొంది. అతడు నడిపిస్తున్న ఇన్స్టిట్యూటు ప్రస్తుతానికి బాగానే ఉంది. కాని ఎన్నాళ్లు నడుస్తుందో చెప్పలేం. మావగారు ఎవరని ఫ్రెండ్స్ అడిగితే ఇబ్బందిగా ఉంటుంది. అయితే తండ్రి పరిస్థితి ఏమిటి. పెద్ద కట్నాలిచ్చుకొనే తాహతు లేదు. గవర్నమెంటులో ఏ చిన్న ఉద్యోగం చేస్తున్నా, బేంకులో క్లర్కుగా ఉన్నా లక్షల మీద కట్నాలడుగుతారు. డేడీ చెప్పిన మాటలు చూస్తే, కుటుంబం ఫరవాలేదనుకొంది. ఈ సంబంధం కాదంటే, తను కోరుకొనేటటువంటి సంబంధం కట్నం లేకుండా దొరకడం అసంభవమనుకొంది. తన గతాన్ని నెమరు వేసుకొంది. తనూ ఇంజనీరింగు పరీక్షలు రాద్దామనుకొంది. అక్క పెళ్లికి అన్న ఒక్కమారు పెద్ద మొత్తం ఇవ్వలేకపోయేడు గాని, తన చదువుకు ప్రతి నెలా చిన్న ఏమౌంట్లు తప్పక ఇవ్వగలడనుకొంది. తను ఇంజనీరుగా పెద్ద జీతం మీద ఉద్యోగం చేస్తూంటే, ప్రతి నెలా డేడీకి డబ్బు పంపిస్తాననుకొంది. అక్క పిల్లలకు పెద్ద చదువులు చదివించగలననుకొంది. అలా ఎన్నో కలలు కంది. తన కోరిక తెలియజేస్తూ అన్నను సహాయం కోరింది. అన్న మొండి చెయ్యి చూపడంతో తన ఆశ నిరాశయింది. జీవితంలో కోరుకున్నవన్నీ దొరకవని తన్ను తాను సమాధానపరచుకొంది. అన్ని పరిస్థితులు అన్ని కోణాలలో ఆలోచించింది. డేడీ చెప్పిన సంబంధమే ఒప్పుకోడం అన్నివిధాలా ఉచితమనుకొంది. మరునాడు తండ్రితో తన నిర్ణయం చెప్పింది.

(సశేషం)

Exit mobile version