[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[గౌరీపతి బ్యాంకు క్లర్క్ పోస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్టవుతాడు. ఓ ప్రసిద్ధ ప్రభుత్వ రంగ బ్యాంకులో పోస్టింగ్ ఇస్తారు. గణపతి, అన్నపూర్ణలిద్దరూ చాలా సంతోషిస్తారు. గౌరీపతి ఈ వార్తని తన మిత్రులతో పంచుకోడానికి వెళ్తాడు. ఈ శుభవార్తని మంగకీ, మూర్తికి ఫోన్ చేసి చెప్పడానికి గణపతి పోస్టాఫీసుకు వెళ్తాడు. మంగమ్మ, శర్మతోబాటు, మూర్తి, చిట్టితల్లి కూడా సంతోషిస్తారు. ఢిల్లీలో శిక్షణ పూర్తయ్యాక, భీమవరం బ్రాంచ్‌లో జాయినవుతాడు గౌరీపతి. విజయనగరం వాస్తవ్యులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడైన హనుమంతరావుగారు తన చిన్న కూతురు లావణ్యకు పెళ్ళి సంబంధాలు చూస్తుంటారు. మూర్తి డెవలప్‍మెంట్‌కి ఇచ్చిన అపార్ట్‌మెంట్ నిర్మాణం పూర్తవుతుంది. బావలిద్దరూ కుటుంబ సమేతంగా వచ్చి గృహప్రవేశం చేసుకుని వెళ్తారు. విశాఖపట్నంలో ఉండే మార్కండేయశాస్త్రి గారి గురించి విని, భార్య కనకదుర్గమ్మతో సహా వెళ్ళి, లావణ్యకి పెళ్ళి సంబంధం గురించి, ఆయనతో మాట్లాడుతారు హనుమంతరావుగారు. తన కుటుంబ వివరాలు, తన స్తోమత అన్నీ వివరిస్తారు. తన దగ్గర ఉన్న సింహాద్రి వివరాలు వాళ్ళకి చెప్తారు శాస్త్రిగారు. ఇంటికి వెళ్ళాకా, సింహాద్రి ఫోటో లావణ్యకి చూపించి, వాళ్ళ వివరాలన్నీ చెప్పి, మర్నాడు తన అభిప్రాయం చెప్పమని అంటారు. శర్మ గుడి పూజారి అని వాళ్ళ స్టేటస్ విషయంలో కనకదుర్గమ్మ సంశయిస్తుంటే, ఆమె భయాలని భర్త త్రోసిపుచ్చుతాడు. ఆ రాత్రి లావణ్య బాగా ఆలోచించుకుని, మర్నాడు ఉదయం సింహాద్రి వాళ్ళ సంబంధాన్ని ఒప్పుకుంటుంది. – ఇక చదవండి.]
సంబంధంలో ముందుకెళ్లే విషయంలో, శర్మగారితో ఫోనులో మాట్లాడ్డమా, వివరంగా ఉత్తరం రాయడమా, అని రావుగారు భార్యతో ఆలోచించేరు. ఆవిడ స్వయంగా వాళ్ళింటికి వెళ్లి మాట్లాడ్డం మంచిదంది. ఆవిడ మనసులో శాస్త్రిగారు చెప్పిన విషయాలు వెళ్లి చూస్తేగాని తెలియవనుకొంది. ముందుగా ఉత్తరం ద్వారా తమ వివరాలన్నీ తెలియజేసి, వాళ్లకు వీలయిన రోజు స్వయంగా వచ్చి మాట్లాడతామని రాయడం మంచిదన్నారు, రావుగారు. భార్యామణి సరే అంది. లావణ్య బయోడేటా, ఫొటోతోబాటు తమ కుటుంబ వివరాలు తెలియజేస్తూ రావుగారు తమ అమ్మాయిని సింహాద్రికి ప్రొపోజ్ చేస్తూ శర్మకు ఉత్తరం రాసేరు. వారికి వీలెప్పుడో తెలియబరిస్తే స్వయంగా వచ్చి మాట్లాడతామని కూడా రాసేరు.
రావుగారి ఉత్తరం శర్మకు అందింది. ప్రక్కనే ఉన్న మంగమ్మకు వినబడేటట్టు శర్మ ఉత్తరం పూర్తిగా చదివేడు. లావణ్య ఫోటో తను చూసి మంగమ్మకు అందించేడు. మంగమ్మ పరీక్షగా చూసి, “సంసారపక్షంగా ఉంది. ఫరవాలేదు.” అని ఫోటో భర్తకు ఇచ్చింది. శాస్త్రిగారి ద్వారా ఈ సంబంధం వచ్చిందన్నాడు శర్మ.
శర్మ లావణ్య బయోడేటా మంగమ్మకు అందించేడు. అందులోని వివరాలు మంగమ్మ భర్తకు తెలియజేసింది. ఇద్దరూ, రావుగారి కుటుంబ వివరాలు, లావణ్య వివరాలు మరోమారు చూసుకొన్నారు.
“మంగా ఎలా ఉందంటావ్ ఈ సంబంధం.”
“అన్నీ బాగానే ఉన్నాయండి. అమ్మాయి బి. ఎస్సీ. చేసిందంటే మన వాడి కోరిక కూడా అదేగా. అబ్బాయికి ఉత్తరం, పిల్ల బయోడేటా, ఫోటో ఇచ్చి వాడి అభిప్రాయం అడుగుదాం. వాడేమిటంటాడో చూసి రావుగారికి రాద్దాం.” మంగమ్మ అభిప్రాయం.
“ఆ.. అలా చేద్దాం. ఏదీ, రెండు మూడు రోజుల్లో రావుగారికి తెలియజేద్దాం. ఆడపిల్లవాళ్లు. మననుండి ఏమిటొస్తుందో అని ఆత్రుతగా ఉంటారు. నేను దేవాలయానికి వెళ్లాలి. పిల్లడు లోపలకు రాగానే వాడికివి ఇచ్చి అవి చూసేక ఏమిటంటాడో కనుక్కో.”
సింహాద్రి, లావణ్య ఫోటో ఓ మారు చూసి పక్కన పెట్టేడు. రావుగారు రాసిన ఉత్తరం చదివేడు. ఆయన హెడ్ మాస్టరు చేసేరంటే పిల్లల్ని డిసిప్లిండుగా పెంచి ఉంటారు. అయినా కుటుంబం విషయం అమ్మ, నాన్నగారు చూసుకొంటారనుకొన్నాడు. తను చూడవలసిందల్లా లావణ్య వివరాలు. బి.ఎస్సీ. మంచి మార్కులతోనే పాసయింది. కాని అవి పి.జి. చెయ్యడానికి చాలవ్. అంచేతే పి.జి. చెయ్యలేదేమో. తన ఇనిస్టిట్యూటులో తనకు సహాయం చెయ్యడానికి ఫరవాలేదు. ఇంజనీరింగు కుర్రాళ్ల శిక్షణలో సాయం చేయలేకపోయినా పది, పదకొండు తరగతి స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పగలదనుకొన్నాడు. అవి స్వయంగా మాట్లాడితేగాని తెలీదనుకున్నాడు. అలా రెండు మూడుసార్లు ఆలోచించుకున్నాడు. సంబంధం నచ్చింది. సంబంధం యెడల తన సుముఖతను తల్లిదండ్రులకు తెలియజేసేడు. అమ్మాయితో మాట్లాడితేగాని నిర్ణయానికి రాలేనన్నాడు. పెళ్లిచూపుల సమయంలో ఆ అవకాశం ఉంటుందని మంగమ్మ చెప్పింది. ఆ వచ్చే మంగళవారంనాడు తమ ఇంటికి రమ్మనమని శర్మ రావుగార్ని ఫోను ద్వారా ఆహ్వానించేడు.
కథ ముందుకు వెళ్లినందుకు రావుగారు సంతసించేరు. భార్యతో ఆ సంతసాన్ని పంచుకున్నారు. వాళ్లతో ఏ విషయాలు మాట్లాడాలో బాగా ఆలోచించుకున్నారు. వారికి తను రాసిన ఉత్తరంలోని వివరాలు నెమరు వేసుకున్నారు. భార్యతోబాటు వెళ్లడమా, తానొక్కరే వెళ్లడమా అని సందిగ్ధంలో పడ్డారు. అక్కడ తెలిసీ తెలియక ఆవిడ ఏమిటి మాట్లాడుతుందేమో అని అనుమానం. తన నిర్ణయానికి తావు లేకుండా, భార్యామణి తను కూడా వస్తానని చెప్పింది. అక్కడ అనవసరమయిన ప్రస్తావన చేసి వెళ్ళిన పని పాడు చెయ్యొద్దని రావుగారు ఆమెను హెచ్చరించేరు. భార్యాభర్తలిద్దరూ మంగళవారం నాడు నవరంగపట్నంలో శర్మగారింటికి వెళ్లేరు. శర్మ, మంగమ్మ, వారిని మర్యాదగా ఆహ్వానించేరు. వచ్చిన పని ప్రారంభిస్తూ రావుగారు, “శర్మగారూ, నా ఉత్తరంలో మా కుటుంబ వివరాలు, అమ్మాయి వివరాలు మీకు పంపేను. అవికాక ఇంకేవైనా మీరు కోరితే చెప్తాను.” అన్నారు.
“అన్ని వివరాలు మీరు ఉత్తరంలో రాసేరు. మరి వేరే తెలుసుకోడానికి లేవు. మీకు మా వివరాలు శాస్త్రిగారు చెప్పేరని రాసేరు. మీకు మరేవైనా వివరాలు కావలిస్తే అడగండి.” శర్మ స్పందన.
“మరేవివరాలు అక్కర్లేదండి. మరి.. కట్నకానుకల విషయంలో మీ అభిప్రాయం ఏమిటో చెప్తే సంతోషిస్తాను.”
“శాస్త్రిగారు మీకావిషయం చెప్పలేదా.” అని శర్మ రావుగారిని ప్రశ్నార్థకంగా అడిగి, మంగమ్మ వైపు చూసేరు.
రావుగారు, కనకదుర్గమ్మ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
“రావుగారూ, మేము శాస్త్రిగారికి అనుమానం లేకుండా చెప్పేం. మాకు కట్నకానుకల కోరిక లేదని. ఆయన మీకు చెప్పలేదా.” అని శర్మ మర్యాదగా అడిగేడు..
రావుగారి దంపతులిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు.
“మేము శాస్త్రిగారికి మాకు కట్నాలక్కరలేదు; అమ్మాయిది సాంప్రదాయ కుటుంబమయి ఉండాలి; మా కుటుంబంలో అందరితో అరమరికలు లేకుండా సఖ్యంగా ఉండాలి. అని చెప్పేం.” అని మంగమ్మ కట్నాల విషయం విడమరచి ధ్రువీకరించింది.
“అమ్మా, ఆయన చెప్పేరు గాని, మరోమారు స్వయంగా తెలుసుకొందామని అడిగేను. అన్యథా భావించకండి.” రావుగారు వినయంగా కారణం చెప్పేరు.
“అందులో తప్పేమీ లేదండి. అలా ఓ మారు అనుమానం తీర్చుకోడం మంచిది.” మంగమ్మ రావుగారిని సమర్థించింది.
“శర్మగారూ, మీరు కోరిన వివరాలన్నీ తెలియజేసేను. దయచేసి మీరుభయులు మీ అబ్బాయితో బాటు మా ఇంటికి వచ్చి మా అమ్మాయితో కూడా మాట్లాడి మీ నిర్ణయం తెలియజేస్తే సంతోషిస్తాం.” అని లాంఛనంగా రావుగారు ఆహ్వానించేరు.
“సంతోషం. మీకు ముందుగా తెలియజేసి వస్తాం.” అని శర్మ స్పందించేడు.
“మీరు ఈ ఇల్లు కట్టించి ఎన్నాళ్లయ్యిందండి.” కనకదుర్గమ్మ ఆరా.
“ఇది మా మామగారు కట్టించిన ఇల్లండి. ఎప్పడు కట్టించేరో సరిగ్గా తెలీదు. మేము దానిని ఎప్పటికప్పుడు బాగుచేయిస్తూ పెరట్లో రెండు గదులు వేయించేం. మా అబ్బాయి పూర్తిగా దీన్ని వీలైనంత మోడర్న్‌గా మార్పించేడు. రండి చూద్దురుగాని.” అని అతిథులకు ఇల్లంతా చూపించేరు. సింహాద్రి ఉన్న క్లాసు రూము చూపించి వాణ్ణి పరిచయం చేసేరు. సింహాద్రి వినయంగా నమస్కరించి క్లాసులోకి వెళ్ళేడు. పక్క గదిలో పిల్లలతో సంభాషిస్తున్న అబ్బాయిని కూడా పరిచయం చేసేరు. అవన్నీ చూసి కనకదుర్గమ్మ సంతృప్తి చెందింది. నిజానికి ఆవిడ ఆ దృష్టితోనే ఇంటి ఊసు ఎత్తింది. శాస్త్రిగారు చెప్పినవన్నీ నిజమేనని నిర్ధారించుకొంది.
రావుగారు బయలుదేరే ప్రయత్నం చేసేరు. శర్మ, మంగమ్మ, కోరడంతో భోజనం చేసి ఉభయులూ విజయనగరం బయలుదేరేరు.
తమ గూటికి చేరుకున్నాక శర్మగారింట జరిగిన విశేషాలన్నీ రావుగారు లావణ్యకు చెప్పేరు. ముఖ్యంగా, అమ్మాయి అరమరికలు లేకుండా వారందరితో కలసిమెలసి ఉండాలని శర్మగారి భార్య నొక్కి నొక్కి చెప్పేరని ప్రత్యేకంగా చెప్పేరు. ప్రక్కనే ఉన్న దుర్గమ్మ, “మన పిల్ల సంగతి మనకు తెలుసుగదా. అది అందరితో కలసిమెలసే ఉంటుందండి. కాని వాళ్లు ఎప్పుడైనా దాన్ని బాధించే మాటలంటే వాళ్లతో సరదాగా ఎలా ఉంటుంది.” అని, లేనివి ఊహించుకొని అన్నాది.
“అమ్మా, మీ అమ్మ మాటలు పట్టించుకోకు. ముందునుండి చూస్తున్నాను. ఈ సంబంధం పాడు చెయ్యాలనే చూస్తున్నాది. ఆవిడగారికి శర్మగారి స్టేటస్ సరిపోలేదు. ఏ కలెక్టరు కొడుకునో చేద్దామనుకొంటోంది కాబోసు.” అని భార్యకు మెత్తగా చివాట్లు పెట్టేరు.
“నేనెందుకు సంబంధం పాడుచేస్తానండి. నేనేం దానికి సవతి తల్లినా.” అని తల్లి నోట వినగానే,
“డేడీ, మీరిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉంటే. నాకు చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉంది.” అని లావణ్య అనడంతో,
“అమ్మా, వాళ్లది చాలా కల్చర్డ్ ఫేమిలీలాగ ఉంది. వాళిద్దరూ ఎంతో మర్యాదగా మాట్లాడేరు. చాలామంది మగపెళ్లివారు వారిదే పైచెయ్యి అన్నట్టు మాట్లాడుతారు. గొంతెమ్మ కోరికలన్నీ కోరుతారు. మీ అక్క పెళ్లిలో చూసేం కదా. మనతో వాళ్లు ఎంత మర్యాదగా మాట్లాడేరో. శర్మగారు, ఆయన భార్య, నెమ్మదస్తుల్లాగ కనిపించేరు. ఆవిడ ఎడ్యుకేటెడ్ లేడీలా ఉన్నారు. అంచేత నీకు వాళ్లనుండి ఏ ఇబ్బందులూ రావనే అనుకొంటాను. అయినా వాళ్లు పెళ్లిచూపులకు వచ్చినప్పుడు నీ అనుమానాలన్నీ తీర్చుకో.” అని సలహా ఇచ్చి భార్యతో సహా నిష్క్రమించేరు.
తల్లిదండ్రులిద్దరూ వెళ్లేక, పెళ్లిపెద్ద స్టేటస్ విషయంలో తనకొచ్చిన ఆలోచనే మమ్మీకి కూడా వచ్చిందనుకొంది. డేడీకి ఆ ఆలోచన వచ్చినా బహుశా కాంప్రొమైజ్ అయిపోయేరేమో అని అనుకుంది.
ముందుగా తెలియబరచిన రోజున, శర్మ, మంగమ్మ, సింహాద్రితోబాటు రావుగారింటికి పెళ్లిచూపులకు వచ్చేరు. ఉభయకుశలోపరి అయింది. సభలో రావుగారు, ఆయన భార్యతోబాటు లావణ్య కూడా ఉంది. సంభాషణ ఎలా ప్రారంభించడమా అని కొద్ది సేపు ఆలోచించి, రావుగారు, “శర్మగారూ, మీ దేవాలయంలో భక్తుల రద్దీ ఎలా ఉంటుంది.” అని అడిగేరు.
దానికి స్పందిస్తూ, “గత నాలుగయిదు సంవత్సరాలనుండి రద్దీ బాగా పెరిగిపోయిందండి. అందులో శనివారాలు రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది.” అని శర్మ జవాబిచ్చేడు.
“పని ఒత్తిడి మీకు బాగా ఎక్కువన్నమాట.” రావుగారి అంచనా.
“మీరన్నట్లు ఆయనకు పని ఒత్తిడి ఎక్కువే. అది గ్రహించి మా వారికి సహాయపడటానికి మూడేళ్ళై మరొకాయనని కమిటీవాళ్లు వేసేరు.” మంగమ్మ అందుకుంది.
“అయితే ఫరవాలేదు.” అన్నారు రావుగారు.
తరువాత సంభాషణ రాజకీయాల్లోకి వెళ్ళింది. భ్రష్టుపట్టిన వాటి పరిస్థితి చర్చించుకున్నారు.
రాజకీయనాయకులు, వారి పిల్లలు, చేస్తున్న అఘాయిత్యాలవల్ల ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని మంగమ్మ అభిప్రాయపడింది. ఆ విషయంలో తగు చర్య తీసుకోవలసిన పోలీసువాళ్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏమీ చెయ్యడంలేదు అని అందుచేత ఆడపిల్లలకు అన్యాయమే జరుగుతోంది అంది.
మంగమ్మ మాటలు రావుగారి మనసుకు తూటాలుగా తగిలేయి.
“అవునమ్మా, మీరు చెప్పింది అక్షరాలా నిజం. కాని, ఏక్షన్ తీసుకొంటే వాళ్లని మన్యానికి ట్రాన్స్ఫర్ చేసి అష్టకష్టాలు పెడతారనే భయంతో ఏమీ చేయలేకపోతున్నారు.” అని రావుగారు తన అనుభవం నెమరువేసుకున్నారు.
“రావుగారూ, ఈ విషయాలు మనం ఎంత చర్చించినా లాభం లేదు. ప్రజలు గోల పెడుతూనే ఉన్నారు. ఆడపిల్లలకు అన్యాయం జరుగుతూనే ఉంది.” శర్మ ఆలోచన.
రావుగారు స్పందిస్తూ, “ అది నిజమేనండి. దాన్ని అలా ఉండనిద్దాం. (మంగమ్మనుద్దేశించి) అమ్మా, మీ అబ్బాయి, లావణ్యతో వేరే మాట్లాడదలచుకొంటే, వేరే గదిలోకి వెళ్లొచ్చు.” అని సలహా ఇచ్చేరు.
మంగమ్మ “ఏమిటంటావ్.” అని కొడుకు వైపు చూసింది.
సింహాద్రి, లావణ్య, అదే అపేక్షిస్తూ ఉండేవారు.
లావణ్య సింహాద్రితో వేరే గదిలోకి వెళ్ళింది. ఇద్దరూ ఎదురెదురుగా ఆసీనులయ్యేరు. సింహాద్రి చొరవ తీసుకొని, “నేను మీ కుటుంబ వివరాలు, మీ వివరాలు తెలుసుకొన్నాను. మా కుటుంబ వివరాలు, నా వివరాలు మీరు తెలుసుకొనే ఉంటారు. వాటిలో మీకు ఇంకా ఏవైనా క్లేరిఫికేషన్స్ కావలిస్తే, please feel free to ask.” అని సింహాద్రి సున్నితంగా చెప్పేడు.
“నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. అంచేత ఇన్‌స్టిట్యూట్ వర్క్‌లో ఎంతవరకు ఉపయోగపడతానో, I am not sure.” నిజం ముందుగానే చెప్పడం మంచిదనుకొని చెప్పింది.
“ఫరవాలేదు. I can take care of that. నేను ఒక రూమ్‌లో టీచ్ చేస్తూ ఉంటే, రెండో రూమ్‌లో స్టూడెంట్స్ నేనిచ్చిన వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్లని సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. I hope it is okay for you.”
“It’s okay.” లావణ్య కన్ఫర్మ్ చేసింది.
“Thank you.. alternate Saturdays I conduct test for the students. వాళ్ల answer papers ని evaluation చెయ్యాలి. దాని key ఇస్తాను. అంచేత there will not be problem. I will be always there to help.”
“Thank you.” లావణ్య చిరునవ్వుతో చెప్పింది.
“గుడ్. అంతేనా ఇంకేవైనా ఉన్నాయా.”
“Thanks. మరేవీ లేవు. What about you. మీకు కూడా ఏవైనా వివరాలు గాని clarifications గాని కావలిస్తే చెప్పండి.”
“ప్రత్యేకించి ఏవీ లేవు. మీనుండి personally ఏమిటి expect చేస్తున్నామో మీ వాళ్లు మీకు చెప్పే ఉంటారు. That is especially important to us.”
“I will always keep it in mind.”
“Thank you.”
“If you don’t mind, మీ అమ్మగారు ఎంతవరకు చదువుకున్నారో తెలుసుకోవాలని ఉంది.”
మంగమ్మ నాలుగో తరగతి వరకు చదువుకుందని, తరువాత అన్న దగ్గర పెద్ద క్లాసుల తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు నేర్చుకున్నాదని, సింహాద్రి ఆ వివరాలు చెప్పేడు.
అవి తెలుసుకొని లావణ్య ఆశ్చర్యపోయింది.
అక్కడితో వారి ఏకాంత సంభాషణ ముగిసింది.
సింహాద్రి, లావణ్య, చిరునవ్వులతో బయటకు వెళ్లేరు. వారికోసం ఎదురు చూస్తున్న పెద్దలకది శుభసంకేతాన్నిచ్చింది.
ఆ తరువాత అందరూ కొంతసేపు లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు.
రావుగారు అతిథులకు తమ నివాసం చూపించేరు.
రావుగారింట భోంచేసి, అతిధులు ముగ్గురూ, వచ్చిన టేక్సీలో తిరుగు ప్రయాణమయ్యేరు.
అతిధులు నిష్క్రమించిన తరువాత రావుగారి కుటుంబం సంబంధం విషయం మాట్లాడుకున్నారు. ముగ్గురికి సంబంధం నచ్చింది. మగపెళ్లివారి అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నారు.
పెళ్లిచూపుల సమయంలోని చర్చల్లో అందరూ పాల్గొన్నారు గాని, తన మమ్మీ నోరు కదపలేదని లావణ్య కొద్దిగా బాధపడ్డాది. కారణం, ఆమె బడిగుమ్మం తొక్కకపోడమే. తన అన్న వద్ద అన్నీ sincere నేర్చుకోబట్టే, సింహాద్రి మమ్మీ అందరితో కలసి మాట్లాడగలిగింది అనుకుంది. తన మమ్మీ విషయంలో డేడీ ఆ శ్రద్ధ తీసుకోవలసింది అని అనుకొని, సమయం చూసుకొని తండ్రితో మంగమ్మ చదువు విషయం చెప్పి, “డేడీ, మీరు మమ్మీకి అలా నేర్పవలసింది.” అని వినయంగా అంది.
“అమ్మా, పెళ్లయిన కొత్తలో మీ మమ్మీకి ఎన్నిసార్లో చెప్పేను; రోజూ ఓ అరగంటైనా నా దగ్గర తెలుగు, లెక్కలు నేర్చుకో అని. ఆవిడకు ఇంటరెస్ట్ ఉంటే గదా. ఆవిడకు ఎంతసేపూ పొల్లు బాతాఖానీలు తప్ప చదువుకొందామని తాపత్రయం లేదు. నేనేమిటి చెయ్యగలను.” అని రావుగారు చెప్పడంతో లావణ్య ఆ ప్రస్తావన అక్కడితో ఆపేసింది.
శర్మ, మంగమ్మలకు సంబంధం నచ్చింది. సింహాద్రి అభిప్రాయం అడిగేరు. సింహాద్రి తల్లిదండ్రుల అభిప్రాయంతో ఏకీభవించేడు. రావుగారికి వెంటనే సంబంధం నచ్చిందని తెలియజేద్దామనుకొన్నారు.
రావుగారికి శర్మ నుండి ఫోను వచ్చింది. తమకు రావుగారి సంబంధం నచ్చిందని తెలియజేసేడు. ఆ విషయంలో రావుగారి అభిప్రాయం కోరేడు. రావుగారు తమకు కూడా వారి సంబంధం నచ్చిందని తెలిపి ధన్యవాదాలు తెలియజేసేరు.
ఒక సుముహూర్తాన్న సింహాద్రి, లావణ్య ఒక ఇంటివారయ్యేరు.
శ్రీవల్లిపురంలో ఏం జరుగుతోందో చూద్దాం.
గౌరీపతి పనిచేస్తున్న బేంకు వారు కొత్తగా బ్రేంచిలు ఓపెన్ చెయ్యడానికి రిజర్వ్ బేంకు ఇచ్చిన 18 లైసెన్సులు వారివద్ద ఉన్నాయి. ఆ లైసెన్సులు ఉపయోగించుకుని ఆ ఊళ్లలో తమ బ్రేంచిలు త్వరగా ఓపెన్ చెయ్యడానికి ఆ బేంకు ఉన్నతాధికారులు నిర్ణయించేరు. వాటికోసం 36 మంది కొత్త ఆఫీసర్లు కావాలి. ఆ పోస్టులు భర్తీ చెయ్యడానికి ప్రస్తుతం తమ బేంకులో క్లర్కులుగా పనిచేస్తున్నవారి నుండి తగినవారిని ఎంపిక చేసుకోవాలి. కనీసం నాలుగు సంవత్సరాలు తమ బేంకులో క్లర్కులుగా పనిచేస్తున్నవారి నుండి అప్లికేషన్లు కోరుతూ, బేంకు హెడ్ ఆఫీసువారు ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేసేరు. గౌరీపతి దానికి అర్హుడయ్యాడు. సకాలంలో అప్లై చేసేడు. గౌరీపతికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. తన లెక్కన బాగానే చేసేననుకొన్నాడు. ఆరు వారాల తరువాత గౌరీపతి తన బేంకులో ఆఫీసరుగా సెలెక్ట్ అయినట్టు, మహారాష్ట్రలో పూనాలోని శనివారువాడాలో కొత్తగా ఓపెన్ చేస్తున్న బ్రేంచిలో పోస్ట్ చేసినట్లు ఆర్డర్లు అందుకున్నాడు. నమ్మలేని సత్యమనుకొన్నాడు. తల్లిదండ్రులకిద్దరికి ఆ శుభవార్త కొరియర్ ద్వారా తెలియజేసేడు. వాళ్లు చెప్పలేని సంతోషం కొడుకుతో పంచుకున్నారు. ఆ విషయం శర్మకు, మూర్తికి తెలియజేసేరు. వారితో బాటు, మంగమ్మ, చిట్టితల్లి, సంతోషం తెలియజేస్తూ అభినందించేరు.
గౌరీపతి ఆఫీసరుగా కొత్త బ్రేంచిలో జాయినయ్యేడు.
***
లావణ్య వైవాహిక జీవనం ప్రారంభమయింది. అత్తవారింట సకల సౌకర్యాలు అనుభవిస్తోంది. లావణ్యను మంగమ్మ ఆదరాభిమానాలతో చూసుకొంటోంది. భర్త ప్రేమానుగారాలకు నోచుకొంది. లావణ్య తరచూ ఫోను చేసి తను సంతోషంగా ఉన్నట్టు తల్లిదండ్రులకు చెప్తోంది. కూతురుకు మంచి అత్తవారు దొరికేరని వాళ్లు సంతోషించేరు.
సింహాద్రిని లావణ్య ‘సిమ్మా’ అని పిలవడం మొదలెట్టింది. అంతేకాదు. ‘నువ్వు’ ‘నీకు’ అని ఏకవచన ప్రయోగం కూడా. మంగమ్మ విన్నా పట్టించుకోలేదు. శర్మకు అది నచ్చలేదు. “రోజులు మారేయండి. మనవాడేమీ అనడంలేదు కదా. అది అట్టే పట్టించుకోకండి.” అని మంగమ్మ భర్తను సమాధానపరిచింది.
లావణ్య కోచింగ్ ఇనిస్టిట్యూటులో సేవలు ప్రారంభించదలిచింది. ఆ విషయం సింహాద్రికి చెప్పింది. సింహాద్రి ఒక రెండు మూడు వారాలు తన వద్ద ఉండి అవగాహన చేసుకున్నాక ప్రారంభించమన్నాడు. లావణ్య సింహాద్రితో బాటు ఇనిస్టిట్యూటుకు వెళ్లడం ప్రారంభించింది. సింహాద్రి పాఠాలు బోధపరచడం గమనించిన లావణ్య, “సిమ్మా, నీ మెథడ్ ఆఫ్ టీచింగ్ చాలా బాగుంది. నాకది నేర్చుకోడానికి టైమ్ పడుతుంది.” అంది. “ఫరవాలేదు. Take your own time. వీళ్లకి చెప్పవలసిన లెసన్స్ అన్నీ ఒక ఫైల్లో సేవ్ చేసి ఉంచేను. అవి బాగా స్టడీ చెయ్యి.” అని ధైర్యం చెప్పేడు. సింహాద్రి వద్ద పనిచేస్తున్న స్టూడెంటుకు ఫైనల్ పరీక్షలు దగ్గరపడడంతో శలవు తీసుకున్నాడు. క్రమంగా లావణ్య ఆ లోటు తీర్చింది.
లావణ్య మనసులో ఏదో ఒక తీరని బాధ. ఇక్కడ అత్తగారు ఏ పని చేయనక్కరలేదు. పనిమనిషి తన పని తను చేసుకుపోతోంది. వంటావిడకు ఆ రోజు వండవలసినవి చెబితే చాలు. మిగతాదంతా ఆవిడే చూసుకుంటుంది. సింహాద్రి అమర్చిపెట్టిన సదుపాయాలు వాడుక చేస్తూ వారిద్దరూ వారి పని వారు చేసుకుపోతున్నారు. అత్తగారు ఉదయాన్నే లేచి స్నానపానాదులు ముగించుకున్నాక తీరికిగా పూజ చేసుకుని న్యూస్ పేపరు చదువుకొంటారు. తనకు నచ్చిన ప్రోగ్రేములు రేడియోలో వింటూంటారు. మామగారు చాలావరకు తన పని తను చేసుకొంటారు. అక్కడ విజయనగరంలో తన తల్లిదండ్రులు మాటేమిటి. మమ్మీయే రెండు పూట్లా వంట వండుకోవాలి. వీలయినప్పుడు నేను చేతనయిన సాయం చేసినా, నీకెందుకమ్మా ఈ పనులు. వెళ్లి చదువుకో అనేది. పనిమనిషి తోమిపెట్టిన గిన్నెలు మమ్మీయే సద్ది ఎక్కడివక్కడ పెట్టుకోవాలి. డేడీయే వీధిలో పనులన్నీ చూసుకోవాలి. ఇక్కడ అవి సింహాద్రి చూసుకొంటున్నాడు. ఇక్కడ రోజూ బ్రేక్‌ఫాస్ట్, నాలిగింటితో భోజనం చేస్తున్నాది. అక్కడ తల్లిదండ్రులకు లేని భోజన సదుపాయం తలచుకొని మరీ బాధపడుతోంది. సింహాద్రి వలే తన అన్న తల్లిదండ్రుల బాధ్యత తీసుకొని ఉంటే వారి పరిస్థితి ఇలా ఉండేదికాదు. కాని ఏమీ చేయలేని పరిస్థితి. లావణ్య తన మనోవేదన తల్లిదండ్రులతో ఎప్పుడూ పంచుకోలేదు.
సింహాద్రి వద్ద ప్రత్యేకించి ఇంజనీరింగు పరీక్షలకే శిక్షణ పొందడానికి చేరినవారిలో బి.ఎస్సి. పాసైనవారు ఆరుగురు ఉన్నారు. లావణ్యకు అది తెలిసి ఒక ఆలోచనలో పడ్డాది. తను కూడా వారివలె ఆ పరీక్ష రాయొచ్చనుకుంది. సింహాద్రి వద్ద కోచింగు తీసుకోవచ్చనుకొంది. సింహాద్రి కోచింగులో తప్పక పాసవుతాననుకొంది. పరీక్ష పాసయితే చదువుకోడానికి సింహాద్రి తప్పక సాయం చేస్తాడని ఊహించుకొంది. ఇంజనీరింగు పాసయ్యాక అన్నలాగ పెద్ద జీతం మీద ఉద్యోగం దొరికితే తన తల్లిదండ్రులకు సకల సౌకర్యాలు సమకూర్చగలనని ఆశపడ్డాది. తను ఉద్యోగం చేస్తున్నచోటే సింహాద్రి కోచింగు సెంటరు పెట్టుకుని తను కూడా బాగా ఆర్జించగలడనుకొంది. ఇద్దరి ఆర్జనలతో లగ్జూరియస్ లైఫ్ గడపొచ్చని కలలుకంది. సమయం చూసి సింహాద్రి మంచి మూడ్‌లో ఉన్నప్పుడు ఆ విషయం మాట్లాడదలచుకొంది.
(సశేషం)
శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం నవంబరు, 1936 లో జన్మించారు. M.A. మరియు P.G. Diploma in Personnel Management పాసయ్యారు. ఉద్యోగ పర్వం, హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రారంభించి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిగా చేసి, 1994 లో విశ్రాంతి తీసుకొన్నారు. అమెరికా వాసి.
హైస్కూలు విద్యార్థిగా రంగస్థల ప్రవేశం చేసేరు. చిన్న నాటికలు రాసి, వాటిలో పాత్రలు ధరించి, దర్శకత్వం చేసేరు.
గత ఎనిమిది సంవత్సరాల నుండి రచనలు చేస్తున్నారు. ఈ నాటికి 33 కథలు, 3 నవలలు, 4 కవితలు, ఒక హాస్య నాటిక ప్రచురణమయ్యేయి.
