[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[లావణ్య సింహాద్రి సంబంధాన్ని అంగీకరించడంతో ఎలా ముందుకు వెళ్ళాలా అని ఆమె తల్లిదండ్రులు ఆలోచిస్తారు. చివరకి లావణ్య ఫోటో, బయోడేటా జోడిస్తూ, తమ కుటుంబ వివరాలన్నీ శర్మగారికి ఉత్తరం రాసి పంపుతారు రావుగారు. వారికి ఎప్పుడు వీలుగా ఉంటుందో తెలియజేస్తే అప్పుడు స్వయంగా వచ్చి మాట్లాడతామని అంటాడు. ఆ ఉత్తరం అందుకున్న శర్మ మంగమ్మకు వినబడేటట్టుగా పైకే చదువుతాడు. పిల్ల ఫోటో చూసి సంసారపక్షంగానే ఉందని అంటుంది మంగమ్మ. విశాఖపట్నం శాస్త్రి గారి ద్వారా ఈ సంబంధం వచ్చిందని భార్యకి చెప్తాడు శర్మ. సింహాద్రికి పిల్ల వివరాలు, ఫోటో చూపిస్తారు. సింహాద్రి బాగా ఆలోచించుకుని, సంబంధానికి సరేనంటాడు, కానీ ముందు అమ్మాయితో మాట్లాడాలని అంటాడు. ఓ మంగళవారంనాడు తమ ఇంటికి రమ్మనమని శర్మ రావుగార్ని ఫోను ద్వారా ఆహ్వానిస్తాడు. రావుగారు భార్యాసమేతంగా వచ్చి మరోసారి తమ వివరాలు చెప్తాడు. క్లాసు మధ్యలో బయటకి వచ్చిన సింహాద్రిని వారికి పరిచయం చేస్తాడు శర్మ. సింహాద్రి వాళ్ళకి నమస్కరించి, తిరిగి గదిలోకి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత లావణ్యకి అన్నీ వివరిస్తారు. అనుకున్న రోజున శర్మ, మంగమ్మ, సింహాద్రి పెళ్ళిచూపులకి రావుగారింటికి వెళ్తారు. లావణ్య, సింహాద్రి ఏకాంతంగా మాట్లాడుకుంటారు. వారిద్దరూ ఒకరికొకరు నచ్చేస్తారు. ఓ శుభముహూర్తాన వాళ్ళ పెళ్ళి జరిగిపోతుంది. అక్కడ గౌరీపతి బ్యాంకు ఇంటర్నల్ ఎగ్జామ్ రాసి ఆఫీసర్ అవుతాడు. పెద్దలందరూ అభినందిస్తారు. లావణ్య అత్తవారింట కొత్త కాపురం ప్రారంభిస్తుంది. భర్తని ఏకవచనంతో పిలవడం ఆమె మామగారికి నచ్చదు. మంగమ్మ భర్తని సమాధానపరుస్తుంది. తండ్రికి ఆర్థికంగా సాయం చేయాలని అనుకుంటున్న లావణ్యకి ఓ కొత్త ఆలోచన వస్తుంది. మంచి మూడ్‌లో ఉన్నపుడు భర్తకి చెప్పాలని భావిస్తుంది. – ఇక చదవండి.]
గౌరీపతి బేంకులో ఆఫీసరయ్యేడు గదా. ఒకమాటు వాడెలా ఉన్నాడో చూద్దాం. తల్లిదండ్రులకు సహాయపడుతుందని వారికి ఇంట ఫోను సదుపాయం కలుగజేసేడు. బేంకులో ఆఫీసరంటే ఎందరో కోరుకొనే పెళ్లికొడుకే గదండి. అలాగే, గౌరీపతికి తమ కుమార్తెలను ఆఫర్ చేస్తూ గణపతికి ముగ్గురు ఉత్తరాలు రాసేరు. వాటిలో రెండు, గణపతికి అన్నపూర్ణకు సుమారుగా నచ్చేయి. మన హీరో ఏమిటంటాడో తెలుసుకోడానికి ఆ మూడు, వాటితో వచ్చిన బయో డేటాలు, ఫోటోలు, కొరియరులో పూణే పంపించేరు. తిరుగు టపాలో గౌరీపతి తల్లిదండ్రుల చెంత చేరేడు. బేంకులో ఆఫీసరుగా ఉన్న కొమరుని చూసి ఇద్దరూ మురిసిపోయేరు. గౌరీపతి స్నానం చేస్తున్న సమయంలో గణపతి అన్నపూర్ణతో, “నాకు కొద్దిగా పని ఉంది. నేను వెళుతున్నాను. ఆ సంబంధాల విషయంలో పిల్లడు ఏమిటంటాడో కనుక్కో.” అని సలహా ఇచ్చి నిష్క్రమించేడు.
గౌరీపతి సోఫాలో కూర్చున్న తల్లిప్రక్కను ఆసీనుడై, “అమ్మా, నాన్నగారెక్కడున్నారు.” అని అడిగేడు.
“ఏదో పనిమీద వెళ్లేరు, నాన్నా. మీ నాన్నగారు పంపించిన కొరియరు నీకు అందిందా.” అని అన్నపూర్ణ అడిగింది.
“అందిందమ్మా. ఆ విషయం మాట్లాడ్డానికే వచ్చేను.”
“వాటిలో నీకు ఏది నచ్చింది, నాన్నా.”
గౌరీపతి సోఫా దిగి, తల్లి ఎదుట మోకాళ్లపై కూర్చొని, ఆవిడ రెండు అరచేతులను పట్టుకొని, “అమ్మా, నీతో ఒకటి చెప్పడానికే వచ్చేను. నువ్వు కోప్పడనంటే చెప్తాను.”
“నీకు ఏవీ నచ్చలేదా. అందులో కోప్పడడానికేముంది. చెప్పు.”
“అమ్మా, నేనొక అమ్మాయిని పెళ్లిచేసుకుందామనుకొంటున్నాను.”
“ఇదెప్పటినుండిరా. ఎవర్రా ఆ అమ్మాయి.” అని ఆశ్చర్యపోయి అడిగింది.
“ఆ అమ్మాయి పేరు మాధురి, అమ్మా. నేను పనిచేస్తున్న బేంకులోనే జబల్పూరులో నాలాగే ఆఫీసరుగా పనిచేస్తోంది.”
“ఎక్కడన్నావ్.”
“జబల్పూరమ్మా.”
“అదెక్కడుంది.”
“మధ్యప్రదేశ్‌లో ఉందమ్మా.”
“నాకంతా గందరగోళంగా ఉంది. ఇద్దరూ, వేరు వేరు ఊళ్లు, అందులోను అంతంత దూరాల్లో ఉంటే కాపురం ఎలా చేస్తారురా.”
“మా బేంకులో, మొగుడు పెళ్ళాలికి ఒకే ఊళ్లో పోస్టింగు ఇస్తారమ్మా. అంచేత పెళ్ళయ్యేక ఇద్దరం ఒకే ఊళ్లో ఉంటాం.”
“ప్రస్తుతం నువ్వొక ఊళ్ళోను ఆ అమ్మాయి వేరే ఊళ్ళోను పనిచేస్తున్నారు కదా, మీ ఇద్దరికీ పరిచయమెలా అయిందిరా. నాకు బోధపడడం లేదు.”
“నేను ఆఫీసరుగా జాయినయిన నెల్లాళ్ళ తరువాత మూడు నెలల ట్రైనింగుకి ఢిల్లీ వెళ్లేను కదమ్మా. ఆ ట్రైనింగుకి మాధురి కూడా ఢిల్లీ వచ్చింది. అక్కడ మా ఇద్దరికీ పరిచయమయింది. ఇద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాక పెళ్లిచేసుకొందామని నిశ్చయించుకున్నామమ్మా.”
“ఏమిట్రా, ఈ కథ.. సరే, వాళ్లది ఏ ఊరు.”
“హైదరాబాదమ్మా.”
“హైదరాబాదా.. ఆ అమ్మాయి కుటుంబం గూర్చి నీకేమయినా తెలుసా.”
“తెలుసమ్మా. మాధురి వాళ్ల నాన్నగారు, హైదరాబాదులో ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజరుగా పని చేస్తున్నారమ్మా.”
“ఆయన పేరేమిటి.”
“మాధవన్ నాయర్.”
ఆ పేరు విన్న తక్షణం, షాక్ తగిలినట్లు అన్నపూర్ణ గౌరీపతి చెయ్యి చిరాకుగా విదిలించుకుని,
“ఏమిటన్నావ్ ఆయన పేరు.”అని, గట్టిగా దమాయించి అడిగింది.
“మాధవన్.. నాయర్.” అని బితుకు బితుకుమంటూ, జవాబిచ్చేడు, గౌరీపతి.
“మా..ధ..వన్ .. నా.య.రా .. ఎక్కడివాళ్లురా వాళ్లు. మన వాళ్లేనా.” అన్నపూర్ణలో ఆవేశం పెరుగుతోంది.
“మలయాళీలమ్మా. మనవాళ్లు కాదు.” హీనస్వరంతో జవాబు.
“నీకేమయినా మతి పోయిందా. మలయాళీ.. పిల్ల.. మనవాళ్లు.. కాదు. (అని ప్రతి పదం నొక్కి నొక్కి అంటూ) దాన్ని ఈ ఇంటి కోడలుగా తెద్దామనుకొంటున్నావా. ఇది ఎంత మాత్రం జరిగేది కాదు. మీ నాన్నగారికి తెలిస్తే ఏమిటి చేస్తారో చెప్పలేను. మనది తరతరాల నుండి సాంప్రదాయమైన కుటుంబంరా. నా మాట విను. నువ్వా విషయం మర్చిపో. నిక్షేపంలాంటి సంబంధాలొచ్చేయిరా. వాటిలో ఒకాయన ఏదో పెద్ద బేంకు; పేరు మర్చిపోయేను. అందులో ఆయన జనరలు మేనేజరు చేస్తున్నారు. పిల్ల ఎమ్మే పాసయింది. ఫోటో చూసేను. ముఖంలో లక్ష్మీ కళలున్నాయ్. మిగిలిన రెండు సంబంధాలు కూడా బాగున్నాయి. వాటిలో నీకేది నచ్చిందో చెప్పు. ఆ మూడు కాకపోతే, మంచి సంబంధాలు ఇంకా వస్తాయ్.”
“అమ్మా, నేను, మాధురి, మూడు నెలలు ఎన్నో విషయాలు మాట్లాడుకొని, ఒకరి అభిప్రాయం ఒకరు తెలుసుకున్నాం. ఇద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాక పెళ్లిచేసుకొందామని నిర్ణయించుకున్నాం. నువ్వు చెప్తున్న సంబంధాల విషయంలో, అమ్మాయిని ఒక్కమారు కలసుకుని, ఓ అరగంటో, గంటో, మాట్లాడుకొంటే, ఒకరి గురించి ఒకరు ఏమిటి తెలుసుకోగలం. చెప్పమ్మా. తరువాత అభిప్రాయబేధాలొస్తే, జీవితంలో సుఖం ఉండదు.”
“అంటే, నీ ఉద్దేశంలో చిట్టితల్లికి సింహాద్రికి జీవితంలో సుఖం లేదంటావా. నీకు తెలుసో తెలీదో, నేను, మీ నాన్నగారు, మా పెళ్లిలోనే ఒకరినొకరు చూసుకొన్నాం. మాకు జీవితంలో సుఖం లేదంటావా.”
“అమ్మా, మీ సంగతి వేరు.”
అన్నపూర్ణకు కోపంతో ఆవేశం వచ్చింది.
“ఏమిట్రా.. మా సంగతి వేరు. నీ లాగ ఇంగ్లీష్ చదువులు చదువుకోలేదనా. మేము నీలాగ దొరల వేషాలు వెయ్యకపోయినా, మాకు సంస్కారం ఉందిరా. తరతరాలనుండి వస్తున్న కుటుంబ విలువల్ని మా స్వార్థం కోసం మట్టిలో కలపలేదురా.”
“క్షమించమ్మా. నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడలేదు. మేమిద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకొన్నామనే అన్నానమ్మా.”
“నువ్వు చెప్పదలచుకొన్నదేమిటంటే, మీరిద్దరూ ఒకరిమీద ఒకరు ప్రేమ ఒలకపోసుకొన్నారు. అదేనా.”
“ప్రేమించుకున్నామమ్మా.”
“నాకు తెలీక అడుగుతాను. మాలో ఎవ్వరికీ ఒకరిమీద ఒకరికి ప్రేమ లేదంటావా. అంతలా నెలల తరబడి ఒకరినొకరు అర్థం చేసుకొని, ప్రేమించుకున్నాక జరిగిన కొన్ని పెళ్లిళ్లు విడాకులు దాకా ఎందుకు వెళుతున్నాయిరా.. చెప్పు.”
గౌరీపతి స్పందించలేదు.
“నువ్వా పెళ్లి చేసుకొంటే మేము జీవితమంతా బంధువులు నలుగురెదుటా తలెత్తుకు తిరగలేమురా. బంధువులందరూ మీ నాన్నగారిని ఎంత గౌరవిస్తున్నారో నీకు తెలుసు గదరా. ఎక్కడినుండి వచ్చిందిరా నీకీ పాడు బుద్ది. మీ నాన్నగారు అంటూనే ఉండేవారు. చెడు సహవాసాలతో నువ్వు చెడిపోతావని. నేనే వెర్రిదాన్ని. నిన్ను నమ్మేను. నీకు జ్ఞాపకముందా. నీ చిన్నప్పుడు, నువ్వు సిగరెట్టు తాగేవని తెలియగానే నిన్ను బడి మాన్పించిస్తానన్నారు మీ నాన్నగారు. అప్పుడు నేను చెప్పబట్టే మీ నాన్నగారు తగ్గేరు. ఆ రోజు నేనలా చెప్పకపోతే నువ్వీ రోజు బేంకులో ఆఫీసరుగా ఉండగలిగేవాడివా. ఈ ప్రేమకలాపాలు జరిగుండేవా. చెప్పు.”
వస్తున్న కోపాన్ని దిగమ్రింగుకొని, “నా మీద నీకు ఏమాత్రం గౌరవమున్నా నా మాట విను. నీ మంచి కోరి చెపుతున్నాను. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. ఆ అమ్మాయికి చెప్పీ. మా వాళ్లు ఒప్పుకోడం లేదని. నీ మలయాళీ వ్యవహారం నాన్నగారికి తెలిస్తే ఏమిటి చేస్తారో నేను చెప్పలేను. మీ నాన్నగారు వచ్చేలోపల నేను చెప్పిన సంబంధాలలో ఏది నచ్చిందో ఆలోచించుకు చెప్పు. నా మాట విను నాయనా.” అని నెమ్మదిగా హితోపదేశం చేసింది.
గౌరీపతి తల దించుకొనే తల్లి చెప్పినవన్నీ విన్నాడు.
“ఊ అనవ్. ఆ అనవ్. నేను చెప్పినవన్నీ నీ చెవికెక్కేయా.”
“అన్నీ విన్నానమ్మా.”
“అయితే చెప్పు. ఏమిటంటావ్.”
“నేను పూణే వెళ్ళేక రెండు రోజుల్లో ఆలోచించుకు చెపుతానమ్మా.”
“నేను చెప్పిన సంబంధాలేనా.”
“ఆ..”
“మీ ఊరు వెళ్ళగానే మొట్టమొదట ఆ మలయాళీ అమ్మాయికి మావాళ్లు ఒప్పుకోలేదని చెప్పీ. తరువాత ఈ వచ్చిన సంబంధాలలో ఏది నచ్చిందో ఫోన్ చేసి చెప్పు. బోధపడిందా.”
“ఆ.. బోధపడింది. (కొన్ని క్షణాలు ఆగి) అమ్మా, నిద్దరొస్తున్నాది. వెళ్లి పడుకొంటానమ్మా. పొద్దున్నే బయలుదేరాలి.”
“అదేమిటి, ఎన్నాళ్ల తరవాతో వచ్చేవ్. రెండు రోజులున్నాక వెళుదువుగాని.”
“లేదమ్మా. ఎల్లుండి డ్యూటీకి వెళ్లాలి. మరోమాటు వచ్చి వారం రోజులుంటాను.”
“సరే. ఓ అరగంట ఆగు. భోంచేసి పడుకుందువుగాని.”
“సరేనమ్మా.”
గౌరీపతి భోజనం చేసి పడుకొన్నాడు.
మరో అరగంటలో గణపతి వస్తూనే, “అన్నపూర్ణా, వాడికి వాటిలో ఏ సంబంధం నచ్చింది.” అని. ఆత్రుతగా అడిగేడు.
“ఇలా రండి.”అని భర్తను తమ గదిలోనికి తీసుకెళ్లి మెల్లగా కొడుకు ప్రేమపురాణం చెప్పింది. గణపతి అది వినగానే, “ఎక్కడున్నాడు, ఆ వెధవ. ఇది ఎవరి ఇల్లనుకొన్నాడు.” అని ఇంకా గర్జిస్తూ ఉంటే, భర్త నోటికి తన అరచేయి అడ్డుపెట్టి, “శాంతంగా వినండి. నేను వాడికి పెట్టవలసిన చీవాట్లన్నీ పెట్టేను. ఆ మలయాళీ పిల్లని మరచిపో అని గట్టిగా చెప్పేను. వాళ్ల ఊరు వెళ్ళగానే ఆ అమ్మాయికి ఆ విషయం చెప్పి, వచ్చిన మూడు సంబంధాలలోనూ ఏది నచ్చిందో చెప్పమన్నాను. అలా పోరి పోరి చెప్పగా దారిలోకి వచ్చేడు. సరే అన్నాడు. ఇప్పుడు మీరు మళ్ళీ వాడిని తిడితే, కథ ముందుకు వస్తుంది. అంచేత, ఓపిక పట్టండి. మన రక్తం పంచుకు పుట్టేడండి. తప్పు దిద్దుకొంటాడు. వాడి చిన్నప్పుడు మనం చెప్పగానే వాడు చేసిన తప్పు దిద్దుకొన్నాడు గదండి. ఆ తరువాత మరే తప్పు చెయ్యలేదు. ఏదో తెలిసో తెలియకో తప్పు చేసేడు. తప్పక తప్పు దిద్దుకొంటాడండి.”
“సరే, నీకు అంత నమ్మకముంటే, నేనా విషయం వాడితో ఎత్తను.”
“మనం అన్నింటికీ ఆ దేముణ్ణే నమ్ముకొంటున్నామండి. ఈ భారం కూడా ఆ దేముడిమీదే వేద్దాం.” అని చెప్పి భర్తను భోజనానికి రమ్మంది.
గౌరీపతి ఉదయాన్నే లేచి, తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి పూణేకి బయలుదేరేడు. పూణే వెళ్ళేక పెళ్లి విషయంలో ఏ నిర్ణయం తీసుకోడానికి గౌరీపతికి కొంత టైము పడుతుంది. ఊరకనే ఉండడం ఎందుకు. ఈ లోగా మన నూత్న దంపతులు ఏం చేస్తున్నారో చూద్దాం.
***
నవరంగపట్నంలో సింహాద్రి, లావణ్య దంపతులు తమ హానీమూన్ ప్రొగ్రాము చర్చించుకొంటున్నారండి. మొదట కాశ్మీరు వెళదామనుకున్నారు. అక్కడ సెక్యూరిటీ సమస్యలు ఎలా ఉంటాయో తెలీదని ఆది డ్రాప్ చేసుకున్నారు. మరో రెండు మూడు ప్రదేశాల వివరాలు తెలుసుకున్నాక అవి కూడా ప్రత్యేకంగా హానీమూన్‌కు తగ్గట్టు లేవనుకున్నారు. ఆఖరకు వాళ్ల శోధన కేరళలోని ఒక హిల్ స్టేషన్, మున్నార్ వద్ద ఆగింది. మున్నార్, పశ్చిమ కనుమల పర్వతశ్రేణిలో 1600 మీటర్ల ఎత్తులో ఉంది. మున్నార్‌ను ‘దక్షిణ భారత కాశ్మీర్’ అని కూడా అంటారు. కాశ్మీర్ కాని కాశ్మీర్ చేరుకోడానికి ఏర్పాట్లు అయ్యేయి. మున్నార్‌లో ఉండడానికి గ్రేండ్ ప్లాజా మున్నార్ హోటల్లో రిజర్వేషన్ అయింది. విశాఖపట్నం నుండి కొచ్చిన్ వరకు ఫ్లైట్ లో వెళ్లడానికి రానూ పోనూ రిజర్వేషన్లు చేసుకున్నారు. కొచ్చిన్ నుండి మున్నార్ 104 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రయాణం టేక్సీ చేయించుకు వెళ్ళాలి.
హానీమూన్ దంపతులు, మున్నార్ లో గ్రేండ్ ప్లాజా మున్నార్ హోటల్ లోని ఒక సూట్లో ప్రవేశించేరు. సామాను ఇంకా సద్దుకోనేలేదు. తమ సూట్ నుండి కనిపిస్తున్న ప్రకృతి సౌందర్యం వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేసింది. “సిమ్మా, ఇటు చూడు. ఎంత బాగుందో.” అని లావణ్య అంటే, “లవ్, ఇటు చూడు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో.”అని సింహాద్రి అటు చూపించేడు. తొలిసారి జీవితంలో అంతటి ప్రకృతి సౌందర్యం చూసి వారిరువురూ ఎనలేని సంతోషాన్ని చవి చూస్తున్నారు. ఉన్న మూడు రోజులూ మున్నార్ సౌందర్యాన్ని ఆనందించేరు. నలుప్రక్కలా భూమి కానరాకుండా ఆకుపచ్చని తివాసీలు కప్పినట్టుంది. చుట్టూ ఉన్న కొండలపై రెండు శతాబ్దాల నుండి సాగు చేస్తున్న తేయాకు తోటలు ఆ ఇరువురూ సందర్శించేరు. గులాబీల తోటలు వాళ్ల కళ్లకు విందు చేసేయి. మున్నార్‌కు దగ్గరలోనున్న ఎరవకులం నేషనల్ పార్క్‌కు వెళ్లేరు. ఆ పార్కుకు ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది. నీలగిరి తార్ అనే, అంతరించిపోతున్న ఒక జాతి మేకలు కేవలం నీలగిరి కోండలలోనే నివసిస్తున్నాయి. ఆ మేకలకు వంకలు తిరిగిన కొమ్ములుండడం విశేషం. అవే కాకుండా అరుదైన సీతాకోక చిలుకలు, పక్షులు కూడా ఉన్నాయి. మన జంట తీరిగ్గా వాటన్నింటిని చూసేరు.
హానీమూన్ దంపతులు అయిదు రోజులలో మున్నారులో ముఖ్యముగా చూడవలసినవి చూడడమయింది. మరునాడు తిరుగు ప్రయాణం. ఇద్దరూ ఉల్లాసంగా ఉన్నారు. తన ఇంజనీరింగు చదువు విషయం సింహాద్రికి చెప్పడానికి అది సరైన సమయమనుకొంది లావణ్య.
“సిమ్మా, నాదొక కోరిక. నువ్వు తీరుస్తానంటే చెప్తాను.”అని శృంగారభంగిమలో ప్రియుడినడిగింది.
“ఆ కోరికేమిటో చెప్పు.”అని తన వక్షస్థలంపై వాలియున్న ప్రియురాలి జుట్టు అరచేతి వేళ్లతో నిమురుతూ అడిగేడు.
“సిమ్మా, నువ్వు తీరుస్తానంటే చెప్తాను.”
“లవ్, నేను తీర్చగలిగినదయితే తప్పక తీరుస్తాను. చెప్పు.”
“నాకు ఇంజనీరింగు ఎంట్రన్స్ రాయాలని ఉంది.”
“ఏమిటీ.. ఇంజినీరింగ్ ఎంట్రన్సా.”
“అవును. ఇంజినీరింగ్ ఎంట్రన్సే, సిమ్మా. నువ్వు దానికి కోచింగ్ ఇవ్వాలి.”
“లవ్వూ, జోక్ చేస్తున్నావా.”
“జోక్ కాదు. సీరియస్‌గా చెపున్నాను, సిమ్మా.”
“నువ్వు సీరియస్ గా చెప్పినా, ఎలా చెప్పినా, that is impossible. ఎవడిచ్చేడు నీకీ ఐడియా. అయినా, దేనికోసం ఇంజనీరింగు ఎంట్రన్స్ రాద్దామనుకొంటున్నావు.” అని, తన వక్షస్థలంపై వాలియున్న లావణ్యను ఒక్కమారుగా విదిలించుకొని అడిగేడు.
“అదేమిటి అలా అడుగుతున్నావ్. ఎంట్రన్సు పాసయితే ఇంజనీరింగు చదివి ఉద్యోగం చేస్తాను.”
“ఉద్ధరిస్తావ్. ఎక్కడ చేస్తావ్, ఉద్యోగం.”
“ఇప్పుడేమిటి చెప్పగలను. ఎక్కడ దొరికితే అక్కడ చేస్తాను.”
“ఓహో, అంత తెలివితేటలున్నాయన్నమాట. నువ్వు ఉద్యోగానికి ఏ ఊరో వెళిపోతే, What about our married life.”
“ఇద్దరం ఒక చోటే ఉంటాం, సిమ్మా.”
“ఏమిటి, నీకు మతి పోయిందా. ఏమిటి మాట్లాడుతున్నావ్. ఇద్దరం ఒకే చోట ఎలా ఉంటాం.”
“నేనెక్కడ ఉద్యోగం చేస్తే. అక్కడకు నువ్వు వస్తావు. ఇద్దరం ఒకే చోట ఉంటాం.”
“నేనేం నీ పెంపుడుకుక్కననుకొన్నావా, నువ్వెక్కడికి వెళితే అక్కడికి నీ వెంటా రాడానికి. నాకో ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉంది. That is giving me bread and butter.”
“నేనున్న ఊళ్లోనే నువ్వు ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చెయ్యొచ్చు గదా. అక్కడ కూడా ఇలాగే సక్సెస్ అవుతుంది. మన ఇన్కమ్ కూడా డబుల్ అవుతుంది.”
“Fantastic idea (వ్యంగ్యంగా). ఇన్స్టిట్యూట్ నడపడం అంటే, రోడ్డు పక్కన పలీలు అమ్ముకోడం కాదు, మేడమ్. ఈ స్టేజికి దాన్ని తీసుకురాడానికి నాకు నాలుగేళ్లు పట్టింది. అదలా ఉండనీ. What about my parents. నేను నీ వెంటా వస్తే, ఇక్కడ వాళ్ళని ఎవరు చూస్తారు.”
“వాళ్లిక్కడ కంఫర్టబుల్‌గా ఉన్నారు గదా. కాకపోతే, వాళ్లని కూడా మన దగ్గరకు తీసుకెళ్లవచ్చు.”
“Stop talking nonsense.”
“ఇందులో నాన్సెన్స్ ఏమిటుంది. What is possible చెప్పేను.”
“Hear me. నా పేరెంట్సుని వదలి నేనెక్కడికీ.. వెళ్లను. వాళ్లు ఇక్కడే.. ఉంటారు. బోధపడిందా. అయినా You tell me. ఇంత ఇంపార్టెంట్ విషయం పెళ్లిచూపుల టైములో మనం వేరే మాట్లాడుకొన్నప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు. అప్పుడే చెప్పుంటే ఈ situation రాకపోను. మన పెళ్లే జరిగుండేది కాదు. It is a preplanned one.”
“ఇదేమీ preplanned కాదు. ఇన్స్టిట్యూట్లో నీ కోచింగ్ చూసేక నాకు తట్టింది.”
“ఈ కాకమ్మ కథలు నాకు చెప్పకు. I am not a fool to believe your words.”
“నేను ఫేక్ట్ చెప్పేను. నువ్వు నమ్మకపోతే, I can’t help it.”
“I don’t want to waste my time anymore. No further discussion. Your proposal is not acceptable to me.”అని, ఒక్కొక్క పదం నొక్కి నొక్కి చెప్పేడు.
“మీ మగవాళ్లంతా ఇంతే. ఆడవాళ్లని డెవలప్ కానివ్వరు.” అని దూరంగా పోయి పడుకుంది, లావణ్య.
“నువ్వు నన్ను మోసం చేసేవ్. నీలాగ నేను ఆడవాళ్లందరూ మోసాలు చేస్తారనను. అది నా కల్చర్.” అని, వెళ్లి దూరంగా సోఫాలో పడుకొన్నాడు.
ఇద్దరూ ఒకరితోనొకరు మాట్లాడకుండా, తిరుగు ప్రయాణమయి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు.
“నేను నా పేరెంట్సుని కలసుకోడానికి విజయనగరం వెళతాను.” అని, లావణ్య తన బేగేజ్ చేత పట్టుకుని సింహాద్రి వైపు చూసి ముక్తసరిగా చెప్పింది.
“ఎలా వెళతావ్.”
“టేక్సీలో.”
“ఒక్కదానివి టేక్సీలో వెళ్లడం not advisable. నేను వచ్చి డ్రాప్ చేస్తాను.”
“Thanks. No need.”
“కేష్ ఉందా.”
“ఊ..”
సింహాద్రి టేక్సీ మాట్లాడేడు. లావణ్య అందులో కూర్చొంది.
“అత్తగారిని, మామగారిని అడిగేనని చెప్పు.”
“ఊ”
సింహాద్రి టేక్సీ నంబరు, డ్రైవరు పేరు నోట్ చేసుకుని టేక్సీలో నవరంగపట్నం వెళ్లేడు.
లావణ్య పుట్టినిల్లు చేరుకుంది. అరగంటలో సింహాద్రి నుండి ఫోను వచ్చింది. లావణ్య ఫోను ఎత్తుకుంది. పక్కనే ఉన్న తల్లి, “ఎవరమ్మా, ఆ ఫోను.” అని అడిగింది. “మీ అల్లుడు.” అని చెప్తూండగానే, సింహాద్రి అది విని ఇహ తను మాట్లాడనక్కరలేదని ఫోన్ కట్ చేసేడు. లావణ్యకు ఒళ్లు మండింది. తల్లి ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే, “అమ్మా, నేను బాగా అలసిపోయేను. స్నానం చేసి పడుకొంటాను.” అంది, లావణ్య.
“అవునమ్మా, దూర ప్రయాణం చేసేవ్. బాగా అలసిపోయి ఉంటావ్. భోజనం తయారుగా ఉంది. స్నానం చేసేక భోంచేసి పడుకో అమ్మా.” అని తల్లి సలహా ఇచ్చింది. లావణ్య స్నానం చేసి, ఏవో నాలుగు ముద్దలు నోట్లో వేసుకొని తన గదిలోకి పోయి తలుపులు మూసుకొని పక్క మీద వాలిపోయింది. జరిగినదంతా నెమరు వేసుకొంటూ మథనపడుతోంది. తను ఉద్యోగం ఎందుకు చేయదలచిందో విడమరచి చెప్పి ఉంటే బహుశా సింహాద్రి అంగీకరించి ఉండేవాడేమో అని ఒక ఆలోచన. తల్లిదండ్రులను విడిచి రానని సింహాద్రి నిస్సందేహంగా చెప్పేడు. అందుచేత అది జరిగి ఉండేది కాదు అనుకొంది. మొదట్లో, సింహాద్రిని రిక్వెస్ట్ చేసి ప్రతి నెలా తన తండ్రికి సొమ్ము పంపుదామనుకొంది. దానికి సింహాద్రి సహకరించినా తన తండ్రికి ఆత్మాభిమానం అడ్డొచ్చి, ఒప్పుకొనేవాడుకాడనుకొంది. అందుచేత ఆ ఆలోచన విరమించుకుంది. ఆలోచించి, ఆలోచించి, తను ఉద్యోగం చేసి, తన ఆర్జనలోనుండి ఆ పని చేస్తే తండ్రికి అభ్యంతరం ఉండదనుకుంది. కాని అదెలా సంభవం. ఆలోచించగా ఆలోచించగా ఈ ప్రణాళిక తట్టింది. తల్లిదండ్రులకు ఏదో చేద్దామనే చింత తప్ప, లావణ్య ఆ విషయం సుదీర్ఘంగా అన్ని కోణాలలోను ఆలోచించలేకపోయింది. తను చేసినదాంట్లో తప్పు లేదనుకోంటోంది. ఒక సత్కార్యం చేద్దామనుకోడం అభినందనీయమే. కాని, అది ఎంతవరకు సంభవమో ముందుగా తెలుసుకోకపోతే, చిక్కులు కొని తెచ్చుకోడమే అవుతుంది. అదండి, మన లావణ్య పరిస్థితి.
(సశేషం)
శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం నవంబరు, 1936 లో జన్మించారు. M.A. మరియు P.G. Diploma in Personnel Management పాసయ్యారు. ఉద్యోగ పర్వం, హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రారంభించి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిగా చేసి, 1994 లో విశ్రాంతి తీసుకొన్నారు. అమెరికా వాసి.
హైస్కూలు విద్యార్థిగా రంగస్థల ప్రవేశం చేసేరు. చిన్న నాటికలు రాసి, వాటిలో పాత్రలు ధరించి, దర్శకత్వం చేసేరు.
గత ఎనిమిది సంవత్సరాల నుండి రచనలు చేస్తున్నారు. ఈ నాటికి 33 కథలు, 3 నవలలు, 4 కవితలు, ఒక హాస్య నాటిక ప్రచురణమయ్యేయి.
