[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[సింహాద్రి ఇంటికొచ్చాక లావణ్యకీ తనకీ మధ్య జరిగిన వాదోపవాదాల గురించి ఆలోచిస్తాడు. మథనపడుతూ నిద్రపోతాడు. రెండు రోజులు పోయాకా లావణ్య తల్లిదండ్రులు అసలేం జరిగిందో ఆరా తీసి, ఆమె ప్రవర్తన, ఆలోచనా తప్పని తేల్చి ఆమెని మందలిస్తారు. సింహాద్రి కూడా జరిగినదంతా తల్లికి చెప్తే, లావణ్య మోసం చేసే మనిషి కాదని అంటుంది. తానే కోడలికి ఫోన్ చేస్తుంది. తన పొరపాటు గ్రహించిన లావణ్య, అత్తగారు ఫోన్ చేయడంతోనే అత్తగారింటికి వచ్చేయడానికి సిద్ధపడుతుంది. మర్నాడు సింహాద్రిని పంపిస్తాననీ, ప్రయాణానికి సిద్ధంగా ఉండమని లావణ్యకి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మంగమ్మ. మర్నాడు తమ ఇంటికి వచ్చిన అల్లుడిని సాదరంగా ఆహ్వానిస్తారు రావుగారూ, కనకదుర్గమ్మ. సింహాద్రి వాళ్ళిద్దరికీ నమస్కరిస్తాడు. పలహారం, కాఫీ అయ్యాకా, లావణ్య, సింహాంద్రి ఏకాంతంగా మాట్లాడుకుని అపోహలు తొలగించుకుంటారు. మర్నాడు బయల్దేరి తమ ఇంటికి చేరుతారు. రెండు రోజులు గడిచాకా, అత్తగారు ఒంటరిగా ఉన్న సమయం చూసి, జరిగినదంతా చెప్పి క్షమాపణలు కోరుతుంది లావణ్య. ‘నీ పరిస్థితిలో ఏ ఆడపిల్ల ఉన్నా తల్లిదండ్రుల గూర్చి నువ్వు ఆలోచించినట్టే ఆలోచిస్తారు. అందుచేత బాధపడకు’ అని ఓదారుస్తుంది మంగమ్మ. మామగారికి కూడా చెప్తాను అని లావణ్య అంటే, తాను చెప్తానులే అంటుంది మంగమ్మ. అలా సింహాంద్రి లావణ్యల వ్యవహారం కొలిక్కి వస్తుంది. – ఇక చదవండి.]
గౌరీపతి ఇంటినుండి వెళ్లేక అన్నపూర్ణ చిట్టితల్లికి ఫోన్ చేసి మలయాళీ వ్యవహారం చెప్పబోతూ ఉంటే, “అమ్మా, ఆ కథంతా నాకు ముందే తెలుసు. తమ్ముడు చెప్పేడు. నీకు రికమెండు చేయమన్నాడు. నేను వాడికి అప్పుడే చెప్పేను. నాకే ఇష్టం లేనిది అమ్మకి ఎలా రికమేండ్ చేస్తానని. ఆ.. మరో విషయం అమ్మా. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి కూడా అది ఎంతమాత్రం ఇష్టం లేదట.”
“ఔనమ్మా, మరో కులంవాణ్ణి చేసుకొంటానంటే ఎవరైనా ఎలా ఒప్పుకొంటారు. ఎవరి కులం వారికి గొప్ప. మీ నాన్నగారు కారాలు మిరియాలు నూరుతున్నారు. నాకు ఏమిటి చెయ్యడమో బోధపడడం లేదు. మరోమారు చెప్పి చూడమ్మా.” అని అన్నపూర్ణ కూతురుకు విన్నవించుకొంది.
“నువ్వు బెంగ పడకమ్మా. నేను మళ్ళీ వాడికి బోధపరుస్తాను.” అని చిట్టితల్లి తల్లిని సముదాయించింది.
“అలా చెయ్యమ్మా. వాడికి చెప్పమ్మా. వాడా మళయాళీ పిల్లని చేసుకుంటే, కుటుంబంలోని అందరితోను వాడికి తెగతెంపులు అయిపోతాయి అని చెప్పమ్మా.” అని మరోమారు కూతురుకు చెప్పుకొంది.
అన్నపూర్ణ కొడుకును ఎలా దారిలోనికి తేడమా అని సతమతమవుతోంది. పెద్దది, మేనత్త చెబితే వింటాడేమో అనే ఆశతో మంగమ్మకు ఫోన్ చేసింది. “మంగా, గౌరీపతి ఏం చేసేడో చూడమ్మా.” అని ఇంకా చెప్పబోతూ ఉంటే, “వదినా. అదంతా విన్నాను. సింహాద్రి చెప్పేడు. చిట్టితల్లి చెప్పిందట.” అనగానే, “మీ అందరికి ముందుగానే తెలుసన్నమాట. వాడు మొన్న వచ్చి చెప్పినదాకా మాకు తెలియనే లేదు. నువ్వు వాడితో మాట్లాడేవా ఏంటి.”
“నాకు తెలియగానే వాడికి ఫోన్ చేసి బోధపరిచేను వదినా. వెంటనే కొరియర్లో ఉత్తరం కూడా పంపించేను. ‘మనది తరతరాల నుండి సాంప్రదాయ కుటుంబం. పై శాఖల వాళ్లనే చేసుకోలేదు; నువ్వు బాగా ఆలోచించుకో. ఏమీ మించిపోలేదు. నువ్వా అమ్మాయికి చెప్పి ఆ సంగతి మరిచిపో. బేంకులో ఆఫీసరుగా ఉన్నావు. మన వాళ్లవే ఎన్నో మంచి సంబంధాలొస్తాయి. మన కుటుంబాల్లో తరతరాలనుండి అందరికి పౌరోహిత్యమే వృత్తి. నువ్వు పెద్ద ఉద్యోగం చేసి పెద్ద హోదాతో బతుకుతావని అన్నయ్య నీకు పెద్ద చదువులు చదివించేడు. నువ్వా పిల్లని చేసుకొని మీ నాన్నకు బహుమతిగా ఇద్దామనుకొంటున్నావా. కుటుంబంలో ఎవరూ హర్షించరు. పెద్దదాన్ని. నీ మంచి కోరి చెబుతున్నాను. నా మాటమీద ఏ మాత్రం గౌరవమున్నా ఆ విషయం మరిచిపో.’ అని రాసేను. బెంగపడకు వదినా. దారిలోకి వస్తాడు.” అని ధైర్యం చెప్పింది.
గౌరీపతి నుండి ఫోను కోసం అన్నపూర్ణ ఆత్రుతగా ఉంది. ఆరు రోజులయింది. ఇంకా రాలేదు. ఆ అమ్మాయికి బోధపరుస్తున్నాడా, ఏమిటయి ఉంటుంది. అదే తలచుకుంటూ ఏమీ తోచని పరిస్థితిలో ఉంది. తానే ఫోను చేసి కనుక్కొందామా అని ఆలోచిస్తోంది. అంతలో కొరియరు వాడు బెల్ వేసి ఒక కవరు అందించేడు. అది గౌరీపతినుండే వచ్చిందని గమనించి, తొందరగా లోనికి నడుస్తూనే కవరు ఓపెన్ చేసింది. పడకగదిలో మంచం మీద కూర్చొని, ఉత్తరం విప్పి చూసింది.
“డియర్ అమ్మా,
పూణే వచ్చేక నువ్వు చెప్పిన విషయం ఎన్నో మార్లు ఆలోచించేను. కాని నీకు చెప్పినట్లు మేమిద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకోడానికి నిశ్చయించుకొన్నాం. వాళ్ల పేరెంట్స్ ఒప్పుకోకపోయినా మాధురి నన్ను నమ్ముకుని నిర్ణయం మార్చుకోలేదు. ఇప్పుడు నేను కాదంటే మాధురికి అన్యాయం చేయడమవుతుంది. అందుచేత నన్ను క్షమించు. నేను మాధురిని పెళ్లి చేసుకొంటాను. నాకు తెలుసు. నీకు నాన్నగారికి అది ఇష్టంలేదు. నా పరిస్థితి ఆలోచించి నా పెళ్లికి మీరు అంగీకరిస్తే సంతోషిస్తాను. కృతజ్ఞతలు చెప్పుకొంటాను.
మీ ఆశీర్వచనాలు కోరుకొంటున్నాను.
గౌరీపతి.”
ఉత్తరం విసిరికొట్టి, పక్కమీద పడి, తల బాదుకొంటూ, ‘భగవంతుడా నేనేం పాపం చేసేనని నాకీ శిక్ష వేసేవ్.’ అని అన్నపూర్ణ తలచుకు తలచుకు బాధపడుతోంది. కొంతసేపటికి గణపతి వచ్చేడు. అది గమనించగానే అన్నపూర్ణ ఎదురుగా వెళ్లి, క్రింద పడి ఉన్న ఉత్తరాన్ని అందుకొని “వాడు దాన్నే పెళ్లాడతాడ్ట.” అని గణపతి చేతిలో పెడుతూ దిగాలుగా అంది. గణపతి ఉత్తరం చదువుకొని, “ఏదో పెద్ద నీతిమంతుడిలాగ రాసేడు. ఆ మలయాళీదానికి అన్యాయం చెయ్యడ్ట. మరి మన మాటేమిటి. మనకు చేసింది న్యాయమా.” అని ఉబికి వస్తున్న కోపంతో బిగ్గరగా అన్నాడు.
“అవునండీ. బాగా చెప్పేరు. ఫోన్ చేసి అడుగుతాను. మనకు చేసింది న్యాయమా అని.”
“అన్నపూర్ణా. నీ అమాయకత్వం. ఫోను చెయ్యడం దండగ. వాడేమిటి, నీ మాట వింటాడనుకొంటున్నావా. వాడు చెడు సహవాసాల్లో పడ్డాడు. ఆ మలయాళీ మాయలో చిక్కుకున్నాడు. వాడు దాన్ని వదలుకోలేడు. అంచేత ఆ విషయం మరచిపో. మనకు వాడు లేడనే అనుకొందాం. మన కన్నతల్లే మనకు కూతురూ, కొడుకు అనుకొందాం.”
“చిట్టితల్లికి, మంగకి, ముందుగా వాడి నాటకం తెలియగానే గట్టిగా చెప్పేరటండి.”
“నేను చెప్పేను కదా. వాడు ఆ ఊబిలో పడ్డాడు. ఎవరి మాటా తలకెక్కదు. అందులో పడి ఏడవనీ. వాణ్ణి తలచుకు బాధపడకు. వాడు లేడనే అనుకో. ఆ విషయం మరచిపో. చన్నీళ్ళతో మొహం కడుక్కుని రా. భోజనం చేద్దాం.” అని అన్నపూర్ణ మనసును మరోప్రక్క తిప్పేడు, గణపతి.
గౌరీపతి తన నిర్ణయాన్ని మెసేజ్ ద్వారా అక్కకు తెలియబరిచేడు. అదే జరుగుతుందని అనుకున్నా, ఆ మెసేజ్ చిట్టితల్లి మనసును కలతపెట్టింది. మేనత్తకు తెలియబరిచింది. మేనత్త మనసు కూడా పాడయింది. కొంతసేపటికి ఏదో ఆలోచించుకుని, చిట్టితల్లికి ఫోన్ చేసింది.
“అమ్మా, చిట్టితల్లీ, మీ అమ్మా, నాన్నా, దీన్ని ఎలా తట్టుకొంటారో తెలీదమ్మా. అన్నయ్య, ఫరవాలేదు. తన పనిలో తాను ఉంటాడు. ఇదే ధ్యాసలో ఉండడు. వదినే.. ఇంట్లో ఒక్కతే ఉంటుంది. అదే తలచుకు తలచుకు బాధపడుతూ ఉంటుంది. నాకు వదిన గురించే బెంగగా ఉంది.”
“ఔనత్తా. అదే నేనూ బాధపడుతున్నాను. అమ్మ ఎలా తట్టుకొంటుందా, అని.”
“నీకు వీలయితే వెళ్లి ఓ వారం పది రోజులు వాళ్ల దగ్గర ఉండగలవా తల్లీ. నేనూ ప్రయత్నిస్తాను వెళ్లడానికి.” అని సలహా ఇచ్చింది, మేనత్త.
“నేనూ అదే అనుకొంటున్నానత్తా. ఆయన ఇంటికి రాగానే ఆయనతో మాట్లాడి వీలైనంత వేగరం వెళతాను.”
“మంచిదమ్మా. అలా చెయ్యమ్మా.”
“అత్తా, ఆయన వచ్చినట్టున్నారు.”
“వెళ్ళమ్మా. నేనూ వెళ్లాలి. కూరలబండీవాడు వచ్చినట్టుంది. కేకేస్తున్నాడు.”
భర్త ఇంటికి రాగానే చిట్టితల్లి మెసేజ్ చూపించింది. అది చూడగానే “డర్టీ ఫెలో. వాణ్ణి ఉతికేయాలి.” అని స్పందించి, మూర్తి, “చిట్టీ, నువ్వు వెంటనే బయలుదేరి మీ ఊరు వెళ్లు. వాళ్లు కొద్దిగా నార్మల్ అయేదాకా నువ్వు అక్కడ ఉండు.” అని సలహా ఇచ్చేడు.
“నేనన్నాళ్లు అక్కడ ఉండిపోతే పిల్లల సంగతి.”
కొద్ది క్షణాలు ఆలోచించి, “చిట్టీ, వాళ్లకి రేపు, ఎల్లుండి స్కూలుంది. అది ఫరవాలేదు. నేను టీచరుకి చెప్తాను. సోమవారంనుండి పది రోజులు శలవులున్నాయి. అంచేత నో ప్రాబ్లెమ్. పిల్లలుంటే అత్తగారికి డైవర్షన్ ఉంటుంది. మామగారికి కూడా బాగా కాలక్షేపమవుతుంది.”
“అవును మీరు చెప్పింది నిజమే. మీరు కూడా వస్తే బాగుంటుందండి.”
మూర్తి ఓ ఘడీ ఆలోచించి, “ఒకే. నేనూ, టు ఆర్ త్రీ డేస్ కోసం వస్తాను.”
మూర్తికి ఏదో ఫోన్ వచ్చింది. ఆ మాటల్లో బిజీ అయ్యేడు.
***
సమయం ఉదయం పది గంటలు. శ్రీవల్లిపురంలో పనిమనిషితో అన్నపూర్ణ ఏదో మాట్లాడుతోంది. వీధి గుమ్మంలో కాలింగు బెల్ వాగింది. ఎవరొచ్చేరు చెప్మా; భర్త, వచ్చేసరికి సాయంత్రం అవుతుందని చెప్పి వెళ్ళేడు; అని ఆలోచిస్తూ తలుపు తీసింది. ఎదురుగా ఇద్దరు మనవలు. నివ్వెరపోయింది. అమ్మమ్మను చూడగానే ఇద్దరు మనవలూ పాదాభివందనం చేసేరు. మేళవించిన ఆశ్చర్యం, సంతోషాలతో, ఇద్దరిని రెండు చేతులా అనురాగంతో దగ్గరగా తీసుకొని ముద్దులు పెట్టుకొంటూ ఉంటే, చిట్టితల్లి వడి వడిగా వచ్చి, “అమ్మా.” అని తల్లి భుజంమీద వాలిపోయింది. దగ్గరలోనే మూర్తి నిలబడి ఆ సీను చూస్తున్నాడు. అన్నపూర్ణ మూర్తిని చూడగానే, “అలా నిలబడిపోయేవ్. రా నాయనా.”అని మూర్తికి దగ్గరగా వెళ్లి ఆహ్వానించింది. మూర్తి అత్తగారికి నమస్కరించేడు. అల్లుణ్ణి ఆశీర్వదించి అన్నపూర్ణ నలుగురితో లోపలకు వెళుతూ, “అమ్మా, ముందుగా ఫోను చేసుంటే, మీరు వచ్చేసరికి తినడానికి ఏదైనా చేసుందును. పిల్లలు ఆకలితో ఉన్నారో ఏంటో.” అని అనగానే, శారద, “అమ్మమ్మా, మేం ఇడ్లీలు తిన్నాం.” అని ముద్దు ముద్దుగా అమ్మమ్మ అనుమానం తీర్చింది. “అలాగా తల్లీ. ఎన్ని ఇడ్లీలు తిన్నావమ్మా.” అని మనవరాలిని అంతే ముద్దుగా అడిగింది, అమ్మమ్మ. “నేను మూడు తిన్నాను. అన్న నాలుగు తిన్నాడు.” అని వివరాలు ఇవ్వగానే పెద్దవాళ్లు ముగ్గురికి నవ్వొచ్చింది. చిట్టితల్లి, మూర్తి, సామానుతో గదిలోకి వెళ్లేరు. అమ్మమ్మ మనవల్ని తీసుకొని వంటింటి వైపు వెళ్ళింది. గదిలో సామాను ఒకచోట పెట్టి, మూర్తి, “చిట్టీ, మనని చూడగానే అత్తగారు మరోలాగ రియాక్ట్ అవుతారేమో అనుకున్నాను. నువ్వు మంచిపని చేసేవ్. పిల్లలిద్దరినీ ముందుగా వెళ్లి బెల్లు కొట్టమన్నావ్. మనవల్ని చూడగానే ఆవిడ ఎంత సంతోషించారో చూడు.”
“అవునండీ, పిల్లలితో వెళదామన్నది మీ ఐడియాయే. నేను ఒక్కదాన్నే వచ్చుంటే అమ్మకి డైవర్షన్ లేకపోను. నేను అమ్మ దగ్గరకు వెళతాను.”అని చిట్టితల్లి తల్లి చెంతకు వెళ్ళింది. అన్నపూర్ణ మధ్యాహ్న భోజనానికి వంట ప్రయత్నంలో ఉంది. “మీ నాన్న పిలుస్తున్నారు, వెళ్ళండి.” అని ఇద్దరు పిల్లల్ని చిట్టితల్లి భర్త వద్దకు పంపించింది. అన్నపూర్ణ కూతురుకి తన దుఃఖం వెళ్లబుచ్చుకొంటోంది. తల్లి కంట తడిని తన పైటకొంగుతో తుడిచి చిట్టితల్లి, “అమ్మా, నువ్విలా కూర్చో. వంట సంగతి నేను చూస్తాను.” అని తల్లిని ఓదార్చి వంట ప్రారంభించింది. అన్నపూర్ణ ఆ విషయమే తలచుకు తలచుకు బాధతో చెప్తూ ఉంటే, “అమ్మా. నువ్వు అదే తలచుకొంటూ నీ ఆరోగ్యం పాడుచేసుకోకు. మనకి ఇష్టం లేకపోయినా, అది జరిగిపోయింది. మనం ఇప్పుడేమీ చెయ్యలేం. అంచేత మరచిపో అమ్మా.” అని తల్లిని శాంతబరుస్తూ వంట పూర్తి చేసింది.
సాయంత్రం అయింది. మనవలికి అన్నపూర్ణ భారతంలోని కథలు చెప్తోంది. చిట్టితల్లి పెరట్లో పువ్వులు కోస్తోంది. డోర్ బెల్ వాగింది. “మీ తాతగారు వచ్చినట్టున్నారు.” అని, అన్నపూర్ణ కథ అక్కడకు ఆపి తలుపు తీయడానికి వెళ్తోంది. మనవలిద్దరూ పరుగున వెళ్లేరు. ప్రభాకర్ తలుపు తీసేడు. తాతగారికి మనవలు పాదాభివందనం చేసేరు. మనవల్ని చూడగానే, ఆశ్చర్యంతో మురిసిపోతూ “మీరెప్పుడు వచ్చేర్రా.” అని, ఇద్దరిని దగ్గరగా తీసుకొని అడగగానే, “పొద్దున్న వచ్చేం, తాతగారూ.” అని మనవడు జవాబిస్తూ ఉంటే, “తాతా మేం పొద్దున్నే ఒచ్చేం. నువ్వెక్కడికి వెల్లేవ్.” అని నిలదీసి అడిగింది మనవరాలు. వెంటనే, “చెల్లీ, తప్పు. తాతగారు.. అనాలి. నువ్వు.. అనకూడదు. మీరు.. అనాలి.” అని పాఠం చెప్పేడు. “నేను పనిమీద వెళ్లేనమ్మా.” అని, ముద్దుగా జవాబిచ్చేరు, తాతగారు. ఆ లోగా అన్నపూర్ణ వచ్చి, వాళ్లెప్పుడూ వచ్చింది చెప్పింది. తండ్రి రాకను పనిమనిషి చెప్పగానే, చిట్టితల్లి వడివడిగా వెళ్లి, తండ్రికి పాదాభివందనం చేసింది. గణపతి దగ్గరగా తీసుకొని, “అమ్మా, అల్లుడు రాలేదా.” అని అడిగేడు. “వచ్చేరు నాన్నా. ఏదో పనిమీద బజారుకు వెళ్లేరు.” అంది. “మీరు రాడం, ముఖ్యంగా పిల్లలతో రాడం మంచిపని చేసేరమ్మా. లేకపోతే మీ అమ్మ ఎప్పుడూ అదే ధ్యాసలో ఉంటోంది.” అని కూతురును కొనియాడేరు. తరువాత కొంతసేపటికి మూర్తి బోర్న్‌విటా డబ్బా, బిస్కెట్ పేకెట్లు, డజను అరటిపళ్ళు కొనుక్కొని వచ్చేడు. మామగారు, అల్లుడు కలసుకొని ఉభయకుశలోపరి అయింది. రెండురోజులుండి, మూర్తి తన గూడు చేరుకున్నాడు.
***
కొద్దిరోజుల క్రిందటే లావణ్య తల్లిదండ్రులను పెద్ద పండుగకు ఆహ్వానిస్తానని, లావణ్యకు చెప్పడం మంగమ్మకు జ్ఞాపకముంది. భర్తతో ఆ విషయం మాట్లాడింది. రావుగారి దంపతులను పెద్ద పండుగలకు వచ్చి తమతో వారం పది రోజులు గడిపితే సంతోషిస్తామని శర్మ ఆహ్వానించేడు. రావుగారు ధన్యవాదాలతో, వారం పది రోజులు వీలు కాదని, పండుగ నాలుగు రోజులకు తప్పక వస్తామని ధ్రువీకరించేరు. మంగమ్మ కోడలిను పిలిచి ఆ సమాచారం చెప్పింది. లావణ్య అత్తగారికి ధన్యవాదాలు చెప్పింది. అతిథులున్న నాలుగు రోజులూ వాళ్ల భోజనాలు, సదుపాయాలు లావణ్యనే స్వయంగా చూడమని మంగమ్మ చెప్పింది. సింహాద్రికి కూడా అదే సలహా ఇచ్చింది.
పండగ నాలుగురోజులుందనగా, తను సకుటుంబంగా పండగకు వస్తున్నానని, పెద్దకూతురు హేమలతనుండి రావుగారికి ఫోను వచ్చింది. ఆయన సందిగ్ధంలో పడ్డారు. పండగకు తప్పక వస్తున్నామని వియ్యంకునికి చెప్పేరు. వాళ్లు దానికి ఏర్పాట్లు చేసి ఉంటారు. ఆఖరి నిమిషంలో రాలేమని వారికి చెప్పడం మర్యాదకాదు. అది తెలిస్తే, లావణ్య ఎంతో నిరాశ చెందుతుంది. ఇటు హేమలతని కాదంటే అది బాధపడడమే కాకుండా తిట్టిపోస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకున్నారు. కనకదుర్గమ్మ అభిప్రాయం, “దాన్ని ఇప్పుడు రావొద్దని, ముఖ్యంగా కారణం చెబితే, అది రేపే వచ్చి, నానామాటలు అంటుంది. మన్ని బతకనివ్వదు. మనం శర్మగారింటికి వెళ్లడం జరగదు. అంచేత వియ్యంకుడికి విషయం చెప్పి, ఆ కారణంగా రాలేకపోతున్నామంటే ఆయన బోధపరచుకొంటారు. అదే మంచిది.” రావుగారికది నచ్చింది. అమలులో పెట్టేరు. అయితే అది అంత సింపుల్‌గా జరిగిపోలేదండీ. ఈ పరిణామానికి అసలు కారణం గోప్యంగా మరొకటి. పెద్ద పండుగలకు, చెల్లెలి ఇంటికి తల్లిదండ్రులు వెళ్లబోతున్నారని, పెద్దకూతురు హేమలతకు ఎలాగో తెలిసిందండి. చెల్లికి ఆ సంతోషం లేకూడదనుకొంది. ఎలాగయినా, అది జరగకుండా ఆపాలనుకుంది. తిరుగులేని బ్రహ్మాస్త్రం వేసింది. ఎలా ఉన్నాయండీ, ఇంటర్నల్ పోలిటిక్స్. సరే, అదలా ఉండనిద్దాం. మనం పూణే వెళదాం. మన హీరో ఏమిటి చేస్తున్నాడో చూద్దాం.
***
ప్రేమ జంట, గౌరీపతి, మాధురి పూణేలో రిజిస్టర్డ్ వివాహం చేసుకున్నారు. బేంకు హెడ్ ఆఫీసుకు అది తెలియబరచి, మాధురిని పూణేకి బదిలీ చేయమని వేడుకొన్నారు. ఆరు నెలలలో మాధురి జబల్పూర్ నుండి బదిలీ అయి పూణే లోని పాషాన్ బ్రేంచికి బదిలీ అయింది. నూత్న వైవాహిక జీవన మాధుర్యాన్ని ఇద్దరూ తనివితీరా ఆస్వాదిస్తున్నారు. కాని, వారిద్దరికి ఒక తీరని లోటు. గౌరీపతికి తన తల్లిదండ్రుల సంపర్కం లేకుండా అయింది. మాధురిని కూడా తల్లిదండ్రులు దూరం చేసుకున్నారు. అలా రెండు సంవత్సరాలు గడిచేయి. మాధురి ఒక పండంటి మగబిడ్డకు తల్లయింది. ఆ బుడతడు తాతగారి పేరుతో ‘గణపతి’ నామధేయుడయ్యేడు. బుడతడి ఫోటో, చిట్టితల్లికి, మేనత్తకు, పంపించేడు.
“పిల్లడు బాగున్నాడు. నాన్నగారి పేరు పెట్టి మంచి పని చేసేవ్. ఫోటో అమ్మకి పంపించేవా.” అని తమ్ముడికి ఫోన్ చేసి చిట్టితల్లి అడిగింది.
“చాలా థాంక్స్ అక్కా. అమ్మకి పంపించమంటావా. ఎలా రియాక్ట్ అవుతుందో అని పంపించలేదు.” అని సలహా అడిగేడు.
“ఫరవాలేదు. పంపించు. అత్తకి కూడా పంపించు. చూద్దాం. చంటివాడు నిన్ను మళ్ళీ కుటుంబంతో కలుపుతాడనుకొందాం.” అని ధైర్యం చెబుతూ సలహా ఇచ్చింది, అక్క.
“థాంక్స్ అక్కా. ఫోటో చూసేక అమ్మ, అత్త, ఏమిటన్నారో నాకు చెప్పు.” అని కోరేడు.
మాధురిని పెళ్లిచేసుకొన్నాక తొలి రెండు వారాల్లో గౌరీపతి రెండు మార్లు తల్లికి ఫోను చేసేడు. కొడుకు గొంతుక వినగానే అన్నపూర్ణ కట్ చేసేసింది. ఆ తరువాత గౌరీపతి తల్లికి ఫోన్ చెయ్యడానికి ప్రయత్నించలేదు. అక్కకు అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు. అక్కద్వారా తల్లిదండ్రుల క్షేమసమాచారం తెలుసుకొనేవాడు. సింహాద్రితో రెండుమూడుసార్లు మాట్లాడేడు. అత్త క్షేమం తెలుసుకొనేవాడు. ఇప్పుడు అక్క చెప్పేక తల్లికి తనయుని ఫోటో పంపిస్తూ, ‘నీ మనవడు, ‘గణపతి’ అని దాని దిగువున మెసేజ్ పెట్టేడు. మనవడి ఫోటో మామ్మకు బాగా నచ్చింది. చిట్టితల్లి ఫోన్ చేసి, “అమ్మా, నీ మనవడి ఫోటో చూసేవా. ఎలా ఉన్నాడు.” అని, ఫోటో చూసేక తల్లి రియాక్షన్ ఎలా ఉందో కనుక్కోదలచింది.
“ఆ.. చూసేను. ముద్దుగా ఉన్నాడు.” అంది, అన్నపూర్ణ.
“ఎంతో బాగున్నాడమ్మా. అచ్చు నీ పోలికేనమ్మా. నీలాగే పెద్ద.. కళ్ళు, చిన్న.. నోరు, చక్కగా.. ఉన్నాడమ్మా.”
“నాలాగ ఉన్నాడంటావా..” అని తాపీగా అంటూ, మరో మారు మనవడి ఫోటో చూసుకొని మురిసిపోయింది.
“అమ్మా, తమ్ముడు వాడికి నాన్నగారి పేరు పెట్టేడమ్మా.” అని మరో అడుగు ముందుకు వేసింది, చిట్టితల్లి.
“అన్నీ.. బాగున్నాయమ్మా. అదొక్కటే.. మనవాళ్ల పిల్లనే చేసుకొనుంటే ఎంతో బాగుండేది.” అని, సంతోషంలో ఓ మూల మరువలేని మనస్తాపం తెలియబరచింది.
“అమ్మా, జరిగిపోయిన దాని గూర్చి మరి తలచుకోకు. వాణ్ణి ఎన్నాళ్ళు దూరంగా పెట్టుకొంటామమ్మా. పాపం. చాలా బాధపడుతున్నాడు. మాధురి చాలా కల్చర్డ్ పిల్లమ్మా. నాతో మూడు నాలుగుమార్లు మాట్లాడింది. తెలుగు స్వచ్ఛంగా మాట్లాడుతోందమ్మా.”
“హైదరాబాదువాళ్లు గదా. తెలుగు బాగా వచ్చుంటుంది.”
“అమ్మా, మనలాగే పూర్తిగా వెజిటేరియన్. ఎగ్ కూడా తినదట.” అని, తల్లిని, తమ్ముని, దగ్గరచేయడానికి ప్రయత్నిస్తోంది.
“అన్నీ.. బాగున్నాయమ్మా. నేను చెప్పినట్లు అదొ..క్కటే.” అని ఇంకా ఏదో చెప్పబోతూంటే,
“అమ్మా, అది పూర్తిగా మరచిపో అమ్మా. నేను నీకన్నా చిన్నదాన్ని. నీకు సలహా ఇవ్వగలదాన్ని కాను. నాదో రిక్వెస్ట్ అమ్మా.”
“ఏమిటో అది చెప్పు.”
“అమ్మా, నువ్వు నాన్నగారిని ఒప్పించి, తమ్ముడికి, మాధురి, కొడుకుతోబాటు ఒకమారు రమ్మని ఫోన్ చెయ్యమ్మా.” అని ఎంతో వినయంగా చెప్పింది.
అన్నపూర్ణ కొద్ది క్షణాలు ఆలోచించి, “అమ్మా, నా సంగతి వదిలీ. నాన్నగారి సంగతి నీకు తెలుసుగదా. వాడి పేరు చెప్తేనే మండిపడుతున్నారు. అయినా నువ్వు చెప్పేవు గదా. కదిపి చూస్తాను.” అని తను ఒక మెట్టు దిగింది.
“థాంక్స్ అమ్మా.” అని తల్లి శలవు తీసుకుంది, చిట్టితల్లి.
(సశేషం)
శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం నవంబరు, 1936 లో జన్మించారు. M.A. మరియు P.G. Diploma in Personnel Management పాసయ్యారు. ఉద్యోగ పర్వం, హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రారంభించి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిగా చేసి, 1994 లో విశ్రాంతి తీసుకొన్నారు. అమెరికా వాసి.
హైస్కూలు విద్యార్థిగా రంగస్థల ప్రవేశం చేసేరు. చిన్న నాటికలు రాసి, వాటిలో పాత్రలు ధరించి, దర్శకత్వం చేసేరు.
గత ఎనిమిది సంవత్సరాల నుండి రచనలు చేస్తున్నారు. ఈ నాటికి 33 కథలు, 3 నవలలు, 4 కవితలు, ఒక హాస్య నాటిక ప్రచురణమయ్యేయి.
