Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పునరావృతం-18

[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[గౌరీపతి మళయాళీ అమ్మాయిని ప్రేమించిన సంగతి కూతురికి చెప్పి బాధపడుతుంది అన్నపూర్ణ. బదులుగా చిట్టితల్లి, తమ్ముడు ఆ విషయం తనకు ముందే చెప్పాడనీ, తాను వారించాననీ చెప్తుంది. బదులుగా అన్నపూర్ణ, మరోసారి గౌరీపతికి నచ్చజెప్పమని కూతురిని అడుగుతుంది. అక్క చిట్టితల్లి, మేనత్త మంగమ్మ నచ్చజెప్పినా గౌరీపతి మనసు మార్చుకోడు. తాను మాధురికి మాట ఇచ్చానని, ఆమెనే చేసుకుంటానని పట్టుబడతాడు. అదే విషయం తల్లికి ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం చూసి షాక్‌కి గురవుతుంది అన్నపూర్ణ. కూతురికి చెప్పి బాధపడుతుంది. తన నిర్ణయాన్ని అక్కకి కూడా ఫోన్‌లో చెప్తాడు గౌరీపతి. ఆ వార్తని అత్తతో పంచుకుంటుంది చిట్టితల్లి. మంగమ్మ దిగులుచెంది, మీ అమ్మ క్రుంగిపోతుంది, నువ్వు పిల్లల్తో వెళ్ళి ఓ వారం రోజులు ఉండిరా అని చిట్టితల్లికి సలహా ఇస్తుంది. ఆమె సలహా మేరకు చిట్టితల్లి, మూర్తి తోనూ, పిల్లలతోనూ బయల్దేరి శ్రీవల్లీపురం చేరుతారు. అనుకోకుండా కూతురు, అల్లుడు, మనవలని చూసి సంతోషిస్తారు అన్నపూర్ణ దంపతులు. వాళ్ళక్కడ ఉన్నన్ని రోజులు ఉత్సాహంగా గడిచిపోతాయి. మంగమ్మ తన వియ్యంకుల కుటుంబాన్ని పండగకి ఆహ్వానిస్తానన్న మాటని గుర్తుంచుకుని, శర్మతో ఫోన్ చేయిస్తుంది. రావుగారు, కనకదుర్గమ్మ తప్పక వస్తామంటారు. లావణ్య సంతోషిస్తుంది. పండగ నాలుగు రోజులుందనగా తను సకుటుంబంగా పండగకి వస్తున్నానని పెద్దకూతురు హేమలత రావుగారికి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో, వారు తమ ప్రయాణం ఆపుకుంటారు. పూణెలో గౌరీపతి మాధురిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఏడాది తిరిగేసరికి మగబిడ్డ పుడతాడు. వాడికి తాతగారి పేరే ‘గణపతి’ అని పెడతారు. కొడుకు ఫోటోని అక్కకి, మేనత్తకు పంపుతాడు గౌరీపతి. చిట్టితల్లి తమ్ముడికి ఫోన్ చేసి మేనల్లుడి ఫోటోని అమ్మకి కూడా పంపమని సలహా ఇవ్వడంతో, అలాగే పంపిస్తాడు గౌరీపతి. మనవడి ఫోటో చూసి సంతోషిస్తుంది అన్నపూర్ణ. అదే సమయంలో చిట్టితల్లి అమ్మకి ఫోన్ చేసి, తమ్ముడిని, మరదలిని ఇంటికి పిలవమని కోరుతుంది. నాన్నకి చెప్పి చూస్తానంటుంది అన్నపూర్ణ. – ఇక చదవండి.]

సాయంసమయానికి గణపతి ఇల్లు చేరుకొన్నాడు. భార్య చేసిన టిఫిన్ చేసి తీరిగ్గా ఉన్నాడు. అన్నపూర్ణ నెమ్మదిగా పతి చెంత చేరి బుడతడి ఫోటో చూపించి, “ఎలా ఉన్నాడండీ.” అని అడిగింది.

“బొద్దుగా ఉన్నాడు గానీ.. ఎవరు.” అని అడిగేడు.

అన్నపూర్ణ తిరిగి తన ఫోటో దిగువనున్న మెసేజ్ చూపించింది. గణపతి ఏమిటనుకొన్నాడో తెలీదు.

“ఇది నీకెలా వచ్చింది.” అని అడిగేడు.

ఏమిటి జరిగిందీ, చెప్పింది, అన్నపూర్ణ. కోడలు గూర్చి కూతురు చెప్పినది కూడా చెప్పింది.

గణపతి అన్ని విషయాలు, కళ్లు మూసుకుని తల దించుకొని కొద్దిగా తల ఊపుతూ విన్నాడు. ఏమైనా ఆలోచిస్తున్నాడేమో భగవంతుడికే తెలియాలి.

అన్నపూర్ణ మళ్ళీ అందుకుంది.

“ఏమండీ, జరిగిందేదో జరిగిపోయిందీ. వాడు చాలా బాధ బాధపడుతున్నాడూ, వాణ్ణి ఓ మారు కుటుంబంతో రమ్మని పిలూ, అని చిట్టితల్లి ఫోన్ చేసి చెప్పిందండి.”

“ఎప్పడు చెప్పింది.” తల ఎత్తి అడిగేడు, గణపతి.

“పొద్దున్న చెప్పిందండి.”

“నువ్వేమిటన్నావ్.”

“మిమ్మల్ని అడగాలీ, అన్నానండి.”

“ఇంతకూ, నువ్వేమిటంటావ్.”

“ఓ మారు రమ్మంటే.. మనవడు.. మీ పేరు పెట్టుకున్నాడు.. వాణ్ణి చూసినట్టవుతుంది.” అని వినయంతో తెలివితేటలుగా మనవణ్ణి ముందు పెట్టి అస్త్రం సంధించింది, అన్నపూర్ణ.

గణపతి కొద్ది క్షణాలు ఆలోచనలో ఉండగా, “మీరేమిటంటారు.” అని అడిగింది.

“చిట్టితల్లికూడా పిలవమన్నాదన్నావు కదూ.”

“అవునండీ. చిట్టితల్లే పిలవమని చెప్పింది.”

“సరే, పిలూ.” అని భార్య వినతిపత్రం మీద గణపతి ఆమోద ముద్ర వేసేడు.

కొడుకును సకుటుంబంగా పిలవాలని అన్నపూర్ణ అనుకొంది. ఆ విషయం ముందుగా కూతురుకు చెబితే ఎక్కువ సంతోషిస్తుందనుకొంది. చిట్టితల్లికి ఫోన్ చేసి, భర్తతో జరిగిన సంభాషణ చెప్పింది. చిట్టితల్లి ఎంతో సంతోషించి, “చాలా థాంక్స్ అమ్మా. వాణ్ణి మళ్ళీ మనకు దగ్గర చేస్తున్నావ్.” అని కొనియాడింది. ఆ శుభపరిణామం, తల్లి కన్నా ముందుగా తనే చెప్పేయాలని చిట్టితల్లి తహతహ. ఆ దృష్టితో, “అమ్మా, తమ్ముడితో నేను మాట్లాడేక నువ్వు వాడికి ఫోన్ చేస్తావా.” అని తల్లిని కోరింది. “అలాగేనమ్మా, నేను ఫోను పెట్టేస్తాను; నువ్వు వాడితో మాట్లాడు.” అని, అన్నపూర్ణ కూతురు ఉత్సాహాన్ని అర్థం చేసుకొంది.

చిట్టితల్లి తమ్ముడికి ఫోన్ చేసి, జరిగినదంతా చెప్పి, “తమ్మూ, నువ్వే అమ్మకు ఫోన్ చేసి మాట్లాడు.” అని సలహా ఇచ్చి ఫోను పెట్టేసింది. గౌరీపతి, మాధురి, పెల్లుబికిన సంతోషంతో, ఆ శుభపరిణామానికి వాడే కారకుడని, ఉయ్యాలలో ఉన్న చిన్నవాడిని ముద్దులాడేరు. గౌరీపతి తల్లికి ఫోన్ చేసి, అక్క అన్ని విషయాలు చెప్పిందని తెలియజేసేడు. అన్నపూర్ణ, మాధురి, బిడ్డడితో రమ్మని చెప్పింది. గౌరీపతి ఎప్పుడు రావడమో తెలియజేస్తే వస్తామన్నాడు. మాధురి కూడా స్వచ్ఛమయిన తెలుగులో అత్తగారికి ధన్యవాదాలు చెప్పింది. అన్నపూర్ణ, “చాలా సంతోషం నాయనా. రాబోయే లక్ష్మీవారం, ఏకాదశి, మంచిరోజు. ఆ రోజు రండి. కనీసం ఒక వారం పది రోజులు ఉండడానికి వీలుచేసుకు రండి. దీనికంతటికి అక్కే ఎక్కువ చొరవ తీసుకుంది. దాని దగ్గరకు కూడా వెళ్ళు. ఆ.. విను. మాధురి తెలుగు స్వచ్ఛంగా మాట్లాడింది. నాకు నచ్చిందని దానికి చెప్పు.” అని, స్పందించింది.

“అక్కకి చెప్పేనమ్మా; దాని దగ్గర రెండు రోజులుంటానని. అత్త దగ్గర ఒక రోజయినా ఉండమని అక్క చెప్పింది. అలాగే అన్నాను.” అని గౌరీపతి తల్లికి వివరాలు చెప్పేడు. అన్నపూర్ణ సంతోషించింది.

నూతన శిశువు గణపతి, మాధురిని కూడా తల్లిదండ్రులతో కలిపేడు. మనవడి ఫోటో చూసి మాధురి తల్లిదండ్రులు సంతోషించేరు. వీలు చూసుకొని హైదరాబాదు రమ్మని అల్లుడికి ఆహ్వానం పంపేరు.

కొడుకు సకుటుంబంగా వచ్చేక, శనివారంనాడు వాళ్లచేత సత్యనారాయణ వ్రతం, వెంకటేశ్వర దీపారాధన చేయించాలని గణపతికి తట్టింది. అది తెలిసి అన్నపూర్ణ సంతోషించింది. అటు విశాఖపట్నంలో, చిట్టితల్లి, మూర్తి కూడా ఏవో ప్లాన్ చేస్తున్నారు. నవరంగపట్నంలో మంగమ్మ, భర్తతో ఆలోచించింది. ఆ ఉభయుల చేత ఇంట్లోనే వెంకటేశ్వర కళ్యాణం చేయిస్తానని శర్మ చెప్పేడు.

గౌరీపతి సకుటుంబంగా శ్రీవల్లిపురం చేరుకున్నాడు. మంగళహారతి ఇచ్చి, అన్నపూర్ణ వారిని ఇంటిలోనికి ఆహ్వానించింది. గౌరీపతి, మాధురి, అన్నపూర్ణకు పాదాభివందనం చేసేరు. కోడలు చేతినుండి మనవడిని అందుకుని, అన్నపూర్ణ వాడిని తనివితీరా ముద్దులాడింది. కొద్దిసేపట్లో గణపతి ఇల్లు చేరుకున్నాడు. కొడుకు, కోడలు, పాదాభివందనం చేసేరు. గణపతికి అన్నపూర్ణ చిన్న గణపతిని అందించింది. మనవడిని ముద్దులాడి తిరిగి అన్నపూర్ణకు అందించేడు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం. గౌరీపతి, మాధురిల చేత గణపతి శనివారం నాడు సత్యనారాయణ వ్రతం, వేంకటేశ్వర దీపారాధన చేయించేడు. దారి తప్పిన కొడుకు దరి చేరినందులకు గౌరీపతి, అన్నపూర్ణ సంతోషిస్తున్నారు. తాతగారు మనవడి మెడలోనికి ఒక బంగారపు గొలుసు బహూకరించేరు. గౌరీపతి, తల్లిదండ్రుల గదిలో ఎ.సి. సౌకర్యం సమకూర్చేడు. మాధురి అత్తగారికి వంటలోను, ఇతరత్రా పనులలోను సహాయం చేస్తూ, అన్నపూర్ణకు దగ్గరయింది. ఒక వారం శ్రీవల్లిపురంలో సరదాగా గడిపి, గౌరీపతి సకుటుంబంగా విశాఖపట్నంలో అక్కగారింటికి వెళ్ళేడు. చిట్టితల్లి ఆనందానికి హద్దు లేకపోయింది. మేనల్లుడితో ఎన్నో ఊసులు చెప్పింది. వాడికి ‘చిన్ని’ అని ముద్దు పేరు పెట్టింది. అదే వాడుకలోకొచ్చింది. మాధురి విశాఖపట్నం బీచి చూసి ముగ్ధురాలయింది. గౌరీపతి, అక్కా బావలకు ఖరీదయిన రిస్టు వాచీలు బహూకరించేడు. బుడతడు మేనత్తనుండి, మధ్యలో చిన్న బంగారపు పువ్వు అమర్చబడిన ఒక వెండి కంచం సంపాదించేడు.

మూడు రోజులు మూర్తి ఆతిథ్యాన్ని ఆస్వాదించి, గౌరీపతి సకుటుంబంగా నవరంగపట్నంలోని మేనత్తగారింటికి వెళ్ళేడు. అన్నయ్య మనవడిని చూసి మంగమ్మ పొంగిపోయింది. ఆ మరునాడు. గౌరీపతి, మాధురిల చేత శర్మ ఇంటనే వెంకటేశ్వరకళ్యాణం చేయించేడు. గౌరీపతి మేనత్తకు. మావయ్యకు పట్టు వస్త్రాలు బహూకరించేడు. చంటివాడికి ఏదయినా కొనిపెట్టమని, మంగమ్మ గౌరీపతిచేతిలో కొంత నగదు పెట్టింది.

ఆ మరునాడు గౌరీపతి సకుటుంబంగా హైదరాబాదులోని అత్తవారింటికి చేరుకున్నాడు. మాధవన్ నాయర్ దంపతులు మనవడిని చూసి మురిసిపోయేరు. తల్లిదండ్రులతో కలయిక కలిగినందుకు మాధురి ఆనందంగా ఉంది. నాయర్ దంపతులు కూడా సంతోషంగా ఉన్నారు. అల్లుడికి, కూతురుకు, మనవడికి, నాయర్ గారు ఖరీదయిన బహుమానాలిచ్చేరు. గౌరీపతి కూడా, మామగారికి, అత్తగారికి, ప్రత్యేకంగా తెచ్చిన బహుమానాలిచ్చేడు. అలా సరదాగా నాలుగు రోజులు గడిపేక గౌరీపతి సకుటుంబంగా గృహోన్ముఖుడయ్యేడు.

గౌరీపతి, మాధురి, వారి కుటుంబాలతో మరల కలయిక ఏర్పడినందులకు సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని ద్విగుణీకృతం చేస్తూ, గౌరీపతి పూనాలోనే కొత్రూడ్ బ్రాంచ్‌కి మేనేజరుగా ప్రోమోటయ్యేడు. గౌరీపతి తరచూ తల్లితో మాట్లాడుతున్నాడు. చిట్టితల్లితో ఎప్పటివలనే సంపర్కంలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు సింహాద్రితో మాట్లాడి మేనత్త యోగక్షేమాలు తెలుసుకొంటున్నాడు. మాధురి కూడా తరచూ తల్లిదండ్రులతో మాట్లాడుతోంది. భార్యాభర్తలిద్దరూ ఉదయం తొమ్మిదిన్నరకు ఆఫీసుకు బయలుదేరి, సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఇల్లు చేరుకొంటున్నారు. ఆ సమయంలో పనిమనిషి నారాయణమ్మ చిన్నిని (చిన్న గణపతి ముద్దుపేరు) జాగ్రత్తగా అభిమానంతో చూసుకొంటోంది.

చిన్నికి మూడేళ్లు నిండేయి. గణపతి, మాధురి, వాణ్ణి రోజల్లా పనిమనిషి నారాయణమ్మ మీద వదలి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదనుకున్నారు. దగ్గరలో ముగ్గురు యువతులు నర్సరీ నడుపుతున్నారు. చిన్నిని అందులో చేరిస్తే సమస్య తీరడమే కాకుండా వాడికి కూడా చదువు మీద ఆసక్తి వస్తుందనుకున్నారు. నర్సరీని సంప్రదించేరు. తొలుత, చిన్ని వయసు బాగా తక్కువని నిరాకరించినా, వారి సమస్యను అర్థం చేసుకొని చిన్నిని నర్సరీలో చేర్చుకున్నారు. రోజూ ఉదయం తొమ్మిది గంటలకు చిన్నిని నర్సరీలో దింపి, దంపతులిద్దరూ బేంక్‌కు వెళతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు నారాయణమ్మ చిన్నిని నర్సరీనుండి ఇంటికి తెచ్చి, వాడి కాళ్లూ చేతులు శుభ్రపరచి, బట్టలు మార్చి, భోజనం పెడుతుంది. వాడు దానితో ఏవో కబుర్లు చెబుతూ ఉంటాడు. నారాయణమ్మ వాడిని ఆడిస్తుంది. సాయంత్రం నాలుగు గంటలకు వాడికి బోర్న్‌వీటా, రెండు బిస్కట్లు ఇస్తుంది. బేంక్ నుండి దంపతులలో ఎవరో ఒకరు వచ్చేదాకా చిన్నిని జాగ్రత్తగా చూసుకొని ఇంటికి వెళుతుంది. చిన్ని అప్పుడప్పుడు మామ్మతో ఒకరి సహాయంతో టెలిఫోనులో మాట్లాడ్డం ప్రారంభించేడు. మనవడి ముద్దుమాటలు వింటూ అన్నపూర్ణ మురిసిపోతోంది. కాలచక్రం తిరిగిన ఈ సమయంలో సింహాద్రి లావణ్యలకు, వివేక్ జన్మించేడు.

కొన్ని సంవత్సరాల క్రితం, అనంత్ పాయి గారు ‘అమర చిత్ర కథ’ అని, పిల్లలకు మన పురాణ గాధలు, జాతక కథలు, పంచతంత్ర కథలు, మున్నగునవి సులభముగా అవగాహన చేసుకోడానికి సులభమయిన ఇంగ్లీషు, ప్రాంతీయ భాషలలో, తగు ఆకర్షణీయమైన చిత్రాలతో చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించడం ప్రారంభించేరు. అవి బాగా ప్రాచుర్యంలోనికి వచ్చేయి. మాధురి వాటిని ఒక్కొక్కటిగా తెస్తూ, చిన్నికి ఇచ్చి బోధపరచసాగింది. వాడికవి బాగా నచ్చేయి. తరువాతి పుస్తకం తల్లి ఎప్పడు తెస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. మన పురాణ గాథలతోబాటు జాతక కథలు, పంచతంత్ర కథలు, వాణ్ణి బాగా ఆకట్టుకొన్నాయి.

ఒకరోజు మాధురి గదిలో ఏకాంతంగా ఏదో ఆలోచిస్తోంది. గౌరీపతి అది గమనించి దరి చేరి, “మధు, ఏమిటి అంతలా ఆలోచిస్తున్నావ్. ఎనీ ప్రాబ్లెమ్ ఇన్ ది ఆఫీస్.” అని, నెమ్మదిగా అడిగేడు.

“నో.” అని, తల అడ్డంగా రెండు మార్లు తిప్పి, భర్త ముఖంలోకి చూస్తూ చెప్పింది.

“Then what.” అని, భార్య భుజం మీద చెయ్యి వేసి గౌరీపతి ఆప్యాయంగా అడిగేడు.

“మన చిన్ని గూర్చే ఆలోచిస్తున్నాను గౌర్.” అని తల కొద్దిగా నిలువుగా రెండు మార్లు తిప్పి, భర్త కళ్ళలోకి చూస్తూ అంది.

“ఏమిటయింది వాడికి.” అని గౌరీపతి ఆత్రుతతో అడిగేడు.

“వాడికేమీ కాలేదు.” అని చెప్పగానే

“మరి వాడిగురించి ఏమిటి ఆలోచిస్తున్నావ్.”

“మనం వాణ్ణి నెగ్లెక్ట్ చేస్తున్నామా, అనిపిస్తోంది.”

“ఎందుకలా అనిపిస్తోంది.”

“ఆదివారాలు తప్ప, వాడితో స్పెండ్ చేయలేకపోతున్నాం, గౌర్. రోజూ వాడు సాయంత్రం ఒంటి గంటకు నర్సరీ నుండి వస్తున్నాడు. ఆ సమయంలో మనం ఇంట్లో ఉండడం లేదు. వాడు రాగానే ఆ రోజు నర్సరీలో జరిగినవి నారాయణమ్మతో షేర్ చేసుకొంటున్నాడు. నారాయణమ్మ చెబితే, నాకవి తెలుస్తున్నాయి. ఒకొక్కరోజు మనం బేంకు నుండి వచ్చేసరికి వాడు నిద్రపోతున్నాడు. ఈ పరిస్థితి, where it will lead, అని చెప్పలేకపోతున్నాను.”

“అవును. మనకి రోజూ బేంకు నుండి వచ్చేసరికి బాగా లేట్ అయిపోతోంది. కాని మనం ఏమిటి చెయ్యగలం, మధు. హెడ్ ఆఫీస్ అంతకంతకు స్టేఫ్ తగ్గించడంతో, బేంకులో వర్క్ లోడ్ పెరిగిపోతోంది”

“కాని అది పిల్లడి పర్సనాలిటీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందా అని ఆలోచించుకోవాలి. క్రమంగా వాడు మనకి దూరం అయిపోతాడేమో అని నా భయం.”

“నిజమే. కాని మనం ఏమిటి చెయ్యగలం” అని, గత్యంతరం లేదన్నట్టు స్పందించేడు.

“There is only one solution.”

“ఏమిటది, మధూ.”

“నేను ఉద్యోగానికి రిజైన్ చేస్తాను.. అలా అయితే, I can take care of him. నువ్వు కూడా వీలయినంతవరకు వాడితో స్పెండ్ చెయ్యడానికి ప్రయత్నించు. అది వాడికి మనకీ కూడా మంచిది. ఏమిటంటావ్.”

గౌరీపతి మళ్లీ ఆలోచనలో పడ్డాడు.

“ఏమిటి ఆలోచిస్తున్నావ్, గౌర్. ఒక్కమారు ఇన్కమ్ తగ్గిపోతే ఎలాగ, అనుకొంటున్నావా. ఇప్పుడు మనం ఆలోచించవలసింది fat బేంక్ డిపాజిట్సా, లేక చిన్ని ఫ్యూచరా, అని.”

“డెఫినెట్లీ వాడి ఫ్యూచరే. నేను ఆలోచిస్తున్నది, నీకు బదులు, నేనే రిజైన్ చేస్తే బెటరా అని.”

“గౌర్, నీకు త్వరలో ప్రోమోషన్ రాబోతోంది. అదే కాకుండా నీకు హెడాఫీసులో మంచి rapport ఉంది. So, it is better I resign.”

“వాడి responsibility అంతా నీమీదే పడిపోతుంది, మధు.”

“అలా ఫీలవకు. We both will take care of him.”

“Okay. నువ్వు చెప్పినట్టే చేద్దాం.”అని, భార్య అభిప్రాయంతో గౌరీపతి ఏకీభవించేడు.

మాధురి ఉద్యోగానికి రిజైన్ చేసింది. ఆ పరిణామం, శ్రీవల్లిపురం, విశాఖపట్నం, హైదరాబాదు చేరుకుంది. అందరూ హర్షించేరు. రోజూ ఉదయం, మాధురి వంటపనిలో నిమగ్నురాలై ఉండడం మూలాన, చిన్నికి నారాయణమ్మ స్నానం చేయించి బట్టలు తొడిగేది. ఉద్యోగం మానేసేక, చిన్నికి తానే స్నానం చేయిస్తున్నాది. ఆ సమయంలో చిన్ని కొంటెగా తనపై నీళ్లు జల్లుతూ ఉంటే వారించక, నవ్వుతో స్పందిస్తున్న ఆ మాతృమూర్తి ఆనందాన్ని, అనుభూతిని, వర్ణించడానికి భాష లేదు. ఒక్కొక్కప్పుడు ఆ తల్లీ కొడుకుల ఆట కొంతసేపు సాగేది. చిన్నిది ఒత్తైన జుత్తు. మాధురి వాడికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా దువ్వితే, కొంటె చిన్ని, రెండు చేతులతోనూ ఆ జుత్తును చెదరగొట్టి పన్ని పట్టుకుని పారిపోతే, వాడి వెనుకనే వడిగా అడుగులు వేసుకొంటూ వెళ్లి, వాణ్ణి పట్టుకొని, “నాన్నా, నా కన్నతండ్రివి కదూ, తల దువ్వించుకో కన్నా, నువ్వు దువ్వించుకొంటే నీకు పాయసం చేసి పెడతాను.”అని లంచం ఎరగా పెడితే, ఆ కొంటె వాడు, “నిజంగానా. నాకు పాయసం పెడతావా.”అని హామీ కోరితే, “నిజంగానే, నువ్వు బడి నుంచి రాగానే నీకు పాయసం చేసి పెడతాను.”అని ముద్దుల తనయుణ్ణి బుజ్జగించి మరల జుట్టును సరి చేస్తోంది. రోజూ ఒంటిగంటకు మాధురి స్వయంగా నర్సరీకి వెళ్లి చిన్నిని ఇంటికి తెస్తున్నాది. ఆ సమయంలో గుక్క తిప్పుకోకుండా చిన్ని కబుర్లు చెబుతుంటే, మాధురి ఆ కబుర్లలో తీపిదనం తనివితీరా ఆస్వాదిస్తోంది.

ఆ సంవత్సరం, చిన్నికి ఎండాకాలం శలవుల్లో శ్రీవల్లిపురం వెళ్ళినప్పుడు ఒకరోజు గణపతిశాస్త్రి పూజచేసుకొంటున్న సమయంలో చిన్ని శ్రద్ధగా గమనించేడు. వాడికేదో సంశయం వచ్చింది. మామ్మ దగ్గరకు వెళ్లి, “మామ్మా, తాతగారు ఏమిటి చేస్తున్నారు.” అని, అడిగేడు.

“తాతగారు పూజ చేసుకొంటున్నారు, బాబూ.” అని మనవడికి చెప్పింది.

“తాతగారు నాకు చెప్తారా అది.” అని మామ్మను అడిగేడు

“నేర్పుతారు. ఇప్పుడు కాదు. బాబూ. నువ్వు పెద్దయ్యాక నేర్పుతారు. ఇప్పుడు నీ స్కూలు పాఠాలు బాగా నేర్చుకో.” అని, సమాధానపరిచింది.

వేరొక రోజు అన్నపూర్ణ బియ్యంలో నూకలు ఏరుతూ ఉంటే, చిన్ని అక్కడకు వెళ్లి, “మామ్మా, చచ్చిపోయినవాళ్ళు ఎక్కడికి వెలతారు.” అని అమాయకంగా అడిగేడు.

అన్నపూర్ణ ఆశ్చర్యంతో వాడి వైపు చూసి, “ఇప్పుడు నీకెందుకు నాన్నా అది.” అని అడిగింది.

“నారాయణమ్మ అమ్మ చచ్చిపోయింది. ఎక్కడికి వెళ్ళింది.” అని అడిగేడు.

అన్నపూర్ణ సంభాషణ పెంచడం మంచిదికాదనుకొని, “చచ్చిపోయినవాళ్ళు దేముడి దగ్గరకు వెళతారు నాన్నా.” అని చెప్పి సమాధానపరిచింది.

మాధురికి చిన్ని బాగా చేరికయ్యేడు. నర్సరీ నుండి రాగానే, వడి వడిగా తల్లిని చేరి, “అమ్మా, ఇవాళ స్కూల్లో..” అని ఆ రోజు విశేషాలు చెప్పనారంభించేడు. గౌరీపతి రాగానే, కొడుకు దగ్గరకు వెళ్లి, “ఇవాళ స్కూల్లో ఏమిటయింది నాన్నా.” అని ఆప్యాయంగా అడిగి తెలుసుకో నారంభించేడు. ఇద్దరికీ అది బాగుంది. మాధవికి కొడుకే సర్వస్వమయింది. చిన్నికి తల్లే లోకమయింది

ఒకరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మాధురికి ఛాతిలో నొప్పి ప్రారంభించింది. అది తీవ్రమవడంతో గౌరీపతికి ఫోను చేసి, విషయం చెప్పి వెంటనే ఇంటికి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లమంది. గౌరీపతి హుటాహుటిన మరొక ఆఫీసరు దీపక్‌తో వచ్చి మాధురిని కారులో పావుగంట దూరంలో నున్న ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లేడు. అక్కడ మాధురిని ఐసీయులో చేర్చేరు. ఒక కార్డియాలిస్టు మాధురికి వైద్యసేవలు అందించేడు. ఫలితం లేకపోయింది. బయట ఆత్రుతగా మనసులో దైవప్రార్థన చేసుకొంటూ ఉన్న గౌరీపతితో ఆ డాక్టరు “I am sorry. She could not be saved.” అని, చెప్పగానే, గౌరీపతి కుప్పకూలిపోయేడు. గౌరీపతితో వచ్చిన దీపక్ ఓదార్చ ప్రయత్నించేడు. కొంతసేపటికి గౌరీపతి ధైర్యం కూడగట్టుకొని, మాధురి పార్థిక దేహాన్ని మార్గ్‌లో పెట్టి దీపక్‌తో బాటు ఒంటిగంట ప్రాంతంలో ఇంటికి వెళ్ళేడు. గౌరీపతి ఇంటినుండి దీపక్ బ్రాంచ్‌కు ఆ విషాదవార్త తెలియజేసేడు. కొద్దిసేపట్లో బ్రాంచ్ నుండి ఆరుగురు స్టాఫ్ తమ సంతాపాన్ని తెలియజేయడానికి గౌరీపతి ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటికి దీపక్, “where is your son, sir.” అని అడగగానే, గౌరీపతి, “He is in the nursery.” అని చెప్పి గౌరీపతి వాచీ చూసుకున్నాడు. టైమ్ ఒంటిగంట అవుతోంది. గౌరీపతికి జ్ఞాపకం వచ్చింది. చిన్నిని నర్సరీనుండి తెచ్చే సమయమయిందని. నిన్నటివరకు మాధురి వెళ్ళేది. దీపక్‌కు చెప్పి, గౌరీపతి నర్సరీకి వెళ్లి చిన్నిని పిక్ అప్ చేసుకున్నాడు. ఇంటికి వెళుతున్న దారిలో చిన్ని ఆ రోజు బడిలో జరిగినవి తండ్రికి ఉత్సాహంగా చెప్ప నారంభించేడు. గౌరీపతి అవి వినే దశలో లేడు. జరిగిన విషాదవార్త ఆ అమాయకుడికి ఎలా చెప్పడమా అని మనసులో మథనపడుతున్నాడు. ఇంటికి వెళ్లి తల్లితో ఆ విషయాలన్నీ చెబుదామని అనుకొంటున్నాడో ఏమో గాని, ఆ ముక్కుపచ్చలారని అమాయకునకు తను తల్లిలేని బిడ్డనయ్యేయని తెలియదు కదా. విధి వైపరీత్యం.

ఇంటిదగ్గరకు రాగానే, చిన్ని పరుగున “అమ్మా” అంటూ తల్లి గది దిక్కు వడిగా వెళ్ళేడు. గౌరీపతి పరుగున వెళ్లి, తనయుని బిగ్గరగా దగ్గరకు తీసుకొని, “నాన్నా, అమ్మ ఇంట్లో లేదు.” అని ఇంకా చెప్పబోతూ ఉంటే, “అమ్మ ఎక్కడికి వెళ్లింది. నన్ను అక్కడికి తీసుకెళ్లండి.” అని తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకొన్నాడు. గౌరీపతి నెమ్మదిగా తనయుణ్ణి తన గదిలోనికి తీసుకెళ్లేడు. తండ్రి చేయి పట్టుకొని చిన్ని పదేపదే “నన్ను అమ్మ దగ్గరకు తీసుకెళ్లండి.” అని ఏడుపు ముఖంతో అడగనారంభించేడు. ఇది దాచిపెట్టే వ్యవహారం కాదని గ్రహించి, గౌరీపతి చిన్నిని గుండెలకు దగ్గరగా తీసుకొని, “నాన్నా, అమ్మ దేముడి దగ్గరకు వెళ్ళింది. మనం అక్కడికి వెళ్ళలేం బాబూ.” అని ఓదారుస్తూ చెప్పగానే, చిన్నికి ఏదో జ్ఞాపకం వచ్చింది. ఈ మధ్యనే శ్రీవల్లిపురం వెళ్ళినప్పుడు తను మామ్మను అడిగేడు, మనుషులు చచ్చిపోయేక ఎక్కడకి వెళతారని. చచ్చిపోయేక మనుషులు దేముడి దగ్గరకు వెళతారని అన్నపూర్ణ చెప్పింది. అది చిన్ని స్మృతి పథకంలో ఒక్కసారిగా కనిపించింది. వెంటనే, “అమ్మ దేముడి దగ్గరికి వెళ్ళిందా.. అమ్మ చచ్చిపోయింది నాన్నగారూ..” అని తండ్రిని శక్తికొలది ఊపుతూ, బిగ్గరగా ఏడుస్తూ, ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యేడు. ముఖంలో ఏ భావనా లేదు. ఎటో చూస్తున్నట్టు కళ్ళు పెట్టేడు. ఏమి చేసినా స్పందన లేదు. నోట మాట లేదు. గౌరీపతి వాణ్ణి ఊపి ఊపి, “నాన్నా. చిన్నీ.” అని బిగ్గరగా పిలుస్తూంటే, దగ్గరలోనే ఉన్న దిలీప్, తొందరగా గదిలోనికి వచ్చేడు.

మనసులో పొంగి పొరలి వస్తున్న దుఃఖాన్ని వెలువరించలేని పరిస్థితి, అంధకారంగా కనిపిస్తున్న భవిష్యత్తు, వాటికి తోడు కన్నకొడుకుకి ఏమయందా అనే ఆందోళన, అవన్నీ గౌరీపతిని ఏమి చేయడమో తెలియని స్థితిలోకి నెట్టింది. చిన్నిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలని దీపక్ సలహా ఇవ్వడంతో గౌరీపతి, దీపక్‌తో బాటు చిన్నిని కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లేడు. జరిగినదంతా వివరంగా డాక్టరుకు చెప్పేడు. చిన్నిని ఐసీయు లో ఒక పీడియాట్రీషియన్ (చిన్నపిల్లల వైద్యనిపుణుడు) పరీక్షించి సేవలు ప్రారంభించేడు. గౌరీపతి బిక్కుబిక్కుమని కంట తడిపెడుతూ ఉంటే, దీపక్, ధైర్యం చెప్పేడు. కొంతసేపటికి, డాక్టరు వచ్చి గౌరీపతితో, “సార్, మీ అబ్బాయి నార్మల్ అయ్యేడు. కాని ఇంకా మాట్లాడ్డం లేదు. కొంత టైమ్ పడుతుంది. వాడి వైటల్ ఆర్గన్స్ అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. మరే సమస్య లేదు. చిన్నపిల్లలు వాళ్లకు ఏదైనా ప్రీతికరమయిన బొమ్మ చెడిపోతేనే ఎంతగానో ఏడుస్తారు. అటువంటిది కన్నతల్లి పోయిందని అకస్మాత్తుగా తెలిస్తే చిన్నపిల్లడి మనసు ఎంత బాధపడి ఉంటుందో చెప్పలేం. ఆ షాక్ అబ్బాయి తట్టుకోలేకపోయేడు. Catatonic state లోకి వెళ్లిపోయేడు. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే తేవడం మంచిపని చేసేరు. ఉన్న వాతావరణం నుండి మార్పుకు కొద్ది రోజులు ఎక్కడికైనా వాణ్ణి తీసుకెళ్లగలిగితే మంచిది. మీరిప్పుడు మీ అబ్బాయిని చూడవచ్చు.” అని, ఇంగ్లీష్ లో సలహా ఇచ్చేడు. గౌరీపతి ఒక చిన్న కాగితం మీద నాలుగు టెలిఫోన్ నంబర్లు రాసి, అవి ఎవరెవరివో రాసిచ్చి, దగ్గరలోనున్న ఒక పబ్లిక్ బూత్ కు వెళ్లి వాళ్లకు భార్య విషాదవార్త తెలియజేయమని దీపక్‌కు చెప్పేడు. చిన్ని ఆసుపత్రిలోనున్నట్టు చెప్పొద్దన్నాడు. ఇంట్లో పడుకున్నాడని చెప్పమన్నాడు. తను చిన్ని పక్కనే ఉన్నానని చెప్పమన్నాడు. అంతలో వాళ్ళెవరైనా ఫోన్ చేస్తే సమస్య అవుతుందని తలచి, దీపక్ నాలుగడుగులు ముందుకు వేయగానే, వెనక్కి పిలిచి, ఇంట్లో టెలిఫోన్ పని చేయడం లేదని, అందుచేత పబ్లిక్ బూత్ నుండి ఫోన్ చేస్తున్నానని చెప్పమన్నాడు. గౌరీపతి చిన్ని దగ్గరకు వెళ్ళేడు.

దీపక్ శ్రీవల్లిపురం, విశాఖపట్నం, నవరంగపట్నం, హైదరాబాదు, ఫోన్ చేసి గౌరీపతి సలహా పాటించేడు. ఒక్కమారుగా విన్న ఆ విషాధ వార్త, వారిమీద పిడుగు పడ్డట్లయింది. అన్నపూర్ణ తలబాదుకొని విలపిస్తుంటే, గణపతి తన మనసును గట్టి చేసుకొని ఓదారుస్తున్నాడు. చిట్టితల్లి శోకంలో మునిగి ఉంటే మూర్తి ఓదారుస్తూ వెంటనే పూనా వెళ్లాలని చెప్పేడు. చిట్టితల్లి, మూర్తి, ఫోన్ చేసి, అన్నపూర్ణకు ధైర్యం చెబుతూ, తమలో ఎవరో ఒకరు వెంటనే పూనా వెళుతున్నామని చెప్పేరు. మూడేళ్ల క్రితం భార్య పరలోకం చేరినందువల్ల, హైదరాబాదులో మాధవన్ నాయరుని ఆ రాత్రి ఓదార్చేవారు లేకపోయేరు. మంగమ్మ కంటి తడిని భర్త, కొడుకు, కోడలు, ఆపే ప్రయత్నం చేసేరు. ఒక గంట తరువాత శర్మ, మంగమ్మ, శ్రీవల్లిపురం ఫోను చేసి తమ సంతాపం తెలియజేసేరు. ప్రస్తుత పరిస్థితులలో చేయగలిగింది ఏదీ లేనందున ధైర్యంగా ఉండమని చెప్పేరు. విశాఖపట్నంలో చిట్టితల్లి, మూర్తి, పిల్లలను ఇంట్లో వదలి వెళ్లలేరు. తమతో తీసుకెళదామా అంటే, ఆ పరిస్థితులలో చిన్న పిల్లలను అక్కడకు తీసుకెళ్లడం భావ్యం కాదనుకున్నారు. అందుచేత ఇద్దరూ పూనా వెళ్లడం కుదరదు; అయితే ఎవరు వెళ్లడమా అని ఆలోచిస్తున్నారు. కొంతసేపటికి, సింహాద్రి ఫోన్ చేసి, వెంటనే పూనా వెళుతున్నానని, మరునాటికి ఫ్లైట్ టికెట్ తీసుకోమని మూర్తికి చెప్పేడు. మొదట భార్యాభర్తలిద్దరూ వెళదామనుకున్నారని, పూనాలో ఎన్నాళ్ళు ఉండవలసి వస్తుందో అని, అన్నాళ్ళు కోచింగు సెంటరు మూయడం ఉచితం కాదని, అందుచేత తానొక్కడే వెళితే, లావణ్య సెంటరును చూసుకోగలదని తలచి ఒక్కడే వెళ్ళడానికి నిశ్చయించేనన్నాడు. సింహాద్రి ఫోను విన్నాక, తను ఉండడానికి, చిట్టితల్లిని సింహాద్రితో పంపడానికి మూర్తి నిశ్చయించేడు. ఆ ఇద్దరికీ ఫ్లైటులో మరునాటికి బెంగళూరు మీదుగా పూనాకు రిజర్వేషన్లు అయ్యేయి. నవరంగపట్నంలో మంగమ్మ, శర్మ, శ్రీవల్లిపురం వెళ్లడానికి ఆలోచనలోనున్నారు. ఇద్దరూ వెళితే, ఇంటివద్ద కోడలుకు ఇబ్బందని తలచి, మంగమ్మ ఒక్కతే వెళ్ళడానికి నిశ్చయించేరు.

పూనా ఆసుపత్రిలో డాక్టరు మరోమారు చిన్నిని చూసి వాణ్ణి ఇంటికి తీసుకెళ్లొచ్చన్నాడు. ఈ లోగా, గౌరీపతి చెప్పినవారికి ఫోన్లు చేసి, దీపక్ ఆసుపత్రి చేరుకొన్నాడు. గౌరీపతి, దీపక్, చిన్నితో ఇల్లు చేరుకొన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు నారాయణమ్మ పనిలోనికి వచ్చింది. డ్రాయింగు రూములో సుమారు పది మంది విచారవస్థలో ఉండడం గమనించింది. వాళ్ళనుండి విషాదవార్త విని నమ్మలేకపోయింది. ఏడ్పు ప్రారంభించగానే, వారిలో ఒకరు పరిస్థితి బోధపరచి ఏడవవద్దని సలహా ఇచ్చేడు. నారాయణమ్మ గది బయటనుండే గౌరీపతికి శోకాన్ని తెలియబరచి, కళ్ళు తుడుచుకొంటూ పనిలోకి వెళ్ళింది. గౌరీపతి చిన్నికి భోజనం పెడదామని ప్రయత్నించేడు. చిన్ని సమ్మతించలేదు. గౌరీపతి ఒక గ్లాసులో, వేడిచేసి చల్లారబెట్టిన పాలు చిన్నికి త్రాగడానికిచ్చేడు. చిన్ని సగం తాగి, మూలుగుతూ సంజ్ఞలతో మరి వద్దన్నాడు. గౌరీపతి చిన్నిని నిద్రబుచ్చడానికి ప్రయత్నించేడు. కాని చిన్ని ఏదో ఆలోచనలోనున్నట్లు చూస్తూ అలా పక్కమీద పరున్నాడు. గౌరీపతి, దీపక్, బ్రెడ్డు, బటరు, సేవించేరు. గౌరీపతి, దీపక్ కు ధన్యవాదాలు తెలుపుతూ, ఇంటికి వెళ్ళమని మర్యాదగా చెప్పేడు. దీపక్ నచ్చచెప్పి ఆ రాత్రి గౌరీపతి ఇంట్లోనే పడుకున్నాడు. గౌరీపతి అంధకారమయిన తన భవిష్యత్తును తలచుకొంటూ చిన్నిని నిద్రబుచ్చడానికి ప్రయత్నించేడు. చాలాసేపటికి చిన్ని నిద్రాదేవి ఒడిలో చేరేడు. గణపతి ఏవో ఆలోచనలతో చిన్నిని దగ్గరగా తీసుకొని రాత్రంతా మేలుకొనే ఉన్నాడు.

(సశేషం)

Exit mobile version