Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పునరావృతం-19

[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా మాధురిని పెళ్ళి చేసుకుంటాడు గౌరీపతి. ఆ దంపతులకు కొడుకు పుడతాడు. కొడుక్కి తండ్రి పేరే పెట్టి, కొడుకు ఫోటోని అమ్మానాన్నలకు పంపుతాడు. అన్నపూర్ణ, గణపతి ఫోటో చూసి సంతోషిస్తారు. కొడుకునీ కోడలినీ, మనవడిని ఇంటికి పిలవమని చెప్తుంది. చిట్టితల్లి కూడా చెప్పమంది అని అంటుంది అన్నపూర్ణ. వారందరి కోరిక మీద పూనా నుంచి గౌరీపతి సకుటుంబంగా శ్రీవల్లీపురం వస్తాడు. తల్లిదండ్రులని క్షమాపణ కోరుతాడు. మాధురి కూడా అన్నపూర్ణకు చేరువ అవుతుంది. వారం రోజులు తల్లిదండ్రులతో గడిపి, అక్క దగ్గరకీ, మేనత్త దగ్గరకీ భార్యతోనూ, కొడుకుతోనూ వెళ్తాడు గౌరీపతి.  ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి అత్తగారిని, మావగారిని కలుస్తాడు. అందరూ సంతోషంగా ఉంటారు. మూడేళ్ళు గడుస్తాయి. బిడ్డని చూసుకోడానికి ఉద్యోగం మానేస్తుంది మాధురి. ఆ వేసవి సెలవల్లో శ్రీవల్లీపురం వెళ్ళివస్తారు. చిన్న గణపతికి ఎన్నో సందేహాలొస్తాయి. మామ్మని అడిగి తెలుసుకుంటాడు. పూనా చేరాక ఓ రోజు హఠాత్తుగా మాధురికి గుండెపోటు వస్తుంది. భర్తకి ఫోన్ చేసి వెంటనే రమ్మంటుంది. కంగారుపడిన గౌరీపతి, దీపక్ అనే కొలీగ్‌ని వెంటపెట్టుకుని వస్తాడు. మాధురిని ఆసుపత్రిలో చేరుస్తారు. కానీ ఆమె బతకదు. పార్థివ దేహాన్ని ఐస్ బాక్స్‌లో పెట్టించి, నర్సరీకి వెళ్ళి కొడుకుని పికప్ చేసుకుంటాడు గౌరీపతి. ఇంటికి రాగానే అమ్మా అంటూ లోపలికి వెళ్ళి తల్లి కనబడకపోయేసరికి, అమ్మేది అని అడుగుతాడు. వాడికి అబద్ధం చెప్పడం ఇష్టం లేక, అమ్మ దేవుడి దగ్గరకి వెళ్ళిపోయిందని చెప్పేస్తాడు. ఆ వార్త వినగానే గణపతి షాక్ గురవుతాడు. కుదిపినా కదలకపోయేసరికి వాడ్ని పిల్లల ఆసుపత్రిలో చేర్చుతాడు. దిలీఫ్ ద్వారా అందరికీ ఫోన్లు చేయించి కబురందిస్తాడు. చిట్టితల్లి, సింహాద్రి, మంగమ్మ పూనా బయలుదేరుతారు. కొంతమంది కొలీగ్స్ వచ్చి గౌరీపతిని పరామర్శిస్తారు. దీపక్ ఆ రాత్రికి అక్కడే ఉండిపోతాడు. నిద్రపట్టని గౌరీపతి మేల్కొనే ఉంటాడు. – ఇక చదవండి.]

తెల్లవారింది. దీపక్ ఇంటికి వెళ్లి త్వరలోనే వస్తానని చెప్పి వెళ్ళేడు. చిన్ని ఇంకా పడుకొనే ఉన్నాడు. గౌరీపతి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ చేసుకు త్రాగేడు. తల్లితోనా, అక్కతోనా మాట్లాడ్డం అని ఆలోచించేడు. అక్కతో మాట్లాడడం మంచిదనుకున్నాడు. విశాఖపట్నం ఫోన్ చేసేడు. మూర్తి అందుకున్నాడు. ఫోనులో నంబరు చూసి అది గౌరీపతి నుండే అని తెలుసుకున్నాడు. ధైర్యం కూడగట్టుకొని మాట్లాడబోతూ ఉంటే, “బావా,” అని గౌరీపతి ఏడ్వడం మొదలుపెట్టేడు. మూర్తి కంట తడిని ఆపుకోలేకపోయేడు. “We are all extremely sorry. చాలా ఘోరమయిపోయింది. మాధురి అందరితో కలసి మెలసి ఉండేది. మా పిల్లలకి కథలు చెప్తూండేది. Nice lady. భగవంతుడు ఇటువంటివి ఎందుకు చేస్తాడో తెలీదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. చిన్ని ఎలా ఉన్నాడు. వాడి గురించి అందరం బెంగపడుతున్నాం.” అని అడగగానే చిన్ని విషయంలో జరిగినదంతా గౌరీపతి చెప్పేడు. “Oh my God. నువ్వు ఎలా భరించేవు బాబూ. మేమెవ్వరం అక్కడ లేకపోయేం. కబురు తెలిసిన వెంటనే ఎవరో ఒకరు వీలయినంత వేగరం నీ దగ్గరకు వెళ్లాలని ఆలోచించాం. సింహాద్రి, చిట్టితల్లి, బెంగళూరు మీదుగా పూనా బయలుదేరేరు. ఇప్పుడే ఫ్లైటు టేక్ ఆఫ్ చేసి ఉంటుంది.” అని చెప్పి, సింహాద్రి, చిట్టితల్లి వెళుతున్న ఫ్లైట్ వివరాలు ఇచ్చేడు. ఈలోగా చిన్ని లేచినట్లయింది. “బావా, చిన్ని లేచినట్టుంది. వెళ్ళాలి.” అని గౌరీపతి ఫోన్ పెట్టేసేడు. చిన్నికి బ్రష్ చేయించి, త్రాగడానికి పాలు ఇచ్చేడు. పాలు త్రాగేక చిన్ని మళ్లీ పడుకున్నాడు. నారాయణమ్మ వచ్చి తన పనులు ప్రారంభించింది.

గౌరీపతికి శ్రీవల్లిపురం నుండి ఫోను వచ్చింది. ఎత్తుకోగానే, తల్లి కంఠం విని, “అమ్మా..” అని ఏడవ నారంభించేడు. అటు అన్నపూర్ణ కూడా “నాన్నా..” అంటూ రోదిస్తూ ఉంటే, గణపతి అన్నపూర్ణను ఓదారుస్తూ, ఫోను తను తీసుకొని, “నాయనా, నీకు ఇంత కష్టం వస్తుందనుకోలేదు. వార్త తెలిసినప్పటి నుండి ఎంతో బాధపడ్డాం. నీకేమీ చేయలేని స్థితిలో ఉన్నాం. ధైర్యంగా ఉండు, నాయనా. చిట్టితల్లి, సింహాద్రి, మీ ఊరు బయలుదేరేరు.” అని ఇంకా మాట్లాడబోతూ ఉంటే, ఎవరో డోర్ బెల్ వాయించడం విని, “నాన్నగారూ, ఎవరో వచ్చినట్టుంది, వెళ్ళాలి.” అని చెప్పి, తలుపు తీయడానికి వెళ్ళేడు. బ్యాంకు కష్టమర్లు నలుగురు పరామర్శించడానికి వచ్చేరు.

పది గంటల ప్రాంతంలో దీపక్ వచ్చేడు. ఎనిమిది ఇడ్లీలు, సాంబారు, చట్నీ, నీట్ గా పేక్ చేసినవి హోటల్ నుండి తెచ్చేడు. చిన్ని, అమర్ చిత్ర కథ పుస్తకాలలో బొమ్మలు చూడడంలో ఉన్నాడు. గౌరీపతి చిన్నికి అతికష్టం మీద రెండు ఇడ్లీలు తినిపించేడు. దీపక్‌ను కూడా తీసుకోమంటే తన బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందన్నాడు. నారాయణమ్మ చిన్నికి స్నానం చేయించి మడతబట్టలు తొడిగి తల దువ్వింది. స్నానం చేయిస్తున్న సమయంలో తల్లితో ఆడిన ఆటలు, తల దువ్వించుకోడానికి షరతు పెట్టి తల్లి చేసిచ్చిన పాయసం తినే రోజులు ఆ దురదృష్టవంతుని జీవితంలో మరి రావు కదా. ఏదీ తెలిసీ తెలియని లోకంలో, చిన్ని మళ్లీ ఆ పుస్తకాలు చూడ్డం మొదలుపెట్టేడు.

పన్నెండు గంటలు కావస్తోంది. దీపక్‌ను ఇంటివద్ద ఉండమని, గౌరీపతి ఎయిర్ పోర్టుకు వెళ్ళేడు. తోటి ప్రయాణికులతో బాటు చేతిలో బేగులతో వస్తున్న సింహాద్రి, చిట్టితల్లిని దూరంనుండే చూసి, వడివడిగా వెళ్లి, “అక్కా..” అని వస్తున్న ఏడుపును ఆపుకొంటూ, చిట్టితల్లి భుజం మీద వాలిపోయేడు. చిట్టితల్లి, తన దుఃఖాన్ని దిగమ్రింగుకొంటూ, తమ్ముణ్ణి ఓదార్చ ప్రయత్నించింది. సింహాద్రి ఇద్దరినీ ఓదార్చి, తన గాఢ సంతాపం గౌరీపతికి తెలియజేసేడు. ఇంటికి వెళుతున్న సమయంలో గౌరీపతి జరిగినదంతా వాళ్ళకి చెప్పేడు. చిన్ని గూర్చి చెప్పగానే, వాళ్ళు దుఃఖాన్ని ఆపుకోలేకపోయేరు. అట్టి క్లిష్ట సమయంలో ఎవ్వరం లేకపోయేం, ఎలా భరించేవో, అని సింహాద్రి సానుభూతి తెలియజేసేడు. గౌరీపతి తన ఆఫీసులో పని చేస్తున్న దీపక్ అనే ఆఫీసరు తనకు ఎలా తోడ్పడుతున్నది చెప్పేడు. ముగ్గురూ ఇల్లు చేరుకొన్నారు. చిట్టితల్లి వడివడిగా చిన్నిదగ్గరకు వెళ్ళింది. అత్తను చూడగానే చిన్ని, “అత్తా, అమ్మ దేముడు దగ్గరికి వెళ్లిపోయింది” అని ఏడవ నారంభించేడు. తన దుఃఖాన్ని దిగమ్రింగుకొంటూ, చిట్టితల్లి వాణ్ణి ఓదార్చింది. కొంతసేపటికి గౌరీపతి అఫీసు ప్యూను ఒక పెద్ద కేరియరు తెచ్చి, సావిత్రీ మేడమ్ పంపారని చెప్పి ఇచ్చేడు. చిట్టితల్లి చిన్నికి ఆప్యాయంగా భోజనం తినిపించింది. తరువాత నలుగురూ భోజనం చేసేరు. గౌరీపతికి అందజేస్తున్న సహాయానికి, సింహాద్రి, చిట్టితల్లి, దీపక్‌ను కొనియాడి, ధన్యవాదాలు చెప్పేరు. గౌరీపతి, ట్రేవల్ ఏజెంటుకు ఫోను చేసి, ఆనాటికి రెండవ రోజున పూనా నుండి విశాఖపట్నానికి ఫ్లైటులో వివరాలిచ్చి నాలుగు టిక్కెట్ల రిజర్వేషనుకు చెప్పేడు.

మధ్యాహ్నం మూడు గంటలు దాటింది. మాధురి పార్థివ దేహాన్ని దహనసంస్కారం చేయడానికి సన్నాహాలయ్యేయి. చిన్నికి ఆ పార్థివ దేహం చూపడం శ్రేయస్కరం కాదనుకున్నారు. అమ్మ దేముడు దగ్గరకు వెళ్ళిందన్న వాడి అభిప్రాయం అలాగే ఉండనిద్దామనుకొన్నారు. దీపక్ మరో ఇద్దరి సాయంతో దహనసంస్కారానికి అన్ని ఏర్పాట్లు చేసేడు. గౌరీపతి, సింహాద్రి దహనసంస్కారానికి వెళ్ళేరు. ఆది ముగించుకుని, సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు. ఓ అరగంటలో హైదరాబాదునుండి మాధవన్ నాయరుగారు వచ్చి అల్లుడికి సంతాపం తెలియజేసి, చిన్నిని దగ్గరగా తీసుకొని కంట తడి పెట్టుకున్నారు. చిన్నిని జాగ్రత్తగా చూసుకోమని గౌరీపతికి సలహా ఇచ్చి, ఆయన హోటలుకు వెళ్లిపోయేరు.

ఆ మరునాడు పది గంటల ప్రాంతంలో, గౌరీపతి, సింహాద్రి, దిలీప్, స్మశానానికి వెళ్లి, మాధురి అస్థికలను అందుకుని, పూనాకు దగ్గరలో ఉన్న, మూలా-ముత్తా నదిలో నిమజ్జనం చేసి ఇంటికి వెళ్ళేరు. గౌరీపతి ఒక నెల శలవు తీసుకొన్నాడు. ఆ మరునాడు మామ్మగారింటికి వెళుతున్నామని చిన్నికి చెప్పేడు. “మామ్మ నాకు కథలు చెప్తుంది.” అని చెప్పి, అమర్ చిత్ర కథ పుస్తకాలన్నీ తెచ్చి తండ్రి ముందు పెట్టేడు. గౌరీపతి అవి జాగ్రత్తగా పెట్టెలో పెట్టేడు.

గౌరీపతి, చిట్టితల్లి, సింహాద్రి, చిన్నితో బాటు విశాఖపట్నం చేరుకున్నారు. సింహాద్రి వెంటనే నవరంగపట్నం వెళదామనుకొన్నాడు. మూర్తి, చిట్టితల్లి, చెప్పడంతో ఆ రాత్రికి ఉండి, మరునాడు ఉదయాన్నే టాక్సీ చేయించుకొని స్వంత గూటికి చేరుకున్నాడు. మూర్తి, చిట్టితల్లి, ఆలోచించుకున్నారు. మరి కొన్నాళ్ళు పిల్లలను చూసుకోగలనని చెప్పి, మూర్తి చిట్టితల్లిని గౌరీపతితో బాటు శ్రీవల్లిపురం వెళ్ళమన్నాడు. ఆ రోజే టాక్సీలో గౌరీపతి, చిట్టితల్లి, చిన్నితో బాటు శ్రీవల్లిపురం చేరుకున్నారు.

అన్నపూర్ణను చూడగానే, చిన్ని, “మామ్మా, అమ్మ దేముడి దగ్గరకు వెళ్లిపోయింది.” అని ఏడుపు ప్రారంభించగానే, అన్నపూర్ణ తన దుఃఖాన్ని దిగమ్రింగుకొని మనవణ్ణి ఓదారుస్తూ, వాడి మనసు మళ్లించడానికి ప్రయత్నించింది. దుఃఖంతో కుమిలిపోతున్న తనయుణ్ణి తల్లిదండ్రులిద్దరు ఓదార్చేరు. గణపతి అధ్వర్యంలో మాధురి కర్మకాండ శాస్త్రోక్తంగా జరిగింది. చిట్టితల్లి విశాఖపట్నానికి వెళ్లింది.

గౌరీపతి బేంకు హెడ్ ఆఫీసుకి వెళ్లి తన పరిస్థితి జనరల్ మేనేజరుకు విన్నవించుకున్నాడు. తన తల్లిలేని బిడ్డ పెంపకంలో తను ఆంధ్రాలో ఉంటే సహాయపడుతుందని చెప్పుకున్నాడు. ఆ దృష్టిలో తన ట్రాన్స్‌ఫర్ కోరుకున్నాడు. ఆ జి.ఎం.కు గౌరీపతి మీద సదభిప్రాయముంది. గౌరీపతి భార్యావియోగానికి సంతాపం తెలియబరచి, ట్రాన్స్‌ఫర్ విషయంలో త్వరలో తగు నిర్ణయం తీసుకొంటానని జి.ఎం. తెలియబరిచేడు. గౌరీపతి ధన్యవాదాలు సమర్పించుకుని శ్రీవల్లిపురం చేరుకొన్నాడు.

ఇక్కడ చిన్ని సేవలు మామ్మ చేస్తోంది. వాడు రాత్రి మామ్మదగ్గరే పడుకొంటున్నాడు. అన్నపూర్ణ వాడికి పురాణగాథలు వినిపిస్తూంటే నిద్రపోతున్నాడు. రోజూ తాతగారు పూజ చేసుకొంటూ ఉంటే దగ్గరలోనే బుద్ధిగా మఠం వేసుకు కూర్చొని చూస్తుంటాడు. రోజూవలె ఒకరోజు గణపతి పూజ అయ్యేక గంట వాగించేడు. ఆది విన్నాక “తాతగారూ దేముడి దగ్గర గంట ఎందుకు వాయిస్తారు.” అని చిన్ని అడిగేడు. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడటానికి గంట వాయిస్తారని ఆ కుర్రకుంకకు బోధపరచడం అవివేకమనుకొని, “బాబూ, గంట వాగిస్తే దేముడికి ఇష్టం.” అని సమాధానపరిచేడు. ఆ విషయం గణపతి అన్నపూర్ణకు చెప్పేడు. “ఇంత చిన్న వయసులో ఎందుకో వాడికీ సందేహాలు. రాత్రి వాడు పడుకుపోయేముందు కథలు చెబుతూ ఉంటే నన్ను కూడా ఇటువంటివే అడుగుతూంటాడు. దేముడికి నాలుగు చేతులు దేనికని ఓ మారు అడిగేడు. దేముడు ఎన్నో పనులు చెయ్యాలి కదా అంచేత నాలుగు చేతులున్నాయి అని చెబితే నమ్మినట్టున్నాడు.” అని అన్నపూర్ణ చెప్పింది.

మూడు వారాలు గడిచేయి. విశాఖపట్నం బ్రాంచికి మేనేజరుగా గౌరీపతి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ అందుకున్నాడు. చాలా సంతోషించేడు. జి.ఎం.కు ధన్యవాదాలు ఫోనులో చెప్పుకొన్నాడు. విశాఖపట్నం బ్రాంచ్ బిజినెస్ ఆశించిన విధంగా లేదని, గత మూడు సంవత్సరాలనుండి నష్టాల్లో ఉందని, దాన్ని గాడిలో పెట్టాలని, ఆ విషయంలో ఏ సహకారం అవసరమయినా నిస్సంకోచంగా తెలియబరచమని జి.ఎం. గౌరీపతికి సలహా ఇచ్చేడు. గౌరీపతి ట్రాన్స్‌ఫర్ తెలుసుకొని అన్నపూర్ణ, గణపతి సంతోషించేరు. ఆ పరిణామం విశాఖపట్నం, నవరంగపట్నానికి చేరింది. వారందరూ సంతసించేరు. గౌరీపతి పూనా వెళ్లి, రిలీవ్ అయి, విశాఖపట్నం బ్రాంచిలో మేనేజరుగా జాయినయ్యేడు.

తాముంటున్న ఫ్లాట్‌కు దగ్గరలో ఏదయినా టు బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు చూడమని గౌరీపతి మూర్తితో చెప్పేడు. చిట్టితల్లి కూడా అక్కడే ఉంది. “తమ్మూ, నువ్వు వేరే ఉండడం దేనికి. మాతోనే ఉండొచ్చు. మాదో బెడ్ రూమ్ ఖాళీగానే ఉందికదా.” అని చిట్టితల్లి స్పందించింది.

“అక్కా, నేను ఈ ఊళ్ళో నెలా రెండునెలలకు రాలేదు కదా. కనీసం మూడు సంవత్సరాలు ఉంటాను. అంచేత వేరే ఉందామనుకొంటున్నాను. మీకు దగ్గరలోనే ఉంటాను. మీ వంటమనిషి, పనిపిల్ల, నా దగ్గర పనిచేస్తారేమో కనుక్కో. కాకపోతే మరెవరినైనా మాట్లాడు.” అని, గౌరీపతి మనసులో మాట చెప్పేడు.

“గౌరీ, నువ్వు మా దగ్గర ఉంటే మాకే ఏ ఇబ్బంది లేదు. వేరే మరో ఎస్టాబ్లిష్మెంట్ దేనికి. నువ్వు, చిన్ని ఉంటే మాకు కూడా మంచి కాలక్షేపం.” అని, చిట్టితల్లి ఆలోచనకు మూర్తి మద్దత్తు ఇచ్చేడు.

“బావా, మీ ఇద్దరి అభిమానానికి చాలా థాంక్స్. వీలయినప్పుడల్లా మీతోనే స్పెండ్ చేస్తాను. నాకు మాత్రం ఇక్కడ మరెవరున్నారు చెప్పు.”

“సరే, ఆలోచిద్దాం.” అని మూర్తి సంభాషణకు తెర దింపేడు.

మూర్తి, చిట్టితల్లి ఆలోచించుకొన్నారు. గౌరీపతిని అర్థం చేసుకొన్నారు. అన్నాళ్ళు ఉండడానికి మొహమాటపడుతున్నాడని పోల్చుకున్నారు. వారి మీద భారం మోపకుండా స్వంత ఖర్చుల మీద వేరే ఉందామనుకొంటున్నాడు. ఆ స్వాభిమానం సహజమే. గౌరీపతి వేరే నివసిస్తే, ఒంటరితనం వాడికి శ్రేయస్కరం కాదనుకున్నారు. చిన్ని మీద కూడా ప్రభావం పడుతుంది. అందుచేత ప్రతినెలా గౌరీపతి వద్ద కొంత డబ్బు తీసుకొంటే, వాడికి మొహమాటం ఉండదనుకొన్నారు. గౌరీపతిని భార్యాభర్తలిద్దరూ సమాధానబరచి, ఆలోచించిన ప్రణాళిక అమలు చేసేరు. గణపతి, అన్నపూర్ణ, ఆ ఏర్పాటు తెలుసుకొని సంతసించేరు. మూర్తిని, చిట్టితల్లిని ప్రశంసించేరు. గౌరీపతి శ్రీవల్లిపురం వెళ్లి రెండు రోజులుండి, చిన్నితోబాటు విశాఖపట్నం చేరుకున్నాడు.

గౌరీపతి రోజూ బ్యాంకుకు వెళ్లనారంభించేడు. చిన్ని సేవలన్నీ చిట్టితల్లి చేస్తోంది. అలా కొన్ని నెలలు గడిచాక చిట్టితల్లి వాడికి తెలుగు అక్షరాలు నేర్పడం మొదలెట్టింది. చిన్ని చకచకా నేరుస్తున్నాడు. గౌరీపతి అమర చిత్ర కథా పుస్తకాలు కొత్తవి తెచ్చి చిన్నికి ఇస్తున్నాడు. చిట్టితల్లి వాడికవి చదివి వినిపించి బోధపరుస్తోంది. వీలయినప్పుడల్లా గౌరీపతి చిన్నితోబాటు శ్రీవల్లిపురం వెళ్లి తల్లిదండ్రులవద్ద గడుపుతున్నాడు. అక్కడ వారికి తగు సదుపాయాలు సమకూర్చేడు. అన్నపూర్ణకు వంటమనిషి సేవలు ఏర్పడ్డాయి. తాతగారింట ఎప్పుడున్నా, గణపతి పూజాసమయంలో చిన్ని తాతగారికి దగ్గరలో బుద్ధిగా మఠం వేసుకొని కూర్చొని పూజను తిలకించడం పరిపాటయింది. ఒకరోజు చిన్నికి ఏదో సందేహం వచ్చింది. మామ్మను, “మామ్మా, తాతగారు ఏమిటి చదువుకున్నారు.” అని అడిగేడు. “తాతగారు పురాణాలు.. వేదాలు.. పూజలు చెయ్యడం.. నేర్చుకొన్నారు బాబూ.” అని, అన్నపూర్ణ బుజ్జగిస్తూ చెప్పింది.

చిన్నికి ఆరేళ్లు నిండేయి. ఒకటవ తరగతిలో అడుగు పెట్టేడు. శ్రద్ధగా చదువుకొంటున్నాడు. కాలచక్రం ఒక సంవత్సరం ముందుకు దొర్లింది. చిన్ని రెండవ తరగతిలోకి వచ్చేడు. ఒకమారు తాతగారింట ఉన్నప్పుడు మామ్మని “మామ్మా, తాతగారు నన్ను ఆఫీసుకు తీసుకెళతారా. నాన్నగారు నన్ను వాళ్ళ ఆఫీసుకు తీసుకెళ్లేరు. అయిస్క్రీం ఇచ్చేరు.” అని అడిగేడు. అన్నపూర్ణ, “బాబూ, తాతగారికి ఆఫీసు లేదు. తాతగారు పూజలు పెళ్ళిళ్ళు చేయిస్తారు. నీకు అయిస్క్రీం కావాలా. నేను తెప్పిస్తాను.” అని, మనవణ్ణి దగ్గరగా హత్తుకుని, ముద్దులాడింది. విశాఖపట్నం చేరుకున్నాక, ఆ మరునాడు మేనత్త స్నానం చేయిస్తున్న సమయంలో, “అత్తా, తాతగారికి ఆఫీసు లేదు. మామ్మ చెప్పింది.” అని అత్తకి తెలియదేమో అని చెప్పేడు. చిట్టితల్లి స్పందిస్తూ, “అవును బాబూ. అందరూ ఆఫీసుకు వెళితే పూజలు, ఉపనయనాలు, పెళ్ళిళ్ళు ఎవరు చేయిస్తారు. తాతగారు అవి చేయిస్తున్నారు” అని విశదీకరించింది.

చిన్నికి పదిహేనేళ్ళు నిండేయి. తొమ్మిది చెప్పుకోదగ్గ మార్కులతో పాసయి పదిలోకొచ్చేడు. విద్యారంగంలో కొడుకు భవిష్యత్తు గూర్చి గౌరీపతి ఆలోచిస్తున్నాడు. ఇంజనీరింగులో పెట్టడమా లేక పి.జి. చేయించి సివిల్ సర్వీసెస్‌కి ప్రయత్నించమనడమా అని మీమాంస. మూర్తి సలహా కోరేడు. ఆ విషయంలో సింహాద్రికి బాగా అనుభవముందని అతడి సలహా తీసుకోమన్నాడు. గౌరీపతి సింహాద్రి సలహా కోరేడు. సింహాద్రి కేవలం సివిల్ సర్వీసెస్ మీద ఆధారపడడం రిస్క్ అయిపోతుందన్నాడు. ఇంజనీరింగు చేసిన తరువాత కూడా సివిల్స్ రాయొచ్చన్నాడు. లెక్కలు, సైన్సులో మంచి మార్కులు తెచ్చుకొన్నాడు కాబట్టి ఇంజనీరింగులో పెట్టమని సింహాద్రి సలహా ఇచ్చేడు. దానికి పదోతరగతి నుండి శిక్షణ పొందడం అవసరమన్నాడు. ఆ మూడు సంవత్సరాలు తన దగ్గర ఉంచితే శిక్షణ ఇస్తానన్నాడు. తప్పక సెలెక్ట్ అవుతాడని చెప్పేడు. గౌరీపతి సింహాద్రికి ధన్యవాదాలు చెప్పి, చిన్నితో మాట్లాడేక చెప్తానన్నాడు. మూడేళ్లు చిన్నికి దూరంగా ఉండడం కష్టమే అయినా వాడి భవిష్యత్తు కోసం అది తప్పదనుకున్నాడు. చిట్టితల్లి, మూర్తి కూడా ఆ విధంగానే ఆలోచించేరు.

గౌరీపతి తన గదిలో చిన్నితో తన ఆలోచన పంచుకున్నాడు. చిన్ని సావధానంగా విని, “నాన్నగారూ, నాకు ఇంకా స్కూలుకు వెళ్లాలని లేదు.” అని తండ్రి ముఖంలోనికి చూస్తూ నెమ్మదిగా చెప్పేడు. గౌరీపతి జీవితంలో ఊహించని రెండవ షాక్. గతంలో తన అర్ధాంగి మాధురి ఇక లేదని డాక్టరు చెప్పగానే, కళ్ళు చీకట్లు కమ్మి భవిష్యత్తంతా అంధకారంగా కనిపించింది. ఆ అంధకార సొరంగం నుండి బయటపడి, తన పంచప్రాణాలు వాడే అని పెంచుతున్న కొడుకు ఈ రోజు చదువుకు స్వస్తి చెప్తానని అకస్మాత్తుగా ఒక బాంబు పేల్చేడు. గౌరీపతికి నోట మాట రాలేదు. కొద్ది క్షణాల తరువాత, “నువ్వు ఇక స్కూలుకు వెళ్ళనంటే నీకు చదువు ఎలా వస్తుంది నాన్నా. నీకు ఆ స్కూలు నచ్చకపోతే ఫరవాలేదు. నవరంగపట్నంలో సింహాద్రి మామయ్య నీకు చదువు చెప్తానన్నాడు. నీకు ఇంజనీరింగులో సీటు వస్తుందన్నాడు. ఇంజనీరింగు పాసయితే నీకు పెద్ద ఉద్యోగం దొరుకుతుంది. ఆ మామయ్య దగ్గరకు వెళ్లి చదువుకో నాన్నా.” అని గారాబంగా చెప్పేడు. తండ్రి చెప్పినదంతా విని, మోకరిల్లి తండ్రికి పాదాభివందనం చేస్తూ, “నాన్నగారూ, నాకు ఎవ్వరి దగ్గరా చదవాలని లేదు. నాకు ఇంజనీరు అవ్వాలని లేదు.” అని బ్రతిమలాడుతూ వినయంగా విన్నవించుకున్నాడు. గౌరీపతి ఆదరణతో తనయుణ్ణి లేవదీసి, వాడి రెండు భుజాలను పట్టుకొని “నాన్నా. నువ్వు చదువుకోకపోతే ఎలా బాబూ. బాగా చదువుకొంటే గదా పెద్ద ఉద్యోగం చెయ్యగలవు. నా మాట విను నాయనా.” అని నచ్చచెప్ప ప్రయత్నించేడు. చిన్ని దీనంగా తండ్రి ముఖంలోనికి చూస్తూ, “నాన్నగారూ, నాకు ఉద్యోగం చెయ్యాలని లేదు.” అని చెప్పగానే, గౌరీపతి నిశ్చేష్టుడయ్యేడు. తనకు సర్వస్వము అయిన కొడుకు, ఇహ చదువుకోనని, ఉద్యోగం చెయ్యనని భీష్మించుకొంటే, ఏ తండ్రి అది ఎలా జీర్ణించుకోగలడు. గౌరీపతి జీవితంలో ఒక కఠిన సమస్య ఎదురయింది. ఆందోళనతో, “నాన్నా చిన్నీ, నువ్వు తెలివయినవాడివి. నా మాట విను నాన్నా. ఉద్యోగం చెయ్యకపోతే ఎలా బతుకుతావు తండ్రీ. చదువు మానేసి ఏమిటి చేస్తావ్ బాబూ.” అని బుజ్జగిస్తూ నెమ్మదిగా అడిగేడు. “నాన్నగారూ, నేను తాతగారి దగ్గర పూజలు చెయ్యడం, పెళ్ళిళ్ళు చెయ్యడం అవన్నీ నేర్చుకొంటాను. తాతగారి దగ్గర వేదాలు నేర్చుకొంటాను. తాతగారు ఉద్యోగం చెయ్యడం లేదు కదా. నేనూ తాతగారి పనే చేస్తాను.” అని, చిన్ని తండ్రికి మనసు విప్పి చెప్పేడు.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version