[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[అది బ్రిటిష్ వారి పాలనా కాలం! శ్రీవల్లిపురం చిన్న పల్లెటూరైనా ఊర్లోని సరస్వతి వేద విజ్ఞాన పీఠం వల్ల ఆ ఊరికి గొప్ప గుర్తింపు ఉండేది. కాలక్రమంలో పల్లె కాస్త చిన్న పట్నంగా ఎదుగుతుంది. ద్వివేదుల గౌరీపతిశాస్త్రి ఆ ఊర్లో పౌరోహిత్యం చేస్తుంటారు. ప్రవచనాలు చెప్తుంటారు. ఆయన భార్య పార్వతి, కొడుకు గణపతిశాస్త్రి, కూతురు అలివేలు మంగ. పిల్లలిద్దరీ నానమ్మ ఈశ్వరమ్మ వద్ద మాలిమి ఎక్కువ. ఆవిడ పురాణాలు, ఇతిహాసాల నుంచి నీతి కథలెన్నో పిల్లలకి నేర్పారు. నానమ్మతో చెప్పించి, తండ్రిని ఒప్పించి, నాల్గవ తరగతి తరువాత ఇంగ్లీషు నేర్పే పెద్ద క్లాసులలో చేరుతాడు గణపతి. చదువులో రాణించి గురువుల మెప్పు, జిల్లా కలెక్టర్ గారి ప్రశంసలు పొందుతాడు. తొమ్మిదో తరగతి మంచి మార్కులతో పాసవుతాడు. పదో తరగతి చదవాలని అనుకుంటాడు గానీ, తండ్రి అంగీకరించడు. పౌరోహిత్యంలో ప్రవేశపెడతాడు. నాలుగో తరగతి పూర్తవగానే మంగని చదువు మానిపిస్తారు. తల్లి వద్ద ఇంటిపనులు నేర్చుకుంటుంది. గణపతి చెల్లెలికి ఇంగ్లీషు పాఠాలు నేర్పిస్తాడు. ఓ రోజు ఉదయం పూజ చేసుకుని, కాఫీ తాగి అనాయాస మృత్యువుని ఆహ్వానిస్తుంది ఈశ్వరమ్మ. తల్లి అంత్యక్రియలు, దశదినకర్మ పద్ధతి ప్రకారం చేయిస్తారు గౌరీపతిశాస్త్రి. కుటుంబమంతా ఈశ్వరమ్మగారిని తలచుకుని బాధపడతారు. – ఇక చదవండి.]
శాస్త్రిగారు మంగమ్మకు సంబంధాలు చూస్తున్నారు. తన వృత్తిలో నున్నవారినే చేయదలిచేరు. రెండు మూడు సంబంధాలు, జాతకాలు కుదరకపోవడంతో ముందుకు వెళ్లలేదు. ఆ విషయాలు భార్యతో ముచ్చటించినపుడు గణపతి కూడా అక్కడ ఉండడం సంభవిస్తూ ఉండేది. చెల్లికి ఎవరైనా ఉద్యోగస్థుణ్ణి చేస్తే బాగుండునని గణపతి మనోవాంఛ. ఆ విషయం ఒక మారు తల్లితో చర్చిస్తూ,
“అమ్మా, చెల్లికి ఎవరైనా ఉద్యోగస్థుణ్ణి చేస్తే బాగుంటుందమ్మా. నువ్వు నాన్నగారికి చెప్పమ్మా.” అని తల్లిని కోరేడు.
“నాయనా, మన కుటుంబాల్లో ఎవరూ ఉద్యోగస్థుల్ని చేసుకోలేదు. పౌరోహిత్యం మనకు అచ్చొచ్చింది. చూడు, మీ నాన్నగారు, తాతగారు, ఆయన తండ్రి, అలా తరతరాలనుండి మనకు అదే కులవృత్తి. ఆ ఉద్యోగాల విషయం మనకు తెలీదు. తెలీని దానిలోనికి వెళ్లి, కాళ్ళు చేతులు కాల్చుకుంటే, రెంటికీ చెడతారు.” అని పార్వతి అన్నాది.
“అమ్మా, ఇంగ్లీషులో పెద్ద చదువులు చదివితే పెద్ద ఉద్యోగాలు దొరుకుతాయి. వాళ్లకి అందరూ నిలబడి దండాలు పెడతారు. గౌరవిస్తారు.” అని గణపతి తన మనసులోని కోరిక మరో విధంగా తల్లికి చెప్పేడు. గణపతికి అట్టి గట్టి అభిప్రాయం ఏర్పడడానికి గతంలో వాడి అనుభవాలు, వాటిని మించి ఒకమారు కలక్టరుగారు ఇచ్చిన సలహా కారణం.
“అదేమో గాని, చూడు, మీ నాన్నగారిని అందరూ ఎంత గౌరవిస్తున్నారో. చిన్నవాడివయినా నిన్ను కూడా చిన్న శాస్త్రిగారని పెద్దవాళ్లు కూడా మన్నిస్తున్నారా. అంతటి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా మీ నాన్నగారి పాదాలకు మొక్కి ఆశీర్వచనాలు తీసుకొంటారు. మీ నాన్నగారు బాగా ఆలోచిస్తారు బాబూ. మన వంశంలో ఎవరూ స్కూలు గడప తొక్కలేదు. అసలు ఆ పల్లెటూళ్లలో స్కూళ్లే ఉండేవికాదు. మీ నాన్నగారు నీ మంచి కోరే బడిలో వేసేరు. నువ్వే మన వంశంలో మొదటిసారిగా స్కూలుకి వెళ్లేవు. ఇంగ్లీసు నేర్చుకొన్నావ్. మీ మామ్మ కూడా పౌరోహిత్యం నేర్చుకోమనే గదా నీకు సలహా ఇచ్చింది.” అని పార్వతి విశదంగా గణపతికి చెప్పింది. గణపతి తల్లికి ఎదురు చెప్పలేదు గాని ఆమె భావనలతో మనసులో సంతృప్తి చెందలేదు. పార్వతి ఆది గ్రహించింది.
“బాబూ, అన్ని వృత్తులవాళ్ళు మనకు కావాలి. ఉద్యోగస్తులు కూడా మనకి కావాలి. ఒక వృత్తి చేసే వాళ్లు లేకపోతే వాళ్ల పని ఎవరు చేస్తారు చెప్పు. మీ నాన్నగారు , నీ వంటి వారు లేకపోతే, అందరి ఇళ్లలో పెళ్లిళ్లు, ఉపనయనాలు, పెద్దపూజలు, పునస్కారాలు ఎవరు చేయిస్తారు. ఉద్యోగస్తులకు చేతకావు గదా. అంచేత నాయనా ఎవరి వృత్తిని వారు గౌరవించుకోవాలి.” అని పార్వతి తనయునికి హితోపదేశం చేసింది. సమాజంలోని Division of labor సూత్రాన్ని తన పరిమితి జ్ఞానంలో పార్వతి కుమారునకు చెప్పింది. గణపతి మనోవాంఛ మీద మార్పుమాత్రం రాలేదు. తల్లితో వాగ్వివాదం చేయడం మంచిది కాదని తలచి, మారు మాటాడ లేదు.
శాస్త్రిగారు మంగమ్మకు చూస్తున్న సంబంధాలలో ఒకటి నిశ్చయం చేసేరు. పెళ్లికొడుకు జగన్నాథ శర్మ. శ్రీవల్లిపురానికి సుమారు యాభై మైళ్ల దూరంలోని నవరంగపట్నంలో ఉంటున్నాడు. అతడి వయసు ఇరవైనాలుగు సంవత్సరాలు. రెండు సంవత్సరాల క్రితం తండ్రి సీతారామ శాస్త్రిగారు స్వర్గస్తులయ్యేరు. జగన్నాథ శర్మ, తల్లి సుభద్రమ్మతో బాటు ఉంటున్నాడు. తండ్రి ఆ ఊళ్లోనే ప్రైవేటు యాజమాన్యంలోని వెంకటేశ్వరాలయంలో పూజారిగా ఉండేవారు. యుక్త వయసు వచ్చిననాటినుండి జగన్నాథ శర్మ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ, స్వామి పూజాకార్యక్రమాలన్నింటిలోనూ బాగా శిక్షణ పొందేడు. తండ్రి తదనంతరం దేవాలయ యాజమాన్యం కోరడంతో ఆ దేవాలయానికి పూజారి బాధ్యతలు స్వీకరించేడు. ఆ కారణంగా భక్తులు, దేవాలయంలో పనిచేసినవారు, శర్మని ‘పూజారిగారు’ అని సంబోధించడం జరిగింది. కమిటీ మెంబర్లు మాత్రం, శర్మగారనే పిలుస్తారు. శర్మకు ఒకే ఒక చెల్లి, జానకమ్మ. ఎనిమిదేళ్ళ క్రితం పెళ్లయి అత్తవారింట కాపురం చేస్తోంది. శాస్త్రిగారు ఆ వివరాలన్నీ పిల్లల సమక్షంలో భార్యకు చెప్పేరు. ఆయన విషయం ప్రారంభించిన కొద్ది సేపటికి సిగ్గుతో మంగమ్మ తన గదిలోకి వెళ్లిపోయింది. పార్వతి, గణపతి శ్రద్ధగా విన్నారు.
అంతా విన్నాక, “కుర్రాడు చూడ్డానికి ఎలా ఉన్నాడండి.” అని భర్తనడిగింది, పార్వతి.
“ఆరోగ్యంగా కనిపించేడు. సుమారు మన గణపతి ఎత్తు ఉంటాడు. ఊళ్లో నాకు తెలిసిన వాళ్లనడిగేను. కుటుంబం మంచిదన్నారు. కుర్రాడు బుద్ధిమంతుడన్నారు.” అని వివరాలతో చెప్పేరు.
“నాన్నా పెళ్లికొడుకు వయసు ఇరవైనాలుగేళ్లు అన్నారు. చెల్లికి బాగా పెద్దవాడయిపోడా.” అని గణపతి కొద్దిగా ధైర్యం తెచ్చుకొని తన సందేహం వినయంగా తెలియబరిచేడు.
“చెల్లికన్నా బాగా పెద్దవాడేమీ కాదు. ఓ పదేళ్ళే తేడా. నీకు తెలుసా. నాకు మీ అమ్మకి పన్నెండేళ్లు తేడా. ఇంకా విను. మీ మామ్మకి తాతగారికి సుమారు ఇరవై ఏళ్లు తేడా.” అని తన నిర్ణయాని శాస్త్రిగారు సమర్థించుకొన్నారు.
గణపతికి మరేమిటనాలో బోధపడలేదు. అవేం పెళ్లిళ్లు బాబూ అని మనసులో అనుకున్నాడు.
ఇన్ని సంవత్సరాలు కలసి మెలసి ఉన్న అన్నా చెల్లిళ్లు, ఒకరికొకరు దూరమయిపోతామని తలచుకొని చింతించసాగేరు. వీలయినప్పుడు వచ్చి కలుస్తానని గణపతి చెల్లికి ధైర్యం చెప్పేడు. పార్వతి కూడా కూతురు పెళ్లయి పరాయి ఇంటికి వెళ్లిపోతుందని మనసులో బాధపడుతోంది. అత్తవారు ఎటువంటివారో, మంగమ్మను ఎలా చూసుకొంటారో అని ఆమె మనసులోని ఆందోళన. ఒకటి రెండు మార్లు, “ఏమండీ కుటుంబం మంచిదనే విన్నారు కదండీ. వాళ్లు మన పిల్లని ఎలా చూసుకొంటారో అని నా భయం. మన పిల్ల అమాయకురాలు.” అని శాస్త్రిగారికి తన ఆందోళన తెలియజేసింది.
“అలా ఏమీ భయపడకు. నేను బాగా వాకబు చేసేను, పార్వతీ. అందరూ కుటుంబం మంచిదని, కుర్రాడు బుద్ధిమంతుడని చెప్పిన తరువాతే సంబంధం ఖాయం చేసేను.” అని శాస్త్రిగారు భార్యకు ధైర్యం చెప్పేరు. పార్వతికి ఆందోళన కొంత తగ్గింది. కాని అప్పుడప్పుడు మనసు ఆ ఆలోచనవైపు మళ్లిస్తోంది. రోజూ పూజ అయిన పిమ్మట, తన కూతురుకు అత్తవారింట ఎట్టి ఇబ్బందులు లేకుండా కాపాడమని దేమునికి విన్నవించుకునేది. కన్నకూతురుకు అత్తవారింట ఎలా మెలగడమో పలుమార్లు సలహాలిచ్చింది. అత్తగారికి అన్నివిధాలా తోడ్పడుతూ వినయంగా ప్రవర్తించమంది. భర్తతో ఎప్పుడూ వాదనలు చెయ్యొద్దంది. నలుగురితో కలసిమెలసి ఉండమంది. అలా తనకు తోచిన సలహాలు ఎప్పటికప్పుడు చెప్తూండేది.
శాస్త్రిగారు పెళ్లి ముహూర్తం పెట్టేరు. బంధు మిత్రులకు శుభలేఖలు పంపేరు. ఇంటిముందు పందిరిరాట వేయడం జరిగింది. పెళ్లిపనులు ప్రారంభమయ్యేయి. ఇరుగుపొరుగు వారు పనులలో సాయం చేస్తున్నారు. శాస్త్రిగారికి వృత్తిరీత్యా పరిచయమున్నవారు ఎవరికి తోచిన సాయం వారు అందజేస్తున్నారు. ఉచితంగా మూడు బియ్యం బస్తాలు, పప్పుదినుసులు సమకూరేయి. శాస్త్రిగారు, గణపతి కలసి ఏర్పాట్లును స్వయంగా చూస్తున్నారు. పందిళ్లు వేయించడం వంటి కొన్ని పనులు గణపతి ఒక్కడే దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాడు. పెళ్లివంటలలో అనుభవం ఉన్న వంటవాళ్లను ముందుగా స్థిరపరుచుకొన్నారు. మగపెళ్లివారికి విడిది, పై ఊళ్లనుండి పెళ్లికి విచ్చేసే అతిథులకు బసకు తగు ఏర్పాట్లు జరిగేయి. పెళ్లిరోజు ఆసన్నమయింది. మగపెళ్లివారు బంధుమిత్రులతో పెళ్లికి తరలి వచ్చేరు. శాస్త్రిగారి బంధుమిత్రులు కూడా విచ్చేయడంతో పెళ్లికి నిండు శోభ వచ్చింది. పెళ్లి కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా జరిగేయి. ఇరువైపులవారు, పెళ్లి సరదాగా జరుపుకొన్నారు.
కని, పెంచి, యుక్తవయసు రాగానే ఆడపిల్లను అత్తవారింటికి శాశ్వతంగా పంపవలసిన రోజున కన్నతల్లి కన్నీళ్లు ఎంత తుడిచినా ఆగవు. పార్వతి మంగమ్మను గుండెలకు గట్టిగా హత్తుకుని, “ తల్లీ, నేను చెప్పినవి జ్ఞాపకమున్నాయి కదా. నాన్నగారు చెప్పేరు. వాళ్లు మంచివాళ్లని. ఫరవాలేదు. నిన్ను దేముడు చల్లగా చూస్తాడమ్మా.” అని ధైర్యం చెప్పింది. శాస్త్రిగారు, “అమ్మా, నీకేమీ భయం లేదు. వీలయినప్పుడు నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటాను.” అని మంగమ్మ భుజాలమీద ఆప్యాయంగా చేతులుంచి తన వంతు ధైర్యం చెప్పేరు. గణపతి చెల్లి తలను దగ్గరగా తీసుకొని, తను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటానని తల నెమ్మదిగా నిమురుతూ చెప్తున్నప్పుడు వాడి కన్నీటి బొట్లు మంగమ్మ మీదరాలేయి. అదే జీవితం.
మంగమ్మ శుభముహూర్తాన్న అత్తవారింట అడుగు పెట్టింది. కన్నెపిల్లల మనోవాంచ్ఛ అయిన దాంపత్యజీవనంలో అడుగుపెడుతున్నానని మంగమ్మకు ఎనలేని సంతోషం ఒక ప్రక్క. నాన్న, అమ్మ ఎంత అభయమిచ్చినా, భర్త, అత్తగారు తనను ఎలా చూసుకొంటారో అని మనసులో ఆందోళన మరో ప్రక్క. అవి బయటకు తెలియకుండా అందరితో కలివిడిగా ఉంటోంది. సందడంతా శ్రీవల్లిపురం నుండి నవరంగపట్నానికి మళ్లింది. శర్మ చెల్లెలు, జానకమ్మ వదినగారిని ఆటపట్టించడంలో ఎనలేని సంతోషం పొందుతోంది. ఒక్కొక్కమారు సుభద్రమ్మ, “జానకీ, అలా మరీ దాన్ని అల్లరిపెట్టకే. భయపడిపోతుంది.” అని కోడలుకు మద్దతు పలికితే, “అమ్మా, నీ కోడల్ని నేనేమీ కొరుక్కు తినేడం లేదు. అలా గాభరా పడిపోతున్నావ్.” అని తల్లికి హామీ ఇచ్చింది, జానకమ్మ. నిజానికి కొత్తలో ఇలా జరగొచ్చని, అదంతా ఓ సరదా అని, అట్టే పట్టించుకోవద్దని, పెళ్లికి ముందరే పార్వతి మంగమ్మకు సలహా ఇచ్చింది. మంగమ్మ ఆ సలహా పాటిస్తోంది. ఆడబడుచు ఎంత కవ్వించినా చిరునవ్వే సమాధానం ఇచ్చేది. ఒక్కొక్కప్పుడు, జానకమ్మ, “ఏమమ్మా, నేనన్నది నీకు వినిపించలేదా.” అని వదినగారినంటే, “ఏమో తెలీదు.” అని ఓ చిరునవ్వు పారేస్తే, “ ఆమ్మో, చాలా గట్టిదానివి నువ్వు.” అని లేని ఆశ్చర్యం ముఖంలో కనబరిచి, తల్లిదగ్గరకు వెళ్లి, “అమ్మా , నీకోడలు నన్నే మించిపోయింది.” అని నవ్వుతూ చెప్పింది. “ఇప్పుడు తెలిసింది కదా. అంచేత జాగ్రత్తగా ఉండు” అని తనూ నవ్వుతూ సలహా ఇచ్చింది, సుభద్రమ్మ. “భగవంతుడా, ఈ ఇంట్లో అత్తా కోడళ్లు ఇద్దరూ కలసిపోయేరు. నేనే ఒంటరిదాన్నయ్యేను.” అని మరో చమకు విసిరింది, జానకమ్మ. “మేమంతా ఉండగా నువ్వెందుకు ఒంటరిదానివవుతామ్మా.” అని, సుభద్రమ్మ చిరునవ్వుతో అంది. అలా మంగమ్మకు అత్తవారింట సంతోషంగా గడుస్తోంది. రెండు వారాలు గడిచేయి. జానకమ్మ స్వంత గూటికి చేరుకుంది.
మంగమ్మ క్రమేణా ఇంటిపనుల బాధ్యతలు కొన్ని తాను తీసుకుంది. సుభద్రమ్మకు విశ్రాంతి లభిస్తోంది. మనసులో సంతోషిస్తున్నాది. తన సంతోషాన్ని కొడుకుతో పంచుకుంటూ, “నీ అత్తగారు కూతురును బాగా పెంచిందిరా. పనులలో తరిఫీదు చెయ్యడమే కాక బాధ్యతలు కూడా నేర్పింది. ఏదో దూరదూరంగా ఉండకుండా అన్ని పనులలోనూ నాకు సాయం చేస్తోంది. పిల్లని బాగా పెంచారని, అది బుద్ధిమంతురాలని అందరూ చెప్పింది నిజమే.” అని కోడలును, వియ్యపురాలును మెచ్చుకుంది. శర్మ, “అమ్మా నువ్వు సంతోషంగా ఉన్నావు కదా. అదే కావల్సింది.” అని, తనూ మనసులో సంతోషించేడు. రాత్రి ఒంటరిగా పడకగదిలో ఉన్న సమయంలో, మంగమ్మను దగ్గరగా తీసుకొని, “నువ్వు మా అమ్మకు చాలా సాయం చేస్తున్నావుట. అమ్మ చెప్పి పొంగిపోతోంది.” అని కానుకగా బుగ్గమీద ఒక ముద్దిచ్చేడు.
“అదేమిటండీ నేనావిడకు సాయం చేయడమేమిటండీ. అది నా బాధ్యత. పెద్దవారు. మా అమ్మవంటి వారు. మా అమ్మకు ఇంతకన్నా ఎక్కువ పనులు చేసిపెట్టేదాన్ని. అత్తగారు ఒప్పుకుంటే వంట నేనొక్కర్తిని చేసేగలను.” అని, నొక్కి చెప్పింది.
“నిజంగా అంత వంటా నువ్వొక్కర్తివే చేసేగలవా.” ఆశ్చర్యంగా అడిగేడు, శర్మ.
“ఎంత వంటండీ. ముగ్గురు మనుష్యులం. ఎంత వండాలి.” అని హామీ ఇచ్చింది.
“అయితే అమ్మతో చెప్పమన్నావా.” అని మనసులో సంతసిస్తూ అనుమానం తీర్చుకున్నాడు.
“చెప్పండి. ఏం ఫరవా లేదు. ఆవిడ ఒప్పుకొంటే వంటంతా నేనొక్కర్తిని చెయ్యగలను.” అని ధైర్యంగా చెప్పింది.
వీలు చూసుకొని శర్మ తల్లి చెంత చేరి, “అమ్మా, నువ్వు ఒప్పుకుంటే నీ కోడలు రోజూ వంటంతా తనే చెయ్యగలనంది” అని ఉత్సాహంగా చెప్పేడు.
“దానికి తెలీదురా, వంటంతా అది చెయ్యడమేమిటి. అది కాలు చెయ్యి కాల్చుకుంటే కోడలిని అష్టకష్టాలు పెడుతున్నానని నలుగురూ నన్ను ఆడిపోసుకొంటారు.” అని శర్మకు బోధపరిచింది.
“పోనీ అంత వంటా కాకపోయినా, ఒక కూరో, పులుసో వండమను. ఎలా వండుతుందో కూడా తెలుస్తుంది.” అని భార్య కోరిక తీర్చడానికి ఒక మధ్యంతర సలహా ఇచ్చేడు.
“సరే, నువ్వు అంతగా అంటున్నావ్. రేపు దాన్ని ఏదో ఒకటి వండమంటాను. నువ్వన్నట్టు ఎలా వండుతుందో కూడా తెలుస్తుంది.” అని అంగీకారం తెలియబరిచింది, సుభద్రమ్మ.
భార్య వంట తినాలని కుతూహలం పడుతున్న శర్మ, ఆ తీపి కబురును రాత్రి సతీమణి చెవిలో వేసేడు.
“అయితే రేపు మీరు నా వంట తింటారన్నమాట.” అని కొంటిగా చెప్పింది.
“ఏం. భయపెడుతున్నావా. నువ్వెలా వండినా తింటాను. బహుమతులు కూడా ఇస్తాను”, అని ప్రేమతో కొంటిగా చెబుతూ గట్టిగా కాగలించుకొన్నాడు.
మరునాడు ఉదయం, అత్తా కోడళ్లు వంటింట్లో పనిలోనున్న సమయంలో, వీధిలోనుండి కూరలబండీ వాడి కేక వినిపించింది. సుభద్రమ్మ, “మంగా వాడేదో ‘వంకాయలు, బెండకాయలు’ అని కేక పెడుతున్నాడమ్మా. వెళ్లి ఏదైనా కూర ఒకటి తీసుకో. ఆనపకాయ ఉంటే పులుసులోకి తీసుకో.” అని చెప్పడంతో కూరల సజ్జా తీసుకొని వెళ్ళింది, మంగమ్మ. బండి మీద నవనవలాడుతూన్న చిన్న వంకాయలు ఇంపుగా కనిపించేయి. అవి ఏరుతూ ఉంటే, “అమ్మగారూ అన్ని నే..తవండి. ఈ ఉదయాన్నే కోసినానండి. మల్లీ ఒచ్చేవారమే కొత్తానండి. కేజీ తీసుకోండమ్మగారూ. మీకైతే రెండు రూపాయలు తగ్గిత్తానండి.” అని తన వ్యాపార నైపుణ్యాన్ని ఉపయోగించేడు, బండివాడు.
“నువ్వు ధర తగ్గిస్తావని కేజీ కొని నేనేం చేస్తాను. ఉన్నవాళ్లం ముగ్గురం. అరకేజీయే ఎక్కి తొక్కి. అందులోనే పనిపిల్లకు ఇవ్వడానికి కూడా సరిపోతుంది.” అని అరకేజీ చిన్నవంకాయలు ఎంచి ఉంచింది. అక్కడే ఉన్న ఒక చిన్న ఆనపకాయ ఒకటి పరీక్షగా చూస్తూంటే, “అమ్మగారండి, నేత కాయండది. పొయ్యిమీదెడితే ఎన్నలా కరిగిపోత్తండి.” అని హామీ ఇచ్చేడు. మంగమ్మ వంకాయలతో బాటు ఆ ఆనపకాయిని బేరమాడి తీసుకుంది. అవి తీసుకొని వంటింటనున్న అత్తగారికి అవి చూపిస్తూంటే, “వంకాయలు బాగున్నాయమ్మా.’ అని ఆవిడ మెచ్చుకుంది.
“ఇవి మెంతికూర పెట్టి వండడానికి బాగుంటాయి, అత్తయ్యగారూ. ఇవాళ నేను చేసీదా.” అని వినయంగా అడిగింది.
“నిజమే. మెంతి కూరకివి బాగుంటాయి. మెంతి కూర ఎలా చెయ్యడమో నీకు తెలుసా. నేను చెప్పీదా.”
“అయ్యో, మెంతికూర వండడం నాకు బాగా తెలుసు. మా ఇంట్లో కొన్ని మార్లు చేసేను, అత్తయ్యగారూ.”
“సరే ఇవాళ అది నువ్వు చెయ్యి.” అని కోడలుకు అనుమతి ఇచ్చింది, సుభద్రమ్మ.
అంతలో శర్మ అక్కడకు వచ్చి, “ఇవాళ ఫలహారం ఏమిటి చేసేరో తొందరగా ఇస్తే తినేసి దేవాలయంలో పని చూసుకోవాలి.” అని తొందరబడుతూంటే,
“ఇవాళ మీ ఆవిడ ఏరి ఏరి మంచి చిన్నవంకాయలు కొంది. తనే వాటితో మెంతికూర చేస్తానంది. ఆలస్యం చెయ్యకుండా వస్తే మొదటిసారిగా మీ ఆవిడ చేసిన వంటకం రుచి చూడగలవ్.” అని తీపి కబురు వినిపించింది, సుభద్రమ్మ.
“ఎంత వేగరమయినా పన్నెండయిపోతుందమ్మా. అయినా నువ్వు చెప్పినట్టు వీలయినంత తొందరగా వస్తానులే.” అని తల్లికి హామీ ఇస్తూంటే అత్తగారి వెనకనే ఉన్న మంగమ్మ చిరునవ్వుతో భర్తకు సంతోషం తెలియబరిచింది. శర్మ పన్నెండు గంటలకు క్రొద్దిగా ముందే ఇంటికి చేరుకున్నాడు. భార్య వండిన కూర తినడానికి ఆత్రుతగా ఉన్నాడు. ఇంట్లో అడుగు పెడుతూండగానే సుభద్రమ్మ “వేగం కాళ్లు చేతులు కడుక్కొని భోజనానికి రా. మీ ఆవిడ వండిన మెంతి కూర తిందువుగాని.” అని చిరునవ్వుతో స్వాగతం పలికింది. శర్మ భోజనానికి కూర్చుంటూ, ” అమ్మా నీ విస్తరేదీ.” అని అడిగేడు.
“నాకు కొద్దిగా ఆకలి వేసింది. నువ్వు ఆలస్యంగా వస్తావేమో అని నీ కోసంచూస్తూంటే, నన్ను తినేమని మంగ నొక్కి చెప్పడంతో ఇప్పుడే ఎంగిలి పడ్డానురా.” అని తల్లి నోట వినగానే,
“అయితే మొదట నువ్వే కూర రుచి చూసేవన్నమాట. ఎలా ఉందమ్మా, నీ కోడలు వండిన వంకాయకూర.” అని చిరునవ్వు ముఖంతో అడిగేడు.
“తింటూ రుచి అడగడమెందుకు. విస్తట్లో వడ్డించిందిగా. నువ్వే తిని చెప్పు.” అని జవాబు దాటవేసింది, సుభద్రమ్మ.
శర్మ తల్లి మాట పాటించేడు. “చాలా రుచిగా ఉందమ్మా.” అని తన ప్రశంస తల్లి ముఖంలోకి చూస్తూ చెప్పేడు.
“నాతో ఏమిటి. కష్టపడి వండింది అది. నీ దగ్గరే ఉంది. అదేదో దానితో చెప్పు. సంతోషిస్తుంది.” అని సలహా ఇచ్చింది, సుభద్రమ్మ. శర్మ తల్లి ఆజ్ఞ శిరసావహించేడు.
రాత్రి పడకగదిలో దగ్గరగా తీసుకొని ముఖం లోనికి ముఖం పెట్టి, “ఇంత బాగా వండుతావన్నమాట. కూర ఎంతో బాగుంది.” అని భర్త నోట వినగానే, “నిజంగానా, లేక నా మనసు బాధపడకుండా అలా అంటున్నారా.” అని అనుమానం తీర్చుకోబోయింది. “అక్షరాలా నిజం. మా అమ్మ కూడా మెచ్చుకుంది కదా. వంటలు బాగానే నేర్చుకుంది.” అని నాతో చెప్పింది. తన వాగ్దానం తీర్చుకుంటూ ప్రియసఖిని మరింత చేరువగా గుండెలకు హత్తుకొని, రెండు బుగ్గలమీద బహుమతులిచ్చేడు. ఆ విధంగా వారిద్దరి అన్యోన్నత దిన దిన ప్రవర్ధానమయింది. వారిరువురు, దాంపత్య జీవన మధుర రుచులను ఆస్వాదిస్తున్నారు. గగన వీదుల్లో విహరిస్తున్నారు. అది గమనిస్తున్న సుభద్రమ్మ సంతోషిస్తోంది. వాళ్లలా సంతోషసముద్రంలో మునుగుతూ తేలుతున్నారు.
మంగమ్మకు తను అత్తవారింట్లో ఎంత సంతోషంగా ఉన్నానో, అత్తగారు, భర్త ఎంత ఆదరిస్తున్నారో తల్లిదండ్రులకు తెలిస్తే వారు సంతోషిస్తారనుకొంది. ఆ విషయం తెలియజేయడానికి తండ్రికి ఉత్తరం రాయదలచింది. భర్తతో తన కోరిక చెప్పింది.
“కార్డుత్తరమా కవరుత్తరమా రాస్తావు.” అని శర్మ అడిగేడు.
“కవరుత్తరమే రాస్తానండి.” అని జవాబిచ్చింది.
“సరే, ఉత్తరం రాసి ఉంచు. పోస్టాఫీసునుండి కవరు తీసుకొస్తాను.” అని సలహా ఇచ్చి, ఒక తెల్లకాగితం పెన్ను తెచ్చిచ్చి పోస్టాఫీసుకు వెళ్ళేడు.
మంగమ్మ ఉత్తరం ప్రారంభించింది.
పూజ్యులయిన నాన్నగారికి పాదాభివందనం చేసి, మంగమ్మ రాయునది
మీరు అమ్మ అన్నయ్య క్షేమంగా ఉన్నారనుకుంటాను. తరచూ మీరు జ్ఞాపకం వస్తూ ఉంటారు.
ఇక్కడ నేను అత్తగారు మీ అల్లుడు క్షేమంగా ఉన్నాము. నాకిక్కడ ఎంతో సంతోషంగా ఉంది. అత్తగారు, ఆయన నన్ను ఎంతో అభిమానంతో చూస్తున్నారు. నాకు ఏ ఇబ్బంది లేదు. కిందటి వారం మా అత్తగారికి చెప్పి చిన్న వంకాయల మెంతి కూర చేసేను. అది మా అత్తగారికి బాగా నచ్చింది. మీ అల్లుడు కూడా మెచ్చుకున్నారు. మా అత్తగారు ఇప్పుడు రోజూ ఒక కూరగాని పులుసుగాని నా చేత చేయిస్తున్నారు. అవి బాగున్నాయని మెచ్చుకొంటున్నారు. అమ్మ నేర్పిన వంటలు జ్ఞాపకమున్నాయి. నాకవి బాగా పనికొస్తున్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. వీలయితే మీరు, అమ్మ, వస్తే చూసి సంతోషిస్తారు. మీకు అమ్మకు అన్నకు నమస్కారాలు. ఉంటాను.
మీ కూతురు
మంగమ్మ.
ఉత్తరం రాసి జాగ్రత్తగా ఉంచింది. కొద్దిసేపటికి శర్మ పోస్టాఫీసునుండి కవరు తెచ్చేడు. అది మంగమ్మకిచ్చేడు. మంగమ్మ రాసిన ఉత్తరం అందుకుని, “మంగా నీ ఉత్తరం నేను చదవొచ్చా.” అని మందహాసంతో అడిగేడు. “అదేమిటండీ, మనిద్దరిమధ్య దాపరికాలు ఏమిటి. చదవండి.” అంది. అది చదివి సంతోషంతో, “మంగా ఇది అమ్మకి చదివి వినిపించేదా.” అని అడిగేడు.
“తప్పేమిటుంది. చదివి వినిపంచండి.” అని మంగమ్మ తన సమ్మతం తెలిపింది.
శర్మ తల్లికి ఉత్తరం చదివి వినిపించేడు.
“చదువుకున్న పిల్ల. అంచేతే వాళ్ల వాళ్లకి ఉత్తరం రాయగలిగింది. మన గూర్చి మంచిమాటలు విన్నాక వాళ్లకి బెంగ తీరుతుంది.” అని కోడలును మెచ్చుకుంది సుభద్రమ్మ.
శర్మ ఉత్తరం పట్టుకుని మంగమ్మ దగ్గరకు వెళ్ళేడు. “మంగా. నీ ఉత్తరం విని మా అమ్మ సరదా పడ్డాది. మీ నాన్నగారి ఎడ్రసు ఉందా.” అని అడిగేడు.
“ఉన్నాదండి. రాసి తెచ్చుకొన్నాను. ఇదిగో కవరు మీద రాసేను.” అని కవరు ఇచ్చింది.
“తెలివయిదానివి. ఇంగ్లీషులో ఎడ్రసు రాసేవు. ఆ.. చెప్పేవు కదూ. మీ అన్న నీకు ఇంగ్లీష్ బాగా నేర్పేడని. ఇది మా అమ్మకు చూపిస్తాను. సరదాపడుతుంది.” అని అది పట్టుకుని మళ్ళీ తల్లి చెంత చేరి కవరు చూపిస్తూ,
“అమ్మా చూసేవా. నీ కోడలు కవరుమీద ఇంగ్లీషులో ఎడ్రసు రాసింది.” అని సగర్వంగా చెప్పేడు.
“నేను చెప్పేను గదరా, అది తెలివయినదని. నీకో సమస్య తీరింది. ఇహమీదట కవరుమీద ఎడ్రసు రాయమని నువ్వు ఎవరినీ ప్రాధేయపడక్కరలేదు.” అని కోడలుకు మరో కితాబిచ్చింది, అత్తగారు.
శర్మ, ఉత్తరాన్ని కవరులో పెట్టి జాగ్రత్తగా మూసి పోస్టాఫీసుకు వెళ్లి పోస్టు చేసేడు.
***
శ్రీవల్లిపురంలో ‘పోస్ట్’ అని కేకవేసి శాస్త్రిగారి గుమ్మం ముందు ఉత్తరం పడేసి పోస్టుమేను ముందుకు సాగేడు. ఆ కేక విన్న పార్వతి తలుపు తీసి ఉత్తరం తీసుకుంది. ఆమెకు ఆ ఉత్తరం ఎవరి నుండి వచ్చిందో తెలీదు. జాగ్రత్తగా ఉంచింది. కొద్దిసేపటికి శాస్త్రిగారు, గణపతి ఒక ఉపనయన కార్యక్రమం ముగించుకుని వచ్చేరు. పార్వతి శాస్త్రిగారికి ఉత్తరం అందిస్తూ ఉంటే, గణపతి అది చూసి, “ఇది చెల్లి దగ్గర నుండి వచ్చింది. కవరు మీద ఇంగ్లీష్ దాని హేండ్ రైటింగే.” అని పొంగిపోతూ చెప్పేడు. శాస్త్రిగారు కవరు చింపి, మురిసిపోతూ ఉత్తరాన్ని బయటకు చదివి వినిపించి,
“అమ్మాయి ఎంత బాధ్యత నేర్చుకుంది. తన క్షేమసమాచారం మనకు తెలియజేసింది.” అని ఇంకా చెప్పబోతూ ఉంటె,
“ఆ స్వామివారి దయ. కన్నతల్లి అత్తవారింట ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉంది.” అని పార్వతి సంతోషం వ్యక్తపరిచింది.
చెల్లెలి క్షేమసమాచారం తెలిసి సంతోషిస్తూ, “నాన్నా. కవరుమీద మీ ఎడ్రసు చెల్లి ఒక్క తప్పూ లేకుండా రాసింది.” అని అక్కడే ఉన్న గణపతి పొంగిపోయేడు.
“మన కుటుంబాల్లో ఇప్పటివరకు ఏ ఆడపిల్లా బడి గుమ్మం తొక్కలేదు. మీరు బాగా ఆలోచించి దాన్ని బడిలో వేసేరు. దానివల్లేకదా అది ఇంత ప్రయోజకురాలయింది. మనకది ఉత్తరం రాయగలిగింది.” అని భర్తని ప్రశంసించింది, పార్వతి.
“దాన్ని బడిలో వెయ్యడం పనికొచ్చిందనుకో. కాని దాన్ని నాలుగో తరగతితో ఆపేశాం గదా. నాలుగో తరగతి చదివినవాళ్లకు తెలుగులో ఇంత బాగా ఉత్తరాలు రాయడం రాదు. ఇంగ్లీష్ అసలు రాదు, పార్వతీ. దానికి పై క్లాసు తెలుగు పాఠాలు, ఇంగ్లీష్, ఇదిగో మనవాడు ఓపిగ్గా నేర్పడంతో అన్నీ నేర్చుకుంది. ఆ ఘనతంతా వాడిది.” అని కొమరుని కొనియాడేరు, శాస్త్రిగారు. ఉత్తరంలోని విషయాలు తెలుసుకొని ముగ్గురూ సంతోషించారని ఆయన ప్రత్యుత్తరం పంపేరు.
(సశేషం)
శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం నవంబరు, 1936 లో జన్మించారు. M.A. మరియు P.G. Diploma in Personnel Management పాసయ్యారు. ఉద్యోగ పర్వం, హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రారంభించి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిగా చేసి, 1994 లో విశ్రాంతి తీసుకొన్నారు. అమెరికా వాసి.
హైస్కూలు విద్యార్థిగా రంగస్థల ప్రవేశం చేసేరు. చిన్న నాటికలు రాసి, వాటిలో పాత్రలు ధరించి, దర్శకత్వం చేసేరు.
గత ఎనిమిది సంవత్సరాల నుండి రచనలు చేస్తున్నారు. ఈ నాటికి 33 కథలు, 3 నవలలు, 4 కవితలు, ఒక హాస్య నాటిక ప్రచురణమయ్యేయి.
