Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పునరావృతం-20

[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[భార్య చనిపోయిందన్న షాక్ నుంచి పూర్తిగా తేరుకోడు గౌరీపతి. అక్కతో బావతో మాట్లాడుతాడు. వాళ్ళు ఓదార్చి, ధైర్యం చెబుతారు. గణపతి గురించి ఆందోళన చెందుతారు. అప్పుడు చిన్నికెదురైన సమస్య గురించి చెప్తాడు. ఈలోపు గణపతి లేచి, తల్లిని గుర్తుచేసుకుని ఏడుస్తాడు. సింహాద్రి, చిట్టితల్లి విమానంలో బయల్దేరుతారు. తల్లిదండ్రులు ఫోన్ చేసి ఓదార్చుతారు. బ్యాంక్ సిబ్బంది కొందరు వచ్చి పరామర్శిస్తారు. మాధురి దహన సంస్కారాలు పూర్తవుతాయి. మర్నాడు అస్థికలు తీసుకుని పూనాకు దగ్గరలో మూలా-ముత్తా నదిలో నిమజ్జనం చేస్తారు.

అక్కవాళ్ళతో పాటు గౌరీపతి, గణపతి కూడా శ్రీవల్లీపురం చేరుతారు. గణపతి, అన్నపూర్ణ కొడుకుని, మనవడిని దగ్గరతీసుకుని ఓదార్చుతారు. గణపతి అధ్వర్యంలో మాధురి కర్మకాండ శాస్త్రోక్తంగా జరుగుతుంది. పరిస్థితి కొంత కుదుట పడ్డాకా, బేంక్ జి.ఎం.గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి విశాఖపట్నానికి బదిలీ చేయించుకుంటాడు గౌరీపతి. విశాఖలో తమతోనే ఉండమంటారు చిట్టితల్లీ, మూర్తి. మొదట వద్దన్నా, చివరికి సరేనంటాడు గౌరీపతి. చిన్ని గణపతికి ఆరేళ్లు నిండుతాయి. శ్రద్ధగా చదువుతున్నాడు. తాత దగ్గర, మామ్మ దగ్గర కూర్చుని వాళ్ళు చేసే పూజలు ఆసక్తిగా చూస్తాడు, ఎన్నో ప్రశ్నలు వేసి సందేహాలు తీర్చుకుంటాడు. కాలం గడుస్తుంది. గణపతి పదో తరగతిలోకి వస్తాడు. తర్వాతి చదువు విషయమై సింహాద్రి, గౌరీపతి కొన్ని సూచనలు చేయగా, గణపతి కాదంటాడు తనకి మామూలు చదువు చదవాలని లేదని, తాతగారిలా వేదవిద్య నేర్చుకుని పౌరోహిత్యం చేస్తానంటాడు. – ఇక చదవండి.]

గౌరీపతికి నోట మాట రాలేదు. వాడికి ఎలా బోధపరచడమో తెలీలేదు. ఆ విషయంలో చిన్నితో సంభాషణ పెంచడం ఉచితం కాదనుకున్నాడు. “సరే నాన్నా, నువ్వు వెళ్లి ప్రభాకర్ (చిట్టితల్లి కొడుకు) తో ఆడుకో.” అని చెప్పి కిమ్ కర్తవ్యం అని ఆలోచనలో పడ్డాడు. మూర్తి, చిట్టితల్లికి, ఊహించని ఆ పరిస్థితి విశదంగా చెప్పి, చిన్నికి ఎలాగయినా బోధపరచమని చెప్పుకొన్నాడు. వాళ్ళిద్దరూ, చిన్నికి బోధపరచడానికి చాలా ప్రయత్నించేరు. చిన్ని ఆలోచనలలో ఏ మార్పు రాలేదు. గౌరీపతికి తమ విఫల ప్రయత్నాలన్నీ చెప్పేరు. చిన్నిలో ఆ ఆలోచనలకు ఒక కారణముండి ఉండొచ్చని మూర్తి గౌరీపతికి చెబుతూ, “చిన్నికి ఎవడో రామశాస్త్రి అనే ఫ్రెండు ఉన్నాడట. వాడి ఇంటికి చాలామార్లు వెళ్లేడట. ఒక మారు వాళ్ల ఇంట్లో ‘వేదవాక్కు’ అనే పత్రిక వాడు చూసేడట. అందులో మన పురాణాలు, పూజలు, వేదాలు, ఉపనిషత్తులు, గూర్చి వ్యాసాలు చదివేడట. అవి వాడికి నచ్చేయట. అప్పటినుండి ఆ రామశాస్త్రి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆ మేగజీను చదవడం అలవాటయిందట. బహుశా అది వాణ్ణి ప్రభావితం చేసి ఉండొచ్చు.” అని తన అభిప్రాయం చెప్పేడు. గౌరీపతి స్పందిస్తూ, “వాడి బుర్రలో ఎప్పడు ఈ బీజం పడిందో తెలియడం లేదు బావా. శ్రీవల్లిపురం వెళ్ళినప్పుడల్లా మా నాన్నగారు పూజ చేస్తున్నంతసేపూ ఆయనకు దగ్గరలో బుద్ధిగా మఠం వేసుకొని శ్రద్ధగా పూజ చూస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఆయన్ని పూజ గూర్చి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. మా అమ్మని కూడా పురాణాల్లో విషయాలు అడుగుతూ ఉంటాడు. వాడికి ఏదయినా మెంటల్ ప్రాబ్లెమ్ వచ్చిందో ఏమిటో” అని, ఆందోళన వ్యక్తపరిచేడు. మూర్తి ధైర్యం చెబుతూ, “నో. అటువంటి ప్రాబ్లెమ్ ఏదీ లేదు. బెంగపడకు. వాడి ఆలోచనలన్నీ అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఒకాయన ఉన్నాడు. అతన్ని అడిగి చూస్తాను. అతను చిన్నిని తెమ్మంటే తీసుకెళదాం.” అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని, ఆ డాక్టర్ని కలసుకొన్నాడు. కుటుంబ చరిత్రతో బాటు మూర్తి చెప్పిన చిన్ని వివరాలన్నీ విని ఆయన చిన్నికి మెంటల్‌గా ఏ సమస్యా లేదన్నాడు. అటువంటి దృఢమైన ఆలోచనలు కొందరు పిల్లలలో ఉండడం సహజమన్నాడు. హెరిడిటరీ జీన్స్ కూడా ప్రభావితం చేసి ఉండొచ్చన్నాడు. తాము అంత దృఢంగా కోరుకొంటున్నది పొందకపోతే, ఆ వయసు పిల్లల ప్రవర్తనలో ఎటువంటి మార్పు వస్తుందో చెప్పడం కష్టమన్నాడు. కొందరు క్రిమినల్స్‌గా మారిన కేసులున్నాయి అన్నాడు. అందుచేత బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నాడు.

చిన్ని విషయంలో డాక్టరు చెప్పిన అభిప్రాయాలు, సలహా, మూర్తి గౌరీపతికి చెప్పేడు. చిట్టితల్లి కూడా అక్కడ ఉంది. ఏమి చేయడమా అని ముగ్గురూ ఆలోచనలో పడ్డారు. మూర్తికి ఏదో తట్టింది. “వాడు పైపైన ఏవో ఆర్టికల్స్ మెగజీనులో చదివి, వేదాలు, పూజలు అవీ స్కూల్లో పాఠాలులాగ నేర్చేసుకోవచ్చు అనుకొంటున్నాడు కాబోలు. నాకు వాటి గురించి తెలీదు కాని, అవి అంత సులభంగా బుర్రకెక్కవు అనుకొంటాను. కాబట్టి వాడు కోరినట్లే వాణ్ణి వేదాలు, పూజలు, ఇంకా ఏవో అన్నీ నేర్చుకోమందాం. I am very sure. మూడు నాలుగు నెలల్లో వాడే వాటికి దండం పెట్టి వచ్చేస్తాడు. అప్పుడు మనం చెప్పినట్లు స్కూలుకి వెళతానంటాడు.” అని తన అభిప్రాయం చెప్పేడు. గౌరీపతి, చిట్టితల్లి, మూర్తి అభిప్రాయంతో ఏకీభవించేరు.

గౌరీపతి సింహాద్రికి చిన్ని గూర్చి వివరంగా చెప్పి, తన భావి ప్రణాళికను చెప్పేడు. సింహాద్రి అది సరైన నిర్ణయమన్నాడు. చిన్ని నాలుగయిదు నెలల తరువాత వెనక్కి వచ్చినా, వాడికి చదువులో సంవత్సరం నష్టం కాకుండా తను చూసుకొంటానని హామీ ఇచ్చేడు. గౌరీపతి సింహాద్రికి ధన్యవాదాలు చెప్పేడు.

గౌరీపతి చిన్నితోబాటు శ్రీవల్లిపురం వెళ్ళేడు. తల్లిదండ్రులకు చిన్నితో వచ్చిన సమస్య చెప్పేడు. వాళ్ళు నిర్ఘాంతపోయేరు. ఆ విషయంలో చిన్నప్పటినుండి చిన్ని ఆసక్తి నెమరు వేసుకున్నారు. కాని అది ఇలా పరిణమిస్తుందని ఎన్నడూ అనుకోలేదన్నారు. గౌరీపతి ఆ విషయంలో డాక్టరు అభిప్రాయం చెప్పి, ఏమి చెయ్యడమో బాగా ఆలోచించేక మూర్తి అభిప్రాయం వివరంగా చెప్పేడు. గణపతి, అన్నపూర్ణ, అల్లుని అభిప్రాయంతో ఏకీభవించి, అదే సరైన మార్గమని అభిప్రాయపడ్డారు. తమ ఉద్దేశం, చిన్నిధ్యాసలో మార్పు తేవాలి గనుక వాడికి వేదవిద్య నేర్పడానికి తను పూనుకోకూడదని గణపతి అభిప్రాయబడ్డాడు. కారణం, వాడికి శిక్షణ కఠోరంగా ఉంటేగాని, ఆశించిన ఫలం దక్కదన్నాడు. అది తను చేయలేనన్నాడు. శ్రీవల్లిపురంలో బాగా పేరున్న సరస్వతీ వేద విజ్ఞానపీఠం ఉన్నాదని, అందులో ఇద్దరు ఉపాధ్యాయులు తనకు బాగా తెలిసినవారని అందులో చేర్పిద్దామని చెప్పేడు.

వేద విజ్ఞానపీఠం అధ్యాపకులను గణపతి సంపర్కించేడు. చిన్నిని అందులో చేర్పించడంలో తమ ఉద్దేశం మాత్రం చెప్పలేదు. విజ్ఞానపీఠంలో చేర్చుకోడానికి చిన్ని వయసు పరిమితికి కొద్దిగా అతిగా ఉన్నా, గణపతి చెప్పడంతో వాణ్ణి చేర్చుకోడానికి అంగీకరించేరు. విద్యార్థులు సంవత్సర రుసుము ముందుగా చెల్లించాలని, మధ్యలో మానేస్తే సొమ్ము వాపసు చేయబడదని తెలియజేసేరు.వారి విద్యార్థులందరూ వారు ఏర్పాటుచేసిన వసతి గృహంలోనే నివసించాలన్న నియమం కూడా తెలియజేసేరు. గణపతి సంతోషంతో అంగీకరించేడు. తదుపరి నెలలో ప్రారంభం కానున్న 10 ఏళ్ల కాలపరిమితి గల కోర్సులో, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలతో బాటు, మన పురాణాలు, పూజా విధానాలు, మానవుని పుట్టుక నుండి మరణం దాకా అన్ని సంస్కారాలు ఎలా నిర్వహించాలో శిక్షణ ఇస్తారని, ఆ సమయంలో చిన్నిని ఆ కోర్సులో చేర్చుకొంటామన్నారు.

గణపతి భార్యా కొమరులకు ఆ వివరాలన్నీ చెప్పేడు. చిన్నికి వేద విజ్ఞానపీఠంలో చేర్పిస్తున్నామని గణపతి చెప్పేడు. వాడు చాలా సంతోషించేడు. తాతకు, తండ్రికి, మామ్మకు, ధన్యవాదాలు చెప్పేడు. ఎంతో గారాబంగా సకల సదుపాయాలతో పెంచిన చిన్ని, ఆ కఠిన శిక్షణ, హాస్టలు జీవితం ఎలా తట్టుకొంటాడో అని గౌరీపతి మనసులో ఒక చింత. కాని ఆ పరిస్థితిలో అది తప్ప మరొక మార్గం లేదనుకున్నాడు. గణపతి, అన్నపూర్ణల మనసులోనూ అట్టి చింతే. విశాఖపట్నం, నవరంగపట్నాలికి చిన్ని వేద విజ్ఞానపీఠంలో చేరుతున్నాడని వార్త వెళ్ళింది. భారమయిన హృదయంతో వారు స్పందించేరు.

ద్వివేదుల గణపతిశాస్త్రి (చిన్ని) సరస్వతీ వేద విజ్ఞానపీఠంలో విద్యార్థిగా చేరేడు. చురుకుగా చదువుకొంటున్నాడు. తోటి విద్యార్థులకన్నా ముందడుగులు వేస్తున్నాడు. వారితో కలసి మెలసి ఉంటున్నాడు. వాడి తెలివితేటలు, ప్రవర్తన, అధ్యాపకులను ఆకర్షించేయి. సుమారు మూడు నెలలు గడిచేయి. ఒక రోజు మనవడి చదువు విషయం తెలుసుకోవడానికి గణపతిశాస్త్రి వేదవిజ్ఞాన పీఠంలో ఒక ఉపాధ్యాయుణ్ణి కలిసేడు. అతడు గణపతిశాస్త్రి (చిన్ని) తెలివితేటలు ప్రశంసిస్తూ, చాలా చురుకయిన వాడని, సంస్కృతం అతి త్వరగా నేర్చుకొంటున్నాడని, కొత్త పాఠాలు నేర్చుకోడంలో చాలా దీక్ష ఉందని, ప్రశంసించేడు. ఆ మంచిమాటలు తాతకు సంతోషాన్ని ఇచ్చేయో లేక తమ ప్రయోగం ఫలించలేదని నిస్పృహ కలిగిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఆ మరునాడు తమ ఇంట ఒక ముఖ్య కార్యముందని, మనవణ్ణి రెండు రోజులకు ఇంటికి తనతో తీసుకువెళ్లడానికి అనుమతి కోరేడు. అధ్యాపకుడు అంగీకరించేడు. తాతతోబాటు చిన్ని ఇంటికి వెళ్ళేడు.

చిన్ని రాకకై వేయి కళ్లతో ఎదురు చూస్తున్న గౌరీపతి, అక్కా బావలతో శ్రీవల్లిపురం చేరుకున్నాడు. శ్రీవల్లిపురంలో వారందరి కలయిక, ముందుగా ఆలోచించినదే. చిన్ని రావడంతో, ఇంట్లో పండుగ సందడి అయింది. చిన్ని ఉత్సాహంగా వేదపాఠశాలలో తను నేర్చుకున్న పాఠాలు, తన అనుభవాలు చెప్పనారంభించేడు. పెద్దలు తాము అనుకొన్నది తారుమారయింది అనుకొన్నారు. కిమ్ కర్తవ్యం అనుకొన్నారు. వేదపాఠశాలకు స్వస్తి చెప్పమని వాడికి ఎలా చెప్పడం అని ఆలోచించేరు. ఒక్కొక్కరే వాడితో ఆ విషయం మాట్లాడదలచుకొన్నారు. గణపతి ముందుగా ఆ బాధ్యత తీసుకొన్నాడు. తనకు తోచిన విధంగా వాడి మనసు మార్చ ప్రయత్నించేడు. విఫలమయింది. చిట్టితల్లి, మూర్తి, చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. గౌరీపతి, “నాన్నా, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నీకు తెలుసుకదా. రోజు రాత్రి నా ప్రక్కనే పడుకొనేవాడివి. నువ్వు లేకుండా నాకు నిద్ర పట్టడం లేదురా కన్నా. బాగా ఆలోచించుకో తండ్రీ.” అని ప్రాధేయపడుతూ చెప్పేడు.

“నాన్నగారూ, నేను వచ్చేస్తాను. కాని నన్ను స్కూలుకు వెళ్ళమనకండి.” అని కాళ్లమీద పడి వేడుకున్నాడు. గౌరీపతి నోట మాట రాలేదు. అన్నపూర్ణ లాలనతో మనవడికి మనసు మార్చుకోమని చెప్పింది. వాడు మాట్లాడలేదు. చిన్ని పడుకున్నాక పెద్దలు అయిదుగురూ ఏమి చేయడమా అని ఆలోచించేరు. అన్నపూర్ణ “వాడికి వేదాలు చదవాలని పట్టుదల గట్టిగా ఉంది. మనం వాణ్ణి బలవంతంగా వేద పాఠశాల మాన్పించేసి స్కూలులో వేసినా వాడు శ్రద్ధగా చదువుకోడు. ఆ చదువు నిష్ప్రయోజనమయిపోతుంది. దానివల్ల వాడు అటు ఉద్యోగస్తుడూ కాలేడు, ఇటు పౌరోహిత్యుడూ కాలేడు. రెంటికీ చెడ్డ రేవడి అవుతాడు. అది ఆలోచించుకోవాలి.” అని అన్నపూర్ణ తన అభిప్రాయం చెప్పింది. మిగిలిన నలుగురూ, అన్నీ కోణాల్లోనూ ఆలోచించి, అన్నపూర్ణ అభిప్రాయంతో ఏకీభవించేరు. రెండు రోజులు గడిచేక, గణపతి చిన్నిని వేదపాఠశాలకు తీసుకెళ్లి, అధ్యాపకులకు అప్పచెప్పేడు.వేద పాఠశాలలో చిన్ని శిక్షణ కొనసాగుతోంది.

శ్రీవల్లిపురంలో గణపతికి తరచూ ఏవో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. గౌరీపతికి, చిట్టితల్లికి అవి ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో తల్లిదండ్రులను తమ వద్దకు శాశ్వతంగా తీసుకురావడం ఉచితమనుకొన్నారు. మూర్తి అభిప్రాయం కూడా అదే. మూర్తి ఉంటున్న ఎపార్టుమెంట్సులో ఒక ఫుల్లీ ఫర్నిష్డు త్రీ బెడ్ రూమ్ ఎపార్ట్మెంట్ క్రయానికి ఉంది. గణపతి బేంక్ లోను తీసుకొని దాన్ని తన స్వంతం చేసుకొన్నాడు. చిట్టితల్లి ఒక వంటమనిషిని, పనిమనిషిని కుదిర్చింది. ఒక మంచిరోజున గణపతి, అన్నపూర్ణ శాశ్వతంగా విశాఖపట్నంలోని కొడుకు ఇంట నివసించ ప్రారంభించేరు.

సరస్వతి వేదవిజ్ఞాన పీఠంలో చిన్ని 10 సంవత్సరముల కోర్సు పూర్తి అయింది. నాలుగు వేదాల సారం ఔపోసన పట్టేడు. పూజావిధానాలు, ఉపనయన, వివాహాది సర్వ సంస్కారాలు నిర్వహించడంలో పట్టు సాధించేడు. అతి విశిష్ఠ విభాగంలో ఏకైక విద్యార్థిగా ఉత్తీర్ణుడయ్యేడు. ఏకైక దీక్షతో పది సంవత్సరములు గడిపిన వేద విజ్ఞానపీఠం నుండి వీడ్కోలు తీసుకోబోతున్న రోజు అది.

విశాఖపట్నంలో చిన్ని రాకకై వేయికళ్ళతో అందరూ ఎదురు చూస్తున్నారు. వాణ్ణి ఇంటికి తీసుకురాడానికి గౌరీపతి, అక్కా బావలతో కారులో వేద విజ్ఞానపీఠం చేరుకొన్నాడు. తను కోరిన జ్ఞానభిక్ష పెట్టిన అధ్యాపకులకు చిన్ని సాష్టాంగనమస్కారం చేసి ఆశీర్వచనాలు పొంది శలవు తీసుకొన్నాడు. ఎదురు చూస్తున్న తండ్రి, అత్త, మామలను చూసేడు. ముఖంలో తేజస్సు, కళ, సంతృప్తి, ప్రస్ఫుటంగా కనిపిస్తూ, ఠీవీగా ఒక సాంప్రదాయిక పురోహితుని వలె కనిపిస్తున్న కొడుకును గౌరీపతి చూస్తూ అలా ఉండిపోయేడు. చిన్ని వడి వడి అడుగులతో నమస్కరిస్తూ వచ్చి, ముగ్గురికీ పాదాభివందనం చేసేడు. గౌరీపతి చిన్నిని బిగ్గరగా హత్తుకొని, “ చిన్నీ, ఇవాళ నిన్ను చూసి గర్వపడుతున్నాను. పట్టుదల, దీక్ష, శ్రద్ధతో నువ్వు అనుకొన్నది సాధించేవు.” అని, కొనియాడేడు. గౌరీపతి కంట ఆనందబాష్పాలు రాలేయి. చిన్ని స్పందిస్తూ, “నాన్నగారూ, మీరు నాకు అవకాశం ఇచ్చేరు కాబట్టే నేను కోరినది అయింది.” అని తండ్రికి ధన్యవాదాలు చెప్పేడు. అనుకొన్నది సాధించినందులకు చిట్టితల్లి, మూర్తి, చిన్నిని ప్రశంసించేరు. నలుగురూ విశాఖపట్నం చేరుకొన్నారు. యుక్త వయసులో నున్న మనవడు ఒక అనుభవశాలి అయిన పురోహితుని వేషంలో కనబడగానే తాత, మామ్మలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. చిన్ని వారిద్దరికి పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు పొందేడు. తండ్రికి దగ్గరగా వెళ్లి, చిన్ని ఏదో నెమ్మదిగా చెప్పేడు. గౌరీపతి చిన్నిని తన గదిలోనికి తీసుకెళ్లి, టేబులుపై ఉన్న మాధురి ఫోటో చూపించేడు. చిన్ని కన్నతల్లి ఫొటోను గుండెలకు హత్తుకుని కంట తడి పెట్టుకున్నాడు. గౌరీపతి వాణ్ణి ఓదార్చేడు. అన్నపూర్ణ సలహా మేరకు గౌరీపతి చిన్నిని నవరంగపట్నం తీసుకెళ్లేడు. మంగమ్మ, శర్మ, చిన్నిని చూసి సంతోషించేరు. కొనియాడేరు. ఇద్దరూ, చిన్నికి ఒక నూతన పట్టుపంచెల చాపు బహుకరించేరు. సింహాద్రి, లావణ్య, ఆశీర్వదించి స్వామీ వివేకానంద జీవితచరిత్ర గల పుస్తకం బహూకరించేరు. చిన్నికి అది బాగా నచ్చింది.

చిన్ని గూర్చి మూర్తి తనకు తెలిసిన వారందరికీ తెలియజేసేడు. మూర్తికి బాగా పరిచితులయిన విశ్వనాధం గారి ఇంట నూతన వధూవరులచే సత్యనారాయణవ్రతం, వేంకటేశ్వర దీపారాధన తలపెట్టేరు. మూర్తి దానికి సకుటుంబంగా ఆహ్వానితుడు. ఆహ్వానితులు రావడం ప్రారంభమయింది. పురోహితుని రాక కోసం ఆహ్వానకర్త ఆందోళనతో చూస్తున్నారు. అంతలో పురోహితునకు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థత చేయడంతో హాస్పిటలులో చేర్పించేరని ఫోను వచ్చింది. విశ్వనాధానికి ఏమి చేయడమో పాలుపోలేదు. పౌరోహితుడు చిన్ని గూర్చి మూర్తి చెప్పడం జ్ఞాపకమొచ్చింది. మూర్తి ఇంకా రావలసి ఉంది. వెంటనే మూర్తికి ఫోను చేసి, విషయం చెప్పి, చిన్ని సేవలకు ప్రార్థించేడు. మూర్తి అభయమిచ్చేడు. చిన్నితోబాటు మిగిలిన ముగ్గురుని విశ్వనాథం ఆహ్వానించేడు. ఒక అరగంట వ్యవధిలో మూర్తి అందరితోబాటు చేరుకున్నాడు. విశ్వనాధం దంపతులు మూర్తికి, చిన్నికి ధన్యవాదాలు చెప్పుకున్నారు. ద్వివేదుల గణపతి శాస్త్రి(చిన్ని), పౌరోహిత్యంలో అరంగేట్రం మొదలుపెట్టేడు. వధూవరులకు ప్రతి విషయం బోధపరుస్తూ, శాస్త్రోక్తంగా వ్రతం చేయిస్తూంటే సభలో తాతగారు మురిసిపోతున్నారు. సభలోని వారందరూ ప్రశంసింససాగేరు. సత్యనారాయణ వ్రతం, వేంకటేశ్వర దీపారాధన అందరి సంతృప్తితో పూర్తయ్యేయి. సభలోని కొందరు పురోహితులవారిని (చిన్నిని) సమీపించి, పేరు, ఎడ్రసు, టెలిఫోను నంబరు తీసుకున్నారు. విశ్వనాథం తనకు తెలిసిన వారందరికీ గణపతిశాస్త్రి గారి పౌరోహిత్యం గూర్చి కొనియాడుతూ చెప్పేడు. స్వల్ప వ్యవధిలో చిన్ని, గణపతిశాస్త్రిగా పేరున్న పౌరోహితుడుగా ఎదిగేడు. తాతగారి పద్ధతిలోనే ఉపనయన వివాహాది కార్యక్రమాల్లో విశ్రాంతి సమయాల్లో గణపతిశాస్త్రి మన పురాణాలు, సంస్కృతి, సులభశైలిలో చెప్పడం ప్రత్యేక ఆకర్షణ అయింది. ముఖ్యంగా వివాహ కార్యక్రమంలో మంగళసూత్రధారణ అయిన పిమ్మట, భాగవతంలో పోతన రచించిన – “మ్రింగెడివాడు విభుండని/ మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్/ మ్రింగుమనె సర్వమంగళ/మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో.” పద్యాన్ని అక్కడ ఉన్నవారందరికి వినబడేటట్లు బిగ్గరగా చదివి, “హాలాహలం లోకాలని నాశనం చేయకుండా ఆ విషాన్ని మింగి ప్రపంచాన్ని కాపాడడానికి భోళాశంకరుడు పూనుకొంటాడు. తన అర్థాంగి పార్వతి యేమంటుందో అని ఆమె వైపు చూస్తాడు. తన మాంగల్యం మీద అంత నమ్మకం ఉండబట్టే, మింగుతున్నది తన భర్త అని తెలిసీ, మింగేది విషమని తెలిసీ, ప్రజలందరికీ మేలు జరుగుతుందని సర్వమంగళ అంగీకరిస్తుంది.” అని, మంగళసూత్రం యొక్క ప్రత్యేకత, విలువ విశదీకరించి చెప్పడం గణపతిశాస్త్రికి ఒక పరిపాటి. అది గణపతిశాస్త్రి ప్రత్యేకత. ఉపనయనాది సంస్కారాలు చేయించినప్పుడు కూడా వాటి ప్రత్యేకత చెబుతూ ఉంటాడు. ఆ విధంగా పౌరోహిత్యంలో ఒక విశిష్ఠ స్థానం పొందేడు. కొందరు ఆహ్వానపత్రికలో ‘పౌరోహితులు- శ్రీ ద్వివేదుల గణపతిశాస్త్రి గారు’ అని ముద్రించడం కూడా జరుగుతోంది.

గత కొన్ని తరాలనుండి పౌరోహిత్యం కులవృత్తిగా నుండెడి ద్వివేదుల వారి కుటుంబంలో గణపతిశాస్త్రి (చిన్ని) ద్వారా పౌరోహిత్యం పునరావృతమయింది.

(సమాప్తం)

Exit mobile version