Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పునరావృతం-3

[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కూతురు మంగమ్మకి పెళ్ళి సంబంధాలు చూడ్డం మొదలుపెడతారు శాస్త్రిగారు. చెల్లికి ఎవరైనా ఉద్యోగస్థుణ్ణి చేస్తే బాగుంటుందని భావించిన గణపతి తన అభిప్రాయాన్ని తల్లికి చెప్తాడు. తమ కుటుంబాలలో ఎవరూ ఉద్యోగస్థుల్ని చేసుకోలేదని, పౌరోహిత్యం తమకి అచ్చివచ్చిందని అంటుందామె. నవరంగపట్నంలో వెంకటేశ్వరాలంలో పూజారిగా ఉన్న జగన్నాథ శర్మతో మంగమ్మ వివాహం జరిపిస్తారు. భర్త ప్రేమతో పాటు అత్తగారు సుభద్రమ్మ, వదిన జానకిల ఆదరణ పొందుతుంది మంగమ్మ. క్రమేణా అత్తగారింట కొన్ని బాధ్యతలు తను అందిపుచ్చుకుంటుంది. అత్తగారు సంతోషిస్తారు. మెల్లిగా, వంటల్లో కూరలు చేయడం మొదలుపెడుతుంది మంగమ్మ. తను అత్తవారింట్లో ఎంత సంతోషంగా ఉన్నానో, అత్తగారు, భర్త ఎంతలా ఆదరిస్తున్నారో తల్లిదండ్రులకు తెలుపుతూ ఉత్తరం రాస్తుంది మంగమ్మ. ఆ ఉత్తరాన్ని చదివి శాస్త్రిగారు, పార్వతమ్మ, గణపతి సంతోషిస్తారు. – ఇక చదవండి.]

ణపతికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. వాడికది తెలిసింది. తల్లి ఒంటరిగా నున్నప్పుడు, “వయసులో బాగా వ్యత్యాసం ఉన్న అమ్మాయిని నాకు చూడొద్దని నాన్నగారితో చెప్పమ్మా.” అని తన మనసులోని కోరిక తల్లికి వినయంగా చెప్పేడు.

“నాన్నగారు అన్నీ ఆలోచించే చేస్తారు బాబూ. చెల్లికి చూడు, మంచి సంబంధమే చేసేరు.” అని తన అభిప్రాయం చెప్పింది, పార్వతి.

“సంబంధం మంచిదే, కానీ వయసులో ఇద్దరికీ తేడా ఎక్కువమ్మా.”

“అయితే నీకు చూస్తున్న వాటిలో ఎంత తేడా ఉండాలంటావ్.” అని తనయుని అభిప్రాయం తెలియగోరింది.

“నాలుగయిదు ఏళ్లకన్నా వద్దమ్మా.” అని తల్లికి తన కోరిక చెప్పేడు.

“సరే, మీ నాన్నగారితో చెప్పి చూస్తాను.” అని హామీ ఇచ్చిన తల్లితో,

“పిల్లకు ఎంతైనా కొంత చదువుండాలమ్మా. బొత్తిగా వేలుముద్ర అమ్మాయిల్ని చూడొద్దను.” అని మరో కోరిక జోడించేడు.

“ఎంతయినా.. ఆంటే ఎంత.” అని, మందహాసంతో అడిగింది, పార్వతి.

“మరీ పెద్ద క్లాసులేమీ కాదమ్మా. ఆరేడు క్లాసులయినా చదివి ఉండాలి.” అని విశదీకరించేడు, గణపతి. ఇంగ్లీష్ తను నేర్పగలననుకొన్నాడు, మనసులో.

తన పెళ్లివిషయంలో కుమారరత్నం కోరికలు రెండూ నెమ్మదిగా పార్వతి భర్త చెవిలో వేసింది.

“వీడికేమిటి పెళ్లిళ్ల విషయంలో కనీ వినని అభిప్రాయాలు ఉన్నాయి. చెల్లి పెళ్లి విషయంలో వయసు విషయం ఎత్తేడు. బోధపరిస్తే మరేమీ అనలేదు. ఇప్పుడు వయసుకు తోడు చదువు కూడా.. మన ఇంటా వంటా లేనివి కోరుకొంటున్నాడు. వాడికన్నా నాలుగయిదేళ్లు చిన్నది అంటే మన కుటుంబాల్లో దొరకడం కష్టం, పార్వతీ. ఆ ఈడు ఆడపిల్లలకు నాలుగయిదేళ్ల మునుపే పెద్దలు పెళ్లి చేసుంటారు. వీడికీ ఆలోచనలు ఎలా వస్తున్నాయో.”

“స్కూల్లో నలుగురితో తిరిగి మాట్లాడుతూంటే అవి విని అలా అనుకొంటున్నాడేమో.”

“వాణ్ణి స్కూలుకు పంపడమే పొరపాటయిందన్నమాట.”

“అలా అనకండి. మీరు వాడి మంచి కోరే స్కూల్లో వేసేరు.”

“అయితే ఇప్పుడు ఏమిటి చెయ్యడం.”

“వాడు పెద్ద క్లాసులు చదువుదామనుకొన్నాడు. మీరు కాదంటే మానేశాడు కదా. వాడు కోరుకున్నట్టున్న అమ్మాయి అన్ని విధాల మీకు నచ్చితే, వాడి కోరిక కూడా తీరుతుంది. అటువంటి అమ్మాయి కోసం కొన్నాళ్లు చూద్దాం. దొరక్కపోతే వాడికే బోధపడుతుంది. అప్పుడు మిమ్మలినేమీ అనుకోలేడు.”

“సరే, చూద్దాం.” అని శాస్త్రిగారు ఒక మెట్టు దిగి వచ్చేరు.

నవరంగపట్నానికి క్రోసుడు దూరంలో బొరిగుమ్మపల్లి ఉంది. ఆ ఊళ్లో మూడువందల గడపలుంటాయి. వాటిలో రామావధానగారిదొకటి. ఆయనకు రామాయణం, భారతం వంటి పురాణాలు సుమారుగా కంఠస్థా. పేరున్న పంచాంగకర్త. జ్యోతిషశాస్త్రంలోనూ ప్రవీణులు. ఆయన పంచాంగాలకు పై ఊళ్లలోనూ బాగా గిరాకీ. ప్రతి సంవత్సరం వాటి కోసం ఎందరో ఎదురు చూస్తూంటారు. ఆయన సతీమణి సీతామహలక్ష్మి. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక అమ్మాయి. పెద్దకుమారుడు కృష్ణావధాని, ఆ ఊళ్లోనే వినాయకాలయంలో పూజారి. రెండోవాడు ఆంజనేయవధాని తండ్రి వద్ద శిష్యరికం చేస్తూ కొంత జ్ఞానం ఆర్జించేడు. మూడో సంతానం అన్నపూర్ణ. అయిదోతరగతి వరకు చదువుకొంది. తల్లిదగ్గర పాకశాస్త్రంలో బాగా తరిఫీదు పొందింది. తండ్రి వద్ద పురాణాలు క్షుణ్ణంగా అభ్యసించింది. జ్యోతిషశాస్త్రం చాలావరకు నేర్చుకుంది. అవధానిగారు అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు. తగిన వరుడు కుదరడంలేదు. ఒక సన్నిహితుని ద్వారా గణపతిశాస్త్రి గూర్చి తెలిసింది. శాస్త్రిగారి కుటుంబ వివరాలు, వరుని వివరాలు తెలుసుకున్నారు. ఆయనకు అవి నచ్చేయి. మంచిరోజు చూసుకొని శ్రీవల్లిపురం ప్రయాణమయ్యేరు. గౌరీపతిశాస్త్రిగారిని కలిసి తమ అన్నపూర్ణను వారింటి కోడలుగా స్వీకరించమని కోరేరు. తమ కుటుంబ వివరాలు, తన వివరాలు, అన్నపూర్ణ వివరాలు విపులంగా చెప్పేరు. అవి విని, “అవధానిగారూ, మీ పంచాంగమే నేను ప్రతి సంవత్సరం తీసుకొంటున్నానండి. ఇతరుల పంచాంగాలు నాకంత నచ్చలేదు.” అని శాస్త్రిగారు చెప్పగానే,

“మీ అభిమానానికి చాలా సంతోషం.” అని అవధానిగారు శాస్త్రిగారికి తలవంచి నమస్కరించేరు.

అవధానిగారు తమ కుటుంబ వివరాలు, అన్నపూర్ణ వయసు, చదువు, శాస్త్రిగారికి తెలియజేసేరు.

అమ్మాయి కొంత చదువుకుంది. గణపతికన్నా అయిదేళ్లు చిన్నది. గణపతి కోరికలు తీరినట్టే, అని తలచి, శాస్త్రిగారు సంబంధం నిశ్చయం చేసేరు. అవధానిగారు ధన్యవాదాలు చెప్పేరు. సంతసంతో తమ సంచీనుండి ఓ కవరు తీసి దాని నుండి అమ్మాయి ఫోటో ఒకటి తీసి శాస్త్రిగారికి మర్యాదగా అందించి, “ఇది ఈ మధ్యనే తీసినది.” అని చెప్పేరు. అది చూస్తూ, “మీ ఊళ్లో ఈ సౌకర్యం కూడా ఉందన్నమాట.” అని చెప్పి శాస్త్రిగారు ఆ ఫోటో తిరిగి అవధానిగారికి ఇవ్వబోయేరు. అవధానిగారు, “అభ్యంతరం లేకపోతే అది మీ వద్ద ఉండనియ్యొచ్చు.” అని వినయంగా చెప్పేరు. “సంతోషం” అని శాస్త్రిగారు తనవద్ద ఉంచేరు. అంతలో గణపతి ఇల్లు చేరుకున్నాడు. శాస్త్రిగారు అవధానిగారికి కొడుకును పరిచయం చేసేరు. గణపతి ఆయనకు పాదాభివందనం చేసేడు. “ఆయుష్మాన్ భవ” అని ఆయన ఆశీర్వదించేరు. గణపతి తన గదిలోనికి వెళిపోయేడు. మరికొద్దిసేపు శాస్త్రిగారు అవధానిగారు తమ తమ కుటుంబ విషయాలు మాట్లాడుకున్నాక, అవధానిగారు బొరిగుమ్మపల్లి ప్రయాణమయ్యేరు.

అతిథి నిష్క్రమించేక గణపతి తల్లి వద్దకు వెళ్లేడు. శాస్త్రిగారు ఇద్దరకు కుటుంబ వివరాలు, పెళ్లికూతురు వివరాలు వివరంగా చెప్పి,

“గణపతీ, నువ్వు కోరినట్టు అమ్మాయి అయిదుదాకా చదువుకుంది. నీ కన్నా అయిదేళ్లే చిన్నది. అవి ఆలోచించి సంబంధం నిశ్చయం చేసేను.” అని శుభవార్త చెప్పేరు.

“అన్ని విధాలా బాగుందండి. నిశ్చయించి మంచిపని చేసేరు. ఏం నాయనా నీకు నచ్చినట్టే కదా.” అని మందహాసంతో కొడుకునడిగింది. వాడు మనసులో సంతోషిస్తూ తన సమ్మతాన్ని తల ఊపి తెలియజేసేడు.

శాస్త్రిగారు, “ఆ.. ఆయన వాళ్ల అమ్మాయి ఫోటో కూడా ఇచ్చేరు. నా కంటికి పిల్ల బాగుంది.” అని అన్నపూర్ణ ఫోటోను భార్యకందించేరు.

“పిల్ల లక్షణంగా ఉంది. చూసేరా రోజులెలా మారేయో. ఇప్పట్లా కాదు. మన రోజుల్లో అయితే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, పెళ్లిరోజునే ఒకరినొకరు చూసుకోడం జరిగేది. ఇంకా ఇలా ఎన్ని మార్పులొస్తాయో.” అని అనూహ్యమయిన భవిష్యత్తు చెప్పింది.

“పిల్ల నీకు నచ్చింది కదా. అది వాడికియ్యి. కాబోయే ఆవిడ ఫోటోను ఓ మారు చూసుకొంటాడు.” అని సలహా ఇచ్చేరు, శాస్త్రిగారు.

గణపతి ఫోటో చూసి మనసున సంతసించి, దానిని తండ్రికిచ్చి తన గదిలోనికి నిష్క్రమించేడు. తను కోరినట్టు జీవితభాగస్వామి కుదిరిందని మనసులో ఎంతో సంతోషించేడు. వివాహమయిన తరువాత ఆమెకు ఇంగ్లీష్ నేర్పుతానని భవిషత్ప్రణాలిక వేసుకున్నాడు.

శాస్త్రిగారు శుభసమాచారం వివరాలతో వియ్యపురాలు సుభద్రమ్మకు ఉత్తరం ద్వారా తెలియబరిచేరు. అల్లునికి అమ్మాయికి ఆ శుభసమాచారం తెలియబరచమని కోరేరు. ముహూర్తం నిశ్చయమయిన వెంటనే ఉభయులూ వచ్చి స్వయంగా ఆహ్వానిస్తామన్నారు. గణపతికి వివాహం కుదిరినందుకు తాము సంతోషిస్తున్నామని మంగమ్మ చేరాతతో సుభద్రమ్మ పంపింది. మంగమ్మ సంతోషానికి అంతు లేకపోయింది. శర్మ కూడా ఆ సంతోషాన్ని పంచుకున్నాడు. భార్య కోరిక మన్నించి శర్మ పోస్టాఫీసునుండి ఒక కవరుత్తరం తెచ్చేడు. తమ ఉభయుల సంతోషం తెలియబరుస్తూ మంగమ్మ అన్నకు ఉత్తరం రాసింది. అన్నకు అభినందనలు తెలియజేసింది. పెళ్లయిన తరువాత వదినగారికి తప్పకుండా ఇంగ్లీష్ నేర్పమని తన వంతు ఓ సలహా ఇచ్చింది. వదినగారి శిష్యరికంలో జ్యోతిషశాస్త్రం నేర్చుకొంటానని హాస్యం జోడించింది. ఆ ఉత్తరం గణపతి సంతోషాన్ని రెట్టింపు చేసింది.

గణపతి, అన్నపూర్ణల వివాహానికి అవధానిగారు శుభముహూర్తం నిశ్చయించేరు. పెళ్లి శుభలేఖలు ముద్రింపజేసేరు. మంచిరోజు చూసుకొని భార్యాసమేతంగా శ్రీవల్లిపురం వెళ్లి శాస్త్రిగారి దంపతులకు శుభలేఖ అందించి సకుటుంబంగా పెళ్లికి విచ్చేయమని వారిని ఆహ్వానించేరు. శాస్త్రిగారు సంతోషంగా తమ సమ్మతి తెలియజేసేరు. ఆ పిమ్మట శాస్త్రిగారు పార్వతీ సమేతంగా నవరంగపట్నం వెళ్లేరు. సుభద్రమ్మను పెళ్లికి సకుటుంబంగా విచ్చేయమని ఆహ్వానించేరు. వీలు చూసుకొని సాధ్యమయినంత ముందుగా శ్రీవల్లిపురం, కొడుకు కోడలుతో రమ్మన్నారు. ఇంటిపనుల వల్ల తనకు ముందుగా రాడానికి వీలుపడదని, శర్మ కూడా తన విధుల వల్ల అంత ముందుగా రాలేకపోయినప్పటికీ, అమ్మాయిని తప్పక ముందుగా పంపుతానని సుభద్రమ్మ హామీ ఇచ్చింది. అల్లుని కూడా కలసుకుని వివాహానికి సాధ్యమయినంత ముందుగా సతీసమేతంగా రమ్మని పిలిచేరు. శర్మ అంత ముందుగా కాకపోయినా మూడు నాలుగు రోజులు ముందుగా తప్పక వస్తానన్నాడు. అక్కడే ఉన్న అమ్మాయితో, “అమ్మా, మీ అత్తగారిని అడిగేము. ఆవిడ నిన్ను తప్పక ముందుగా పంపుతానని చెప్పేరు. నువ్వు ఇక్కడ పనులు చూసుకొని పెళ్లికి ముందుగా రా.” అని కుటుంబ సభ్యులు ముగ్గురిని ఆహ్వానించేరు. మంగమ్మ ఎగిరి గెంతినంత చేసింది. కోడలుకు కొత్త పట్టుచీర కొనమని సుభద్రమ్మ కుమారునికి సలహా ఇచ్చింది. అత్తగారి సలహా మేరకు మంగమ్మకు కొత్త పట్టుచీర లభ్యమయింది. దానితోబాటు కొత్త దండవంకీ కూడా ప్రాప్తించింది.

పెళ్లికి మూడు వారాల ముందుగా మంగమ్మ పుట్టినిల్లు చేరుకుంది. కూతురు రాక పార్వతికి చాలా సహాయపడింది. మంగమ్మ సగర్వంగా తల్లిదండ్రులకు తన కొత్త పట్టుచీర, దండవంకీ చూపింది. అది చూసి ఇద్దరూ సంతసించేరు. కూతురును, అత్తగారు, భర్త ఆదరిస్తున్నారని ఆనందించేరు. అల్లుని ఇష్టాయిష్టాలు తెలుసుకొంది పార్వతి. అల్లుడు వచ్చినప్పుడు మరోమారు జ్ఞాపకం చేయమంది. శాస్త్రిగారి ఇంటి ముందర పెళ్లిరాట వెలిసింది. పెళ్లిపనులు జోరందుకొన్నాయి. తల్లీ కూతుళ్లకు బట్టలు కొనడంలో ఒకటే సందడి. శాస్త్రిగారు పెళ్లి ఏర్పాట్లలో తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వీలు దొరికినప్పుడల్లా అన్నా చెల్లిళ్లది ఒకటే సందడి. ఏవేవో మధుర స్మృతులతో ఆనందాన్ని పంచుకొంటున్నారు. పెళ్లికి వచ్చే అతిథుల నివాసానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎప్పటివలె ఇరుగు పొరుగు వారిళ్లలో కొన్ని గదులు ఏర్పాటు అవుతున్నాయి. ఆ సందర్భంగా గణపతి తన అభిప్రాయాన్ని తండ్రికి చెబుతూ, “నాన్నా, ఇహ మీదట మన ఇంటికి బంధువుల రాక తరచూ ఉండొచ్చు.” అని చెపుతూ ఉంటే, అక్కడే ఉన్న పార్వతి, “అవునండి. మనవలు పుడితే వాళ్ల బారసాల అని, అన్నప్రాశన అని, ఏవో శుభకార్యాలు అవుతూ ఉంటాయి.” అని శృతి కలిపింది.

“వాటికి ఇరుపక్కల వాళ్లూ వస్తారు. ప్రతీమారు ఇరుగు పొరుగు వాళ్లను గదులడగడం అంత బాగుండదు.” అని గణపతి తన అభిప్రాయం చెప్పేడు.

“అయితే ఏమిటి చేద్దామంటావ్.” శాస్త్రిగారి ప్రశ్న.

“మరొక గదైనా మనం కట్టించుకుంటే వచ్చిన వాళ్లకవి ఇవ్వొచ్చు.” గణపతి సలహా.

“అవునండి. పిల్లడు చెప్పింది బాగుంది. ప్రతీమారు ఎవరో ఒకరిని బ్రతిమాలుకోఅక్కరలేదు.” కొడుకు సలహాకు తల్లి మద్దత్తు.

“నిజమే, వాడు చెప్పింది బాగుంది. అయితే ఒక్క గది వల్ల అవసరాలు పూర్తి కాకపోవచ్చు. ఎలాగూ కట్టించుకొన్నప్పుడు ఓ రెండు గదులయినా అయితే బాగుంటుంది.” శాస్త్రిగారు కొమరుని సలహాకు మరికొంత మెరుగు దిద్దేరు.

ఆ సంభాషణంతా వింటున్న మంగమ్మ, “అమ్మా, అక్కడ మా ఇంట్లో మేముంటున్న గదిలో గోడకు కర్ర అల్మైరా ఉంది. దానికి తలుపులు కూడా ఉన్నాయి. దాంట్లోనే మా బట్టలు పెట్టుకుంటాం. అది ఎంతో సదుపాయంగా ఉంది. పెట్టిలో బట్టలు పెట్టుకుంటే, కిందనున్న చీరకోసం పైనున్న బట్టలన్నీ బయట పెట్టి మళ్ళీ పెట్లో పెట్టుకోవాలి. కర్ర అల్మైరాలో ఆ ఇబ్బంది ఉండదు. తలుపులుంటాయి కాబట్టి బట్టలమీద ధూళి పడదు. పురుగుల బాధ కూడా ఉండదు. అన్నగదిలో అటువంటిది చేయిస్తే వదినకు సదుపాయమవుతుంది.” అని, రాబోయే వదినగారికి సదుపాయాలు తలపెట్టింది, మరదలు.

“ఏమమ్మా, మీ వదినగారికేనా కావాలి ఆ సదుపాయాలు. నాకు అక్కరలేదా.” అని ఓ ఛలోక్తి వేసింది పార్వతి.

“పిల్ల చెప్పింది బాగుంది. నువ్వు బెంగ పడకు. మన గదిలో కూడా చేయిస్తాను.” అని కూతురు సలహా పాటిస్తూ, భార్యకు హామీ ఇచ్చేరు, శాస్త్రిగారు.

“నాన్నా, ఆ పనికి సివిల్ నాయుణ్ణి రమ్మని కబురు పెట్టీదా.” అని అడిగేడు గణపతి.

“ఆ.. కబురు చెయ్యి. సాయంత్రం ఆరు తరువాత రమ్మను.”

ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో, తన కాబోయే భార్యకు సదుపాయాలు సమకూర్చినందుకు, చెల్లికి ధన్యవాదాలు చెప్పేడు, గణపతి.

ఆ ఊళ్లో గృహనిర్మాణాల్లో సివిల్ నాయుడుకు మంచి పేరుంది. అతగాడి పూర్తిపేరేమిటో తెలిసిన వాళ్లు తక్కువ. సివిల్ నిర్మాణాలే అతని వృత్తి. తత్కారణంగా సింహాద్రి నాయుడు సివిల్ నాయడుగా అవతారమెత్తేడు.

సాయంత్రం సివిల్ నాయుడు శాస్త్రిగారిని కలిసేడు. ఆ సమయంలో తల్లీ కొడుకులు కూడా అక్కడ ఉన్నారు. శాస్త్రిగారు నాయుడుకి తమ ప్రస్తావన తెలియజేసేరు. గదులు కొద్దిగా విశాలంగా ఉండాలని నాయుడుకు చెప్పేరు. తమ గదిలోను గణపతి గదిలోనూ గోడలకు బట్టలు పెట్టుకోడానికి తలుపులుతో సహా కర్ర అల్మైరాలు అమర్చమని చెప్పేరు. గదులు ఎక్కడ కట్టాలో చూపించేరు. పెళ్లికి ముందుగా వారం రోజుల్లో పని పూర్తవ్వాలన్నారు. నాయుడు అవి దృష్టిలో ఉంచుకొని శాస్త్రిగారు కోరినట్టూ రెండు గదులు నిర్మించడానికి, శాస్త్రిగారి గదిలోను, గణపతి గదిలోను కర్ర అల్మైరాలు అమర్చడానికి, మొత్తం ఎంత ఖర్చవుతుందో చెప్పేడు. శాస్త్రిగారు బేరమాడి కొంత తగ్గించేరు. పని వెంటనే ప్రారంభించమన్నారు. నాయుడు మరునాడే పని ప్రారంభించేడు. కర్ర అల్మైరాలు చేస్తున్నప్పుడు మంగమ్మ కొన్ని సలహాలు ఇచ్చింది. శాస్త్రిగారి ఇంట కొత్తగా రెండు గదులు చేరేయి. ప్రణాళిక ప్రకారం వారుంటున్న రెండు గదుల్లోను కర్ర అల్మైరాలు వెలిసేయి.

పెళ్లికి నాలుగు రోజులు ముందుగా అల్లుడు అత్తవారిల్లు చేరుకొన్నాడు. పనుల భారం వల్ల పెళ్లికి రాలేకపోతున్నానని, మన్నించమని సుభద్రమ్మ కొడుకు ద్వారా శాస్త్రిగారి దంపతులకు సందేశం పంపింది. శర్మ రాకతో గణపతికి కాలక్షేపం అయింది. మంగమ్మకు తెలుగు, ఇంగ్లీషు నేర్పినందుకు శర్మ గణపతిని ప్రశంసించి, అభినందించేడు. గణపతి కూడా తన చెల్లెలను ఆప్యాయంగా ఆదరిస్తున్నందుకు శర్మను, సుభద్రమ్మను కొనియాడేడు. మంగమ్మ అదృష్టానికి అట్టి అత్తగారు, భర్త దొరికారని మెచ్చుకున్నాడు. గణపతికి శర్మ సేవలందిస్తున్న దేవాలయం గూర్చి తెలుసుకోవాలని కుతూహలం కలిగి, “బావా, మీ దేవాలయానికి భక్తుల సందడి బాగానే ఉంటుందనుకొంటా.” అని విషయం కదిపేడు.

“భక్తులు రోజూ చాలామంది స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు, గణపతీ. శనివారాల్లో దగ్గర ఊళ్లనుండి కూడా తరలి వస్తూంటారు. భక్తుల సంఖ్య పెరుగుతూండడంతో దేవాలయంలో వాళ్లకు తగు సౌకర్యాలు చేయవలసి వస్తోంది. మా ప్రెసిడెంటుగారు ఎప్పటికప్పుడు అవి పర్యవేక్షిస్తూ భక్తులకు ఎట్టి ఇబ్బందులు కలగకుండా చూస్తారు. సెక్రటరీగారు, మిగిలిన మెంబర్లు ఆయనకు సహాయపడుతూ ఉంటారు. నాయడుగారికి, అదే మా ప్రెసిడెంటుగారికి వెంకటేశ్వరస్వామి ఆరాధ్యదేవత. దేవాలయంలో పరిశుభ్రత ఆయన రోజూ స్వయంగా చూస్తూంటారు. స్వామి పూజకు ఏ లోటూ రాకూడదంటారు.”

“పెరుగుతున్న భక్తుల సంఖ్య వల్ల ఖర్చులు పెరుగుతూ ఉంటే, గవర్నమెంటువాళ్లు ఏమైనా సాయం చేస్తున్నారా.” అని గణపతి అడిగేడు.

“అబ్బే, వాళ్లకి దానితో సంబంధం లేదు. అయినా మా కమిటీ వాళ్లకు ప్రభుత్వం నుండి ధనసహాయం కోరడం ఇష్టం లేదు. వాళ్లు చేసేది తక్కువయినా ఎక్కువగా పెత్తనం చలాయిస్తారు, అంటారు. అయినా గణపతీ, నీకు తెలీంది ఏముంది. ఆ సొమ్ము ఇచ్చినప్పుడు ఎంతమంది చెయ్యి జాపుతారో అందరికీ తెలుసు. మా దేవాలయం సందర్శించేవారి సంఖ్య బాగా పెరుగుతూండడంతో హుండీలో ఆదాయం అంతకంతకు బాగా పెరుగుతోంది. అంచేత ఫరవాలేదు. ఏమైనా తక్కువపడితే కమిటీ మెంబర్లు చందాలేసుకొని కథ నడిపిస్తారు.” అలా గణపతి నవరంగపట్నంలోని వెంకటేశ్వరాలయం విశేషాలు కొన్ని తెలుసుకున్నాడు. వీలయినప్పుడు యువత ముగ్గురూ ఒకచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకొంటున్నారు. రోజూ అల్లునికి ఇష్టమయిన వంటలు, పిండివంటలు చేస్తోంది, పార్వతి. అల్లుడు, కూతురు రాకతో సందడిగా ఉన్న ఇల్లు శాస్త్రిగారికి పార్వతికి ఎనలేని సంతోషాన్ని ఇస్తోంది.

బొరిగుమ్మపల్లి వెళ్లి అక్కడ అవధానిగారి ఇంట పెళ్లి సందడి ఎలా ఉందో చూద్దాం. అవధానిగారికి ఇద్దరు మగపిల్లలు, కొండంత సాయం. తండ్రి ఆదేశాలానుసారం కృష్ణావధాని, ఆంజనేయావధాని పనులు దగ్గరుండి చేయిస్తున్నారు. పనివారు ఒక ప్రక్క ఇంటికి కావలిసిన మరమత్తులు చేస్తూ మరో ప్రక్క గోడలకు సున్నాలు వేస్తున్నారు. ఇంటిముందు విశాలమయిన పందిరి వెలిసింది. దట్టమయిన మామిడి తోరణాలతో అలంకరింపబడ్డాది. దానితో బాటు మామిడి తోరణాలతో నిండుగా ఉన్న గుమ్మాలు శుభకార్యాన్ని సూచిస్తున్నాయి. వీలయినప్పుడు తల్లిదండ్రులు అన్నపూర్ణకు అత్తవారింట ఎలా మెలగాలో హితోపదేశాలు చేస్తున్నారు. కని పెంచి పెద్దచేసిన కూతురు కనుమరుగై అత్తవారింటికి శాశ్వతంగా వెళ్ళబోతోందని కన్నతల్లి మనోవేదన. పెంచి పెద్దచేసి జీవనమార్గాన్ని చూపించిన తల్లిదండ్రులను విడనాడడం ఊహించుకోలేకపోతున్న కన్నెపిల్ల మనస్తాపం. చిన్నప్పటినుండి కలసిమెలసి జీవించిన అన్నదమ్ముల సాంగత్యం కరువవుతుందని చెల్లెలి చెప్పరాని బాధ. ముద్దుల చెల్లెలు తమకు దూరమయిపోతుందని అన్నదమ్ముల ఆవేదన. అట్టి పరిస్థితి జీవితంలో తప్పదని ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు జీవితసత్యాన్ని గ్రహించేరు.

శాస్త్రిగారి కుటుంబం పెళ్లికి బొరిగుమ్మపల్లి చేరుకున్నారు. మంగళవాయిద్యాలతో అవధానిగారు, భార్య, వారిని సగౌరవంగా ఆహ్వానించి విడిదికి తీసుకెళ్లేరు. ఉభయుల కుశలసమాచారాలు ముగిసేయి. పెళ్లికి శాస్త్రిగారి బంధువులు వచ్చి చేరేరు. వివాహమహోత్సవం ప్రారంభమయింది. కన్నెపిల్లల సందడి, చిన్నపిల్లల ఆటలతో సందడిగా ఉంది. ‘సీతారాముల కల్యాణము చూతము రారండి’ అని సన్నాయివారు మంగళవాయిద్యాలు వీనుల విందుగా వాయిస్తుంటే, సభలోని సంగీతప్రియులు ఆస్వాదిస్తున్నారు. మంగళసూత్రధారణకు సమయం వచ్చింది. చెవులు బ్రద్దలయ్యేటట్లు మద్దెలవారు వాయిస్తున్నారు. ఆ ధ్వనిలో గణపతి, అన్నపూర్ణ మెడలో మంగళసూత్రాలు కట్టేడు. రెండు కుటుంబాలవారికి బంధుత్వం ఏర్పడింది. నలుగురు ఘనాపాఠీలు ప్రవరలు బిగ్గరగా వినిపిస్తూంటే, అందరూ నిశ్శబ్దంగా విన్నారు. తదుపరి కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా జరిగేయి. వివాహకార్యక్రమం సమాప్తమయింది.

ఓ సుముహూర్తాన్న అన్నపూర్ణ శాస్త్రిగారి ఇంట గృహప్రవేశం చేసింది. ఏనాళ్లకు, అన్నపూర్ణ తల్లి సీతామహలక్ష్మి వచ్చింది. శాస్త్రిగారి నివాసం సందడితో నిండుకొంది. నూత్నదంపతులు భక్తిశ్రద్ధలతో సత్యనారాయణవ్రతం చేసుకొన్నారు. చూడటానికి వచ్చిన ముత్తయిదులు గణపతికి అన్నపూర్ణ సరైన జోడీ అని కొనియాడేరు. అల్లుడు, కోడలు, ఇంటనుండడంతో శాస్త్రిగారి కుటుంబానికి నిండుతనం వచ్చింది. వదినా మరదళ్లు ఒకరిపైనొకరు ఛలోక్తులు సంధించుకొంటూ ఆనందాన్ని పంచుకొంటున్నారు. అది గమనిస్తున్న గణపతి మనసులో పొంగిపోతున్నాడు. రెండురోజులుండి, శర్మ అత్తమామల శలవు తీసుకొని తిరుగుప్రయాణమయ్యేడు. అత్తమామలు కోరడంతో మంగమ్మ మరో రెండు వారాలు పుట్టింట ఉండడానికి సమ్మతించేడు. సీతామహలక్ష్మి, వచ్చిననాటినుండి శాస్త్రిగారి కుటుంబసభ్యుల ప్రవర్తన పరిశీలిస్తోంది. ముఖ్యంగా, పార్వతి ప్రవర్తన చూస్తోంది. కుటుంబంలోని అందరూ సఖ్యంగా, ఆప్యాయంగా ఉండడం నచ్చింది. పార్వతితో మూడు రోజులు గడిపిన పిమ్మట సీతామహలక్ష్మికి పార్వతిపై సదభిప్రాయం ఏర్పడింది. కూతురును అత్తగారు ఎలా చూస్తుందో అనే ఆందోళన కొంత తగ్గింది. అతిథులు ఎవరి గూటికి వారు చేరుకున్నారు.

అన్నపూర్ణకు తన బట్టలు, పుస్తకాలు పెట్టుకోడానికి తమ గదిలో ఏర్పరిచిన కర్ర ఆల్మైరా బాగా నచ్చింది. రాత్రి మగనితో అది చెబుతూ, “ఏమండి, బట్టలు, పుస్తకాలు పెట్టుకోడానికి కర్ర ఆల్మైరా చాలా సదుపాయంగా ఉందండి. మా అమ్మకి నాన్నగారికి చూపించవలసింది. మా ఇంట్లో కూడా ఇటువంటివి చేయించి ఉందురు. బట్టలుకన్నా మా నాన్నగారి విలువయిన పుస్తకాలకి ఇది ఎంతో అవసరం. ప్రతీ రెండు మూడు వారాలకి పుస్తకాలన్నీ ధూళి దులిపి చెదలు పట్టకుండా చూసుకోవలసి వస్తోంది.” అని అభిప్రాయపడింది.

“ఈ అల్మైరా మన పెళ్లికి ముందునే మా చెల్లి చెబితే చేయించేము. వాళ్లింట్లో ఇటువంటివి ఉన్నాయిట. (మందహాసంతో) వదినగారు వస్తే ఆవిడకు సదుపాయమవుతుందని సిఫారసు చేసింది. మా నాన్నగారు మన గదిలోను, వాళ్ల గదిలోను చేయించేరు. మంగమ్మ దగ్గరుండి చేయించింది.” అని కర్ర అల్మైరా ఎలా వెలిసిందీ చెప్పేడు.

ఉదయం మంగమ్మ కలియగానే, “ఇంజనీరుగారూ, మీ అభిమానానికి ధన్యవాదాలు.” అని భుజం తట్టి చెప్పింది, కొత్త పెళ్లికూతురు.

వదినగారి నోట మాట మరదలును తికమక చేసింది. అయినా బయటపడకుండా, “అమ్మాయిగారికి రాత్రి నిద్రపట్టినట్టు లేదు. అవునులే అలాగే ఉంటుంది.” ఒక ఛలోక్తి విసిరింది.

అదంతా గమనిస్తున్న గణపతి నవ్వుతూ అసలు విషయం బయటపెట్టేడు.

“మంగమ్మా, బట్టలమాటకేంగానీ పుస్తకాలకి అది చాలా ఉపయోగపడుతుంది.” అని అన్నపూర్ణ చెప్పడంతో,

“వదినా, నువ్వు పుస్తకాలు కూడా తెచ్చుకున్నావా. ఏం పుస్తకాలవి.” అని అడిగింది, మంగమ్మ.

“జ్యోతిషశాస్త్రం లోనివి ఓ నాలుగు, పోతన భాగవతం, అలా కొన్ని తెచ్చుకొన్నాను.” అని వివరాలిచ్చింది, అన్నపూర్ణ.

“నువ్వు జాతకాలు చూస్తావన్నమాట. మా నాన్నగారు కూడా చూస్తారు.”

“అలాగా, అయితే మామగారి దగ్గర నేర్చుకోవచ్చు.”

“భారతం అంతా నీకు బాగా వచ్చా, వదినా.”

“బాగా.. అంటే, మరీ ఏమీ ఎక్కువగా కాదు. మా నాన్నగారు అందులో చాలా పద్యాలకు అర్థాలు చెప్పి బోధపరిచేరు. వీలయినప్పుడు అవి చదువుకుంటూ ఉంటాను.” అని నిగర్వంగా చెప్పింది. అన్నపూర్ణ.

“వదినా, ఓ మారొచ్చి నీ ఆల్మైరా చూడొచ్చా.” అని కుతూహలంతో అడిగింది, మంగమ్మ

“అయ్యో, నీకు అడ్డేమిటి. పద. చూపిస్తాను.” అని మరదలను తన గదికి తోడుగా తీసుకెళ్లింది.

అల్మైరా తలుపు తెరిచి మంగమ్మకు అన్నపూర్ణ తన పుస్తకాలు చూపెట్టింది.

“వదినా, చాలా పుస్తకాలే ఉన్నాయి. పోతన భాగవతం గూర్చి విన్నాను గాని, ఎప్పుడూ చదవలేదు. నేనిక్కడ ఉంటే నీ దగ్గర నేర్చుకొని ఉండేదాన్ని.” అని మనసు విప్పి మాట్లాడింది.

“మీ ఊళ్లో కూడా భాగవతం పుస్తకాలు దొరకొచ్చు. సరదా ఉంటే ఒకటి కొనుక్కొని ఎవరైనా తెలుగు పండితులు వద్ద నేర్చుకోవచ్చు.” అని మరదలుకు సలహా ఇచ్చింది.

“అవును. నిజమే. మా ఊరు వెళ్లేక ప్రయత్నిస్తాను.” అని మాతృభాషపై తన అభిలాషను వ్యక్తపరిచింది, మంగమ్మ.

ముగ్గురు ఆడవాళ్ళూ భోజనాలు చేస్తున్నప్పుడు మంగమ్మ భాగవతం ప్రస్తావన తెచ్చింది.

“అమ్మా, వదిన దగ్గర భాగవతం పుస్తకం ఉంది. అందులోని పద్యాలన్నీ వదినకు అర్థాలతో కూడా తెలుసు.” అని తెలుగు సాహిత్యంలో వదినగారి జ్ఞానం తల్లికి సంతోషంతో చెప్పింది.

“అలాగా. ఎవరు నేర్పేరమ్మా నీకు.” అని కోడలును అడిగింది, పార్వతి.

“మా నాన్నగారే నేర్పేరండి.” అని వినయంగా జవాబిచ్చింది కోడలు.

“అటువంటివి చదువుతూ ఉంటే మనసుకు హాయిగా ఉంటుంది. ఈ హడావిడంతా అయ్యేక రోజూ ఓ గంట భాగవతం చదివి వినిపించమ్మా. ఏవో పొల్లు మాటలు మాట్లాడుకోడానికి బదులు అటువంటివి నాలుగు మంచి ముక్కలు వింటే మంచిది.” అని కోడలుకు తన కోరిక చెప్పింది, పార్వతి.

“తప్పకుండానండి. నాకూ భాగవతం మరోమారు చదవాలని ఉంది. ఎప్పుడో, మీరు చెపితే ప్రారంభిస్తాను.”

“సరేలే, ఈ హడావిడి అయిన తరువాత నేను చెప్తానులే.” అని పార్వతి చెప్పడంతో ఆ సంభాషణ మరో వైపు మళ్లింది.

మంగమ్మ తన గూటుకు చేరుకొంది. ఎప్పటివలె ఇంటిపనులలో అత్తగారికి సాయపడుతోంది. పెళ్లి విషయాలు అత్తగారికి పూసగుచ్చినట్టు చెప్పింది. “మీ అన్నకు మంచి జోడీ దొరికింది.” అని సుభద్రమ్మ అన్నపూర్ణను ప్రశంసించింది. ఒకరోజు అత్తాకోడళ్లు వంటింట పనులలోనుండగా, సుమారు అరవై ఏళ్ల ఒకామె వచ్చి కలసుకుంది. ఆమె ప్రాధేయపడుతూ, “అమ్మగారండి నేను ఇక్కడకు ఇరవై మైళ్ల దూరంలో ఉన్న చెంచ్వాడ నుండి వచ్చానండి. నా పేరు శాంతమ్మ. మా ఆయన అక్కడ బ్రాహ్మణోత్తాలు చేసేవారు. పిల్లలు లేరు. మావారు నెలక్రితం ఉన్నపాళంగా ఏదో మాయదారి జబ్బు వచ్చి పోయేరు. నాకు మరో ఆధారం లేదు. మా ఊళ్లోనే ఏదయినా పని దొరుకుతుందేమో అని ప్రయత్నించేను. ఏవీ దొరకలేదు. ఒకావిడ మీ ఊరులో ఏదయినా పని దొరకొచ్చని సలహా ఇచ్చేరు. రెండు రోజుల క్రితం ఈ ఊరు వచ్చేనమ్మ గారూ. ఇంటింటికి వెళుతున్నాను. ఏదీ దొరకలేదు. మీ పాదాల దగ్గరకు వచ్చేను. దయచేసి తమరు మీ ఇంట్లో నాకు ఏదయినా పని ఇస్తే నమ్మకంగా చేస్తాను. నాకు వంటలన్నీ వచ్చు, అమ్మగారూ. పెళ్లిళ్లు, ఉపనయనాలలో పెద్ద వంటలలో సాయం చేయడానికి నన్ను పిలుస్తూ ఉంటారు.” అని విన్నవించుకొంది. సుభద్రమ్మది జాలి గుండె. “అమ్మా, మా ఇంట్లో కూడా ఏ పనీ లేదు. చూస్తున్నావుగా, ఇంట్లో ఉన్నవాళ్లం ముగ్గురం. ఆ మాత్రం పనికి ఇద్దరం ఉన్నాం. అయినా తెలిసినవాళ్లను అడిగి చూస్తాను. రేపొకమారు వచ్చి కలీయ్.” అని సలహా ఇచ్చి, “వంట అవుతోంది. అవగానే భోజనం చేసి వెళ్ళు.” అని చెప్పడంతో శాంతమ్మ సుభద్రమ్మకు పాదాభివందనం చేసింది. కొంతసేపట్లో భోజనం చేసి గంపెడాశతో వెళ్ళింది.

మధ్యాహ్న భోజనాల సమయానికి శర్మ దేవాలయం నుండి ఇంటికొచ్చేడు. కాళ్లూ చేతులూ కడుక్కొచ్చి భోజనానికి తల్లితోబాటు కూర్చున్నాడు. మంగమ్మ వడ్డనలు ప్రారంభించింది. భోజనం చేస్తూ “ఏమిటోనమ్మా, ఇవాళ లేచిన వేళ బాగులేదు.” అని శర్మ ఇంకా చెప్పబోతూ ఉంటే,” ఏమిటి నాయనా ఏమిటయింది.” అని గాభరాపడుతూ సుభద్రమ్మ అడిగింది. మంగమ్మ కూడా “ఏమిటయిందండీ.” అని ఆత్రుతతో అడిగింది. “మా కమిటీ మెంబరు, నారాయణమూర్తిగారని.. వాళ్ల వంటావిడ భర్త నిన్న పోయేడట. ఆవిడను నాకు బాగా తెలుసు. రోజూ సాయంత్రం దేవాలయానికి వచ్చి గర్భగుడి శుభ్రం చేసేది. ‘శుభ్రంగానే ఉందండి. మీకెందుకు శ్రమ’ అని నేనంటే, ‘ఫరవాలేదు. దేముడి సేవ చేసుకొనే అవకాశం మీరిస్తున్నారు. అదే సంతోషం.’ అనేది. ఇవాళ మూర్తిగారు దేవాలయానికి వచ్చినప్పుడు ఆ విషయం నాతో చెప్పి, ‘మంచావిడ. పాపం పెద్ద కష్టమే వచ్చింది. మూడు నెలల దాకా పనిలోకి మా అమ్మ రాలేదని వాళ్ళ అమ్మాయి చెప్పింది. ఫరవాలెదమ్మా. ఆవిడకు ఎప్పుడు వీలయితే అప్పుడు రావచ్చన్నాను’ అన్నారు.

అది విన్నాక, ‘అయితే, మూడు నెలలదాకా మీకెలాగండి.’ అని అడిగేను. ‘చూడాలి. ఏదీ నిన్ననేగా తెలిసింది.’ అన్నారు” చెప్పాడు శర్మ. ఆ సంభాషణ విన్నాక, సుభద్రమ్మ తమ ఇంటికి వచ్చిన శాంతమ్మ విషయం జ్ఞప్తికి వచ్చింది. శాంతమ్మ విషయం చెప్పి, “అవిడను మాట్లాడమంటావా. రేపు పెద్ద ఆశ పెట్టుకుని మనింటికి వస్తుంది.” అని అడిగింది, సుభద్రమ్మ.

“చెప్పమ్మా, మూర్తిగారు చాలా మంచి మనిషి. ఎందరకో సాయం చేస్తూ ఉంటారు. నువ్వు చెప్పినావిడ కుదిరితే వాళ్ళకి వెంటనే సమస్య తీరుతుంది.” అని తల్లికి చెప్పేడు.

“శాంతమ్మ అదృష్టవంతురాలు. వెంటనే పని దొరికింది.” అని మంగమ్మ సంతోషించింది.

“అమ్మా, ఆవిడకు ఒక విషయం చెప్పడం మరచిపోకు. మూర్తిగారి ఇంట్లో వాళ్ళ వంటావిడ వచ్చేదాకా మూడు నెలలకే చెయ్యాలి. అది ఇష్టపడితేనే, రేపు సాయంత్రం నన్ను దేవాలయంలో కలుసుకోమను.” అని నొక్కి చెప్పేడు.

“అలాగే నాయనా. అవిడకది తప్పక చెప్తాను.” అని తల్లి హామీ ఇచ్చింది. సంభాషణ ముగిసింది. శాంతమ్మ మూర్తిగారింట పనికి చేరింది. ఆయనకు సమస్య తీరింది. శర్మను అభినందించేరు. శాంతమ్మ సుభద్రమ్మను కలసుకొని ధన్యవాదాలు చెప్పుకొంది.

(సశేషం)

Exit mobile version