[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[తనకి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని తెలిసి, తనకి ఎలాంటి అమ్మాయి కావాలో తల్లికి చెప్తాడు గణపతి. నాన్నగారు అన్నీ ఆలోచించే చేస్తారని అంటుంది పార్వతమ్మ. నవరంగపట్నాకి క్రోసెడు దూరంలోని బొరిగుమ్మపల్లి ఊర్నుంచి అవధాని గారి అమ్మాయి అన్నపూర్ణ సంబంధం వస్తుంది. అందరికీ నచ్చడంతో సంబంధం ఖాయం చేసుకుంటారు. శాస్త్రి గారు ఈ విషయాన్ని కూతురి అత్తగారికి, అల్లుడికి తెలియజేస్తారు. సుభద్రమ్మ, మంగమ్మ ఎంతో సంతోషిస్తారు. అత్తగారి తరఫున మంగమ్మ తల్లిదండ్రులకి ఉత్తరం రాస్తుంది. ఇకపై బంధువుల రాకపోకలు పెరుగుతాయి కాబట్టి తమ మేడపైన ఒక గది కట్టిస్తే మంచిదని గణపతి అంటే, ఒకటి సరిపోదు, రెండు గదులు వేద్దామని చెప్పి, నాయుడిని పిలిపించి ఆ పనులు అప్పజెప్తాడు. అన్న పెళ్ళికి ముందుగానే వచ్చిన మంగమ్మ గదుల్లో, గోడలకి చెక్క అలమారులు బిగిస్తే బాగుంటుందని సూచించడంతో, అలాగే చేయిస్తారు. పెళ్ళికి నాలుగురోజుల ముందు శర్మ అత్తగారింటికి వస్తాడు. గణపతి బావగారిని ఆప్యాయంగా పలకరించి ఆయన పని చేసే గుడి వివరాలు తెలుసుకుంటాడు. అక్కడ అవధాని గారింట కూడా పెళ్ళి సందడి ఘనంగా ఉంటుంది. పెళ్లి రోజున గణపతి మంగళవాయిద్యాల నడుమ అన్నపూర్ణ మెడలో తాళికడతాడు. అన్నపూర్ణ అత్తగారింటికి వచ్చేస్తుంది. గదుల్లో గోడలకి బిగించిన చెక్క అలమారలను చూసి అబ్బురపడుతుంది. అది ఆమె ఆడపడుచు ఆలోచన అని చెప్తాడు గణపతి. కొన్ని రోజులుండి మంగమ్మ తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఓ రోజున శాంతమ్మ అనే ఆవిడ వచ్చి తనకి జరుగుబాటు లేదని, ఎక్కడైనా వంట పని ఇప్పించమని సుభద్రమ్మని వేడుకుంటుంది. రెండు రోజుల తర్వాత, శాస్త్రి గారి గుడి కమిటీ మెంబరు, నారాయణమూర్తిగారికి తాత్కాలికంగా వంటమనిషి అవసరం పడితే, శాంతమ్మని పంపుతారు. శాంతమ్మ వీళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటుంది. – ఇక చదవండి.]
శ్రీవల్లిపురంలో అన్నపూర్ణ భర్త వద్ద ఇంగ్లీష్ శ్రద్ధగా నేర్చుకొంటోంది. పార్వతికి కోడలుతో బాగా కాలక్షేపమవుతోంది. అన్నపూర్ణకు అత్తగారితో కొంత చనువు ఏర్పడింది. ఆవిడకు క్రమంగా వంటలో సాయం చేస్తోంది. ఆ సమయంలో తన తల్లిదండ్రులు, అన్నదమ్ముల గూర్చి అప్పుడప్పుడు చెప్తూ ఉండేది.
“నీకు వాళ్లు బాగా జ్ఞాపకం వస్తున్నారా. నిజమే అలాగే ఉంటుందమ్మా.” అని పార్వతి ఆప్యాయంగా సమర్థించింది.
“నేను వచ్చేక మా అమ్మకే చాలా ఇబ్బందిగా ఉండి ఉంటుంది, అత్తయ్యగారూ. వంటలో నేను చాలా సాయం చేసేదాన్ని. అప్పుడప్పుడు తనకు వీలుకానప్పుడు పూర్తిగా వంటంతా నేనే చేసేదాన్ని.” అని తల్లికి సానుభూతి తెలిపింది.
“అవునమ్మా, నువ్వు లేకపోడంతో వంటింట్లో ఒంటరితనం కూడా బాధిస్తుంది.” అని తనూ సానుభూతి ప్రకటిస్తూ, “వంటంతా నువ్వే చేయగలిగేదానివా.” అని ఆశ్చర్యపడ్డాది. చిన్న చిరునవ్వుతో అవునన్నట్టు తల ఊపింది, అన్నపూర్ణ.
“అయితే ఫరవా లేదు. గణపతికి ఎప్పుడూ ఇబ్బంది రాదు.” అని పార్వతి సరదాగా అంది.
అంతలో శాస్త్రిగారు రావడం గమనించి, అన్నపూర్ణ చేతులు కడుక్కొని తొందరగా పెరట్లోనికి వెళ్లి, ఆయనకు కాళ్లు చేతులు కడుక్కోడానికి సహకరిస్తూ ఉంటే, “గణపతి వచ్చేడా అమ్మా.” అని అడిగేరు.
“ఇంకా రాలేదండి. ఇవాళ రాడంలో ఆలస్యమవుతుందని వెళ్లేటప్పుడు చెప్పేరు.” అని చెప్పింది.
ఇద్దరూ లోపలకు వెళ్లేరు. కొద్దిసేపట్లో గణపతి వచ్చేడు. మగవాళ్ల భోజనాలు ప్రారంభమయ్యయి. ఆ సమయంలో అంతకు ముందు తనకు, కోడలుకు జరిగిన సంభాషణ పార్వతి శాస్త్రిగారితో చెప్పింది. “అవధానిగారు మొదట్లోనే చెప్పేరు. వాళ్ల అమ్మాయికి వంట బాగా వచ్చని. కోడలు తల్లివద్ద బాగా శిక్షణ పొందిందన్నమాట.” అని కోడలును మెచ్చుకున్నారు, శాస్త్రిగారు.
“అయితే మరేం. కోడలు వంట చేస్తుంది. నువ్వు దేముడి దగ్గర పూజలు తాపీగా చేసుకోగలవ్. నువ్వు విశ్రాంతి తీసుకో.” అని తల్లికి సలహా ఇచ్చేడు, గణపతి.
“అదే వంటంతా చేస్తే, నాకు కాళ్లు చేతులు పట్టేస్తాయిరా. ఇంతకూ ఇప్పుడు తానేమీ ఊరకనే కూర్చోడం లేదు. బోలెడు సాయం చేస్తోంది. ఇలాగే నడవనీండి. ఎప్పుడు అవసరమయితే అప్పుడు చూసుకోవచ్చు.” అని తన ఉద్దేశం చెప్పింది, పార్వతి.
“అదేదో వాళిద్దరిని చూసుకోనీ.” అని శాస్త్రిగారు తనయునికి సలహా ఇచ్చేరు.
మగవాళ్ల భోజనాలయ్యేయి. ఆడవాళ్లిద్దరూ భోజనాలకు కూర్చున్నారు. ఏవో కబుర్లు చెప్పుకుంటూ ముగించేరు.
***
ఒకరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సుభద్రమ్మ వంటింట్లో జారిపడ్డాది. విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. బాధ తగ్గించడానికి మంగమ్మ సర్వ ప్రయత్నాలు చేసింది. ఫలితం లేకపోయింది. అత్తగారు కాలు కదపలేకపోడం, విపరీతమైన బాధతో చుట్టుకుపోడం గమనించిన మంగమ్మ, పొరుగాయనను పిలుచుకొచ్చింది. ఆయన అది చూసి, “కాలు ఏదో బాగా దెబ్బ తిన్నట్టుంది. డాక్టరుకు చూపించడం మంచిది.” అని సలహా ఇచ్చేడు. మంగమ్మ ఆయనను తొందరగా గుడికి వెళ్లి తన భర్తను రమ్మని చెప్పమని వేడుకొంది. అరగంటలో గాభరాపడుతూ శర్మ ఆటోతో బాటు వచ్చేడు. భార్యాభర్తలిద్దరూ సుభద్రమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లేరు. డాక్టరు పరీక్షలు చేసి సుభద్రమ్మ కాలు ఫ్రేక్చరు అయిందని చెప్పేడు. నొప్పి తగ్గడానికి మందులిచ్చేడు. సుభద్రమ్మ కాలుకు ఆపరేషను చేసి ఎముక సరిదిద్దాలన్నాడు. ఆసుపత్రిలో కనీసం మూడు వారాలుండాలన్నాడు. భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకున్నారు. సుభద్రమ్మ ఆసుపత్రిలో జాయినయింది. ఆ వార్త తెలిసిన తక్షణం దేవాలయం కమిటీ మెంబరు నారాయణమూర్తి ఆసుపత్రికి వచ్చి, శర్మకు ధైర్యం చెప్పేరు. అవసరానికి ఉంచమని కొంత సొమ్మిచ్చేరు. శర్మ ఆయనకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు. మూర్తిగారు ఏదో ఆలోచించి, నాలుగు వారాల క్రిందటే వారి వంటమనిషి పనిలో చేరిందని, బహుశా శాంతమ్మ ఖాళీగానే ఉండొచ్చని, అవసరమయితే ఆవిడకు కబురు పంపమన్నారు. అది విన్న సుభద్రమ్మ కొడుకుతో శాంతమ్మకు వెంటనే కబురు చేయమని సలహా ఇచ్చింది. శాంతమ్మకు కబురు వెళ్లింది. శాంతమ్మ వెంటనే ఆసుపత్రి చేరుకొంది. సుభద్రమ్మ, తను బాగుపడేదాకా రోజూ ఇంటికొచ్చి వండిపెట్టమంది. శాంతమ్మ సంతోషంతో అంగీకరించింది.
నిర్ణయించిన రోజు ఉదయాన్నే సుభద్రమ్మ కాలుకు ఆపరేషను జరిగింది. ఆపరేషను జరుగుతున్నంతసేపు, థియేటరు బయట శర్మ, మంగమ్మ, శాంతమ్మ, సుభద్రమ్మకు ఏ ఇబ్బందీ లేకుండా ఆపరేషను జరగాలని మనసులో దైవప్రార్థన చేసేరు. కొంత సమయం తరువాత సుభద్రమ్మను గదిలోనికి మార్చేరు. ఆపరేషను ఏ ఇబ్బందీ లేకుండా జరిగినందుకు అక్కడున్న ముగ్గురూ దైవానికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. సుభద్రమ్మ కళ్లు మూసుకొనే ఉంది. బాగా నీరసంగా ఉంది. శర్మ తల్లితో మాట్లాడబోతే అక్కడున్న నర్సు, “ఆవిడ బాగా నీరసంగా ఉన్నారు. ఎవరూ ఆవిణ్ణి డిస్టర్బ్ చెయ్యకండి.” అని గట్టి సలహా ఇచ్చి బయటకు వెళ్ళింది. భార్యాభర్తలు ఆలోచించుకొని, శాంతమ్మను ఇంటికి వెళ్లి వేడి కాఫీ ఫ్లాస్కులో పోసి తెమ్మన్నారు. శాంతమ్మ ఇంటికి వెళ్లింది. శర్మ మంగమ్మనుద్దేశించి, “మంగా నేను ఒక్కమారు దేవాలయానికి వెళ్లి స్వామివారి పని చూసుకొని వీలయినంత తొందరగా వస్తాను. శాంతమ్మ కాఫీ తెస్తే అమ్మలేవగానే అమ్మకి నెమ్మదిగా త్రాగించు.” అని సలహా ఇచ్చి బయలుదేరేడు. మంగమ్మ అత్తగారి నుదురు మీద మెల్లగా నిమరప్రారంభించింది. కొంతసేపట్లో శాంతమ్మ కాఫీ పట్టుకు వచ్చింది. అప్పటికింకా సుభద్రమ్మ కళ్లు మూసుకొనే ఉంది. శాంతమ్మను ఇంటికి వెళ్లి మధ్యాహ్నభోజనాల ఏర్పాటు చేయమని, అత్తగారికి భోజనం తెమ్మని, మంగమ్మ సలహా ఇచ్చింది. శాంతమ్మ తిరిగి ఇంటికి వెళ్ళింది. సుమారు మూడు గంటల తరువాత సుభద్రమ్మకు బాగా తెలివి వచ్చింది. ఆ సమయానికి శర్మ ఆసుపత్రి చేరుకున్నాడు. సుభద్రమ్మ త్రాగడానికి మంచినీళ్లు ఇమ్మంది. శర్మ సున్నితంగా, తల్లి తల మీదకెత్తి పట్టుకుంటే, మంగమ్మ తాపీగా కొద్దిపాటి నీళ్లు పట్టగానే సుభద్రమ్మ చాలునని సౌజ్ఞ చేసింది. డాక్టరు వచ్చి సుభద్రమ్మను పరీక్షించేడు. ఆమెకు తేలికయిన ఆహారం కొద్దిగా పెట్టమన్నాడు. భార్యాభర్తలు ఆమెకు కొద్దిపాటి కాఫీ త్రాగించేరు. ఇద్దరూ ఆమెకు ఎలాగుందో అడిగేరు. మరేమీ ఇబ్బంది లేదుగాని, నీరసమే ఎక్కువగా ఉందని సుభద్రమ్మ చెప్పింది. శాంతమ్మ భోజనం పట్టుకు వచ్చింది. భార్యాభర్తలిద్దరూ సుభద్రమ్మకు తేలికపాటి భోజనం కొద్దిగా పెట్టేరు. శాంతమ్మను సుభద్రమ్మవద్ద ఉండమని చెప్పి, శర్మ, మంగమ్మ ఇంటికి భోజనానికి వెళ్లేరు.
రోజూ ఉదయాన్నే శర్మ ఫ్లాస్కుతో వేడీ కాఫీ తీసుకెళ్లి అమ్మకు అందించి క్షేమ సమాచారం కనుక్కుని దేవాలయానికి వెళ్ళేవాడు. రాత్రంతా సుభద్రమ్మ వద్ద గడిపిన శాంతమ్మ వడిగా తన ఇంటికి వెళ్ళి స్నానం చేసి శర్మగారిల్లు చేరుకునేది. ఆ సమయానికి మంగమ్మ స్నానపానాదులు ముగించుకుని దేముని పూజ చేసుకొనేది. శాంతమ్మ ఫలహారం తయారుచేసి, సుభద్రమ్మకొరకు జాగ్రత్తగా పేక్ చేసి తయారుగా ఉంచేది. తను ఫలహారం చేసి, అత్తగారి ఫలహారంతో మంగమ్మ ఆసుపత్రికెళ్లి అత్తగారికి తినిపించేది. ఆవిడతో కాలక్షేపం చేసేది. ఇంటివద్ద శాంతమ్మ మధ్యాహ్నభోజనం తయారుచేసేది. శర్మ దేవాలయంలో బాధ్యతలు నిర్వర్తించుకొని, ఆసుపత్రికెళ్లి తల్లి క్షేమసమాచారం కనుక్కుని, ఇంటికెళ్లి భోంచేసేవాడు. శాంతమ్మ అత్తాకోడళ్లకు భోజనం పేక్ చేసి ఆసుపత్రికెళ్లేది. శర్మ కొద్దిపాటి విరామం తరువాత ఆసుపత్రికెళ్లేవాడు. అలా రోజూ పగటిపూట ఎవరికి వీలయినప్పుడు వారు సుభద్రమ్మ వద్ద ఉండేవారు. రాత్రుళ్ళు శాంతమ్మ అక్కడే పడుకునేది. సుభద్రమ్మ త్వరగా కోలుకొంటోంది.
మూడు వారాల తరువాత సుభద్రమ్మను డిశ్చార్జ్ చేసేరు. కొంతకాలం వరకు సుభద్రమ్మ చేతికర్ర సాయంతో నడవడం అవసరమని డాక్టరు సలహా ఇచ్చేడు. తల్లిని అవసరమయినప్పుడే చేతికర్ర సాయంతో నడవమని శర్మ నొక్కి చెప్పేడు. ఆ సమయాల్లో అమ్మకు దగ్గరగా ఉండమని మంగమ్మను కోరేడు. నిజానికి చేతికర్ర సాయంతో కూడా నడవడానికి సుభద్రమ్మకు ధైర్యం చాలలేదు. అది గమనించిన మంగమ్మ అత్తగారిని అంటిపెట్టుకొనే ఉండేది. అత్తగారు పూర్తిగా నయమయినదాకా రోజూ రాత్రిపూట అత్తగారి గదిలోనే పడుకోమని, ఆవిడను జాగ్రత్తగా చూసుకోమని మంగమ్మ శాంతమ్మను కోరింది. శాంతమ్మ సంతోషంగా సమ్మతించింది. ఈ పరిణామాలు శాస్త్రిగారికి తెలిసేయి. అవసరమయితే పార్వతిని గాని అన్నపూర్ణను గాని సహాయానికి పంపిస్తానని శాస్త్రిగారు అల్లునికి తెలియజేసేరు. శర్మ మామగారికి ధన్యవాదాలు తెలుపుతూ, శాంతమ్మ పనిలో చేరడం వలన తమకు ఎట్టి ఇబ్బంది లేదని, అవసరమయితే తప్పక తెలియజేస్తానన్నాడు.
ఓ మారు శ్రీవల్లిపురం వెళ్దాం.
పార్వతి చెప్పడంతో, రోజూ సాయంత్రసమయంలో అన్నపూర్ణ పోతన భాగవతం చదివి వినిపించడం మొదలుపెట్టింది. ఒకొక్క పద్యం చదివి దాని భావం చెబుతూండేది. అత్తగారికి ముందునుండి కొసదాకా అంతా వినే ఆసక్తి ఉండదని గ్రహించి అక్కడక్కడ ఆవిడకు ఆసక్తికరమయిన భాగాలనే చదివి వినిపించేది. ప్రప్రథమంగా పోతనకుండెడి రామభక్తి తెలియబరుస్తూ, ‘పలికెడిది భాగవతమట, పలికించెడి విభుడు రామభద్రుడట’ – పద్యాన్ని పూర్తిగా చదివి భావార్థం చెప్పింది. అది విని పార్వతి “ఎంత చక్కగా చెప్పేడమ్మా. అంతటి పెద్దలు ఎంత మంచి పని చేసినా, అందరిలాగ జబ్బలు చరుచుకొని వాళ్లు చేసిన పని చాటుకోరు.” అని నిత్యసత్యాన్ని చెప్పి, “అమ్మా ఇంత చక్కగా పద్యాలు చదువుతున్నావు, నువ్వు సంగీతం నేర్చుకొన్నావా.” అని అడిగింది.
“లేదండి, అత్తయ్యగారూ, మా నాన్నగారు రోజూ భారత భాగవతాల్లోని పద్యాలు వీలయినప్పుడు వల్లె వేసుకొంటూ ఉంటారు. అది వింటూ ఉండేదాన్ని. మా నాన్నగారు కూడా కొంత నేర్పేరనుకోండి.” అని వినయంగా చెప్పింది.
పార్వతిగారింట పురాణ కాలక్షేపం ఇరుగుపొరుగు వనితల చెవిన పడ్డాది. ఆ కార్యక్రమంలో చేరడానికి వారికి ఆసక్తి కలిగింది. ఆ విషయం పార్వతికి తెలియజేసేరు. “అయ్యో, తప్పకుండా రండి.” అని పార్వతి వారిని ఆహ్వానించింది. భాగవతం వినే ప్రేక్షకుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఒక సాయంత్రం అన్నపూర్ణ గజేంద్రమోక్షం వినిపిస్తున్న సమయంలో, గజరాజు ప్రాణాలను కాపాడాలనే ఉత్సాహంతో విష్ణువు లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా, శంఖచక్రాలను చేతిలోనికి తీసుకోక, ఎంత తొందరగా వెళ్ళేడో చెప్పే పద్యం ‘సిరికిం జెప్పడు; శంఖచక్ర యుగముం జేదోయి సంధింపడే..’ చదివి భావార్థం చెప్పింది. అది విన్న ఒకావిడ, “ మా అమ్మమ్మ రోజూ రాత్రి నిద్రరానప్పుడు, మంచం మీద కూర్చొని, ‘రాజేంద్రా.. వి.. నూమా..’ అని పాడుకుంటూ ఉండేది. అదేమిటో అప్పుడు బోధపడలేదు. అది, ఈ కథ అన్నమాట.” అని తన అమ్మమ్మను తలచుకొంది. అలా శాస్త్రిగారి ఇంట రోజూ పురాణకాలక్షేపం జరుగుతోంది. అదలా ఉండనిద్దాం. నవరంగపట్నంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
సుభద్రమ్మ కాలు చాలా వరకు నయమయింది కాని చేతికర్రతో జంకుతూనే నడుస్తోంది. శాంతమ్మ అవసరం కొనసాగుతోంది. దేవాలయంలో ప్రతిఏట జరుపుతున్న వేంకటేశ్వరస్వామి కళ్యాణం నిర్వహించడంలో శర్మగారు తలమునిగి ఉన్నారు. ఆ కార్యక్రమానికి మామగారిని సకుటుంబంగా విచ్చేయమని ఆహ్వానం పంపేరు. ఒకరోజు ముందుగా శాస్త్రిగారు సకుటుంబంగా చేరుకున్నారు. తనవారందరి రాకతో మంగమ్మ సంతోషంతో పొంగిపోయింది. శాస్త్రిగారు, పార్వతి, సుభద్రమ్మను కుశలప్రశ్నలడిగి తెలుసుకున్నారు. గణపతి, అన్నపూర్ణ, కూడా అడిగి తెలుసుకొన్నారు. అతిథుల సౌకర్యాలు స్వయంగా చూడమని సుభద్రమ్మ కోడలుకు సలహా ఇచ్చింది. కళ్యాణానికి జరుగుతున్న ఏర్పాట్లు చూడడానికి శాస్త్రిగారు, గణపతి, దేవాలయం సందర్శించేరు. ఆ సమయంలో కమిటీ మెంబర్లు అక్కడ ఉన్నారు. శర్మ వారికి అతిథులిద్దరను పరిచయం చేసేడు. కళ్యాణోత్స్వానికి స్వయంగావచ్చినందుకు కమిటీ తరఫున మూర్తిగారు వారిద్దరకు ధన్యవాదాలు చెప్పేరు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న భక్తుల సదుపాయాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
మగవారు ముగ్గురూ, రాత్రి భోజనాల సమయంలో కళ్యాణానికి జరుగుతున్న ఏర్పాట్లు చర్చించుకున్నారు. వాటికి సుమారుగా ఎంత ఖర్చవుతున్నాదో శర్మ చెప్పేడు. దానికి స్పందిస్తూ శాస్త్రిగారు, “ఈ ఖర్చులన్నింటికీ దేవాలయ ఆదాయం సరిపోతోందా.” అని ఆరా తీసేరు.
“దేవాలయానికి పెరుగుతున్న భక్తులు సంవత్సరం పొడుగునా హుండీలో వేసే సొమ్ము సరిపోవచ్చు నాన్నా.” అని గణపతి తన అభిప్రాయం చెప్పేడు.
“భక్తులు హుండీలో వేసే సొమ్ము బాగానే చేరుతోంది. కాని అది ఈ ఖర్చులన్నింటికీ పూర్తిగా సరిపోదు, గణపతీ. చాలని మొత్తాన్ని కమిటీ మెంబర్లు పెట్టుకొంటూ ఉంటారు.” అని శర్మ విశదీకరించేడు.
భోజనాలు ముందుకు సాగేయి. గణపతికి ఏదో ఆలోచన తట్టింది.
“బావా. స్వామివారి కళ్యాణం చూడటానికి వస్తున్న భక్తులు, అనేకమంది ఆ ఉత్సవం దూరంనుండే చూడగలుగుతూంటారు. అవునా.” అని గణపతి అడిగేడు.
“అవును. మధ్యలో ఉన్నవాళ్లు చూడడానికి నిలబడితే, వెనకనున్నవాళ్లు వాళ్లని ‘కూర్చోండి, కూర్చోండి. మాకు కనబడడం లేదు.’ అని గోల పెట్టేస్తూంటారు. ఆ నిలబడిన వాళ్లను కూర్చోబెట్టడానికి మా వాలంటీర్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు.” అని శర్మ గణపతిని సమర్థించేడు.
“వాళ్లలో చాలామంది దగ్గరనుండి చూడగలిగే అవకాశమిస్తే రుసుము చెల్లించి చూడటానికి వెనకాడరనుకొంటాను. అటువంటి కార్యక్రమం ప్రారంభిస్తే, దేవాలయానికి ఆదాయం పెరుగుతుంది. భక్తులూ సంతోషిస్తారు.”
“అవును. నిజమే, గణపతీ. అటువంటి కార్యక్రమాలేవయినా ఉన్నాయేమో ఆలోచించాలి.”
“నీకు తెలిసే ఉంటుంది. తిరుపతి దేవాలయంలో కోరిన భక్తులవద్ద రుసుములు వసూలు చేసి, వారికొరకు వేరే కళ్యాణాలు జరిపిస్తూ ఉంటారు. మీరు కూడా అలాగే ప్రత్యేక రుసుములు చెల్లించిన కొద్దిపాటి భక్తులకొకసారి, వారికి దగ్గరలో స్వామివారి కళ్యాణం జరిపే కార్యక్రమం చేస్తే, భక్తులు చాలామంది ఆ అవకాశాల్ని వినియోగించుకొంటారు.” అని గణపతి దేవాలయ ఆదాయం పెంచడానికి ఒక విలువయిన సలహా ఇచ్చేడు.
“వాడు చెప్పింది బాగానే ఉంది. మొదట్లో వారానికి ఓ రోజు, ప్రతి శనివారం చేస్తే బాగోగులు తెలుస్తాయి. భక్తుల గిరాకీ పెరిగితే క్రమక్రమంగా రోజూ చేయొచ్చు.” అని శాస్త్రిగారు కొడుకు సలహాని సమర్థిస్తూ తన వంతు దానికి మెరుగులు దిద్దేరు.
మరునాడు ఉదయాన్నే శర్మ దేవాలయానికి వెళ్లేడు. ఆ రోజే నిర్వహించబోయే స్వామివారి కల్యాణానికి కావలసిన సామగ్రి జాగ్రత్తపరిచేడు. కొద్దిసేపట్లో కమిటీ మెంబర్లు ఒక్కొక్కరు దేవాలయం చేరుకున్నారు. గతరాత్రి మామగారు, గణపతి, దేవాలయ ఆదాయాన్ని వృద్ధిపరచడానికి ఇచ్చిన సలహాలు శర్మ వారికి విపులంగా చెప్పేడు. వారందరూ వాటిని మెచ్చుకుంటూ శాస్త్రిగారు, గణపతి తమ దేవాలయ విషయంలో కనబరిచిన ఆసక్తిని ప్రశంసించేరు. మరికొద్ది సేపట్లో శాస్త్రిగారు, గణపతి చేరుకున్నారు. భక్తుల రాక ప్రారంభమయింది. వాలంటీర్లు వారికి సేవలందిస్తున్నారు. కళ్యాణానికి ప్రత్యేకంగా నిర్మించిన పందిర, భక్తులతో నిండుకొంది. దాని ముందర కళ్యాణం కొరకు ప్రత్యేకంగా ఎత్తయిన మండపం అమర్చబడ్డది. కార్యక్రమ ప్రారంభానికి ముందుగా మంగమ్మ, శాంతమ్మల సహాయంతో సుభద్రమ్మ ఆటోలో వచ్చింది. నిర్ణీత సమయానికి స్వామి వారి కళ్యాణం ప్రారంభమయింది. శర్మగారు నిర్వహిస్తున్న కళ్యాణమహోత్సవానికి శాస్త్రిగారు, గణపతి సహాయపడుతున్నారు. భక్తి శ్రద్ధలతో అందరూ వీక్షిస్తున్నారు. స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. కమిటీ ప్రెసిడెంటుగారు విచ్చేసినవారందరకూ మైకులో ధన్యవాదాలు తెలిపేరు. శాస్త్రిగారికి, గణపతికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పలుకుతూ, ప్రతి సంవత్సరం జరిపే ఈ మహోత్సవానికి సకుటుంబంగా రమ్మని ఆహ్వానించేరు. వారిరువిరికి నూతనవస్త్రాలు సమర్పించేరు. సభ చప్పట్లతో మారుమ్రోగింది. అతిథులందరకు భోజన ఏర్పాట్లు జరిగేయి. స్వామివారి కళ్యాణ మహోత్సవం సాంప్రదాయంగా ముగిసింది. శాస్త్రిగారు, గణపతి భార్యాసమేతంగా శ్రీవల్లిపురం చేరుకున్నారు.
***
శాస్త్రిగారి ఇంట ఒక శుభ పరిణామం చోటుచేసుకుంది. కొద్ది రోజులై అన్నపూర్ణకు తల్లికాబోయే సూచనలు కనిపించేయి. తల్లి సలహా మేరకు గణపతి అన్నపూర్ణను డాక్టరు వద్దకు తీసుకెళ్లేడు. అన్నపూర్ణ తల్లికాబోతోందని ఆమె ధ్రువపరిచింది. అంతులేని సంతోషంతో వారిరువురూ ఇంటికెళ్లి, ఆ శుభవార్త పార్వతికి తెలియజేసేరు. పార్వతి సంతోషంతో కోడలును దగ్గరగా తీసుకొని, “అమ్మా, జాగ్రత్తగా ఉండు. బరువైన పనులేవీ చేయకు.” అని ఆప్యాయంగా సలహా ఇచ్చింది. శాస్త్రిగారు రాగానే పార్వతి ఆయనతో, “మీరు తాత కాబోతున్నారు.” అని మందహాసంతో చెప్పింది. ఆయన. “నువ్వు కూడా మామ్మవి అవుతున్నావన్నమాట.” అని చమత్కరించేరు.
“వియ్యాలవారిద్దరికి ఈ సంగతి తెలియబరచాలండి.” అని పార్వతి కోరింది.
“ఆ.. అవును. మంచిరోజు చూసి తెలియబరుస్తాను.” అని శాస్త్రిగారు స్పందించేరు.
శుభవార్త తెలిసి, అవధానిగారి కుటుంబం మురిసిపోయేరు. అవధానిగారి సతీమణి సీతామహలక్ష్మి, కొడుకులిద్దరను మేనమామలు కాబోతున్నారని ఊరించింది. “నువ్వు కూడా అమ్మమ్మవవుతున్నావు.” అని వారు ప్రతిస్పందించేరు. ఆ ముగ్గురూ కలసి అవధానిగారిని, ‘మీరు తాతగారయిపోతున్నారు’ అని ఆయనతో సంతోషం పంచుకున్నారు.
సాయంత్రం పురాణకాలక్షేపం అయ్యేక, పార్వతి సంతోషంతో అక్కడున్నవారితో విషయం ప్రారంభించగానే, అన్నపూర్ణ సిగ్గుతో లోపలకు దారితీసింది. పార్వతి అందరకు తీపి తినిపించింది. అందులో ఒకావిడ, “పార్వతిగారూ, అయితే మన పురాణకాలక్షేపం కొన్నాళ్లు అవదన్నమాట.” అని సందేహించింది. “ప్రస్తుతానికి, అన్నపూర్ణ పుట్టింటికి వెళ్ళేదాకా ఫరవాలేదనుకొంటాను.” అని పార్వతి వారి సందేహనివృత్తి చేసింది.
శాస్త్రిగారు సుభద్రమ్మకు శుభవార్త తెలియజేసేరు. శర్మకు, మంగమ్మకు కూడా తెలియజేయమని కొరేరు. తను మేనత్త కాబోతున్నాని తెలిసి మంగమ్మ మురిసిపోయింది. అత్తగారి కోరికపై శాస్త్రిగారికి ఆవిడ తరఫున, అభినందనలు ఉత్తరం ద్వారా పంపింది. అదే కవరులో తన తరఫున, శర్మ తరఫున అన్నపూర్ణకు, గణపతికి, ప్రత్యేక అభినందనలు వేరే రాసింది.
రాత్రి పడకగదిలో, గణపతి, అన్నపూర్ణ, ఎనలేని సంతోషంలో మునిగిపోయేరు. పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు గూర్చి ఎన్నో ఊహించుకొన్నారు. మగ అయినా, ఆడ అయినా, తప్పక పెద్ద చదువులు చదివించాలని ఉవ్విళ్లూరేరు. మన పురాణ గాధలు చిన్నప్పటినుండి చెప్పాలని అన్నపూర్ణ ఆశ. మంచి నడవడి నేర్పాలని గణపతి జోడించేడు. ఆ బాధ్యత చాలావరకు అన్నపూర్ణే తీసుకోవాలని గణపతి అభిప్రాయపడ్డాడు. “అయ్యగారు ఇప్పటినుండి బాధ్యతలు తప్పించుకొందామనుకొంటున్నారు. అది కుదరదు.” అని భర్త చెవి సున్నితంగా పట్టుకొని భార్యామణి హెచ్చరించింది.
“అలాగేనండి, అమ్మగారూ, నాకు తెలిసిన నాలుగు ముక్కలు తప్పక చెప్తాను. నా చెవి వదలండి.” అని పరిహాస్యమాడేడు. అలా వారిద్దరు రాత్రి చాలసేపటివరకు, ఊహాప్రపంచంలో కలలుకన్నారు.
కొడుకు, తండ్రి కాబోతున్నాడని పార్వతి ఆనందిస్తోంది. ఆ అమితానందమయిన మనసులో ఏదో చివర, కూతురు పెళ్లి ముందుగా జరిగినా ఇంకా తల్లికాబోయే సూచనలు ఏవీ రాలేదని ఒక ఆవేదన ప్రారంభమయింది. ఆ విషయం రాత్రి మగనితో ప్రస్తావించగా,
“పార్వతీ, అలా గాభరా పడకు. మనకు పెళ్లయిన ఆరు సంవత్సరాలకి గదా మొదటి సంతానం.” అని శాస్త్రిగారు అభయమిచ్చేరు.
“నిజమే అనుకోండి. అయినా డాక్టరుకు ఓ మారు చూపిస్తే ఏదయినా సమస్య ఉంటే తెలుస్తుంది.” అని అనుమానం తీర్చుకోబోయింది.
“పార్వతీ, అమ్మాయికి పెళ్లయి నాలుగయిదు సంవత్సరాలేమీ కాలేదు, గాభరా పడడానికి. పిల్లతో ఆ విషయం అనబోకుసుమీ. చిన్నబుచ్చుకొంటుంది.” అని నొక్కి చెప్పేరు.
“అబ్బే, మీరు చెప్పేరుగదా. దానితో ఆ విషయం ఎత్తను.” అని తనను తాను సముదాయించుకొంది.
రోజూ పూజా సమయంలో మంగమ్మకు తొందరలో సంతానప్రాప్తి కలుగజేయమని పార్వతి వెంకటేశ్వరస్వామిని వేడుకొనేది.
అన్నపూర్ణకు నెలలు నిండుతున్నాయి. పార్వతి కోడలుకు ఇష్టమయినవి వండి పెడుతోంది. పురాణ కాలక్షేపం కొనసాగుతోంది. ఇబ్బందిగా ఉంటే ప్రస్తుతానికి ఆపేమని పార్వతి సలహా ఇచ్చింది. ఆ సమయంలో దైవచింత చేసుకోడం మంచిదని మనసులో తలచి, తనకేమీ ఇబ్బంది లేదని, ఎప్పుడు ఇబ్బంది తెలిస్తే అప్పుడు ఆపేస్తానని వినయంగా చెప్పింది.
(సశేషం)
శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం నవంబరు, 1936 లో జన్మించారు. M.A. మరియు P.G. Diploma in Personnel Management పాసయ్యారు. ఉద్యోగ పర్వం, హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రారంభించి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిగా చేసి, 1994 లో విశ్రాంతి తీసుకొన్నారు. అమెరికా వాసి.
హైస్కూలు విద్యార్థిగా రంగస్థల ప్రవేశం చేసేరు. చిన్న నాటికలు రాసి, వాటిలో పాత్రలు ధరించి, దర్శకత్వం చేసేరు.
గత ఎనిమిది సంవత్సరాల నుండి రచనలు చేస్తున్నారు. ఈ నాటికి 33 కథలు, 3 నవలలు, 4 కవితలు, ఒక హాస్య నాటిక ప్రచురణమయ్యేయి.
