[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[అన్నపూర్ణకి అత్తగారితో చనువు ఏర్పడుతుంది. భర్త వద్ద ఇంగ్లీషు నేర్చుకుంటుంటుంది. అప్పుడప్పుడు పుట్టింటివాళ్ళని గుర్తు చేసుకుంటుంది. ఒక రోజు సుభద్రమ్మ వంటిట్లో జారిపడుతుంది. డాక్టరు వద్దకు తీసుకువెళ్తే, ఆపరేషన్ చేసి ఎముకని సరిచేస్తారు. మూడు వారాలు ఆసుపత్రిలో ఉండి ఇంటికి వస్తుంది. మంగమ్మ, శర్మ ఆమెను జాగ్రత్తగా చూసుకుంటారు. ఆమెకి నయమయ్యేదా శాంతమ్మ వండిపెడ్తుంది. డిశ్చార్జ్ అయ్యాకా, చేతికర్ర సాయంతో నడవమని చెప్తారు డాక్టరు. విషయం తెల్సిన శాస్త్రి గారు పార్వతిని గాని అన్నపూర్ణని గాని పంపిస్తానంటే, శాంతమ్మ అన్నీ చూసుకుంటోందని, అవసరం లేదని చెప్తాడు శర్మ. అన్నపూర్ణ గజేంద్ర మోక్షంలోని పద్యాలు బాగా చెప్తుందని విని, ఇరుగుపొరుగు మహిళలంతా సాయంత్రాలు పార్వతి ఇంట్లో పురాణ కాలక్షేపానికి పూనుకుంటారు. అక్కడ నవరంగపట్నంలో సుభద్రమ్మ కాలు చాలావరకూ నయమయ్యింది. ఆ ఊర్లోని వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏటా జరిగే కళ్యాణోత్సవానికి శాస్త్రిగారు సకుటుంబంగా చేరుకుంటారు. ఏర్పాట్లు చూడడానికి బావమరిదితో పాటు గణపతి కూడా ఆలయానికి వెళ్తాడు. ఆలయానికి ఆదాయం రావడానికి గణపతి ఓ మార్గం సూచిస్తాడు. కమిటీ మెంబర్లకు అది నచ్చుతుంది. కళ్యాణోత్సవం ముగిసాకా, శాస్త్రిగారి కుటుంబం తిరిగి శ్రీవల్లీపురం చేరుతుంది. కొద్దిరోజులకు అన్నపూర్ణ గర్భవతి అవుతుంది. కొడుకు కన్నా ముందు పెళ్ళయిన కూతురికి ఇంకా గర్భం రానందుకు పార్వతి బాధపడ్తుంది. అన్నపూర్ణకు నెలలు నిండుతాయి. – ఇక చదవండి.]
ఏడోనెలన అమ్మాయిని పురిటికి తీసుకురాడానికి అవధానిగారింట సన్నాహాలు జరుగుతున్నాయి. కూతురు ఉన్నన్నాళ్ల కోసం ఒక వంటావిడను నియమించుకొన్నారు. ఏడోనెలన సూడిదల కార్యక్రమం ఉంటుందని, సుభద్రమ్మ, మంగమ్మను వారం ముందు పుట్టింటికి పంపింది. మంగమ్మ రాక పార్వతికి సహాయపడింది. అన్నపూర్ణకు బాగా కాలక్షేపం అవుతోంది. అవధానిగారు పెట్టిన ముహూర్తానికి సీతామహలక్ష్మి పెద్దకొడుకు సాయంతో శ్రీవల్లిపురం వెళ్లి సూడిదలు లాంఛనప్రాయంగా ఇచ్చి అన్నపూర్ణను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చింది. మరో నాలుగురోజులుండి, మంగమ్మ తన ఇంటికి తిరుగుప్రయాణమయ్యింది. అవధానిగారి కోరిక మన్నించి లేడీ డాక్టరు ఇంటికి వచ్చి అన్నపూర్ణను పరీక్ష చేసింది. తల్లి, బిడ్డ, క్షేమంగా ఉన్నారని చెప్పి, కొన్ని సలహాలిచ్చింది. పురిటికి ఇంటివద్దే సన్నాహాలు జరిగేయి. అన్నపూర్ణకు తొమ్మిది నెలలు నిండేయి. ఒక రాత్రి అన్నపూర్ణ చక్కని ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కన్నబిడ్డను చూసి అన్నపూర్ణ చెప్పలేని సంతోషం పొందింది. అమ్మమ్మ, తాతగారు, మేనమామలు, ఆ సంతోషాన్ని పంచుకొన్నారు.
నూతన శిశువుకు ఇరవైఒకటవ రోజున నామకరణం చేయ నిశ్చయమయింది. అవధానిగారు ఆ విషయం ముందుగా వియ్యాలవారికి తెలియబరిచి ఆహ్వానించేరు. నామకరణానికి ముందురోజు సాయంత్రమే, పార్వతి, గణపతి చేరుకొన్నారు. కుశలప్రశ్నలయ్యేక మనవరాలిని చూద్దామన్న కుతూహలంతో ఉయ్యాలలో ఉన్న పాపను చేరింది పార్వతి. తల్లివెంటా కొడుకూ వెళ్ళేడు. ఉయ్యాలలోనున్న చిట్టితల్లిని బయటకు తీసి అత్తగారికి అందివ్వబోయింది, కోడలు. “ఒద్దమ్మా, ప్రయాణం చేసి వచ్చేం. కాళ్లూ, చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుని వస్తా.” అని చెప్పి పార్వతి ఆ ప్రయత్నానికి వెళ్ళింది. గణపతి కూడా అదే పని మీద వెళ్ళేడు. పార్వతి పని ముగించుకుని వచ్చి వంటావిడ తెచ్చిన కాఫీ త్రాగి, చాపమీద కూర్చున్నాక, “ఏదమ్మా, నా మనవరాలిని ఇలా ఇయ్యి.” అని కోడలునడిగింది. మామ్మ ఒళ్ళో చేరింది చిన్నారి. మనవరాలిమీద ముద్దుల వర్షం కురిపిస్తూ, వియ్యపురాలితో, “పాప ఆరోగ్యంగా ఉంది. కళ్లు, పెద్దవి. అందంగా ఉన్నాయి. చిన్న.. నోరు. గోరుముద్దలు ఎలా తింటావే తల్లీ.” అని, మనవరాలి అందానికి సర్టిఫికేటు ఇవ్వగానే,
“అచ్చు మీ పొలికేనండి.” అని వియ్యపురాలు అంటూ ఉంటే, పార్వతికి మనవరాలు కట్నం ఇచ్చింది. పార్వతి నవ్వుకుంటూ, “అయ్యో, తల్లీ, మెచ్చుకోగానే కట్నం ఇచ్చేసేవా.” అని నవ్వుతూంటే, చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఘొల్లుమని నవ్వుకున్నారు. సీతామహలక్ష్మి, చీరకొంగు నోటికి అడ్డంగా పెట్టుకుని, వస్తున్న నవ్వును ఆపుకోంది.
“అయ్యో, మీ చీర పాడుచేసిందా. దాన్నిలా ఇవ్వండి, అత్తయ్యగారూ.” అని అన్నపూర్ణ పాపను అందుకుంది. మనవరాలిని కోడలుకు అందిస్తూ, “చీర మార్చుకొని వస్తాను. దీన్ని శుభ్రం చెయ్యమ్మా.” అని లేస్తూ ఉంటే, “ఇది తడిపేసిన చీర తెచ్చి నాకివ్వండి, అత్తయ్యగారూ. తడిపి అరేస్తాను.” అని చెప్పింది, అన్నపూర్ణ. పార్వతి వచ్చి మనవరాలను మరల అందుకుంది. కన్నకూతురును చూస్తూ మురిసిపోతున్నాడు, గణపతి. పార్వతి ఆత్రుతగా చూస్తున్న కొడుకుకు పాపను అందించింది. గణపతి రెండు నిమిషాలు పట్టుకుని, “అమ్మా, చేతినుండి జారిపోతున్నాది. దీన్ని తీసుకో అమ్మా.” అని తల్లికి అందివ్వబోతే, త్వరగా అన్నపూర్ణ నవ్వుకొంటూ వచ్చి అందుకుంది. అలా కొంతసేపు నాలుగు విషయాలూ మాట్లాడుకున్నారు. మరునాడు నామకరణం జరిగింది. బియ్యంలో గణపతి, ‘పార్వతి’ అని రాయగానే చుట్టూ ఉన్నవాళ్లు చప్పట్లు చరిచేరు. పార్వతి ముఖం వికసించింది. మనవరాలి మెడలో బంగారపు గొలుసు తొడిగింది. మళ్ళీ చప్పట్లు మ్రోగేయి. ఆ రోజంతా అందరూ ‘చిన్న పార్వతి’ కబుర్లు చెప్పుకొంటూ సరదాగా గడిపేరు. చిన్నపార్వతిని అందరూ, ‘చిట్టితల్లి’ అని పిలవనారంభించేరు.
చిట్టితల్లికి మూడు నెలలు నిండేయి. ఒక శుభముహూర్తాన్న సీతామహాలక్ష్మి, రెండవ కొడుకు ఆంజనేయావధాని సాయంతో తల్లీ బిడ్డలను అత్తవారింటికి దిగపెట్టింది. పిల్ల పెంపకంలో పార్వతి, కోడలుకు సహాయపడవలసి ఉంటుందని, ఆ సమయానికి శాస్త్రిగారి ఇంట ఒక వంటమనిషిని నియమించుకున్నారు. కొద్దిరోజులకు భార్య శిక్షణలో గణపతికి కూతురును ఎత్తుకోడానికి ధైర్యం వచ్చింది. రోజూ ఇంటికి రాగానే శుభ్రపడి, ఉయ్యాలమంచం మీద ఉన్న కూతురు చెంత చేరి, ఏవో పలకరింపులు చేయనారంభించేడు. ఒక్కొక్కప్పుడు ఆ సమయంలో భోజనానికి పిలిచినా వెళ్లకపోతే, “ఏం, నాయనా కూతురును చూస్తూ ఉంటే, ఆకలి కూడా వెయ్యడం లేదా. కొంతసేపు ముద్దులాపి భోజనానికి రా. ఆలస్యం చేస్తే అన్నీ చల్లారిపోతాయి.” అని, తల్లి చమత్కరిస్తూ హెచ్చరిక చేస్తే, “వస్తున్నానమ్మా.” అని చిట్టితల్లిని మరో ముద్దు పెట్టుకుని భోజనానికి వెళ్లేవాడు. శాస్త్రిగారు మనవరాలను చూసి మురిసిపోతున్నారు. సమయం దొరికినప్పుడు పలకరిస్తున్నారు. కానీ తన ఆప్యాయతను పూర్తిగా వ్యక్తపరచడానికి సంశయిస్తున్నారు.
ఇదివరలో రోజూ పురాణ కాలక్షేపానికి వస్తూండే వారికి చిట్టితల్లి రాక ఎరికయింది. ఒక రోజు సాయంత్రం ఆ ఎనమండుగురు ముందుగా తెలియబరచి పాపను చూడడానికి పార్వతిగారి ఇంటికి వెళ్లేరు. ఉయ్యాలమంచంలో ఉన్న చిన్నదాన్ని అన్నపూర్ణ వారికి చూపింది. “మీ పాప చాలా అందంగా ఉందండీ” అని ఒకరు, “చందమామలా ఉంది.” అని వేరొకరు, “పచ్చగా, ఎక్కడా మచ్చ ఒక్కటీ.. లేకుండా మెరిసిపోతోంది.” అని మరొకామె, “అచ్చు, మీ అత్తగారిలాగే ఉందండీ.” అని మరొక భామ చిట్టితల్లిమీద కురిపిస్తున్న ప్రశంసలు, అక్కడే ఉన్న పార్వతి విని, “నాదేమి అందమండి. దాని ముందు తీసికట్టు.” అని మనవరాలును మరో అంతస్తు మీదకెత్తింది. ఆ ప్రశంసా కార్యక్రమం ముగిసింది. వచ్చిన వారిలో ఒకామె, ఒక జూయల్ బాక్స్ నుండి ఒక జత బంగారు గాజులు చిట్టితల్లికి సున్నితంగా తొడిగింది. “అయ్యో, ఇవెందుకండీ.” అని, మనసులో సంతోషపడుతూ, మర్యాదగా స్పందించింది, అన్నపూర్ణ.
“మా సరదా అండీ. చంటిపిల్లల దగ్గరికి, దేముడు దగ్గరికి ఉత్త చేతులతో వెళ్లకూడదంటారు.” అని ఒకామె సమర్థించింది. వేరొకామె “మేము ఆలోచించేమండి. పాపకు ఏమిటి తేవడమా అని. బట్టలయితే ఎదుగుతున్న పిల్లకు అట్టే రోజులు పనికిరావు. ఈ గాజులు కొన్నాళ్లకు చిన్నవయితే మార్చి మరో వస్తువు చేయించొచ్చు.” అని నిశ్చయించి ఈ గాజులు తెచ్చేం.” అని వివరించింది. “మీరు చెప్పింది నిజమేలెండి. గాజులు చిన్నవయినప్పుడు మార్చి మరేదయినా చేయించొచ్చు.” అని పార్వతి వారి నిర్ణయాన్ని సమర్థించింది. అతిథులుతో బాటు కాఫీ పలహారాలు సేవిస్తూ అన్నపూర్ణ వారితో కొంతసేపు కాలక్షేపం చేసింది. శాస్త్రిగారి ఇల్లు అలా సంతసంతో నిండుకొంటోంది.
నవరంగపట్నంలో సుభద్రమ్మకు చాలవరకు నయమయింది. కాని చేతికర్ర సాయంతో పనులు చేయ సాహసించలేకపోతోంది. కోడలుమీద తన పని భారం ఎక్కువగా ఉందని చింతిస్తూ, అప్పుడప్పుడు, “అమ్మా, నా పనులతోనే నీకు రోజంతా అయిపోతోంది.” అని, జాలిపడేది.
“అదేమిటి, అత్తయ్యగారూ, మీ పనులు చాలావరకు మీరే చేసుకొంటున్నారు. వంటింటి పనంతా శాంతమ్మగారు చూసుకొంటున్నారు. నాకు ఏ ఇబ్బంది లేదు. మీరు క్షేమంగా ఉండడమే మాకు కావలిసింది. మీరు మరే ఆలోచనా పెట్టుకోకండి.” అని మంగమ్మ అత్తగారికి ధైర్యం చెప్పింది.
శర్మ తల్లిని డాక్టరుకు చూపించేడు. పరిస్థితి చెప్పేడు. ఆయన పరీక్షలు చేసి, “మీ తల్లిగారికి, కాలు పూర్తిగా నయమయింది. కాలు విరిగినప్పుడు అనుభవించిన బాధ మరచిపోలేక అది మళ్ళీ సంభవిస్తుందేమో అనే భయం ఆవిడ మనసులో ఉండిఉండొచ్చును. దానికి మందులు లేవు. ఎట్టి పరిస్తుతులలోను ఆవిడ చేతికర్ర లేకుండా నడవడం మంచిది కాదు.” అని సలహా ఇచ్చి, “ అమ్మా, మీకు తెలిసిందే. మనం వింటూ ఉంటాం. కొందరు, తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో వారికున్నది హరించేసి, రోడ్లపాలు చేస్తున్నారు. మీరు అదృష్టవంతులు. కొడుకు, కోడలు మిమ్మల్ని ఇంత బాగా చూసుకొంటున్నారు. హాయిగా ‘రామా, కృష్ణా’ అని దేముణ్ణి ధ్యానిస్తూ సుఖంగా ఉండండి.” అని మర్యాదగా సుభద్రమ్మ భుజం తట్టి చెప్పేడు. “అమ్మా, డాక్టరుగారు చెప్పింది విన్నావు గదా. ఆయన చెప్పినట్టు చెయ్యి.” అని తల్లికి హితవు పలికేడు, శర్మ. ఇంటికి వెళ్లేక మంగమ్మకు డాక్టరు చెప్పింది తెలియబరిచేడు. “అత్తయ్యగారూ, మీరు ఇంటి పనులగూర్చి ఏమీ ఆలోచించకండి. అవసరమయితే, శాంతమ్మకు మరికొంత ఇచ్చి చేయించుకోవచ్చు. ఆవిడ తప్పకుండా ఒప్పుకుంటుంది. మీరు మీ పూజలేవో శాంతంగా చేసుకోండి.” అని తనవంతు సలహా ఇచ్చింది, మంగమ్మ.
సుభద్రమ్మకు బయటకు చెప్పలేని చింత కొన్నాళ్లయి వేధిస్తోంది. తరువాత పెళ్లయిన అన్నపూర్ణకు సంతానప్రాప్తి కలిగినా, కోడలుకు ఆ సూచనలేవీ ఇంకా రాకపోడానికి ఏదయినా కారణముందా, అని ఒక ఆందోళన. ఆ విషయం, కొడుకుతో గాని, కోడలుతోగాని పంచుకోడం ఇష్టంలేదు. మంగమ్మకు పనిభారం దానికి కారణమా, అని తట్టింది. ఆ కారణంగా తను ఏదో కొంత పని చేస్తూ ఉంటే కోడలుకు భారం తగ్గుతుంది అనుకుంది. ఆ ఆలోచనతోనే పనులు చేయడానికి ప్రయత్నించింది. పనులు చేస్తూ, మళ్ళీ కాలో చెయ్యో విరగ్గొట్టుకుంటే, సమస్య మరీ జఠిలమయిపోతుందని ఒక మూల భయం. ఈ తికమకలతో, పాపం, సుభద్రమ్మ సతమతమవుతోంది. సమస్యను అన్నికోణాలనుండి ఆలోచించగా, ఆలోచించగా, ఇంట్లో చాలా రోజులయి శుభకార్యం ఏదీ చేసుకోలేదని, ఏదయినా చేసుకొంటే ఫలితమిస్తుందేమో అనుకుంది. సత్యనారాయణ వ్రతం తట్టింది. ఆ ఆలోచన శర్మకు, మంగమ్మకు చెప్పింది. ఇద్దరూ తప్పక చేసుకొందామన్నారు. మరుసటి శనివారం, దంపతులిద్దరూ సత్యనారాయణ వ్రతం, వెంకటేశ్వరుని దీపారాధన శ్రద్ధగా చేసుకొన్నారు. సుభద్రమ్మ ఇద్దరు దేముళ్ళను, తన మనోవాంఛ త్వరలో సిద్ధించమని వేడుకుంది.
ఆరువారాలు గడిచేయి. మంగమ్మ తల్లికాబోయే సూచనలు కనిపించేయి. అది తెలియగానే సుభద్రమ్మ, కోడలును డాక్టరుకు చూపించమని కొడుకును తొందరపెట్టింది. శర్మ, తల్లి ఆజ్ఞను శిరసావహించేడు. లేడీడాక్టరు మంగమ్మ గర్భవతి అని ధ్రువీకరించింది. కొన్ని సలహాలిచ్చింది. ఇంటికి ఆటోలో తిరిగి వెళుతున్నప్పుడు, భార్యాభర్తలిద్దరూ ఒకరి అరచేయిని మరొకరు గట్టిగా పట్టుకొంటూ, ఎనలేని సంతోషాన్ని పొందేరు. వారు ఇల్లు చేరగానే, గుమ్మంలోనే సుభద్రమ్మ ఎదురుకొని, “డాక్టరు ఎమ్మిటి చెప్పింది.” అని ఆత్రుతతో అడిగింది. కొడుకునోట జవాబు వినగానే, వ్రతం ఫలించింది అనుకుంది, సుభద్రమ్మ. వడిగా వెళ్లి, దైవానికి నమస్కరించి, కృతజ్ఞతలు చెప్పుకొంది. అది గమనించిన దంపతులిద్దరూ ఆమెను అనుకరించేరు. ఆ శుభవార్త తెలిసిన శాంతమ్మ, తన సంతోషాన్ని వ్యక్తబరిచింది. సుభద్రమ్మకు ఒకటే సందడి. “నువ్వు ఏ పనిలోకి రాకమ్మా. ఒకచోట అలా కూర్చుంటూ ఉండు. ఏది కావలిసినా ఆవిణ్ణి అడుగు.” అని కోడలుకు తనకు తోచిన సలహాలు గడగడా చెప్పింది. సుభద్రమ్మకు పనులు చేయడంలో మునపటి బెరుకుతనం పోయింది. చేతికర్ర సాయంతో ఇంట్లో చకచకా నడుస్తోంది. అది గమనించిన భార్యాభర్తలిద్దరూ నివ్వెరపోయారు. “డాక్టరు చెప్పింది వినగానే, సంతోషంలో అమ్మకు ఒక్కమారు ఉత్సాహం వచ్చినట్టుంది.” అని శర్మ అనడంతో, “అవునండీ. ఆవిడ పరిస్థితి చూసి బాధ వేసేది. మంచిదయింది. ఇంట్లో ఆవిడ సునాయాసంగా తిరుగుతూ ఉంటే, బెంగ తీరింది.” అని మంగమ్మ తన సంతృప్తి తెలియజేసింది.
నవరంగపట్నంలోని వేంకటేశ్వరాలయలో క్రమంగా పెరుగుతున్న భక్తుల వల్ల, ఆదాయం అభివృద్ధి చెందుతోంది. ప్రారంభంలో కొత్తగా ప్రవేశపెట్టిన స్వామివారి కళ్యాణం, ప్రతి శనివారం మూడునాలుగు కుటుంబాలకు ప్రత్యేకముగా వేరొకచోట జరిపేవారు. క్రమంగా గిరాకీ పెరగడంతో ఆ ప్రత్యేక కార్యక్రమం వారానికి అయిదు రోజులు నిర్వహిస్తున్నారు. స్వయంగా అతి సామీప్యంలో ఆ దర్శనభాగ్యం కలిగినవారు సంతుష్టులవుతున్నారు. ఆ కార్యక్రమం నూతన వధూవరులకు ప్రత్యేక ఆకర్షణ అయింది. ఈ పరిణామాలతో దేవాలయ ఆదాయం త్వరితగతిని బాగా పెరిగింది. కమిటీవారు దాన్ని భక్తుల సదుపాయాలు మరింత నాణ్యంగా మెరుగుపరచడానికి వినియోగించగలుగుతున్నారు. ఈ పరిణామానికి కారకుడు శర్మ అని, అతని జీతం తగురీతిని పెంచేరు. శర్మ సంతసించేడు. కొత్తగా ప్రవేశపెట్టిన, స్వామివారి కళ్యాణాల వల్ల శర్మకు పని ఒత్తిడి పెరిగిందని కమిటీ మెంబర్లు గమనించేరు. ఆ వృత్తిలో కొద్దిపాటి అనుభవమున్న వెంకట చేన్లు అనే ఒక పూజారిని శర్మకు సహాయకుడుగా నియమించారు. శర్మకు కొంత విరామం దొరుకుతోంది.
ఆశించకుండా పెరిగిన ఆదాయంలో శర్మ వీలయినంత, బ్యాంకులో ఆదా చేస్తున్నాడు. ఆ ఆదాయాన్ని బ్యాంకులో ఆదా చేయడానికి బదులు, ఇంట్లోనే పెరట్లో ఒకటి రెండు గదులు కట్టించుకుంటే ఇంకా ఉపయోగపడుతుందని మంగమ్మకు తట్టింది. భర్తతో తన ఆలోచన చర్చిందింది. “అవును మంగా, నువ్వు బాగానే ఆలోచించేవ్. ఇప్పుడు మనముంటున్న ఇల్లు మా తాతగారు కట్టించింది. నీకు తెలుసుగా, మా నాన్నగారు వేగరం పోడం వల్ల ఏమీ చేయలేకపోయారు. కమిటీ వాళ్లు నన్ను మా నాన్నగారి స్థానంలో వేయబట్టి ఇల్లు నడుస్తోంది. నువ్వు చెప్పిన ఆలోచన బాగానే ఉంది. అయితే బ్యాంకులో ఎంతోకొంత ఉంచుకొంటే, ఏదయినా అత్యవసరమయితే పనికొస్తుంది. రెండు గదులు కట్టించడానికి ఎంతవుతందో మా దేవాలయం పనులు చేయిస్తున్న పోలిరెడ్డిగారిని అడిగి చూస్తాను. రెండు గదులు కుదరకపోతే, మొదట ఒక గది కట్టించుకొందాం. తాపీగా మరోటి కట్టించుకోవచ్చు.” అని భార్య సలహాను ప్రశంసిస్తూ ఆచరణీయంగా ఆలోచించేడు. తమ ఆలోచన తల్లికి చెప్పేడు. “అవును, నాయనా. డబ్బు ఎలా ఖర్చయిపోతున్నాదో, ఒక్కొక్కప్పుడు తెలీదు. గదులయితే మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. అవసరాలు పడినప్పుడు వాటిని అద్దెకు ఇచ్చుకోవచ్చు.” అని స్పందించింది, సుభద్రమ్మ. పెరట్లో ముందుగా ఒక గది వెలిసింది.
మంగమ్మకు ఆరు నెలలు నిండేయి. ఏడో నెలలో ఓ శుభముహూర్తాన్న పుట్టినిల్లు చేరుకుంది. ఇదివరలోనే వంట సాయానికి ఒకామెను నియమించుకోబట్టి పార్వతికి సదుపాయమయింది. మంగమ్మకు అన్నపూర్ణ తోడు కూడా ఉండడం వలన బాగా కాలక్షేపమవుతోంది. డాక్టరు పరీక్ష చేసి, తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని చెప్పి తగు సలహాలిచ్చింది. ఇంటివద్దే పురిటికి నిశ్చయమయింది. తొమ్మిదో నెలలో మంగమ్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ గదిలోనే ఉన్న పార్వతితోబాటు మంగమ్మ ముఖం వెలుగులుతో నిండింది. నర్సు గది బయటకు వచ్చి శుభవార్త చెప్పగానే శాస్త్రిగారు, గది బయట ఆత్రుతతో వేచియున్న, గణపతి, అన్నపూర్ణ, సంతోషంలో మునిగిపోయేరు. మామగారిని తాతగారయ్యేరని, గణపతిని మేనమామయ్యేడని, అన్నపూర్ణ అభినందించింది. వార్త తెలిసి, శర్మ, సుభద్రమ్మ చాలా సంతోషించేరు. దేవాలయంలో స్వామివారి హుండీలో నూరు రూపాయలు వేయమని సుభద్రమ్మ శర్మకు సలహా ఇచ్చింది. ఆ శుభవార్త తెలిసిన అవధానిగారు అభినందనలు తెలియజేసేరు. నూతనశిశువు సింహాద్రి శర్మ నామధేయుడయ్యేడు. మూడవనెలన మంగమ్మ అత్తవారిల్లు చేరింది. కాలచక్రం ముందుకు తిరిగింది. గణపతికి ఓ అబ్బాయి గౌరీపతి శాస్త్రి కలిగేడు.
చిన్నపార్వతికి చిట్టితల్లి పేరే వాడుకలోకొచ్చింది. ఇంటా బయటా అందరూ ఆ పేరుతోనే పిలుస్తారు. చిట్టితల్లికి ఆరు నిండేయి. గణపతి, చిట్టితల్లిని ఓ ప్రైవేటు బడిలో చేర్చేడు. వీధిలో సుమారు అదే ఈడు ఆడపిల్లలతో రోజూ ఆటోలో స్కూలుకు వెళ్లి వస్తోంది. పేరుకు బడికి వెళ్లి వస్తోంది కాని వానాకాలం చదువే అవుతోంది. ఇంటివద్ద అన్నపూర్ణ రోజూ శిక్షణ ఇస్తోంది. తెలివితేటలతో చిట్టితల్లి శ్రద్ధగా నేర్చుకొంటోంది. తల్లిదండ్రుల శిక్షణలో మంచి నడవడి అలవరచుకుంది. అది గమనిస్తున్న మామ్మ, తాతగారు, మనవరాలిని మెచ్చుకొంటున్నారు. ఒక మంచిరోజున గణపతి, కుమారుడు గౌరీపతిని ప్రైవేటు బడిలో చేర్చేడు. బడికి వెళ్లిరాడానికి గౌరీపతికి మరో అయిదుగురుతో ఆటో ఏర్పాటయింది. తమ్మునికి చదువులో కావలిసిన సాయం అక్క అందిస్తోంది. అది గమనించిన గణపతి, “చిట్టితల్లి నీ డ్యూటీ తీసుకొంది.” అని అన్నపూర్ణతో సంతోషాన్ని పంచుకున్నాడు. “శాంతమ్మ లేకపోడంవల్ల, వాడికి పాఠాలు చెప్పడానికి నాకు తీరిక దొరకడం లేదు. చిట్టితల్లి వాడి చదువు చూసుకోడం నాకు సులువయింది. నాకు వీలయినప్పుడు నేనూ చూస్తున్నాను.” అని స్పందించింది. “నీకు ఇబ్బందిగా ఉంటే ఆవిడకు కబురు చేస్తాను.” అన్నాడు గణపతి. “అబ్బే, నాకే ఇబ్బంది లేదండి. అయినా ఆవిడ ఇప్పుడు ఖాళీగా లేదు. ఏదో హోటల్లో పనిచేస్తోంది. ఖర్చులు తగ్గించుకొందామని కదా ఆవిణ్ణి మాన్పించేసాం. పెద్ద ఖర్చులన్నీ ముందుకే ఉన్నాయి. ఇలాగే వెళ్లనిద్దాం.” అని అన్నపూర్ణ నచ్చచెప్పింది.
చిట్టితల్లి గౌన్ల దశనుండి, పరికిణీల దశకు, క్రమంగా వోణీలు వేసుకునే దశకు ఎదిగింది. అందములొలుకుతూ చూడ ముచ్చటగా ఉంది. చిట్టితల్లి తొమ్మిది చదువుతున్న రోజులు. రోజూ వారి వీధిలోనే ఉన్న నలుగురు అమ్మాయిలతో స్కూలుకు నడిచి వెళ్లి రావడం చేస్తోంది. ఒక రోజు స్కూలునుండి ఇంటికి వెళుతున్నప్పుడు, ఆ స్కూలు మగ పిల్లలే నలుగురు వెంటబడ్డారు. అది గమనించిన అమ్మాయిలు వడిగా నడవసాగేరు. కాని అందులో ఒకడు అంతకన్నా త్వరగా నడచి నలుగురులోను చివరకు ఉన్న చిట్టితల్లిని సమీపించి, “I love you” అంటూ చిట్టితల్లి భుజం తాకి పరుగున పోయేడు. ఒక అమ్మాయి వెనకతిరిగి చూసింది. వారు బుర్రలు దించుకొని మాకేమీ తెలియదన్నట్టు నిలబడిపోయారు. వెనకతిరిగి చూసిన అమ్మాయి వాళ్లు పదిలో చదువుతున్నారని పోల్చుకోంది. నలుగురు అమ్మాయిలూ ఇళ్లకు చేరుకొన్నారు. చిట్టితల్లి జరిగిన విషయం తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పింది. వాడు పదో క్లాసులో ఉన్నాడని తెలియబరచింది. అన్నపూర్ణకు ఒళ్లు మండింది. చిట్టితల్లిని ఓదార్చింది. “మీ నాన్నగారు ఆ వెధవ పని పడతారమ్మా. భయపడకు.” అని అభయమిచ్చింది. గణపతి రాగానే జరిగిన విషయం చెప్పి, “ఆ వెధవని అలా వదలీ కూడదు. వెంటనే పోలీసు స్టేషనులో కంప్లైంటు ఇవ్వండి.” అని గణపతికి చెప్పింది. “అన్నపూర్ణా, ఈ సంగతి ఇలా వదలకూడదు. మనం ఊరుకొంటే ఆ వెధవను చూసి మరికొంతమంది మొదలెడతారు. ఇది స్కూలు విషయం. మొదట ప్రిన్సిపాలు గారికి చెప్తాను. ఆయన తప్పక ఆ వెధవకు శిక్ష వేస్తారు. ఆయన ఏమీ చేయకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు పోలీసు కంప్లైంటు ఇస్తాను.” అని భార్యకు హామీ ఇచ్చేడు. మరునాడు ఉదయం గణపతి ప్రిన్సిపాలుగారికి ఫిర్యాదు చేసేడు. ఆయన చిట్టితల్లిని పిలిపించి ఏమిటి జరిగిందో చెప్పమన్నారు. చిట్టితల్లి జరిగినది చెప్పింది. “అమ్మా, ఆ స్టూడెంటును నువ్వు పోల్చగలవా, అని అడిగేరు. “నన్ను అల్లరపెట్టి, వాడు పరుగున ముందుకు పారిపోయాడు సార్. నేను వాడి మొహం చూడలేదు, సార్. సావిత్రి వెనకతిరిగి చూసి, మిగిలిన ముగ్గురు పదో క్లాసులో ఉన్నారంది.”
“సావిత్రి మీ క్లాసులో ఉందా.” అని ప్రిన్సిపాల్ గారు అడిగితే అవునని చెప్పింది. ప్రిన్సిపాలుగారు సావిత్రిని పిలిపించి అడిగేరు. తను ఆ ముగ్గురిని పోల్చగలనంది. ప్రిన్సిపాలుగారు సావిత్రిని, చిట్టితల్లిని, పదో క్లాసుకు తీసుకెళ్లేరు. సావిత్రి ఆ ముగ్గురిని చూపించింది. వెంటనే నిలబడి “మేమేమీ చేయలేదు సార్. అదిగో వాడే చేసేడు, సార్.” అని భయపడుతూ, వాళ్లు జగ్గారావును చూపించేరు. జగ్గారావును తన రూముకు రమ్మని చెప్పి, ప్రిన్సిపాలుగారు చిట్టితల్లిని, సావిత్రిని తమ క్లాసుకు వెళ్లమన్నారు. ప్రిన్సిపాలుగారి రూములో గణపతి వేచి యున్నాడు. ప్రిన్సిపాల్ గారు జగ్గారావుకు బడితపూజ చేసి, ఇహమీదట ఇటువంటి పనులు చేస్తే, స్కూలునుండి డిస్మిస్ చేస్తానన్నారు. వాడిచేత గణపతికి క్షమాపణలు చెప్పించి క్లాసుకు పొమ్మన్నారు. “గణపతిగారూ, మీ అమ్మాయికి జరిగినదానికి విచారిస్తున్నాను. నేను వాడి ఫాదర్‌కి ఈ విషయం ఇప్పుడే తెలియజేస్తాను,” అని, హామీ ఇచ్చేరు. గణపతి ఇంటికి వెళ్లి అన్నపూర్ణకు జరిగినది తెలియజేసేడు.
(సశేషం)
శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం నవంబరు, 1936 లో జన్మించారు. M.A. మరియు P.G. Diploma in Personnel Management పాసయ్యారు. ఉద్యోగ పర్వం, హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రారంభించి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిగా చేసి, 1994 లో విశ్రాంతి తీసుకొన్నారు. అమెరికా వాసి.
హైస్కూలు విద్యార్థిగా రంగస్థల ప్రవేశం చేసేరు. చిన్న నాటికలు రాసి, వాటిలో పాత్రలు ధరించి, దర్శకత్వం చేసేరు.
గత ఎనిమిది సంవత్సరాల నుండి రచనలు చేస్తున్నారు. ఈ నాటికి 33 కథలు, 3 నవలలు, 4 కవితలు, ఒక హాస్య నాటిక ప్రచురణమయ్యేయి.
