Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పునరావృతం-6

[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[అన్నపూర్ణకు ఆడపిల్ల పుడుతుంది. పార్వతి, గణపతి అవధానిగారింటికి వెళ్తారు. కూతురుని చూసి గణపతి, మనవరాలిని చూసి పార్వతి మురిసిపోతారు. మర్నాడు నామకరణం జరుగుతుంది. తల్లి పేరే కూతురికి పెడతాడు గణపతి. చిన్నపార్వతిని అందరూ, ‘చిట్టితల్లి’ అని పిలవసాగారు. పాపకి మూడు నెలలు నిండుతాయి. ఓ శుభముహూర్తాన అన్నపర్ణని, మనవరాలిని అత్తారింట దిగపెడుతుంది సీతామహాలక్ష్మి. పిల్ల పెంపకంలో పార్వతి, కోడలికి సాయం చేయాలి కాబట్టి, ఆ సమయానికి శాస్త్రిగారి ఇంట ఒక వంటమనిషిని పెట్టుకుంటారు. పురాణ కాలక్షేపం కోసం వచ్చే ఇరుగుపొరుగు మహిళలు చిన్న పార్వతి అందాన్ని పొగిడారు. అందరూ కల్సి బంగారు గాజులు చేయిస్తారు పాపకి. నవరంగపట్నంలో సుభద్రమ్మకు చాలవరకు నయమవుతుంది. ఇంటి పనంతా కోడలి మంగమ్మ మీదే పడుతున్నందుకు బాధపడుతుంది. ఇదే కాకుండా కోడలు గర్భం దాల్చకపోవడం ఆమెకు వేదన కలిగిస్తోంది. చివరికి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయిస్తుంది. ఆరు వారాలు గడిచాకా, మంగమ్మ గర్భం దాలుస్తుంది. శర్మ తల్లి ఆజ్ఞ ప్రకారం భార్యని లేడీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తాడు. ఆవిడ మంగమ్మ గర్భవతి అని ధ్రువీకరించి, కొన్ని సలహాలిస్తుంది. ఆలయంలో కొత్త చేపట్టిన కళ్యాణాల వల్ల స్వామివారి ఆదాయం పెరుగుతుంది. శర్మ జీతం పెంచుతారు. ఓ పూజారిని సహాయకుడిగా నియమిస్తారు. ఆదాయంలో పెరిగిన మొత్తాన్ని పొదుపు చేస్తాడు శర్మ. భార్య సూచన మేరకు పెరట్లో రెండు గదులు కట్టిస్తాడు. నెలలు నిండాక మంగమ్మకి కొడుకు పుడతాడు. వాడికి సింహాద్రి శర్మ అని పేరుపెడతారు. అన్నపూర్ణ మరోసారి గర్భం దాల్చి కొడుకుని కంటుంది. వాడికి గౌరీపతి శాస్త్రి అని పేరు పెడతారు. చిన్న పార్వతిని ఇంటా బయటా అంతా చిట్టితల్లి అనే పిలుస్తారు. ఆరేళ్ళు నిండాకా పాపని బడిలో వేస్తారు. బాగా చదువుకుంటుంది, మంచి ప్రవర్తన అలవర్చుకుంటుంది. చిట్టితల్లి పెద్దదై ఓణీలు వేసే దశకు ఎదుగుతుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లో ఓ పోకిరిపిల్లాడు ఏడిపిస్తాడు. ఇంటికి వచ్చి అమ్మానాన్నలకు చెబుతుంది. గణపతి స్కూలికి వెళ్ళి హెడ్ మాస్టర్‌గారికి ఫిర్యాదు చేస్తాడు. ఆయన ఆ కుర్రాడిని పిలిపించి శిక్షిస్తాడు. కుర్రాడి ప్రవర్తన గురించి వాళ్ళ నాన్నకు తెలియజేస్తానంటాడు. – ఇక చదవండి.]

నవరంగపట్నంలో, మంగమ్మ, శర్మల ఏకైక సంతానం సింహాద్రిశర్మకు బడికి వెళ్లే ఈడు వచ్చింది. ఆ విషయంలో శర్మ కమిటీ మెంబరు మూర్తిగారి సలహా కోరేడు. ఆయన  ఖర్చు కొంత ఎక్కువయినా కాన్వెంటు స్కూలులో వేయడం మంచిదన్నారు.  మంగమ్మ అన్నయ్య సలహా అడిగింది. గణపతి కూడా అదే సలహా ఇచ్చేడు. సింహాద్రి కాన్వెంట్ స్కూల్లో చేరేడు.

కాలచక్రం ముందుకు తిరిగింది. ఈ మధ్యకాలంలో మూడు కుటుంబాలలోను పెద్దతరం వారు పెద్దల్లో కలసిపోయారు.

ఒకరోజు తీరిక సమయంలో తమ గదిలో గణపతి, అన్నపూర్ణ, చిట్టితల్లి చదువు విషయం ఆలోచిస్తూ,

“చిట్టితల్లి అన్నిట్లో మంచి మార్కులు తెచ్చుకొంటోందండి. దాన్ని కాలేజీ చదువులు చదివిద్దామా.” అని, అన్నపూర్ణ ఆలోచించింది.

“నిజమే అన్నపూర్ణా, కాలేజీ క్లాసుల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకొంటుంది. కాని, పై చదువులు చదివిస్తే, దాని పెళ్లికి సమస్య వస్తుంది.”

“సమస్య ఏమిటి వస్తుందండీ.” అని ప్రశ్నించింది.

“అది బియ్యే పాసయిందనుకో, అప్పుడు అంతకన్నా పెద్ద చదువులు చదివినవాణ్ణి చెయ్యవలసివస్తుంది. నీకు తెలిసే ఉంటుంది. మన విశ్వేశ్వరరావు గారి నిర్మల డిగ్రీ చేసింది. ఆ అమ్మాయికి లక్ష రూపాయలు కట్నమిచ్చి పెళ్లి చేసేరు. పెళ్లికొడుకు బ్యాంకులో గుమస్తాగా పనిచేస్తున్నాడట.”

“అవునండీ. అది కాక ఇంకా చాలా అడిగేరుట. వాళ్ల పెరట్లో జాగా అమ్మి పెళ్లి చేసేరుట. ఆవిడ చెప్పుకొచ్చింది.”

“పిల్లని పెద్ద చదువులు చదివించడానికి అదే సమస్య, అన్నపూర్ణా. పోనీ, పెద్ద చదువులు చదివిస్తే ఉద్యోగం చేసుకుని, దాని కాళ్ల మీద అది నిలబడగలదనుకొంటే, ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా ఉంది.”

“అవునండీ, మనవంటి వాళ్ల పిల్లలు,ముఖ్యంగా ఆడపిల్లలు, ఎంత తెలివయిన వాళ్లయినా పెద్ద చదువులు చదువుకునే భాగ్యం లేదు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా, మన బతుకులు, ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్టుంది. ఎలక్షన్ల ముందొచ్చి, మేమొస్తే మీకు అది చేయిస్తాం, ఇది చేయిస్తాం, అని అరచేతిలో మోక్షం చూపిస్తారు. ఆ తరువాత  వాళ్ల పత్తా ఉండదు.”

“ఒక మాటు వీధిలోకి వెళితే తెలుస్తుంది, అన్నపూర్ణా. ఎండనక వాననకా చమటోడ్చి పనిచేస్తున్నవాళ్లు కనిపిస్తారు. వాళ్లకి రెక్కాడితేనే డొక్కాడుతుంది. మనకి కనీసం రెండుపూట్లా అయిదివేళ్ళూ లోనికి వెళుతున్నాయి. అలా సంతృప్తి పడాలి.”

“మీరు చెప్పింది నిజమే. పెద్ద చదువులు చదువుకుంటే అవసరమయితే అది కూడా నాలుగు రాళ్లు సంపాదించగలదు అనుకొన్నాను. కానీండి. సరస్వతీ కటాక్షం ఎంతవరకూ ఉంటే, అంతవరకు చదువుకొంటుంది. ప్రభుత్వాలు మారినా, మన తల రాతలు మారడం లేదు. మన తంటాలు మనమే పడాలి. ప్రభుత్వాల్ని నమ్ముకు కూర్చోలేం.”

“మన గౌరీపతి కూడా వాడి అక్కలా తెలివిగా చదువుకొంటున్నాడు. వాడికి వీలయినంతవరకు పెద్ద చదువులు చదివిద్దాం.”

“అది తప్పక చేద్దామండి. వాడు పెద్ద చదువులు చదువుకుంటే కొన్నాళ్లకయినా ఉద్యోగం దొరకొచ్చు. మీ కోరిక తీరుతుంది.”

“భగవదేచ్ఛ ఎలా ఉందో చూద్దాం.” అని సంభాషణకు తెర దించేడు. గణపతి.

గౌరీపతికి క్లాసులో ఇద్దరు పిల్లలతో సఖ్యత బాగా ఏర్పడింది. వారిరువురూ సంపన్న కుటుంబంవారు.  చదువులో వెనకబడి ఉన్నారు. హోంవర్క్ వంటి విషయాల్లో గౌరీపతిమీదే ఆధారపడతారు. అప్పుడప్పుడు వాళ్లు గౌరీపతిని తమ ఇంటికి తీసుకెళ్లి రకరకాలయిన పలహారాలు పెడుతూ ఉంటారు. అవి వాడు ఇష్టంగా తింటూంటాడు. ఇద్దరి స్నేహితుల గదులలోనూ, ఎయిర్కండిషనర్లు ఉన్నాయి. ఆ చల్లదనం గౌరీపతిని బాగా ఆకర్షించింది. ఒకరోజు తల్లితో,

“అమ్మా, మా ఫ్రెండ్సు రూముల్లో ఎయిర్కండిషనర్లు ఉన్నాయి, అమ్మా, ఆ గదిలో ఎంత చల్లగా ఉంటుందనుకున్నావ్. అవి ఎంత అవుతాయమ్మా.” అని అమాయకంగా అడిగేడు.

“నాన్నా, ఎంతవుతాయో నాకు తెలీదుకాని, చాలా ఖరీదుంటాయి. ఎందుకలా అడిగేవు.”

“నాన్నగారు మన ఇంట్లో కూడా పెట్టిస్తారేమో అని.”

“నాన్నగారివద్ద అంత డబ్బు లేదు నాన్నా. నువ్వు పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తే, నువ్వే కొనుక్కోగలవ్. నీ గదిలో అది పెట్టించుకొని హాయిగా ఉండొచ్చు.” అని కొడుకును దగ్గరగా తీసుకొని తలపై ముద్దాడింది.

“అమ్మా, మీగదిలోను, అక్క గదిలోనూ కూడా పెట్టిస్తానమ్మా.” అని తల్లి ముఖంలోకి చూస్తూ సగర్వంగా చెప్పేడు.

“నా బంగారు తండ్రే. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు.” అని చెప్పి, “నీకిష్టమయిన తాటిముంజలు తెచ్చేరు నాన్నగారు. పద, నీకిస్తాను.” అని కొడుకుతో బాటు వెళ్లింది.

రాత్రి భర్తతో కొడుకు తనకు చెప్పినవన్నీ తెలియజేసింది, అన్నపూర్ణ.

అంతా శాంతంగా విని “గొప్పవాళ్ల సహవాసం దేనికి దారి తీస్తుందో చెప్పలేం, అన్నపూర్ణా. సరే, ఇప్పటికి వాడు సరదాగా ఉన్నాడు గదా.”

“మన పిల్లడి సంగతి మనకు తెలుసుగదా. వాడెప్పుడూ తప్పుటడుగులు వెయ్యడండీ.  వాళ్లేదో మంచి కుటుంబం వాళ్ల లాగే ఉన్నారు.”

“నేనన్నది వాళ్ల కుటుంబం మంచిచెడ్డలు గూర్చి కాదు, అన్నపూర్ణా. వాళ్లు ఇళ్లల్లో సకల సౌకర్యాలు సమకూర్చుకొంటారు. వాళ్ల అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. సహవాస దోషం అంటారు. వాటికోసం మనవాడు ప్రాకులాడతాడేమో అని నా బెంగ.” గణపతి దూరాలోచన.

“వాడలా చెయ్యడనుకొంటాను.”

“వాడికి తెలుసునులే, మన పరిస్థితి. అలా చెయ్యడనే అనుకొందాం.”

“వాడికి మనమీద, వాడి అక్కమీద ఎంత అభిమానమో, చూడండి. పెద్దయితే బాగా ఆర్జించి నీ గదిలో ఎయిర్కండిషనరు పెట్టించుకోగలవు అని నేనంటే, మన గదిలోను, వాడి అక్క గదిలోను కూడా పెట్టిస్తానన్నాడు.”

“ఇంట్లో మనం ఒకరిమీద ఒకరు అభిమానంగా ఉంటే, పిల్లలు ఆ దారిలోనే నడుస్తారు.”

“అవునండీ, అత్తయ్యగారు ‘ఇంట్లో పెద్దల ప్రవర్తన, పిల్లలు ఓ కంటితో చూస్తూ ఉంటారు. పెద్దయ్యాక వాళ్ళూ అలాగే ప్రవర్తిస్తారు. అంచేత మనం జాగ్రత్తగా ఉండాలి.” అని, అంటూ ఉండేవారు.

సంభాషణ ముగిసింది.

ఒకరాత్రి, శర్మ, మంగమ్మ, తనయుని విద్యావిషయంలో, భావి ప్రణాళిక ఆలోచిస్తున్నారు.

“ఏమండీ, మనవాడు 11 లోకి వచ్చేడు. వచ్చే ఏడాది వాణ్ణి కాలేజీలో పెట్టాలి. ఏమిటి చదివిద్దామనుకొంటున్నారు.” అని, మంగమ్మ భర్త అభిప్రాయం అడిగింది.

“ఇంకా ఏదీ ఆలోచించలేదు. నువ్వేమిటి అనుకొంటున్నావ్.”

“ఇంజనీరింగు చదివిస్తే బాగుంటుందేమో. మెడికల్ చదివిస్తే చాలా మంచిది. కాని, దానికి చాలా ఖర్చట. అంచేత అది మనకు లాభంలేదు. ఇంజనీరింగు అయితే నాలుగేళ్లతో అయిపోతుందట.”

“విషయాలన్నీ సేకరిస్తున్నావన్నమాట. మంచిదే. లోతుపాతులు ముందుగా తెలిస్తే, ఏది చెయ్యగలమో, తెలుస్తుంది. మంగా, రాబోయే మూడేళ్ళలో చదువుల్లో ఏ ఏ మార్పులు వస్తాయో తెలీదు. మరో రెండేళ్లు చూద్దాం.

“అవునండీ. మీరన్నది నిజమే. మీరన్నట్టు రెండేళ్లు చూద్దాం. అప్పటికి మనం ఎంత కూడపెట్టేమో కూడా తెలుస్తుంది. అది చూసుకొని వాడి చదువు మాట ఆలోచించొచ్చు.”

గదిలో లైటు ఆర్పేరు.

చిట్టితల్లి S.S.L.C. పాసయింది. క్లాసు ఫస్టు వచ్చింది. ప్రిన్సిపాలుగారు చిట్టితల్లికి మార్క్స్ సర్టిఫికేటు ఇస్తూ, “ఇంత మంచి మార్కులు వచ్చేయి. కనీసం డిగ్రీ చేస్తే మంచిదమ్మా.” అని సలహా ఇచ్చేరు.

“అలాగే సార్. మా నాన్నగారికి చెప్తాను” అని చెప్పి శలవు తీసుకుంది. చిట్టితల్లికి తనకు పై చదువు చదువుకొనే ఆలోచన లేదని, దానికి కారణాలు, ఆయనతో చెప్పుకోడం ఇష్టం లేకపోయింది. ఇంటికి వెళ్లి, అమ్మా నాన్నలకు తన మార్కులు చూపించింది. వాళ్లెంతో సంతోషించేరు. ప్రిన్సిపాలుగారు తనకిచ్చిన సలహా మాత్రం చెప్పలేదు. దాని వల్ల ప్రయోజనం ఉండదు గాని, అమ్మా నాన్నా బాధపడతారని ఆ నిర్ణయం తీసుకుంది. గణపతి, అన్నపూర్ణ, వేరే ఉన్నప్పుడు,  “అన్నపూర్ణా నా చేతకానితనం వల్ల, పిల్ల భవిష్యత్తు బలి అయిపోయింది.” అని, బాధపడ్డాడు.

“అలా, అనుక్కోకండి. మన కుటుంబాల్లో ఎవ్వరూ చేయనిది, మీరు పిల్లను స్కూలు చదువు పూర్తిగా చెప్పించేరు. అది తెలివయినది. జీవితంలో తప్పక రాణిస్తుంది. నాకు నమ్మకముంది.” అని ధైర్యం చెప్పింది.

“అంత ఖచ్చితంగా చెబుతున్నావ్. దాని జాతకం చూసేవేమిటి.”

“ఈ మధ్యనే చూసేనండి. ప్రస్తుతం దానికి రాహు మహాదశ నడుస్తోంది. ఈ దశ ఇంకా రెండు సంవత్సరాలు ఉంది. ఆ తరువాత గురుమహాదశ వస్తుంది. గురుడు దానికి యోగకారకుడు. భాగ్యాధిపతి. ఆ దశలో పిల్ల చాలా అభివృద్ధిలోకి వస్తుంది. అందుచేత దాని గూర్చి బెంగపడకండి.” అని జాతకరీత్యా చిట్టితల్లి జీవితంలో తప్పక సుఖపడుతుందని హామీ ఇచ్చింది.

“నువ్వు జాతకం చూసి చెప్పేవు కదా. అలాగే జరగుతుందని అనుకొందాం.” అని కొంత తృప్తి పడ్డాడు.

అంతలో డోర్ బెల్లు వాగితే, అటు వెళ్ళేడు, గణపతి. మనం నవరంగపట్నం వెళదామా.

మంగమ్మ కొడుకు సింహాద్రి ఇంటర్మీడియట్ సైన్సెస్ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టేడు. క్లాసులో పిల్లలు ఇంజనీరింగు, మెడికల్, ప్రవేశ పరీక్షల విషయం చర్చించుకొంటున్నారు. ఏ కోచింగు సెంటరు ఎంచుకోడమో తర్జన భర్జన చేస్తున్నారు. ఊళ్లో మూడు సెంటర్లు ఉన్నాయి. రోజూ న్యూసుపేపర్లలో వారి ఫుల్ పేజీ ఎడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. ఎవరి ఘనత వారు చాటుకొంటున్నారు. ఇదివరలోనే మంగమ్మ పిల్లణ్ణి ఇంజనీరింగు చదివించాలనే కోరిక శర్మకు చెప్పింది. అది మదిలో ఉండి, శర్మ ఆ విషయంలో వివరాలు తెలుసుకోడానికి, దేవాలయ కమిటీ మెంబరు, మూర్తిగారిని కలిసేడు. ఆయన అందులో లోతుపాతులు చెప్పి, బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమని సలహా ఇచ్చేరు. ఇంటికి వెళ్లగానే, మంగమ్మ ఆత్రుతగా,

“మూర్తిగారు ఏమన్నారండి.” అని అడిగింది.

“ఇంజనీరింగు కాలేజీలు ఎన్నో ఉన్నాయట, మంగమ్మా. కొన్ని కాలేజీలు, పేర్లేవో చెప్పేరు. వాటిలో పాసయితే తప్పక ఉద్యోగాలు దొరుకుతాయట. కాని చాలా కాలేజీల్లో చదువు అధ్వానంగా ఉంటుందట. వాటిలో పాసైనవారికి సర్టిఫికేటు వచ్చినా ఉద్యోగాలు దొరకడం లేదట. వాళ్లలో కొంతమంది బ్యాంకు గుమస్తా పనులకు కూడా పోటీ పరీక్షలు రాస్తున్నారట. ఇంజనీరింగు కాలేజీల పోటీ పరీక్షల్లో బాగా మంచి మార్కులు వచ్చిన వాళ్లకే ఆ మంచి కాలేజీల్లో సీట్లు దొరుకుతాయట. అదే పరిస్థితి.”

“అయితే, మనవాణ్ణి, ఆ కాలీజీల సీట్ల కోసం గట్టిగా ప్రయత్నించమందాం.”

“పూర్తిగా విను. వాటిలో జీతాలు ప్రతి సంవత్సరం లక్షలమీద ఉంటాయట.”

“తెలివిగా పాసయితే స్కాలర్షిప్పులు ఇస్తారుగదా.”

“వాటి వివరాలేవీ తెలీదు. అయినా వాటిమీద ఆశపడలేం.ఆ కాలేజీల్లో కూడా  రిజర్వేషన్లకింద చాలా సీట్లు వెళతాయట. మనవాళ్లకు ఏ రిజర్వేషన్లూ లేవు. ఆ మిగిలిన సీట్లకే మనదేశం నుండేకాక, పైదేశాలనుండికూడా, మనవాళ్లు లక్షల్లో పరీక్షలు రాస్తారట. ఆ పోటీ మనవాడు తట్టుకోగలడో, లేదో తెలీదు. తట్టుకున్నా  చదివించే తాహతు మనకు లేదు. ఏమంటావ్.”

“అవునండీ, ఏదో కలలు కన్నాను. మన ఇళ్లల్లో ఇంజనీరింగు ఎవరూ చదవకపోడం వల్ల అసలు విషయాలు నాకు తెలీలేదు. సరేలెండి, మనకున్నదానితో సంతృప్తి పడదాం.”

“పిల్లడు ఆ విషయం నీతో మాట్లాడాడేమిటి.”

“లేదండీ. ఆ విషయం ఎత్తలేదు.”

“పెద్దవాడవుతున్నాడు. జ్ఞానం వచ్చింది. ఇంటి పరిస్థితులు చూస్తున్నాడు. వాడికి మనం చదివించలేమని తెలిసుంటుంది.”

“వాడు ఈ విషయం నాతో మాట్లాడితే, బోధపరుస్తానులెండి. ఫరవాలేదు.”

మంగమ్మ తన పనిలోకి వెళ్ళింది.

***

ఒకరోజు, కొడుకు డోర్ బెల్లు వాయిస్తే, అన్నపూర్ణ వెళ్లి తలుపు తీసింది. వాడు ప్రవేశిస్తూ ఉంటే, అన్నపూర్ణకు ఏదో అనుమానం వచ్చింది.

“ఏదీ, నీ నోరు విప్పు.” అని గట్టిగా అడిగింది.

వాడు తటపటాయిస్తూ ఉంటే, “నోరు విప్పు.” అని స్థాయి పెంచి అడిగింది. వాడు నోరు విప్పగానే, అన్నపూర్ణ నోటి వాసన చూసి,  “నువ్వు సిగరెట్టు తాగేవా.” అని దమాయించి అడిగింది.

వాడు బిక్కుబిక్కుమని తల వంచుకున్నాడు. అందులోనే అర్థమయింది, వాడు సిగరెట్టు తాగేడని.

“ఇంట్లోకి పద.” అని, వాడి జబ్బ పట్టుకుని లాక్కెళ్లింది. అన్నపూర్ణకు ఒళ్లు మండిపోతోంది.

“నీకు సిగరెట్టు ఎలా వచ్చింది.” అని గట్టిగా అడిగింది. సమాధానం లేదు. మొహం దించుకొనే ఉన్నాడు. వాడి జుట్టు పట్టుకొని మొహం మీదకెత్తి, “ఆ వెధవలే నీకిచ్చేరా.” అని వాడి ముఖంలోకి చూస్తూ అడిగింది. అవునన్నట్టు సంకేతమిచ్చేడు.

“మీ నాన్నగారు అప్పుడే చెప్పేరు. వాళ్ల సహవాసాలు నిన్ను పాడుచేస్తాయని. నేనే వెర్రిదాన్ని. నిన్ను నమ్మేను. ఆయనకు ఇప్పుడు ఏమిటని చెప్పేదిరా. నా ఖర్మ. నేనేం పాపం చేసేనని నాకీ శిక్ష వేసేవు భగవంతుడా.” అని అరచేతులతో నుదురును కొట్టుకుంటూ కంట తడిపెట్టుకుంది.

అది గమనించిన గౌరీపతి, తల్లి కాళ్లమీద పడి, “అమ్మా, తప్పయిపోయిందమ్మా. ఎప్పుడూ సిగరెట్టు తాగనమ్మా. నిజంగానమ్మా.” అని పాదాలు గట్టిగా పట్టుకొన్నాడు.

“ఇది తెలిస్తే మీ నాన్నగారు ఊరుకోరు. ఏమిటి చెస్తారో నాకు తెలీదు. సరే, లే. నువ్వు కాళ్లూ చేతులూ కడుక్కుని రా. ఆ కంపు నోరు శుభ్రంగా కడుక్కో.” అని మందలిస్తూ చెప్పింది.

కొద్దిసేపటికి గణపతి వచ్చేడు. కాళ్లూ చేతులూ కడుక్కుని గదిలోకి వెళ్ళేడు. అన్నపూర్ణ అక్కడకు వెళ్ళింది. జరిగినది చెప్పింది. అది విని,

“నేనప్పుడే చెప్పేను. సహవాసదోషం, పాడవుతాడని.” గణపతి ఉవాచ.

“నిజమేనండి. మీకున్న జ్ఞానం నాకు లేకపోయింది. క్షమించండి.”

“వాడు చేసిన తప్పుకు నువ్వెందుకు క్షమాపణ చెప్పుకోడం. ఇంటా ఒంటా లేదు. వీడిలా చేస్తాడని నేనూ అనుకోలేదు. సరే, వాణ్ణిలా పిలూ. “

“వాణ్ణి పిలుస్తాను. కాని కొట్టకండి. పొరబాటు ఒప్పుకొన్నాడు. మరి చెయ్యనన్నాడు.”

“సరే, పిలూ వాణ్ణి.”

బితుకుబితుకుమంటూ తల దించుకొంటూ గౌరీపతి వచ్చేడు. వాడి రెండు చెవులతో ముఖాన్ని ఎత్తి, “నువ్వు ఎన్నాళ్లబట్టి సిగరెట్టు తాగుతున్నావ్.” అని, గట్టిగా అడిగేడు. సమాధానం లేదు.

“చెప్తావా, వాయించీ మన్నావా.”

వాడేదో గొణిగేడు.

“గట్టిగా చెప్పు.” అని చెవులు బాగా నులిపేడు.

“ఇవాళే తాగేను. ఎప్పుడూ తాగలేదు.” అని చెపుతూ ఉంటే కళ్ళ నీళ్లు తిరిగేయి. వాడి వెనకనే ఉన్న అన్నపూర్ణ అది గమనించి, కొద్దిగా తగ్గమని భర్తకు సౌజ్ఞ చేసింది.

గణపతి చెవులు వదిలి, “రేపటి నుండి నువ్వు స్కూలుకు వెళ్లక్కర్లేదు. ఇంట్లో పడుండు. రేపు నేను ప్రిన్సిపాలుగారిని కలసి నీ పేరు స్కూలునుండి తీసీమంటాను.” అని వాణ్ణి భయపెట్టి,

“అన్నపూర్ణా, రేపటినుండి పనిపిల్లను మాన్పించీ. వీణ్ణి ఆ పనులలో పెట్టు.” అని ఆర్డరు పాసు చేసేడు.

గౌరీపతి భయపడి, తండ్రి కాళ్లపైబడి, “నాన్నా, ఇహమీదట ఎప్పుడూ సిగరెట్టు తాగను. నన్ను క్షమించండి.” అని పాదాలు గట్టిగా పట్టుకొన్నాడు.

గణపతి, “నా పాదాలు వదులు. నిలబడి నేను చెప్తున్నది విను. వాడు నిలబడ్డాక, “నావైపు చూడు. నువ్వు ఆ వెధవల సహవాసం మానుకో. క్లాసులో వాళ్ల పక్కనగాని, దగ్గరలోగాని కూర్చోడానికి వీల్లేదు. వాళ్ల ఇళ్లకు వెళ్లడానికి వీల్లేదు. అసలు, నువ్వు వాళ్ళతో మాట్లాడ్డానికి వీల్లేదు. నేనోకంట కనిపెడుతూ ఉంటాను. నువ్వు మళ్ళీ వాళ్ళతో కలుస్తున్నావని తెలిసిన మరుక్షణం నిన్ను స్కూలు మాన్పించేస్తాను. బోధపడిందా.” అని కొట్టొచ్చినట్లు చెప్పేడు. ఆ బెదిరింపు కేవలం గౌరీపతిని భయపెట్టడానికే. కారణం; కొడుకును తప్పక ఉద్యోగస్థుణ్ణి చేయాలన్న దృఢమైన సంకల్పం. గణపతిని అది ఏ నాటికీ చేయనివ్వదు.

గౌరీపతి తాను చెప్పినవన్నీ వాడినోట అనిపించేడు.

గౌరీపతి తండ్రి సలహాలను వెంటనే అమలుచేసేడు. చెడుసహవాసం మానుకొన్నాడు. తెలివిగా చదువుకుంటున్నాడు.

***

మంగమ్మ కొడుకు సింహాద్రి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో అడుగుపెట్టేడు. వాడి పైచదువు విషయంలో ఏమిటనుకొంటున్నాడో కదిపి చూద్దామని, ఒకరోజు మంగమ్మ, కొడుకుతో,

“నాన్నా, ఈ ఏడుతో నీ కాలేజీ  చదువు అయిపోతుందికదూ.” అని తెలియనట్టు అడిగింది.

“అవునమ్మా, ఈ ఏటితో అయిపోతుంది. ఎందుకలా అడిగేవు.”

“తరువాత ఏమిటి చేద్దామనుకొంటున్నావో తెలుసుకొందామని అడిగేను, నాన్నా.”

“నాన్నగారు ఏమిటి చెయ్యమంటే అది చేస్తాను, అమ్మా.”

“నువ్వేమీ ఆలోచించడం లేదా.”

“లేదమ్మా. ఏమీ ఆలోచించడం లేదు. నాన్నగారే ఏదో ఆలోచించి చెప్తారు కదా.”

“క్లాసులో మిగిలిన పిల్లలు ఏమిటి చేస్తున్నారు, నాన్నా.”

“కొందరు ఇంజనీరింగు, మెడికల్ పోటీ పరీక్షలు రాద్దామనుకొంటున్నారు. కొందరు డిగ్రీ చేద్దామనుకొంటున్నారు.”

“నీకు అన్నిట్లో మంచిమార్కులు వస్తున్నాయి కదా, నువ్వు కూడా పోటీపరీక్షలు రాస్తే మంచిది కదా.”

“అమ్మా, పోటీ పరీక్షల జోలికి మనం వెళ్లలేమమ్మా. వాటికి లక్షలమీద రాస్తారు. ఇంటిదగ్గర ఎవరిమట్టుకు వారు రాస్తే ఏమీ లాభం లేదు. వాటికి ఎన్నో కోచింగ్ క్లాసులుంటాయ్. వాటిలో చేరాలి. వాళ్లు గుంజేస్తారు. కొందరు పేరున్న కోచింగు క్లాసుల్లో చేరడానికి, పై ఊళ్లలో నెలలబడి ఉంటున్నారమ్మా. ఫెయిలయితే, మళ్ళీ మళ్ళీ రాస్తున్నారు. అవన్నీ నేను చెయ్యలేనమ్మా. అంచేత అందులో నేను బుర్ర పెట్టుకోదలచలేదు.” అని వాటిలో సాధకబాధకాలన్నీ విపులంగా తల్లికి చెప్పేడు.

“నాన్నా, పెద్దవాళ్లకే తెలీని ఈ విషయాలన్నీ నీకు ఇంత చిన్న వయసులో ఎలా తెలిసేయో ఆశ్చర్యంగా ఉంది.”

“ఆశ్చర్యానికి ఏమీ లేదమ్మా. న్యూసుపేపర్లలో రోజూ వార్తలు చదివితే, అన్ని విషయాలు తెలుస్తాయి. దేశంలో నిరుద్యోగులు పడుతున్న అష్టకష్టాలు తెలుస్తాయి. కష్టపడి ఏదోలాగు ఇంజినీరు అయినా, ఉద్యోగాల పరిస్థితి ఘోరంగా ఉందమ్మా. I.I.T. వంటి కాలేజీల్లో పాసయినవాళ్లకి ఉద్యోగాలు దొరుకుతున్నాయట. మిగిలిన వాళ్లు ఉద్యోగాలకోసం పడుతున్న పాట్లు వింటుంటే, జాలి వేస్తుంది.  ఏదీ దొరక్క ఆఖరికి బ్యాంకులో గుమస్తా పనులకు కూడా ప్రయత్నిస్తున్నారట. గవర్నమెంటు ఉద్యోగాల్లో పది ఖాళీలుంటే వెయ్యిమంది ఎప్లై చేస్తున్నారట . మొన్ననే పేపర్లో చదివేను. గవర్నమెంటులో ప్యూను పోస్టుకి డిగ్రీ పాసయినవాళ్లు ఎప్లై చేసేరుట. అలా ఉంది ఉద్యోగాల పరిస్థితి. పరిస్థితి నీకు చెప్పేను కానీ, నువ్వేం బెంగపడకమ్మా. నాన్నగారికి నాకన్నా బాగా తెలుసు. నాకు ఏది మంచిదో చెప్తారు. అది చెయ్యొచ్చు.” అని తల్లికి హామీ ఇచ్చేడు.

మంగమ్మ, కుమారరత్నాన్ని కౌగలించుకొని, తల నిమురుతూ, “భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు నాన్నా.” అని ఆశీర్వదించి, వాడికి తినడానికి ఇచ్చింది.

కొడుకుతో జరిగిన సంభాషణ, మంగమ్మ, రాత్రి శర్మతో చెప్పింది.

“మంగా, మన ఇంటి పరిస్థితి పిల్లడు రోజూ చూస్తున్నాడు కదా. ఇంత చిన్న వయసులోనే బాధ్యత తెలుసుకున్నాడు. అది మన అదృష్టం. వాడు చెప్పినట్లు మనవాళ్ళకి ఉద్యోగావకాశాలు తక్కువ. ఏమిటి చెయ్యాలో బాగా ఆలోచించాలి. మన చేతనయినదాంట్లో తక్కువలేకుండా వాడికి చేద్దాం, మంగా.” అని అనిశ్చితమయిన భవిష్యత్తును తలచుకొన్నాడు.

“నాకేమీ పాలుపోడంలేదు. మీరే ఆలోచించాలి.” అని సంభాషణ ముగించింది, మంగమ్మ.

(సశేషం)

Exit mobile version