[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[నవరంగపట్నంలో మంగమ్మ, శర్మల ఏకైక సంతానం సింహాద్రిశర్మను కాన్వెంటులో చేరుస్తారు. ఆ మూడు కుటుంబాలలోను పెద్దతరం వారు పెద్దల్లో కలసిపోతారు. చిట్టితల్లి చదువు విషయంలో తల్లిదండ్రులు తర్జన భర్జన పడతారు. చిట్టితల్లి తమ్ముడు గౌరీపతికి క్లాసులో ఇద్దరు డబ్బున్న పిల్లలతో స్నేహం కుదిరి, వాళ్ళని అనుకరిస్తూంటాడు. చిట్టితల్లి S.S.L.C. మంచి మార్కులతో పాసవుతుంది. ఇంటి ఆర్థిక పరిస్థితి గ్రహించి, ఇంకా చదవలన్నా ఆలోచనని విరమించుకుంటుంది. గౌరీపతి చెడు స్నేహల వల్ల, సిగరెట్ త్రాగి ఇంటికొస్తాడో రోజు. తల్లి మందలిస్తుంది, తండ్రి చెంపదెబ్బ కొట్టి గట్టిగా హెచ్చరిస్తాడు. దాంతో గౌరీపతిలో మార్పు వస్తుంది. సింహాద్రి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలోకి వస్తాడు. వాడి పైచదువుల గురించి తల్లి వాడితో మాట్లాడితే, నిర్ణయం తండ్రికి వదిలేస్తాడు. చేతనయినదాంట్లో వాడికి తక్కువలేకుండా చెయ్యాలని శర్మ భావిస్తాడు. – ఇక చదవండి.]
చిట్టితల్లికి తగిన సంబంధాల కోసం గణపతి చూస్తున్నాడు. జాతకాలు కుదరక కొన్ని, కట్నకానుకలకు తూగలేక కొన్ని ఫలించలేదు.
ఒకరోజు, గతంలో అన్నపూర్ణ పురాణకాలక్షేపంలోని సభ్యురాలు రామసీతమ్మ ఏదో మాట్లాడడానికి అన్నపూర్ణగారి ఇంటికి వెళ్లింది. అన్నపూర్ణ ఆమెను ఆప్యాయంగా ఎదుర్కొని,
“రండి, రండి, సీతమ్మగారూ.” అని ఆహ్వానించి ఉభయకుశలోపరితో లోపలికి వెళ్లేరు.
అంతలో చిట్టితల్లి వచ్చి, ఆవిడకు పాదాభివందనం చేసి, “అమ్మా, నా క్లాసుమేటు వినోదిని వచ్చింది. దాన్ని ఓ మారు కలసి వస్తాను.” అని తల్లికి చెప్పి, వెళ్లింది.
“చిట్టితల్లికి పెద్దలంటే ఎంత గౌరవమండి. ఇప్పటి పిల్లలు ఎంత తెలిసినవాళ్లు వచ్చినా వాళ్ల వేపు చూడనే చూడరు. చూసినా ‘హాల్లో ఆంటీ.” అని విసురుగా అనేసి పోతారు. అంతా మన పెంపకంలో ఉంటుంది.”
“అవునండీ, మా అత్తగారు అంటూ ఉండేవారు, మన అలవాట్లే పిల్లలకు వస్తాయని.”
“అన్నపూర్ణగారూ, చిట్టితల్లికి సంబంధాలు ఏవైనా చూస్తున్నారా.”
“చూస్తున్నామండీ, ఇప్పటిదాకా ఏదీ కుదరలేదు.”
“మాకు కావలిసిన వాళ్ల కుర్రాడొకడు ఉన్నాడు. అది మాట్లాడటానికే వచ్చేను.”
“మీకు కావలిసిన వాళ్లంటున్నారు. ఆ సంబంధమేదో చెప్పండి.”
“కుర్రాడు డిగ్రీ చేసేడండి. పేరు సత్యనారాయణ మూర్తి. L.I.C. ఏజెంటుగా పని చేస్తున్నాడు. బాగానే ఆర్జిస్తున్నాడట.”
“పెళ్లికొడుకు వయసు ఎంత ఉంటుందండి.”
“ఇరవై అయిదు నిండేయట.”
“బాగుందండి. చిట్టితల్లికన్నా ఆరేళ్ళు పెద్దన్నమాట. ఎక్కడ పని చేస్తున్నాడండి, అబ్బాయి.”
“విశాఖపట్నంలో నండి.”
“అలాగా, మనకు అట్టే దూరం లేదు.”
“మీరన్నట్టు అట్టే దూరం లేదండి. మూడు గంటలు ప్రయాణంట. మన ఊరునుండి రోజూ అయిదారు బస్సులు వచ్చి వెళుతున్నాయిట.”
“అబ్బాయి తండ్రి ఏమిటి చేస్తున్నారండి.”
“కుర్రాడి తల్లి వాడి ఆరో ఏట పోయిందండి. ఆతరువాత రెండేళ్లకు తండ్రి కూడా పోయారండి.”
“అయ్యో, పాపం.”
“పిల్లడి మేనత్త అప్పలనరసమ్మగారు విశాఖపట్నంలో ఉంటుందండి. బాగా పెద్దావిడట. పదేళ్ల కిందటే భర్త పోయేరట. ఆవిడికి ఇద్దరు మగపిల్లలు. వాళ్ల నాన్నగారికి రైల్వేలో బాగా తెలిసిన ఏదో పెద్ద ఉద్యోగస్తుడు సాయంతో ఇద్దరూ రైల్వేలో జాయినయ్యేరట. ఇద్దరూ ఇప్పుడు కలకత్తా వేపు టికెట్ కలెక్టర్లుగా ఉన్నారట. మేనత్త నరసమ్మగారే మూర్తిని చేరదీసి చదువు చెప్పించిందిట.”
“నాటికొక్క దైవము లేడే, అంటారు.”
“ఆవిడ మా ఆయనకు దూరపు బంధువు.”
“అదే, మీరు చెప్పేరుకదా, మీకు కావలిసినవాళ్లని.”
“మొన్న మా ఆయన విశాఖపట్నంలో ఓ పెళ్లికి వెళ్లేరండి. ఆ పెళ్లిలో ఆవిడ కలసిందట. అప్పుడు ఆయనతో మూర్తికి ఏదయినా మంచి సంబంధం చూడమని ఎంతో చెప్పిందట. వాడికి తనుతప్ప ఎవ్వరూ లేరు; తనూ పెద్దదయిపోయింది. ఆప్యాయంగా కడుపులోపెట్టుకు చూసే కుటుంబంలోని పిల్లని చూడమందిట. కట్నకానుకలేవీ కోరడం లేదట. ఆయన నిన్న నాతో చెప్పేరు. చిట్టితల్లి కోసం మీరు ఆలోచిస్తారేమో అని తెలుసుకోడానికి వచ్చేను.”
“మంచి పని చేసేరు. చాలా thanks. మాకూ పిల్లకోసం తగిన సంబంధం కావాలి కదా. మా ఆయనతో మాట్లాడుతాను. తల్లిని కూడా అడిగి చూస్తాను. ఏ సంగతీ రేపు మీ ఇంటికి వచ్చి చెప్తాను.”
“మీకెందుకండి శ్రమ. నేనే వస్తాను.”
“శ్రమ ఏమీ లేదండీ. మీ ఇంట్లో ఫిల్టరు కాఫీ తాగి చాలా రోజులయింది. అది తాగడానికేనా వస్తాను.” అని చమత్కరించింది.
“తప్పక రండి. వస్తాను.”
“అయ్యో, మాటల సందడిలో మీకు మంచినీళ్లయినా ఇవ్వలేదు. ఒక్క ఘడీ కూర్చోండి. కాఫీ చేసి తెస్తాను.”
ఉభయులు కాఫీ సేవించేక, సీతమ్మ ఇంటికెళ్లింది.
సంబంధం విషయం అన్నపూర్ణ గణపతికి వివరాలతో తెలియజేసింది.
“నువ్వేమిటి చెప్పేవ్.”
“మిమ్మల్ని అడిగి రేపు చెపతానన్నాను. చిట్టితల్లిని కూడా అడగాలన్నాను.”
“ఆవిడ చెప్పినదాన్ని బట్టి చూస్తే, సంబంధం బాగానే ఉన్నట్టుంది. పెళ్లికొడుకు డిగ్రీ చేసేడన్నావు కదూ.”
“అవునండీ.”
“నేను డిగ్రీ వాళ్లకోసమే చూస్తున్నాను. మన పిల్ల S.S.L.C. పాసయింది కాబట్టి, చదువు విషయం బాగుంది. L.I.C. ఏజంటూ.. అంటే చిన్న, పెద్ద, తరహావాళ్లందరితో మర్యాదగా మాట్లాడ్డం, వాళ్లని ఒప్పించడానికి ఓపిగ్గా ప్రయత్నించడం చేతనవునన్నమాట. నీకు తెలుసనుకొంటాను, L.I.C. ఏజెంటు పని గురించి.”
“తెలుసండీ. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు సత్యవాణి అని మా క్లేసుమేటు ఉండేది. వాళ్ల నాన్నగారు L.I.C. ఏజెంటుగా పని చేస్తూ ఉండేవారు. ఓ మారు ఆ అమ్మాయి చెప్పింది, వాళ్ల నాన్నగారి పని గురించి.”
“అది ఎంత చదువు చదివినా అందరికీ చేతకాదు, అన్నపూర్ణా. కుర్రాడు చురుకయినవాడులా ఉన్నాడు. ఓపికున్నన్నాళ్ళు పని చేసుకో వచ్చు. నాకు బాగున్నట్టే ఉంది. నువ్వేమిటంటావ్.”
“నాకూ బాగానే ఉన్నట్టుందండి. కట్నకానుకలు కోరడం లేదని మేనత్త చెప్పిందట.”
“అదీ పెద్ద విషయమే. మనకు అందుబాటులో ఉన్న సంబంధం. అమ్మాయిని కూడా అడిగి చూడు. అది సరే అంటే, ముందుకెళ్లొచ్చు.
“చిట్టితల్లి ఒప్పుకొంటే రేపు సీతమ్మగారింటికి వెళ్లి మనకు నచ్చిందని చెప్పేదా.”
“ఆ.. చెప్పు. పెళ్లికొడుకు మేనత్తగారి ఎడ్రసు అడుగు. నేను స్వయంగా వెళ్లి ఆవిణ్ణి కలసుకుని చిట్టితల్లిని చేసుకోమని అడుగుతాను.”
“ అలాగేనండి.”
సంభాషణ ముగిసింది.
అన్నపూర్ణ సమయం చూసి చిట్టితల్లికి పెళ్ళికొడుకు వివరాలు చెప్పి తన అభిప్రాయం అడిగింది.
“నాన్నగారేమిటన్నారు.” అని చిట్టితల్లి తండ్రి అభిప్రాయం తెలియగోరింది.
“నాన్నగారికి నచ్చింది.”
“నువ్వేమిటంటావ్.”
“నాకు బాగానే ఉందమ్మా.”
“మీ ఇద్దరూ నాకన్నా పెద్దవాళ్లు. మీకన్నా నా మంచి చెడ్డలు చూసుకొనే వాళ్ళెవరున్నారమ్మా. మీ అంత ప్రపంచజ్ఞానం కూడా నాకు లేదు. మీ ఇద్దరూ నచ్చేరు కదా.”
“మా సంగతి వదిలీ. అసలు నీ..కు నచ్చిందా. ఆ.. విషయం చెప్పు.”
“నాకు నచ్చిందమ్మా.” అని సిగ్గుతో తల్లి భుజం మీద వాలిపోయింది.
మరునాడు అన్నపూర్ణ సీతమ్మగారింటికి వెళ్లి తమ అభిప్రాయం తెలియజేసి, ధన్యవాదాలు చెప్పింది. నరసమ్మగారి ఎడ్రసు సేకరించింది. ఫిల్టరుకాఫీ తాగుతూ, కబుర్లు చెప్పుకుంటూ కొంతసేపు గడిపి ఇల్లు చేరుకుంది.
గణపతి మంచిరోజు చూసుకుని విశాఖపట్నం ప్రయాణమయ్యేడు. అమ్మాయికి కూడా నచ్చినందున సంబంధం నిశ్చయం చేసుకువస్తానని అన్నపూర్ణకు చెప్పేడు. అన్నపూర్ణ “శుభం” అంది. గణపతి విశాఖపట్నం చేరుకొని నరసమ్మగారిని కలసుకున్నాడు. తమ వివరాలన్నీ ఆవిడకు చెప్పేడు. పిల్ల ఫోటో ఆవిడకు అందజేసేడు. నరసమ్మ,అమ్మాయి లక్షణంగా ఉంది. వాడు వస్తే చూపిస్తానంది. తమ కుటుంబం గూర్చి వివరాలు గణపతికి చెప్పింది. సీతమ్మగారు ఆ వివరాలన్నీ చెప్పేరన్నాడు, గణపతి.
“అయినా నేను మీకు స్వయంగా చెప్పడం మంచిది కదా. మాకు మరే కోరికలూ లేవు. మీకు చెప్పేను కదా. సత్యం, చిన్నతనంలోనే వాడి తల్లి, తండ్రి, పోయేరు. అయినా నా దగ్గర చాలా బుద్ధిగా పెరిగేడు. ఏ చెడ్డ అలవాట్లూ లేవు. చాలా అమాయకుడు. మీరు చూస్తున్నారు. నేను పెద్దదాననయిపోయేను. అంచేత వాణ్ణి ఆప్యాయంగా చూసుకొనే వాళ్ల కోసం చూస్తున్నాను. అదొక్కటే నా కోరిక. మరేకోరికలు లేవు.”
“మా కుటుంబం గూర్చి సీతమ్మగారు చెప్పే ఉంటారు. మీ మేనల్లుణ్ణి మా స్వంత కొడుకులా చూసుకొంటాం. మీకా బెంగక్కరలేదు.”
“అవునండి సీతమ్మ మీ కుటుంబం గూర్చి చెప్పింది. మీ అమ్మాయిని చిన్నతనంనుండి తెలుసంది.”
ఆ మాటలు విన్నాక, నరసమ్మకు తమ సంబంధం నచ్చిందని అనుకొని, గణపతి సంబంధం నిశ్చయం చేసేద్దామనుకున్నాడు. నరసమ్మతో ఆ ప్రస్తావన చేయబోయేడు. కాని అంతలో నరసమ్మ,
“సత్యం రాగానే వాడికి మీ వివరాలన్నీ చెప్తాను. అమ్మాయి ఫోటో చూపిస్తాను. వాడికి నచ్చితే, మీ ఊరొచ్చి మీ అమ్మాయిని చూడమంటాను. ఇద్దరూ ఒకరికొకకు నచ్చితే మనం ముందుకెళ్లొచ్చు.” అని చెప్పడంతో వెనక్కి తగ్గి,
“మీరు, మీ మేనల్లుడుగారు మా అమ్మాయిని చూడడానికి మా ఊరు వస్తే, మాకెంతో సంతోషం.” అని గణపతి ఆహ్వానించేడు.
నరసమ్మ తను ప్రయాణాలు చేయలేనని, మేనల్లుణ్ణి తప్పక పంపిస్తానంది. లోపలకు వెళ్లి ఫ్రేము కట్టిన మూర్తి ఫోటో తెచ్చి గణపతికి చూపించింది. అబ్బాయి బాగున్నాడని గణపతి ప్రశంసించేడు. ఆమె వద్ద శలవు తీసుకొని గృహోన్ముఖుడయ్యేడు.
భర్త రాక కోసం అన్నపూర్ణ వేచి ఉంది. రాత్రి సుమారు పది ఘంటలకు, గణపతి ఇల్లు చేరుకొన్నాడు. తలుపు తీస్తూనే, “ఆవిడ ఏమిటందండి.” అని ఆత్రుతగా అడిగింది.
చిరునవ్వుతో, “నన్ను లోపలకు రానీ. సవ్యంగానే జరిగింది. కాళ్లూ చేతులూ కడుక్కొచ్చి జరిగిందంతా చెప్తాను.” అని శుభ్రపరచుకొని వచ్చేడు.
“ఆవిడ బాగా పెద్దావిడ.”
“అవునండి, సీతమ్మగారు చెప్పేరు.”
“చాలా మర్యాదగా మాట్లాడేరు. పెళ్లికొడుకు గూర్చి, మనకు తెలిసిన విషయాలే ఆవిడ చెప్పేరు. మన కుటుంబం గూర్చి వివరాలన్నీ ఆవిడకు చెప్పేను.”
“సాంప్రదాయ కుటుంబలో పెరిగిన పిల్లన్నమాట.” అని ఆవిడ అన్నారు.
“మన పిల్ల, పెద్దలదగ్గర అణకువుగా ఉంటుందని, ఇంటిపనుల్లో నీకు సాయంగా ఉంటున్నాదని, చెప్పేను. మన ఇద్దరి వియ్యాలవాళ్ల గురించి చెప్పేను. ఆవిడ అనుకూలంగా ఉన్నారనిపించింది. నా పద్ధతిన సంబంధం నిశ్చయం చేసేద్దామనుకున్నాను. కాని నేనా విషయం ఎత్తక మునుపే ఆవిడ పిల్లని చూసుకోడానికి మేనల్లుణ్ణి పంపిస్తానంది. ఇద్దరూ ఒకరికొకరు నచ్చితే, ముందుకెళ్లొచ్చంది.”
“పద్ధతులన్నీ మారిపోయాయండి. ఆవిడ చెప్పిందీ బాగుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొంటారు. మన పిల్ల గొప్పలు మనం చెప్పుకోకూడదు గాని, లక్షల్లో ఎంచదగ్గ పిల్లండి.”
గణపతి తను ఆవిడకు ఇచ్చిన ఆహ్వానం, ఆవిడ సమాధానం, అన్నీ వివరంగా చెప్పేడు.
“వచ్చేముందు మనకు ముందుగా తెలియబరుస్తారనుకొంటాను.” అని తన సందేహాన్ని బయటపెట్టింది.
“తెలియబరుస్తారనుకొంటా. అయినా, ఒక పని చెయ్యి. సీతమ్మగారితో జరిగిందంతా చెప్పు. కథ ముందుకు ఆవిణ్ణే నడిపించమను. ఆవిడతో ఈ సంగతి చెప్పు.”
“ఆ.. అవునండీ. అలా చేద్దాం.” అని భర్త సలహాతో ఏకీభవించి, అమలుపరిచింది.
***
పనిమీద బయటకు వెళ్లిన మూర్తి ఇల్లు చేరుకున్నాడు. అప్పలనరసమ్మ, మేనల్లుడు సత్యనారాయణ మూర్తితో, వాడికి వచ్చిన పెళ్ళిసంబంధం వివరాలు చెప్తూ, “ శ్రీవల్లిపురంలో మనకు కావలసిన వాళ్లు, షణ్ముఖ శాస్త్రిగారని, ఆయన ద్వారా వచ్చింది, ఈ సంబంధం. ఆయన భార్య సీతమ్మ, ఆ కుటుంబం తనకు బాగా తెలిసినదే అని చెప్పింది. పెళ్లికూతుర్ని నెలల పిల్లనుండే తెలుసంది. తెలివైంది, పెద్దవాళ్లంటే గౌరవం, చురుకైనది అని చెప్పింది. ఆ పిల్ల తల్లి భారతభాగవతాలన్నీ చదువుకొందట. ఆవిడ పెళ్ళైన కొత్తలో అవి చదివి వినిపిస్తూ ఉంటే, మరికొందరితోబాటు సీతమ్మ కూడా వెళ్లేదట. అదంతా చెప్పుకొచ్చి, కుటుంబం గూర్చి గాని, పిల్ల గూర్చిగాని ఎంచడానికేమీ లేదంది.” అంతలో ఏదో జ్ఞాపకం వచ్చి, “నా తలగడా కింద ఓ ఫోటో ఉంటుంది, తీసుకురా.” అని మేనల్లుడికి చెప్పింది. వాడు ఫోటో తీసుకొస్తూ, దారిలో రెండు మూడు నిమిషాలు ఆగి, ఫోటో పరీక్షగా చూసేడు. ఏమీ తెలియనట్టు దాన్ని మేనత్త చేతిలో పెట్టేడు. ఆవిడ తిరిగి వాడికిచ్చి, “ఆయన, పెళ్ళికూతురు ఫోటో కూడా తెచ్చి ఇచ్చేడు. బాగా చూసి చెప్పు, ఎలా ఉందో.” మూర్తి కొంతసేపు చూసి మేనత్తకు తిరిగి ఇచ్చేడు. ఆవిడ, “ఎలా ఉంది, పిల్ల. నీకు నచ్చిందా.” అని సూటిగా అడిగింది.
“నువ్వు కూడా చూసేవు కదా ఫోటో. నీకు నచ్చిందా.. చెప్పు.”
“నాకు చూడగానే నచ్చిందిరా. కన్నూ, ముక్కూ, లక్షణంగా ఉన్నాయి. పుత్తడిబొమ్మలా ఉంది.”
“నాకు ఇప్పుడు బొమ్మలెందుకత్తా. నేనేం ఆడుకోవాలా.”
“హాస్యాలు మానీసి, నీకు నచ్చిందో లేదో చెప్పరా నాన్నా.”
“అత్తా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు చెప్పూ, హాస్యాలాడడానికి.” అని మేనత్తతో ఆప్యాయంగా అన్నాడు.
“హాస్యం కాకుండా, నీకు నచ్చిందో లేదో చెప్పురా, బాబూ.”
“అత్తా, నీకు బాగా నచ్చినట్టుంది. అవునా,”
“అవునురా నాయనా. నాకు నచ్చింది.”
“అత్తా, చిన్నప్పటినుండి నన్ను పెంచి ఇంతవాణ్ణి చేసేవ్. నాకు ఏది మంచో అదే నువ్వు చేస్తున్నావు..” అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే,
“అవన్నీ ఇప్పుడెందుకు నాయనా. కష్టాల్లో ఉన్నవాళ్లకు బంధువులే చేతనయిన సాయం చేయాలి. అది ధర్మం.”
“నిజమే అనుక్కో. కాని, ఈ రోజుల్లో స్వంత అన్నదమ్ములే చూసీ చూడనట్టు ఉంటున్నారు, అత్తా.”
“నాయనా. నువ్వు బాగా మాటకారివిరా. అసలు విషయం తేల్చకుండా ఉన్నావ్.”
“నీతో మాట్లాడుతూ ఉంటే సరదాగా ఉంటుంది, అత్తా. సరే, నిన్ను విసిగించను. నాకు నచ్చింది. సరేనా.” అని, మేనత్త రెండు భుజాలూ పట్టుకొని ఆప్యాయంగా చెప్పేడు.
“అమ్మయ్య. ఇది చెప్పడానికి, నా తల ప్రాణం తోకకు తెచ్చేవ్. ఇది విను. మరి హాస్యాలాడకు. ఆయన పెళ్లికూతురును చూడడానికి మనిద్దరిని రమ్మన్నాడు. నేను ప్రయాణాలు చేయలేను, మావాణ్ణి పంపిస్తానని చెప్పేను.”
“నిన్ను నేను టేక్సీలో తీసుకెళతానత్తా. తాపీగా వెళ్లొచ్చు. మధ్యలో మనకు కావలిసిన చోట్ల ఆగొచ్చు.”
“నాయనా. నాకు తెలుసు. నన్ను వదిలీ, బాబూ. సీతమ్మతో ఇవాళే మాట్లాడుతాను. పెళ్లిచూపులికి నీతో వాళ్లింటికి వెళ్లమని.”
“సరే, ఎప్పడు వెళ్లాలో ఓ రోజు ముందు చెప్పత్తా. నేను వెళతాను. అత్తా, ఒకాయన్ని కలియాలి, వెళతాను.” అని, మూర్తి బయటకు దారి తీసేడు.
***
మంగమ్మ కొడుకు, సింహాద్రి I.Sc. పాసయ్యాడు. లెక్కల్లో నూటికి తొంభైరెండు తెచ్చుకొన్నాడు. సైన్సులో కూడా ఎనభై శాతం వచ్చేయి. తను ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షరాస్తే తప్పక సెలెక్టవుతానని సింహాద్రికి నమ్మకం ఉంది. ఇంజనీరింగు చదివించే ఆర్థిక బలం తండ్రికి లేదని కూడా తెలుసు. తన కోరిక చెప్పి తండ్రి మనసు నొప్పించకూడదనుకున్నాడు. అయితే ఏమిటి చేయడమా అని ఆలోచించేడు. పాఠాలు బోధపరచడంలో కొంత అనుభవముంది. దాని మీద ఆసక్తి కూడా ఉంది. అందుచేత అటుప్రక్కే దృష్టి సారించేడు.
సింహాద్రి తన మార్కులు నాన్నకు చూపించేడు. పక్కనే మంగమ్మ కూడా ఉంది. ఇద్దరూ కొడుకు మార్కులు చూసి పొంగిపోయేరు. అంతలో సింహాద్రి క్లేసుమేట్లు ఇద్దరు వస్తే, అటు వెళ్ళేడు.
ఆ సమయంలో, “మంగా, పిల్లడి మార్కులు చూసేవుకదా. ఇంత మంచి మార్కులు వచ్చేయి. పరీక్షలు రాస్తే తప్పక ఇంజనీరింగులో సీటు దొరుకుతుంది. కానీ ఏం చేస్తాం. వాడు సీటు సంపాదించినా డబ్బు మనం పెట్టలేం కదా.” అని చింతించేడు.
“అలా బాధ పడకండి. భగవంతుడు వాడికేదో దారి చూపిస్తాడు.” అని భర్తకు ధైర్యం చెపుతూ ఉంటే, సింహాద్రి వచ్చేడు.
“ఎవరు నాన్నా, వచ్చేరు.” మంగమ్మ అడిగింది.
“నా క్లాసుమేట్లమ్మా. నాకెన్ని మార్కులు వచ్చాయో కనుక్కోడానికొచ్చేరు.”
శర్మ కొడుకునుద్దేశించి, “నాన్నా. కాలేజీ అయిపోయింది. తరువాత ఏమిటి చేద్దామనుకొంటున్నావ్.”
“ఏమిటి చెయ్యాలో మీరు చెప్పండి నాన్నా.”
“నాకేమీ తోచడం లేదు బాబూ. నువ్వు ఏదయినా చెయ్యదలచుకొంటే చెప్పు. మొహమాట పడకు.”
“నీకు కూడా అన్ని విషయాలు తెలుసు. నాన్నగారు చెయ్యగలిగింది తప్పక చేస్తారు. నువ్వు ఏమిటి చెయ్యదలచుకొన్నావో చెప్పు.”
“అవును నాయనా. నా చేతనయింది తప్పక చేస్తాను.”
“నాన్నా. మీకు నచ్చితే B.Sc. చేద్దామనుకొంటున్నాను. మన ఊళ్లోనే డిగ్రీ కాలేజీ ఉంది.”
“డిగ్రీతో ఆపేస్తే ప్రయోజనం ఉండదుట. నేను కనుక్కొన్నాను, బాబూ.” శర్మ సలహా.
“అవును, నాన్నా. మీరు చెప్పింది నిజమే.”
“అయితే నువ్వు ఏమిటి చేద్దామనుకొంటున్నావ్.” మంగమ్మ అరా.
“నేను తొమ్మిదో క్లాసునుండీ, క్లేసులో ఇద్దరు ముగ్గురికి తరచూ లెక్కలు బోధపరుస్తూ ఉండేవాణ్ణమ్మా. వాళ్ళెప్పుడూ నన్ను మెచ్చుకొంటూ ఉండేవారు. దానితో నాకు టీచింగు చెయ్యగలనని నమ్మకం వచ్చింది. అంచేత B.Sc. పాసయ్యేక టీచరవుదామనుకొంటున్నాను.”
“నేను ఆ విషయం కూడా కనుక్కొన్నాను బాబూ. దానికి డిగ్రీ అయ్యేక ఏదో.. మరచిపోయాను, అది చెయ్యాలిట. దాన్లో సీట్లు కూడా కష్టమేనట.” శర్మ తనకు తెలిసినది చెప్పేడు.
“మీరన్నది నిజమే నాన్నా. డిగ్రీ అయ్యేక బి.ఎడ్ చెయ్యాలి. నేను అది ఆలోచించడం లేదు.”
“మరి.” మంగమ్మ ప్రశ్న.
“B.Sc. అయ్యేక, నేను స్వయంగా ఒక ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్ పెడతానమ్మా. అందులో స్కూలు పిల్లలికి లెక్కలు, సైన్సు, బోధపరుస్తాను. నా గురించి కొంత మందికి తెలుసు. అంచేత నాకు ధైర్యం ఉంది, నా దగ్గర నేర్చుకోడానికి పిల్లలు వస్తారని. నేను పాఠాలు బాగా బోధపరుస్తానని నలుగురికీ తెలుస్తుంది. వాళ్ల పిల్లల్ని కూడా పంపిస్తారు. అది మొదలు పెట్టడానికి పెట్టుబడి ఏమీ అక్కర్లేదమ్మా. మన ఇంట్లోనే ఒక గదిలోనే ప్రారంభించగలను. నా ఉద్యోగం నా చేతుల్లోనే ఉంది. దీని కోసం ఎవరి రికమెండేషను అక్కర్లేదు. ఏ ఇంటర్వ్యూకి వెళ్లక్కరలేదు. ఎవరికీ లంచాలు ఇవ్వక్కర్లేదు. నేను చెప్పింది నచ్చితే, మీ ఇద్దరి ఆశీర్వాదాలతో మంచి రోజున నా ఇన్స్టిట్యూటు ప్రారంభిస్తాను.” అని తన నమ్మకాన్ని ధైర్యంగా చెప్పేడు, సింహాద్రి.
“నువ్వు చెప్పింది చాలా బాగుంది నాన్నా. ఏమిటి చెయ్యడమా అని సతమవుతున్నాను. నువ్వు అన్నివిధాల బాగా ఆలోచించేవ్. ఆ స్వామి దయతో నువ్వు పెట్టే స్కూలు తప్పక బాగా నడుస్తుంది.” శర్మ దీవెనలు.
“అవును నాన్నా. నీ స్కూలుకి ఆ స్వామి దీవెనలు తప్పక ఉంటాయి.” మంగమ్మ కూడా శర్మతో ఏకీభవించింది.
“నాన్నా. బి.ఎస్సీలో చేరడానికి కావలిసిన ప్రయత్నాలు చెయ్యి. డబ్బెంత కట్టాలో చెబితే నేనిస్తాను. ఆ.. ఆ నీ మార్కుల సర్టిఫికేటు ఇలా ఇయ్యి. మూర్తిగారికి చూపిస్తాను. ఆయన సంతోషిస్తారు.”
తండ్రికి మార్క్స్ సర్టిఫికెట్ ఇచ్చి, “చాలా thanks నాన్నా. నీకు కూడా thanks అమ్మా.” అని తన కోరిక నెరవేరుతున్నాదని పొంగిపోయేడు.
సింహాద్రి ఫ్రెండ్సుని కలియడానికి వెళ్లేడు.
శర్మ మూర్తిగారికి కొడుకు మార్కులు చూపించి, వాడు చేయదలచుకున్నది చెప్పేడు. ఆయన, “మీ వాడికి చాలా మంచి మార్కులొచ్చాయి. వాడికి కంగ్రాచులేషన్స్ చెప్పండి. వాడు చాలా తెలివిగా ఆలోచించేడు. దేశంలో చదువుకున్నవాళ్ల సంఖ్య ప్రతీ ఏట పెరుగుతోందండి. దాంతో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. మీవాడు చెప్పినట్టు ఎవరి ఉద్యోగం వాళ్లే సృష్టించుకోవాలి. దాన్నే self-employment అంటారు. అది తెలివిగా చేసుకోగలిగిన వాళ్ళకి సమస్య ఉండదు.” అని ఉన్న పరిస్థితిని చెబుతూ, సింహాద్రిని పొగిడేరు.
సింహాద్రి B.Sc. లో చేరేడు.
(సశేషం)
శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం నవంబరు, 1936 లో జన్మించారు. M.A. మరియు P.G. Diploma in Personnel Management పాసయ్యారు. ఉద్యోగ పర్వం, హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రారంభించి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిగా చేసి, 1994 లో విశ్రాంతి తీసుకొన్నారు. అమెరికా వాసి.
హైస్కూలు విద్యార్థిగా రంగస్థల ప్రవేశం చేసేరు. చిన్న నాటికలు రాసి, వాటిలో పాత్రలు ధరించి, దర్శకత్వం చేసేరు.
గత ఎనిమిది సంవత్సరాల నుండి రచనలు చేస్తున్నారు. ఈ నాటికి 33 కథలు, 3 నవలలు, 4 కవితలు, ఒక హాస్య నాటిక ప్రచురణమయ్యేయి.
