[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[చిట్టితల్లికి సంబంధాలు చూస్తుంటారు. అన్నపూర్ణ పురాణ కాలక్షేపం బృందంలోని సీతమ్మ గారు వచ్చి అన్నపూర్ణతో మాట్లాడుతూ ఓ సంబంధం చెబుతుంది. కుర్రాడి పేరు సత్యనారాయణ మూర్తి అనీ, డిగ్రీ చదివి, ఎల్.ఐ.సి. ఏజంటుగా విశాఖపట్టణంలో పనిచేస్తున్నాడనీ వయసు పాతికేళ్ళు ఉంటుందని చెబుతుంది. పిల్లాడి తల్లిదండ్రులు అతని బాల్యంలోనే చనిపోతే, మేనత్త అప్పలనరసమ్మ పెంచి పెద్దచేసిందనీ చెబుతుంది సీతమ్మ. అప్పలనరసమ్మ కుటుంబ వివరాలు కూడా చెబుతుంది. ఈ సంబంధం విషయం భర్త గణపతికి చెబుతుంది అన్నపూర్ణ. కూతురి అభిప్రాయం కూడా తెలుసుకున్నాక, సీతమ్మ గారి ద్వారా అప్పలనరసమ్మ గారికి కబురుపెడుతుంది. గణపతి విశాఖ వెళ్ళి నరసమ్మ గారిని కలుసుకుంటాడు. తమ కుటుంబ వివరాలు చెప్పి, పిల్లని చూసుకోడానికి రమ్మని ఆహ్వానిస్తాడు. తాను ప్రయాణాలు చేయలేనని, మూర్తి వచ్చి చూస్తాడని ఆమె చెబుతుంది. పనులు చూసుకుని ఇంటికి వచ్చిన మూర్తికి సంబంధం గురించి చెబుతుంది. మంచి రోజు చూసి చెబితే, వెళ్ళి పిల్లని చూసివస్తానంటాడు. మంగమ్మ కొడుకు, సింహాద్రి I.Sc. పాసవుతాడు. బిఎస్సీ చదివి, ట్యుటోరియల్ కాలేజీ పెట్టుకుంటానని తల్లిదండ్రులకి చెప్తాడు. వాళ్ళ ఆమోదంతో, సింహాద్రి B.Sc. లో చేరుతాడు. – ఇక చదవండి.]
శ్రీవల్లిపురం చేరుకొని, మూర్తి సీతమ్మతో బాటు చిట్టితల్లి పెళ్లి చూపులకు వెళ్ళేడు. సీతమ్మ గణపతికి, అన్నపూర్ణకు మూర్తిని పరిచయం చేసింది. మూర్తి ఆ ఇరువురికి నమస్కరించేడు. ఆ ఇరువురిని మూర్తికి పరిచయం చేసింది.
“మీ మేనత్తగారు బాగున్నారా.” అని గణపతి సంభాషణ ప్రారంభించేడు.
“బాగానే ఉందండి.” అని వినయంగా స్పందించేడు, మూర్తి.
“మీరు మా ఊరు ఇదివరలో వచ్చేరా.” అన్నపూర్ణ అడిగింది.
“లేదండీ, ఇదే మొదటి సారి. ఇహ మీదట వద్దామనుకొంటున్నాను.” చిరునవ్వుతో చమత్కరించేడు.
మిగిలిన ముగ్గురికి దాని అంతరార్థం బోధపడలేదు. సీతమ్మ ‘ఏమిటిలా మాట్లాడుతున్నాడు.’ అని విస్తుపోయి,
“తప్పక రా బాబూ.” అని పలికింది.
“Thank you. వచ్చినప్పుడు మీ సహాయమే నాకు అవసరముంటుంది.” అని సీతమ్మనుద్దేశించి అన్నాడు మూర్తి.
“నా సహాయమా.” సీతమ్మకు మరో షాక్.
“అవునండీ. మీ సహాయమే. నాకీవూరు కొత్త. మీరు ఎన్నాళ్లనుండో ఉంటున్నారు. మీ సాయంతో పరిచయాలు చేసుకొని, నా బిజినెస్ చెయ్యొచ్చు. ఏమంటారు.”
ముగ్గురూ ఊపిరి పీల్చుకున్నారు. చిరునవ్వులు చిందేయి.
“పరిచయాలు చేస్తాను. అయితే బిజినెస్ చేసి, అంతా నీకేనా. నాకేమైనా ఇస్తావా.” అని తనూ చమత్కరించింది, సీతమ్మ.
“సీతమ్మగారూ, మీకు పట్టుచీర దొరుకుతుంది. బెంగపడకండి.” అని అన్నపూర్ణ మూర్తి తరఫున హామీ ఇచ్చింది.
“Agreed. ఆవిడ చెప్పేరుకద. తప్పక ఇస్తాను. కంచిపట్టుచీర గేరెంటీ.”అని చిరునవ్వుతో తనూ హామీ ఇచ్చేడు.
నవ్వుల వర్షం కురిసింది. అన్నపూర్ణ వెళ్లి చిట్టితల్లిని తెచ్చి మూర్తికి ఎదురుగా కూర్చోబెట్టింది. చిట్టితల్లి సిగ్గుతో తలదించుకొనే ఉంది. “చిట్టితల్లీ, ఎదురుగా ఉన్నాడు పెళ్లికొడుకు. సిగ్గుపడకు. తలెత్తి చూడమ్మా.” అని సీతమ్మ చిట్టితల్లికి దగ్గరగా వెళ్లి బుజ్జగించింది. చిట్టితల్లి తలెత్తింది. పెళ్ళికొడుకు, పెళ్లికూతురు, ఒకర్నొకరు చూసుకొన్నారు.
“మీరు ఉద్యోగ రీత్యా పై ఊళ్ళకి వెళ్ళవలసి ఉంటుందనుకొంటాను.” గణపతి మూర్తితో అన్నాడు.
“వెళ్లవలసి వస్తుందండి. కాని, ఎంత లేటయినా రాత్రికి ఇంటికి వచ్చేస్తూ ఉంటాను. లేకపోతే మా అత్తకి ఇబ్బందైపోతుంది. నేను లేని టైములో మా వంటావిడ వీలయినంతసేపు మా అత్త దగ్గర ఉంటుంది. పని పిల్ల కూడా వీలయినంతసేపు అత్తకు సాయంగా ఉంటుంది. అదే కాకుండా, నాకు ఇద్దరు మంచి ఫ్రెండ్సు ఉన్నారండి. నేను లేనప్పుడు వాళ్లు వీలయినప్పుడల్లా మా అత్త ఎలా ఉందో చూసి వెళుతూ ఉంటారు.”
“అవును బాబూ. మంచి స్నేహితులు కాబట్టే, అలా సహాయంగా ఉంటారు. మనం మంచయితే లోకం మంచంటారు.” అన్నపూర్ణ లోకోక్తి చెప్పింది.
“అయితే నేను మంచివాణ్ణంటారు. Thank you, madam.” అని మరో ఛలోక్తి విసిరేడు.
“ఏం. నీకు నమ్మకం లేదా.” తనూ చమత్కరించింది, సీతమ్మ.
“నాకు నమ్మకమున్నా పెద్దవాళ్ల సర్టిఫికేట్ కావాలి కదా.”
జరుగుతున్నదంతా చూస్తూ వింటున్న చిట్టితల్లికి ముసిముసి నవ్వులు వస్తున్నాయి.
“మా బావలు కూడా ప్రతి సంవత్సరం పిల్లల స్కూలు శలవుల్లో ఫ్యామిలీస్ తో వచ్చి వారం పది రోజులు ఉంటూ ఉంటారండి.”
“మీరెప్పుడైనా మీ బావగార్ల దగ్గరకు వెళ్ళేరా.” గణపతి తెలియగోరేడు.
“చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు, మా అత్తతో అయిదారుసార్లు వెళ్లేనండి. తరువాత తరువాత, కాలేజీలో చేరేక ఒక్కమారే వెళ్లేననుకొంటాను. ఇప్పుడు ఈ పనిలో చేరేక వెళ్లడం కష్టమవుతోందండి. వెళ్లడానికి రాడానికే ప్రయాణంలో నాలుగు రోజులయిపోతుందండి. అక్కడ రెండు రోజులున్నా మొత్తం వారం రోజులయిపోతుంది. అది నాకు పనిలోనే ఇబ్బంది కాక, అత్తను వదలి అన్నాళ్లు వెళ్లడం మంచిది కాదు. పోనీ నాతో అత్తని తీసుకెళదామంటే నేను రాలేనురా బాబూ. ఆ రైళ్ళ కుదుపు భరించలేనంటుంది.”
“అవును, ఆవిడ చెప్పింది నిజమే. మేమే ఆ కుదుపుల్ని భరించలేకపోతున్నాం.” అన్నపూర్ణ మూర్తితో ఏకీభవించింది.
“మీ మేనత్తగారు, ఆవిడ వయసుకు చురుగ్గానే కనిపించేరు.” గణపతి ప్రశంస.
“మా అత్త మీరన్నట్టు బాగా ఏక్టీవుగానే ఉంటుందండి. రోజూ న్యూసుపేపరు, అంతా కాకపోయినా తనకు ఇంటరెష్టైనవి ఏవైనా ఉంటే చదువుతుందండి. (చిన్న చిరునవ్వుతో) రాజకీయాలు ఫాలో అవుతుందండి. ఆవిడ నెహ్రూను చాలా పొగుడుతుంది.” అని ఇంకా చెప్పబోతూ ఉంటే,
“ఆయన మహానుభావుడండి.” గణపతి, నరసమ్మకు ఓటు వేసేడు.
మూర్తి మళ్ళీ అందుకుని, “ఆయన ఆగర్భశ్రీమంతుడు. లండన్‌లో చదువుకున్నాడు. హాయిగా కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఉండగలిగేవాడు. అటువంటిది దేశం కోసం తన ఆస్తి కూడా ఖర్చుపెట్టి జైళ్లపాలయ్యేడు. ఇప్పుడున్నవాళ్లకి కావలసినవన్నీ పదవులు. వాటికోసం కొట్టుకు చస్తున్నారు, అని ఓ మారు పెద్ద లెక్చరిచ్చింది.” అని మేనత్త రాజకీయాలు ఎలా ఫాలో అవుతున్నాదో చెప్పేడు.
“ఆవిడ చెప్పింది నిజమేనండి. ఇప్పుడు రాజకీయాలు వ్యాపారంగా మారేయి. పదవులకోసం కొన్ని కోట్లు ఖర్చుపెట్టడం; దానికి మూడింతలు రాబట్టుకోడానికి అడ్డదార్లన్నీ తొక్కడం. అదీ వాళ్ల దేశసేవ.” గణపతి తన అభిప్రాయం చెప్పేడు.
“మనమంతా మాట్లాడుతున్నాం. మీ అమ్మాయి మాట్లాడ్డం లేదు. నా గురించిగాని, మా కుటుంబం గురించి గానీ ఇంకా ఏవైనా తెలుసుకోవాలంటే, most welcome.” అని మూర్తి చిట్టితల్లినుద్దేశించి అన్నాడు.
“అవునమ్మా, ఆయన మేనత్తగారు ఆ వివరాలన్నీ చెప్పేరు. నీకవి మీ అమ్మ చెప్పే ఉంటుంది. ఇంకా ఏవైనా తెలుసుకోవాలంటే, అడుగు.” అని గణపతి సలహా ఇచ్చేడు.
“నాకు ప్రైవేటుగా బి ఎ చెయ్యాలని ఉంది.” నెమ్మదిగా చెప్పింది.
“చెయ్యొచ్చు. No problem. అంతేనా. ఇంకా ఏవైనా అడగదలచుకొంటే, అడగండి.”
“మరేవీ లేవు.” చిరునవ్వు ముఖంతోనే ముక్తసరిగా చెప్పింది.
“మీ మేనత్తగారికి మా కుటుంబవివరాలన్నీ చెప్పేను. ఆవిడ మీకు చెప్పే ఉంటారు. మీకింకా ఏవైనా తెలుసుకోవాలంటే అడగండి.” గణపతి మూర్తినడిగేడు.
“మా అత్త అన్నీ చెప్పిందండి. తెలుసుకోవలసినవి మరేవీ లేవండి.” మూర్తి వినయంగా చెప్పేడు.
క్రొద్ది సేపటికి సభ ముగిసింది.
కొడుకు స్కూలునుండి వచ్చేక అన్నపూర్ణ పెళ్లిచూపులు విషయాలు తెలియజేసింది. వాడు నేరుగా అక్క దగ్గరకు వెళ్ళేడు. ఇద్దరూ ఏవో గుసగుసలాడుకున్నారు.
దారిలో ఆటోలో వెళుతున్నప్పుడు, సీతమ్మ, “పిల్లని చూసేవు. పెద్దవాళ్ల మాటలు కూడా విన్నావు. నీ ఉద్దేశమేమిటి.” అని మూర్తి అభిప్రాయం అడిగింది.
“అంతా మర్యాదగా మాట్లాడేరండి. అందులో ఆవిడ, పేరేమిటో మరచిపోయాను.”
“అన్నపూర్ణగారా.”
“అవునండి. ఆవిడ సరదాగా మాట్లాడారు. నాకు నచ్చింది.”
“అది సరే, పెళ్లికూతురు ఎలా ఉంది.”
“బాగానే ఉందండి. నాకు ముఖ్యంగా నచ్చిందేమిటంటే, ప్రైవేటుగా బి.ఏ. చేస్తానంది. చదువు మీద ఇంకా శ్రద్ధ ఉందన్నమాట.”
“అయితే నీకు నచ్చిందన్నమాట.”
“నచ్చిందండి.”
“నాకు సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఒకరికొకరు బాగా కుదిరేరు.”
ఆటో గమ్యస్థానం చేరుకొంది.
***
సీతమ్మ, మూర్తి, నిష్క్రమించిన తరువాత, అన్నపూర్ణ, గణపతి, సంబంధం విషయం చర్చించుకొన్నారు.
“అన్నపూర్ణా, ఏమిటి నీ అభిప్రాయం.”
“నాకు బాగా నచ్చిందండి. కుర్రాడు చలాకీగా ఉన్నాడు. కలుపుగోరుగా ఉన్నాడు. ఈ పెళ్ళిచూపులు నాకు కొత్త. పెళ్లికొడుకు పిల్లనేమిటేమిటి అడుగుతాడో అని భయంగా ఉండేది. పిల్లకి ముందుగానే చెప్పేనండి. ఏది అడిగినా ధైర్యంగా చెప్పు. తెలీనివి, తెలీదని చెప్పమ్మా, గాభరాపడకు, అని.”
“మంచిపని చేసేవ్. అబ్బాయి అమ్మాయినేమీ ఇబ్బంది పెట్టలేదు. కుటుంబం సాంప్రదాయంగా ఉంది. పెళ్లికొడుకు డిగ్రీ చేసేడు. ప్రవర్తన బాగుంది. నాకు అన్నివిధాలా నచ్చింది. అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కో.”
“దానికి నచ్చినట్టే ఉందండి. అయినా అడిగి చూస్తాను.”
“శేషాచలం గారి మనవరాలికి పెళ్లి కుదిరిందిట. ఆ విషయం మాట్లాడ్డానికి రమ్మన్నారు. వస్తాను.”అని గణపతి బయటకు వెళ్లేడు. కూతురు అభిప్రాయం తెలుసుకోడానికి అన్నపూర్ణ వెళ్లింది. చిట్టితల్లి తనకు నచ్చిందని చెప్పింది. అన్నపూర్ణ సంతోషం పట్టలేక, చిట్టితల్లిని గట్టిగా కాగలించుకొంది.
మూర్తి ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబం నచ్చిందని, పెళ్లికూతురు కూడా నచ్చిందని, మేనత్తతో చెప్పేడు. ఆవిడ సంతోషించింది. “జాగ్రత్తగా విను. నీకు సంబంధం నచ్చిందని వాళ్లకి చెప్పమని సీతమ్మకు ఇప్పుడే ఫోను చేసి చెప్తాను. తరువాత మాట మార్చడానికి వీల్లేదు.”అని మేనల్లుణ్ణి దమాయించి అడిగింది.
“ఎందుకలా భయపడుతున్నావు. నాకు తెలీదా అత్తా. నేనోమాట చెప్పేను.. అంటే.. అది మాటే. మాట మార్చే ప్రసక్తే లేదు. సీతమ్మగార్ని వాళ్లకి చెప్పమను. నాకూ, నీకూ, కూడా నచ్చిందని చెప్పు.” అని ఫోను తెచ్చి డయల్ చేసి ఇచ్చేడు.
సీతమ్మకు శుభసమాచారం అందింది. తక్షణం గణపతిగారింటికి వెళ్లి అన్నపూర్ణకు ఆ శుభవార్త సంతోషంతో చెప్పింది. “పెళ్లిచూపులయ్యేక మీ ఇంటినుండి వెళుతున్నప్పుడు నేను అతడి అభిప్రాయం అడిగేను. తనకు నచ్చిందన్నాడు. ముఖ్యంగా చిట్టితల్లి బి.ఏ. చదవాలని చెప్పిందే, అది అతడికి బాగా నచ్చింది.” అని నొక్కి చెప్పింది.
అన్నపూర్ణ అమితానందంతో, సీతమ్మ భుజాలను రెండు చేతులతోనూ పట్టుకొని ధన్యవాదాలు చెప్పుకొని, చిట్టితల్లి పెళ్లి విషయంలో శ్రమ పడి కుదిర్చినందుకు పరిపరి విధాల ప్రశంసించింది. చిట్టితల్లికి సరైన జోడీ దొరికినందుకు తనకూ సంతోషంగా ఉందంది, సీతమ్మ.
గణపతి పుట్టినరోజు సందర్భంగా చేసిన మిఠాయి తెచ్చి సీతమ్మకు ఇచ్చింది అన్నపూర్ణ. అది సేవించి, ‘చిట్టితల్లి ఇంట్లో లేదా’ అని అడిగింది. “లేదండి. తన స్నేహితురాలిని కలియడానికి వెళ్లింది.” అని అన్నాది, అన్నపూర్ణ.
“చిట్టితల్లి వస్తే, నా కంగ్రాచులేషన్లు చెప్పండి.” అని కోరింది. సీతమ్మ.
“తప్పక చెప్తానండి.”అంది, అన్నపూర్ణ.
మరునాడు వచ్చి తీరిగ్గా మాట్లాడుకొందామని చెప్పి, సీతమ్మ ఇంటికి వెళ్లింది. కొంతసేపట్లో, స్నేహితురాలి ఇంటికి వెళ్లిన చిట్టితల్లి వచ్చింది. అన్నపూర్ణ తలుపు తీస్తూనే, కాగలించుకొని శుభవార్త చెప్పి, కాంగ్రేచులేషన్సు చెబుతూ, నోట్లో మిఠాయి కుక్కింది.
“ఇందాకళే, సీతమ్మగారొచ్చి చెప్పేరు. నీకు కూడా కంగ్రాచ్యూలేషన్స్ చెప్పమన్నారు” అని, అమితోత్సాహంతో కూతురుతో బాటు లోనికి వెళ్లింది. చిట్టితల్లి తన గదిలోకి వెళ్లి తలుపు మూసుకొని పక్క మీద వాలి, ఊహాలోకాల్లో విహరించసాగింది. మరో గంటకు, గణపతి వచ్చేడు. తలుపు తీస్తూనే, భర్తకు అన్నపూర్ణ శుభవార్త ఉత్సాహంతో చెప్పింది. “సీతమ్మగారు చెప్పేరా.” అని లోపలికి వెళుతూ అడిగేడు, గణపతి.
“అవునండి, ఇందాకళ ఆవిడే స్వయంగా వచ్చి చెప్పేరు.”
“చాలా సంతోషం. అమ్మాయి, మనము, కూడా అదృష్టవంతులం.”
“అంతా, ఆ స్వామి దయ.” అని వెంకటేశ్వరుని స్మరించుకుంది, అన్నపూర్ణ.
“అమ్మాయికి చెప్పేవా.”
“ఆ.. అది రాగానే చెప్పేనండి.”
“మంచిరోజు చూసుకొని ముహూర్తం పెడతాను.” అని గణపతి భావి ప్రణాళిక ఆలోచనలో పడ్డాడు.
గణపతి, భార్యతో బాటు చిట్టితల్లి గదికి వెళ్లి అమ్మాయిని దగ్గరగా తీసుకొని, తల మీద ఆప్యాయంగా రాస్తూ, అభినందనలు చెప్పేడు. చిట్టితల్లి తల్లిదండ్రులిద్దరకు పాదాభివందనం చేసింది.
దంపతులిద్దరూ, గది వీడేరు.
చిట్టితల్లికి పెళ్లి కుదిరిందని అన్నపూర్ణ గౌరీపతి రాగానే వాడికి చెప్పింది. వాడు సంతోషంతో చిట్టితల్లి గదికెళ్లి , “చిట్టితల్లి పెళ్లికూతురాయెనే.” అని, అక్కను అల్లరిపెట్టడం మొదలుపెట్టేడు. అది వెళ్లి తల్లికి ఫిర్యాదు చేసింది. అన్నపూర్ణ, అక్కా తమ్ముళ్ల వినోదం చూస్తూ మురిసిపోయింది.
“దాన్ని అల్లరి పెట్టకురా నాన్నా.” అని ఆప్యాయంగా చెప్పింది. ఇద్దరూ మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయేరు. సరదాగా కాలక్షేపం చేసేరు.
చిట్టితల్లి తమ్ముడు, గౌరీపతి S.S.L.C. పాసయ్యేడు. వాడికి లెక్కలు తప్ప మిగిలిన అన్నింటిలోను మంచి మార్కులు వచ్చేయి. ఇంగ్లీషులో క్లాసుకు సెకండు వచ్చేడు. వాడి పై చదువు విషయం ఒకరోజు గణపతి, అన్నపూర్ణ ఆలోచిస్తున్నారు.
“చిట్టితల్లికి కట్నం లేకుండా సంబంధం కుదిరింది కదా, పిల్లడికి పెద్ద చదువు ఏదైనా చెప్పించగలమా అండి.” అన్నపూర్ణ ఆరా.
“అన్నపూర్ణా, నువ్వన్నట్టు, చిట్టితల్లికి కట్నం లేకుండా కుదరడంతో, కొంతవరకు సాగగలం. వాడి మార్కులు చూసేను. లెక్కల్లో వెనకబడి ఉన్నాడు. అయినా వాడు ఇంజనీరింగు పరీక్షల్లో నెగ్గినా, అంత పెట్టుబడి పెట్టలేం, అన్నపూర్ణా.”
“డిగ్రీ మన ఊళ్లోనే ఉందికదా. పోనీ డిగ్రీ చేయిస్తే, మన అల్లుడు చేస్తున్న ఉద్యోగం చేసుకోవచ్చుకదా.”
“మన అల్లుడు మాట్లాడుతున్నప్పుడు విన్నావు కదూ. ఎంత చలాకీగా ఉన్నాడో చూసేవ్.”
“అవునండి. చాలా తెలివితేటలుగా మాట్లాడేడు.”
“హాస్యంగా మాట్లాడినా సున్నితంగా మాట్లాడేడు. ఆ చలాకీతనం అందరికీ రాదు.”
“పోనీ, వాణ్ణి అడిగి చూసేదేమిటి, వాడా ఉద్యోగం చెయ్యగలడేమో.”
“అసలు, వాడు ఏమిటి చేద్దామనుకొంటున్నాడో మనకు తెలిస్తే, మనం ఆలోచించొచ్చు.”
సంభాషణ ముగిసింది.
ఓ ఆదివారం ఉదయం, గణపతి, “వాణ్ణి ఓ మారు ఇలా రమ్మని చెప్పు.”అని అన్నపూర్ణతో చెప్పేడు. గౌరీపతి తండ్రి ఎదుట హాజరయ్యేడు. అన్నపూర్ణ కూడా అక్కడే ఉంది.
గణపతి, “నీకు స్కూలు చదువయింది. తరువాత ఏమిటి చేద్దామనుకొంటున్నావ్.” అని కొడుకును అడిగి సంభాషణ ప్రారంభించేడు.
“నేను ఇంటర్మీడియట్లో కామర్సు చేసి, B.Com. డిగ్రీ చేద్దామనుకొంటున్నాను, నాన్నగారూ.”
“బాబూ, డిగ్రీతో ఉద్యోగాలు దొరకడం కష్టమంటున్నారు.” అన్నపూర్ణ అడిగింది.
“అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే.”
“డిగ్రీ తరువాత మీ బావ మూర్తి చేస్తున్న పని చేస్తావా.” గణపతి ఆరా.
“నేనది చెయ్యలేను నాన్నగారూ. నాకది చేతకాదు.”
“అయితే ఆ డిగ్రీ తరువాత ఏమిటి చేద్దామనుకొంటున్నావ్.” గణపతి ప్రశ్న.
“బి. కామ్. పాసయ్యేక బేంకు పరీక్షలు రాద్దామనుకొంటున్నాను, నాన్నగారూ.”
“అవేమిటో నాకు తెలీదు. ఎవరినేనా కనుక్కున్నావా.” గణపతి మీమాంస.
“మా స్కూలుకి ఓ డాక్టరుగారు, ఇంజినీరుగారు, లాయరుగారు వచ్చి, ఆ పనులు చేయడానికి ఏమిటి చదవాలో, ఏ పరీక్షలు రాయాలో, వాటి గురించి బోధపరిచేరండి. అలాగే మన ఊళ్లో బేంకు మేనేజరుగారు వచ్చి, బేంకులో ఉద్యోగాలకి ఏది చదవాలో, ఏ పరీక్ష రాయాలో దాని గురించి చెప్పేరు. ఏ డిగ్రీ అయినా పాసయితే చాలట, బేంకు పరీక్షలు రాయడానికి. ఆ డిగ్రీతో క్లర్కు పరీక్షలు గాని, ఆఫీసరు పరీక్షలు గాని, అన్ని బేంకులవి రాయొచ్చన్నారు. బేంకులో క్లర్కుగా చేరినా, మేనేజరు, ఇంకా పెద్ద పోస్ట్‌లకి వెళ్లొచ్చు అని చెప్పేరు. ఆయన వాళ్ల బేంకులో క్లర్కుగానే జాయినయ్యేరట.”
“అదంతా బాగుంది గాని వాటి పరీక్షల్లో లెక్కల పరీక్షలుండవా.” గణపతి ప్రశ్న.
“ఇంజనీరింగు వాటిలాగ లెక్కల పరీక్షలుండవు, నాన్నగారు.”
“అలాగా. ఎందుకేనా మంచిది. నేను కూడా ఎవరినేనా తెలిసిన వాళ్లని కనుక్కొంటాను. సరే, నువ్వు వెళ్ళు.” అన్నాడు, గణపతి.
గౌరీపతి నిష్క్రమించేక, “ఏమండీ, ఫరవాలేదంటారా. ఏమిటో, దాని గురుంచి నాకు ఏమీ తెలీదు.”అని అన్నపూర్ణ భర్తనడిగింది.
“ఇంకా టైము ఉందిగా. నాకూ వివరాలేమీ తెలీదు, అన్నపూర్ణా. వాడు కూడా బాగా ఆలోచించినట్టున్నాడు. చదువులో వాడి లోతుపాతులు వాడికి బాగా తెలిసినట్టుంది. అందుకే, లెక్కలు బాగా రావని, ఇంజనీరింగు పరీక్షలు రాస్తాననడంలేదు. బేంకుల్లో ఉద్యోగాలంటే మంచిమాటే. అయినా నేనూ నలుగురినీ కనుక్కొంటాను. ఆలోచించి ఏదైనా చేద్దాం.”అని గణపతి, సంభాషణకు తెర దించేడు.
చిట్టితల్లికి పెళ్లి కుదురిందని, పెళ్లికొడుకు వివరాలన్నీ తెలియజేస్తూ, గణపతి శర్మకు ఉత్తరం రాసేడు. మంగమ్మకు కూడా తెలియబరచమన్నాడు. అది తెలిసి దంపతులిద్దరూ సంతోషించేరు. తమ సంతోషాన్ని తెలియబరుస్తూ, అవసరమయితే మంగమ్మను పెళ్లికి ముందుగా పంపిస్తానని శర్మ జబాబిచ్చేడు. గణపతి పెళ్లికి సుముహూర్తం పెట్టేడు. విశాఖపట్నంలోని నరసమ్మగారికి ఆది తెలియబరిచి, పెళ్లికి సకుటుంబంగా రమ్మని ఆహ్వానించేడు. బంధువులందరకు శుభలేఖలు పంపించేడు. నరసమ్మ, ఇద్దరు కొడుకులకు ఫోను చేసి సకుటుంబంగా వీలైనంత ముందుగా రమ్మనమని చెప్పింది. పెద్ద కోడలు రెండు వారాలు ముందుగా వచ్చి, పెళ్లికి ఏర్పాట్లన్నీ అత్తగారి సలహాతో మొదలుపెట్టింది. పెళ్లికి నాలుగు రోజులు ముందుగా ఇద్దరు మగపిల్లలూ సకుటుంబంగా చేరుకున్నారు. ఇద్దరు బావలూ మూర్తిని ఆటపట్టిస్తున్నారు. మూర్తి కూడా తీసిపోలేదు. అలా ఉన్న ఇంటి సందడి నరసమ్మకు చూడ ముచ్చటేసింది. తన సంతతిని, ముఖ్యంగా మనవలను చూసి నరసమ్మ ఆనందంగా ఉంది. మనవలతో కబుర్లాడుతోంది.
ఆడపెళ్లివారి ఇంట వివాహ ప్రయత్నాలు జోరందుకొన్నాయి. మంగమ్మ పది రోజులు ముందుగా రావడంతో అన్నపూర్ణకు పని కొంత తేలిక పడింది. సీతమ్మతోబాటు, ఇదివరకు పురాణ కాలక్షేపంలో పాల్గొన్న ఇద్దరు ముగ్గురు, వీలయినప్పుడల్లా వచ్చి అన్నపూర్ణకు తోడ్పడుతున్నారు. పెళ్లి సన్నాహాలన్నీ దాదాపుగా పూర్తయ్యేయి. పెళ్లికి మగపెళ్లివారు తరలి వచ్చేరు. కోడళ్లు, మేనల్లుడితో నరసమ్మ టేక్సీలో వచ్చింది. మంగళ వాయిద్యాలతో పెళ్లి శాస్త్రోక్తంగా జరిగింది. ఇరుప్రక్కలవారూ పెళ్లి సరదాగా జరుపుకొన్నారు. శర్మ పెళ్లయిన వెంటనే వెనుదిరిగేడు. మంగమ్మను మరో వారం ఉండి రమ్మన్నాడు.
(సశేషం)
శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం నవంబరు, 1936 లో జన్మించారు. M.A. మరియు P.G. Diploma in Personnel Management పాసయ్యారు. ఉద్యోగ పర్వం, హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రారంభించి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిగా చేసి, 1994 లో విశ్రాంతి తీసుకొన్నారు. అమెరికా వాసి.
హైస్కూలు విద్యార్థిగా రంగస్థల ప్రవేశం చేసేరు. చిన్న నాటికలు రాసి, వాటిలో పాత్రలు ధరించి, దర్శకత్వం చేసేరు.
గత ఎనిమిది సంవత్సరాల నుండి రచనలు చేస్తున్నారు. ఈ నాటికి 33 కథలు, 3 నవలలు, 4 కవితలు, ఒక హాస్య నాటిక ప్రచురణమయ్యేయి.
