[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పునరావృతం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[శ్రీవల్లిపురం చేరుకొని, మూర్తి సీతమ్మతో బాటు చిట్టితల్లిని చూడ్డానికి పెళ్ళిచూపులకి వెళ్తాడు. గణపతి, అన్నపూర్ణ మూర్తితో అన్ని వివరాలు మాట్లాడుతారు. చిట్టితల్లికీ, మూర్తికీ ఒకరికొకరు నచ్చుతారు. ఆటోలో తమ ఇంటికి వెళ్తూ, సీతమ్మ మూర్తిని అడిగితే, అమ్మాయి తనకి నచ్చిందని చెప్తాడు. వాళ్ళు వెళ్ళాక, తల్లిదండ్రులు అడిగితే, చిట్టితల్లి కూడా అబ్బాయి నచ్చాడని చెబుతుంది. సీతమ్మ గారి ద్వారా మూర్తి సంబంధానికి ఆమోదం తెల్పుతాడు. మంచిరోజు చూసి ముహూర్తం పెడతాడు గణపతి. అక్కకి పెళ్ళి కుదిరినందుకు గౌరీపతి సంతోషిస్తాడు. గౌరీపతి చదువుల గురించి తల్లిదండ్రులు చర్చించుకుంటారు. ఓ రోజు గౌరీపతిని పిలిచి, భవిష్యత్తులో ఏం చేద్దామనుకుంటున్నావని అడుగుతారు. డిగ్రీ పాసయ్యాకా, బ్యాంక్ పరీక్షలు రాస్తానంటాడు గౌరీపతి. అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని ఏర్పాట్లు చేసుకోమంటారు. చిట్టితల్లి పెళ్ళికి ముహూర్తం పెడతాడు గణపతి. బంధువులకు శుభలేఖలు పంపిస్తాడు. మగపెళ్ళివారింట, ఆడపెళ్ళివారింట వివాహం పనులు జోరుగా సాగుతాయి. మంగళ వాయిద్యాలతో పెళ్లి శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఇరుప్రక్కలవారూ పెళ్లి సరదాగా జరుపుకుంటారు. – ఇక చదవండి.]
చిట్టితల్లి అత్తవారింట అడుగు పెట్టింది. అన్నపూర్ణ మరీ మరీ చెప్పడంతో, ఏనాళ్లకు సీతమ్మ కూడా వచ్చింది. నరసమ్మ సలహాలతో, ఇద్దరు కొడుకులు, కోడళ్లు, ఏనాళ్లకు ఏర్పాట్లన్నీ చేసేరు. పద్దతిగా ఏనాళ్ళు జరిగేయి. మూర్తి, ఆ మరునాటికి దసపల్లా హోటల్లో రిసెప్షనకు ఏర్పాట్లు చేసేడు. చిన్నబావ అది చూసుకొంటున్నాడు. మూర్తి తన కస్టమర్లనే కాక, మరికొందరు తెలిసిన వాళ్లను కూడా ఆహ్వానించేడు. చిట్టితల్లికి రిసెప్షన్ విషయం ముందుగా చెప్పేడు. చిట్టితల్లి తను ఎప్పుడూ అటువంటివి చూడలేదంది. మూర్తి పద్ధతులన్నీ చెప్పి, వచ్చిన గెస్ట్‌లను తనతోబాటు రిసీవు చేసుకోవాలని చెప్పేడు. వచ్చే వాళ్లందరూ తెలుగువాళ్లే. అంచేత వాళ్లతో తెలుగులోనే మాట్లాడొచ్చు అన్నాడు.
“ఫరవాలేదు లెండి. అవసరమయితే, వాళ్లతో నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగలను.” అని చిట్టితల్లి అనడంతో, “తెలుగువాళ్లే కనక తెలుగులో మాట్లాడొచ్చన్నాను. అంతే కాని నీకు ఇంగ్లీష్ రాదని కాదు. నీ ఫీలింగ్స్ హర్టయి ఉంటే, I am sorry.” అని మూర్తి చిట్టితల్లి చెయ్యి పట్టుకొని చెప్పుకొన్నాడు.
“అయ్యో, మీరు సారీ చెప్పడం దేనికి. నా ఫీలింగ్స్ ఏమీ హర్ట్ కాలేదు. ఎవరయినా ఇంగ్లీష్‌లో మాట్లాడినా మేనేజ్ చెయ్యగలనని చెప్పేను, అంతే.” అని చిట్టితల్లి మూర్తిని శాంతబరచింది.
వచ్చిన గెస్టులందరకు మూర్తి ఆ మరునాటి రిసెప్షన్ వివరాలు తెలియబరిచేడు.
చిట్టితల్లికి, తన తల్లిదండ్రులకు రిసెప్షన్సులో పూర్వానుభవం లేదని తెలుసు. వారికి దాని విషయం చెప్పింది.
“తల్లీ, రేపు అంతా పెద్దవాళ్లు వస్తున్నారు కాబోసు. నువ్వు ఆ నెమలికంఠం రంగు పట్టుచీర కట్టుకో అమ్మా. బాగుంటుంది.” అన్నపూర్ణ సలహా.
“అమ్మా, మీ అల్లుడు రేపు సూటు వేసుకొంటారట. దానికి మేచింగు పట్టుచీర కొన్నారట. అది కట్టుకోమన్నారు.”
“మరేమ్, బాగానే ఉంది. అదే కట్టుకో అమ్మా.”
“అమ్మా, నువ్వు ఏ చీర కట్టుకొంటావ్.”
“ఏదీ, ఇప్పుడే కదా తెలిసింది. ఇంకా ఏదీ అనుకోలేదమ్మా.”
“పెళ్లికి కొనుక్కొన్నావు, గంధం రంగు పట్టుచీర, అది కట్టుకో అమ్మా, బాగుంటుంది.”
“నువ్వు చెప్పేవు కదా, అదే కట్టుకొంటాను.”
అంతలో ఎవరో తన్ను చూడడానికి వచ్చేరని తెలిసి చిట్టితల్లి అటు వెళ్లింది.
సీతమ్మ, “చూసేరా, అన్నపూర్ణగారు, ఒక్క రోజులో, చిట్టితల్లి పట్నవాసి అయిపోయింది.” అని, చమత్కరించింది.
“సీతమ్మగారూ, రోజులు ఎలా మారేయో, చూడండి. పెళ్లిళ్లకి వాటికి వెళ్లేటప్పుడు, మనం ఓ జరీచీరో, పట్టుచీరో, ఏదో ఒకటి చుట్టపెట్టుకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు మేచింగులు వచ్చేయి. చీరకి జాకెట్లు మేచింగులు వచ్చేయి. మొగుడు బట్టలికి పెళ్లాం బట్టలు మేచింగుట.”
“అయ్యో, అదే కాదండి, అన్నపూర్ణగారూ, ఓ మారు నేను ఎక్కడకో వెళ్లడానికి చీర కట్టుకుంటే, ఏమిటమ్మమ్మా, ఇలా కట్టుకున్నావ్. అని మా మనవరాలు నవ్వుతూ, నా పైటకొంగును ఏదో కొలబద్దతో పెట్టినట్టు మడతలు పెట్టి, అవి కదలకుండా, బయిటకు కనపడకుండా పిన్నులు పెట్టి, ముస్తాబు చేసింది. తల్లీ, అయిపోయిందా, ఇంకా ఏమైనా ఉందా, అని అడిగితే, ‘అమ్మమ్మా, ఈ చీరలతో ఇదే ప్రోబ్లెం. అర్జంటుగా వెళ్లాలన్నా అవ్వదు. నేనొకటి చెప్పేదా నీకు’ అని ఏదో చెప్పబోయింది. ఏమిటది, అని అడిగితే, ‘హాయిగా నాలాగ పేంట్లు వేసేసుకో. నిమిషాల మీద తయారయిపోతావు. మోడెర్నుగా ఉంటావు’ అంది. అక్కడతో ఆపు తల్లీ. వింటూ ఉంటే, నీలాగ నిక్కర్లు కూడా వేసుకోమంటావ్, అని దాని చెవి నులిపితే, తప్పించుకు పారిపోయింది.”
“రోజులు మారుతున్నాయండి, సీతమ్మగారూ. ఇంకా ఎలా మారుతాయో తెలీదు,” అని సంభాషణకు అన్నపూర్ణ స్వస్తి పలికింది.
ఆ మరునాడు రిసెప్షనుకు నరసమ్మతో బాటు అందరూ తరలి వెళ్లేరు. అతిథుల రాక ప్రారంభమయింది. మూర్తి, చిట్టితల్లి, వారిని సాదరంగా పలకరిస్తున్నారు. వచ్చిన కొందరు ఆడవాళ్లతో, చిట్టితల్లి నిర్భయంగా మాట్లాడుతోంది. అది చూసి అన్నపూర్ణ, గణపతి, మురిసిపోతున్నారు. జీవితంలో వారికది తొలి అనుభవం. సూటు వేసుకుని, ఊరి పెద్దలతో కలసి మాట్లాడే అల్లుడు, తమకు ఊహాలోకంలో కూడా ఎప్పుడూ లేడు. చిట్టితల్లి అదృష్టవంతురాలనుకొన్నారు. నరసమ్మ కూడా తను పెంచి పెద్దచేసిన మేనల్లుడు ఒక ఇంటివాడయ్యేడని, వాడికి తగిన జోడీ దొరికిందని సంతోషించింది. చిట్టితల్లికి తగిన జోడీ కుదిరిందని, అన్నా వదినలను మంగమ్మ అభినందించింది. సుమారుగా అతిథులందరూ విచ్చేసేరు. భోజనాలు ప్రారంభమయ్యేయి. మూర్తి, చిట్టితల్లి, వేరువేరుగా, అతిథులను వంటకాలు ఎలా ఉన్నాయి, అని అడిగి తెలుసుకొంటున్నారు. వారిలో ఒకావిడ, వంటకాలు చాలా బాగున్నాయని చిట్టితల్లికి హిందీలో సమాధానం చెప్పింది. ఆవిడకు చిట్టితల్లి, హిందీలో ధన్యవాదాలు చెప్పింది. ఆవిడ సంభాషణ పొడిగించి, చిట్టితల్లిని, మీ ఊరేది, మీరిదివరకు విశాఖపట్నం వచ్చేరా, అని హిందీలో అడిగింది. వాటి సమాధానాలు చిట్టితల్లి హిందీలో చెప్పి, ఆవిణ్ణి మీ ఊరేది, మీరీ ఊళ్లో ఎన్నాళ్లబట్టి ఉంటున్నారు, అని హిందీలో అడిగి తెలుసుకుంది. అది గమనించిన మూర్తి ఆశ్చర్యపోయేడు. మేనత్తకు, అత్తమామలకు, అందరు బంధువులకు భోజనం సరిగ్గా అందిందో లేదో కనుక్కోడానికి అటు వెళ్ళేడు. బావలిద్దరూ, ఆ విషయం తాము చూసుకొంటున్నామని చెప్పి, వచ్చిన అతిథులను చూసుకోమని మూర్తికి సలహా ఇచ్చేరు. మూర్తి అత్తగారి వద్దకు వెళ్లి, “చిట్టితల్లి, హిందీ చాలా బాగా మాట్లాడుతున్నాదండీ. ఒకావిడతో హిందీలో మాట్లాడుతూంటే విన్నాను. నాకు హిందీ అస్సలు రాదు.”అని తన ఆశ్చర్యాన్ని తెలియజేస్తూ, చిట్టితల్లిని పొగిడేడు. “చిట్టితల్లి, హిందీలో మూడు పరీక్షలు పాసయింది బాబూ. ఏదో ఒకదాన్లో, నాకు సమంగా జ్ఞాపకం లేదు, అందులో మన సౌత్ ఇండియాకి ఫస్టు వచ్చింది.” అని చెప్పింది.
“సౌత్ ఇండియాకే ఫస్టా. గ్రేట్. అయితే ట్యూషన్ ఫీజ్ లేకుండా నాకు హిందీ టీచరు దొరికిందన్నమాట.” అని చిరునవ్వుతో చమత్కిరించేడు, మూర్తి.
“చిట్టితల్లి ట్యూషను ఫీజు పుచ్చుకొంటుందో లేదో, అడిగి చూడు. ఫ్రీగా కొట్టేద్దామని చూడకు.” అని, సీతమ్మ కూడా చమత్కరించింది.
“అయ్యొబాబోయ్, మీరో ట్విస్ట్ పెట్టేరు. చిట్టితల్లి మిమ్మల్ని కలియడానికి ముందే నేను వెళ్లి నాకు హిందీ నేర్పమని రిక్వెస్టు చేస్తాను.” అని తొందరగా అతిథుల వద్దకు వెళ్ళేడు.
“వదినా, మీ అల్లుడు గొప్ప చమత్కారి. ఎప్పుడూ సరదాగా ఉంటాడు.” అని మంగమ్మ మూర్తిని మెచ్చుకుంది.
“అలా మాట్లాడగలడు కాబట్టే పనిలో రాణిస్తున్నాడమ్మా.” అని గణపతి, అల్లుణ్ణి పొగిడేడు.
రిసెప్షన్ ముగిసింది.
శ్రీవల్లిపురం నుండి వచ్చిన ఆడపెళ్లివారు వెనుదిరిగేరు. తల్లిదండ్రులిద్దరూ వెళ్లడంతో చిట్టితల్లి మనసులో ఏదో లోటు చోటు చేసుకుంది. అది గ్రహించిన మూర్తి, చిట్టితల్లితోనే ఉంటూ, ఏవో కబుర్లు చెబుతూ మనసు తిప్పే ప్రయత్నాలు చేస్తున్నాడు. నరసమ్మ కూడా చిట్టితల్లి మనసును పోల్చుకొని, “ఒరే, సత్యం, పార్వతిని ఓ మారు బీచివైపు తీసుకెళ్లు. దానికి మార్పు ఉంటుంది.”అని మేనల్లునికి సలహా ఇచ్చింది. సాయంత్రం మూర్తి, “చిట్టీ, పద బీచికి వెళదాం.” అనగానే,
“ఉండండి, దొడ్డమ్మగారికి చెప్పి వస్తాను.” అంది, చిట్టితల్లి.
“దొడ్డమ్మగారెవరు.” అని ఆశ్చర్యంగా అడిగేడు, మూర్తి.
“అదేమిటండీ, అలా అడుగుతున్నారు. మీ మేనత్తగారండి.”
“నా మేనత్త నీకు దొడ్డమ్మవుతుందా.”మూర్తి సంశయం.
చిట్టితల్లి మూర్తికి ఆ సంబంధం బోధపరిచింది. దొడ్డమ్మగారితో బీచికి వెళుతున్నామని చెప్పి బయలుదేరింది. దంపతులిద్దరూ విశాఖపట్నం బీచి చేరుకున్నారు. చిట్టితల్లి విశాఖపట్నం బీచి చూసి ముగ్ధురాలయింది. ఆ రోజు శెలవు దినం. అందువల్ల జనసందోహంతో బీచి కిటకిటలాడుతూ ఉంది. యువత కొందరు సముద్రపు అలలకు ఎదురుగా నీటిలో నాలుగడుగులు ముందుకు వేసి, అవి వారి పాదాల క్రింద నున్న ఇసుకను కోరేస్తూ ఉంటే ఆనందిస్తున్నారు. ఒడ్డునే ఉన్న వారి పెద్దలు ఆందోళనతో వారిని వెనక్కు తగ్గమని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఒడ్డునే ఉన్న అమ్మవారి గుడిలో గల కాళికాదేవికి పాదాభివందనం చేయడానికి సముద్రుడు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. మన నూతన దంపతులిద్దరూ అమ్మవారి దర్శనం చేసుకొని, బీచి ఒక చివరనుండి మరో చివరకు కబుర్లు చెప్పుకొంటూ నడుస్తున్నారు.
“ఆ రోజుల్లో ఉన్న విశాఖపట్నం బీచి గురించి, శ్రీశ్రీ ఏమన్నాడో తెలుసా.”
“ఏమిటన్నాడండి.”
“విశాఖపట్నం బీచ్. దీన్ని బీచ్ అన్నవాళ్లు, ఎవరి పాపాన్న వాళ్లు పోతారు. అని రాసేట్ట. ఇప్పుడుంటే, ఎంత పొగిడేవాడో.”
అలా కబుర్లు చెప్పుకొంటూ ఇద్దరూ నీటి అలలకు దూరంగా ఒక చోట ఇసకమీద ఆశీనులయ్యేరు. పానీపూరీలమ్మే అబ్బాయి ఆశతో వారి దరి చేరేడు. దంపతులిద్దరూ పానీపూరీలు ఆరగించేరు. చిట్టితల్లికి అవి నచ్చేయి.
“నేనెప్పుడో ఓ మారు మా ఊళ్లో అమ్మవారి పండుగులప్పుడు తిన్నానండి. ఎలా ఉండేవో జ్ఞాపకం లేదు. కాని ఇవి చాలా బాగున్నాయి.”అని పానీపూరీలను మెచ్చుకొంది.
“అలాగా, నీకు నచ్చితే రోజూ వచ్చి తిందాం.”
“రోజూ అక్కర్లేదండి. రోజూ తింటే బోరు కొడుతుంది.”
“చిట్టీ, అయితే ఐస్‌క్రీమ్ తిందామా.” అని మూర్తి అడిగేడు.
“పానీపూరీలు ఏడో ఎనిమిదో తినీసేను. కడుపులో ఖాళీ లేదండి. మరోమాటు వచ్చినప్పుడు తిందాం.”
“పోనీ ఒకటి తీసుకుని ఇద్దరం షేరు చేసుకొందాం.”
“అందరూ చూస్తారు. బాగుండదండి.”
“ఏం ఫరవాలేదు. చాలామంది అలాగే తింటూ వుంటారు.” అని నచ్చచెప్పి, దగ్గరలో ఉన్న ఐస్‌క్రీం కుర్రాణ్ణి రమ్మన్నాడు. చిట్టితల్లి ఎవరైనా చూస్తున్నారేమో అని బెరుకు బెరుకుగా అటూ ఇటూ చూస్తూ భర్తతో షేర్ చేస్తూ తినడం ప్రారంభించింది. అలా షేర్ చేసుకు తినడంలో మజా అనుభవిస్తోంది. చిట్టితల్లికి భర్త అనురాగం, నరసమ్మ ఆదరాభిమానాలతో తల్లిదండ్రులకు దూరమయ్యేనన్న చింత తగ్గసాగింది.
***
ఒకరోజు, నూతన దంపతులు, భీమునిపట్నం బీచ్‌లో సరదాగా గడిపి ఇల్లు చేరుకున్నారు. టేబిలు మీద రెండు ఏపిల్స్ చూసి, “అత్తా, ఇంటికి ఎవరైనా వచ్చేరేమిటి.” అని అడిగేడు, మూర్తి.
“మన పక్క వీధిలో ఉంటారు; రాజేశ్వరమ్మగారు, వాళ్ల మనవడికి మూడు రోజుల క్రిందట పెళ్లి అయిందిట. వాణ్ణి, పెళ్ళాన్ని మన ఇంటికి తీసుకొచ్చింది ఆవిడ, ఆశీర్వదించమని. ఆవిడ ఇచ్చింది, ఆ ఏపిల్ పళ్లు. పిల్ల లక్షణంగా ఉంది. ఆ కుర్రాడు, పెళ్ళాం, ఎల్లుండి బెంగుళూరు, బృందావనం వెళుతున్నారట. అక్కడ వారం రోజులుండి వస్తారట. గొప్పగా చెప్పింది.” అని, నరసమ్మ చెప్పింది.
“అత్తా, వాళ్లు హానీమూన్ వెళుతున్నారన్నమాట. బృందావనం కాదు. బృందావన్ గార్డెన్స్ అత్తా. అక్కడ సినిమా షూటింగులు కూడా అవుతూ ఉంటాయి. అందుకు.. అంత గొప్పగా చెప్పింది.”
“సరే, వాళ్ల మాట అలా ఉండనీ. మీరు ఎప్పుడూ ఈ ఊరి బీచిలకే వెళుతున్నారు. మీరు కూడా ఓ మారు ఆ ఊళ్లకి వెళ్లి సరదాగా గడపొచ్చుగా.” అని మేనల్లుడికి సలహా ఇచ్చింది.
“చెప్పేవు కదా, అత్తా. మేము కూడా ఆలోచించి ఎక్కడికైనా వెళతాం.”
“వచ్చే నెల పెద్దవాడు కుటుంబంతో వచ్చి రెండు వారాలు ఉంటున్నాడు కదా. అప్పుడు వెళ్లడానికి ప్రయత్నాలు చెయ్యి.” అని మేనల్లుడికి గట్టిగా చెప్పి, “అమ్మా, నువ్వు వాడికి ఆ విషయం జ్ఞాపకం చేస్తూ ఉండు. లేకపోతే, నీకు ఈ ఊరి బీచిలే చూపిస్తూ ఉంటాడు.” అని చిట్టితల్లికి సలహా ఇచ్చింది.
నిజానికి మూర్తికి చిట్టితల్లితో హానీమూనుకు వెళ్లాలని సరదా ఉన్నాది. కాని అన్ని రోజులు అత్తను ఒంటరిగా ఉంచి వెళ్లడం ఇష్టపడలేదు. బావలు వచ్చినప్పుడు తను లేకపోతే బాగుండదేమో అని, ఆ ప్రయత్నం చెయ్యలేదు. చిట్టితల్లికి ఆ విషయం ఇదివరలో చెప్పేడు. చిట్టితల్లి, మూర్తితో పూర్తిగా ఏకీభవించింది.
రాత్రి దంపతులిద్దరూ పెద్దావిడ చెప్పిన విషయం ఆలోచించేరు.
మూర్తి, “చిట్టీ, నీకు ఎక్కడికి వెళ్లాలని ఉంది.” అని అడిగేడు.
“నాకేమీ ఐడియా లేదండి. మీరే ఏదో డిసైడ్ చెయ్యండి.”
“మనం వెళ్లేది సమ్మరు. చల్లగా ఉండే ప్లేసెస్‌కి వెళితే ఎంజాయ్ చెయ్యగలం, అనుకొంటాను.”
“అది నిజమేనండీ. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. వైజాగ్‌లో ఎప్పుడూ చమట్లే. చల్లటి ఊళ్లయితే బాగుంటుంది.”
“బృందావన్ గార్డెన్స్ – నాకేమిటో అంత ఇంటరెస్టింగ్‌గా అనిపించడం లేదు. సినిమాల్లో చూస్తున్నాంగా.”
“అయితే, మరెక్కడికి వెళదామంటారు.”
“కలకత్తా వైపు ఏవైనా ఉంటాయేమో, గాని, నాకు ఐడియా లేదు.”
“కలకత్తా వైపు, అంటే, మీ బావలకి తెలుస్తుందేమో.”
“గుడ్. మంచి ఐడియా ఇచ్చేవ్. రేపు మా పెద్దబావని అడిగి చూస్తాను.”అని చెప్పి చిట్టితల్లిని దగ్గరగా కౌగలించుకొని చెవిలో ఏదో చెప్పేడు. ఫలితం. చిట్టితల్లి మూర్తికి తీపిగా మొట్టికాయ పెట్టింది. ఇద్దరూ సరససల్లాపాలలో మునిగి తేలేరు.
మరునాడు, పెద్దబావ చలపతికి మూర్తి ఫోన్ చేసి విషయం చెప్పేడు. చలపతి, కలకత్తాకి దగ్గరలో బర్ధమాన్ జంక్షనులో స్టేషన్ మాస్టరుగా ఉన్నడు. ఏవో చాలా ప్లేసెస్ ఉన్నాయి గాని, వాటిలో ఏది బెటరో, కనుక్కుని ఫోన్ చేస్తానన్నాడు. తమ్ముడు కూడా కలకత్తాకి దగ్గరలోనే షాలీమార్ స్టేషన్ లో ఎస్,ఎం. గా ఉన్నాడని, వాణ్ణి కూడా కనుక్కొంటానన్నాడు. వివరాలన్నీ కనుక్కొని, మూడు నాలుగు రోజుల్లో ఫోన్ చేస్తానన్నాడు.
ఇద్దరి అన్నదమ్ముల ఆలోచనలతో, మన నూతన దంపతుల హానీమూన్ ప్రోగ్రేము నిర్ణయమయింది. వాళ్లు డార్జిలింగు, గ్యాంగ్టాక్ సందర్శిడానికి నిర్ణయమయింది. ఆ రెండు నగరాల్లో వారిద్దరూ ఉండడానికి కూడా ఆలోచిస్తున్నారు. చలపతి మూర్తికి ఫోన్ చేసి, “మూర్తీ, మీ హనీమూన్‌కి రెండు బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి డార్జిలింగు. అది మా వెస్ట్ బెంగాల్ లోనే హిమాలయా పర్వతాల దగ్గరలో ఉంది. డార్జిలింగు మీరు బాగా ఎంజాయ్ చేస్తారుట. అక్కడనుండి ఫేమస్ కాంచెంజెంగా మీకు అద్భుతంగా కనిపిస్తుందిట. అది ఇండియాలో హైఎస్ట్ మౌంటెన్. ఆ ఊళ్లో చూడవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయట. అన్నట్టు, డార్జిలింగు వెళ్లడానికి న్యూ జల్పైగురీ నుండి ఒక స్పెషల్ ట్రైన్ ఉంది. టోయ్ ట్రైన్ అంటారు. అది డార్జిలింగు ఊళ్లోంచి వెళుతుంది. అది కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ ట్రైను ఘుమ్ అనే స్టేషన్ మీంచి వెళుతుంది. అది వరల్డ్స్ హైఎస్ట్ రైల్వే స్టేషన్. డార్జిలింగు నుండి గ్యాంగ్టాక్ తొంభై మైళ్ళు. ఆ ఊరికి ట్రైన్ కనెక్షన్ లేదు. టేక్సీ లో వెళ్లాలి. గ్యాంగ్టాక్, సిక్కిం కేపిటల్. అది 14,500 ఫీట్ హైటులో ఉంది. అక్కడ చూడవలసిన వాట్లో నాథులా పాస్ ఒకటి. అది చైనాకి కనెక్ట్ చేస్తుందట. అది వరల్డ్స్ హైస్ట్ మోటారుబుల్ రోడ్డట. ఇంకా ఏవో ఉన్నాయట. మీ ఇద్దరికీ వైజాగ్ నుండి హౌరాకి రానూ పోనూ టిక్కెట్లు రిజర్వ్ చేసుకో. ఆ డేట్లు తెలిసేక మీకు మిగతా ట్రేవలంతా మేం చూసుకొంటాం. మొత్తం ట్రిప్ రెండు వారాలకి ప్లాన్ చేస్తే సరిపోతుందా. కన్ఫర్మ్ చెయ్యి. మర్చిపోయేను. హెవీ ఉలెన్స్ పట్టుకోండి. రాత్రి తీరిగ్గా అమ్మతో మాట్లాడతానని చెప్పు.”
“చాలా thanks బావా.”
“Thanks తో సరిపెట్టీకు. నీకు తెలుసుగా నేను ఎవరికీ ఫ్రీ సర్వీస్ చెయ్యను.”
“నా డయలాగ్ కాపీ కొట్టేవ్ బావా. ఫరవాలేదు. నీ ఫీజ్ నీకిస్తాను.”
ఆ సంభాషణ ముగిసింది.
***
చలపతి సకుటుంబంగా వైజాగ్ చేరుకున్నాడు. మూర్తికి, చిట్టితల్లికి, వారి ట్రిప్పుకు ఏర్పాటుచేసిన వివరాలు బోధపరిచేడు. డార్జిలింగు, గ్యాంగ్టాక్ లలో రైల్వే హాలిడే హోమ్స్ లో బస ఏర్పాట్ల వివరాలు చెప్పి, ఆ విషయంలో కొన్ని సలహాలిచ్చి, ఎవరిని కలియాలో చెప్పి, ఆ వివరాలన్నీ రాసి ఉన్న కాగితం ఇచ్చేడు. “హౌరా స్టేషన్లో చిన్నబావ రిసీవ్ చేసుకొని, టిక్కెట్లు ఇచ్చి, ట్రైన్లో కూర్చోబెటతాడు. మీకే ఇబ్బంది రాదు.” అని ధైర్యం చెప్పేడు. దంపతులిద్దరూ, చలపతికి అభినందనలు తెలియజేసేరు.
సాయంత్రం, పెద్దబావ పిల్లలిద్దరిని స్కూటరుమీద తిప్పడానికి మూర్తి తీసుకెళ్ళేడు. చిట్టితల్లి, వంటావిడకు రాత్రి భోజనాల గూర్చి చెబుతున్నాది. పెద్దకోడలు కూడా అక్కడే ఉంది. ఆ సమయంలో నరసమ్మ పెద్దకొడుకుతో, “ఒరే, పెద్దవాడా, సత్యం, పెళ్ళాం, ఏవో ఆ ఊళ్లు వెళ్లడానికి మీరు టిక్కట్లు కొన్నామన్నారు. ఆ టిక్కెట్ల డబ్బు నేనిచ్చేస్తాను. వాడి దగ్గర పుచ్చుకోకండి.” అని సలహా ఇచ్చింది.
“నువ్వివ్వడమెందుకమ్మా. మేము వాణ్ణి అడగదల్చుకోలేదు. నేను, తమ్ముడూ, పెట్టుకొంటున్నాం.”
“మంచిపని చేస్తున్నారు. ఇది.. వాడు వెళదామనుకోలేదు. నేనే.. వాడి బుర్రలో పెట్టేను. నువ్వు చెప్పినదాన్ని బట్టి, చాలా అయ్యేటట్టు ఉంది. అంత వాడి దగ్గర ఉందో లేదో. ఇంటి ఖర్చులన్నీ వాడే పెడుతున్నాడు. నన్ను చిల్లిగవ్వ పెట్టనివ్వడం లేదు. దేనికయినా నేనిస్తానురా అంటే, నువ్వు నాకు చేసినదాంట్లో ఇదెంత అని మాట దాటవేయిస్తాడు. అమాయకుడు.”
“అవునమ్మా. వాడికి నువ్వంటే ఎంతో అభిమానం, గౌరవం. వాడు నిన్నలా చూస్తున్నాడు కాబట్టే మేమక్కడ ధైర్యంగా ఉంటున్నాం. మాకన్నీ తెలుసమ్మా. అందుకే వాళ్లకి ఉండడానికి కూడా ఫ్రీగా ఎరేంజ్ చేసేమమ్మా. దేనికీ ఇబ్బంది పడరు.” అని తల్లికి హామీ ఇచ్చేడు.
“మంచి పని చేసేరు.” అని నరసమ్మ మెచ్చుకుంది.
అంతలో పెద్దకోడలు, చిట్టితల్లి రావడంతో సంభాషణ మరో వైపు మళ్లింది.
***
హనీమూన్ దంపతులు హౌరా చేరుకొన్నారు. వారిని మూర్తి చిన్నబావ రిసీవ్ చేసుకున్నాడు. తదుపరి ప్రయాణం విషయంలో వివరాలు చెప్పి, కొన్ని సలహాలిచ్చి ట్రైన్లో కూర్చోబెట్టేడు. న్యూ జలపైగురిలో ట్రైను మారి, డార్జిలింగుకు టాయ్ ట్రైన్ ఎక్కేరు. పర్వతాల మధ్యనుండి రైలు వెళుతూ ఉంటే ఇరుప్రక్కలా వింతగాచూస్తూ, విస్తుపోయేరు. ప్రపంచంలోకెల్లా ఎత్తైన రైల్వే స్టేషను ఘుమ్ చేరగానే, ఎవరెస్టు శిఖరం మీద ఉన్నంత సంతోషించేరు. ట్రైను డార్జిలింగు ఊళ్లోండి వెళుతున్నాది. ఆ ఇద్దరిదీ ఒకటే సందడి. ఇళ్లలో ఉన్నవాళ్లు చేతులూపుతూ చూస్తూ ఉంటే, మన దంపతులు కూడా తిరిగి చేతులూపుతూ సందడి చేసేరు. వాళ్ల ఆనందానికి అంతు లేదు.
ఇద్దరూ డార్జిలింగు లోని రైల్వే హాలీడే హోములో దిగేరు. వాళ్ల గది బాల్కనీలోనుండి దట్టమయిన మంచు, కిరీటంగా ధరించి ఉన్న కాంచెంజెంగా పర్వతాన్ని చూసి దిగ్భ్రాంతి చెందేరు. కళ్ళార్పకుండా ఆ దృశ్యాన్ని పదే పదే చూసేరు. ఉన్న నాలుగు రోజులూ ముఖ్యమయిన ప్రదేశాలు చూడడానికి ఒక జీప్ మాట్లాడుకున్నారు. జీపు వాడి సహాయంతో, డార్జిలింగు లోయలలో పండిస్తున్న టీ తోటలు చూసేరు. వాటిలో ముఖ్యంగా బ్లేక్ టీ గార్డెన్స్ వారిని ఆకర్షించేయి. ఒక రకం టీ, కేజీ లక్ష రూపాయలని తెలిసి ఆశ్చర్యపోయేరు. జాపనీస్ పీస్ పగోడా, మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన టెన్జింగ్ నార్గే స్థాపించిన హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూటు, డార్జిలింగులో అతి ఎత్తైన టైగర్ హిల్, ప్రాచీన బౌద్ధ మఠం- ఘూమ్ మోనెస్టరీ మున్నగునవి తనివి తీరా చూసి, ఆనందించేరు.
ఆ తరువాత మూడు రోజుల పర్యటనకు గ్యాంగ్టాక్ చేరుకొని రైల్వే హాలిడే హోమ్‌లో దిగేరు. ఆ మూడు రోజుల్లో, పట్నంలో ఎచ్చటనుండేనా కనబడే కాంచెంజన్గా పర్వతం, నాథూలా పాస్, ప్రసిద్ధ తీర్థ స్థలం- గణేష్ టోక్ టెంపుల్, హిమాలయాల నడి బొడ్డున ఉన్న ఖంగ్చేంద్జోంగా నేషనల్ పార్క్, బౌద్ధ మఠాలు, అతి ఎత్తులోనున్న త్సోంగో లేకు, బాన్ ఝక్రి ఫాల్సు, మున్నగునవి చూసి, తిరుగు ప్రయాణమయ్యేరు. రెండు చోట్లా ప్రత్యేకమైన గిఫ్టులు, కొన్నారు.
దంపతుల హనీమూన్ ముగిసింది. నరసమ్మ పెద్దకొడుకు చలపతి కుటుంబం వాళ్ల ఊరికి వెళ్లేరు.
చిట్టితల్లి తమ హానీమూన్ విశేషాలు వివరంగా తండ్రికి రాసింది. అవి తెలిసి గణపతి, అన్నపూర్ణ ఎంతో సంతోషించేరు. చిట్టితల్లి అనుభవిస్తున్న దాంపత్య జీవనం తలచుకు తలచుకు మురిసిపోయేరు.
(సశేషం)
శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం నవంబరు, 1936 లో జన్మించారు. M.A. మరియు P.G. Diploma in Personnel Management పాసయ్యారు. ఉద్యోగ పర్వం, హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రారంభించి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిగా చేసి, 1994 లో విశ్రాంతి తీసుకొన్నారు. అమెరికా వాసి.
హైస్కూలు విద్యార్థిగా రంగస్థల ప్రవేశం చేసేరు. చిన్న నాటికలు రాసి, వాటిలో పాత్రలు ధరించి, దర్శకత్వం చేసేరు.
గత ఎనిమిది సంవత్సరాల నుండి రచనలు చేస్తున్నారు. ఈ నాటికి 33 కథలు, 3 నవలలు, 4 కవితలు, ఒక హాస్య నాటిక ప్రచురణమయ్యేయి.
