Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పునరపి

[శ్రీ జి.ఆర్.భాస్కర బాబు రచించిన ‘పునరపి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

అక్షరం పగిలి శబ్దమవుతోంది
భావం దానికి రంగులద్దుతూంది
ఎరుపో.. మెరుపో..!
తెలుపో.. నలుపో.. !
పచ్చో.. నీలమో.. !
మనోగగనమంతా అక్షరాలే..
రంగురంగుల వాన
కాగితం నిండా కురిసి
అనంతమైన హరివిల్లులు సృష్టిస్తున్నాయి!!
రంగుల హరివిల్లులన్నీ
దూరంగా ఉన్న స్వచ్ఛధవళ
కాంతి పుంజలో కలిసిపోతున్నాయి..
అన్నిటిలోనూ ఉన్న సర్వాంతర్యామిలో
జగాలన్నీ లీనమైపోతున్నట్టు..
శబ్దమంతా ప్రణవంలో కలిసిపోతున్నట్లు..
సర్వస్వరమంతా లయకారునిలో
లీనం అవుతున్నట్లు అనిపించింది..
నిచ్చేష్టమైన లేఖిని ఒక లుప్త ఆగిపోయిందేమో..
కానీ అక్షరం అక్షరమై మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంది

Exit mobile version