Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పునరపి జననం పునరపి మరణం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘పునరపి జననం పునరపి మరణం’ అనే రచనని అందిస్తున్నాము.]

భగవద్గీత 15వ అధ్యాయం, 7వ శ్లోకం
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః।
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి॥

ఈ భౌతిక ప్రపంచంలో పొషణార్థం శరీరం ధరించిన ఆత్మలన్నీ కూడా నా యందు ఉద్భవించినవే. ఈ అనంతవిశ్వమైన నా శరీరం లోని భాగాలే. కానీ కర్మ ఫలం కారణంగా ఈ జగత్తులో వున్న భౌతిక ప్రకృతితో బంధించబడి వారు అనునిత్యం జీవన సంఘర్షణ చేస్తున్నారు అని పై శ్లోకం భావం.

జీవుల యథార్థ స్వరూపాన్ని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణపరమాత్మ తెలియజేస్తున్నారు. తొలుత జీవులన్నీ భగవంతునిలో లయమై వున్నాయి. అనంతరం ఈ సృష్టి కార్యార్థమై అవి భగవంతుని నుండి విడివడి ఈ భౌతిక జగత్తులోనికి ప్రవేశించి ఒక శరీరాన్ని ధరించాయి. నిత్యం కర్మాచరణ యందు నిమగ్నమై అరిషడ్వర్గాలతో పోరాడుతూ మరింత కర్మఫలాన్ని పోగు చేసుకుంటున్నాయి. ఈ కర్మఫలాలను అనుభవించడానికి తిరిగి ఆత్మలు ఒక శరీరం వదిలి మరొక శరీరాన్ని ధరిస్తుంటాయి. ఇదియే జనన మరణ చక్రభ్రమణం.

భగవద్గీతలో చెప్పిన శ్రీకృష్ణపరమాత్మ ముఖ్య విషయం ఏమిటంటే – “పుట్టుక, మరణం ఎలా జరుగుతాయో నిజంగా ఎవరికైతే తెలుసో, వారే జ్ఞానులు.”

మన దేహం, ఇంద్రియాలు, మనసు, ప్రాణం ఇవన్నీ ఆత్మ నుండి విడిపోవడాన్నే మరణం అని అంటారు. అంటే అది పూర్తిగా నాశనం కావడం కాదు, కేవలం తాత్కాలికంగా వేరుచేయబడటం మాత్రమే. మరణం అనేది శరీరానికి మాత్రమే; ఆత్మకు మరణం లేదు.

మరణం నిజంగా నొప్పి ఇవ్వదు. మరణం గురించిన భయమే మనకు బాధను కలిగిస్తుంది. అసలు మరణం అనేది ఒక క్షణం అదృశ్యమై, మరో రూపంలో తిరిగి కొనసాగడమే. ఇది దాగుడుమూతల ఆటలా ఉంటుంది – కొంతసేపు కనబడకుండా, మళ్లీ ప్రత్యక్షమవడం లాంటిది.

జ్ఞానం ఉన్నవారు, తెలివైనవారు ఈ నిజాన్ని అర్థం చేసుకుంటారు; అందుకే మరణం వారిని ఎప్పుడూ భయపెట్టదు, గందరగోళానికి గురి చేయదు. ఎందుకంటే, వారు తెలుసుకుంటారు – ఆత్మ శాశ్వతం, మారేది కేవలం శరీరమే.

మరణం మనకు ముందున్న నిజాన్ని దాచేస్తుంది. అందుకే మనం దుఃఖిస్తాం. ఇప్పుడే కనిపించని మరో జీవన దశ ఉందని మనం అంగీకరించలేకపోవడమే బాధ. ఆత్మ శాశ్వతం. దానికి పుట్టుక లేదు, మరణం లేదు, మార్పు లేదు. జీవితం ఒక అపూర్ణమైన పుస్తకం లాంటిది. మధ్యలో ఉన్న జీవనాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, “నేను ఎవరు? ఎక్కడినుంచి వచ్చాను? ఎక్కడికి వెళ్తాను?” అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఇక్కడ ఉన్నాం అంటే ముందెక్కడో ఉన్నాం. జీవితం అనేది కనిపించేదాని నుంచి కనిపించనిదానికి చేసే ప్రయాణం అంటారు స్వామి రామా.

Exit mobile version