Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పునర్మిలనం

[డా. పార్థసారథి చిరువోలు గారు రచించిన ‘పునర్మిలనం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

శశాంక్‌కి ముళ్ల మీద కూర్చున్నట్టుగా ఉంది. ఎదురుగా ఉన్న వాళ్ల మాట్లాడే మాటలు చికాకు తెప్పిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి పారిపోదామా అనిపిస్తోంది. మాటిమాటికీ గడియారం వంక చూసుకుంటున్నాడు. గంటలు లెక్కవేసుకున్నాడు. ‘ఇంకో ఐదారు గంటలు ఇక్కడ గడపటం కష్టమేమో’ మనసులోనే అనుకున్నాడు.

మిగతావాళ్లు ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

“శశాంక్.. మూడీగా ఉన్నావేంటి? జెట్ లాగా?” ఎవరో అడిగారు.

కాదని తల అడ్డంగా ఆడించాడు. “ఇలా వచ్చి కూర్చో..” బలవంతంగా లాగి మధ్యలో కూర్చోపెట్టారు.

అక్కడ అల్లరి కొనసాగుతోంది.

“ఒరే మామా.. నిముషానికోసారి దువ్వెన తీసి తల దువ్వుకునే వాడివి, ఇప్పుడు ఆ రింగుల జుట్టేదిరా.. బట్టతల బంగారయ్యవి అయిపోయావ్”

ఒక్కసారిగా నవ్వులు.

“పొడవాటి జడతో శివంగిని చూస్తుంటే అప్పట్లో నాకు గుండె లయ తప్పేది. జడకుప్పెలు, నాగస్వరాలు, రాళ్ల పిన్నులు, ముత్యాల కుచ్చులతో ఎన్నెన్ని అలంకరణలు చేసేది? ఎన్ని సొగసులు పొయేది. వాటిని చూస్తే మనసులో కవిత్వం పొంగుకొచ్చేది. వచ్చిరాని భాషతో బోలెడన్ని కవితలు రాశాను. ఇప్పుడు చూడు శివంగి గొర్రె తోక జడని..”

మళ్లీ నవ్వులు.

“స్కూలులో రివటలాగా ఉండేవాడివి. గాలి వస్తే ఎగిరిపోయేలా. ఇప్పుడేమిట్రా ఇంత భారీకాయం ఎక్కడ నుంచి వచ్చిందిరా బాబూ”

“మన బ్యూటీ క్వీన్ అప్పలమ్మలా ఎలా తయారయిందో చూడు. చిన్నప్పుడు దీని అందం చూసి పెళ్లి చేసుకుంటే బావుండు అనుకునే వాడిని. అదృష్టవంతుడిని. బతికిపోయాను. లేకపోతే చచ్చుండేవాడిని”.

“మా ఆయన అలా అనుకోవటం లేదు. నేను వచ్చిన తర్వాత అంతా కలిసొచ్చిందంటాడు ఎప్పుడూ. మొన్ననే ఓ విల్లా కూడా కొనిచ్చాడు తెలుసా?”

“అంటే నేను మిస్ అయిపోయినట్టేనా.. బ్యాడ్ లక్..” మళ్లీ నవ్వులు, కేరింతలు.

 “మీరందరూ డ్యాన్సు బాగా చేస్తున్నారు. ఊ అంటే రేపు రిటైరయిన తర్వాత మీ అందరి చేత రికార్డింగ్ డ్యాన్స్ పెట్టిస్తా, ఇప్పుడు వాటి జాడ అంతగా లేదు గాని ఒకప్పుడు వాటి పేరు చెబితే జనానికి కిర్రెక్కిపోయేది”.

“నువ్వు ఆ పనిచేస్తే నేను మార్కెటింగ్ పనులు చూస్తా. ఉభయగోదావరి జిల్లాల్లో ప్రోగ్రామ్ లు ఏర్పాటు చేయిస్తా”.

“మీరెవరెవరు ఏం చేస్తారో అది చేయండి. నన్ను మాత్రం క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చోపెట్టండి”

“అరె.. ఇంకా నువ్వు గల్లాపెట్టెల రోజుల్లోనే ఉన్నట్టున్నావ్? ఇప్పుడంతా ఆన్‌లైన్‌లో డిజిటల్ పేమెంట్లు నడుస్తున్నాయి. మరిచిపోయావా” అంటూ నవ్వుల మీద నవ్వులు..

ఇవన్నీ తన స్థాయికి తక్కువగా చవకబారు సంభాషణలుగా శశాంక్‌కి తోస్తున్నాయి. అతి పెద్ద బిజినెస్ డీల్స్‌లో పాల్గొనే అలవాటు ఉన్న అతనికి ఇదంతా ట్రాష్‌లా అనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ బయలుదేరదామా అని మనసు తరుముతోంది.

నిజానికి ఈ కార్యక్రమానికి రావటం అతనికి సుతరామూ ఇష్టం లేదు. కాని పరిస్థితులు అలా తన్నుకొచ్చాయి.

“40 ఏళ్ల తర్వాత సాగుతున్న గెట్ టు గెదర్. పనులన్నీ పక్కన పెట్టి తప్పనిసరిగా నువ్వు రావాలి. ఎక్కడెక్కడో ఉన్న మన క్లాస్‌మెట్స్ అందరి పోగేసేసరికి ప్రాణం మీదకు వచ్చింది. ఆరేడు నెలలుగా ఇదే పనిలో తలమునకలై ఉన్నాం” అని చెప్పాడు ఓ మిత్రుడు ఫోన్‌లో.

‘అలాగే. ప్రయత్నిస్తాను” అన్నాడు. కాని ‘వస్తాను’ అని కమిట్ కాలేదు.

శశాంక్‌కి తన స్కూలు రోజులను గుర్తు చేసుకోవటం అంత ఇష్టం ఉండదు. అందులో అతనికి గుర్తుంచుకోదగ్గ అంశాలు కనిపించవు. పెద్ద సంసారం. నలుగురి పిల్లల్లో మూడోవాడిగా ఉన్నాడు. తండ్రి ఏదో షాపులో అక్కౌంటెంట్‌గా పనిచేసేవాడు. ఎనిమిది, తొమ్మిది గంటలు దుకాణంలో పనిచేసి ఇంటి తిరిగి వచ్చినా ఇంకా ఆయనకు చేయటానికి పని మిగిలేది. తల్లి నలుగురు పిల్లలను సాకటం.. ఇంటి పనులతో సతమతమయ్యేది.

తన కంటె పెద్దవాళ్లు చదివిన పుస్తకాలే చదవటం, అన్నయ్యలు వేసుకునే బట్టలే వేసుకోవటం.. అరకొరగా, సర్దుబాటుతో సాగిన ఆ జీవితం పట్ల అతనికి మమకారం లేదు.

ఆ అసంతృప్తి జీవితంలో బాగా ఎదగాలన్న కసిని పెంచింది. చదువు పెద్ద ఆయుధం అని నమ్మాడు. కాలేజీలో ర్యాంకర్ కావటంతో కలిసొచ్చింది. కాలేజీ యానివర్సరీలో ఓ డాక్టర్ కంట్లో పడ్డాడు. ఆయనే స్వయంగా పూనుకుని శశాంక్‌ని అమెరికాకు పంపాడు.

అక్కడి నుంచే తన అసలు జీవితం ప్రారంభమైందని శశాంక్ బలంగా నమ్ముతాడు.

బాగా చదువుకున్నాడు. ఉద్యోగంలో అంచలంచెలుగా ఎదిగాడు. ఆ తర్వాత సొంతగా కంపెనీలు ప్రారంభించే స్థాయికి చేరటానికి ఎన్నో సంవత్సరాలు పట్టలేదు. వ్యాపార సామ్రాజ్యంలో పైపైకి దూసుకుపోవటం తప్పమరే ఇతర ఆసక్తులు లేవు. బిజినెస్ సర్కిల్లో ఉన్న వ్యక్తులను తప్ప సాధారణంగా అతను ఇతరులను దగ్గరకు రానివ్వడు.

ఈలోగా అతని వ్యాపారం ప్రపంచంలో అనుకోని చిన్న కుదుపు. అది తనను తల్లకిందులు చేసేది కాకపోయినా ఎందుకో డిస్ర్టబ్ అయ్యాడు.

తన కంపెనీల్లో ఒకదాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకే దెబ్బలో 200 మంది ఉద్యోగాలను ఇంటికి పంపేశాడు. ఓ వీడియో మెసేజ్ ద్వారా అందరికీ ఈ సమాచారం పంపటంతో కలకలం రేగింది.

“నీకు మానవత్వం లేదా? ముందు నోటీసు ఇవ్వకుండా ఇలా హఠాత్తుగా అందరినీ రోడ్డున పడేస్తే కుటుంబాలు ఎలా బతుకుతాయ్?” అని ఎవరో పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో నిందించారు.

కంపెనీలు ఉద్యోగులను తొలగించటం కొత్త విషయం కాదు. కాకపోతే తనను విమర్శించేసరికి శశాంక్ వ్యక్తిగతంగా తీసుకుని తట్టుకోలేకపోయాడు.

“ఉద్యోగులు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటారు. షేర్ హోల్టర్లు లాభాలు ఆశిస్తారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే కంపెనీలు కఠినమైన నిర్ణయాలు చేయవలసిందే. ఉద్యోగులను తొలగించటం తప్పు కాదు. అది సరైన నిర్ణయమే” అని తన చర్యను సమర్థించుకున్నాడు.

దాంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది.

కంపెనీకి వ్యతిరేకంగా న్యాయపోరాటం మొదలయ్యింది. మరో వైపు ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనలు ప్రారంభించారు. ఓ గుంపు శశాంక్ ఇంటి మీద పడి రాళ్ల దాడి చేసింది. అమెరికన్ సమాజంలో ఇలాంటి సంఘటనలు అరుదు.

దాంతో భార్య వణికిపోయింది. “మీ స్కూలు ఫ్రెండ్స్ రమ్మంటున్నారుగా? ఓ నాలుగు రోజులు ఇండియా వెళ్లిరండి. ఈలోపు అంతా సర్దుకుంటుంది” అని సలహా ఇచ్చింది.

అది సరైన పనే అని తనకు కూడా అనిపించింది. హైదరాబాద్‌లో గ్లోబల్ రియల్ ఎస్టేట్ వెంచర్ ఒకటి కొత్తగా ప్రారంభం కాబోతోందన్న వార్త విని ఉన్నాడు. వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే భాగస్వామ్యం వర్కవుట్ అవుతుందని అనిపించింది. అప్పటికప్పుడు కాంటాక్ట్ చేశాడు. మినిస్టర్ పీఏతో మాట్లాడి అప్పాయింట్మెంట్ కుదర్చుకున్నాడు.

ఇప్పుడు అతని ఆలోచనలు ఈ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి.

తన అమెరికన్ డాలర్లు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రపంచంలో ఎన్ని కోట్లు కుమ్మరిస్తాయో ఊహించుకుంటుంటే అతనికి మనసు పులకరిస్తోంది.

ఎదురుగాఉన్న క్లాస్‌మేట్స్ పెద్దగా ఖాతరు చేయవలసిన వ్యక్తులుగా అనిపించలేదు. అన్యమనస్కంగా కూర్చున్నాడు.

అమెరికాలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన శశాంక్ కార్యక్రమానికి రావటం వాళ్లను ఉత్సాహపరిచింది. అతను రాజమండ్రి ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే బ్రహ్మరథం పట్టారు. కార్ల ర్యాలీ ఏర్పాటు చేసి సిటీలోకి తీసుకొచ్చారు. మంచి ఫైవ్ స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. కాలు కింద పడితే ఎక్కడ కందిపోతాడో అన్నట్టుగా వాళ్లు అతన్ని చూసుకుంటున్నారు.

గోదారి ఒడ్డున ఓ మంచి రిసార్టులో కార్యక్రమం.

“మన టీచర్లు చాలా మంది కాలం చేశారు. ఉన్న ఒకరిద్దరు కూడా రాలేం అని చెప్పేశారు. ఇక మనం.. మనం.. పారాహుషారే” అన్నారు. కాలాన్ని 40 ఏళ్ల వెనక్కినెట్టి అందరూ స్కూలు పిల్లలయి పోయారు. పరిచయాలు, పరామర్శలు.. అరె.. ఒరేల నుంచి మొదలుపెట్టి బూతులు తిట్టుకోవటం వరకూ.. మంచీ చెడు మాట్లాడుకోవటం దగ్గర నుంచి ఈలలు, డ్యాన్సులతో కేరింతలు కొట్టటం వరకూ.. ఇక బాడీషేమింగ్ సంగతి సరే.

మరో వైపు స్టార్టర్లు, కూల్ డ్రింకులు ఎన్నెన్ని కడుపులోకి పోతున్నాయో లెక్క లేదు. మధ్యాహ్న భోజనానికి గోదావరి ప్రత్యేక వంటకాలు సిద్ధం చేశారు.

అంతలో శశాంక్‌కి ఏదో గుర్తొచ్చింది.

గబుక్కున బ్యాగు తెరిచి అందులో నుంచి విస్కీ బాటిళ్లను తీసి బయటకు తీసి టేబుల్ మీద పెట్టాడు.

అంత ఖరీదయిన విస్కీని తాగటం మాట దేముడెరుగు. అసలు వాళ్లు చూసి కూడా ఎరగరు. దానితో వాళ్లలో ఉత్సాహం కట్టలు తెంచుకుంది.

‘ఒరే నువ్వు సూపర్ రా. ఆ రమేష్ గాడూ ఉన్నాడు. కొడుక్కి పెళ్లి చేశాడు. కాస్త నోరు తడి చేయరా బాబూ అంటే మందూ గిందూ లేదు. ఉన్నదేదో మెక్కిపొండి అని నిర్మొహమాటంగా చెప్పాడు యూజ్ లెస్ ఫెలో..”

“ఇందాక మన పక్కన కూర్చున్న వాడేనా?” అడిగాడు అమాయకంగా శశాంక్,

“వాడు కె. రమేష్.. నేను చెప్పేది జీ రమేష్ గురించి”.

‘ఆహా”.

“నీకు గుర్తుందో లేదో మన స్కూలులో రమేష్‌లు, శీను, ప్రసాద్, లక్ష్మి, పద్మలు చాలా మంది ఉన్నారు” అని ఎవరో సమాధానం ఇచ్చారు.

“మా క్లాస్‌మేట్ ఇంత గొప్పోడు అయ్యాడంటే ఆశ్చర్యంగా ఉందిరా” అని శశాంక్‌ని ఆకాశానికెత్తేశారు. పోటీలు పడి మరీ అతనితో సెల్ఫీలు దిగారు. కాని అవేమీ శశాంక్ మనసును తాకలేదు. బలవంతంగా ముఖాన నవ్వు పులుముకుని ఓ ప్రేక్షకునిలా కాసేపు అక్కడ గడిపాడు.

ఆ తర్వాత వాళ్లు మందులో మునిగిపోతే, తను ఒక్కడే బయటికొచ్చాడు.

అక్కడ గోడకు ఆనుకుని నిలబడి కనిపించాడు విరాట్.

“అందరూ పార్టీలో ఉన్నారు.. నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా..” అడిగాడు శశాంక్.

“నాకు అలవాటు లేదు. ఇక్కడ కాసేపు గోదావరిని ఎంజాయ్ చేస్తున్నా” అన్నాడు.

మొట్టమొదటిసారి చూస్తున్నట్టు నదిని ఆరాధనగా, తన్మయత్వంగా చూడసాగాడు.

“అదేంటి? నువ్వు రోజూ చూసేదిగా.. అందులో కొత్తగా ఏం ఉంటుంది?” ఆశ్చర్యంగా అడిగాడు శశాంక్.

విరాట్ నవ్వి ఊరుకున్నాడు.

“చిన్నప్పుడు ర్యాంకర్‌వి కదా? ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ చేయలేదా? ఈ ఊరిలోనే కూరుకుపోయావు” అనడిగాడు తేలిక భావంతో.

“కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించాను. అవకాశం దొరకలేదు. దానితో ఇక్కడ ప్రయివేటు స్కూల్లో ఉద్యోగం చేశాను. రిటైరయినప్పటి నుంచి ట్యూషన్లు చెబుతున్నాను”.

“ఆదాయం..?”

“ఎలాంటి ఇబ్బంది లేదు. మా కుటుంబాన్ని నడుపుకోవటానికి సరిపోతుంది.”

“సరిపోతోందా? సరిపెట్టుకుంటున్నావా?” నిర్మొహమాటంగా అడిగాడు.

విరాట్ వైపు నుంచి నవ్వే సమాధానం.

“చుట్టూ ఉన్నవాళ్లు అందరూ గొప్పగా జీవిస్తున్నారనే బాధ.. నేను సంపాదించలేకపోతునన్న చింత నీకు ఎప్పుడూ కలగలేదా?”

“లేదు”.

“అదేంటి?”

“నేను వాళ్లతో పోటీ పడి ఉంటే అలా అనిపించేదేమోగాని, నేను ఈ రేస్‌లో లేను”.

“హోదా..స్టాటస్.. లైఫ్ స్టయిల్.. ఇవేమీ నీ ఆలోచనల్లోకి రావా?”

“ఊహు”.

“మీ కుటుంబం..”

“వాళ్లకు, నాకు ఈ విషయంలో వైరుధ్యం లేదు. నా అభిప్రాయాలను గౌరవిస్తారు. నా భార్య నా మాటకు విలువ ఇస్తుంది”.

“పిల్లలు..”

“మా పెద్దమ్మాయి ఇక్కడే ఇంజనీరింగ్ చేసింది. అమెరికాలో ఎంఎస్‌కి సీటొచ్చింది. నేను అంత చదివించలేనని చెప్పేశాను. ఏదో ఉద్యోగం చూసుకుంటానని చెప్పింది. అబ్బాయి టెన్త్ చదువుతున్నాడు”.

“అసలు ఈ ఊరు ఎందుకు వదిలిపెట్టి వెళ్లటం లేదు? అంతగా నిన్ను కట్టిబడేసింది ఏమిటి?”

“మా బంధువర్గం, మా బాబాయిలు, పిన్నులు, అత్తయ్యలు అంతా ఈ చుట్టూ పక్కలే ఉన్నారు. ఒకళ్లకొకళ్లం తోడు..” అన్నాడు విరాట్.

అతను ఏం చెప్పాలనుకున్నాడో శశంక్ కి అర్థం కాలేదు.

‘పూర్ ఫెలో. జీవితంలో ఎదగటం చేత కాని వ్యక్తి’ అని మనసులో అనుకుని ఊరుకున్నాడు.

సంభాషణ అక్కడితో ముగిసింది. “నీకు అభ్యంతరం లేకపోతే.. నాతో వస్తే సిటీ అంతా నీకు చూపిస్తా.. వస్తావా?” అని ఆహ్వానించాడు విరాట్.

‘కాదు’ అనటానికి శశాంక్‌కి కారణం కనిపించలేదు. టూవీలర్ పైన కూర్చుని వెళ్లటం గమ్మత్తుగా అనిపించింది. ఆ తర్వాత రెండు గంటల సమయం ఎలా గడిచిందో కూడా అతనికి తెలియలేదు.

రిసార్ట్‌కి తిరిగొచ్చేసరికి ఎవరి గొడవలో వాళ్లు ఉన్నారు. తమ మధ్యలో కూర్చున్న అతిథి మాయమయిన విషయాన్ని అక్కడ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

గోదావరి ప్రత్యేక వంటకాలతో భోజనం కానిచ్చి అక్కడి నుంచి నిష్కృమించాడు శశాంక్.

అమెరికా తిరిగొచ్చి రెండు రోజులయినా ఇండియా టూర్ అతని మనసులో రొద పెట్టసాగింది.

రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో పార్ట్‌నర్‌షిప్ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ముందు ఊహించినదే గనక అదేం పెద్ద ఎగ్జయిటింగ్‌గా అనిపించలేదు.

ఏదో తెలియని వెలితి అతనిని వెంటాడింది.

స్నేహితులు ఎంత బాగా సెలబ్రేట్ చేశారు. ఒక్క క్షణం వృథా అయితే మళ్లీ తిరిగి రాదేమో అన్నంత ఆరాటంతో ఎంజాయ్ చేశాడు. తను వాళ్లలో ఒకడు ఎందుకు కాలేకపోయాడు? అన్న ప్రశ్న తలెత్తింది. దానికి మళ్లీ తనే సమాధానం చెప్పుకున్నాడు.

“ఆ.. వాళ్లూ తననే ఒకటేనా? తను వాళ్లతో కలిసి చదువుకున్న మాట నిజమే అయినా ఇప్పుడు వాళ్లూ తను సమానం కాదు.

సమాజంలో తను చాలా ఎత్తుపైన ఉన్నాడు. డబ్బు, అధికారం, హోదా, పరపతి.. ఇలా ఏ రకంగా చేసినా తను ఉన్నతుడే. ఆ విషయాన్ని ఎవరూ కూడా కాదనలేరు.

మరి విరాట్ మాటేమిటి?

అంత నిర్లిప్తంగా ఎలా ఉండగలుగుతున్నాడు. జీవితంలో ఎదగలేకపోయానన్న అసంతృప్తి మచ్చుకయినా కనిపించదే? ముఖంలో చిరునవ్వు చెదరటం లేదే? అంత సంతోషంగా ఉండటం ఎలా సాధ్యం అవుతోంది?

విరాట్ టూవీలర్ మీదనే తను ఎయిర్ పోర్టుకి వచ్చాడు. విమానం ఎక్కే ముందు సూట్ కేసు తెరిచి అతని ముందు పెట్టాడు. అందులో గిఫ్ట్‌లుగా ఇవ్వటానికి తెచ్చిన బాడీ లోషన్లు, షాంపూలు, స్ర్పేలు, చాక్లెట్లు ఇలా చాలానే ఉన్నాయి. కావలసిన వస్తువులు తీసుకోమని కోరాడు.

‘ఏదీ అవసరం లేదు’ అని విరాట్ తల అడ్డంగా ఆపాడు. పైగా మనసులో ఏం అనుకున్నాడో తెలియదు కాని ప్రేమగా తను భుజం తట్టాడు.

తనకు తెలిసిన ప్రపంచంలో పోటీ ఉంది. కుట్రలు ఉన్నాయి, కుహకాలు ఉన్నాయి. తను మాత్రమే గెలవాలన్న స్వార్థం ఉంది. హోదా చాటుకోవాలని, విలాసాలను ప్రదర్శించాలన్న తాపత్రయం ఉంది.

అర్హతలున్నా అవకాశాల కోసం పాకులాడకపోవటం, ఆశకి లోనుకాకుండా ఉన్నదానితో సంతృప్తితో జీవించటం, చుట్టూ ఉన్న వాతావరణానికి స్పందించకుండా నిబ్బరంగా ఉండటం అంత సాధారణమైన విషయం కాదేమో?

ఎందుకో తెలియదు ఆ నిముషంలో విరాట్ అద్భుతంగా అనిపించాడు.

“భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితుల ప్రేమను పొందటం కంటే గొప్ప ఆస్తి ఇంకేం ఉంటుంది?” అని అతను అన్న మాటలు ఆ నిముషంలో గుర్తుకొచ్చాయి.

‘తను డబ్బు బాగా సంపాదించాడు. పేరు ప్రతిష్ఠలు సొంతం చేసుకున్నాడు. కాని సంపద మాత్రం చేజారిపోయిందేమో?’ అనిపించింది శశాంక్‌కి. మొదటిసారిగా అతనిలో కరడుగట్టిన మెటీరిలియస్టు మెల్లగా కరగటం మొదలుపెట్టాడు.

పిల్లలు గుర్తొచ్చారు.

“డాడీ.. ఐ హావ్ మేడప్ మై మైండ్.. ఐ యామ్ లీవింగ్ మై హజ్బెండ్” అంది ముఫై రెండేళ్ల కూతురు కొన్ని నెలల క్రితం ఓ రోజు హఠాత్తుగా.

తన, తన బిడ్డ భవిష్యత్తుని భర్త చేతిలో పెట్టటం ఇష్టం లేదని కరాఖండీగా చెప్పేసింది.

“అసలు ఏమైంది? ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవలసి వచ్చింది?” అని తను అడగలేదు. వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఓ పెద్ద మనిషిగా భార్యాభర్తల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించలేదు. కుటుంబ బంధాల ప్రాధాన్యత గురించి లెక్చరివ్వలేదు.

“యాజ్ యు లైక్. గో హెడ్ బేబీ” అన్నాడు క్యాజువల్‌గా.

“ప్రస్తుత పనిచేసే కంపెనీలో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా. రిజైన్ చేసి ఇంకో కంపెనీలో ఉద్యోగం వెతుక్కుంటా” అనే ఉద్యోగి వ్యవహారంలాగా దానిని చూశాడు తప్ప తన వారసురాలి భవిష్యత్తుకు చెందిన అంశంగా దాని పర్యవసానాల గురించి లోతుగా ఆలోచించే ప్రయత్నం చేయలేదు.

భార్య మొత్తుకుంది. “మనం ఎంత అమెరికాలో ఉంటున్నా.. మనం రక్తంలో భారతీయత ఉంది. మనకో సాంప్రదాయం ఉంది. కుటుంబ బంధాలు ఉన్నాయి. మీ గారాల కూతురి మాటను ఎలాగూ కాదనలేరు. కనీసం అల్లుడినయినా పిలిచి మాట్లాడండి. ఇద్దరి మధ్యా ఎందుకు దూరం పెరిగిందో తెలుసుకోండి” అని సలహా ఇచ్చింది.

ఆ మాటలేవీ అప్పుడు తలకెక్కలేదు. ఇప్పడు దిద్దుబాటుకు ప్రయత్నిస్తే బావుంటుందనిపించింది.

మనవరాలి అల్లరి, దాని ముద్దుమాటలు కళ్ల ముందు మెదిలాయి. కూతురు, అల్లుడి జంట ఎంత చూడముచ్చటగా ఉంటుందో అని తెగ మురిసిపోయే తన భార్య ఇప్పటి పరిస్థితికి ఎంత తల్లడిల్లుతోందో గుర్తుకొచ్చింది.

ఓ పూర్తి రోజంతా పిల్లలతోనే గడపాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.. ఫ్యామిలీ గెట్ టుగెదర్‌లు, బిజినెస్ గెట్ టు గెదర్ లన్నీ ఫైవ్ స్టార్ హోటల్లోనే నిర్వహించటం అతనికి అలవాటు. దానికి భిన్నంగా మొట్టమొదటిసారిగా ఇంట్లోనే విందు చేయాలని నిర్ణయించాడు. మనసు విప్పి మాట్లాడాలని తీర్మానించుకున్నాడు.

కూతురికి, అల్లుడికి ఇద్దరికి విడివిడిగా ఫోన్ చేశాడు. రెండో వారి విషయం చెప్పకుండా భోజనానికి రమ్మని ఆహ్వానించాడు.

ఆ తర్వాత.. కొడుకును తలుచుకోగానే గుండె బరువెక్కింది.

ఆరేళ్ల క్రితం నాటి సంఘటన కళ్ల ముందు ప్రత్యక్షమైంది.

ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్నారు. డైనింగ్ టేబుల్ పైన తనొక వైపున ఉంటే ఎదురుగా తన భార్య, కొడుకు పక్కపక్కనే కూర్చున్నారు.

“నేను చెఫ్ కావాలనుకుంటున్నా”.

కొడుకు నోటి నుంచి ఆ మాటలు వినగానే ఒళ్లు మండింది తనకి.

సాధారణ హోటళ్లలో చెమటలు కక్కుకుంటూ ఉండే వంటవాళ్లు కళ్ల ముందు మెదిలారు. సాధ్యమైనంత వరకూ తమాయించుకుని.. “మేనేజిమెంటులో ఎంఎస్ చెయ్యి. రేపు మన కంపెనీలు చూసుకోవచ్చు. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. డ్రీమ్ బిగ్” అని సలహా ఇచ్చాడు.

‘భవిష్యత్తా?..” అని కొడుకు పెడసరంగా నవ్వాడు. దాంతో చిర్రెత్తింది.

“నేను చెప్పినట్టు చదువుకోరా.. పెద్ద కంపెనీకి సీఎండీవి అవుతావు అంటే వంటవాడిని అవుతాను అంటున్నావు. బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా?”

“డాడీ..” అన్నాడు వాడు కోపంగా.

భార్య వారించటానికి విఫలయత్నం చేసింది. ఇద్దరూ తగ్గలేదు.

“కచ్చితంగా మేనేజ్మెంటులో నువ్వు ఎంఎస్ చేయవలసిందే”.

“కుదరదు”.

“ఈ ఇంట్లో ఉండాలంటే నా మాట విని తీరాలి” అన్నాడు తను పరుషంగా. “రోడ్డు మీద పడి అడుక్కుతింటే గానీ నీకు నా విలువ తెలియదు..”.

తింటున్న భోజనం మధ్యలోనే ఆపేసి చేతులు కడుక్కుని గదిలోకి వెళ్లిపోయాడు కొడుకు. వాడికి నచ్చచెప్పటానికి తల్లి వెనకే వాడి గదిలోకి వెళ్లింది .

ఆ రాత్రి అశాంతిగా గడిచింది.

మరుసటి రోజు నిద్రలేచేసరికి కొడుకు ఇంట్లో లేడు.

విలాసాల మధ్య పుట్టి పెరిగినవాడు. అవి లేకుండా ఒక్క రోజు బయట ఉండలేడు. కడుపులో ఆకలి ఈడ్చితంతే వాడే ఇంటికి తిరిగి వస్తాడనుకున్నాడు. కాని తన అంచనా దెబ్బతింది.

వ్యాపారవేత్తగా రాణించిన తను మనుషులను అంచనా వేయగలిగానని అనుకున్నాడు. కాని కన్న కొడుకు విషయంలో తను దారుణంగా విఫలయ్యాడు.

సెల్ఫ్ మేడ్ మిలియనీర్ అని గర్వంతో విర్రవీగుతున్న తన అహంమీద వాడు దెబ్బకొట్టి వెళ్లిపోయాడు. ఇద్దరి దారులు వేరయ్యాయి.

ఏదో స్టార్ హోటల్లో పని చేస్తూ వాడు తన కలలను పండించుకున్నాడు. కొన్నాళ్లకు ఎవరో చెప్పారు. లాస్ ఏజెంలెన్స్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కల్నరీ ఎడ్యుకేషన్ సంస్థలో చేరాడని. ఏదో అంతర్జాతీయ పోటీల్లో బహుమతి గెల్చుకున్నాడని.

తనలో వ్యాపారవేత్త ఆనందించాడు. కాని తండ్రిగా విఫలమయ్యానన్న విషయం స్ఫురించలేదు.

ఇప్పడు కొడుక్కి ఫోన్ చేయాలంటే చేతులు వణకటం ప్రారంభించాయి. మనసు అపరాధభావంతో గిలగిలలాడింది.

తను ఫోన్ చేస్తే వాడు ఎలా స్పందిస్తాడు?

తనను నిందిస్తాడా? నువ్వు ఓడిపోయావు అని వెక్కిరిస్తాడా? నీ మీద గెలిచాను చూడు అని సవాల్ చేస్తాడా?

ఇవేమీ జరగలేదు.

ఎన్నో ప్రశ్నలు, భయాలు.. సందేహాల మధ్య గుండె దిటవు చేసుకుని రింగ్ చేశాడు. ఇంట్లో జరిగే కుటుంబ విందుకు రావలసిందిగా ఆహ్వానించాడు.

“అలాగే డాడీ. నేను వస్తాను” అని మృదువుగా కొడుకు మాట్లాడటం శశాంక్‌కి ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది. అతని వినయం, ప్రేమ అతని గుండెల్ని సున్నితంగా తాకాయి.

ఆలోచనలను తుంచేస్తూ అంతలో ఫోన్ మోగింది.

సెక్రటరీ. ప్రతి రోజు ఉదయం ఏడు గంటలకల్లా ఫోన్ చేసి ఆ రోజు దినచర్యను చెబుతుంది.

“ఎగ్జిక్యూటివ్ లీడర్ షిప్ టీం మీడింగ్”

“వచ్చే సోమవారానికి పోస్ట్ చేయండి”.

“సేల్స్ రీజియనల్ హెడ్స్ సెలక్షన్”

“క్యాన్సిల్”.

“బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ మీటింగ్”

“నాకు సాధ్యం కాదు. మిగతావాళ్లు మాట్లాడి నాకు బ్రీఫ్ చేయమని చెప్పండి”.

“జర్మన్ డెలిగేట్స్‌తో కాన్ఫరెన్స్ సర్..”

“నో” అన్నాడు.

“ఇంకా..”

“అవేం వద్దు. అన్నీ క్యాన్సిల్ చేయండి.. ఓ వారం రోజులు నన్ను డిస్ర్టబ్ చేయవద్దని అందరికీ నా మాటగా సమాచారం పంపండి. మరీ ముఖ్యమయితే వాయిస్ మెసేజ్ పంపమని చెప్పండి.”

అవతల వైపు ఫోన్‌లో ఉన్న సెక్రటరీనే కాదు. అదే గదిలో సోఫా పైన కూర్చుని టీవీ చూస్తున్న భార్య కూడా ఈ మాటలకు ఉలిక్కిపడింది. చేతిలో ఉన్న రిమోట్‌ను పక్కన పెట్టి అతని దగ్గరకు వచ్చింది.

ఒళ్లు కాలుతోందేమోనని నుదుటి పైన చెయ్యి వేసి చూసింది. జ్వరం వచ్చిన సూచనలు ఏవీ ఆమెకు కనిపించలేదు.

మరెందుకు శశాంక్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు?

‘ఏమిటి సంగతి?’ కళ్లెగెరెస్తూ అడిగింది.

శశాంక్ నవ్వాడు. ఆమె చేతిని తన చేతిలో అలాగే ఉంచుకుని చెప్పాడు.

“వచ్చే వారం మనం వెకేషన్‌కి వెళుతున్నాం” అన్నాడు.

“ఇప్పుడా?” ఆశ్చర్యంగా చూసింది.

ఏటా వేసవిలో ఓ వారం పాటు ‘హాలిడే’కు వెళతారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ బిజినెస్ వ్యవహారాలు తప్ప మిగిలిన వాటికి ప్రాధాన్యం ఇవ్వడు. అలాంటిది ఇప్పుడు.. హఠాత్తుగా..

“ఇంతకీ ఎక్కడికి?” అడిగింది.

“కెనడా.. డేవన్ ఐలాండ్స్”

“ఆ..” అంది ఇంకా నమ్మకం కుదరనట్టు.

“అవును నువ్వు విన్నది నిజమే. అక్కడికే” అన్నాడు.

“స్టార్ హోటళ్లలో తప్ప బయట ఉండటానికి ఇష్టపడని వ్యక్తి.. నరసంచారం లేని ‘అంటే నో మ్యాన్ ల్యాండ్’గా చెప్పే ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నాడో ఆమెకు అసలు అర్థం కాలేదు”.

అది గ్రహించినట్టుగా చెప్పాడు శశాంక్.

“అక్కడ మనం ఇద్దరమే ఉంటాం. నువ్వూ, నేను.. క్యాంప్ హౌస్‌లో ఉంటాం. అవసరమైన అన్నీ మనం తీసికెళతాం. అందుకు ఏర్పాట్లు చేస్తున్నాను” అన్నాడు.

ఆమె విస్మయంగా చూసింది.

ఇండియాకు వెళ్లొచ్చిన దగ్గర్నుంచి భర్త ప్రవర్తన ఆమెకు వింతగా అనిపిస్తోంది. అతను ఎందుకో దిగులు పడుతున్నాడు. ఏదో కోల్పోయిన భావనకు లోనవుతున్నాడు. ఆ విషయం గ్రహించినా ఆమె అడగలేదు.

తనతో చెప్పదలుచుకున్న అంశాలు ఉంటే అతనే చెబుతాడు. లేకపోతే నోరువిప్పడు. భర్త స్వభావం తెలిసిన వ్యక్తి కావటంతో మౌనంగా ఉంది.

ఆమె చేతిని మృదువుగా రుద్దుతూ చెప్పాడు శశాంక్.

“రేపు ఉదయం పిల్లలు వస్తున్నారు. అల్లుడు, అమ్మాయి.. మనవరాలు” ఒక్క నిముషం విరామం ఇచ్చి.. “అబ్బాయి కూడా” అన్నాడు.

“భారీ విందుకి ఏర్పాటు చేస్తున్నాను. అది ఇంట్లోనే”.

ఆమె నమ్మశక్యం కానట్టు చూసింది.

“నిజమేనా?” కళ్లతోనే ప్రశ్నించింది.‘అవును’ అన్నట్టుగా తలాడించాడు.

ఆ మాటలకు ఆమె ఒక్కసారిగా కదిలిపోయింది. ఆమె కనురెప్పుల చాటున కన్నీటి సంద్రం పొంగింది.

ఏరులై పారుతున్న ఆ నీటికి అడ్డుకట్ట వేయటానికి పైట కొంగు సరిపోదనిపించింది. భర్త చేతిని ప్రేమగా చుంబించి అక్కడ నుంచి పక్క గదిలోకి వెళ్లి పోయింది.

కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గరకు నడిచాడు శశాంక్.

కొన్ని సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటున్నాడు. సముద్రం ఒడ్డున ఉన్న ఆ ఆరు అంతస్తుల భవనం అతని హోదాకు చిహ్నం. ఆ కిటికీ దగ్గర నిలబడి బయటకి చూశాడు.

ఈ రోజెందుకో తెలియదు. దూరంగా ఎగిసిపడుతున్న సముద్రం. మునుపెన్నడూ లేనంత కొత్తగా కనిపించింది. సూర్యుని లేలేత కిరణాలు వెచ్చగా తాకాయి. చల్లని గాలి ముఖానికి బలంగా తాకి ఏదో తెలియని పులకింత రేపింది.

చిన్న పిట్ట కిటికీలో నుంచి ఎగిరివచ్చి పక్కనున్న టేబుల్ మీద వాలింది.

అరచేతిలో ఇమిడిపోయేటంత చిన్నగా. రంగురంగుల్లో మెరిసిపోతోంది. దాన్ని మెల్లగా చేతుల్లోకి తీసుకుని ప్రేమగా వెన్ను నిమిరాడు. దాని అందాన్ని పరీక్షగా చూడసాగాడు. చేతిలో నుంచి తీసి పక్కన పెట్టగానే అది తుర్రమని ఎగిరిపోయింది.

ఇప్పుడు శశాంక్‌కి తను తక్షణం చేయవలసిన రెండు పనులు గుర్తొచ్చాయి.

పక్కనే ఫోన్ అందుకున్నాడు.

“విరాట్.. మీ పాపకు అమెరికాలో ఎంఎస్‌లో చేరటానికి అన్ని ఏర్పాట్లు చేశాను. దయచేసి నా మాట కాదనుకు. ఈ ఒక్క సాయం చేసే అవకాశం నాకు కల్పించు. మీ అమ్మాయిని, పాస్‌పోర్టు వీసా రెడీ చేసుకోమను” అని మెసేజ్ పెట్టాడు.

ఆ తర్వాత స్కూలు గ్రూపులో అచ్చ తెలుగులో ఇంకో మెసేజీ..

“త్వరలోనే మనం మళ్లీ కలుద్దాం. కలిసి ఆనందిద్దాం. అందుకయ్యే ఖర్చు మొత్తం నేనే చూసుకుంటాను. మీరంతా హాజరయితే చాలు”

ఆ పని పూర్తి కాగానే మనసు మరింత తేలిక పడిన భావన కలిగింది. చుట్టూ ఉన్న పరిసరాలు కొత్తగా కనిపించాయి.

డబ్బుతో కొనలేని సంపదల గురించి ఇంతకు ముందు అతనికి పరిచయం లేదు.

జీవితంలో మొదటిసారి వాటి కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు.

Exit mobile version