తేది 24-03-2026 న సాయంత్రం 06.00 గంటలకు పుణే లోని జ్ఞానజ్యోతి సావిత్రిబాయి ఫులే స్మారక సభాగృహంలో మహారాష్ట్ర ప్రభుత్వ తెలుగు సాహిత్య అకాడెమీ ద్వారా సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోనాలు ప్రదర్శన కన్నుల పండుగగా జరిగింది. తలపై బోనాల కుండలతో, డప్పు వాద్యాలతో, వేపమండల విన్యాసాలతో ఊరేగింపుగా సభాగృహంలోకి ప్రవేశించిన మహిళలు, వేదికపై వెలసిన రేణుక ఎల్లమ్మను భక్తి శ్రద్ధలతో, దీపం వెలిగించి పూజించారు.
దాదాపు మూడు వందల మంది హాజరైన ఆ సమావేశానికి ఆడపడుచులు, పిల్లలు పెద్ద సంఖ్యలో రావడం విశేషం. ఆ అద్భుతమైన కవి సమ్మేళనం మరియు సాంస్కృతిక కార్యక్రమాన్ని మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ కార్యాలయ అధికారి శ్రీ హరీష్, శ్రీ జగన్ బాబు గంజి, శ్రీ అశోక్ కంటె, శ్రీ అంబల్ల జనార్దన్, పద్మశాలి మహిళా మండల్ (గంజ్ పేట్, పుణే) అధ్యక్షురాలు శ్రీమతి వందన లక్ష్మణ్ పాస్కంటి మరియు పూణే నగర పద్మశాలి యువజన్ సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీ రోహన్ దోంతుల్ నిర్వహించారు. ఆ సదస్సును మండల అధికారి శ్రీ వెంకటేష్ జీ చిర్ముల్లా, హాజరైన నిర్వాహకులు, జ్యోతి ప్రకాశనంతో ప్రారంభించారు. ఆ తర్వాత షాహిర్ సాబ్లే స్వరపరిచిన మహారాష్ట్ర వందన్ పాట ‘జై జై మహారాష్ట్ర మాజా’తో సభ ముందుకు సాగింది.
దీప ప్రకాశనం తర్వాత, సభకు మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ కార్యాలయ అధికారి శ్రీ హరీశ్ గారు, స్వాగతం చెబుతూ, ఇది ఈ ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర ప్రభుత్వం, తెలుగు సాహిత్య అకాడెమీ నిర్వహిస్తున్న తొమ్మిదవ తెలుగు కార్యక్రమం అన్నారు. ఈ అకాడెమీ ఉద్దేశం ఇరు సాహిత్యాల, సంస్కృతుల సమ్మేళనం మరియు వారి మధ్య అనుబంధం మరింత పెరగడం అన్నారు.
ఆ సందర్భంగా వివిధ తెలుగు మాట్లాడే నృత్య బృందాలకు చెందిన బాల, యువ, మహిళ నృత్యకారులు తెలుగు సంస్కృతికి సంబంధించిన నృత్యాలను చాలా అందంగా, కళాత్మకంగా ప్రదర్శించారు. పద్మశాలి మహిళా మండళి, జైశంకర్ శ్రీసూక్త మండల్ సభ్యులు తెలుగు సంస్కృతికి చెందిన సంప్రదాయ, నృత్యాలను కన్నుల పండుగగా ప్రదర్శించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు.
ఆ నృత్య ప్రదర్శనల తరువాత స్థానిక కవుల ‘తెలుగు భాషా కవి సమ్మేళనం’ ఎంతో ఉత్సాహంగా వైవిధ్యభరిత కవితలతో వీక్షకుల మన్ననలను అందుకుంది. అలాగే మనోజ్ చెన్నా (పూణే) తన మిమిక్రీ కళతో ప్రేక్షకులను నవ్వించాడు. ఆ రెండు కార్యక్రమాలకు హాజరైన తెలుగు మాట్లాడే ప్రేక్షకులు బిగ్గరగా చప్పట్లు కొట్టి, వన్స్ మోర్ స్పందనతో వారిని ఉత్సాహపరిచారు.
పుణేకు చెందిన మహిళలు చివరగా ప్రదర్శించిన బతుకమ్మ నృత్యాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఆ తర్వాత ప్రవేశించిన బోనాలను హాలంతా నిలబడి స్వాగతం పలికింది.
ఆ రెండు కార్యక్రమాల్లో పాల్గొన్న కవులు, నృత్యకారులందరినీ మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ కార్యాలయ అధికారి శ్రీ హరీష్, శ్రీ జగన్ బాబు గంజి, శ్రీ అశోక్ కంటె, శ్రీ జనార్దన్ అంబల్ల, శ్రీమతి వందన లక్ష్మణ్ పాస్కంటి, శ్రీ రోహన్ దోంతుల్ మరియు పద్మశాలి సమాజ్ లోని వివిధ సంస్థల ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు గౌరవ ప్రశంసాపత్రాలు, శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సదస్సును శ్రీ అశోక్ కంటె తన సహజ శైలిలో, తెలుగు భాషలో మధురమైన స్వరంలో, అలంకారిక పదాలను ఉపయోగించి వ్యాఖ్యానిస్తూ చక్కగా నిర్వహించారు. వచ్చే రోజుల్లో మరింత భవ్యంగా, దివ్యంగా మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ పుణేలో కార్యక్రమాలు నిర్వహించాలని హాజరైన ప్రజలు కోరారు. మన జాతీయ గీతంతో సదస్సు ముగిసింది. ఆ తరువాత, అందరూ రుచికరమైన విందును ఆస్వాదించారు.
డా. అంబల్ల జనార్దన్ ప్రసిద్ధ కవి, కథకుడు, నాటక రచయిత. దాదాపు ముప్పై సంవత్సరాల నుండి సాహితీ సృజన చేస్తున్నారు. ఎనిమిది కథా సంపుటాలు, నాలుగు కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి, ఒక మోనోగ్రాఫ్ ప్రచురించారు. వీరి తెలుగు కథలు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతీ, ఒడియా భాషల్లో సంపుటాలుగా వచ్చాయి. వీరి కథలపై ఎం.ఫిల్. పరిశోధన జరిగింది. పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం 2011 లో లభించింది. గత పాతికేళ్లుగా వీరి తెలుగు కథలు మహారాష్ట్రలోని తెలుగు మరాఠీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి.

