[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన రాజు కల్లూరి గారి ‘పుణ్య గోదావరి – పొలసల వేట’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“శ్రీరాములు బాబాయ్.. శ్రీరాములు బాబాయ్”
“రాము నువ్వా ఏంటి రా కూర్చో”
“గోదారి పెరుగుతుంది కదా. పేపర్లో వేశారట కదా. నువ్వు రోజూ పేపర్ చదువుతావు కదా. ఎలా ఉంది తెలుసుకుందామని వచ్చా. రాత్రికి వేటకి వెళ్ళాలి.”
“ఈ వానాకాలం వస్తే మన గోదారి కోసమే టివిలో పేపర్లో వేస్తారు కదా! సీజన్‌కి సంబంధం లేని గొప్పతనం మన జిల్లాకి ఉంది రాము, అవునా.”
“అవును. అది గోదావరి పుణ్యమే.”
“తూర్పు గోదావరి అంటే జిల్లాకి కీర్తి గడించిన జీవనది గోదావరి గుర్తుకు వస్తుంది. తన గొప్పతనం చెప్పినా విన్నా పుణ్యమే. ఈ గోదావరి నది ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలు తమ జీవన భృతికి కారణం అవుతున్నందుకు నిత్యం తలుస్తూ కొలుస్తూ కొనియాడుతూ కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉంటారు!
ఎక్కడో త్రయంబకేశ్వరంలో పుట్టిన ఈ గోదావరి రాష్ట్రాలు జిల్లాలు దాటుతూ ప్రవహిస్తూ ఎందరికో తాగునీరుగా దాహార్తి తీరుస్తూ పంటలకు సాగునీరుగా అవసరం తీరుస్తూ కొండలు కోనల మధ్య ప్రవహిస్తూ పిల్ల కాలువలను తనలో ఐక్యం చేసుకుంటూ పలకరిస్తూ బాసర భద్రాద్రి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ దక్షిణ కాశీ రాజమహేంద్రవరం చేరి అఖండ గోదావరిగా విస్తరిస్తుంది. తాను చేసిన మేలుకు కృతజ్ఞతగా ప్రజలు పుణ్య స్నానాలు ఆచరిస్తూ ముత్తైదువగా భావించి పసుపు కుంకుమలు చీర పుష్పాలు సమర్పించి తమ భక్తిని చాటుతుండగా నిలకడగా నెమ్మదిగా అందరికీ దీవెనలు ఇస్తూ పాయలుగా ప్రయాణం సాగించి సంద్రంలో సంగమిస్తుంది.
జీవన విధానం, పరమార్థం చాటుతూ ఈ నదిలో చేపలు పట్టుకుని జీవిస్తున్న జాలారుల జీవనం అలల కుదుపుల ఒడిదుడుకుల వైవిధ్యం! అనాది కాలం నుండి వీరి వృత్తి కొనసాగుతుంది. రాను రాను చేపలు కరువు అవుతున్నాయి. వారి జీవనోపాధి బారం అవుతున్న వేళ ఈ ఏడాది పొలస చేపల సీజన్ వచ్చింది.” చెప్పాడు శ్రీరాములు.
“సరే బాబాయ్ ఇంటికి వెళతా. చదువు లేక ఎవరిని అడగక, ఇవన్నీ తెలీలేదు ఇన్నాళ్లు” అని బయల్దేరాడు రాము.
***
“ఒరేయ్.. నీలయ్యా.. ఎంతసేపోయ్? తొందరగా.. వల సక్కబెట్టాల కదా” అని పిలుస్తున్న తాతారావు కేకలకు చద్ది క్యారేజీ చేత పట్టుకుని తలపాగా చుట్టుకుంటూ “ఏరా నాయనా ఓ.. కంగారు. పొలసలు పిలుస్తున్నాయా” అంటూ వచ్చి “పదండి పదండి ఇయ్యాల రెండు జొడాలు ఐనా పడాల లేదంటే బావకి దబిడి దిబిడే” అంటూ నడక ప్రారంభించారు!
మార్గ మధ్యంలో “బావా, మన ధవళేశ్వరం బ్యారేజ్ అంటే గోదారి కాలం పొలసలకి పెద్ద పేరు అంట కద. మా తాత అనేవోడు సిలుకు వల తేలితే పది పది జొడాలు పొలసలు పడేయి అని. నేను వేటకి వచ్చింది ఇప్పటివరకూ ఐదు జొడాలు పడటం చూడలేదాయ్. నువ్వు చూసావా!” అన్నాడు నీలయ్య.
“లేదురా నేను ఆరు జొడాలు పడటం చూసా పది ఏళ్ళు కిందట. ఐతే మొదటి వేట. అందులో ఒక జొడా అలివి పెద్ద ఇంట్లో కూర వండి వల మీద రైతులకి అందరికీ ఇంటికి కూర ఇచ్చేవారు. మన గోదారి పోలస విదేసాలకు పోతుంది అంటే ఎంత గొప్పతనం! తాతల కాలంలో మామ్మల మెడలో తాళిబొట్టు తాకట్టు పెట్టి మరి తెచ్చుకుని పొలస కూర తినేవారట. ఇప్పుడు అదేమీ లేదు. జొడా పడితేనే అదృష్టం.” చెప్పాడు తాతారావు.
“ఏమయ్యింది పొలస జాతి?” అడిగాడు నీలయ్య.
“మొన్న టీ కొట్టు కాడ ఒక పెద్దాయన నాతో పొలసలు పడుతున్నాయా అంటే లేదు సార్ అన్నాను. సముద్రంలో కాలుష్యం ఎక్కువ అయ్యింది. ప్లాస్టిక్ వచ్చిన నాటి నుంచి పర్యావరణం కలుషితం అవటం మొదలు అయ్యింది. అంతా సముద్రంలో కలుస్తూ చేపల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ పొలస కూడా ఆస్ట్రేలియా దేశం నుంచి గోదావరి వరదలు వచ్చినప్పుడు నురగ తింటూ వస్తుంది. ఈ కాలుష్యం వలన పొలస కూడా రావటం బాగా తగ్గిపోయింది అన్నాడు!” చెప్పాడు తాతారావు.
“మామూలు చేపలే సరిగా పడటం లేదు. ఇట్టా ఐతే ఇక పొలస రాను రానూ పేరుకే చూడలేము. ఏమిటో ఆ పరమాత్మ మనకి ఇట్టా రాశాడు నాలుగు చేపలు పడితేనే కంచంలో బువ్వ వచ్చేది. లేదంటే గాలి భోజనమే రోజు. కష్టం గోదారి పాలు. ఇక ఈ జన్మకి మన బతుకులు ఇంతే బావా. వల. నావ. గోదారి. ఇదే మన జీవితం” నిట్టూరుస్తూ అన్నాడు నీలయ్య.
“రేవు దగ్గరకి వచ్చేసాం. ఇక మాటలు ఆపి వల సద్దండి. ఇయ్యాల గోదారి తల్లి కరుణించి రెండు జొడాలు పొలసలు పడాల. పది రోజులు మనకి ఆకలి బాధలు తప్పాల. నావ తొయ్యి, వేట మొదలు పెడదాం!!” అన్నాడు తాతారావు.