[డా. గండ్ర లక్ష్మణ రావు రచించిన ‘పుణ్యక్షేత్రాలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నాకు రెండే రెండు క్షేత్రాలు
ఒకటి సస్యక్షేత్రం
రెండు సాహితీక్షేత్రం
జన్మతః పరిచయమయింది సస్యక్షేత్రం
తొలిఅడుగులు పడినవి ఎర్రటి నేలపైనే
బాల్యం పెనవేసుకొన్నది తోటతో పొలంతో
పసులతో లేగలతో చేనుతో చెలకతో
దుర్శేని తీగల చక్రాల బండి వెంట
పల్లేరు గాయల లెక్కలేకుంటా నడిచిన పాదాలు
నెలరోజుల లేత లేగదూడ వెంట
చెలకంతా ఉరికిన పరుగు పందెం
చెట్లకింద పసులు నెమరువేస్తుంటే
దోసకాయలు, బుడిమకాయలు ఏరుకొని కొరుక్కు తిన్న కమ్మదనం
పొలంగట్టుమీద గారడీవాడు తాడు మీద నడిచినట్టు
ఒడుపుగా నడుస్తూ తప్పి కాలుజారితే
బురదలో పరవశం
కోడెల నూపురాలతో గంగడోలుతో
కొసరి కొసరి తాకుతూ ఆటలు
కొడవలితో పచ్చి గడ్డి ఏరి ఏరి
కోసి మూటగట్టుకొచ్చిన పట్టుదల
మిరపకాయఅండెం తొక్కడం సరదా
కల్లం కాడ కావలి కథలూ ముచ్చట్లూ
నాటికీ నేటికీ నన్ను వదలని
నేను వదలని నా నేల
నా తోట నా పొలం నా పంట
నా కనుల పంట నామనసు వెంట
అయిదారేళ్ళ వయసునుండి
డెబ్బైయేదైయినా అదే నా అసలు క్షేత్రం
అన్నం పెట్టినా అప్పులు కట్టినా
అదే నా జీవన గాత్రం
అదే నా మొదటి పుణ్యక్షేత్రం
అక్షరాలు పద్యాలు
అన్నీ మా బాపుతోనే
ఎండాకాలం బయట నులకమంచాలు
నిండుపున్నమి వెన్నెలలు
బాపు కథలు పురాణాలు పద్యాలు
నా వెంటనంటిన సాహిత్యం
నేను వెంటాడిన పుస్తకాలు
గురువులు శిష్యులు
నేను చదివిన పాఠాలు
నేను బోధించిన పాఠాలు
అల్లిన పద్యాలు, అవధానాలు
సభలు, ప్రసంగాలు, వ్యాఖ్యానాలు
జీవన సర్వస్వం సాహిత్యం
ఆర్తి తీర్చినా కీర్తి తెచ్చినా
అంతా సాహిత్యం నా సర్వస్వం
ఇంటినిండా పుస్తకాలు అవి తెచ్చిన పతకాలు
బతుకునిండా పెంచుకున్న అక్షర బంధాలు
నిదురలేచింది మొదలు నిదురించేదాక
మదినిండా తిరుగాడే పుస్తకాలు
వదనంలో వెలిగే సారస్వత జ్యోతులు
ఇదీ నా జీవన గాత్రం
ఇది నా రెండవ పుణ్యక్షేత్రం.
ఎన్ని యాత్రలు చేసినా
ఎన్ని తీర్థ క్షేత్రాలు చుట్టి వచ్చినా
ఇవే నా నిజమైన పుణ్యక్షేత్రాలు.
ఒకటి అన్నం పండించేది
ఒకటి ఆనందం పంచియిచ్చేది
ఇంతకన్నా జీవితంలో లేవు ఏ దివ్యక్షేత్రాలు
